వికసిత భారత్, అచ్ఛేదిన్, అమృత్‌కాల్ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, మోడీ గొప్పగా ప్రకటించిన మేక్-ఇన్-ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు ఏవి యువత ఉపాధికి తోడ్పడలేదు. పైగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని ఇటీవల మానవాభివృద్ధి సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో మనదేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నది. పలు అంతర్జాతీయ నివేదికలు ఉపాధి దెబ్బతిన్నదనీ, అసమానతలు ఆకాశాన్నంటాయని, సగం బలం అనుకున్న సంతోషానికి కూడా ఈ దేశపౌరుడు నోచుకోవడం లేదని ఆ సూచికలూ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని ఏటా నివేదికలు అద్దం పడుతుంటే, ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా మెరుగుపరిచామని కేంద్రంలోను, రాష్ట్రంలోను పాలకులు అదే పనిగా చేస్తున్న ప్రచారం ఒట్టి బూటకమని మరోసారి స్పష్టమైంది.
2014 ఎన్నికల సందర్భంలో బిజెపి గెలిస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ అటుకెక్కి ప్రధాని ఏలుబడిలో దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఆందోళనకరంగా 25 ఏళ్ళ లోపు నూతన గ్రాడ్యుయేట్లలో 45 శాతం మంది నిరుద్యోగులుగా వున్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకటించింది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామి అమలు కాకపోగా 2017-22 మధ్య రెండు కోట్ల మంది మహిళా కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగ సైన్యంలో కలిసిపోయారు. 2023-24 స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) 2019-20 కంటే దాదాపు 18 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు అంచనా వేస్తూంటే ఉపాధి అవకాశాలు మాత్రం గత ఐదేళ్ళలో ఎన్నడూ లేనంతగా సున్నా వృద్ధిని సూచిస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. 2023-24లో నిరుద్యోగానికి కూడా కులం, లింగం, ఆర్థిక వివక్ష ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటి ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023’ రిపోర్టు నిరుద్యోగం లోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.
భారత్‌లో ఉపాధి పరిస్థితి భయంకరంగా ఉందని, నిరుద్యోగిత రేటు, కీలక లేబర్ సూచీలూ 2000-2018 మధ్య ఉపాధిలో దీర్ఘకాలిక క్షీణతను సూచిస్తున్నాయని, నిరుద్యోగ సైన్యంలో 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ), ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డి) మార్చి 26న వెల్లడించాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024’ ను ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఈఎ) వి. అనంత నాగేశ్వరన్ మార్చి 26న విడుదల చేశారు.” దేశంలో నిరుద్యోగ సమస్య యువతలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులలో ఎక్కువగా ఉంది” అని ఆయన తెలిపారు. ఇవాళ దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడు లేనంతగా పెరిగిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నది. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎన్నో ఆశలతో ఉపాధి, ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తే నిరాశ మిగులుతుంది. డిగ్రీలు, పీజీ, రీసెర్చ్ చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైన చేయడానికి సిద్దపడినా మార్కెట్‌లో ఉపాధి లభించని స్థితి నెలకొంది. భారతదేశంలో కొందరు పోగేస్తున్న సంపద గురించి, అసంఖ్యాకులైన సామాన్యజనం సంపాదన కృశించిపోవడం గురించి ఎంతోకాలంగా మనం చూస్తున్నదే మరోమారు మన కళ్ళముందు ఆవిష్కృతమైంది.
