ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం వంటి పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్‌ శక్తులను ఊతమిచ్చే విధంగా ఉంది. బడ్జెట్‌ అంటే ప్రభుత్వ ఆదాయ-వ్యయాల చిట్టా మాత్రమే కాదు. దానికి ఒక తాత్విక చింతన ఉండాలి. ఆదాయం ఎవరి నుంచి వస్తుంది, వ్యయం ఎవరి కోసం చేస్తున్నారనేది బడ్జెట్‌లో కీలకాంశం. ప్రధానంగా దేశ ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఏలా అభివృద్ధి చేయాలనే కనీస ఆలోచన ఉండాలి. కాని మన పాలకులకు ప్రజలు కనిపించడం లేదు. పేదల శ్రేయస్సే ప్రధాన లక్ష్యమని పాలకులు గొప్పగా మాట్లాడుతారు. బడ్జెట్‌ స్వరూపాలను గమనిస్తే అవి కార్పొరేట్లకు మాత్రమే కొమ్ముగాస్తున్నట్లు విధితమవుతున్నది.  మాటల్లో ప్రజలు, చేతల్లో కార్పొరేట్లకు ప్రయోజనాలు కల్పించడంగానే కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు వంటి సామాజిక వర్గాల ప్రయోజనాలు, మధ్యతరగతి ఇబ్బందులు ఏవీ ఈ బడ్జెట్‌ లెక్కలోకి తీసుకోలేదు. ఆర్థిక భారంతో సామాన్య ప్రజలు విగతజీవులవుతుంటే, కార్పొరేట్లు మాత్రం బిలియనీర్లు అయిపోతున్నారు.

            పరాయి పాలన మారి ఏడున్నర దశాబ్దాలు గడిచిన తర్వాత కూడ ప్రజల మౌలిక సమస్యల్లో ఏ ఒక్కటి నేటికీ పరిష్కారం కాలేదు. నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం, ఆర్థిక అంతరాలు మరింతగా పెరిగిపోతున్నాయని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భవిష్యత్‌ పౌరులైన  బాలబాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ముప్పది శాతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ బడ్జెట్‌పై మాట్లాడుతూ ‘ఇప్పుడు మనకు కావల్సింది ఉపాధి అవకాశాలు సృష్టించే ఆర్థిక వృద్ధి అన్నారు. దేశ జనాభాయే మనకు గొప్ప అవకాశం అన్నారు. దానిని సరైనా విధానంలో వినియోగించుకొనే విధానాలే మృగ్యమైనాయన్నారు. యువతకు  ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనం ఉత్పాదక ఉపాధి మార్గాలను అన్వేషించాలన్నారు. అలాగే ప్రస్తుత బడ్జెట్‌లో అతిపెద్ద పద్దు వడ్డీ చెల్లింపులే కావడం విచారకరమన్నారు. దేశ అప్పులు పెరిగినంతగా జిడిపి పెరుగడం లేదన్నారు’ డి. సుబ్బారావు.  20 కోట్ల మంది యువకులు ఉపాధి కొరకు వేచి ఉన్నారు. దేశంలో ప్రతినెల పది లక్షల మంది ఉపాధి కొరకు మార్కెటులోకి వస్తుంటే ప్రభుత్వం కనీసం ఐదు లక్షల మందికి ఉపాధి చూపలేక పోతుంది. మరోవైపు ఒక శాతం సంపన్నుల వద్ద 40 శాతం సంపద పోగు పడిరది. దిగువన ఉన్న 50 శాతం ప్రజల వద్ద కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉంది.

