ఫాసిజం పుట్టుకను అర్థం చేసుకోవాలంటే ముందు పెట్టుబడిదారీ విధానం ఏ దశల గుండా ప్రయాణించినదీ తెలుసుకోవాలి.   పెట్టుబడిదారీ విధానానికి రెండు దశలున్నాయి: 

  1. స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానం
  2. పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ  అయిన గుత్త పెట్టుబడిదారీ విధానం.

స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారులు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా పోటీ పడుతూ ఉత్పత్తి చేస్తుంటారు. ఈ పోటీలో కొంతమంది వెనుకబడిపోతారు, కొంతమంది నాశనమైపోతారు. మరికొంతమంది క్రమంగా సంపదలను కూడబెట్టి గుత్త పెట్టుబడిదారులుగా ఎదుగుతారు. ఈ విధంగా పెట్టుబడిదారీ విధానం క్రమంగా అభివృద్ధి చెందుతూ తన అత్యున్నత దశ అయిన సామ్రాజ్యవాద దశను చేరుకుంటుంది.
20వ శతాబ్దపు ప్రారంభానికి పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాద దశను చేరింది. ఈ దశ లక్షణాలను లెనిన్ ‘సామ్రాజ్యవాదం – పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ’ అనే తన రచనలో వివరించాడు. ఈ దశ యొక్క ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే –
సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచాన్ని తమలో తాము పంచుకోవడం పూర్తయింది. ప్రతీ సామ్రాజ్యవాద దేశమూ, తన ప్రభావంలో ఉండే వలసలూ, అర్థ వలసలూ, ముడి పదార్థాలను సరఫరా చేసే ప్రాంతాలూ, మార్కెట్లూ మొదలైనవి ఏర్పరుచుకుంది. కానీ, సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక, సైనిక స్థితి స్థిరంగా ఉండదు, వేగంగా మారుతుంటుంది. ముందున్న దేశాలు వెనుకబడతాయి. వెనుకబడ్డ దేశాలు ముందుకు వస్తాయి. అలా కొత్తగా సామ్రాజ్యవాద దశలో ప్రవేశించిన దేశాలకూ, మరింతగా బలపడిన పాత సామ్రాజ్యవాద దేశాలకూ తమ పెట్టుబడిని ఎగుమతి చెయ్యడానికీ, మార్కెట్లకూ, ముడి పదార్థాలను సంపాదించడానికీ తమ అధీనంలో ఉండే దేశాలూ, ప్రాంతాలూ కావాలి. అప్పటికే విభజించబడిన ప్రపంచాన్ని తిరిగి విభజిస్తే తప్ప ఇది సాధ్యంకాదు. అలా పునర్విభజన జరగాలంటే, ఒక సామ్రాజ్యవాద దేశం అధీనంలో ఉన్న ప్రాంతాలను మరో సామ్రాజ్యవాద దేశం బలవంతంగా – అంటే యుద్ధం ద్వారా – తన అధీనంలోకి తీసుకోవాలి. సామ్రాజ్యవాద దశలో యుద్ధం అనివార్యం. కోట్లమంది బలైపోయిన మొదటి ప్రపంచ యుద్ధమూ, రెండో ప్రపంచ యుద్ధమూ ఇలాగే ప్రారంభమయ్యాయి.
బూర్జువా ప్రజాస్వామ్యం, బూర్జువా వర్గ నియంతృత్వం అని మనందరకూ తెలుసు. కానీ, స్వేచ్ఛా పోటీ పెట్టుబడిదారీ విధానంలో ఆ విధానానికి అనుగుణంగా పరిమితమైన ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది. పెట్టుబడిదారీ విధానం గుత్త పెట్టుబడి దశను (అంటే సామ్రాజ్యవాద దశను) చేరుకున్నప్పుడు, ఈ పరిమిత ప్రజాస్వామ్యం కూడా అంతమవుతుంది. పెట్టుబడి తన నియంతృత్వాన్ని నగ్నంగా అమలు జరుపుతుంది. ఈ నియంతృత్వానికి పరాకాష్ఠే ఫాసిజం.
ఫాసిజం అంటే అత్యంత మితవాదుల చేతుల్లో ఉన్న ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ రాజ్యం అనీ, ఈ రాజ్యం ప్రతిపక్షాలను బలప్రయోగం ద్వారా అణచి వేసి, ఒక పార్టీ లేదా ఒక వ్యక్తి చేతుల్లో అధికారం కేంద్రీకృతమయ్యేలా చేస్తుందనీ సాధారణంగా బూర్జువా మేధావులు ఒక నిర్వచనం ఇస్తుంటారు. ఈ నిర్వచనం అసమగ్రమైనది. మార్క్సిస్టులు ఇచ్చే నిర్వచనం వేరుగా ఉంటుంది.
‘ఫాసిజం అధికారంలోకి రావడం అంటే, సాధారణంగా జరుగుతున్నట్లు ఒక బూర్జువా పార్టీ ప్రభుత్వ స్థానంలో మరో బూర్జువా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం కాదు. బూర్జువా తన వర్గ ఆధిపత్యాన్ని సాగించే ఒక రాజ్య రూపం (state form) స్థానంలో – అంటే బూర్జువా ప్రజాస్వామ్యం స్థానంలో – మరొక రాజ్య రూపం – బహిరంగ టెర్రరిస్టు నియంతృత్వ రాజ్యం – ఉనికిలోకి రావడమే ఫాసిజం. ఈ తేడాని గుర్తించకపోవడం తీవ్ర తప్పిదమవుతుంది.’ – డిమిట్రోవ్ (1935 ఆగస్టు 2న కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 7వ ప్రపంచ కాంగ్రెస్ కు డిమిట్రోవ్ సమర్పించిన ప్రధాన నివేదిక).
1921లో ఇటలీలో ముస్సోలినీ నేషనల్ ఫాసిస్టు పార్టీని స్థాపించిన తర్వాత, 1923లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫాసిజం గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. విప్లవోద్యమాల కాలంలో ఫాసిజం కార్మిక వర్గ డిమాండ్లతో ముందుకు వచ్చిందనీ, కార్మిక వర్గాన్ని అణచి వేసేందుకు ఫాసిజం తనకు అవసరమని బూర్జువా వర్గం గుర్తించి ఈ ఫాసిస్టు శక్తులను ఉపయోగించుకుంటోందనీ ఈ తీర్మానం వివరించింది. 1928లో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 6వ మహాసభ ఫాసిస్టు దాడి గురించి హెచ్చరించింది. స్పష్టంగానో అస్పష్టంగానో, ఫాసిస్టు ధోరణులూ, ఫాసిస్టు ఉద్యమ బీజాలూ దాదాపు ప్రతీ దేశంలోనూ కనుపిస్తున్నాయని పేర్కొంది. ఈ దాడికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మిక వర్గం సంసిద్ధమవ్వాలని పిలుపునిచ్చింది. 1935 ఆగస్టులో సమావేశమైన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 7వ ప్రపంచ కాంగ్రెస్ లో డిమిట్రోవ్ సమర్పించిన నివేదిక ఫాసిజం గురించీ, ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటంలో కార్మిక వర్గ కర్తవ్యాల గురించీ చాలా వివరంగా చెప్పింది.
1928లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభ భారమంతటినీ కార్మిక వర్గ భుజాలమీద మోపడానికీ, వలస దేశాల దోపిడీనీ తీవ్రం చేస్తూ ప్రపంచాన్ని తమలో తాము పునర్విభజించుకోవడానికీ, మొదటి కార్మిక వర్గ రాజ్యమైన సోవియట్ యూనియన్ మీద దాడి ద్వారా ప్రపంచంలోని కార్మిక, కర్షక విప్లవాత్మక శక్తులను కాలరాయాడానికీ సామ్రాజ్యవాద దేశాలకు ఫాసిజం అవసరమవుతోందని ఈ నివేదిక హెచ్చరించింది. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 13వ ప్లీనం ఫాసిజాన్ని ద్రవ్య పెట్టుబడి యొక్క అత్యంత అభివృద్ధి నిరోధక, అత్యంత జాతీయోన్మాద సామ్రాజ్యవాద శక్తుల బహిరంగ టెర్రరిస్టు నియంతృత్వంగా వర్ణించింది.
ఫాసిజం గురించి మూడవ ఇంటర్నేషనల్ అవగాహనకూ, ఫాసిస్టు వ్యతిరేక కార్యక్రమాలకూ వెనుక స్టాలిన్ నాయకత్వం ఉంది. 1934-1943 మధ్య కాలంలో స్టాలిన్ కూ, డిమిట్రోవ్ కూ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు ఈ విషయాన్ని ధృవపరుస్తాయి.