దేశ ఆర్థికరంగం ఎదుగుతున్నదనీ, అగ్రరాజ్యాలను దాటేస్తున్నామని గర్విస్తున్న థలో, కార్మికశక్తిని సద్వినియోగపరచడంలోనూ, ఉపాధి కల్పించడంలోనూ ఎంతో వెనుకబడివున్నామని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) అధ్యయనం హెచ్చరిస్తోంది. శ్రామికశక్తిలో నైపుణ్యాలను పెంచడం, తయారీరంగాన్ని అభివృద్ధిపరచడంతో పాటు మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆచరణలో ఎందుకు విఫలమైనాయన్నది సమీక్షించుకోవడం అవసరం. శ్రామికశక్తిలో దాదాపు సగం ఇంకా వ్యవసాయరంగంమీదే ఆధారపడి బతుకులీడ్వడం సరికాదు. ఇటీవల కాలంలో వ్యవసాయరంగ ఉపాధిలో క్షీణత గణనీయంగా పెరగడాన్ని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అత్యంత పేలవంగా ఉన్నాయన్నది వాస్తవం. ఉపాధి దొరికిన వారికి సరైనవేతనాలులేవు. ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుపెరుగుతున్నారు. వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం కొనసాగుతున్నది. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువత ఉన్న దేశం మనది. అత్యధిక నిరుద్యోగం కూడా ఇక్కడే. డెమోగ్రాఫిక్ డివిడెంట్ గురించి ఉపన్యాసాలు ఇచ్చేముందు ఉన్న శ్రామిక శక్తిని సద్వినియోగం చేసుకోవడం, మిగతారంగాలకు విస్తరించడం మీద దృష్టిపెట్టాలి. చదువున్నవారు, చదువు లేనివారు కూడా ఒకే దుస్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది.
పెచ్చరిల్లిన నిరుద్యోగం :
కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో శ్రమశక్తికి ఉపాధి పట్టణ ప్రాంతాల్లో 44.7 శాతం నుండి 37.5 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం నుండి 40.5 శాతానికి తగ్గిపోయింది. ఇదే సంవత్సరాల్లో మహిళల ఉపాధి 14.9 శాతం నుండి 8.7కు, పట్టణాల్లో 14.6 నుండి 6.9కి, గ్రామీణ ప్రాంతాల్లో 15.9 నుండి 9.7 శాతానికి పడిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక తెలిపింది. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న నిరుద్యోగులు పట్టణాల్లో 45.98 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 43.79 శాతం మంది ఉన్నారు. త్వరలోనే ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ప్రతిష్టించబడుతుందని పాలకులు చెబుతుంటే యువతలో సగం మంది నిరుద్యోగులుగా ఉండడం ఆందోళనకరం. 2050 నాటికి దేశ జనాభాలో 54 శాతం మంది 25 ఏళ్ళలోపు యువత ఉంటారు. వారు మన దేశ భవిష్యత్తుకు పెద్ద వనరు. అయితే, ఈ యువతలో 45 శాతం పొట్ట చేత పట్టుకుని పనికోసం ఎదురు చూస్తుండడం పాలకుల విధానాలు సృష్టించిన విషాదం.
నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువకులు 2000లో 35.2 శాతం మంది ఉండగా, 2022లో ఇది 65.7 శాతానికి అంటే రెండింతలు పెరిగినట్లు ఐఎల్‌ఓ అధ్యయనం పేర్కొంది. అలాగే చదువుకున్న నిరుద్యోగుల్లో పురుషుల (62.2 శాతం) కాగా స్త్రీలు (76.7 శాతం) ఉన్నారని తెలిపింది. 2019లో ఉపాధిలో కొంచెం పెరుగుదల కనిపించినా, కోవిడ్ మహమ్మారి సమయంలో మళ్లీ క్షీణించిందని నివేదిక తెలిపింది. 2000లో మొత్తం ఉపాధి యువత జనాభాలో సగం మంది స్వయం ఉపాధి పొందారు. 13 శాతం మంది రెగ్యులర్ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. మిగిలిన 37 శాతం మంది కాజ్యువల్ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. మరోవైపు మరో దశాబ్దంలో దేశంలో యువ శ్రామిక శక్తి 7-8 మిలియన్లు (70-80 లక్షలు) చేరుకుంటుందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఐదు కీలక విధాన రంగాలపై దృష్టి సారించాలని సూచించింది. ఉపాధి సహిత వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం, ఉపాధి నాణ్యతను మెరుగుపరచడం, కార్మిక మార్కెట్‌లో అసమానతలను పరిష్కరించడం, క్రియాశీల కార్మిక మార్కెట్‌తోపాటు లేబర్ మార్కెట్ నైపుణ్యాలు, విధానాలు బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.