            మోడీ సర్కారు పాలన తొమ్మిదేళ్ల పాటు మాటలకు, చేతలకు సంబంధం లేకుండా సాగింది. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన అఖరి బడ్జెట్‌లో కూడా గత ఆర్థిక విధానాలను ప్రజానుకూలంగా మార్చడానికి ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా లేవు. సాధారణ ఎన్నికల ముందు నిరుద్యోగం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, అధిక ధరలు, పేదరికం, పారిశ్రామిక మందగమనం వంటి ప్రధాన సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ. 45,03,097 కోట్లు కాగా, రెవెన్యూ వసూళ్లు రూ. 26,32,281 కోట్లు, మూలధన వసూళ్లు రూ. 18,70,816 కోట్లు. వివిధ పథకాల వ్యయం రూ. 35,02,136 కోట్లు, రుణాల కిస్తీలు, వడ్డీలకు రూ.10,00,961 కోట్లు. రెవెన్యూ లోటు రూ. 8,69,855 కోట్లు, ద్రవ్యలోటు రూ. 17,86,816 కోట్లుగా ఉంది. మొత్తం అప్పులు మార్చి 2024 నాటికి రూ. 1,69,46,666 కోట్లు కానున్నాయి.

            దేశ ఆర్థిక వ్యవస్థ యావత్‌ ప్రపంచానికే వెలుగురేఖ అంటూ ఓ వైపు మోడీ సర్కార్‌ గొప్పలు చెప్తుంటే మరోవైపు… జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022-23 సంబంధించిన ఆర్థిక సర్వే వెల్లడిరచిన వాస్తవ పరిస్థితులు మాత్రం ఇంకోలా ఉన్నాయి. ఆ సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగాలు పడుతున్నదని, మాంద్యం ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ వచ్చే సంవత్సరం భారత జిడిపి 6.5 శాతంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం 6 శాతం పైనే ఉంటుందని, నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయని, ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయని స్పష్టం చేసింది. రాబోయే ఏడాది కాలానికి దేశాన్ని అభివృద్ది పథంలోకి తీసుకువెళ్లే ప్రక్రియలో సామాన్యులను విస్మరించిన తరువాత ఇక చెప్పుకునేదేముంది? ప్రజా వ్యతిరేకమని తప్ప! దీనిని కప్పిపుచ్చడానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఎన్నో విన్యాసాలు చేశారు. సప్తర్షుల మార్గమని, అమృతకాలమని, ప్రజల్ని కేంద్రంగా చేసుకున్నామని ప్రజలకు అర్థం గాని సంస్కృత భాషలో గొప్పగా చెప్పారు.

            45 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌గా కనబడుతున్నప్పటికీ మన దేశ జాతీయ స్థూల ఉత్పత్తి(జిడిపి)లో బడ్జెట్‌ పరిమాణం ఏటేటా తగ్గుతున్నది. అంటే ప్రజాహిత (సబ్సిడీలు, సంక్షేమం) కార్యక్రమాల పట్ల ప్రభుత్వ వ్యయం తగ్గుతుందని గుర్తించాలి. ప్రభుత్వ వ్యయం స్థూల ఉత్పత్తిలో 2020-21లో 17.7 శాతం ఉండగా, 2021-22లో 16 శాతం, 2022-23లో 15.3 శాతం, 2023-24లో 14.9 శాతంగా ఉంది. ఇలా తగ్గడానికి కారణం సంపన్నుల నుండి వసూలు చేయాల్సిన పన్నులను తగ్గించడం, మరోవైపు బడ్జెట్‌ వ్యయంలో మూడవ వంతు రుణాల ద్వారా సమకూర్చుకొంటుంది. ఈ ఆర్థిక సంవత్సర వ్యయం రూ.45 లక్షల కోట్లలో వాస్తవాదాయం రూ.26,32,281 కోట్లు కాగా అప్పుల ద్వారా సమకూర్చుకునేది రూ.17,86,186 కోట్లు. ప్రభుత్వం చేసే అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించేది ప్రజల నుండి పరోక్ష పన్నుల ద్వారా వసూలు చేసిన సొమ్మునుంచే, అంటే ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసే పన్నుల ఆదాయాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ అప్పులు చేస్తున్నారు. ఇవ్వాళ భారత రుణం జిడిపిలో 84 శాతంగా ఉంది. తలసరి ఆదాయం రూ.1,97,000 లు ఉండగా, తలసరి రుణం రూ.1,09,000 లు ఉంది. మన ఆర్థిక వ్యవస్థ అనారోగ్యంతో ఉందని ఇది తెలియజేస్తున్నది. నిన్న శ్రీలంక, నేడు పాకిస్తాన్‌, రేపు భారత్‌ దివాళ అంచుకు చేరక తప్పదనిపిస్తుంది.