డిమిట్రోవ్ నివేదిక యొక్కా, వివిధ సందర్భాలలో 3వ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ లోని ప్రసంగాల, ఇంటర్నేషనల్ తీర్మానాల యొక్కా సారాంశం ఇది:
ఫాసిజం వర్గాలకు అతీతంగా ఉండే రాజ్యం కాదు. ఫాసిజం పెట్టీ బూర్జువా, మధ్య తరగతి వర్గాల, లంపెన్ ముఠాల ప్రభుత్వం కాదు. ఫాసిజం ద్రవ్య పెట్టుబడి యొక్క అధికారం. ఫాసిజం కార్మిక వర్గాన్నీ, రైతాంగాన్నీ, ప్రజల తరఫున నిలిచే మేధావి వర్గాన్నీ టెర్రరిస్టు పద్ధతుల ద్వారా అణచి వేసే ఒక నిర్మాణం. విదేశాంగ విధానంలో ఫాసిజం దేశభక్తి పేరుతో యుద్ధోన్మాదాన్నీ, జాతీయోన్మాదాన్నీ రెచ్చగొడుతూ ఇతర దేశాల పట్ల ద్వేషాన్ని రగిలిస్తుంది.
ద్రవ్య పెట్టుబడి ఒక సుముహూర్తాన ఫాసిస్టు నియంతృత్వాన్ని నెలకొల్పడానికి నిశ్చయించి దేశంలో ఫాసిజాన్ని స్థాపిస్తుందని భావించకూడదు. వాస్తవంలో, పాత బూర్జువా పార్టీలతోనూ, లేదా ఈ పార్టీలలోని కొన్ని విభాగాలతోనూ సంఘర్షిస్తూ ఫాసిజం అధికారంలోకి వస్తుంది. ఫాసిస్టు నియంతృత్వాన్ని నెలకొల్పడానికి ముందు బూర్జువా ప్రభుత్వం అనేక అభివృద్ధి నిరోధక చర్యలను చేపడుతుంది. ఈ చర్యల ద్వారా ఫాసిజం అధికారాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఈ ప్రాధమిక దశలో ఫాసిజం చేపట్టే చర్యలను ప్రతిఘటించకపోతే ఫాసిజం విజయాన్ని ఆపడం సాధ్యం కాదు. అంతే కాదు, ఈ వైఫల్యం ఫాసిజానికి దారిని సుగమం చేస్తుంది.
సోషల్ డెమోక్రాటిక్ పార్టీల నాయకులు ఫాసిజం నిజ స్వరూపాన్నీ, వర్గ స్వభావాన్నీ ప్రజలనుండి దాచి పెట్టి, బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపునివ్వలేదు. ఫలితంగా జర్మనీలోనూ, ఇతర ఫాసిస్టు దేశాలలోనూ కార్మిక వర్గంలో ఒక పెద్ద భాగం ఫాసిజం యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోయింది, ప్రతిఘటించలేకపోయింది.
చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానూ, ఒక దేశ ప్రత్కేకతా, అంతర్జాతీయంగా ఆ దేశానికి ఉన్న స్థానం కారణంగానూ ఫాసిజం వివిధ దేశాలలో వివిధ రూపాలు తీసుకుంటుంది. ఫాసిజానికి ప్రజలలో అంతగా ఆదరణ లభించని దేశాలలో, బూర్జువా వర్గంలోని ముఠాలలో సంఘర్షణలు తీవ్రం కాని పరిస్థితులలో, ఫాసిజం పార్లమెంటును వెంటనే రద్దు చెయ్యదు. ఇతర బూర్జువా పార్టీలనూ, సోషల్ డెమోక్రాటిక్ పార్టీలనూ అనుమతిస్తుంది. విప్లవం విరుచుకుపడబోతోంది అని భయపడ్డ దేశాలలో ఫాసిజం అడ్డూ ఆపూ లేని రాజకీయ గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుతుంది. తన ప్రత్యర్ధి పార్టీల మీదా, ముఠాల మీదా దాడులు చేస్తూ భయకంపితులను చేస్తుంది. ఈ టెర్రరిస్టు నియంతృత్వంతో పాటు కుహనా పార్లమెంటు కూడా కొనసాగుతుంటుంది.
సాధారణంగా ప్రతీ దేశ ప్రజలకూ, లేదా ఆ దేశ ప్రజలలోని వివిధ విభాగాలకూ, చారిత్రక కారణాల వలన తమకు చాలా అన్యాయం జరిగిందనే భావన ఉంటుంది. ఈ భావన వాస్తవమైనది కావచ్చు, ఊహాజనితమైనది కావచ్చు. అటువంటి మనోభావనలను కూడా ఉపయోగించుకుని ఫాసిజం అధికారంలోకి వస్తుంది.
పాత బూర్జువా పార్టీలతో విసిగిపోయిన ప్రజలను ఫాసిజం తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. బూర్జువా ప్రభుత్వాల మీదా, పాత బూర్జువా పార్టీల మీదా తీవ్రమైన దాడులు చేస్తూ ఫాసిజం ప్రజలను తన వైపుకు తిప్పుకుంటుంది. ఎంతో వాగాడంబరంతో ప్రజల అవసరాల గురించీ, డిమాండ్ల గురించీ మాట్లాడుతుంది. నిరుద్యోగం, చాలీ చాలని వేతనంతో దిగజారుతున్న బ్రతుకులు, భద్రత లేని జీవితంతో నిరాశతో ఉన్న పెట్టీ బూర్జువా వర్గానికి చెందిన వారూ, కార్మికులలో ఒక విభాగమూ కూడా ఫాసిస్టు వాగాడంబరానికి ఆకర్షితులవుతారు.
ఫాసిజం ప్రజలలో పాతుకు పోయిన విద్వేషాలను రెచ్చగొడుతుంది. న్యాయం కోసం తహతహలాడే ప్రజల మనోభావాలను కూడా ఉపయోగించుకుంటుంది. ఒక్కొక్కప్పుడు విప్లవ సంప్రదాయాలను కూడా ఉపయోగించుకుంటుంది. ఉదాహరణకు జర్మన్ ఫాసిస్టులు – బడా బూర్జువా తొత్తులూ, సోషలిజానికి బద్ధ వ్యతిరేకులూ. అయినా వారు తమను తాము సోషలిస్టులమనీ, తాము అధికారంలోకి రావడం బూర్జువాకు వ్యతిరేకంగా ఒక ‘విప్లవం’ అనీ ప్రచారం చేశారు. ఇటాలియన్ ఫాసిస్టులు ‘మా రాజ్యం కేపిటలిస్టు రాజ్యం కాదు, కార్పొరేట్ రాజ్యం’ అని ప్రచారం చేశారు. జపానీస్ ఫాసిస్టులు ‘దోపిడీ లేని జపాన్’ అన్న నినాదం ఇచ్చారు. అమెరికన్ ఫాసిస్టులు ‘సంపదను పంచుకుందాం’ అన్నారు. సాధారణంగా అన్ని దేశాలలోనూ రాజకీయంగా వెనుకబడిన ప్రజలను ఆకర్షించడానికి ఫాసిస్టులు ఇటువంటి నినాదాలిస్తారు. ఒకే దేశంలో వివిధ సమూహాల ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని కూడా ఫాసిజం మోసపూరిత నినాదాలతో ప్రజలను ఆకర్షిస్తుంది.
ఫాసిజం యువతను ఆకర్షించే కార్యక్రమాలు చేబడుతుంది. యువతను తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది.
ఫాసిజం – పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను కాపాడుతుంటుంది. కానీ, దేశానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశభక్తుడిగా ప్రజల ముందు పోజు పెడుతుంది.
ఫాసిజం – ప్రజలను అడ్డూ ఆపూ లేకుండా దోచుకోవాలని చూస్తుంది. కానీ, కేపిటలిస్టు వ్యతిరేక వాగాడంబర నినాదాలతో ప్రజల ముందుకు వస్తుంది. బూర్జువా దోపిడీకి వ్యతిరేకంగా శ్రామిక వర్గంలో ఉన్న తీవ్ర ద్వేషాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఫాసిజం – అత్యంత అవినీతికరమైన, దిగజారుడు శక్తులకు ప్రజలను బలిచేస్తుంది. కానీ, నిజాయితీతో కూడిన, అవినీతిరహితమైన ప్రభుత్వం అన్న నినాదాలతో ప్రజల ముందుకు వస్తుంది. బూర్జువా ప్రజాస్వామ్య ప్రభుత్వాల తీరుతో విసిగి పోయిన ప్రజల ముందు ఫాసిజం మోసపూరితంగా అవినీతిని ఖండిస్తుంది.
ఫాసిజం – కార్మిక వర్గం మీదా, అశాంతితో ఉన్న ప్రజల మీదా దాడి చేసే పార్టీ. కానీ, తను అధికారంలోకి రావడం బూర్జువాకు వ్యతిరేకంగా ఒక విప్లవంగా, దేశానికి ఒక విముక్తిగా, ప్రజా విజయంగా చెబుతుంది.
ఫాసిజం – యువతకు బంగారు భవిష్యత్తు వాగ్దానం చేస్తుంది. కానీ, వాస్తవంలో యువ కార్మికులు లక్షలమంది తమ ఉపాధిని కోల్పోతారు.
