కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ప్రచార ఉధృతిలో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సామాన్యులకు, సంక్షోభంలో ఉన్న రైతులకు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క చర్య చేపట్టలేదు. సమర్థ పాలన స్థానే అసమర్థత, ఏ మాత్రం పారదర్శకత, సమిష్టి నిర్ణయాలు లేని, నియంతృత్వ పోకడలున్న పాలకుడే మోడీలో కనిపిస్తాడు. కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసిన, చేస్తున్న కాలంలోనూ మోడీ, ఆయన లెప్టినెంట్ అమిత్ షాల అనాలోచిత, ప్రజావ్యతిరేక చర్యలు దేశ అభివృద్ధిని అతలాకుతలం చేశాయి. మోడీ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. అచ్చేదిన్ (మంచి రోజులు) వస్తాయని నమ్మిన ప్రజలకు చచ్చే రోజులు వచ్చాయని భావిస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ ఇండియా… వంటివన్ని ప్రచారానికి పరిమితమయ్యాయి.

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రింట్ మీడియాను, ఎలక్షానిక్ మీడియాను 90 శాతం తన గొంతుగా మార్చుకున్నాడు. తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాప్తి చేయించాడు. మునిగిపోతున్నా వెలిగిపోతున్నామని మీడియా బూటకపు వార్తలు మోడీని పోగడుతూ రాశాయి. తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మీడియాలో వినిపించినా అనేక దారుల్లో, దాడులతోలొంగ‌దీసుకునే ప్రయత్నం చేశాడు. లొంగ‌ని వారిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాడు. గొంతులెత్తిన విద్యార్థులు, రైతులు,కార్మికులు,కవులు, జర్నలిస్టులు, కళాకారులు, పౌర హక్కుల సంఘాల కార్యకర్తలపైనా వందల సంఖ్యలో దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (ఉపా) కింద కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించాడు. మరోవైపు ఆర్ఎస్ఎస్ శ్రేణులు మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మూఢనమ్మకాలు, ఆ శాస్త్రీయతను బలపర్బేవిధంగా మోడీ ప్రభుత్వంవ్యవహరించడం దేశ విదేశాల్లో విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వమే జాతీయ అతివాదం, అసహనాన్ని ఎగదోస్తుండడంతో సామాజికంగాదేశంమరిన్ని సమస్యల్లోకి వెళ్లిందని మేధావులు అంటున్నారు. దీంతో ప్రజలు మోడీవి ప్రగల్ఫాలే గాని చేతల్లో శూన్యం అన్న చర్చ చేస్తున్నారు.


భారత్లో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభం వల్ల సమాజం అతలాకుతలం అవుతోంది. ప్రతి మనిషి బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్న దయనీయస్థితి. ఈ వ్యాధి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారత సమాజం జీవనం సాగిస్తోంది. ఇలాంటి దయనీయ స్థితిలో బతుకు పోరాటం సాగిస్తున్న జనానికి భవిష్యత్ పై  భరోసా కల్పించే స్థితిలో ప్రభుత్వం లేదు. నరేంద్ర మోడీ జనవరిలో కొవిడ్-19ను భారత్ జయించిందని ప్రపంచ అర్థిక వేదిక మీద ప్రకటించారు. అక్కడితో ఆగకుండా మందులు, వ్యాక్సిన్లు చిన్న దేశాలకు అందించి ప్రపంచాన్నే భారత్ రక్షిస్తున్నదని చెప్పారు. ఆ భ్రమ నుండి బయట పడేందుకు మూడు నెలలు కూడా పట్టలేదు. పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రపంచ గురువు అనుకుంటున్న మనకి ప్రపంచమంతా ఇప్పుడు సహాయం ప్రకటిస్తున్నది. మరోవైపు విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో మోడీ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట బాగా దిగజారిందని లండన్‌కు  చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. కొవిడ్-
19 రెండో దశ విజ్బంభణకు సంబంధించి ముందుగానే నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదని, తమ బాధలు, ఇబ్బందుల పట్ల ప్రధాని మోడీ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ఇలా పలు విదేశీ పత్రికలు సంపాదకీయాలు రాశాయి. మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత, కార్పొరేట్ అనుకూల, మతతత్వ విధానాలపై సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు చేయడం ద్వారానో లేదా ఇతరులు చేసిన పోస్టులను ‘షేర్ చేయడం ద్వారానో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. పౌరులు, ప్రజాస్వామ్య హితులు సమాజ శ్రేయస్సు కోరి ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాలపై పాలకుల నిర్ణయాల మీద నిర్భయంగా అభిప్రాయాలను ప్రకటించడానికి ఇప్పుడు సామాజిక మాధ్యమం ఒక్కటే అనువైన వేదికగా ఉంది.



