జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌, చిత్తనూరులో ఏర్పరుస్తున్న ఇథనాల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలి

పాదయాత్ర

తేది : 11.02.2023 చిత్తనూరు నుండి 

తేది : 21.02.2023 ఆత్మకూరు దాకా

ప్రియమైన సోదరీ సోదరులారా ! మిత్రులారా !

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌ వారు చిత్తనూరు శివారులో మూడు పంటలు పండే భూములలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అబద్దాలు చెబుతూ మోసపూరితంగా చిత్తనూరు, ఎక్లాస్పూర్‌, జిన్నారం గ్రామాలకు చాలాదగ్గరలో జనావాసాల నడుమ ఈ కంపెనీ పనులు శరవేగంతో నిర్వహిస్తున్నారు. వాళ్ళు తొలుత మనకు నేరేడు పండ్లతోట పెడతామని చెప్పారు. కొద్దిరోజులలోనే ఇథనాల్‌ కంపెనీ నిర్మిస్తున్నారనే నిజం బయటపడిరది. ఇథనాల్‌ అంటే ఏమిటి? ఇథనాల్‌ తో ఏం చేస్తారు? ఇథనాల్‌ ఉత్పత్తి ఎలా చేస్తారు? ఉత్పత్తి క్రమంలో ఏం జరుగుతుంది? యాజమాన్యానికి కలిగే మేలేమిటి? ప్రజలకు ప్రకృతికి జరిగే కష్టనష్టాలేమిటి? వంటి అనేక ప్రశ్నలు మనని చుట్టుముట్టాయి.

తొలుత చిత్తనూరు గ్రామ యువరైతాంగం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది. పర్యావరణ వేత్తలను, శాస్త్రవేత్తలను, ప్రజాస్వామిక వాదులను కలిసి చర్చించింది. వీరికి ఎక్లాస్పూర్‌, జిన్నారం, ఫర్దిపూర్‌ తదితర గ్రామాల రైతులు జతకలిశారు. ఈ అందరితో కలిసి ఏడాది కాలంగా ప్రజల భాగస్వామ్యంతో, ప్రచారం, ఆందోళనలు, ఉద్యమాలు సమావేశాలు జరిగాయి. ప్రతీసారీ మనకు జరిగే నష్టం తీవ్రత మరింత స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. ఇక మనమందరమూ పూనుకుని కంపెనీ ఎత్తి వేయించకపోతే మునుముందు మనమే నిర్వాసితులం కావలసి వస్తుందని అర్థమైంది. ఇక్కడికి వచ్చిన మేధావులు, పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు కూడా చాలా ఆందోళనతో ఈ కంపెనీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ॥ కె.పురుషోత్తం రెడ్డి చిత్తనూరు సందర్శించి కంపెనీ వల్ల కలిగే కష్టనష్టాలు వివరించారు. మరికల్‌లో 30.10.2022న జరిగిన సదస్సులో ఐఐసిటి శాస్త్రవేత్త బాబూరావు పాల్గొని మన భూమి, గాలి, నీరు, మన ఆరోగ్యాలు ఎలా దెబ్బతింటాయో తెలిపారు. మానవహక్కుల పౌర, ప్రజాస్వామిక హక్కుల సంఘాల, నాయకత్వ బృందాలు, స్వతంత్ర పరిశోధకులు ఇక్కడ పర్యటించి ప్రభుత్వానికి, ఈ కంపెనీ ఎత్తివేసి ఇక్కడి ప్రజలు ఆరోగ్యంగా, గౌరవంగా జీవించే హక్కును కాపాడాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొ. ఎం. కోదండరాం, బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షులు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌్‌ కుమార్‌ ప్రత్యక్షంగా చూసి ఈ కంపెనీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌, మరికల్‌, నారాయణపేట, హైదరాబాద్‌లలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశాలలో కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఐ (ఎం), బిఎస్‌పి, సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా తదితర పార్టీలు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆ సమావేశాలలో ప్రపంచంలోని వివిధ దేశాలలో, భారతదేశంలో వేర్వేరు చోట్ల ఏర్పాటుచేసిన చిన్న, పెద్ద కంపెనీల వల్ల తీవ్ర నష్టం జరిగిందని, చిత్తనూరులో ఏర్పాటయ్యే కంపెనీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు, కృష్ణా నదికి, యావత్తు తెలంగాణకు ముప్పు తెస్తుందని చర్చ జరిగింది. గొంతులో వుండే విషంవల్ల ఎప్పటికైనా ప్రమాదమే కదా!

