లింగభేదం యింద్రధనుస్సు లో రంగుల మధ్య భేదం లాంటిది. నేను వొక రంగును కరెక్టు గా గుర్తు పట్టానా లేదా అన్నది అసలు సమస్యే కాదు. అన్ని రంగులకీ సమానమైన విలువ యివ్వడం – ప్రతి రంగుకీ సమాన హోదాలో గుర్తించబడే అవకాశం వుండటం అదీ ముఖ్యమైన విషయం. జన్యుపరంగా, లింగ అభివ్యక్తిపరంగా, లైంగిక గుర్తింపుపరంగా  యే విధమైన లక్షణాలు వున్నప్పటికీ సమానంగా గుర్తించబడే హక్కు ప్రతి వ్యక్తికి వుండాలి.

విరసం ప్రచురించిన బిట్టూ కె. ఆర్. రచించిన పి.వరలక్ష్మి గారు అనువదించిన “రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు”  పుస్తకాన్ని చూసినప్పుడు “ట్రాన్స్ జెండర్ అనేది కేవలం వొక వైద్య పరంగా జరిగే రూపాంతరం మాత్రమే కాదు. నువ్వు యెవరివి అన్నది ఆవిష్కరించుకోవటం, నీ జీవితాన్నిలోతుగా యెట్లా జీవించాలి ? నిజాయితీగా యెట్లా జీవించాలి, నిన్ను నువ్వు యెట్లా ప్రేమించుకోవాలి, ఆ ప్రేమని యితరులకు యెట్లా పంచాలి, యే భేదాలు యెట్లా వున్నా యితరులని యెట్లా మనసుకు హత్తుకోవాలి ట్రాన్స్ జెండర్ అంటే  యివన్నీ ఆలోచించుకోవటం.” అన్న Jazz Jennings మాటలు గుర్తొచ్చాయి.

‘రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు’ ల్లో పొందుపరిచిన విషయాలు లైంగికత పై అవగాహన వున్నవారికి మరింత స్పష్టమైన చూపునిచ్చేట్టు, అస్సలు యే అవగాహనా లేని వారికి మెరుగైన అవగాహనని కలిగించేట్టు, అపోహలతో వుండేవారి అపోహలని తీర్చేట్టు, తూలనాడేవారికి యెందుకు తూలనాడకూడదోననే యెరుకని కలిగించేట్టుంది.

సమాజం భిన్న లైంగికతలని యెలా చూస్తోంది? యెలా అర్ధం చేస్కొంటుంది? యెలా చూడాలో యెలా అర్ధం చేసుకోవాలో

వ్యక్తిగత ఆస్తి కేంద్రంగా నడిచే కుటుంబ వ్యవస్థ స్త్రీ లైంగిక స్వేచ్ఛను పూర్తిగా పక్కన పెట్టేసి పురుషుడి ఆకాంక్షలకి అనుగుణంగానే యెవరి రోల్స్ యేమిటో నిర్వచించి జీవిత విధివిధానాల్ని రూపొందించినప్పుడు స్త్రీలని పురుషుల ఆస్తిగానే సుస్థిరమైన ఆచరణని, రూపాన్ని కంచుకోటల సమాజపు అవగాహనలోకి స్థిరపరిచారు. అటువంటి ఆవరణలోకులం, ఆస్తి, మతం అంతా తనతన పరిధిలో మనుష్యుల మధ్యన ముఖ్యంగా రెండు హృదయాల నడుమ చిగురించే ప్రేమా లేదా ఆకర్షణ చుట్టూ అనేక ముళ్ళ కంచెలని నీట్ గా వేస్తుంటుంది. ప్రేమ నేరమైన సమాజం మిగిలిన సమాజాన్ని యే వనరుతో శుభ్రపరుస్తుంది? యిటువంటి సమాజంలో ట్రాన్స్ జెండర్ అస్తిత్వానికి గుర్తింపు అనే మాట పెదవి దాటాక ముందే బోలెడన్ని తిరస్కార బాణాలని యెక్కుపెట్టటాన్ని చూస్తూనే వున్నాం.

