(జనవరి 10 , 1985 గద్వాల విరసం సాహిత్య పాఠశాల ప్రసంగ పాఠంలోంచి కొంత భాగం – వసంత మేఘం టీం )
…ఐతిహాసిక , పౌరాణికాంశాలను వదిలి, చరిత్రలో మధ్యయుగాలకు సంబంధించిన మతపరమైన యుద్ధాలకూ మారణదారుణాలకూ వస్తే, వాటి కారణాలు కేవలం మతంలోనే లేవని తేలుతుంది. మతసంస్థలకు చెందిన ఆస్తిపాస్తుల విషయంలో, రాజపోషణవల్ల సమకూరే శుద్ధభౌతిక సదుపాయాల విషయంలో, భూస్వామిక సమాజంలోని హెచ్చుతగ్గుల విషయంలో వచ్చిన సామాజికమైన పోటాపోటీలు మత విరోధాల రూపం పొందిన సందర్భాలు ఒకటీ రెండూ కాదు. బ్రాహ్మణ మతం ఎన్నడో గతించిపోగా, బౌద్ధాన్ని చావగొట్టిగానీ చచ్చుపార్చిగానీ హైందవం తన ప్రాబల్యం స్థాపించుకున్న తర్వాత గూడా, బౌద్ధులకూ జైనులకూ, బౌద్ధ-జైనులకూ శైవులకూ, శైవులకూ వైష్ణవులకూ వచ్చిన కలహాలన్నింటికీ భౌతికమూలాలను చూపవచ్చు. వీరశైవం, శ్రీవైష్ణవం, ప్రధానంగా భూస్వామ్యవర్గంలోని భిన్నశ్రేణుల మధ్య సాగిన వర్గకలహానికి, మతపరమైన మతరూపం పొందిన లౌకిక స్పర్ధే మూలకారణం.
ఇస్లాం ఈ దేశానికి వచ్చి రాజ్యాధికారం పొందిన తర్వాత, మతవిభేదాల నటుంచి చూస్తే మతాంతరీకరణలన్నీ కూడా కేవలం మతదృష్టితో జరిగినవేనని చెప్పడానికి వీలులేదు. పాలకవర్గమతానికి అనితరమైన, లౌకిక విషయపరమైన అధికారమూ ఆకర్షణా ఉండడం సహజమేగాని, విపరీతమేమీ కాదు. బలప్రయోగంద్వారా మతాంతరీకరణ జరిగినంత ఎక్కువగా, సమ్మతివల్ల జరగక పోయివుండవచ్చు. అయితే సింధుప్రాంతంలో నిరుపేద రైతాంగంగానీ, చాతుర్వర్ణానికిగూడా వెలిబడి వుండిన అస్పృశ్యజనంగానీ, చివరకు ఏకేశ్వరభావానికి మనసైన సంపన్న హిందువులు సైతం, ముస్లిములుగా మారారు. గజనీ మొహమ్మద్ దండయాత్రలన్నీ కేవలం విగ్రహారాధనకు కేంద్రాలైన హిందూ దేవాలయాలను ధ్వంసం చెయ్యడానికి మాత్రమే జరగలేదు. ఎంతో విలువైన భౌతికసంపదకు కేంద్రాలుగా అవి అతని దాడినీ దోపిడీనీ ఆకర్షించాయి. సోమనాధ్ విగ్రహాన్ని ముసలంతో కొడితే వజ్ర వైడూర్యాలు రాలిపడినమాట అబద్ధంకాదు.
