స్టాలిన్‌ వ్యతిరేకతతో మొదలై కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయిన వాళ్లు చరిత్రలో కోకొల్లలు..’ అని చలసాని ప్రసాద్‌ డజన్ల పేర్లు ఉదహరించేవారు. ఇరవయ్యో శతాబ్దపు విప్లవాల్లో, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో స్టాలిన్‌ అంత జనామోద నాయకుడు లేరు. ఆయనలాగా విమర్శలు మోసినవాళ్లూ లేరు. బహుశా ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంలో విప్లవోద్యమానికేగాక సోషలిస్టు నిర్మాణానికి కూడా నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. ఆ శతాబ్ది విప్లవాల ప్రత్యేకతల్లాగే ఆ కాలపు సోషలిస్టు నిర్మాణ ప్రత్యేకతలను కూడా పరిగణలోకి తీసుకొని చూడ్డానికి ఇప్పుడు చరిత్ర మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పటికీ విప్లవమన్నా, సోషలిజమన్నా స్టాలిన్‌ అజరామర పాత్ర మీద  అంతులేని విశ్లేషణలు సాగుతున్నాయి.

  స్టాలిన్‌ అనగానే విమర్శలతో, మినహాయింపులతో చర్చ మొదలవుతుంది. ‘కానీ, అయినప్పటికీ’ అంటూ వాదన ఆరంభమవుతుంది. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ స్థానంలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి స్టాలిన్‌ చేసిన ప్రయత్నం చుట్టూ అనేక వాదవివాదాలు ఇప్పటికీ ఉన్నాయి. సోషలిజం అంటే కేవలం ఆర్థిక వ్యవస్థే కాదని, నూతన మానవులు ఆవిర్భవించగల నాగరికతా క్రమం అని, దానికి తగినట్లు సామాజిక జీవన రంగాలన్నిటినీ సోషలిస్టు విలువల మీద, విధానాల మీద నిర్మించవలసి ఉన్నదని ఆయనకు పుష్కలమైన అవగాహన ఉన్నది. రాజకీయార్థిక వ్యవస్థ కేంద్రంగా, పాలన కేంద్రంగా సోషలిజాన్ని చూసినట్లే నూతన మానవ సంబంధాల దిశగా  ఆయన చూశారనడానికి  ఆ కాలంలో  వచ్చిన కాల్పనిక సాహిత్యమే గొప్ప ఉదాహరణ. ముఖ్యంగా యుద్ధ  కాలంలో సోషలిజాన్ని నిర్మించవలసిన బాధ్యతను చరిత్ర ఆయనకు అప్పగించింది. సోవియట్‌ యూనియన్‌ లోపలా, బైటా ఉన్న ఈ చారిత్రక సామాజిక ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకొని  స్టాలిన్‌ను అంచనా వేయాల్సి ఉంటుంది. 

 సోషలిస్టు వ్యవస్థ ఎలా ఉండాలి? దాన్ని ఎలా నిర్మించాలి? అనే ఆసక్తికరమైన పరిశీలనలు ముందు నుంచే చేయడం అవసరమే. కానీ మన ఊహలను, ప్రణాళికలను తల్లకిందుల చేస్తూ ఆనాటి పరిస్థితులే దాన్ని నిర్ణయిస్తాయి. ఒక వ్యవస్థగా, కమ్యూనిజంలోకి చేరుకొనే ప్రయాణంలో మధ్యంతర దశగా సోషలిజం మౌలికంగానే పెట్టుబడిదారీ విధానానికి సమగ్ర ప్రత్యామ్నాయం. అలాంటి వస్తుగత పని విధానం మీద సోషలిజం నిర్మాణం కావాలి. అది కూడా ఆనాటి చారిత్రక పరిస్థితులను, సమాజపు అంతర్గత సంక్షోభాలను, ఆ సామాజిక, సాంస్కృతిక ప్రగతిదాయక పరివర్తనలను బట్టి రూపొందుతాయి. అమలులోకి వస్తాయి.

