ప్రియమైన ప్రజలారా,

రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు   కూంబింగ్‌లు  షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ అశోక్‌ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్‌ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్‌, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం 24మందిపై మోపిన పూసపల్లి కుట్ర కేసును పరిశీలిస్తే, రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదనీ, నియంతృత్వ పోలీసు పాలనే అని రుజువవుతున్నది.

కామ్రేడ్స్‌ అశోక్‌ అన్న, గోపన్నలు ఫిబ్రవరి 14న ఖమ్మంలో వైద్యం కోసం వచ్చి, కామ్రేడ్స్‌ మదార్‌, సురేశ్‌ ల మోటార్‌ సైకిళ్లపై బయ్యారం ప్రాంతానికి తిరిగి వెళ్లిపోతుండగా, ఖమ్మం పరిసరాలలో ముందస్తు సమాచారంతో రెండు జీపులు, ఒక కారులో వచ్చి మాటుకాచిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16 రాత్రి వీరితో పాటు కామ్రేడ్‌ పుల్లన్నను కూడా కలిపి ఇల్లందును అనుకునివున్న పూసపల్లి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు కొత్తగూడెంలో చూపించారు. కామ్రేడ్‌ పుల్లన్నను అంతకు ముందు రోజే 15-02-2024న తన యింటి నుండి తీసుకొచ్చి తమ కస్టడీలోకి తీసుకుని విపరీతంగా కొట్టారు. ఇల్లందు పొలిమేరలలోని పూసపల్లి వద్ద యీ  ఐదుగురిని పట్టుకున్నట్లూ, వీరి వద్ద రివాల్వర్‌, తూటాలు, కత్తులు, జిలెటిన్‌ స్టిక్స్‌, వంట పాత్రలు, దళం డ్రస్సులు దొరికినట్లుగా కట్టుకథలల్లి ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసులు యిచ్చిన రిమాండ్‌ రిపోర్టులో మొత్తం 24మంది యీ కేసులో వున్నట్లుగా, రాజద్రోహం (120దీ), అక్రమంగా ఆయుధాలు కలిగి వున్నారనే పలు సెక్షన్లు మోపారు. మా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ చంద్రన్న(పాతూరి ఆదినారాయణస్వామి), రాష్ట్ర సహాయ కార్యదర్శి  కామ్రేడ్‌ సాదినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు  కామ్రేడ్‌ కె.గోవర్థన్‌లతో పాటు కామ్రేడ్స్‌ గౌని ఐలయ్య, ఏనుగు చంద్రారెడ్డి (సాగర్‌), జడ సీతారామయ్య, మోకాళ్ళ మురళీకృష్ణలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ యాదన్న తదితరుల పేర్లను కూడా యిందులో చేర్చారు. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ ప్రధాన నాయకత్వాన్ని పూసపల్లి కుట్ర కేసులో యిరికించడం ద్వారా గత 50 సంవత్సరాలకు పైగా నిజాయితీగా, నిస్వార్ధంగా పనిచేస్తున్న విప్లవ సంస్థగా పేరుగాంచిన సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీని అభాసు పాల్జేసి, అణచివేసే కుట్రకు కొందరు పోలీసు  ఉన్నతాధికారులు తెర లేపుతున్నట్లుగా స్పష్టమవుతున్నది.  

ఆదివాసులకు, గిరిజనులకు, దళితులు, తదితర పేద వర్గాలకు కొండంత అండగా నిలబడుతూ వస్తూన్న సిపిఐ(ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీని ‘‘నిషేధిత నక్సలైట్‌ పార్టీ’’గా కూడా కొంతమంది ఉన్నత పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. పూసపల్లి కుట్ర కేసు         రిమాండ్‌లోనే కాకుండా, గత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసిఆర్‌) నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ప్రభుత్వ హయాంలోనూ 2015లోఅక్రమంగా మోపిన ‘‘కిచ్చెనపల్లి కుట్ర కేసు’’లోనూ నిషేధిత నక్సలైట్‌ పార్టీ’’కి చెందిన వారిగా  పేర్కొన్నారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది.   

సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ గత 50 యేళ్ళకు పైగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ, ప్రత్యేకించి గోదావరి లోయ పరీవాహక ప్రాేంతంలో నిలకడ కలిగిన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూన్నది. ప్రతిఘటనోద్యమాన్ని నిర్మిస్తున్నది. లక్షలాది ఎకరాల పోదు భూములు కొట్టించడంలోనూ, వాటికి పట్టాలు సాధించే పోరాటంలోనూ చెరువులు, కుంటల నిర్మాణానికి తోడ్పడంలోనూ అగ్రభాగంలో నాయకత్వం వహిస్తూ వస్తున్నది. పత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అత్యంత మిలిటెంట్‌ పోరాటాలలోనూ ప్రత్యేకించి, మిలియన్‌ మార్చ్‌, సాగర హారం సంసద్‌ యాత్ర, రోడ్‌ రోకో, వంటా-వార్పు లాంటి ఆందోళనలలోనూ పాల్గొని తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించింది. గత పదేళ్ల కాలంలో బిఆర్‌ఎస్‌ అనుసరించిన ప్రజావ్యతిరేక, తెలంగాణ ఆకాంక్షల వ్యతిరేక పరిపాలనను దృఢంగా వ్యతిరేకించింది.