పత్రికలు, ఎలక్షానిక్ మీడియా పాలకుల అదుపాజ్ఞల్లోకి మరింతగా జారిపోతున్నాయనే అభిప్రాయం గట్టిపడుతున్న నేపథ్యంలో
ప్రజలు సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయించడం అనివార్యమైపోయింది. ఇవాళ భిన్నభావాలు సంఘర్భించి, వికసించడానికి వేదిక కల్పిస్తున్న సామాజిక మాధ్యమాలు ప్రపంచ జీవితాలతో విడదీయలేని భాగాలయ్యాయి. అయితే మోడీ సర్కార్ ఈ సోషల్ మీడియాలో పోస్టులు, ఇమేజ్ల రూపంలో వస్తున్న విమర్శలను చూసి బెంబేలెత్తుతోంది. దేశంలో కొవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వరుస కడుతున్నాయి. ట్విట్టర్లో మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుమార్లు విపరీతమైన ట్రెండింగ్ కూడా నడిచింది.



ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ష్లాట్ఫాంలలో నెటిజన్లు పెట్టే పోస్టులు, వారి అభిప్రాయాలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం ఇటీవల కొత్త ఐటి (ఇంటర్మీడియారీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021 తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో నెటిజన్లు ఏం పోస్టు చేయాలి అన్న దానిపై ప్రభుత్వం ఈ నియమాల ద్వారా ఏకపక్ష నియంత్రణ విధించినట్లవుతుంది. ఈ చట్టం ప్రకారం నడుచుకోకుంటే అయా మాధ్యమ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరిస్తోంది. భావ ప్రకటనా స్వేచ్ఛ‌ను హరించేలా, ప్రభుత్వం పైన పెరుగుతున్న అసమ్మతిని అణచివేసేలా ఈ నిబంధనలు ఉన్నాయి. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛ‌గా పంచుకునేందుకు, తమకు నచ్చిన భావాలను వ్యక్తీకరించేందుకు అనుసంధాన వేదికలు (ఇంటర్మీడియరీస్)గా వ్యవహరిస్తున్న ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకు ఇన్నాళ్లూ రక్షణగా ఉన్న ఐ.టి చట్టంలోని పలు నిబంధనలను సవరించి కొత్త నియమావళిని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 25న విడుదల చేసింది. వాటి అమలుకు 3 నెలల గడువు ఇచ్చింది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుడి గోష్యత హక్కుకు భంగం వాటిల్లుతోందన్నది వేరే చెప్పనవసరం లేదు.



స్వతంత్ర భావ ప్రకటన వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు దేశంలో మూతపడబోతున్నాయా? అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ కొనసాగినా వాటి ద్వారా అభిప్రాయాలు ప్రకటించుకోడానికి, ప్రస్తుతం అనుభవిస్తున్న స్వేచ్ఛ‌కు విఘాతం కలగనున్నదా? మే 26 నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త సమాచార సాంకేతిక నిబంధనలు ఈ ప్రశ్నలకు తావు కల్పిస్తున్నాయి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఈ సంస్థలేవీ ఇంతవరకు ప్రభుత్వానికి తెలియజేయలేదు. మేనేజింగ్ సంస్థ వాట్సాప్ ప్రభుత్వ నిబంధనలపై ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. తమ వేదికలపై ప్రసారమయ్యే చాట్లు, సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క దానిపైనా నిఘా ఉంచాల్సి ఉంటుందని, అది ప్రజల గోప్య‌త‌ హక్కును కాలరాస్తుందని వాట్సాప్ అభిప్రాయపడుతున్నది. ఈ వాదనతోనే అది కోర్టురెక్కింది.