             ఈసారి బడ్జెట్‌ కూడ ఎప్పటి మాదిరిగానే జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న అతి పరిమిత ఆదాయాలు గల సాధారణ ప్రజల వికాసానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వారి ఆరోగ్య, విద్య వికాసాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. కొన్ని కీలక పథకాలకు గతం కంటే నిధులను తగ్గించి వేశారు. అదే సమయంలో కార్పొరేట్‌ రంగాన్ని సంతృప్తి పరచడానికి పాటుపడ్డారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారీ, అద్భుతాలు జరుగుతాయని ఆశించడం.. తీరా చూస్తే ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో నీరుగారిపోవడం సామాన్యుడికి సామాన్యమైపోతోంది. ఉపాధి లేక, ఉద్యోగావకాశాలు లభించక అల్లాడుతున్న యువతకు చేయూతనిచ్చే అంశాలు, ప్రతిపాదనలు, ప్రణాళికలు ఈ బడ్జెట్‌లో కనిపించవు. ఈ బడ్జెట్‌లో కూడ  రైతులు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగ యువకులు, ఎస్సీ-ఎస్టీ సామాజిక వర్గాల ప్రయోజనాలు, ఆహారభద్రత, ఉపాధి హామీ వంటి సమస్యలను పరిగణలోకి తీసుకోలేదు. కాని, బడా కార్పొరేట్లు నడిపిస్తున్న రుణ సంస్థలకు మాత్రం నిబంధనల్ని సడలించారు.

            ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థలో కొట్టవచ్చినట్లు కనిపించే వాస్తవ విషయం ప్రజల వినియోగంలో పెరుగుదల అత్యంత హీనస్థాయిలో ఉండడం. 2019-20 నుండి 2022-23 మధ్యకాలంలో తలసరి వినియోగం పెరుగుదల నామమాత్రంగానే ఉంది. జిడిపి వృద్ధి రేటు కంటే 50 శాతం ప్రజల వినియోగం తక్కువగా ఉంది. అందువలన బడ్జెట్‌లో ప్రధానంగా ఉండవలసిన లక్ష్యం ప్రజల వినియోగాన్ని పెంచడం, అందుకు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉపాధి హామీ పథకానికి ఇతరత్రా సబ్సిడీలకు కేటాయింపులు పెంచాలి. కాని ఈ బడ్జెట్‌లో ఆ పని చేయలేదు సరికదా, సంక్షేమ రంగాలకు గతంలో కేటాయించిన కేటాయింపులకు కోతలు పెట్టారు. 2021-22లో రూ.4,60,575 కోట్లు రాష్ట్రాలకు బదలాయించారు, 2022-23లో రూ.3,67,224 కోట్లు కాగా 2023-24లో రూ.3,59,430 కోట్లు కేటాయించారు. అయితే వాస్తవంలో ఎంత బదలాయిస్తారో సంవత్సరం చివరి వరకు వేచి చూడాలి. సంపన్నులకు, మధ్య ఆదాయ వర్గాలకు పన్ను రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సామాజిక, సంక్షేమ రంగాలకు 2022-23లో రూ.5,62,079 కోట్లు కేటాయించగా 2023-24 బడ్జెట్‌లో రూ.4,03,084 కోట్లకు కుదించారు. ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలకు గత సంవత్సరం కంటే 28 శాతం కుదించారు.

