సీనియర్‌ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావు ఫిబ్రవరి 6న చనిపోయారు. ఆయన తెలుగు కథా చరిత్రలో గుర్తు పెట్టుకోదగిన రచయిత. మూడు తరాల కథా వికాసం ఆయనలో కనిపిస్తుంది. 1950లలో ఆయన కథా రచన ఆరంభించారు. ఆ రోజుల్లో ని చాలా మంది కథకుల్లాగే ఆయనా మధ్య తరగతి జీవిత ఇతివృత్తం ప్రధానంగా రాశారు. సహజంగానే కోస్తా ప్రాంత సాంస్కృతిక ముద్ర ఆయన కథల్లో కనిపిస్తుంది. మానవ జీవిత సంఘర్షణను, వైచిత్రిని నిశితంగా చూసి రాశారు. చాలా మామూలు కథన శైలితో సాగే ఆయన కథల్లో ఇప్పటికీ మిగిలి ఉండేది ఆయన పరిశీలనాశక్తి, అందులోని విమర్శనాత్మకత.

            కొన్ని కథలు చాలా సాధారణంగా ఉన్నప్పటికీ మరికొన్ని చాలా లోతుగా ఉంటాయి. మానవ జీవితంలో సాధ్యంకాగల అంశాలను గుర్తెరిగా కథలుగా మలిచారు. మనుషులు తమ చుట్టూ ఉండే పరిస్థితులకు లోబడి ప్రవర్తించే తీరును చిత్రిస్తున్నట్లే ఉంటుందికాని, తమ వివేకంతో పరిస్థితులను పట్టి పట్టి పరిశీలించి, అర్థం చేసుకొని, అనుకూలంగా మార్చుకొని, అధిగమించేందుకు పడే తపనను జగన్నాథరావు చాలా సహజంగా రాస్తారు. ఇవన్నీ  జీవితంలో  సహజమే, సాధ్యమే అనే నమ్మకం కలిగేలా రాయడం ఆయన ప్రత్యేకత. మధ్య తరగతి కేంద్రంగా తెలుగులో వచ్చిన, వస్తున్న సాహిత్యానికి ఉండే పరిమితులకు, ప్రత్యేకతలకు  ఆయన కథలు కూడా ఉదాహరణ.

            కథనాన్ని మంచి వర్ణనతో, పాత్రల మనస్తత్వ చిత్రణతో, సహజమైన వైరుధ్యాల సంఘర్షణలతో, పాత విలువలపట్ల పట్టింపుతో, వాటి వల్ల కలిగే ఉక్కబోతతో మనుషులు ఎలా ప్రవర్తించేదీ జగన్నాథరావు చిత్రిస్తారు. ఆయన కథల్లో రెండు మూడు దశలు కనిస్తాయి. అవి వ్యక్తిగా, కథకుడిగా ఆయనలోని పరిణామాన్ని, దాన్ని ప్రభావితం చేసిన తెలుగు సమాజపు భావజాల వికాసపు ప్రభావాన్ని సూచిస్తాయి. మనుషుల్ని దోషులుగా చిత్రించకపోవడం, పరిస్థితుల ప్రాబల్యాన్ని కథలోకి తేవడంలో ఆయనకు ఒక రకమైన ఒడుపు ఉంది.

            ఎప్పుడో 1960ల్లో రాసిన అడుగుజాడలు కథ కానీ, ఆ తర్వాత రాసిన సముద్రం  వంటి కథలుగాని  జగన్నాథరావు కథన శక్తికి  చప్పున చెప్పుకోదగిన ఉదాహరణలు. అడుగుజాడలు కథలో  మనిషిలోని సగటు మంచి`చెడ్డల ప్రవర్తనల వెనుక ఉండే పట్టింపు ఎంత క్రౌర్యానికి దారి తీస్తుందో హృదయ విదారకంగా చిత్రిస్తారు. అయినా సరే మనిషి జీవితం ముందు లొంగిపోవాల్సిందే, దాన్ని అంగీకరించాల్సిందే.. అనే సత్యాన్ని చెప్పడానికి ఈ కథ రాశారా అనిపిస్తుంది. పరువు కోసం ఆస్తులు అమ్ముకొని దేశం కాని దేశం వెళ్లి, అన్నం అమ్ముకుంటూ అక్కడా ఉండలేక ప్రపంచం చాలా పెద్దదని దారి చూసుకోవడంతో ఆ  కథ ముగుస్తుంది.  కథనం, దృక్పథం కలగలసి  జీవితాన్ని అర్థం చేసుకొనేలా చేయడమే ఆయన కథల సారాంశం. అలాగే ‘సముద్రం’ కథ చాలా విస్తారమైన చర్చను ప్రేరేపిస్తుంది. ప్రేమ, ఇష్టం, అనుభూతులు మనుషులకు కొత్త ఎరుకను కలిగిస్తాయని, అలాంటి వాటి గురించి వ్యక్తులు, సమాజం పెట్టుకున్న నియమాలకన్నా, విలువల కన్నా జీవితం చాలా పెద్దదని, ఆనందంగా, పూర్తిగా జీవించడమంటే దాన్ని గుర్తించడమే.. అనే ఆలోచన రేకెత్తించే కథ ఇది. 

            ఇట్లా భమిడిపాటి జగన్నాథరావు చాలా కథలు మానవ సంస్కారాన్ని, సాంస్కృతిక ఉన్నతిని పెంచడానికి దోహదం చేస్తాయి. తనకు తెలిసిన జీవితాన్ని అంతే వివేకవంతంగా, సహజంగా, ఆర్తిగా గుర్తించి కథలు రాశారు. సమాజంలోని ప్రగతిశీల పరిణామాలను పరిశీలిస్తూ చివరి దాకా కొనసాగారు. తన కథల ద్వారా పాఠకుల మనసు, అవగాహన  ఆ దిశగా విస్తరించడానికి దోహదం చేసే కథలు రాశారు. అట్లాగే ఆయన చివరి రోజుల దాకా విప్లవ సాహిత్యాన్ని కూడా గమనిస్తూ,  చదువుతూ వచ్చారు. అరుణతార పత్రికకు ఇష్టమైన పాఠకుడిగా ఉండేవారు. ఆయన మృతికి విరసం నివాళి ప్రకటిస్తోంది.

Leave a Reply