నూతన చట్టం వార్తలు పంపే వ్యక్తికి మాత్రమే తెలిసే (ఎండ్ టు ఎండ్ ఎన్క్రిష్పన్) ప్రస్తుత ఏర్పాటుకు విఘాతం కలిగి జోక్యందారీ విధానం నెలకొంటుందని ప్రజలు అందోళన చెందుతున్నారు. బ్రిటీష్ వలసవాదుల నుండి అధికార మార్చిడి జరిగి, రాజ్యాంగ రూపకల్పన జరిగి 1950 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన రాజ్యాంగం 19 (1)(ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ఖావ ప్రకటన స్వేచ్ఛ‌ను ప్రసాదించింది. భావ ప్రకటన స్వేచ్ఛ‌కు సంబంధించి రాజ్యాంగ మొదటి సవరణ 1951లో జరిగింది. సహేతుక పరిమితులు ఉండాలన్నది ఆ సవరణ సారాంశం. గత ఏడు దశాబ్దాలుగా తెలుసుకునేందుకు ప్రజలకు గల హక్కును అహేతుకంగా తొక్కి పట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించిన ప్రతిసారి న్యాయ వివాదాలు రాజు కొంటూనే ఉన్నాయి. డిజిటల్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమ వేదికల్ని కఠిన నిబంధనల చట్రంతో బిగించి బందించేలా ఐటి చట్టంలోని 69-ఎకి కఠిన నిబంధనల కోరలు తొడిగి, సుతిమెత్తనైన పర్యవేక్షణ యంత్రాంగం పేరిట డిజిటల్ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛ‌ను హరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం అప్రజాస్వామికం, దారుణం.



సామాజిక మాధ్యమాల్లో విశృంఖలత్వాన్ని అదుపు చేసే నెపంతో మీడియా స్వేచ్ఛ‌కు గల రాజ్యాంగ రక్షణల్ని కేంద్రం తోసిపుచ్చజాలదని ఎడిటర్స్ గిల్డ్ లోగడే ఆక్షేపించింది. డిజిటల్ వార్తావేదికలకూ విస్తరించిన సంప్రదాయ టివీ వార్తా ప్రసార మాధ్యమం ఇప్పటికే తగు కట్టుబాట్లకు లోబడి ఉన్నందువల్ల దాన్ని కొత్త ఐటీ నిబంధనల నుంచి మినహాయించాలని ఎన్విఏ తాజాగా విజ్ఞప్తి చేసింది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని నిలువరించడం వంటి కఠిన నిబంధనలు మీడియా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ‌కు గొడ్డలి పెట్టుగా మారతాయనీ అందోళన వ్యక్తీకరిస్తోంది. వార్తా ఛానళ్లలో ప్రసారాలకు ‘కంటెంట్ కోడ్” పేరిట లక్ష్మణ రేఖ గీయడానికి పుష్కర కాలం క్రితం యూపీఏ సర్మారు ప్రయత్నించి భంగపడింది. భావితరం మీడియాగా ఎదిగొచ్చిన డిజిటల్ ప్రసార మాధ్యమాల నియంత్రణ యత్నం పూర్తిగా అనుచితం, అప్రజాస్వామికం. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో సమ్మతిని తెలుపడానికి ఎంత హక్కుంటుందో, అసమ్మతిని తెలుపడానికి కూడ అంతే హక్కు ఉంటుంది.



ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛ‌గా పంచుకునేందుకు, తమకు నచ్చిన భావాలను వ్యక్తీకరించేందుకు అనుసంధాన వేదికలు (ఇంటర్మీడియరీస్)గా వ్యవహరిస్తున్న ఫేస్‌బుక్‌,  ట్విట్టర్, వాట్స్యాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకు ఇన్నాళ్లూ రక్షణగా ఉన్న ఐ.టి చట్టంలోని పలు నిబంధనలను సవరించి కొత్త నియమావళిని కేంద్ర ప్రభుత్వం మే నెల 26 నుంచి అమలులోకి తెచ్చింది. వాస్తవానికి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను  ఈ ఏడాది ఫిబ్రవరి 25నే ప్రభుత్వం జారీ చేసింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా సామాజిక మాధ్యమాలకు మూడు నెలలు గడుపునివ్వడంతో అవి ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. నిజానికి వీటి వల్ల నష్టపోయేది సామాజిక మాధ్యమాలు కాదు… వాటిని వినియోగిస్తున్న కోట్లాది మంది భారతీయులేనన్నది మనం గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ‌ను హరించడమే తప్ప సామాజిక మాధ్యమాలను అడ్డుకోవడం కాదన్నది సుస్పష్టం.



మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నియమాలు సామాజిక మాధ్యమాల వేదికలపై ఎటువంటి అవరోధం లేకుండా సాగుతున్న సమాచార ప్రవాహానికి అడ్డు కట్టలు వేస్తాయి. ప్రభుత్వానికి ఇష్టం లేని వాటిపై కత్తెర పడేలా చేస్తాయి. ప్రింట్, ఎలక్షానిక్ మీడియాలకు మాదిరిగానే సెన్సార్ షిప్ విధానం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వంపై అభ్యంతరం తెలిపే మెసేజ్లను, సమాచారాన్ని తొలగించి తీరవలసిన ఆగత్యాన్ని కలిగిస్తాయి. ఇవి ప్రజల మానవ హక్కులకు భంగం వాటిల్లజేసి అమాయకులను జైళ్లకు పంపించే పరిస్థితిని దాపురింప చేస్తాయని వాట్సాప్ చేస్తున్న వాదనను కొట్టి పారేయడానికి వీల్లేదు. కొత్త నియమాలతో ఈ వేదికలు ఫిర్యాదుల విభాగాలను నెలకొల్బవలసి ఉంటుంది. పత్రికల్లో, ఎలక్షానిక్ మీడియాలో ప్రచురణకు, ప్రసారానికి నోచుకోని అభిప్రాయాలను ప్రజలు ప్రస్తుతం ఈ మాధ్యమాల ద్వారా యధేచ్ఛ‌గా ప్రకటించుకుంటున్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద గాని, వాటి వైఖరుల మీద గాని, ప్రపంచంలోని అన్ని స్థాయిల్లో ఉత్పన్నమయ్యే పరిణామాలపై గాని మనసు విప్పి నిర్మాహమాటంగా వ్యాఖ్యానం చేయగలుగుతున్నారు.



ఇంటర్నెట్ వ్యాప్తి, స్మార్ట్ సెల్ ఫోన్ల వినియోగం విప్లవాత్మక స్థాయికి చేరిన తర్వాత సామాజిక మాధ్యమాల్లోని అభిప్రాయాలు ప్రజా ఉద్యమాలనే సృష్టించగలుగుతున్నాయి. సంప్రదాయ మీడియాలో రాకముందే సమాచారం అత్యంత తాజాగా సోషల్ మీడియాకు ఎక్కుతున్నది. మంచి చెడుల చర్చ లోతుగా జరుగుతున్నది. విజ్ఞాన తాత్వికాది అంశాల లోతుల పరిశీలన సాగుతున్నది. ఖాతాదార్లు తమసృజనాత్మక పాటవాన్ని ప్రదర్శించుకోగలుగుతున్నారు. మహిళలు, అణగారిన సామాజిక వర్గాల వారు ఈ వేదికలను నిర్భయంగావినియోగించ గలుగుతున్నారు. వీటిపై సెన్సార్ షిప్ అమలైతే ఏమి చెబితే ఏ ముప్పు ముంచుకొస్తుందో, ఏ అర్ధరాత్రి ఏ పోలీసులుతలుపు కొడతారో అనే భయం వీటి వినియోగదారులను ఆవహిస్తుంది. ఈ మాధ్యమాలు ప్రాధాన్యతను కోల్పోయి సోషల్ మీడియా కాస్తా ఈగలు తోలుకునే వ్యవస్థగా మారిపోనుంది.