ఈ ప్రమాద తీవ్రతను మన గాలికి, భూమికి, నీటికి కలిగే నష్టాన్ని, పెరిగే కాలుష్యాన్ని, ప్రభుత్వానికి లేఖల ద్వారా తెలిపాం. చర్చలు జరపాలని అడిగే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే సమస్య తీరుతుందా అని అడిగాం. అపుడు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో నారాయణపేట ఆర్డీఓ గారు అధికారులను, మనల్ని పిలిపించి చర్చలు జరిపారు. ఆ చర్చలలో కంపెనీ చేసిన మోసాలను, ప్రభుత్వానికి, ప్రజలకు చెప్పిన అబద్దాలను నిరూపించాం. ఆర్డీఓ గారు మరోసారి చర్చించుకుందాం అన్నారు. కానీ ఇంతవరకూ ఆ ప్రయత్నం చేయలేదు. ఈ కంపెనీ రద్దు కోసం ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి. అందుకు మనమంతా ఒకే గొంతుగా కంపెనీ ఎత్తేయాలని నినదించటం తప్ప మరో దగ్గరి దారి లేదు. ఈ ప్రయత్నంలోనే మనం 20.01.2023న రెండువేల మందితో మరికల్‌లో ధర్నా జరిపి అధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన లేఖ పంపించాం. ఇప్పటి వరకు మన గ్రామాల సర్పంచులకు, మండలాల బాధ్యులకు, శాసనసభ్యులకు మన గ్రామాలను, ప్రజలను ఈ దుష్ట కంపెనీ బారి నుండి కాపాడవలసిన బాధ్యత మీదే అని అనేక పర్యాయాలు విన్నవించాం. వారికి సమస్య తెలుసు, తీవ్రతా తెలుసు. అయినా మన గ్రామాల వైపు నిలిచి ఎందుకు పనిచేయటం లేదో మనమందరమూ వారిని అడగాలి.

మనం తీవ్ర కరువు కాటకాలతో వలసలతో బతుకులు ఈడ్చిన వాళ్ళమే. సాగునీటి కోసం, రైతు సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలోనే భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలు సాధించుకున్నాం. ఆంధ్రపాలకవర్గ పక్షపాత పాలన మనకు వద్దని పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇంకా నీటివనరు ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు అందుబాటులోకి రానేలేదు. ఇంతలో అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి పక్షుల మీదికి గద్దలు వచ్చినట్టుగా మన నీటి మీదికి ఇథనాల్‌ కంపెనీ వచ్చి పడిరది. మనం తెచ్చుకున్న ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా, ఈ కంపెనీకి తగిన పరిశీలన లేకుండా అనుమతులిచ్చాయి. నిజానికి ఈ కంపెనీ, ప్రభుత్వాలకి అన్నీ అబద్దాలే రాసిచ్చింది. మనరైతులు, ప్రజా సంఘాలు కంపెనీ చెబుతున్న అబద్దాలను నిరూపించిన తరువాత కూడా అవే అబద్దాలు మళ్ళీ చెబుతూ ఆ కంపెనీ యాజమాన్య ప్రతినిధి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోను ఖండిస్తూ వాస్తవాలతో మనం మరొక వీడియో విడుదల చేశాం. ఆ కంపెనీ యజమాని ఎటిరోడ్రగ్స్‌ చైర్మన్‌ మరియు రాజ్యసభ ఎంపి అయిన బండి పార్ధసారథి రెడ్డి ప్రభుత్వాలను మేనేజ్‌ చేస్తున్నాడు. మన గ్రామాలలో ప్రతి మనిషికి ఈ నిజాలు చెప్పాలని, అందరూ కలిసికట్టుగా కంపెనీ రద్దుకోసం పోరాడి మన పర్యావరణాన్ని, మన ఆరోగ్యాలను, ప్రాణాలను, ముందుతరాల జీవితాలను కాపాడుకునే పనిలో కలిసి కదులుదామని చెప్పాలని మనం ఈ పాదయాత్ర చేపట్టాం.