క్రీ.శ. 13వ శతాబ్ది ప్రారంభంలో ఢిల్లీ కేంద్రంగా సుల్తానుల పరిపాలన మొదలైనప్పటినుంచి క్రీ.శ. 19వ శతాబ్ది మధ్యకాలానికి మొగల్ సామ్రాజ్యం తుడిచిపెట్టుకు పోయేంతవరకూ సాగిన ముస్లిం పరిపాలనలో, రాజులంతా మతోన్మాదులనడం చరిత్రకు అపచారం. హిందూవనితలను పెళ్ళాడిన ముస్లిం రాజులకు పుట్టిన బిడ్డలే తదితరులకంటె చాలా తీవ్రమైన అసహనవైఖరి ప్రదర్శించిన సందర్భాలు, ఫిరోజ్ తుగ్లక్, షాజహాన్ వగైరాల విషయంలో కనిపిస్తాయి. గుడ్డిలో మెల్ల మేలన్న చందంగా, ముస్లిం మతాధిపతుల పట్టును విదిలించివేసి ఉన్నంతలో, ‘లౌకిక’ దృష్టిని ప్రదర్శించిన అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, షేర్షా నూర్, అక్బర్ వంటి సుల్తానులూ పాదుషాలూ – కొందరు తమ రాజ్యాధికార విస్తరణలో దండయాత్రలకుగానీ సైనిక చర్యలకుగానీ మతాన్ని ఒక లౌకిక సాధనంగా వాడుకొంటే, మరికొందరు కొంతవరకు మతసామరస్యదృష్టి ప్రదర్శించారు. అక్బర్ స్థాపించిన ‘దీన్ ఇలాహీ’ అనే రాజమతం కేవలం రాజకీయ సమైక్యతను ఏర్పరచడానికి సాధనమేగాని, మతసామరస్య దృక్పథాన్ని బట్టి మాత్రమే కాదు. చివరికి ఔరంగజేబు సైతం, చరిత్రకారులు చిత్రించినంత ఘోరమైన హిందూమత ద్వేషి కాదనీ, వాస్తవానికి హిందూ దేవాలయాల వంటి మత సంస్థలకు భూరిదానాలు కూడా చేశాడనీ, ఇటీవలి పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. అయితే, రాజ్యాధికారం చేజారి పోయింది. కాబట్టి, సామాజికంగా హిందువులలో సంపన్నుల గౌరవ ప్రతిష్టలు కూడా కొంతమేరకైనా తగ్గిపోక తప్పిందికాదు. కాని, పరిపాలనా యంత్రాంగంలో అనేకానేకులు క్రింది శ్రేణులలోనైనా వుండకతప్పలేదు. మతం మార్చుకున్నవారైతే, మాలిక్ మక్బూల్‌లాంటి వ్యక్తి ఫిరోజ్‌తుగ్లక్‌కు ప్రధాని కాగలిగాడు. చమార్‌గా వుండిన మాలిక్ కపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి కాగలిగాడు. ఇక, విద్యా విజ్ఞానాల విషయంలో, కళలో, శాస్త్రంలో, కడపటికి మతతత్వంలో కూడా ఆదానప్రదానాలే ఎక్కువ. మత సామరస్యాన్ని ఆశించి కొందరు ప్రజానీకంలో భక్తికవులుగా ప్రఖ్యాతికి వచ్చి తమతమ పంథాలకు ఆద్యులైతే, మరికొందరు హైందవ వేదాంతానికీ ఇస్లామిక్ సూఫీతత్వానికీ స్నేహవారధులు నిర్మించినవారయ్యారు. సామాజికమైన హీనావస్థను మత పరిభాషలో పలికించినవారూ ఉన్నారు. భక్తిపారవశ్యంలో యీ హెచ్చుతగ్గులను తాము మరిచి ఇతరులచేత మరిపింపజేసేందుకు ఉపయోగపడిన వారూ ఉన్నారు. సైన్యపరమైన భూస్వామికవ్యవస్థ రూపాంతరంలో, మొదట సామంతుల హోదాలో మన్సబ్‌దారీ విధానంలో హిందువులు – రాజపుత్రులే ఎక్కువ కావచ్చు – ముఖ్యస్థానాలు పొందడమే గాక, పరిపాలనలో ముస్లిం ప్రభువులకు తోడ్పడిన తోడర్‌మల్ లాంటివారు, యుద్ధంలో తోడ్పడిన రాజామాన్‌సింగ్, మీర్వా రాజా జయసింగ్, జస్వంత్‌సింగ్ వంటివారూ ఉన్నారు. అంటే, ముస్లిం పరిపాలన కేవలం ప్రత్యేక మతవర్గ సిద్ధాంతం మీదనే సాగలేదన్నమాట, కృష్ణదేవరాయలుగానీ, శివాజీగానీ, రంజిత్‌సింగ్‌గానీ ముస్లిములను తమ సైన్యంలో చేర్చుకోలేదా, వారికోసం మసీదులు కట్టించలేదా, వారిని పెద్ద పదవులలోకూడా నియమించలేదా ?మతంకంటె రాజకీయం, అంటే ఆర్థిక ప్రాబల్యం హిందూరాజులనుగానీ ముస్లిం రాజులనుగానీ ఎక్కువగా ఆకర్షించిన అంశం. పాలకవర్గం తన సంస్కృతినీ భావజాలాన్నీ పాలితులందరిమీద నేరుగానో మరోవిధంగానో మోపడం ముస్లిములతోనే మొదలు కాలేదు. ముస్లిములతోనే అంతంకాలేదు.
మతవర్గతత్వానికీ మతానికీ నేరుగా సంబంధం వుండవలసిన ఆగత్యమేమీ లేదని సారాంశం.
