మానవ రహిత వైమానిక వాహనాలను (యుఎవి) అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2021లో, ఆ సమయంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, “కంప్యూటర్ అల్గారిథమ్‌ల ఆధారంతో జరిగే డ్రోన్ల దూకుడు ఉపయోగం యుద్ధ సమయంలో ట్యాంకులు, ఫిరంగి, భూతల సేన వంటి సాంప్రదాయ సైనిక హార్డ్వేర్లను సవాలు చేసింది.” అతను చెప్పినది పూర్తిగా సరైనది. డ్రోన్ దాడులు ప్రపంచ యుద్ధాల తీరుని మార్చాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి – వీటన్నింటిలో సైన్యం డ్రోన్ విమానాలను ఉపయోగిస్తోంది. మానవాళికి వ్యతిరేకంగా నేరస్తులుగా, ప్రజా ఉద్యమాలకు డ్రోన్లు సవాలుగా మారుతున్నాయి.
భారతదేశంలో నిరసనలపై డ్రోన్ దాడిని అధికారికంగా ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. సెప్టెంబర్ 12న హర్యానా, పంజాబ్ సరిహద్దులో ఉన్న శంభు సరిహద్దు వద్ద ఢిల్లీకి యాత్రగా వస్తున్న రైతులపై డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీనికి ముందు, దాని రిహార్సల్ కూడా క్రమం తప్పకుండా జరిగింది. వేలాది మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసు వజ్ర వాహనాలు ఓవర్‌బ్రిడ్జిపై వున్న రెండు లేన్లకనీసం 4,500 షెల్స్‌ను కాల్చాయి అని హర్యానా-పంజాబ్ సరిహద్దు, శంభు సరిహద్దు వద్ద విధుల్లో ఉన్న ఒక సీనియర్ అధికారి చెప్పాడు.
తన దేశంలోనే పోలీసు, పారామిలటరీ బలగం లేదా సైన్యం వైమానిక దాడులు చేయవచ్చా? ఏదైనా నిరసన, ప్రదర్శన లేదా తీవ్రవాద దాడి జరిగితే, డ్రోన్ల వినియోగానికి భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలా? నిఘా తప్ప మరేదైనా దాడికి డ్రోన్లను ఉపయోగించడం యుద్ధ విభాగంలోకి రాదా? ఏ చట్టం ప్రకారం డ్రోన్లను దాడులకు ఉపయోగిస్తారు? ఇవీ శంభు సరిహద్దులో దేశం ముందు ఉంచిన కొన్ని ప్రశ్నలు.
రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ఉద్యమం, ప్రభుత్వ వ్యతిరేక నిరసన డ్రోన్ దాడులకు గురికావలసి వస్తుందా? భవిష్యత్తులో సామాన్య ప్రజలపై బాష్పవాయు గోళాలకు బదులు బాంబులు పేల్చబోరని గ్యారంటీ ఏమిటి? ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాబల్య ప్రాంతాల్లో, 2016 నుండి 2023 వరకు అనేక సార్లు డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శనలు చేసారు, కానీ ప్రభుత్వం అలా దాడులు చేశామనడాన్ని నిరాకరిస్తోంది. అయితే రైతుల ఉద్యమంపై జరిగిన డ్రోన్ దాడులు ప్రభుత్వ వాదనలను బట్టబయలు చేస్తున్నాయి.