లైంగికత అంటే యేమిటని అడిగితే యిప్పటికీ అయోమయంగా చూసేవారెందరో. చాల యేళ్ళుగా లైంగికత మీద మాటాడుతున్నా, సాహిత్యం వస్తున్నా యీ విషయం మీద స్పష్టమైన అవగాహనున్నవాళ్ళ కంటే లేనివాళ్ళే యెక్కువ. లైంగికత గురించి మనకి అవగాన యెందుకనే ప్రశ్నా వినిస్తుంటుంది. లైంగికత గురించి తెలుసుకోవటం యెవరి కోసమో కాదు. మన కోసం మనం తెలుసుకోవాలి. చాల మందికి తాము శ్వాసిస్తోన్నశరీరపు అనాటమీ కూడా తెలియనితనం వుంటుంది. తెలియక పోవటం పొరపాటు కాదు. తెలియకుండా తీర్పులు చెప్పటం యెంతో మందిని గాయపరుస్తుంది. మనల్నిమనం సరిగ్గా ఆవిష్కరించుకోవటానికి, ఆర్గనైజ్ చేసుకోటానికి మనకి ముందుగా మన అనాటమీ తెలియటం చాల ముఖ్యం. అలాగే మన లైంగికత యేమిటన్నదీ తెలియటం చాల అవసరం.    

లైంగికతను గురించి పూర్తిగా సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం యెంతో వుంది. లైంగికత మీద సరైన అవగాహన లేకపోవటానికి వో కారణం దాని గురించిన సమాచారం అర్థమయ్యే రీతిలో సింపుల్ గా దొరకకపోవటం కూడా కావొచ్చు. లైంగికత మీద వచ్చిన పుస్తకాలు అందుబాటులో లేకపోవటమూ కావొచ్చు. యీ ‘రెయిన్ బో’ పుస్తకం ఆ లోటుని పూరిస్తుంది. యీ అంశంని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా అర్ధం చేసుకోవటానికి అవసరమైన జన్యుపరమైన… వైద్య పరమైన విషయాల్ని, మానసిక స్థితులని సోషల్ కండీషన్స్ ని చాల వివరంగా అందరికీ అర్ధమైయ్యేట్టుచే యీ పుస్తకాన్నిఅనువదించిన వరలక్ష్మి గారు వివరించారు. అందరి అవగాహనకి చేరువగా యీ అనువాదాన్ని అందించిన వరలక్ష్మి గారు అభినందనలు.      

తాము కాని లైంగికత వైపు చిన్న చూపు వున్నవారి చూపుని విశాలం చేసేట్టున్నయీ పుస్తకంలో ‘లైంగిక వైవిధ్యాలను అర్ధం చేసుకుందాం’, ‘సైన్స్ ఏం చెపుతుంది’, ‘లైంగిక వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి?’, ‘ట్రాన్స్ జెండర్ పిల్లల అనుభవాలు ఎలా ఉంటాయి?’, ‘ట్రాన్స్ జెండర్ పిల్లల కోసం ఏం చేయవచ్చు’, ‘హిజ్రా సమాజపు రాజకీయార్ధిక వ్యవస్థ’- అర్ధ వలస అర్ధ భూస్వామ్యం: ట్రాన్స్ జెండర్ సమాజంలో ఉత్పత్తి విధానాల వర్గ కుల విశ్లేషణ, ‘మన ఆలోచనా విధానాన్ని మార్చగలిగే ట్రాన్స్ జెండర్ సామాజిక దృక్పథం’,  వర్గ నిర్మూలన, కుల నిర్మూలన లాగా జెండర్ నిర్మూలన సాధ్యమా?’, అనే విషయాల మీద వో లోతైన సమగ్రమైన అవసరమైన చూపునిచ్చే సరికొత్త టార్చలైట్ యీ ‘రెయిన్ బో’.

లైంగిక వైవిధ్యాలను అర్ధం చేసుకుందాం:

హిజ్రా సమూహాలని చాలామంది చూస్తూనే వున్నారు. గత కొన్నేళ్ళు గా లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్ [ఎల్ జి బిటిక్యూ] వంటి పదాలు చాలా సంవత్సరాలుగా వింటున్నవాళ్ళల్లో చాల మంది మన  సమాజంలో ప్రవేశిస్తున్న పాశ్చాత్య భావాలుగానే బలంగా నమ్ముతుంటారు.