ఫాసిజం – ఆఫీసు ఉద్యోగులకూ, చిరుద్యోగులకూ, మేధావులకూ జీవన భద్రత వాగ్దానం చేస్తుంది. పెట్టుబడి దోపిడీని తుడిచి పెడతానని చెబుతుంది. కానీ, వాస్తవంలో అది రేపటి గురించి మరింత భయపడేట్లు చేస్తుంది.
ఫాసిజం – అప్పులతో సతమతమవుతున్న రైతాంగాన్ని ఆదుకుంటాననీ, రుణ విముక్తులను చేస్తాననీ వాగ్దానం చేస్తుంది. కానీ, వాస్తవంలో రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తోంది.
ఫాసిజం – కార్మికులకు జీవితావసరాలను తీర్చగల వేతనాన్ని వాగ్దానం చేస్తుంది. కానీ, వాస్తవంలో కార్మికుల జీవన ప్రమాణాలను మరింత దిగజారుస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి వాగ్దానం చేస్తుంది. కానీ, వాస్తవంలో పెట్టుబడికి బానిసలను చేస్తుంది. కార్మికుల హక్కులను అపహరిస్తుంది. ట్రేడ్ యూనియన్లను నాశనం చేస్తుంది. సమ్మె హక్కును ఉపసంహరిస్తుంది. కార్మికుల సామాజిక బీమా సంపదను దోచుకుంటుంది. మిల్లులనూ, ఫాక్టరీలనూ పెట్టుబడిదారుల నియంతృత్వ పాలన కొనసాగించే బేరక్కులుగా మారుస్తుంది.
ఏ ముసుగులు వేసుకు వచ్చినా, ఏ రూపాలలో కనుపించినా, ఏ మార్గాలలో అధికారాన్ని చేబట్టినా, ఫాసిజం అంటే –
కార్మిక వర్గం మీదా, శ్రమ జీవుల మీదా భయంకరమైన దాడి.
అడ్డూ ఆపూ లేని జాతీయోన్మాదం, యుద్ధోన్మాదం.
అత్యంత అభివృద్ధి నిరోధకమైన ప్రతీఘాత విప్లవం.
కార్మిక వర్గానికీ, మొత్తం శ్రమ జీవులందరికీ అత్యంత క్రూరమైన శత్రువు.
బూర్జువా శిబిరంలోని వైరుధ్యాలను అధిగమించడానికి ఫాసిజం ప్రయత్నిస్తుంది. ఇతర రాజకీయ పార్టీలను నాశనం చేసి రాజకీయాధికారాన్ని మొత్తంగా తన చేతుల్లో కేంద్రీకరించాలని చూస్తుంది. ఈ ప్రయత్నం వైరుధ్యాలను పరిష్కరించకపోగా మరింత తీవ్రతరం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండే వివిధ వర్గాలూ, ఆ వర్గాల మధ్య తీవ్రమవుతున్న వైరుధ్యాలూ అనివార్యంగా ఫాసిస్టు గుత్తాధికారాన్ని సవాలు చేస్తాయి.
ఫాసిజం మాటలకూ చేతలకూ మధ్య ఏ మాత్రం పొంతన ఉండదు. ఫాసిజం ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతూ పెట్టుబడిదారుల సంపదను పెంచే మార్గాలను అనుసరిస్తుంది. ఆ కారణంగా కొంచెం ముందో వెనుకో ప్రజలు ఫాసిస్టు పార్టీ వర్గ స్వభావాన్ని గుర్తించగలుగుతారు. అలా ప్రజలు గుర్తించిన నాడు ఫాసిస్టు ప్రజా పునాది బలహీనపడుతుంది.
బూర్జువా ప్రజాస్వామ్యాన్ని నాశనం చెయ్యడం ద్వారా, న్యాయ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా, బహిరంగంగా హింసతో పాలించడం ద్వారా, తన నియంతృత్వ పోకడల ద్వారా, ఫాసిజం చట్టానికి ఉన్న అధికారాన్నీ, గౌరవాన్నీ నాశనం చేస్తుంది. బూర్జువా ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఉన్న భ్రమలను తొలగిస్తుంది.
ఫాసిజం రాకతో వర్గ సామరస్య విధానాలను అనుసరిస్తున్న పార్టీలలోని విప్లవ శక్తులలో, అంతవరకూ బూర్జువాతో తాము అనుసరిస్తున్న వర్గ సామరస్య విధానాలు సరియైనవేనా అని ఒక సందేహం తలెత్తుతుంది. ఈ సందేహం ఒక బలమైన విప్లవ పార్టీని నిర్మించాలనే ఆకాంక్షకు దారి తీస్తుంది. విప్లవాత్మక శక్తులన్నింటినీ ఒక ఐక్య సంఘటనలో ఐక్యం చెయ్యాలనే ఆలోచనకు దారి తీస్తుంది.
ఫాసిజం రాక బూర్జువా వర్గ బలాన్ని సూచిస్తుందా? బలహీనతను సూచిస్తుందా? ఇది మరొక ముఖ్యమైన ప్రశ్న.
‘… జర్మనీలో ఫాసిజం విజయాన్ని, కార్మిక వర్గ బలహీనతకు చిహ్నంగానూ, కార్మిక వర్గానికి ద్రోహం చేసి సోషల్ డెమోక్రసీ ఫాసిజానికి మార్గాన్ని సుగమం చేసిన ఫలితంగానూ మాత్రమే పరిగణించకుండా, బూర్జువా బలహీనతకు చిహ్నంగా కూడా భావించాలి. పార్లమెంటేరియనిజం, బూర్జువా ప్రజాస్వామ్యం లాంటి పాత పద్ధతుల ద్వారా బూర్జువా వర్గం పాలించలేకపోతోందనీ, పర్యవసానంగా దేశీయ విధానంలో అది టెర్రరిస్టు పద్ధతుల ద్వారా పాలించవలసి వస్తోందనీ భావించాలి. శాంతియుత విదేశీ విధానం ద్వారా అది ఈ పరిస్థితి నుండి బయటపడలేక పోతోందనీ, పర్యవసానంగా అది యుద్ధ విధానాన్ని అవలంబించవలసి వస్తోందనీ భావించాలి…’ – (సో.యూ.క.పా 17వ కాంగ్రెసులో స్టాలిన్ ప్రసంగం)
ఇది కూడా మనం గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్య సూత్రీకరణ.
ఏ దేశంలోనైనా ఫాసిజం రాక కార్మిక వర్గ పార్టీల బలహీనతనూ, సోషల్ డెమోక్రాటిక్ పార్టీల ద్రోహాన్ని మాత్రమే కాక బూర్జువా వర్గ బలహీనతను కూడా సూచిస్తుంది. ఎదురులేనట్లు కనుపిస్తున్న బూర్జువా ఫాసిజం వాస్తవానికి బూర్జువా బలహీనతల వలన వచ్చిందనీ, అది అంతర్గత వైరుధ్యాలతో సతమవుతున్నదనీ తెలియజేస్తుంది.
ఫాసిజం అధికారంలోకి రాకుండా నిరోధించడం ఎలా? అది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిఘటించడం ఎలా?
1935 నాటి డిమిట్రోవ్ నివేదికలోని రెండో భాగం – ఫాసిజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గ ఐక్య సంఘటన (United Front Of The Working class Against Fascism) – ఈ అంశాలను చాలా వివరంగా చర్చించింది. ఇక్కడ చాలా క్లుప్తంగా మాత్రమే ఈ భాగం గురించి చెప్పడం జరిగింది.
ఫాసిజాన్ని నివారించాలంటే ఒక ఐక్య ఫాసిస్టు వ్యతిరేక కార్మిక సంఘటన ఉండాలి. బూర్జువా ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ ఫాసిజం ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేస్తుంటే, ఫాసిజాన్ని ఖండిస్తూ కాగితం మీద సోషల్ డెమోక్రాట్లు చేసే తీర్మానాలతో సంతృప్తి చెందక కార్మిక వర్గం నిజమైన ప్రజాపోరాటాల ద్వారా ప్రతిఘటించాలి. ఈ పోరాటాలు బూర్జువా పధకాలను నిరోధించగలవు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గం విజయవంతంగా తన హక్కులను కాపాడుకోవడంలోనూ, వర్గ శత్రువుకూ, ఫాసిజానికీ వ్యతిరేకంగా ఎదురుదాడి చెయ్యడంలోనూ ఒక శక్తివంతమైన ఆయుధం అవుతుంది. అటువంటి ఐక్యతకు ఒకే ఒక్క షరతు తప్ప ఏ షరతులూ ఉండవు. ఈ షరతు కార్మికులందరూ అంగీకరించే షరతు – ఐక్య కార్యాచరణ ఫాసిజానికి వ్యతిరేకంగా, పెట్టుబడి దాడికి వ్యతిరేకంగా, వర్గ శత్రువుకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టబడాలి.
పెట్టుబడి దాడి నుండీ, ఫాసిస్టు నియంతృత్వాన్నుండీ తమను తాము కాపాడు కోవడానికి ప్రజలు ఈ రోజు ఏం చెయ్యాలి అన్నది కమ్యూనిస్టుల స్పష్టంగా చెప్పాలి. కార్మికుల హక్కులను కాపాడుకోవడం కోసం పోరాటం ప్రారంభించాలి. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటం ప్రారంభించాలి.