ఎరువులు, ఆహారం, పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీ కోట్లలో:

అంశం21-2222-2323-24
ఎరువులు1,53,7582,25,2201,75,100
ఆహారం2,88,9692,87,1941,97,350
గ్యాస్‌సబ్సిడీ38,4553,4232,275

సాంఘిక సంక్షేమ పథకాలకు కోత :

            ఈ బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు కోతలు పెట్టారు. కరోనా సృష్టించిన సంక్షోభం దేశ ప్రజానీకాన్ని ఇంకా వెంటాడుతూనే ఉందన్న విషయాన్ని కేంద్రం విస్మరించింది. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రాయితీలను కల్పిస్తూ, పెట్టుబడులను సమకూరుస్తూ అనేక ప్రతిపాదనలు ఉన్న ఈ బడ్జెట్లో పేద ప్రజలకు మాత్రం మొండి చేయి చూపించింది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం : నూతన ఆర్థిక విధానాల పేరుతో భారతదేశంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను అమలు చేయడం ప్రారంభించిన తర్వాత పేద ధనిక వ్యత్యాసాలు విపరీతంగా పెరగటం ఆరంభమైంది. గ్రామీణ నిరుద్యోగం తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహాన్ని తాత్కాలికంగా చల్లార్చడానికి ప్రపంచ బ్యాంకు సూచించిన సమ్మిళిత వృద్ధిలో భాగంగా, ఒక ఉపశమన కార్యక్రమంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2005 ఆగష్టు 25న ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు  చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

            మోడీ ప్రభుత్వం 2014 నుంచి ఈ పథకానికి కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. ప్రజలను శాంతింప చేయడానికి ప్రవేశపెట్టినప్పటికీ ఈ పథకం గ్రామీణ పేదలకు కొంతమేరకు ఊరటనిచ్చింది. కనీసం వంద పనిదినాలు అనేది ఏనాడు అమలు కాలేదు. బిజెపి వచ్చిన తర్వాత సగటు పనిదినాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పేదలకు ఊరటనిచ్చే ఈ పథకం పైన ప్రభుత్వం కక్ష పూనినట్లుగా వ్యవహరిస్తున్నది. ఈ సంవత్సరం బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులను 60 వేల కోట్లకు పరిమితం చేసింది. గత సంవత్సరం కేటాయింపు 89,400 కోట్లు. 33 శాతం తగ్గించారు. ఈ పథకంలో దాదాపు 17 కోట్ల మంది రిజిస్టర్‌ అయి ఉన్నారు. సగటున 10 కోట్ల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన మొత్తం కేవలం 20 పని దినాలకు మాత్రమే సరిపోతుంది. 100 రోజుల పని కల్పించాలంటే రూ.3 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంది.

వ్యవసాయ రంగం : వ్యవసాయ రంగానికి కేటాయింపులను రూ.1,24,000 కోట్ల నుండి రూ.1,25,000 కోట్లకు పెంచారు అంటే పెరుగుదల కేవలం 1000 కోట్లు మాత్రమే. పెరిగిన బడ్జెట్‌ పరిమాణంతో పోల్చుకున్నా, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నా ఇది పెరుగుదల కానే కాదు. వాస్తవంగా తగ్గుదల. దేశంలో తలసరి ఆదాయం నెలకు రూ.16,400 ఉండగా రైతుల తలసరిఆదాయం రూ.12,500 రూపాయలు మాత్రమే. ధనిక రైతులు, భూస్వాముల ఆదాయాలను తీసివేసి సన్నకారు చిన్న మధ్య తరగతి రైతుల ఆదాయాన్ని మాత్రమే గణిస్తే ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. పాలకులు వ్యవసాయాన్ని నష్టదాయకంగా మారుస్తున్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను అనుసరించే పరిస్థితి మనదేశంలో లేదు. వ్యవసాయ పరిశోధనకు స్థూల జాతీయోత్పత్తిలో 0.5% కంటే తక్కువ కేటాయించారు. ప్రపంచ దేశాలలో సగటు కేటాయింపు 1.5% శాతంగా ఉంది. గ్రామాల్లో రైతులకు ఆధారంగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు కేవలం రూ.2516 కోట్లు మాత్రమే కేటాయించారు.