ఎల్ జి బిటిక్యూ సమూహంతో హిజ్రా సమూహంతో స్థానిక సాంస్కృతిక నిర్మాణాలు మధ్య వున్న సంబంధాలను, రాజకీయ వ్యత్యాసాలను విపులంగా వివరించారు. స్థానిక భారతీయ సంస్కృతులు ప్రపంచాన్ని సెక్సువాలిటీ వైపు నుంచి కాక లింగం వైపు నుండి చూస్తాయని చెపుతూ హిజ్రా సమూహాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన విషయాలని అంటే వాళ్ళని థర్డ్ జెండర్ గా యెట్లా పరిగణిస్తారు, వైద్యులు యెట్లా చూస్తారనే విషయాలన్నింటినీ యీ సెక్షన్లో చాలా లోతుగా చర్చించారు.

చాల దేశాల్లో కంటే భారత దేశంలో హిజ్రా సమూహం ట్రాన్స్ జెండర్, యింటర్ సెక్స్ కమ్యూనిటీల చారిత్రిక నాయకత్వాన్ని, అస్తిత్వాన్ని సృస్టించిందని వారి సమిష్టి నిర్మాణాల గొప్ప చరిత్రకు అపవాదాలకి హింస వివక్షతలకు వ్యతిరేకంగా వారు రోజువారి జీవితంలో చేస్తోన్నపోరాటాలకు గౌరవంతో  సెల్యూట్ చేస్తూ ప్రశంసించారు.

సైన్స్ ఏం చెపుతుంది:

పురుష శరీరం కలిగి వుండటానికి పురుషునిగా వుండటానికి తేడా యేమైనా వుంటుందా? చాలామంది యీ రెండు వొకటే కదా అనుకుంటారు. పురుషాంగం వుంటే పురుషుడు, యోని కలిగి వుంటే స్త్రీ. పురుషాంగం వుండటానికి, పురుషునిగా వుండటానికి తేడా వుంటుంది. ఆ తేడా యే లైంగికతకు అంటే సెక్స్, లింగానికి అంటే జెండర్ కి మధ్య వున్న తేడా.  అయితే అసలు లైంగికత అంటే యేoటి? లింగం అంటే యేoటి? సెక్స్ అనేది జీవన సంబంధమైనది. జెండర్ సామాజికమైనది. అంటే సమాజంలో యే జెండర్ పాత్రను నిర్వర్తిస్తారు అన్నదానికి సంబంధించింది. అయితే యీ రెండిటికి మధ్య వొక లంకె యేమిటంటే పుట్టిన శిశువు యేమిటనేది వైద్యులు, కుటుంబం నిర్ణయించాక, దాని ఆధారంగా శిశువు సామాజిక పాత్ర నిర్ణయించపడుతుంది. కొంతమంది యింటర్ సెక్స్ గా అంటే వుభయలింగత్వంగా వుంటారన్న విషయం యెవరికి వాళ్ళకే తెలుస్తుంది. వారి శరీరాలను ఆడా అని కానీ మగ అని కాని డాక్టర్లు వర్గీకరించలేకపోవటాన్ని చెపుతూ, ట్రాన్స్ జెండర్ వాళ్ళందరూ యింటర్ సెక్స్ అయి వుంటారని అనుకుంటారు కానీ యింటర్ సెక్స్ కు,  ట్రాన్స్ జెండర్ అస్తిత్వానికి జీవ సంబంధమైన మూలం వుంటుందని సైన్స్ చెప్తుంది అర్థం చేసుకోవాలంటే మొదట మనం ఆడ మగ శరీరాలు కలిగి వుండటానికి కారణమైన జీవసంబంధమైన మూలాన్ని కూడా అర్థం చేసుకోవాలని క్రోమోజోన్స్, జీన్స్ మొదలైన వాటి పాత్ర మొత్తాన్ని సైంటిఫిక్ గా యీ పుస్తకంలో సమూలంగా వివరించారు. ఆ వివరణ మనకు అర్థమైతే యీ పుట్టుకలో తేడాలు అనే యీ పుట్టుకలు యెలా వుంటాయి? యెందుకు వుంటాయన్నది అర్థమయితే యెవరిని వారు మన చుట్టూ ప్రపంచాన్ని కూడా పూర్తిగానో కొంతమేరకో అర్థం చేసుకునే అవకాశముంది యీ పుస్తకంలో యీ చాప్టర్ ని సమూలంగా చదివితే.