పరిస్థితిలో మార్పు సంభవించినప్పుడు పోరాట రూపాలలో, పద్ధతులలో వేగంగా సంభవించే మార్పులకు అనుగుణంగా కార్మిక వర్గాన్ని సంసిద్ధం చెయ్యాలి. ఉద్యమం పురోగమించినప్పుడు, కార్మిక వర్గం శక్తిని పుంజుకున్నప్పుడు, పెట్టుబడికి వ్యతిరేకంగా చేసే రక్షణ పోరాటాలనుండి ఎదురుదాడికి సంసిద్ధం కావాలి. విశాలమైన రాజకీయ సమ్మె వైపుగా సంసిద్ధం కావాలి.
కమ్యూనిస్టులు ఎట్టి పరిస్థితులలోనూ తమ స్వతంత్ర కార్యక్రమమైన కమ్యూనిస్టు శిక్షణా, నిర్మాణమూ, ప్రజల సమీకరణా వదలుకోకూడదు. ఆచరణలో ఐక్యత కోసం, సోషల్ డెమోక్రాటిక్ పార్టీలతోనూ, సంస్కరణ వాద ట్రేడ్ యూనియన్లూ తదితర సంస్థలతోనూ ఫాసిజానికి వ్యతిరేకంగా స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక ఒప్పందాల కోసం ప్రయత్నించాలి. ఈ ఒప్పందాలలోని షరతులన్నింటికీ కట్టుబడి అమలు చేస్తూ, అదే సమయంలో ఐక్య కార్యాచరణకు నష్టం కలిగించే చర్యలన్నింటినీ బహిరంగం చెయ్యాలి. ఒప్పందాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగినప్పుడు – అటువంటి ప్రయత్నాలు జరగవచ్చు – మనం చెదిరిపోయిన ఐక్య కార్యాచరణను పునరుద్ధరించడానికి విరామం లేకుండా పోరాడుతూనే ప్రజలకు వాస్తవాలు వెల్లడించండం ద్వారా మనం ఆ విధ్వంసకారులకు సమాధానం చెప్పాలి.
మనం కార్మిక వర్గ నియంతృత్వం కోసం పోరాడుతాం. సంవత్సరాల పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించిన ప్రతీ విజయాన్నీ మనం కాపాడుకుంటాం. మరిన్ని విజయాలను సాదించడానికి కృతనిశ్చయంతో పోరాడుతాం. కానీ, ఇప్పుడు మన ముందున్నది కార్మిక వర్గ నియంతృత్వమా? బూర్జువా ప్రజాస్వామ్యమా? అన్నది ప్రశ్న కాదు. బూర్జువా ప్రజాస్వామ్యమా? ఫాసిజమా? అన్నది మన ముందున్న ప్రశ్న.
యువతలో విస్తరంగా ప్రచారం సాగించడం ద్వారా యువతను మన వైపుకు తిప్పుకోవాలి.
ఇదీ స్థూలంగా ఫాసిజానికి ఎదుర్కోవడానికి ఆ నాటి కమ్యూనిస్టుల ప్రణాళిక.
హిట్లర్ పార్టీ పేరు నేషనల్ సోషలిస్టు జర్మన్ వర్కర్స్ పార్టీ – నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ పార్టీలో కూడా సోషలిజం అంత ఉంది. ఆ నాడు ప్రపంచంలో సోషలిజం పేరు మారు మ్రోగుతుంటే శాస్త్రీయ సోషలిజానికి పోటీగా ఈ నేషనల్ సోషలిజం రంగంలోకి దిగింది.
పెట్టుబడిదారుల, బ్యాంకుల, ట్రస్టుల దోపిడీతో విసిగిపోయిన జర్మన్ ప్రజల మనసుల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబించే నినాదాలిచ్చింది హిట్లర్ పార్టీ:
‘కష్టపడి సంపాదించని ఆదాయాలను రద్దు చేయాలి’,
‘ట్రస్టులను జాతీయం చెయ్యాలి’,
‘దేశ ద్రోహులకూ, వడ్డీ వ్యాపారస్తులకూ, అక్రమ మార్గాలలో లాభాలు ఆర్జించేవారికీ మరణ శిక్ష విధించాలి’ లాంటివి నాజీ పార్టీ కార్యక్రమంలోని కొన్ని అంశాలు.
‘సాధారణ సంక్షేమం వ్యక్తుల సంక్షేమం కంటే ఉన్నతమైనది’,
‘సంపద పంచుకుందాం’,
‘అవినీతి రహితమైన నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుందాం’ లాంటి నినాదాలతో, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నట్లూ, పెట్టుబడిదారీ విధానానికీ అవినీతికీ వ్యతిరేకంగా ధృఢంగా నిలబడుతున్నట్లూ చెబుతూ హిట్లర్ ఫాసిజం ప్రజలను ఆకర్షించగలిగింది. తాను అధికారాన్ని చేపట్టడాన్ని బూర్జువాకు వ్యతిరేకంగా ఒక విప్లవంగా, దేశంలో ఒక నవశకంగా వర్ణించింది.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం వెర్సయిల్స్ ఒడంబడిక జర్మనీ మీద చాలా అవమానకరమైన షరతులు విధించింది. ఈ సంధి పట్ల జర్మన్ ప్రజలలో సహజంగా, న్యాయంగా ఉన్న తీవ్ర వ్యతిరేకతను తనకు అనుకూలంగా ఫాసిజం మలుచుకోగలిగింది. తమ దేశానికి జరిగిన అవమానం పట్ల ఆగ్రహంతో ఉన్న జర్మన్లలో తేలికగానే జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టగలిగింది.
సోషల్ డెమోక్రాట్లు అనుసరించిన వర్గ సామరస్య విధానాల వలన రాజకీయంగా, నిర్మాణాత్మకంగా, కార్మిక వర్గం నిరాయుధమై బూర్జువా వర్గ దాడిని ఎదుర్కోలేని స్థితిలోకి నెట్టబడింది. అక్కడ కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు నాయకత్వం వహించగలిగినంత బలంగా లేవు. కమ్యూనిస్టులు కూడా ఫాసిస్టు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయారు. జర్మనీకి జరిగిన అవమానం వలన గాయపడిన జర్మన్ ప్రజల మనో భావాలను అర్థం చేసుకోవడంలో కూడా కమ్యూనిస్టులు విఫలమయ్యారు. రైతుల, పెట్టీ బూర్జువా వర్గ ఊగిసలాటను కూడా కమ్యూనిస్టులు గమనంలోకి తీసుకోలేదు. ఫాసిస్టు కార్యక్రమానికి ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు ఇవ్వలేకపోయారు.
జర్మన్ ఫాసిజానికి తొలుతగా ప్రజల మద్దతు ఉంది. హిట్లర్ అధికారంలోకి రావడానికి ముందు 1929-34ల మధ్య, ఆకలి దశాబ్దంగా వర్ణించబడిన పెట్టుడిదారీ ఆర్థిక మాంద్య కాలంలో, 70 లక్షల మంది నిరుద్యోగులు ఉండేవారు. హిట్లర్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున పబ్లిక్ వర్క్స్ కార్యక్రమాలు ప్రారంభించాడు. ప్రజలకు ఉద్యోగాలు దొరకసాగాయి. జర్మనీని సాయుధం చెయ్యడానికి ప్రయత్నాలు ప్రారంభించడంతో ఆయుధ పరిశ్రమలు చురుకుగా పని చెయ్యసాగాయి. లక్షల సంఖ్యలో యువకులు సైన్యంలో చేరసాగారు. అవమానకరమైన వెర్సయిల్స్ సంధి సంకెళ్ళను తెగగొట్టి, వివిధ దేశాలలో ఉన్న జర్మన్లనందరినీ ఐక్యం చేసి, జర్మనీని ఒక శక్తిమంతమైన రాజ్యంగా రూపొందిస్తానని చెబుతున్న హిట్లర్ ను జర్మన్ ప్రజలు అభిమానించారు. జర్మనీ సాధిస్తున్న ‘ప్రగతి’ ని చూసి జర్మన్లు గర్వించసాగారు. 1936 నాటికి నిరుద్యోగ సమస్య చాలామటుకు తీరింది. కడుపు నిండిన కార్మికులలో అధిక భాగం ‘ట్రేడ్ యూనియన్ హక్కులు లేకపోయినా, హిట్లర్ పాలనలో కార్మికులకు మాడి చచ్చే స్వేచ్ఛ లేదు’ అని నవ్వుకుంటుండేవారు. దీర్ఘ కాలిక పరిణామాలు అత్యంత ప్రమాదకరమైనవైనా, ఇటువంటి చర్యలతో నిరుద్యోగ సమస్యను చాలా వరకూ పరిష్కరించాడన్న పేరు తెచ్చుకున్నాడు హిట్లర్. తమ వ్యక్తిగత స్వాతంత్ర్యం హరించబడుతున్నా, తమ సంస్కృతి నాశనం చెయ్యబడుతున్నా, కనీవినీ ఎరుగని విధంగా తమ జీవితాలు నియంత్రించబడుతున్నా మెజారిటీ ప్రజలు ఉత్సాహంతో హిట్లర్ ను ఆహ్వానించారు, తమ దేశానికి బంగారు భవిష్యత్తు ఉందని భ్రమించారు. జర్మన్ల కళ్ళ ముందు నిలిచిన అందమైన కల – ప్రపంచాధినేత కాబోతున్న జర్మనీ – వాళ్ళ కళ్ళకు పొరలు కప్పేసింది.