ఆఖరికి, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానం అందుకున్నది. మొదటి అసెంబ్లీ సమావేశాలలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామిక పాలన తమ ప్రభుత్వ అభిమతమని చెబుతూ, శాసనసభలో ప్రాతినిధ్యంలేని సిపిఐ(ఎం)పార్టీని, సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ పార్టీని కూడా అఖిలపక్ష సమావేశాలకు పిలుస్తామని ప్రకటించారు. అదే సమయంలో మరోప్రక్క భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం యీ  పూసపల్లి కుట్ర కేసులోనూ, గతంలోని కిచ్చెనపల్లి(ఆళ్లపల్లి) కుట్ర కేసులోనూ సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ నేతలను ‘‘నిషేధిత నక్సలైట్‌ పార్టీ’’ నాయకులుగా పేర్కొని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను ప్రక్కదారి పట్టించే దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు యిలాంటి అబద్దపు ప్రచారాన్ని మానుకోవాలి. గత పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (మోడీ, కెసిఆర్‌లు) అనుసరించిన ఆనాటి ప్రజావ్యతిరేక, నియంతృత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలోనూ, పోరాటాలలోనూ కాంగ్రెస్‌ పార్టీతో పాటు యితర రాజకీయ పార్టీలతో కలిసి సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ పనిచేసింది. ఈ విషయం నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి,ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లుకి, వారి సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, యితర ప్రజాప్రతినిధులకు తెలియనిది కాదు.

గత నాలుగైదు రోజులుగా అంటే, ఫిబ్రవరి 15 నుండే ఏజెన్సీ గ్రామాలు, తండాలు, గూడేలలోని పార్టీ నాయకులను, సానుభూతిపరులను, శ్రేయోభిలాషులను, చివరికి సామాన్య ప్రజలను యిళ్ళకు వెళ్లి మరీ పట్టుకొచ్చి వివిధ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. ఇప్పటికే 72 గంటలు దాటిపోయినా కామ్రేడ్స్‌ సనప పొమ్మయ్య, తొగరు కొమరయ్య, నాయిని కొమరయ్య, కల్తీ విష్ణురావు తదితరులను యింకా విడిచిపెట్టడం కానీ, కోర్టుకు హాజరుపరచడం కానీ జరుగలేదు. అంటే, యిక్కడ కాంగ్రెస్‌ హయాంలోనూ సాగుతున్నది ప్రజాపాలన కాదని, నియంతృత్వ ఫాసిస్టు పాలనే అని స్పష్టమవుతున్నది. ‘పాలకులం కాదు, ప్రజలకు సేవకులం’ అని ముఖ్యమంత్రి పదేపదే ప్రస్తావించడం ఉత్తుత్తి గంభీర ప్రసంగాలేనా?

1969 నుండీ గోదావరి లోయ పరీవాహక ప్రాంతంలో భూమి, భుక్తి, విముక్తిల కోసం సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీకి చెందిన ఆత్మ రక్షణా దళాలు ప్రతిఘటనా పోరాటాలు నిర్వహిస్తున్న వాస్తవాలు నేటి ప్రభుత్వ పెద్దలకు, పోలీసు అధికారులకు, ప్రభుత్వాలకు తెలియనిది కాదు. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారే ఇంద్రవెల్లి సభలో మాట్లాడుతూ  ‘‘అన్నలు రావాలి’’, ‘‘నక్సలైట్లు సమాజంలో వుంటేనే పేదలకు న్యాయం దొరుకుతుంది’’ అని బహిరంగంగా ప్రకటించిన తరువాత కూడా సిపిఐ (ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ కేంద్ర, రాష్ట్ర నేతలపై పూసపల్లి కుట్ర కేసును బనాయించడం అత్యంత నీతి బాహ్యమైనది. జనవరి 29న భద్రాచలంలో పిడిఎస్‌యు జిల్లా జనరల్‌ కౌన్సిల్‌  సమావేశాలు హాలులో నిర్వహించుకుంటూంటే పోలీసులు అడ్డుకున్న సందర్భం కూడా వున్నది.ఇవి ప్రజాస్వామిక పాలనకు సంకేతం ఎంతమాత్రమూ కానే కాదు.

పోడు భూములకు పట్టాలు యిస్తామనిబీ పోడు సాగుదారులకు, కౌలు రైతులకు పట్టాలు యిస్తామనే వాగ్దానాల అమలు కోసం తగిన విధంగా ప్రజలను, ప్రత్యేకించి ఆదివాసులు, గిరిజనులను సన్నాహం చేసుకుంటున్న సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిని, యితర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిరచాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులకు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ నేతలకు మా పార్టీ-సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది.  

ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో సాయుధ పోలీసు పహారాలో భయానకంగా సాగుతూన్న కూంబింగ్‌ ఆపరేషన్‌లను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ నాయకత్వంపై అక్రమంగా మోపిన పూసపల్లి కుట్ర కేసును బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. అదే విధంగా 2015లో నాటి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోపిన కిచ్చెనపల్లి కుట్ర కేసును కూడా బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. మోడీ, కెసిఆర్‌ల పాలనకు భిన్నంగా రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామిక పాలన సాగే విధంగా అంటే,స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలనిబీ అణచివేతలు, నిర్బంధాలు, కుట్ర కేసులు,అక్రమ అరెస్టులు, కూంబింగ్‌లు, ఎన్‌కౌంటర్లులేని విధంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించేలా, ప్రత్యేకించి సమాజపు అట్టడుగు పొరలలో అన్ని రకాలుగా వెనుకబడిన ఆదివాసులు, గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం నిజాయితీగా పోరాడుతున్న సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ వంటి విప్లవ సంస్థపై తప్పుడు ప్రచారాన్ని, నిర్బంధాన్ని ఆపివేయాలని కోరుతున్నాము.

రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మోడీ, కెసిఆర్‌ల ఫాసిస్టు తరహా పాలనకు దిగడాన్ని ప్రజాస్వామికవాదులు, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఐ  (ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. 20-02-2024      

Leave a Reply