రాజకీయ కవితలు రాయడం చాలా కష్టం. అందులోనూ కమ్యూనిజం లేదా ఇప్పుడు పాలకులు పదేపదే  ఉఛ్ఛరిస్తున్న అర్బన్ నక్సల్ అవగాహనతో కవిత్వం రాయడం ఇంకా కష్టం. ఇలాంటి కవిత్వం లో రెండు అంశాలు ప్రధానంగా కనబడతాయి. నేరుగా ప్రజాపోరాటాలతో, జనజీవితంతో సంబంధం ఉండడమూ, వాటి రూప సారాలను మార్క్సిజం ఆధారంగా అర్థం చేసుకునే చారిత్రక అవగాహన కలిగి ఉండడమూ. నేను చూసిన, పరిచయమున్న ఇలాంటి పెద్దలలో అరుణ్ సార్ ఒకరు.

           తాను నమ్మిన విప్లవ పంధా నుంచి, ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఇసుమంత కూడా పక్కకు ఒరగని నేపధ్యం నుంచి ఎలాంటి కవిత్వం ఆశించగలమో అలాంటి కవిత్వమే అరుణ్ సార్ రాసారు. విరసంతో ఇన్నేళ్ళ సభ్యత్వంలో అనేక రాజకీయ అంశాలతో పాటు రాయలసీమ నేపధ్యంగా వ్యాసాలూ బుక్లేట్ అనేకం రాసారు కానీ ఎందుకో కవిత్వం ఎక్కువగా రాయలేదు. అడపాదడపా రాసిన వాటినే ఇప్పుడు ఈ సంకలనం తీసుకొచ్చారు.  పదాడంబరం జోలికి పోకుండా, అనవసర పాండిత్యం ప్రదర్శించకుండా, స్పష్టంగా, సూటిగా తాను అనుకున్నది, చారిత్రక గమనంలో ఉన్నది, తన రాజకీయ జీవితానుభవం గీటురాయి గా రాయబడ్డ కవిత్వం ఇది.

             ఈ కవిత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఏ అలంకార శాస్త్రాలనీ ఉపయోగించి తూచనవసరం లేదు. ఏ నిఘంటువు పుటల మధ్యో అర్థాలు వెతుక్కునే అవసరం లేదు.  “ఎర్రజెండా..ఎన్నీయలకు” నిజానికి ఏ సొబగులూ అక్కర లేదు. ఇవి జనం మధ్య నుంచి ,వారి బాధల్లోంచి, ఆకాంక్షల్లోంచి పెల్లుబికిన పదాలు. వాటిని మసిపూసి మారేడు కాయ చేయడం అనవసరం. అవసరం అనుకునే వాళ్ళను అలా వొదిలేద్దాం.  అరుణ్ సర్ ఒక కవితలో అన్నట్టూ “మరి, ఏంజేయాలి నేనూ!? ప్రభంద కవులను మరిపిస్తూ, పాలక రాబందులను మురిపిస్తూ మధుర కావ్యాలను రాయనా?” / ” జన సమూహాన్నోదలి మత్తు సిరాతో గమ్మత్తు చేయనా?”  అంటారు.

రాజ్యం చేసే కుట్రలను అర్థం చేసుకొని వాటికి భాష్యం చెప్పే ఓర్పూ నేర్పూ ఉంటే ఇలా రాయగలం. మనం ఏమిటో, మన పంధా ఏమిటో నేరుగా పాఠకునితో చెప్పగలం. ఒక కమ్యూనిస్టు కూ, మిగతా కవులకు ఉండే తేడా అదే కదా? వస్తువు కోసం వెంపర్లాట అవసరం లేదు. మన కళ్ళ ముందు నుంచి కదిలిపోయే కదలికలనూ గమనిస్తూ, చరిత్ర ఆయన ముందు పెట్టిన పరిణామాల్లోంచే ఈ కవిత్వం పుట్టింది.