జర్మనీలో హిట్లర్ ఫాసిజం విజయానికి స్థూలంగా కారణాలు ఇవి.

2

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచాన్ని కుదిపి వేసిన సంఘటన ఒకటి జరిగింది.  అక్టోబరు మహా విప్లవంలో రష్యాలో  కార్మిక వర్గ రాజ్యం ఉనికిలోకి రావడంతో ప్రపంచం రెండు వైషమ్య పూరిత వ్యవస్థలుగా – పెట్టుబడిదారీ వ్యవస్థ,  సోషలిస్టు వ్యవస్థలుగా చీలిపోయింది.  సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ దేశాల మధ్య అనివార్యంగా జరిగే సంఘర్షణలకు తోడు, సోషలిస్టు వ్యవస్థతో సంఘర్షణ ఒకటి  కొత్తగా తలెత్తింది.  తొలి సంవత్సరాలలోనే సోషలిస్టు రష్యాను నాశనం చెయ్యాలని పెట్టుబడిదారీ ప్రపంచం చేసిన దురాక్రమణ యుద్ధం విఫలమై సోషలిస్టు రష్యా నిలబడగలిగింది.  

            పెట్టుబడిదారీ దేశాల చేత చుట్టుముట్టబడిన ఒంటరి సోవియట్  రష్యా ఎంత కాలం నిలబడగలుగుతుంది? 

‘ఇప్పుడు మన ముందు ఎంతో అస్థిరంగా ఉన్న (సోవియట్ రిపబ్లిక్ కూ, సామ్రాజ్యవాద దేశాలకూ మధ్య – తోలేటి) సమతౌల్యం ఉంది….ఇది దీర్ఘకాలం ఉంటుందా? నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేరని నేను అనుకుంటున్నాను.  అందుకని మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి….మనల్ని బహిరంగంగా ద్వేషించే ప్రజలూ, వర్గాలూ, దేశాల చేత మనం చుట్టుముట్టబడి ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.  ఏదో రకమైన దాడి నుండి ఎల్లప్పుడూ మనం వెంట్రుకవాసి దూరంలో మాత్రమే ఉన్నామన్న   సంగతి మరిచిపోకూడదు..’ – లెనిన్ (Lenin, CW, Russian Edition, Vol. XXVIL, p. 117 – quoted in Problems of Leninism, p. 158)

‘మనం ఒక రాజ్యంలో మాత్రమే నివసించడం లేదు, రాజ్యాల వ్యవస్థలో నివసిస్తున్నాం.  సామ్రాజ్యవాద దేశాల సరసనే సుదీర్ఘకాలం  సోవియట్ రిపబ్లిక్ ఉనికిని మనం ఊహించలేం. చిట్టచివరకు ఏదో ఒక వ్యవస్థ గెలిచి తీరాలి.  అది జరిగే ముందు, బూర్జువా రాజ్యాల మధ్యా, సోవియట్ రిపబ్లిక్ మధ్యా   భయంకరమైన పోరాటాలు అనేకం అనివార్యంగా జరుగుతాయి.  దీనర్థం, పాలక వర్గమైన కార్మిక వర్గం తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే, సైనికంగా కూడా తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకోవాలి …’  – లెనిన్ (Lenin, SW, Vol.VIII, p.33 – quoted in Problems of Leninism, p. 156)

            సోషలిస్టు  సోవియట్ యూనియన్, సామ్రాజ్యవాద దేశాల మధ్య శాంతియుత సహజీవనం ఎంతో కాలం సాధ్యం కాదు అన్న లెనినిస్టు అవగాహనతో,   అనివార్యంగా రాగల దాడిని ఎదుర్కోవడానికి స్టాలిన్ అనుసరించిన వ్యూహం ఇది:

  • సామ్రాజ్యవాద దేశాలన్నీ కలిసికట్టుగా సోవియట్ యూనియన్ మీద మళ్ళీ దాడి చేసే ప్రమాదం ఉంది. ఆ కారణంగా సోవియట్ యూనియన్ తనను తాను రక్షించుకోవడానికి సాయుధ శక్తిని వేగంగా పెంచుకోవాలి.
  •  ప్రధమ కార్మిక రాజ్యమైన సోవియట్ యూనియన్ కు ఇతర దేశాల కార్మికుల మద్దతూ, సామ్రాజ్యవాదులనుండి విముక్తి కోసం వలస, అర్థ వలస దేశాలలో పోరాడుతున్న ప్రజల మద్దతూ కావాలి.  సోవియట్ యూనియన్ ఇతర దేశాలలోని కార్మిక వర్గ పోరాటాలకూ, విముక్తి పోరాటాలకూ, ఫాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకూ  సహాయం చేస్తూ  ఆయా దేశాల కార్మికుల, పీడితుల సహకారాన్ని పొందాలి.
  •  సామ్రాజ్యవాద దేశాల మధ్య నుండే వైరుధ్యాలను ఉపయోగించుకుని, అంతా కలిసికట్టుగా దాడి చెయ్యకుండా నివారించడానికి ప్రయత్నించాలి.