ఈ సందర్భంగా ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్-2024 సిఇఓ నాగేశ్వరన్ మాట్లాడుతూ, ‘ప్రతి సామాజిక, ఆర్థిక సమస్య’కు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని భావించడం ‘సరి కాదు’ అని అన్నారు. ”మనం ఈ ఆలోచన నుండి బయటపడాలని సుద్దులు చెప్పారు. నిరుద్యోగం వంటి సామాజిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని మోడీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు చెబుతూ తమ ప్రియమైన నాయకుడిని రక్షిస్తున్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నివేదిక నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్వాకానికి తిరుగులేని తార్కాణమని పేర్కొన్నాయి. యువత భవిష్యత్తును మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ జాతీయ అధ్యకక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. నిరుద్యోగ టైం బాంబ్‌పై యువత కూర్చొన్నదని ఆయన అన్నారు.. 2012తో పోల్చితే మోడీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువత శాతం మూడు రెట్లు పెరిగిందన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని, అయితే యువత నుంచి 12 కోట్ల ఉద్యోగాలు లాక్కున్నారని ఆరోపించారు.
చదువుకు చేస్తున్న పనులకు మధ్య పొంతన లేదు. వృత్తి నైపుణ్యం లేక, ఉపాధి అవకాశాలు లభించక, అసంఘటిత రంగాల్లో పనులు చేసుకునే వారి సంఖ్య ఏటేటా రెట్టింపు అవుతున్నది. పని నాణ్యతలేని కారణంగాఉపాధి కల్పన కష్టమవుతున్నదని యాజమాన్యాల వాదన. అసలు పనే దొరకనప్పుడు, అనుభవం, నైపుణ్యం ఎలా సాధ్యమన్నది సగటు నిరుద్యోగి ఆవేదన. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా ఈ విషవలయాన్ని వేదించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోవడం శోచనీయం. మితిమీరిన యాంత్రికీకరణ ఒకవైపు, కొత్తగా పుట్టుకొచ్చిన కృత్రిమ మేధ మరోవైపు ఉద్యోగావకాశాలను కుదించి వేస్తున్నాయి. దీనికి తోడు ప్రైవేటు సంస్థల లాభాపేక్ష శ్రమదోపిడీని ప్రోత్సహిస్తున్నది. దేశంలోని యువ శక్తిని, శ్రామిక బలాన్ని ఉపయోగించుకోలేకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. కార్మిక హక్కులను కాలరాసి, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని బుట్టదాఖలు చేసి, కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహించి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నది. శ్రమకు విలువ లేకుండా చేస్తున్నది. ఉపాధి కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయనంత కాలం నిరుద్యోగ సమస్యకు తెరపడదు. శ్రమ దోపిడీ అంతం కాదు.
