(కోవిడ్ కాలంలో రాజకీయ ఖైదీ హేమంత్ రాసిన కవిత. కోవిడ్ తగ్గిందేమో గాని ఈ కవితలోని రాజకీయ ప్రాసంగికత అలాగే ఉంది. – వసంత మేఘం టీం )
మా పిల్లల వ్యాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపావు మోడీజీ అని అడుగుతున్నాయి ఆ గోడలు ఏడ్వడానికి, నవ్వడానికి, పాలు తాగడానికి, ఆహారం తీసుకోవడానికి తప్ప అడగడానికి నోరులేని ఆ పిల్లల ఆక్రందనలు ఆ పోస్టర్లు మా ప్రాణౌషధాలు సముద్రాలు ఎట్లా దాటాయని అడుగుతున్నాయి ఫ్రేజర్లు, బిల్‌గేట్స్, యురోపియన్ యూనియనూ, జర్మనీ పేటెంట్ హక్కుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టుమని సైనిక స్థావరాలు స్వాధీనం చేయమని కొన్ని దేశాలను అడుగుతున్నాయిగదా మరి నీ 18 - 45 వయసు మధ్య మనుషులకు వ్యాక్సిన్ గాలిలో దీపమేనా అని అడుగుతున్నాయి ఇంక మా పిల్లల మీద విరుచుకపడే మూడో ఉప్పెనను ఎట్లా కట్టడిచేస్తావు అని అడుగుతున్నాయి కోవిడ్ 19 ని దేశం నుంచి పారదోలే ప్రతిజ్ఞ ఆగస్టు 15 స్వాతంత్య్రం వంటి, జనవరి 26 గణతంత్రం వంటి ఆత్మనిర్భర నినాదమేనా అని అడుగుతున్నాయి నువ్వు అరెస్టు చేసిన ఆ ఇరవై ఏడుగురు ...కూలీలు రిక్షావాలాలు, నిరుద్యోగులు క్షేత్రస్థాయి కార్యకర్తలు మూడు సముద్ర తీరాల నుంచి, కన్యా కుమారి నుంచి కశ్మీర్‌దాకా రెండో కెరటం సునామీకి కొట్టుకవస్తున్న కోట్లాది మంది ప్రతినిధులు ` దేశ ద్రోహులు కాదు, టెర్రరిస్టులు కాదు మళ్లీ లాక్‌డౌన్ చేసి ఎవరింట్లో వాళ్లు ముసుగులు ధరించి దీపాలు వెలిగించి గంటలు కొట్టమంటారా ` చమురేది దీపమేదీ దేహంలో ప్రాణవాయువు కరువై చమురింకి ఇంటిదీపం ఆరిపోయాక చేతులేవీ చేతలేవీ గంటలు మోగించడానికి కరోనా ` కరో అంటావా ` పారదోలడానికి కదంతొక్కానంటావా కోవిడ్`19 రహస్యం నీకన్నా తెలిసిన పండితుడెవరు? ప్రధానిని ` దేశానికి ఎన్నికైన ఏకైక ప్రతినిధిని ప్రశ్నించడం ఏమిటంటావా? ప్రభుత్వాన్ని కాకుండా ప్రధానిని ప్రశ్నిస్తే రాజ ద్రోహనేరమంటావా? ప్రభుత్వం ఎక్కడుంది మంత్రి వర్గం ఎక్కడుంది? పార్లమెంట్ ఎక్కడుంది? నేషనల్ సెంట్రల్ విస్టా నిర్మాణంలోనా? ఇన్నాళ్లకు ఇవ్వాళ విన్నాం దేశీయాంగ వ్యవహారాలమంత్రి అమితమైన షా నోట ` రెండో అలను అరికట్టామని మూడో ముప్పును ఎదుర్కొంటామని` అతడు గాలిని కమ్మనెను ` అది ఆయెను అతడు గాలిని ఆగమనెను ` అది ఆగెను దేవుణ్ణి నమ్ముకున్నవాళ్లు దేవుణ్ణే అడుగుతారు ప్రాధేయపడతారు ప్రార్థిస్తారు ఆగ్రహిస్తారు శపిస్తారు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నవాళ్లు దాని ప్రధానినే ప్రశ్నిస్తారు. ప్రజలకు జవాబుదారీ అయిన ప్రజా సేవకుడని దేశ భక్తుడనికాదు, దేశ సేవకుడని ఇప్పుడు పార్లమెంటు, ప్రభుత్వం అన్నీవచ్చి ఒక మోడీ దగ్గర ఆగిపోయాయి ఇపుడు నీ మన్‌కీ బాత్ తప్ప మనుషుల మనసులోనికి మాట వినడానికి, కనడానికి, ఆలకించి ఆదరించడానికి ఎవరున్నారక్కడ`ఒక అహంకార రాజ్యం మమ్మేలే రాజ్యానికి మారుపేరయింది కోవిడ్`19 రెండోసారి ఎన్నికయిన ఎన్‌డిఏ ప్రభుత్వంవలె ఇంతకూ కెనడాలో నువ్వేయించిన కృతజ్ఞతల పోస్టర్ సంగతేమిటి? జయశంకర్ అమెరికా హుటాహుటి ప్రయాణమేమిటి? ఈ విదేశీ దేశభక్తి మర్మమంతా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే బహుళజాతి కంపెనీల గుప్పెట ఉందా?...? ఢల్లీిలో గోడలేకాదు, కాన్పూరులో గోడలేకాదు సామాజిక మాద్యమాల గోడలు కరోనా మృతుల శవాగారాల గోడలు, శ్మశానాల గోడలు కన్నవారి పేగుల గోడలు సహచరుల కన్నీటి రెప్పల గోడలు ప్రేమ పెదవుల గోడలు, మమకారాల వాత్సాల్యాల గోడలు అవి నువు నిర్మించిన సామాజిక దూరాల గోడలు కావు అవి ఆ వ్యాధిగ్రస్త, బాధితుల, మృతుల దేహస్పర్శ కోల్పోయి విలపిస్తున్న గోడలు, రక్త బంధువుకు, ప్రాణ స్నేహానికి ప్రేమకూ మానవత్వానికి దూరం చేసి ముసుగు మనుషుల్ని చేసిన గ్లోబల్ కోవిడ్ బ్రాహ్మణీయ హిందుత్వకు మారుపేరయిన రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న గోడలు అసూయ అసహాయుల కొచ్చిపోయే జ్వరం లాంటిది ద్వేశం దేశాధినేతల మనోప్రయోగశాలల నుంచి వ్యాపించే వైరస్`అది గాలిలో వైరల్ అవుతుంది మనుషుల పట్ల ప్రేమ ఒక్కటే వైరల్‌గా ప్రతిఘటించే వ్యాక్సిన్ అన్ని గోడలపై పోస్టర్లు వేసిన మనుషులు అటువంటి మనుషుల హృదయాల నిండా ఉన్నది అదే భవిష్యత్తుకు భరోసా.
1. ‘గోడలకు నోళ్లున్నాయి’ అనే దీర్ఘ కవిత 1980లలో వరంగల్ నగరం గోడలపై రాడికల్స్ నినాదాలు చదివి వాసిరెడ్డి భాస్కరరావు రాసిన దీర్ఘ కవిత శీర్షిక.
2. ‘కల్లుముంతో మా యమ్మ పాట’ ముగిస్తూ గద్దర్ సారా గురించి ‘మమ్మేలే రాజ్యానికి మారుపేరువే నీవు’ అంటాడు.