సోవియట్ యూనియన్ ను అతి వేగంగా ఆధునికం చెయ్యాలనే లక్ష్యంతో 1928లో మొదటి పంచవర్ష ప్రణాళికను రచించడం జరిగింది.  1931 ఫిబ్రవరి 4న స్టాలిన్ 18వ పార్టీ కాంగ్రెసులో మాట్లాడుతూ ‘మనం అభివృద్ధిచెందిన దేశాల కంటే ఏభై, వంద సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం.  ఈ అంతరాన్ని  మనం ఒక  దశాబ్దంలో అధిగమించాలి.  ఇది చెయ్యకపోతే శత్రువు మనల్ని నాశనం చేస్తాడు’ అని హెచ్చరించాడు.  పారిశ్రామికీకరణ కోసం అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి రష్యా తన కడుపు మాడ్చుకుని గోధుమ, రై, గుడ్లూ, మాంసమూ, వెన్న, ద్రాక్షసారా మొదలైనవి విదేశాలకు ఎగుమతి చేసింది.  

                మొదటి పంచవర్ష ప్రణాళికలో యుద్ధ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 1928-1940 మధ్య కాలంలో 9,000  ఫాక్టరీలను నిర్మించడం జరిగింది.  1930లో సోవియట్ యూనియన్ 740 టాంకులను ఉత్పత్తి చేస్తే,  1941లో    5,500 టాంకులను ఉత్పత్తి చేసింది.  1930 లో సోవియట్ యూనియన్  860 విమానాలను ఉత్పత్తి చేస్తే,   1938లో 5,469, 1939లో 10,382, 1940లో 10,565 విమానాలనూ  ఉత్పత్తి చేసింది.  సైనిక, వైమానిక బలగాలే కాకుండా సోవియట్ యూనియన్ శక్తివంతమైన నౌకా బలగాలను కూడా నిర్మించింది.  

              యుద్ధం జరిగిన నాలుగు సంవత్సరాలలోనూ    సోవియట్ పరిశ్రమలు 4,90,000 శతఘ్నులూ, మోర్టార్లూ, 1,20,000 టాంకులూ,  స్వయం చలిత శతఘ్నులూ, 1,37,000 యుద్ధ విమానాలనూ, నిరంతరాయంగా మందుగుండునూ  ఎర్ర సైన్యానికి అందించి ఫాసిస్టు జర్మనీ ఓటమికి తోడ్పడ్డాయి.

            సమిష్టి వ్యవసాయ విప్లవం గ్రామీణ ప్రాంతాలను ఫ్యూడల్ వెనుకబాటుతనాన్నుండి విముక్తి చేసి ఆధునిక యుగంలోకి తీసుకువచ్చింది.   విద్యా,  సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో సంభవించిన మహత్తరమైన మార్పుల వలన  సోవియట్ జనాభా విద్యాపరంగా, సాంకేతికంగా, సాంస్కృతికంగా చాలా పురోగమించింది. ఈ రంగాలలోని ప్రగతి, ఒక మొద్దుగా పరిగణించబడిన సోవియట్ కార్మికుడిని అత్యంత నిపుణుడైన కార్మికుడిగా మార్చింది.  1928లో ఒక స్త్రీ ట్రాక్టరు నడిపినప్పుడు జనం హేళన చేసి రాళ్ళు రువ్విన పరిస్థితి మారి, సోవియట్ స్త్రీ ఎంతో పురోగమించింది.   రెండో ప్రపంచ యుద్ధ కాలంలో  వ్యవసాయమంతా సోవియట్ స్త్రీయే నిర్వహించింది. యుద్ధ పరిశ్రమలలో సగం మంది స్త్రీలే ఉండేవారు. అంతేకాదు, సోవియట్ స్త్రీ తుపాకీ చేతబట్టి పోరాడింది, యుద్ధ విమానాలను నడిపింది.      మూడు పంచవర్ష  ప్రణాళికలలోనూ విద్యా సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో ఈ మహత్తర  విప్లవం లేకుండా సోవియట్ యూనియన్ వెనుకబడి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు.  జర్మన్ ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన దేశభక్తి ప్రపూరిత మహా యుద్ధంలో సోవియట్ యూనియన్ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు – సోవియట్ వ్యవస్థా, ఆ వ్యవస్థ ప్రజలలో కలిగించిన సోషలిస్టు చైతన్యమూ.

            సోషలిస్టు విప్లవం ప్రజల కోసం జరిగిన విప్లవమనీ,  ప్రజలను సంతృప్తి పరచడం ప్రధమ కర్తవ్యం అనీ బుఖారిన్ తదితరులు ప్రతిపాదించినట్లు, పరిమితంగా ఉన్న పెట్టుబడిని సోవియట్ యూనియన్  వినియోగ పరిశ్రమలకు మళ్ళిస్తే ప్రజలకు వినియోగ వస్తువులు విరివిగా లభ్యమయ్యేవి.  కానీ  జర్మనీ దాడి చేసినప్పుడు, భారీ పరిశ్రమలూ యుద్ధ పరిశ్రమలూ  లేని సోవియట్ రష్యా  తనను తాను రక్షించుకోలేపోయేది.  వందేళ్ళ బానిసత్వంలోకి పోయేది.

            ఈ పంథాను తిరస్కరించి అత్యంత వేగంగా పారిశ్రామికీకరణను సాధించడం  వలనే ఫాసిస్టు జర్మనీతో యుద్ధంలో సోవియట్ యూనియన్ గెలవగలిగింది. ఫాసిజం మీద రష్యా విజయానికి మూల కారణాలైన  సమిష్టి వ్యవసాయ  విప్లవంలోనూ, పారిశ్రామికీకరణలోనూ స్టాలిన్ పాత్రను మనం విస్మరించలేము.

            తను పదవిలోకి రాకముందు హిట్లర్ 1924లో రచించిన ‘నా పోరాటం’ (Mein kampf) లో తను అధికారంలోకి వస్తే  ఏం చేస్తాడో స్పష్టంగా చెప్పాడు.  జర్మన్ జాతి ఆర్యన్ జాతి అనీ, ఈ ఆర్యన్ జాతి ఇతర జాతులను అణచి ఉంచి పాలించాలనీ అన్నాడు.  అన్ని దేశాలలోని జర్మన్లనూ ఐక్యం చేసి జర్మనీ ప్రపంచాధినేత కావాలన్నాడు.  జర్మనీ జీవించడానికి స్థలం (lebensraum) కావాలన్నాడు.     జర్మనీ, ఫ్రాన్స్ ను ముందు నాశనం చేసి తర్వాత రష్యా మీద దాడి చెయ్యాలన్నాడు. ఇటువంటి భావాలు గల హిట్లర్ జర్మన్ పారిశ్రామికవేత్తల అండదండలతో  1933లో జర్మన్ ఛాన్సలర్ అయ్యాడు.  కుయుక్తులూ, కుతంత్రాల ద్వారా సర్వాధికారాలూ చేబట్టి త్వరలోనే జర్మనీకి నాయకుడు (ఫ్యూరర్) అయ్యాడు.

                శాంతి గురించి మాట్లాడుతూ హిట్లర్ జర్మనీని ‘రహస్యంగా’ సాయుధం చేశాడు.  ఈ ‘రహస్య కార్యక్రమం’ నిజానికి రహస్యం కాదు.  బ్రిటన్, ఫ్రాన్స్ లకు తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున జర్మన్ పునరాయుధీకరణ జరుగదు.   వెర్సయిల్స్ సంధి షరతులను ఒక్కొక్కటే ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున జర్మనీని సాయుధం చేస్తున్నప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ లు హిట్లర్ ను ఆపడానికి ప్రయత్నించలేదు.   కమ్యూనిస్టు రష్యా మీద దాడికి హిట్లరును ఉసిగొలిపే లక్ష్యంతో  పరోక్షంగా ప్రోత్సహించాయి.  ఈ రెండు దేశల కుతంత్రాలూ హిట్లర్ జర్మనీలో నిలద్రొక్కుకోవడానికీ, అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని సమకూర్చుకుని ప్రపంచాన్ని మారణ హోమంలోకి దించడానికీ పరోక్షంగా కారణమయ్యాయి.

యూరోపులో క్రమ్ముకు వస్తున్న యుద్ధ మేఘాలను గమనించి సోవియట్ ప్రభుత్వం చాలా ఆందోళన చెందింది.  ఆస్ట్రియా జర్మన్ వశం అయిన  తర్వాత జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు సమిష్టి రక్షణకు సిద్ధమవ్వాలని సోవియట్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. కానీ, బ్రిటన్,  ఫ్రాన్స్ లు  దీనికి అంగీకరించలేదు.