చండీగఢ్‌లో ప్రభుత్వంతో రైతులు శాంతియుతంగా చర్చలు జరుపుతుండగా, మరోవైపు పోలీసులు వివిధ చోట్ల రహదారులను దిగ్బంధించారు. పెద్ద పెద్ద కాంక్రీట్ బండరాళ్లు వేశారు. కంటైనర్లు ఉంచారు. ఇనుప రాడ్లు, బారికేడ్లు, కాంక్రీట్ గోడలు నిర్మించి రహదారులను దిగ్బంధించారు. ఇది డజన్ల కొద్దీ చోట్ల జరిగింది. లక్షలాది ప్రజల జీవనోపాధి దెబ్బతింది. అనారోగ్యాలపాలయ్యారు. అయితే మరి ఇందుకు ఎవరిపైనైనా కేసులు పెడతారా? తమ డిమాండ్ల కోసం రైతులు పాదయాత్రలు చేస్తే, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు, ట్రాఫిక్‌ను అడ్డుకున్నందుకు వారిపై కేసులు నమోదు చేస్తారు. లాఠీ ఛార్జ్ చేస్తారు. కానీ పరిపాలకులే ఇదంతా చేస్తున్నప్పుడు ఎవరిపైన కేసులు పెట్టాలి? ఆ ఆస్తి నష్టానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ప్రజల జేబులోంచి వెళ్లే టోల్ టాక్స్, రోడ్ టాక్స్ మొదలైన వాటి సహాయంతో రోడ్లు వేస్తారు. వాటిని పాడు చేయడానికి లేదా నిరోధించడానికి పరిపాలనకు అనుమతి ఎక్కడనుంచి దొరుకుతుంది.
ఉద్యమాన్ని అడ్డుకొనేందుకు అయ్యే కాంక్రీట్, కంటైనర్లు, జేసీబీ, బండరాళ్ళు, డ్రోన్లు, టియర్ గ్యాస్ ఖర్చును ఎవరి నుంచి వసూలు చేస్తారు? ఇవన్నీ ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పేదెవరు?
చివరగా, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2023లో హర్యానా ప్రభుత్వానికి చెందిన డ్రోన్ ఇమేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ హర్యానా లిమిటెడ్ కంపెనీ (దృశ్య )ద్వారా ఇటువంటి డ్రోన్లను ప్రారంభించినప్పుడు, వాటిని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వ్యవసాయం, భద్రతాపర సున్నితమైన ప్రాంతాలలో ఉపయోగిస్తామని, భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసామని చెప్పారు. పర్యవేక్షణకు ఉపయోగిస్తామన్నారు. ‘ది హిందూ’ ప్రకారం, ఉపయోగించిన డ్రోన్లు హర్యానా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కర్నాల్‌లో ఉన్న పైన పేర్కొన్న దృశ్య కంపెనీకి చెందినవి.
2024 ఏప్రిల్ 4 న హర్యానా ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వ్యవసాయం, ఉద్యానవనాలు, సున్నితమైన ప్రాంతాల పర్యవేక్షణ కోసం ఈ డ్రోన్లను తయారు చేసినట్లు పోలీసు అధికారి ‘ది హిందూ’తో చెప్పాడు. కర్నాల్‌కు చెందిన ఒక కంపెనీ డ్రోన్‌ను తయారు చేస్తుందన్న నిర్ధారణ హిందూస్థాన్ టైమ్స్ వార్తల్లో కూడా ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, ఈ డ్రోన్లను పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల భద్రత కోసం కూడా తయారు చేసారు.
ఇటువంటి డ్రోన్లను 2022లో జరిగిన 42వ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) ప్రదర్శించింది. వీటిని డిటిసిఎల్ అంటే డ్రోన్ టియర్ స్మోక్ లాంచర్ అని పిలిచేవారు. రాళ్లు రువ్వే గుంపులను నియంత్రించడమే దీని ఉద్దేశమని చెప్పారు. అలాంటి డ్రోన్లు అనేక గ్రెనేడ్లను తమ వెంట తీసుకువెళ్లి ఒకదాని తర్వాత ఒకటి పేల్చుతూ ఉంటాయి. వారు రిమోట్ ద్వారా దూరంగా కూర్చుని నిరంతర బాంబు దాడులు చేయవచ్చు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హర్యానా పోలీసులను దీని గురించి సమాచారం కోరగా, వారు డ్రోన్లను పారామిలటరీ బలగాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇవి 400-500 మీటర్ల పరిధిని కవర్ చేస్తాయి.
తెలుగు: పద్మ కొండిపర్తి