మనం రోజూ తినే బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, చెరకు తదితర ఆహార పదార్థాలతో ఇథనాల్‌ తయారుచేస్తారు. ఒక లీటరు ఇథనాల్‌ తయారీకి 5 లీటర్ల నీరు, దాదాపు మూడు కేజీల ఆహార పదార్థాలు అవసరం. అంటే ఈ కంపెనీ ప్రతిరోజూ ఇప్పుడైతే 30 లక్షల లీటర్ల నీరు, దాదాపు 1650 టన్నుల ఆహార పదార్థాలు ఉపయోగిస్తుంది. మునుముందు ఈ వినియోగం రెండు మూడిరతలకు పెరగవచ్చు. ప్రస్తుతం ప్రకటించిన ఉత్పత్తి మేరకే అయితే 300 వందల నుండి 400 వందల టన్నుల కుడితి లాంటి ద్రవం, ఈ మోతాదులోనే కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు విడుదల అవుతుంది. ఈ ద్రవ పదార్థాన్ని గట్టిపరచాలన్నా, వాయు పదార్థాన్ని గాలిలో కలువకుండా ఇతర వినియోగాలకు తరలించాలన్నా చాలా ఖర్చు పెరుగుతుంది. కంపెనీ ఉత్పత్తి పెంచినట్టల్లా కాలుష్యం పెరుగుతుంది. కంపెనీకి లాభాలు పెరిగితే మనకు రోగాలు పెరుగుతాయి. మన నీటిలో కాలుష్యపు మురుగునీరు, గాలిలో కలిసే కార్బన్‌డైయాక్సైడ్‌ వల్ల మనం అస్తమా, అలర్జీలు, క్యాన్సర్లు వంటి రోగాల పాలవుతాం. మన పిల్లలు, ఇక్కడి ప్రాణులన్నింటి పునరుత్పత్తి శక్తి మీద కూడా ఈ కాలుష్యం ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్యనే బాధిత ప్రజల పోరాటానికి దిగివచ్చి ఇథనాల్‌ కంపెనీ మూసేయించాడు. కరీంనగర్‌ పర్లపల్లిలో ప్రజలు రోగాలపాలయ్యారు. ఇప్పటికీ అక్కడ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికా, బ్రెజిల్‌ లాంటి యూరప్‌ దేశాలు ఇథనాల్‌ ఉత్పత్తిని వదులుకుని ఇతర దేశాలకు నెడుతున్నాయి. క్యూబా దేశం ఇథనాల్‌ కంపెనీల ఏర్పాటునే వ్యతిరేకించింది. ఈ అనుభవాలన్నీ వుండగా రాజకీయాలతో, అక్రమ సంపాదనతో డబ్బు పోగేసుకున్న ఇథనాల్‌ కంపెనీ యాజమాన్యం ఒకవైపు రాజకీయ పదవులను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ. మన జీవితాలతో చెలగాటమాడుతున్నది.