లైంగిక వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి?:

పుట్టుకతో ఆడా మగా కానీ వ్యక్తులుగా వైద్యుల చేత గుర్తించబడే శరీరాలు గలవారు వుంటారు. అయితే యీ ఆడ మగ కానీ వారు వైద్యపరంగా వర్గీకరించబడిన శరీరాలు కలవారు వుంటారు. అటువంటి అనుభవం కలిగిన వారు యింటర్ సెక్స్ వ్యక్తులు. చాలామంది  హిజ్రాలందరూ యింటర్ సెక్స్ వ్యక్తులని సమాజం పొరపాటుగా అనుకొంటూ వుంటుంది. కానీ హిజ్రా సమూహంలో యెక్కువమంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులు. కొద్దిమంది యింటర్ సెక్స్ వ్యక్తులు కూడా వుంటారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తులు చాలా వరకు  యింటర్ సెక్స్ కాదు. పుట్టినప్పుడు వారిని ఆడా అని గాని మగాని వైద్యులు కచ్చితంగా గుర్తించినా వారి శరీరాలకు యే లైంగికతనైతే ఆపాదించి వుంటారో దానికి సంబంధించిన లింగంతో వారు యెదగరు. దానికి బదులుగా విరుద్ధమైన జెండర్ తో గుర్తించబడతారు ట్రాన్స్ జెండర్ మూడవ జెండర్ అని యిలా వున్న పలు పేరులని  కూడా వివరించారు.

తల్లితండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే వంశపారంపర్య లక్షణాలు, వాటికి మూలమైన డిఎన్ఏ యెలా యిటువంటి పిల్లలు పుట్టటానికి కారణమవుతుందోననేదాన్ని సైంటిఫిక్ గా వైద్యపరంగా యీ చాప్టర్ ల్లో వివరించారు. యీ మొత్తం విషయాన్ని సైంటిఫిక్ గా యెట్లా చూడాలన్నది అర్థం చేసుకోవడానికి చాలా వుపయోగపడుతుంది. యిదంతా కూడా సైన్స్ స్టూడెంట్ కానప్పటికీ ప్రతి వొక్కరికి అర్థం అయినట్టుగా రాయటం వివరించటం యీ చాప్టర్లో వున్న ప్రత్యేకత.

ట్రాన్స్ జెండర్ పిల్లల అనుభవాలు యెలా వుంటాయి:

యీ పిల్లల్లోయెట్లాంటి మానసిక వేదన వుంటుంది? యెందుకు వుంటుందనే విషయాల్ని నిశితంగా తెలుసుకునేట్టు వివరించారు. సామాజిక డిస్పోరియాను బాగా తగ్గించగల అవకాశం సమాజానికి యెలా వుంటుందో స్పష్టంగా చెప్పారు. ప్రతి వొక్కరూ వ్యక్తులందరినీ వారిని వారు యే లింగంతో గుర్తిస్తారని అడిగి, వారితో గౌరవంగా వ్యవహరించటం రోజువారి సంబంధాల్లో స్నేహపూరితంగా  వుండే సమాజాన్ని సృష్టించడం సులభమవుతుంది.

ట్రాన్స్ జెండర్ పిల్లల కోసం ఏం చెయ్యవచ్చు :

అన్నింటి కంటే ముందు ట్రాన్స్ జెండర్ పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళకి యేది మంచి అని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. పిల్లలు తల్లిదండ్రులని బలంగా నమ్ముతారు. చాలామంది ట్రాన్స్ జెండర్ పిల్లలకి తల్లితండ్రుల నుంచి బాధాకర పరిస్థితి ప్రారంభమవుతుంది. పిల్లలు చిన్నతనం నుంచే వాళ్లకి వాళ్ల మీద నమ్మకాన్నికలిగించటానికి సమాజము తల్లిదండ్రులు, స్కూల్స్ అన్నీ కూడా ప్రయత్నించాలి. నమ్మకాన్ని కలిగించటం వొక సామూహిక బాధ్యతగా నిర్వహించినప్పుడు మాత్రమే కలిగించగలం. సో ట్రాన్స్ జెండర్ పిల్లలకి ఆ భరోసాని, ఆత్మవిశ్వాసాన్నిఅందిస్తూ అందరి పిల్లలతో పాటే గుర్తించగలిగినప్పుడు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో సంతోషంగా యీ సమాజంలో పెరగగలుగుతారు.