మోడీ పాలనలో తగ్గిన కార్మికుల నిజవేతనాలు:
శతాబ్దకాలంలో సాధారణ జీతం పొందే కార్మికుల నెలవారీ నిజ వేతనాలు యేటా ఒక శాతం మేర తగ్గుతున్నాయి. నాణ్యమైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, మహమ్మారి ప్రతికూల ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డి)లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. సాధారణ వేతన కార్మికుని సగటు నెలవారీ నిజ వేతనం 2012లో రూ.12,100గా ఉండగా, 2022 నాటికి రూ.10,925కి పడిపోయింది. ప్రభుత్వం నుండి సేకరించిన అధికారిక సమాచారాన్ని విశ్లేషించి ఐఎల్‌ఒ ఈ నివేదికను రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో నిజ వేతనాలు వేగంగా పడిపోయాయని, 2012లో రూ.13,616 ఉండగా 2022లో రూ.12,616కి పడిపోయాయి. భారత్‌లోని కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. చేసిన పనికి తగిన వేతనం లభించటం లేదు. కనీస వేతనాలను కార్మికులకు దక్కేలా చట్టాలు చేసి, అమలు చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం దానిని పట్టించుకోవటం లేదు. దేశ వ్యాప్తంగా 60 శాతం మంది సాధారణ కార్మికులు తమకు రావాల్సిన కనీస వేతనానికి నోచుకోలేకపోతున్నారు. ”సాధారణ వ్యవసాయ కార్మికులలో 62 శాతం మంది, నిర్మాణ రంగంలో 70 శాతం మంది కార్మికులు 2022లో నిర్దేశించిన రోజువారీ కనీస వేతనాలను పొందలేదు” అని నివేదిక పేర్కొన్నది.
ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన లేబర్ ఎకనామిస్ట్ రవి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. భారత్‌లో 91 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు అందడం లేదన్నారు. మధ్యవర్తిత్వం సంస్థల ద్వారా ఒప్పందం చేసుకున్న నైపుణ్యం లేని కార్మికులు ఎదుర్కొంటున్న శ్రమ, వేతన దోపిడీని ఎత్తి చూపారు. కాంట్రాక్టర్లు.. కార్మికుల సంపాదనలో కొంత భాగాన్ని లాగేసుకోవటంతో కనీస వేతనం కూడా వారికి అందకుండా పోతున్నదని చెప్పారు. 2019 తర్వాత అధిక ఉత్పాదకత తయారీ, సేవా రంగాలలో తగినంత ఉద్యోగ కల్పన జరగకపోవటంతో నాణ్యమైన ఉద్యోగాల కొరత ఉన్నది. 2000-2019 మధ్య, తక్కువ ఉత్పాదకత కలిగిన వ్యవసాయం నుంచి సాపేక్షంగా అధిక ఉత్పాదకత కలిగిన వ్యవసాయేతర రంగాలకు ఉపాధిలో తిరోగమనం కనిపించింది. మహమ్మారి సంబంధిత ఆర్థిక మందగమనంతో వ్యవసాయేతర రంగం పని అవకాశాలు లేకపోవటంతో.. వారు వ్యవసాయంలో జీవనాధార కార్యకలాపాలకు తిరిగి రావటమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నది.
ముగింపు:
బిజెపి ప్రభుత్వానికి ఆర్థిక విధానం కంటే మతతత్వ ఎజెండా ప్రధాన అంశం. గత పది సంవత్సరాల పాలనా కాలంలో ప్రజల మధ్య మత విభజనను తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు, ఢిల్లీ, మణిపూర్‌లలో అల్లర్లు, ఉమ్మడి పౌరస్మృతి, అయోధ్యలో రామాలయం ఇలా అన్నింటిలోనూ మతతత్వ ఎజెండాను అమలు చేశారు. కేవలం మతతత్వ విధానాలు అమలు చేస్తే విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు బిజెపిని బలపరచవు. అందుకే ఆర్థిక విధానాల్లో ఈ కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశ యువత, భవిత కంటే కార్పొరేట్ కంపెనీల సేవలో పునీతమవుతున్నారు. లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు. వీటన్నింటి గురించి ఆలోచించకుండా యువత దృష్టిని మళ్ళించడానికి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. మతతత్వ విద్వేషాలను రెచ్చగొట్టడానికి బదులు వెలుగులోకి వస్తున్న పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొనాలని విద్యావేత్తలు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమించడమంటే కార్పొరేట్, మతతత్వ ఎజెండాల సమ్మళితంగా ఉన్న బిజెపిని ఓడించడానికి సిద్ధం కావడమే తక్షణ పరిష్కారం.