కంపెనీ వాళ్ళు ఎన్ని అబద్దాలు చెప్పారంటే ఆ భూమి పంటలు పండని నిరుపయోగమైన భూమి అన్నారు. అక్కడ నివాసిత గ్రామాలు లేవన్నారు. లేళ్లు, నెమళ్ళు లేవన్నారు. వాగులు, సహజ వనరులు లేవన్నారు. నక్షబాటలు, అసైన్డ్‌ భూములు లేవన్నారు. ఇవన్నీ అబద్దాలే కదా! కంపెనీ వాళ్ళు 0.09 టిఎంసి నీరు అడిగారు. ప్రభుత్వం అందులో పావువంతు అనగా 0.0309 టిఎంసి నీరు అనుమతించింది. వాళ్ళు ఏకంగా 1 టి.ఎం.సి నీరు తరలించటానికి భారీ పైపులైన్‌ వేస్తున్నారు. పెద్దవంపు, గైనికుంట వంపుల మీద అక్రమ నిర్మాణాలు చేపట్టి వాటిని కంపెనీలోకి కలిపారు. సుమారు వెయ్యి ఎకరాలకు పారే నీరును ఆ విధంగా అక్రమంగా మళ్ళించుకున్నారు. ఇకముందు కంపెనీ వదిలే మురుగునీరు మాత్రమే మన్నెవాగులో పారుతుంది. అది ఊకశెట్టివాగును, రామన్‌పాడు డ్యాంను క్రమంగా కృష్ణానదిని కాలుష్యంతో నింపుతుంది. కంపెనీ వాళ్ళు జీరో కాలుష్యం అని కుడితి లాంటి ద్రవాన్ని గట్టిపరిచి అమ్ముతామని, కార్బన్‌డైయాక్సైడ్‌ను కూల్‌డ్రిరకు కంపెనీలకు అమ్ముతామని తమకు లాభాల పంట పండుతుందనీ చెబుతున్నారు. అంటే మనల్ని బలి తీసుకుంటామని చెప్పకుండానే చెబుతున్నారు.

ఇప్పుడిప్పుడే మనం పోరాడి సాధించుకున్న నీటితో వేలాది మందికి పనులు చూపుతూ స్థానికంగా వుంటున్న మనని తరిమివేసే కుట్ర చేస్తున్నారు. పండినపంటనంతా పంట భూమి మీదనే కొంటారట. ఇదీ ఒక అబద్దం. కాలుష్యం పెరిగితే పంటలు బాగా పండుతాయా? అదీకాక కంపెనీ వాళ్ళు ప్రభుత్వం దగ్గర సబ్సిడీ బియ్యం కొంటారు. మన దగ్గర కొనరు. అంతేగాక ఆకలితీవ్రత గల దేశాల పట్టికలో మనదేశం ఆకలి తీవ్రతలో ముందుంది. రక్తహీనత, ఆహార కొరత, కొనుగోలు శక్తిలేమి మనదేశ ప్రజానీకాన్ని వేదిస్తున్నాయి. ఈ పరిస్థితిలో కడుపులను ఆకలితో కాల్చి కార్లలో తిరిగేవాళ్ళకు ఇథనాల్‌ తయారుచేసి ఇవ్వటం అవసరమా? అసలిది అభివృద్దేనా?

ప్రభుత్వాలుగా ఏర్పడుతున్న పార్టీలు ఓట్ల కోసం వచ్చినపుడు ఏనాడు ఇక్కడ ఇథనాల్‌ కంపెనీ పెడతామని చెప్పలేదు. సాగునీరు పారిస్తామన్నారు. నిజానికి మనదేశానికి గొప్ప వరం లాగా మంచి ఎండ, గాలి వున్నాయి. సాగునీటి కాల్వల మీద సౌర విద్యుత్తు, గుట్టల మీద వాయు విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ప్రజా రవాణా వ్యవస్థ పెంచి పెట్రోల్‌ దిగుమతులు, కర్బన

ఉద్గారాలు తగ్గించవచ్చు. కానీ కొద్దిమంది పెట్టుబడిదార్లు, కార్పొరేట్లు ప్రభుత్వాలను లోబరుచుకుని సహజ వనరులను దురాక్రమించి మానవ శ్రమను విపరీతంగా దోచుకుంటూ లాభాల వేటాడుతున్నారు. దేశ ప్రజలు ఎక్కడికక్కడ ఈ కంపెనీల వేటను అడ్డుకుంటున్నారు. అమరుడు కాళోజీ నారాయణ రావు అన్నట్టు రాజకీయ పదవులలో వుండి అధికారాలు చలాయించే వారందరూ మన ఓట్లకు పుట్టినవారు. వారు మనకు ద్రోహం చేస్తే కుదరదు. దేశంలో నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థ లాగా నిచ్చెనమెట్ల రాజకీయ వ్యవస్థ రూపొందింది. కింది నాయకులను పై నాయకులు తమకు లోబరుచుకుంటున్నారు. మనం మోసపోతున్నా, ప్రకృతి పాడైనాక, సహజవనరులు దెబ్బతిన్నాక రెక్కల కష్టంతో స్థానిక వనరులను రేపటి కోసం కాపాడుతూ ఆ వనరుల మీదనే ఆధారపడి బతికే మనం ఎట్లా బతుకుతాం. కరోనా వంటి విపత్తులు దాపురించినపుడు పట్టణాలు మనల్ని పల్లెలకు తరిమేశాయి. కాలుష్యపు కంపెనీలు మనని పల్లెల నుండి తరిమేస్తున్నాయి. మనం పల్లెలను వదిలి ఎటుపోగలం. అందువల్ల ఇథనాల్‌ కంపెనీ రద్దు కోసం అందరం గొంతెత్తి పోరాడుదాం. మన కోసం, రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం తప్ప మరో మార్గంలేదు.