 ఆస్ట్రియాను ఆక్రమించి, జకోస్లోవేకియాను మూడు వైపులనుండి జర్మన్ సైన్యం చుట్టుముట్టింది.  జకోస్లోవేకియా తనను తాను రక్షించుకోలేని దుస్థితిలో పడింది.  జకోస్లోవేకియా ఉనికి ప్రమాదంలో పడగానే, ఆ దేశంతో రక్షణ ఒడంబడిక ఉన్న సోవియట్ యూనియన్, జకోస్లోవేకియా  తరఫున పోరాడడానికి పశ్చిమ సరిహద్దులకు 40 డివిజన్ల సైన్యాన్ని తరలించింది.  కానీ, మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ ల ద్రోహానికి జకోస్లోవేకియా గురైంది.  జకోస్లోవేకియాలోని కొన్ని ప్రాంతాలను జర్మనీకి అప్పగించాలనీ, లేకపోతే యుద్ధం తప్పదనీ ఆ దేశం మీద ఒత్తిడి తీసుకు వచ్చి, 1938లో మ్యూనిచ్ లో జర్మనీతో ఒక ఒడంబడిక మీద సంతకాలు చేశాయి ఈ దేశాలు.  తన భవిష్యత్తును నిర్ణయించిన ఈ సమావేశంలో జకోస్లోవేకియా లేదు.  జకోస్లోవేకియా-ఫ్రాన్స్-రష్యాల మధ్య   సైనిక సహాయానికి సంబంధించి ఒక ఒడంబడిక ఉన్నా, ఈ మ్యూనిచ్ సమావేశం నుండి సోవియట్ యూనియన్ ను వెలివేశారు.  క్రమంగా హిట్లర్ జకోస్లోవేకియానంతా ఆక్రమించి పోలెండు సరిహద్దులకు చేరాడు.  ఒక్కొక్క అడుగే వేస్తూ యుద్ధ రాక్షసి రష్యా సరిహద్దులకు చేరసాగింది.  పెట్టుబడిదారీ దేశాలన్నీ ఏకమై సోవియట్ యూనియన్ మీద దాడి చేసే ప్రమాదం తలెత్తుతోంది.

ఇటువంటి పరిస్థితులలో సోవియట్ యూనియన్-ఫాసిస్టు జర్మనీల మధ్య 1939 ఆగస్టులో ఒక నిరాక్రమణ సంధి (non-aggression pact) జరిగింది.  ప్రపంచంలోని ప్రజాస్వామ్యవాదులనూ, కమ్యూనిస్టులనూ ఈ సంధి విస్మయంలో ముంచెత్తింది, గందరగోళంలో పడేసింది.  హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ హిట్లర్ ఫాసిజాన్ని వ్యతిరేకించడంలో రష్యా ముందుంది.  అటువంటి రష్యా నిరాక్రమణ ఒడంబడికకు ఎలా అంగీకరించింది?  ఎందుకు అంగీకరించింది?

పరస్పరం సహాయం చేసుకోవడానికి బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ లు ఒక ముక్కోణపు ఒడంబడికకు రావాలని 1939 ఏప్రిల్ 16న సోవియట్ ప్రభుత్వం   బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది.  బ్రిటిష్ ప్రభుత్వం మూడు వారాల తర్వాత మే 8న ఈ ప్రతిపాదనను దాదాపు తోసిపుచ్చింది.   తరువాత జరిగిన సంప్రదింపులలో ప్రతిష్టంభన ఏర్పడింది.  ఆగస్టు రెండవ వారానికి సోవియట్ యూనియన్-పశ్చిమ దేశాల మధ్య  సైనిక సంప్రదింపుల ప్రక్రియ దాదాపు నిలిచిపోయే స్థితికి వచ్చింది.  ఇటు రష్యాతో సంభాషణలు జరుపుతున్న సమయంలోనే, మరో పక్క 1939 జూన్-ఆగస్టు లలో బ్రిటన్-జర్మనీల మధ్య రహస్య సంప్రదింపులు జరుగుతున్నాయి.  బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చెయ్యనని హిట్లర్ హామీ ఇస్తే, తూరుపు వైపు హిట్లర్ దురాక్రమణలో (అంటే  రష్యా మీద దాడిలో) బ్రిటన్ కలుగజేసుకోదు.  సోవియట్ యూనియన్ తో సంధి సంప్రదింపులను ఆపేస్తుంది.  గూఢచారుల ద్వారా స్టాలిన్ కు ఈ రహస్య సంప్రదింపుల వివరాలు అందుతూనే ఉన్నాయి.  సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ అన్నీ ఏకమయ్యే ప్రమాదం ఎదురవుతోందని స్టాలిన్ గ్రహించాడు.  మరో పక్క జర్మనీ సోవియట్ యూనియన్ తో నిరాక్రమణ  సంధిని ప్రతిపాదిస్తోంది.

ఆగస్టులో మరో పరిణామం జర్మనీతో నిరాక్రమణ  సంధి గురించి స్టాలిన్ ఆలోచించేలా చేసింది.  1938 నుండీ సోవియట్ యూనియన్ – ఫాసిస్ట్ జపాన్ ల మధ్య మంచూరియా సరిహద్దులలో సాయుధ సంఘర్షణ జరుగుతోంది.  1939 ఆగస్టు నాటికి ఖాల్కిన్ గోల్ ప్రాంతంలో చిన్న సైజు యుద్ధం జరుగుతోంది.  రష్యా రెండు రంగాలలో, తూర్పున జపాన్ తోనూ, పశ్చిమాన జర్మనీతోనూ ఒంటరిగా యుద్ధం చెయ్యాల్సి వచ్చే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టబడుతోంది.  జర్మనీతో నిరాక్రమణ సంధి, జర్మనీ మిత్రదేశమైన జపాన్ ను నిరుత్సాహ పరుస్తుంది.  జపాన్ తో యుద్ధం రష్యాకు అనుకూలంగా ముగిసే అవకాశం ఉంది.  ఇటువంటి పరిస్థితులలో స్టాలిన్ జర్మనీతో నిరాక్రమణ సంధికి అంగీకరించాడు. 

ఈ సంధి వలన యుద్ధానికి సిద్ధం కావడానికి రష్యాకు ఒకటిన్నర సంవత్సరాల వ్యవధి లభించింది.   రష్యా పశ్చిమ సరిహద్దు 150-200 మైళ్ళు పశ్చిమంగా జరిగి రష్యాకు అదనంగా  రక్షణ ఏర్పడింది.  (పోలెండు ఆక్రమణలో ఉన్న పశ్చిమ యుక్రెయిన్ రష్యాలో కలిసి) 2 కోట్ల 30 లక్షల జనాభా సోవియట్ యూనియన్ లో చేరింది.  ఈ సంధితో సామ్రాజ్యవాద దేశాలు కలిసికట్టుగా సోవియట్ యూనియన్ మీద దాడి చేసే ప్రమాదం తప్పింది.

ఫాసిస్టు జర్మనీతో ఈ నిరాక్రమణ సంధి స్టాలిన్ ను పచ్చి అవకాశవాదిగా చేసిందని కొంతమంది  కమ్యూనిస్టులు ఇప్పటికీ ఆరోపిస్తారు.  కానీ, ఆ కాలంలో అది అత్యంత వాస్తవికమైన చర్య.  మొత్తం సామ్రాజ్యవాద ప్రపంచానికి ఎదురుగా నిలబడి సోవియట్ యూనియన్ ఒంటరిగా పోరాడవలసిన స్థితి ఈ సంధి వలన తప్పింది.  దౌత్య వ్యవహారాలలో స్టాలిన్ నైపుణ్యానికి నిదర్శనంగా ఈ సంధి నిలుస్తుంది.  దీన్ని అవకాశవాదంగా చిత్రించడం సమంజసం కాదు.

  1939లో జర్మనీ పోలెండు మీద దాడి చెయ్యడంతో, సామ్రాజ్యవాద దేశాల మధ్య యుద్ధంగా రెండో ప్రపంచ యుద్ధం        ప్రారంభమైంది.  సామ్రాజ్యవాద దేశాలతో దౌత్యవ్యవహారాలలో స్టాలిన్  వాస్తవికంగా వ్యవహరించిన ఫలితంగా 1941లో ఫాసిస్టు జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చేసినప్పుడు రష్యా ఒంటరిగా లేదు. అమెరికా, బ్రిటన్ లు మిత్ర దేశాలుగా సోవియట్ యూనియన్ తో చేతులు కలపవలసి వచ్చింది.