            జీవితానుభవం అన్నింటి కంటే గొప్ప శాస్త్రం, అన్నింటికంటే సరళమైన వ్యాపకం. కాకపోతే మనం ఏ స్థానంలో నిలబడి రాస్తున్నాం అనే ఎరుక అవసరం. ఈ వాక్యాలు చూడండి( నా జీవితం) “నా జీవితం వడ్డించిన విస్తరే కాదనను కానీ అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం పోరాటం” ” నేనగ్రవర్ణ సంజాతుడనే కానీ కులం వర్గం రహిత సమాజం కై జరిగే పోరులో సాహితీ సైనికుణ్ణి” తానేమిటో స్పష్టంగా తెలిసిన కవి తనను ప్రశ్నిస్తున్న వాళ్ళ పై సంధించిన రాజకీయ ప్రకటన ఇది!

          జీవితమే రాజకీయాలకి ప్రతిరూపం అయినపుడు చూపు రాజకీయం, నడత రాజకీయం, ఆచరణ రాజకీయం, కవిత్వమూ రాజకీయ మార్గదర్శి కావాలి. మిగతావన్ని రాజ్యం కుట్రలకు బలౌతున్న సమిధలే! ఇంకా చెప్పాలంటే రాజ్యం కుట్రల్లో భాగమౌతున్న వాదాలే!            కర్నూలు జిల్లా లో పొడచూపిన అనేక ప్రజాపోరాటాలూ, వాటితో ప్రత్యక్ష,పరోక్ష భాగస్వామ్యం, నల్లమల కేంద్రంగా ఆయన చూపు పరిధిలోనే విస్తరించిన విప్లవోద్యమం బహుశా, కాలం, సర్ ముందు ఎన్ని సవాళ్ళు ఉంచాలో అన్ని ఉంచింది. అందుకే ఆయన అనారోగ్యం సమస్యల్లో సైతం యువతరానికి కావాల్సిన ఆత్మవిశ్వాసపు టానిక్ అందిస్తూనే ఇంకా చురుగ్గా ఉన్నాడు. ఆ టాపిక్ లోని ఎఫెక్ట్ ఈ కవిత్వంలోనూ చూడగలం. “నేను కలాన్నే కాదు,కర్షకుణ్ణి, కార్మీకుణ్ణి దోపిడీ వ్యవస్థని పెకలించే గునపాన్ని” అని తన రాజకీయ లక్ష్యం ఏమిటో ప్రకటించాడు. అంతే కాదు “కులమతాలు లేని, దోపిడీ పీడనలు లేని సమసమాజావిష్కరణకు వెలుగు చూపే రేపటి సూర్యూణ్ణి నేను,అవును,నేను రోహిత్ వేములను, ఢిల్లీపై రేపు ఎగరబోయే జెండాను నేనే” అలాగే వివి, సాయిబాబా ల ఖైదు కు వ్యతిరేకంగా రాసిన కవితల్లో అటు రాజ్యాన్నీ, ఇటు రాజ్యం కనుసన్నల్లో పని చేస్తున్న  న్యాయ వ్యవస్దనీ నిలదీశారు. నేనెపుడూ స్వేచ్ఛా జీవినే అనే కవితలో ” నీ హిందూత్వ ఫాసిస్టు భూగర్భంలో నన్ను బంధించాలనుకోకు, సామ్యవాద లావానై నిన్ను ముంచెత్తుతా, జనం నిండా విస్తరిస్తా” నని ప్రకటిస్తారు. పని మనిషి మీద రాసిన కవితలో “ఆమె మనీ లేని ప్రేమ జేసే షి అని పని మనిషిని నిర్వచించారు. అలానే “చీకట్లను చీపురుతో తరిమే కాంతి ఆమె/ఇండ్లలో మలినాన్ని, మాలిన్యాన్ని కడిగే గంగ అవుతుంది అంటారు. ఇంత చిన్న సంకలనంలో విభిన్న వస్తువులను స్పృశించారు. ఇది ఆయన రాజకీయానుభవం వల్లే సాధ్యమైంది. అరుణ్ సార్ నుంచి నేను ఇంకా కవిత్వాన్నీ ముఖ్యంగా రాయలసీమ కవిత్వాన్నీ ఆశిస్తున్నాను.

Leave a Reply