ప్రభుత్వాలు అమలుపరుస్తున్న తప్పుడు అభివృద్ధి విధానాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు, మైనింగ్‌ వల్ల భూగర్భంలో పెరుగుతున్న కాలుష్యం, భూకంపాలు మానవాళిని భయకంపితం చేస్తున్నాయి. ఇపుడు పర్యావరణాన్ని, సామాన్య ప్రజలను పరిరక్షించే కాలుష్య రహిత అభివృద్ధి విధానాలు కావాలి. భూమినీ, మానవులనూ కాపాడాలి. అందుకు మన బాధ్యతగా మనం ఇథనాల్‌ కంపెనీ ఎత్తేసే దాకా పోరాడుదాం. మనలో మనం, మనతో మనం మాట్లాడుకుందాం. రండి పాదయాత్రలో భాగం కండి. 

ప్రభావిత గ్రామాలు

 1 చిత్తనూరు, 2. దమగ్నాపూర్‌, 3. కుమార్‌ లింగంపల్లి, 4. పర్కపురం, 5. రాంపూర్‌, 6. లంకాల, 7. నర్వ, 8. ఉందేకోడ్‌, 9. పాతర్‌చేడ్‌, 10. జంగంరెడ్డిపల్లి, 11. బుడ్డెగాని తాండ, 12. గాజులాయ తాండ, 13. కన్మనూరు, 14. ఎక్లాస్పూర్‌, 15. జిన్నారం, 16. వీరపట్నం, 17. మరికల్‌, 18. పస్పుల, 19. ఎలిగండ్ల, 20. యమునోనిపల్లి, 21. గున్ముక్ల, 22. కంసాన్‌ పల్లి, 23. ధన్వాడ, 24. మందిపల్లి, 25. మందిపల్లి తాండ, 26. అప్పంపల్లి, 27. మాదారం, 28. రాంకిష్టయపల్లి, 29. కిష్టాపురం, 30. గోటూర్‌ (కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు), 31. కోండ్రోనిపల్లి, 32. పూసల్‌పాడ్‌, 33. రాకొండ, 34. బండ్రవల్లి, 35. బండ్రవల్లి క్రాస్‌రోడ్‌, 36. పెద్దచింతకుంట, 37. లాల్‌కోట, 38. పల్లమర్రి, 39. పర్దిపురం, 40. సీతారాంపేట, 41. నెల్లికొండి, 42. వడ్డేమాన్‌, 43. చిన్న వడ్డేమాన్‌, 44. ఏదులాపురం, 45. చిన్న చింతకుంట, 46. మద్దూర్‌, 47. కురుమూర్తి, 48. అమ్మాపురం, 49. దుప్పల్లి, 50. కొత్తపల్లి, 51. మదనాపురం, 52. తిర్మలాయిపల్లి, 53. రామన్‌పాడ్‌, 54. ఆత్మకూరు)

చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ (చిత్తనూరు యువక, రైతు మండలి, ఎక్లాస్పూర్‌  రైతు మండలి,  పాలమూరు అధ్యయన వేదిక, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, TFTU, AISF, AIYF, AIKS, మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి,  కుల నిర్మూలనా పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం,   ఎస్సీ ఉపకులాల సమితి, బుడగ జంగం హక్కుల పోరాట సమితి,  బాధిత గ్రామాల ప్రజలు)

Leave a Reply