ఆహార సబ్సిడీ : ఆహార సబ్సిడీలోనూ భారీ కోత పెట్టడం ద్వారా పేదప్రజానికంపై మరో దాడిని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆకలి సూచీలో 129 దేశాల్లో మన స్థానం 107. అయినా, వివిధ పథకాల ద్వారా పేదలకు తక్కువ ధరకు సరఫరా చేసే ఆహారం కోసం ఇచ్చే సబ్సిడీలో ఏకంగా 90 వేల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం తగ్గించింది. 2021-22లో ఆహార సబ్సిడీ కోసం రూ.2,88,969 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, 2022-23లో 2,87,194 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అంచనా! మాంద్యం ముంచుకొస్తున్న వేళ ఈ మొత్తాన్ని ఇంకా పెంచాల్సి ఉండగా ఈ బడ్జెట్‌లో 1,97,350 కోట్ల రూపాయలతో సరిపెట్టింది. అంటే 31 శాతం కోత!

ధాన్యం సేకరణ : ధాన్యం సేకరణ కోసం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 2022-23లో 2,14,696 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వగా తాజా బడ్జెట్‌లో రూ.1,37,207 కోట్లకు తగ్గించారు. ఎస్‌ఎఫ్‌ఎస్‌ఎ పథకం కింద చేసే సేకరణకూ రూ.72,283 కోట్లు గత బడ్జెట్‌లో కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.59,793 కోట్లకు సరిపెట్టారు.

ఎరువులు : ఎరువులపై సబ్సిడీని గత బడ్జెట్‌తో పోలిస్తే 50 వేల కోట్ల రూపాయల మేర తాజా బడ్జెట్‌లో కేంద్రం తగ్గించింది. అంటే 22 శాతం. 2022-23లో 2,25,520 కోట్ల రూపాయలను ఎరువుల సబ్సిడీ కోసం ఖర్చు చేయగా, తాజా బడ్జెట్‌లో 1,75,100 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. ఫలితంగా వ్యవసాయం మరింత భారంగా మారనుంది.

గృహనిర్మాణం : పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 2021-22లో 90,020 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, తాజా బడ్జెట్‌లో 79,590 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. 2021-22లో 77,130 కోట్ల రూపాయలు ఇళ్ల నిర్మాణం కోసం వ్యయమైనట్లు అంచనా వేశారు. దానితో పోలిస్తే వచ్చే సంవత్సరానికి నామమాత్రంగా కేటాయింపులు పెంచినప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ మొత్తం తగ్గుతుంది.

ఆరోగ్యం: ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి గత ఏడాది రూ.86,291 కోట్లని చెప్పి రూ.79,145 కోట్లను సవరించిన బడ్జెట్‌లో చూపింది. ఈ సంవత్సరానికి రూ.89,155 కోట్లు కేటాయించింది.

– స్త్రీ, శిశు సంక్షేమానికి, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరుగలేదు. ఎస్సీ-ఎస్టీల సబ్‌ప్లాన్‌ నిధులు గత సంవత్సరం కంటే తగ్గాయి. మైనార్టీల సంక్షేమానికి, వారి పిల్లలకు ఇచ్చే ఉపకార వేతనాలకు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు 2022-23 కేటాయింపులతో పోలిస్తే 38 శాతం కోత పెట్టి బడ్జెట్‌కు మతం రంగు పులిమిన ఘనతను మోడీ సర్కార్‌ మూటకట్టుకున్నది.

– బిజెపి ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు ఉదారంగా కేటాయింపు చేసిన మోడీ సర్కార్‌ ఇతర రాష్ట్రాలకు కేటాయింపుల పట్ల వివక్ష చూపింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలు నెరవేర్చకుండా మొండి చెయి చూపింది.

సెస్‌ల రూపంలో రాష్ట్రాల ఆదాయానికి గండి :

            మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాలను అస్థిరపరుస్తోంది. న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తోంది. సెస్సులు, సర్‌చార్జీల రూపంలో దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు తరలించుకుపోతోంది. దీంతో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా క్రమంగా తగ్గుతూ పోతోంది. ఈ సెస్‌ల వసూళ్లకు ఎలాంటి నిబంధనలు అడ్డు రావు. తద్వారా రాష్ట్రాల వాటాను కేంద్రం దర్జాగా తన ఖాతాలో వేసుకుంటోంది. ఇది సరికాదని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కేంద్రం మాత్రం తమ దారి తమదే అన్న చందంగా ఒంటెద్దు పోకడలతో నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. పన్నులను సెస్‌లు, సర్‌చార్జీలతో వసూలు చేస్తుండడంతో  రాష్ట్రాలకు రాబడి క్రమంగా క్షీణిస్తోంది.