హిజ్రా సమూహ సమాజపు రాజకీయార్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది:

 హిజ్రాలు పితృస్వామ్యాన్నిధిక్కరిస్తారు. అలానే కులవర్గ నిబంధనలు కూడా వుల్లంఘిస్తారు. నిజానికి హిజ్రాలు నిజమైన అర్థంలో కమ్యూనిస్టులు. వొక కమ్యూన్ లో సమిష్టిగా జీవిస్తూ శ్రమిస్తూ ఆ క్రమంలో వారి కులవర్గ వారసత్వాన్ని తెoచేస్తారు. వొక యువ హిజ్రా కమ్యూన్ లో చేరినప్పుడు తన పేరు ఆస్తి విద్య కులమతాలకు సంబంధించిన అన్ని సంబంధాలను కోల్పోతారు. యెలా యెందుకు అన్నది సమాజంలో వారి  రోల్ యేమిటన్నది యీ చాప్టర్లో వివరంగా వివరించారు. దీనివల్ల హిజ్రా సమూహపు రాజకీయ స్వరం యెలా వుంటుందో వివరించారు.

మన ఆలోచన విధానాన్ని మార్చగలిగే ట్రాన్స్  సెంటర్ సామాజిక దృక్పథం:

ట్రాన్స్ జండర్ వ్యక్తులు చాలా మంది యితర వ్యక్తులు మాదిరిగానే వుంటారు. అంతా జీవించినట్టుగానే అంతా యెదుర్కొనే అన్ని ఆర్థిక, కుటుంబ సమస్యల మధ్య జీవితాన్ని గడపాలని, కనీస సౌకర్యాలు తీసుకోవాలని వారు కోరుకుంటారు. కాకపోతే వాళ్లు ట్రాన్స్ వ్యక్తులుగా తమ జీవితంలో అడుగడుగునా అడ్డంకులను యెదుర్కొంటారు. కాబట్టి వీరిలో చాలామందికి సమాజంలో యెన్ని రకాలుగా జెండర్ వొక అధికార నిర్మాణంగా పనిచేస్తుందో తెలియటంతో పితృస్వామ్యం నుంచి బయట పడే స్త్రీలందరితో వీరు పంచుకునే సంఘీభావాన్నివ్యక్తం చెయ్యటం స్త్రీవాద చర్చకు పదునిచ్చే వుమ్మడి సంభాషణలు ట్రాన్స్ ఫెమినిజం తాత్వికత  నుంచి  చర్చించాల్సిన  అవసరాన్ని, అంతా సమాజాన్ని అధికారాన్ని అర్థం చేసుకునే పద్దతి మారటానికి ట్రాన్స్ జెండర్ సామాజిక దృక్పథం యెలా  దోహదం చెయ్యగలదో యీ చాప్టర్ లో చర్చించారు. 

వర్గ నిర్మూలన, కుల నిర్మూలనలాగా  జెండర్ నిర్మూలన సాధ్యమా:

హిజ్రా సమూహం సంఘటితంగా వుంటుంది. యితర ట్రాన్స్ జెండర్ల పోరాట సామర్థ్యం మాటేంటి? ట్రాన్స్ జండర్ సమూహంలో యీ సమాజంలోని కులాన్ని, వర్గాన్ని, అర్థం చేసుకునే మార్గాలేమిటి? యీ విషయాన్నిఅంతా యెట్లా అర్థం చేసుకుంటాం? లింగ నిర్ధారణ చేయడం వల్ల వచ్చే అంచనాలకు అతీతంగా వ్యక్తులు తమ సొంత వ్యక్తిత్వాన్నికలిగి వుండగలరా? మన లింగాన్ని నిర్మించుకోగలమా? ప్రతి వొక్కరూ తమ జండర్ అంశాల నుండి విముక్తి పొందివారు కోరుకున్న విధంగా మాట్లాడటం, కోరుకున్నది ధరించడం, పలానా పనులు ఆడపిల్లలే చేయాలి. అలా నా పనులు మగపిల్లలే చేయాలి అని పట్టించుకోకుండా వారికి యిష్టమైన పనులు చేయడం వూహించగలమా? అటువంటి వ్యక్తులతో కూడిన ప్రపంచాన్ని మనం వూహించగలమా? భవిష్యత్తులోమనం యెలాంటి ప్రపంచాన్ని నిర్మించాలి?

యిలా ప్రతి విషయాన్ని అరుణతారలో ‘రెయిన్ బో’ లో సమగ్రంగా అందించినందుకు  బిట్టూ కె. ఆర్. గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. 