1939లో సోవియట్ యూనియన్ తో జరిగిన సాయుధ సంఘర్షణలో ఫాసిస్టు జపాన్ ఓడిపోయింది.  అయినా జపాన్ మళ్ళీ దాడి చెయ్యదని హామీ ఏమీ లేదు.     సోవియట్ రష్యా జపాన్ తో కూడా నిరాక్రమణ సంధిని కుదుర్చుకుంది.  కానీ, ఈ కాగితం ముక్క సోవియట్ యూనియన్ ను రక్షించదని స్టాలిన్ కు తెలుసు. పశ్చిమాన జర్మనీ, తూర్పున జపాన్ – ఈ రెండు ఫాసిస్టు రాజ్యాలూ   ఒకే సమయంలో  దాడి చేసినట్లయితే రష్యా – యూరోపియన్ రష్యా, ఏషియన్ రష్యాలుగా –  రెండు ముక్కలుగా తెగిపోవచ్చు.    ఆ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, జపాన్ దాడిని ఎదుర్కోవడానికి స్వయం సమృద్ధమైన 5 లక్షల సైన్యాన్ని తూర్పున ఉంచాడు స్టాలిన్.  ఈ సైన్యానికి రెండు సంవత్సరాలకు సరిపడా మందుగుండూ, ఇతర ఆయుధ సంపత్తీ ఉంది. పశ్చిమ రష్యానుండి సహాయం అందకపోయినా స్వతంత్రంగా పోరాడగలదు. మాస్కో యుద్ధం జరుగుతున్నప్పుడూ, స్టాలిన్ గ్రాడ్ యుద్ధం జరుగుతున్నప్పుడూ, సోవియట్ యూనియన్ కూలిపోతుందని ప్రపంచమంతా విశ్వసిస్తున్న తరుణంలో, తూర్పునుండి దాడి చెయ్యడానికి జపాన్ సిద్ధపడింది.  కానీ, 1941లో మాస్కో ద్వారాల ముందూ, 1942లో స్టాలిన్ గ్రాడ్ లోనూ జర్మన్ ఓటమితో జపాన్ సోవియట్ యూనియన్ మీద దాడి చెయ్యడానికి సాహసించలేదు.

1941 జూన్ 22న ఫాసిస్టు జర్మనీ 35 లక్షల సైన్యంతో, వేల విమానాలతో, టాంకులతో హఠాత్తుగా సోవియట్ రష్యా మీద దాడి చేసింది.    కానీ, మిత్రదేశాలుగా ఉన్న పశ్చిమ దేశాలు తమ కుతంత్రాలను మానలేదు. ఈ యుద్ధంలో జర్మనీతో ఒంటరిగా పోరాడుతూ సోవియట్ యూనియన్ బలహీనపడాలనే ఉద్దేశంతో రెండో యుద్ధ రంగాన్ని 1944 వరకూ ప్రారంభించలేదు.  సోవియట్ యూనియన్ ఒంటరిగా జర్మనీని ఓడించగల పరిస్థితి ఏర్పడినప్పుడు, యూరోపు అంతా ఎర్రబడుతుందనే భయంతో మాత్రమే 1944లో రెండో యుద్ధ రంగాన్ని ప్రారంభించాయి. 

1945 మేలో ఎర్ర సైన్యం జర్మన్  రాజధాని బెర్లిన్ ను ఆక్రమించింది.  హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.  జర్మనీ బేషరతుగా లొంగిపోవడంతో యుద్ధం ముగిసింది.

జర్మన్ ఫాసిజం ఓటమితో, ఫాసిస్టు ఆక్రమణలో ఉన్న  యూగోస్లోవియా, జకోస్లోవేకియా, పోలెండు, రుమేనియా, బల్గేరియా, హంగరీ, ఆల్బేనియా దేశాలలో ఫాసిజం అంతమై సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడడానికి  దారి తీసింది.  జర్మనీ రెండు ముక్కలై తూర్పు జర్మనీలో  సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడింది.   సోవియట్  యూనియన్ తన ఒంటరితనాన్ని అధిగమించగలిగింది, ఒక సోషలిస్టు  శిబిరం ఏర్పడింది.  ఈ ఘన విజయానికి  కారణం – స్టాలిన్ నేతృత్వంలో సోవియట్ కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన సరియైన, వాస్తవికమైన విధానాలు.

ఫాసిస్టు జపాన్ ఓటమిలో కూడా సోవియట్  యూనియన్ మహత్తర పాత్రను పోషించింది.  ఏప్రిల్ 5, 1945లో సోవియట్ ప్రభుత్వం జపాన్ తో నిరాక్రణ సంధిని రద్దు చేసింది.  జపనీస్ సైన్యంలో అత్యుత్తమ సైన్యం అయిన 10 లక్షల క్వాంగ్ టుంగ్ సైన్యం మంచూరియా సరిహద్దులో ఉంది.     ఆగస్టు 9న సోవియట్ సైన్యం జపనీస్ సైన్యం మీద దాడి చేసింది.  పది రోజులలో, ఆగస్టు 19 నాటికి ఫాసిస్టు జపనీస్ సైన్యం ఓడిపోయింది.  సెప్టెంబరు 2,   1945న ఫాసిస్టు  జపాన్ బేషరతుగా లొంగిపోయింది. జపాన్ ఓటమి చైనాలో కమ్యూనిస్టులు  బలపడడానికి దారి తీసింది.

ఎర్ర సైన్యం దాడి చెయ్యడానికి మూడు రోజుల ముందు, ఆగస్టు 6న అమెరికా హిరోషిమా మీద ఆటంబాంబును ప్రయోగించింది.  రెండు రోజుల తర్వాత నాగసాకి మీద మరో ఆటంబాంబు వేసింది.  ఈ ఆటంబాంబు ప్రయోగం ప్రపంచాన్ని భయకంపితులను చేసే ఉద్దేశంతో, ముఖ్యంగా కమ్యూనిస్టు రష్యాకు ఒక  హెచ్చరికగా జరిగినదే కానీ సైనికంగా ఈ బాంబుల ప్రయోగానికి అంత ప్రాముఖ్యత లేదు.

ఈ వ్యాసం ప్రధానంగా ఫాసిజం గురించీ, ఫాసిజాన్ని ఓడించడానికి స్టాలిన్ చేసిన కృషి గురించీ చెప్పడానికి ఉద్దేశించబడినది కాబట్టి ఇంతటితో ముగుస్తుంది.

వ్యక్తిపూజను నిరసించే పేరుతో ఈ మహానాయకుడి మీద అత్యంత నీచ  స్థాయిలో – స్టాలిన్ చాలా భయస్తుడనీ,   టాయిలెట్ సీటు మీద ఒంటరిగా కూర్చోవడానికి భయపడి తోడుగా పక్కన సెక్యూరిటీ గార్డును ఉండమనేవాడనీ (కృశ్చేవ్ ఆరోపణ) – ఎంతో ప్రచారం జరిగింది. ఇటువంటి ప్రచారంతో చరిత్ర నుండి అతని పాత్రను తుడిచి వెయ్యడానికి ప్రయత్నం జరిగింది.  కృశ్చేవ్, గోర్బచేవ్ లాంటి ద్రోహులు స్టాలిన్ పేరును తుడిచి వెయ్యలేక పోయారు, కానీ సోవియట్ యూనియన్ ను నామరూపాలు లేకుండా నాశనం చెయ్యగలిగారు.  ప్రజలు  చరిత్ర నిర్మాతలు అనేది వాస్తవమే కానీ ‘…చరిత్రలో ఏ వర్గం కూడా తనకు ప్రాతినిధ్యం వహించి, సంఘటితపరచి, పోరాటాలకు నాయకత్వం వహించగల వ్యక్తులు లేకుండా అధికారాన్ని చేపట్టలేదు..’ అని లెనిన్ అన్నది కూడా నిజమే.  వ్యక్తిపూజను నిరసించే పేరుతో సమర్థులైన నాయకులను చులకన చెయ్యడమూ, నాయకత్వం మీద అపనమ్మకం కలిగించే ప్రచారం చెయ్యడమూ ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది.

 ప్రపంచంలో అనేక దేశాలలో ఫాసిజం నిలద్రొక్కుకుంటున్న నేటి పరిస్థితులలో ఫాసిజం ఎలా తలెత్తుతుందో అర్థం చేసుకోవడానికీ, ఫాసిజంతో ఎలా పోరాడాలో తెలుసుకోవడానికీ ఈ వ్యాసం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 

Leave a Reply