            ఈ నేపథ్యంలో 2018-2019లో కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రాలకు వచ్చిన ఆదాయం 36.6 శాతం కాగా, 2021-22 నాటికి 33.2 శాతం, 2022-2023లో 31.2 శాతం, 2023-2024 అంచనాల్లో 30.4 శాతమే రానుంది. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో రూ.2,18,553 కోట్లు అర్జించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-2023)లో జనవరి నెల వరకు రూ.5,10,549 కోట్లకు పెరిగిందని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2017-2020 మధ్య కాలంలో కేంద్రం పెట్రోల్‌పై సెస్‌, సర్‌చార్జీలను 150శాతం, డిజిల్‌పై 350 శాతం పెంచింది. నిజానికి కేంద్రానికి వచ్చే స్థూలపన్నుల ఆదాయంలో డివిజబుల్‌ పూల్‌ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటాను పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అయితే డివిజబుల్‌ పూల్లోకి రాని సెస్సులు, సర్‌చార్జీల పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. 

ముగింపు :

            సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలు తరువాత ఆర్థిక అంతరాలు పెరుగడం మొదలయ్యింది. మోడీ అధికారంలోకి వచ్చాక ఈ అంతరాల తీవ్రత చాలా విస్తృతంగా పెరిగింది. సంపద ఒకచోటే పోగుపడుతోందన్న ఆక్స్‌ఫామ్‌ ఇటీవలీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోలేదు. సామాజిక భద్రత ఇచ్చే పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలన్న కార్మికసంఘాల డిమాండ్‌ పట్టించుకోలేదు. కొవిడ్‌కు ముందు జిడిపిలో 42 శాతం ఆదాయం సమకూర్చే అసంఘటిత రంగం ఇవాళ జిడిపిలో 20 శాతం మాత్రమే సమకూరుస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం కొరబడటమే ప్రధాన కారణం. అందులో ఉపాధి కోల్పోయిన  కార్మికుల ఊసే ఎత్తలేదు. ఎన్‌పిఎ (బ్యాంకులకు చెల్లించాల్సిన మొండి బాకీలు) సమస్య ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. వాస్తవ సమస్యలను ప్రస్తావించకుండా, జీవన భారాలకు పరిష్కారం చెప్పని మోడీ బడ్జెట్‌ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడంలో విఫలమైంది. శ్రామిక వర్గాన్ని, రైతులను నిరాశ పర్చింది.              ఈ బడ్జెట్‌లో కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం నిరుద్యోగులకు శరాఘాతం లాంటిది. ఈ కృత్రిమ మేధ కారణంగా ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగాలకు గండిపడిరది. ఇది మరింత అభివృద్ధి చెందితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తంమీద ఏ రకంగా చూసినా, ఇది బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్‌లాగే కనిపిస్తున్నది. దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేయడంలో చూపుతున్న ఉత్సాహం, ఉపాధి కల్పన, పేదరికం నిర్మూలన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి మౌలిక అంశాలపై ఉంటే నిజంగా ప్రజలకు మేలు జరిగేది. ఒక అవాస్తవిక బడ్జెట్‌గా ఇది చరిత్రలో మిగిలిపోతుంది. మౌలిక వసతుల కల్పన కోసం చేసే ఖర్చు నేరుగా ఆశ్రిత పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చుతుంది. అందుకే ఆ క్రోనీలకు మౌలిక వసతుల కల్పన అంటే అంత ఆసక్తి. ఈ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తంగా ముందుకు తీసుకుపోయే ఆలోచనలతో లేదు.బడ్జెట్‌లో హంగామా సృష్టించడం తప్ప సామాన్యుడికి జరిగింది శూన్యం.

Leave a Reply