ఇంటర్నెట్‌లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఆశ్లీలత, విద్వేషం వంటి చెత్త చాలానే ఉందనడంలో ఎవ్వరికీ అనుమానం అక్కర్లేదు. వాటిని నియంత్రించే విషయంలో ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ అది ఒక స్వతంత్ర సంస్థ ద్వారా జరగాల్సి ఉంటుందన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడమే దుర్మార్గం. ఇటువంటి వార్తలను స్వతంత్ర సంస్థ లేదా న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోనే జరుగాలి. ప్రజల భావాలను వ్యక్తీకరించే మాధ్యమాలపై (అది సినిమా అయినా, లేదా కళా రూపమైనా, ప్రింట్ ఎలక్షానిక్ లేదా డిజిటల్ మీడియా ఏదైనా సరే) నేరుగా ప్రభుత్వమే ‘సెన్సార్‌షిప్‌కు దిగి పెత్తనం చెలాయించడమంటే ఖచ్చితంగా అది భావ ప్రకటన స్వేచ్ఛ‌పై దాడి దాడి చేయడమే అవుతుంది. అలాంటి ప్రభుత్వం ఉన్నచోట ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే. విద్వేష ప్రసంగాలను, సోషల్ మీడియాలో అబద్ధాల్ని విరివిగా ప్రచారం చేస్తున్నది సంఘ పరివార్ శక్తులే. ప్రభుత్వ అనుకూల వ్యక్తులే. ఇదెలా ఉందంటే దొంగే ‘దొంగ దొంగ” అన్న చందంగా ఉంది. అందువల్ల ఐ.టి నిబంధనలు అనేవి సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం తీసుకొచ్చినవి కావని, వాటిలో వ్యక్తమయ్యేప్రజల భావాలను అణచివేయడమే అసలు లక్ష్యమన్న సంగతి ప్రజలు గమనంలో ఉంచుకొని ఈ నిరంకుశ నిబంధనలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 
ఇప్పటికే గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌,  ట్విట్టర్, ఆపిల్, మైకోసాఫ్ట్, రిలయన్స్ వంటి డిజిటల్ గుత్తాధిపత్య సంస్థలు మన డేటాను సేకరించి, దాన్ని డబ్బుగా ఆర్జించే వ్యాపారాన్ని జరుపుతున్నాయి. మన వివరాలు, అభిరుచులు, అభిప్రాయాలు, ఇతరులతోజరిపిన సంభాషణలను వంటి డేటాను సరుకుగా మార్చేసి ఇతరులకు వారి అవసరాల దృష్ట్యా అమ్ముతున్నాయి. బిజెపి ప్రభుత్వం నూతననిబంధనల ద్వారా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫాం  వినియోగదారుల డేటాను కొల్లగొడుతోంది. ఇది సమాచార దోపిడీకాకుంటే మరేంటి. నిజానికి నియంత్రణ అనేది పౌరుల ప్రాథమిక హక్కు అయిన గోప్యతను పరిరక్షించే విధంగా ఉండాలి. మనప్రజాస్వామ్య ప్రక్రియలో ఎటువంటి జోక్యాన్నైనా నిరోధించేదిగా ఉండాలి. అయితే ఈ అందోళనలకు ఎటువంటి పరిష్కారం చూపకపోగా , వివిధ ప్లాట్‌ఫాంల‌లో  పోస్ట్ చేసిన సమాచారంపై కఠినమైన నియంత్రణను విధించడం మాత్రమే కొత్త నిబంధనల ఉద్దేశ్యంగా ఉంది. స్వతంత్ర జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, ఏవైనా భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే వారిని లక్ష్యంగాచేసుకోవడానికి, అసమ్మతిని అణిచివేయడంలో సోషల్ మీడియా సంస్థలు, ప్రభుత్వానికి సహకరించే ఒక ‘ఫ్రేమ్‌వ‌ర్క్‌ ఇస్తోంది.



రాజ్యాంగ బద్ధమైన ఖావ ప్రకటనా స్వేచ్ఛ‌కు సంబంధించిన అత్యంత కీలక చట్టంలోని నిబంధనలు సవరించాలంటే అది మంచికైనా చెడుకైనా పార్లమెంటు ద్వారానే జరగాలి. కానీ మోడీ సర్కార్ దొడ్డిదారిన ఒక నోటిఫికేషన్ జారీ చేసి కొత్త నిబంధనావళిని తీసుకొచ్చేసింది. దీని ద్వారా ప్రభుత్వానికి నిరంకుశ అధికారాలు దఖలు పడతాయి. ఇష్టానుసారం సెన్సార్షిప్ చేయడానికి వీలుంటుంది. విచారణ లేకుండా అనుమానితులను శిక్షించే వ్యవస్థ ఏర్పడుతుంది. సమాచార, సాంకేతిక చట్టం పరిధిలోనే తాము ఈ నిబంధనలు తీసుకొచ్చామని మోడీ సర్కార్ చెబుతున్నా ఐ.టి చట్టం పరిధికి మించి ఈ నిబంధనలు ఉన్నాయన్నది యధార్థం. ఐ.టి. నిపుణులు, న్యాయ కోవిదులు వ్యక్తం చేస్తున్న ఆందోళన కూడా ఇదే. కొత్త నిబంధనల పరిధి చాలా విస్తృతంగా కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాలతో పాటు డిజిటల్ మీడియాకూ ఈ నిబంధనవాళి వర్తించనుంది. అసలు మోడీ సర్కార్ ప్రధాన లక్ష్యం అదే. దవైర్, న్యూస్ క్లిక్, ఆల్ట్ న్యూస్, సోల్ ఇన్ వంటి ప్రత్యామ్నాయ వార్తా సంస్థలన్నీ కూడా డిజిటల్ మీడియా వేదికగానే నడుస్తున్నాయి. ఇవి ప్రజా గళాన్ని వినిపిస్తూ మోడీ సర్కార్కు చుక్కలు చూపిస్తున్నాయి. అందుకనే దవైర్, న్యూస్ క్లిక్ లాంటి సంస్థలపై ఐ.టి దాడులకు కూడా తెగబడిన సంగతి విదితమే.



ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం, వాటితో విభేదించడం పౌరుల  ప్రాథమిక హక్కు ఈ చట్టం ప్రభుత్వ ప్రయోజనాలకు లోబడిలేని వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు, వారిని అరెస్టు చేసేందుకు ఉపయోగపడే సాధనంగా ఉంది. పౌరులు పెట్టే పోస్టులపై నిఘాతో పాటు ‘సెన్సార్షిప్ విధించేటటువంటి రెండు ప్రధానమైన లక్ష్యాలతో ఈ నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధల ప్రకారం… సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదులను పరిశీలించేందుకు గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్లను, ప్రభుత్వ దర్యాప్త సంస్థలతో సమన్వయం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను, ఐ.టి. నిబంధనలను పాటిస్తున్నదీ లేనిది పర్యవేక్షించేందుకు కాంప్లియన్స్ ఆఫీసర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. వాట్స్యాప్ లాంటి మెసేజింగ్ సంస్థలు అయితే ప్రభుత్వం అడిగిన ప్రతిసారీ ఏదైనా ఒక మెసేజ్ తొలుత ఎక్కడ పోస్టు చేశారనేది… ఆ తర్వాత అది వ్యాప్తి చెందిన క్రమాన్ని సమగ్రంగా అందజేయాల్సి ఉంటుంది.



వాస్తవానికి సందేశాలు అనేవి ప్రజల గోప్యతకు సంబంధించినవి. సామాజిక మాధ్యమాల్లో ఈ గోప్యతకే భంగం వాటిల్లుతోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. వాట్స్యాప్, ఫేస్‌బుక్  వంటి సంస్థలు ప్రజల సమాచారాన్ని ఎన్నికల అవసరాలకు రాజకీయ పార్టీలకు, వ్యాపార సంస్థలకు అమ్మేస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు దానికి తోడు ప్రభుత్వమే నేరుగా ప్రజల సందేశాల్లోకి తొంగి చూసే ఏర్పాటు ఈ సామాజిక మాధ్యమాలు చేయాలన్నమాట. ఇంతకంటే నీచమైన ఎత్తుగడ మరోటి ఉంటుందా? భారత దేశంలో గల బహుళ సామాజిక వ్యవస్థకు, బిజెపి పాలకుల హిందూత్వ అధిపత్యానికీ మధ్య వైరుధ్యాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నియమాలు దేశంలో స్వేచ్ఛాయుత చర్చను బలి తీసుకుంటాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం, వాటితో విభేదించడం పౌరుడి ప్రాథమిక హక్కు ఈ చట్టం ప్రభుత్వ ప్రయోజనాలకు లోబడిలేని వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు వారిని అరెస్టు చేసేందుకు ఉపయోగపడే సాధనంగా ఉంది. అందుచేత ప్రజాస్వామిక ‘స్వేచ్ఛ‌లను గౌరవిస్తూ సామాజిక మాధ్యమాల మీద ప్రయోగించే కాఠిన్యతను కేంద్ర ప్రభుత్వమే సహేతుక స్థాయికి సడలించుకోవలసి ఉంది. అందుకు పౌర సమాజం ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావాల్సి ఉంది.

Leave a Reply