సమాజం నుంచి అలవాటు అయిన లైంగికత కానీ వాళ్ళని నెట్టివేసే మనస్తత్వంలోకి ఆచరణలోకి జారిపోతూ వున్నబాధాకరమైన సిట్యుయేషన్. అభివృద్ధి నిరోధకమైన పరిస్థితి కూడా. మనలాగా లేదా నాలాగా మీలాగా మనది కానీ ఆలోచన రూపాన్ని జీవన విధానాన్ని వొప్పుకోకపోవటం లోని సంకుచితత్వాన్ని యిరుకుని వదిలించుకోవాలంటే విషయాల పట్ల వొక శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. ఆ శాస్త్రీయ దృక్పథం వున్నప్పుడే యీ విషయాల పట్ల వున్న పొలిటికల్ అండర్స్టాండింగ్, తాత్వికత వొస్తుంది. లైంగికతకు సంబంధించిన విషయాలు తెలిసి కూడా మనుషుల పట్ల వ్యతిరేకంగా అవమానకరంగా ప్రవర్తిస్తుంటే వారిని పదేపదే యెడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా యెంతో వుంది. లైంగిక వివక్షా అనేది చాలామందిలో పోగుపడిన విషయం. అది సమాజంలో రకరకాల ఫామ్స్ లో కనిపిస్తూ వుంటుంది. మనం యెలా అర్థం చేసుకుంటాం మనం అనేక సంవత్సరాలుగా హిజ్రా సమూహాన్ని చూస్తూనే వున్నా వారి పట్ల చాల మంది  చూపు యెటువంటిది? వాళ్లు రోడ్లు మీద మనల్ని అటకా యిస్తారు. విసిగిస్తారు అని చాలా తేలిగ్గా కామెంట్స్ చేసేస్తారు. నిజమే రోడ్లు మీద వారు మన చుట్టూ తిరుగుతూ మనల్ని కదలనివ్వకుండా వుండటం అనేది  వొక యెంబ్రాసింగ్ సిట్యుయేషన్ కానీ వాళ్ళు యెందుకలా ప్రవర్తిస్తున్నారు? కారణాలేంటి? యిటువంటి ప్రవర్తనని తీసేయడానికి చేయాల్సిందేంటి? యీ విషయాలను ఆలోచించకుండా వున్నంతకాలం ఆ సమస్య తీరిపోదు. అన్నింటి కంటే ముఖ్యం గా ప్రతి వ్యక్తికీ జండర్ తో  నిమిత్తం లేకుండా సమాజంలో విద్యా, వైద్యం అన్ని రంగాల్లోకి ప్రవేశం  యిలా గౌరవప్రదమైన జీవితానికి అర్హులుగా ప్రతి వొక్కరు అందరి గురించి ఆలోచించాలి. వచ్చిన హక్కుల ఆచరణ , రావాల్సిన హక్కుల కోసం సంభాషణని, ప్రతి వొక్కరు ప్రతి  జీవన  సంబరానికి అర్హులే అనే సంభాషణకి, ఆలోచనకి, కార్యాచరణకి యీ ‘రెయిన్ బో’ అనేక కిటికీల్ని తెరిచి విశాలమై గగనాన విరబూసే యింద్రధనుస్సు లోని ప్రతి రంగూ ముఖ్యమైనదేనని  స్పురణని అందించడానికి వారధి అవుతుందని నమ్ముతూ భావిస్తూ యీ పుస్తకాన్ని అందించిన విరసం ప్రచురణలకి హృదయ పూర్వక కృతజ్ఞతలు. శుభాకాంక్షలు.

                                                                   ***

2 thoughts on “రంగులన్నీ  సమానమే  యింద్రధనుస్సులో

  1. Rainbow పుస్తక పరిచయం చాలా బాగుంది. చదువుతూ ఉంటే ఇంతకాలం ఏదో ఒక సెపరేట్ పాయగా గుర్తించడానికి నిరాకరించిన సమూహంగా వున్న వారి పట్ల మనమెంత నిర్లక్ష్యంగా వున్నామో జెండర్ పరంగా అంటరానివారుగా చూస్తున్నామో వారి దుఃఖానికి కారణాలను తెలుసుకునే అవకాశాన్ని ఈ పుస్తకం కల్పిస్తున్నందుకు బిట్టూకు, అనువదించిన వరలక్ష్మి గారికి మీకూ ధన్యవాదాలు.

