1 .నలిపెడుతున్న భావమేదో..!
 
ఏమీ తోచని స్థితి
ఎప్పుడో ఒకసారి
అందరికీ వస్తుంది.

అమ్మ పోయినప్పుడో 
నాన్న ఊపిరి ఆగినప్పుడో
మనసు వెన్ను విరిగినప్పుడో
అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో
అపార్థాలతో స్నేహాలు కూలినప్పుడో..
దారితప్పినప్పుడో...
ఎప్పుడో ఒకప్పుడు
ఊపిరాడని స్థితి
అందరికీ వస్తుంది.

పూర్వజ్ఞాపకాలు రోదించినప్పుడో..
కయ్యాలు కురిసినప్పుడో
గింజలు మొలువనప్పుడో 
కోసిన పంట తుఫాన్ లో
కొట్టుకపోయినప్పుడో
ఆత్మకు నచ్చినవాళ్లు
వెనక్కి గుంజి నప్పుడో..

అప్పుడే సోప్ప బెండులా
అల్కగా బరువు తగ్గిపోతాం.
ఈనెపుల్లలా సన్నగా మారుతాం.

ఒక్కోసారి మనసు
లోపల కసిబిసితో
నలిపెడుతున్న భావమేదో
బయటికి ఉసులుతుంది.
అప్పుడే ఏమీతోచని స్థితి
వేడి శ్వాసల
రూపంతో బయటకు వస్తుంది.

నిన్నటి దాక నవ్వినట్టున్నా
ముఖాల్ని 
ఇవ్వాలే ఎవరో అపంహరించుక పోయాక..
కొన్నిసార్లు భలే ముసురుకుంటాయి
నలుపు మేఘాలు..!

బరువును పెంచే
మనుషులు ఎప్పుడూ ఉంటారు
కానీ 
బరువు దించే మనుషులే
 మహానుభావులై నిలిచిపోతారు.
 14.3.2024
 
2 . అద్దాన్ని ధ్వంసం చేయాలి!

ఎవరిని వారే స్వయంగా
మర్చిపోయాక
ఇంకేం మిగులుతుంది?

కొన్నిసార్లు 'విలువలు' మిగలవు 
'మనిషే'  మిగిలితాడు.

ఉన్మత్త పువ్వును చూసి
పారిజాత పుష్పమని
భ్రమ పడ్డావు చూడు
అక్కడే జరిగింది తప్పు!

మెత్తగా రాలుతున్న
వెన్నెల సోనను వదిలిపెట్టి
మెలిపెట్టి భయపెట్టే
చీకటి కుహరాన్ని ప్రేమిస్తే
చివరకు చీకటే గుర్తుండిపోతుంది!

నది మీది నుంచి ప్రవహించే
వెన్నెల అందంగానే ఉంటుంది
కానీ నది ఎండితేనే
ప్రతిబింబ కాంతికి 'కరువు' సోకుతుంది!

ఏండ్లకేండ్లుగా వెన్నాడుతున్న రూపం 'కౌగిలించు'కున్నంత మాత్రాన
అపురూపం కాదది
ఆత్మ గౌరవాన్ని తుంచి వేయడమే!

సమిష్టి చైతన్యాన్ని
అచేతనంలోకి నిట్టేసి
వ్యష్టి చైతన్యమే
వెలుగొందాలని చూస్తే
నిద్రపోద్దులే ఉదయిస్తాయి!

పెద్దదిగా ఉన్న కొండను
చిన్నదిగా చూయించే
అద్దాన్ని ఇప్పుడు అర్జెంటుగా
ధ్వంసం చేయాలి.
అదొక్కటే సత్య మార్గం.
మరి వొస్తావా?
రాలిన పూవ్వులే ఏరుతావా ?

 12.3.2024

Leave a Reply