ఈ వైపు నుంచి సోవియట్‌ యూనియన్‌ నిర్మాణంలో స్టాలిన్‌ పాత్రను ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో భాగంగా కూడా చూడాలి. యుద్ధంతో సంబంధం లేకుండా స్టాలిన్‌ను అంచనా వేయాలని ఎవ్వరు ప్రయత్నించినా ఘోరంగా విఫలమవుతారు. వాస్తవాలకు సుదూరంగా సొంత పాండిత్య ప్రదర్శన చేసినవాళ్లవుతారు. మానవాళిని కబళించబోతున్న ఫాసిస్టు యుద్ధోన్మాదాన్ని ఎదుర్కొంటూ సోషలిస్టు వ్యవస్థను నిర్మించడం, దాన్ని కాపాడుకోవడం అనే  కర్తవ్యాలను ఆనాటి నిర్దిష్ట పరిస్థితులతో నిమిత్తం లేకుండా వాదన చేసిన వాళ్లవుతారు. అత్యంత ప్రయాసభరితంగా సోషలిస్టు వ్యవస్థను నిర్మించే పనిలో పార్టీలో, సమాజంలో ఉన్న అననుకూలతలను, ప్రతీఘాతుక ధోరణులను ఎదుర్కొంటూ స్టాలిన్‌ కోట్లాదిమంది ప్రజలను సోషలిస్టు నిర్మాణంలో భాగం చేశాడు.  ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో కూడా భాగం చేశారు. ప్రజల సృజనాత్మక, క్రియాశీల భాగస్వామ్యం లేకుండా ఎక్కడా సోషలిజం నిర్మాణం కాదు.  ఫాసిస్టు యుద్ధాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఈ రెంటినీ  స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ ప్రజలు నిరూపించారు.

ఇవాళ సోవియట్‌ యూనియన్‌ చరిత్రలో భాగమైపోయి ఉండవచ్చు. కానీ సోషలిస్టు నిర్మాణంలో, ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ఆ దేశ ప్రజలు మానవాళికి అపారమైన అనుభవాలను అందించారు.  బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి పుట్టి బూర్జువా ప్రజాస్వామిక విలువలను, వ్యవస్థలను, అంతిమంగా మానవ జాతిని కబళించడానికి ఫాసిజం ప్రయత్నించినప్పుడు స్టాలిన్‌ ప్రదర్శించిన అవగాహన ఇప్పుడు మనమున్న పరిస్థితులకు ఎలా ఉపయోగపడుతుందో అధ్యయనం చేయాలి. స్టాలిన్‌ నాయకత్వంలో ఇంటర్‌నేషనల్‌ ప్రపంచ కమ్యూనిస్టు ప్రగతిశీల శక్తులకు చూపిన దారి నుంచి మనం స్ఫూర్తి పొందవలసిన అంశాలను వెలికి తీయాలి. ప్రపంచంలోని బూర్జువా ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటానికి  రష్యా ప్రజలు తమ దేశ విప్లవంలో కంటే ఎక్కువ  బలిదానం చేసి ఫాసిజాన్ని ఓడిరచిన అనుభవం నుంచి స్వీకరించాల్సిన వాటిని గుర్తించాలి. 

నిస్సందేహంగా ఇవాళ మనమున్న ప్రపంచం చాలా కొత్తది. ఆనాడున్నట్లు సోషలిస్టు శిబిరం ఇవాళ లేదు. సామ్రాజ్యవాదం ప్రత్యక్ష వలస రూపంలో పని చేయడం లేదు. ద్రవ్య పెట్టుబడి ప్రపంచమంతా విస్తరించింది. కమ్యూనిస్టు విప్లవ శక్తులు చాలా బలహీనంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆనాడున్నట్లు కూడా ఇవాళ లేదు. అత్యంత నికృష్టంగా దిగజారిపోయింది. ప్రజలకు  పనికి వచ్చే ఏ లక్షణాన్ని అది నిలబెట్టుకోలేదు. అత్యంత పాశవికమైన, అమానవీయ వ్యవస్థగా తనకుతానే నిరూపించుకున్నది. ముఖ్యంగా వలస రూపంలో దిగుమతి అయిన భారత పార్లమెంటరీ వ్యవస్థ తన హీన దశకు ఎప్పుడో చేరుకున్నది. ఆ మురికి గుంట నుంచి ఫాసిజం అనే విష జంతువు పుట్టింది. దేశాన్ని కబళిస్తున్నది.   ఈ తరుణంలో ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో స్టాలిన్‌ చూపిన నిశ్చయ మార్గాన్ని మనం అనుసరించాలి. ఫాసిజం మీద తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించాలి.  మన దేశంలోని ఫాసిజం ప్రత్యేకతలను గుర్తించి దాన్ని   ఓడిరచడానికి సిద్ధం కావాలి.  ఫాసిస్టు వ్యతిరేక ప్రజా యుద్ధానికి, ఐక్య సంఘటనకు ఆయన అందించిన దృక్పథంలో ఈనాటికీ మనకు అవసరమైన వాటిని స్వీకరించి పదును పెట్టుకోవాలి.  ఫాసిస్టు వ్యతిరేకంగా నిర్ణయాత్మక వైఖరి తీసుకోడానికి కామ్రేడ్‌ స్టాలిన్‌ తలపోత గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది.  అందులో భాగమే ఆయన వర్ధంతి మార్చి 5 సందర్భంగా వసంతమేఘంలో కొన్ని ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తున్నాం.

Leave a Reply