  2. ♥️💐🤝
    మా సత్యం
    ముందుగా రచయిత్రి బిట్టూకి అనువాదకురాలు
    పి.వరలక్ష్మి గారికి ఉద్యమాభి వందనాలు.
    “రెయిన్ బో ” రచన లో ఎన్నో తార్కిక తాత్వికపరమైన ప్రశ్నలు దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.
    బిట్టు కె.ర్.గారిని విరసం 23వ సాహిత్య పాఠశాలలో 7, 8th
    జనవరి 2023 న చూశాను. ముందుగా అసలు నాకేం అర్థం కాలేదు,
    ఏమిటి ఈ ట్రాన్స్ జెండర్? వారిని చూసి ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యాను.
    ‘ రైతు ఉద్యమ స్ఫూర్తితో ఫాసిజం పై పోరాడుదాం’ (అరుణతార జనవరి-2023 సంచికలో చదివా)
    నాటి ప్రసంగం,
    వారి రూపం,
    అరుణతార బుక్ స్టాల్ లో వారి పాపతో కాసేపు అటు ఇటు తిరుగాడిన దృశ్యం
    (ట్రాన్స్ జెండర్) వారిని చూస్తున్నప్పటికీ కూడా విచిత్రంగా కొత్తగా ఫీల్ అవుతున్న
    రియల్లీ షీ ఇస్ రెబెల్.
    నా కనుల ముందు కదలాడడానికి కారణం
    కుప్పిలి పద్మ రాసిన పరిచయ వ్యాసం చదవడం వల్ల.
    వసంత మేఘములో ‘రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు ‘ చదివా.
    ” రంగులన్నీ సమానమే యింద్రధనుస్సులో”
    ప్రఖ్యాత కవిత్రి కుప్పిలి పద్మ గారు రాసిన పరిచయ వ్యాసం పై నా విమర్శనాత్మక స్పందన.
    పద్మ గారు తన పరిచయ వ్యాసంలో
    “లైంగికతను గురించి పూర్తిగా సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం యెంతో వుంది. లైంగికత మీద సరైన అవగాహన లేకపోవటానికి
    వో కారణం దాని గురించిన సమాచారం అర్థమయ్యే రీతిలో సింపుల్ గా దొరకక పోవటం కూడా కావొచ్చు.
    లైంగికత మీద వచ్చిన పుస్తకాలు అందుబాటులో లేకపోవటమూ కావొచ్చు”.
    అని పద్మ గారు పేర్కొన్నారు.
    మొదటగా మన రాజ్యంగ యంత్రం.
    భారత రాజ్యాంగ యంత్రం పైకి అది ఎంతో స్వేచ్ఛాయుతంగా కనబడుతుంది.
    ప్రతి సమస్య వెనక వర్గ స్వభావం లోతుకు చొచ్చుకుని వేళ్ళుని దృఢంగా పాతుకొని నిక్షిప్తమై ఉన్నాయి.
    సమాజంలో దీనికి లోతైన వర్గమూలాలు దాగి ఉన్నాయి.
    ట్రాన్స్ జెండర్ సమస్య ఇంకా ఎన్నెన్నో చాలా ఇతరాత్ర సమస్యలన్నింటిని కూడా గతి తార్కిక చారిత్రక దృష్టితో పరిశీలిస్తే
    ఈ సమస్యల పరిష్కారానికి వర్గ పోరాటమే
    సమస్యలన్నింటినీకి పరిష్కార మార్గం అని నా అభిప్రాయం.
    భారతదేశంలోని కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం నర్సరీ దశ నుండె లోప పూరితమైన, ఆశాస్త్రీయమైన పాఠ్యప్రణాళికలు, పాఠ్య అంశాలవల్ల కూడా జరగకూడని అనర్థాలు, కొంత తల్లిదండ్రుల ఆశాస్త్రీయ విధానం,
    అనుసరిస్తున్న పితృస్వామిక కుటుంబ వ్యవస్థ వలన విద్యార్థుల బాల్య దశ నుండే జరిగి పోతున్నాయి.
    కుప్పిలి పద్మ గారు నిశితమైన విశ్లేషణాత్మకమైన పరిచయం లో వాటి యొక్క మూలాలకి
    కారణం ఎక్కడ!? అన్న అంశాన్ని పరిశీలించక పోవడం కొంత అసంపూర్ణత ఉన్నప్పటికీ
    ప్రశంసనీయమైన పరిచయం.

Leave a Reply