3
బ్రిటీష్ వలసాధిపత్యం తన స్వార్ధానికి సృష్టించిన ‘విషకన్య’ పేరే మతవర్గతత్వం, కంపెనీ రాజకీయాధికార విస్తరణను సంకల్పపూర్వకంగా, విస్తృత పథకం ప్రకారం, ఎదుర్కొని పోరాడి మరణించిన టిప్పుసుల్తాన్ తొలి స్వాతంత్య్ర యోధుడు. నామకార్థంగానైనా కొసప్రాణంతో కొనసాగుతూ వచ్చిన మొగల్ సామ్రాజ్యాన్ని దాదాపు ఆరు వందల సంవత్సరాల కాలం పరిపాలక వర్గంగా దర్జా ననుభవించిన ఇస్లాం మతస్థులలో పైశ్రేణిని పడేసి కిందికి తోసి పైకి వచ్చిన కంపెనీ దొరతనం, పీష్వాలనుగానీ రాజాలనుగానీ మన్ననచేసి విడవలేదు. క్రైస్తవ మతవ్యాప్తి దృష్టితో మాత్రమే ఈ దురాక్రమణ, పరాయి పరిపాలన సాగలేదు. 1857 నాటి పోరాటంలో ముస్లిములు మాత్రమే పాల్గోలేదు. ఔధ్, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాలలో భూస్వామ్యవర్గంలో ఒక భాగం తన స్వార్థం కొద్దీ ప్రముఖపాత్ర వహించినా, ఇతర కారణాలతోటి ప్రజలు కూడా కదిలి కలిసివచ్చారు. అరేబియాలో మొదలైన వహాబీ ఉద్యమం ప్రభావం వల్ల మన దేశంలో సయ్యద్ అహమ్మద్ నాయకత్వాన వలియుల్లాహీ ఉద్యమం వాయువ్య సరిహద్దు ప్రాంతంలో సాయుధ పోరాటరూపం ధరించి, అన్యమతస్థులు పరిపాలిస్తున్న రాజ్యాన్ని (దరుల్ హర్బ్) ముస్లిములు పాలించే రాజ్యంగా (దరుల్ ఇస్లామ్) మార్చాలనే సంకల్పంతోటి బీహార్ కేంద్రంగా దక్షిణాదిలో మచిలీపట్నందాకా గూడా హెచ్చుతగ్గులతో విస్తరించి బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వాన్ని గజగజలాడిరచింది. తూర్పు బెంగాల్‌లో నిరుపేద ముస్లిం రైతాంగం టిపూ నాయకత్వాన ప్రారంభించిన ఫలైజీ ఉద్యమం సైతం ఆంగ్రేజీ సర్కార్‌కు కొంతకాలం పక్కలో బల్లెమయింది. 1857 పోరాటంలో విజయం లభించి వుంటే బహదూర్‌షా ఆలమ్‌ను మళ్ళీ మొగల్ పాదుషాగా ప్రకటించాలనే సంకల్పం కొందరికి లేకపోలేదు. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్న బ్రిటీష్ వలసాధిపతులకు మొదట్లో ముస్లిములంటే భయం, వారి రాజభక్తి గురించి సంశయం, బలంగా వుంటూ వచ్చాయి. ముస్లిములు మళ్ళీ పైకి రాకుండా వుండేందుకు హిందువులనే వాళ్ళు బాగా దగ్గరకు తీస్తూ వచ్చారు. మతవర్గ తత్వానికి ఇది నాంది.
దీనికి పరోక్షంగానైనా అసంకల్పితంగానైనా తోడ్పడిరది హిందువులే. ‘జాతీయ పునర్వికాసం’ (రినేజాన్స్) అనబడే దశలో, హిందువుల పునర్వికాసమే లక్ష్యంగా వుండిరదిగాని, ముస్లిములది కాదు. స్వయంగా అరబ్, పార్శీ భాషలు నేర్చి ఇస్లాం మతానికి మూలమైన ఏకేశ్వరభావాన్ని గ్రహించిన రామ్‌మోహన్‌రాయ్ తన బ్రహ్మసమాజ్ ద్వారా ఉపనిషన్మహా వాక్యమైన, ‘ఏకమేవా 2 ద్వితీయమ్ బ్రహ్మను పునరుద్ధరించాడు. ఇంకా వెనక్కుమళ్ళి దేవేంద్రనాథ్ ఠాకూర్ ‘మహర్షి’ అనిపించుకోగా క్రైస్తవ మత పద్ధతులకు మనసుపడిన కేశవ్‌చంద్రసేన్ ‘బ్రహ్మానంద’ అనిపించుకున్నా, ప్రాచీన హైందవానికి దూరమౌతున్నాడనే భావం కలిగించిన ఫలితంగా బ్రహ్మసమాజ్ చీలికకు కారణమయ్యాడు. ఇక ఆర్యసమాజ్ పేరుతోటి స్వామీ దయానంద సరస్వతి వేద ప్రామాణ్యాన్ని తప్ప తక్కిన దేన్నీ ఆమోదించనని భీష్మించి ‘సత్యార్థ ప్రకాశిక’ రాశాడు. బ్రిటీష్ పరిపాలక వర్గంలోనే ఉన్నతాధికారులు ప్రాచ్య భాషాసాహిత్యాలపట్ల విశేషమైన శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తూ, ‘ఓరియంటలిస్ట్‌స్’గా పైకి వచ్చి భగవద్గీత మొదలు ఋగ్వేదం వరకు మత గ్రంథాలనూ అభిజ్ఞానశాకుంతలం వంటి సాహిత్య గ్రంథాలనూ అనువదిస్తూ, ఆధునిక శాస్త్ర విద్యను మనకు అందజేయనివ్వని విధంగా, సంస్కృత ‘భాష’ పట్ల విపరీతమైన గౌరవం చూపెట్టడంలోని కౌటిల్యాన్ని రామ్‌మోహన్‌రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎండగట్టి ప్రతిఘటించారు. దివ్యజ్ఞానసమాజం వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించి, గతమంతా ఘనమనే వెనుకచూపును బలంగా కలిగించింది. ఈ సంస్కరణోద్యమాలకన్నిటికీ ముస్లిములు వెలిబడి వుండడమేగాక, చింతచచ్చినా పులుసు చావని విధంగా, ఆధునిక, ఆంగ్లేయ శాస్త్ర విద్యకు పూర్తిగా పెడమొగమై, బ్రిటీష్ ప్రభుత్వ సేవకు గల అవకాశాలనన్నిటినీ కంటగించుకుంటూ, ఇంకా మతపరమైన మధ్యయుగీన మనస్తత్వంతోటి హిందువులకు సమవుజ్జీలు కాలేకపోయారు.
అయితే, ఆంగ్ల విద్యావంతులైన హిందువులలో క్రమంగా జాతీయభావాలు అమరించడం, వృద్ధిపొంది కాంగ్రెసుసంస్థ స్థాపనగా పరిణమించడం గమనించిన ఇంగ్లీషు వాళ్ళు కొందరు, మాన్‌స్టువర్ట్ ఎల్‌ఫిన్‌స్టన్, లార్డ్ మేయో వగైరా, హిందువుల మూలంగా తమ దొరతనానికి మూడగల ముప్పును సకాలంలో నివారించేందుకు ముస్లిములను మచ్చిక జేసుకుని పైకి తీసుకురావడ మొక్కటే మార్గమని భావించడం మొదలుకావడంతోటి, మైనారిటీ మతవర్గతత్వానికి అంకురార్పణ జరిగింది. ‘ఎదురు తూకం విధానం’ చేబట్టుతూ, ముందుగా పాలిత జనంలో ముస్లిముల దయనీయస్థితిని వర్ణిస్తూ సర్ విలియమ్ హంటర్ 1893లో ‘ది ఇండియన్ ముసల్మోన్స్’ అనే గ్రంథం రాశాడు. 1857 నాటి తిరుగుబాటు కారణాలు వివరిస్తూ ఒక గ్రంథం రాసిన మొగల్ పాదుషా ఆస్థానంలో మాజీ గుమస్తా సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ వంటి పెద్దమనిషి బుర్రలోకి హిందూవ్యతిరేక భావాలను దూర్చి, అలీఘర్‌లో ముస్లిం ఆంగ్లో – ఓరియంటల్ విద్యాసంస్థకు ప్రిన్సిపాళ్ళుగా ‘సీమ’ నుండి వచ్చిన థియోడర్ బెక్, ఆర్చిబాల్డ్ వంటి ఇంగ్లీషు వాళ్ళు, కాంగ్రెసు సంస్థ కేవలం హిందువుల సంస్థేనని నమ్మించి, రాజభక్తి పరాయణమైన యునైటెడ్ పేట్రియాటిక్ ఇండియన్ అసోసియేషన్ స్థాపనకూ కాంగ్రెసుపట్ల బద్ధవిరోధ భావానికి రంగం సిద్ధం చేశారు. ఇది కేవలం ముస్లిములకే పరిమితం కాలేదు. బెనారస్ మహారాజా శివప్రసాద్ కూడా దీనిలో ముఖ్యుడే. సర్ సయ్యద్ ముస్లిములను విద్యావిషయాలలో సంస్కృతి విషయాలలో పైకి తేవాలన్న సత్సంకల్పంతో ఇంగ్లీషునుంచి ఎన్నో గ్రంథాలను అనువదించేందుకు తర్జుమా సంస్థను స్థాపించడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదు సరిగదా, భారతదేశమనే వధువు ముఖ సౌందర్యానికి హిందువులు ఒక కన్ను కాగా ముస్లిములు మరొక కన్ను అని వర్ణించిన మనిషి వలసాధిపతుల బంట్ల దుర్బోధలు తలకెక్కించుకోక తప్పలేదు. అలాగే కలకత్తాలో జస్టిస్ అమీరలీ ముస్లిముల విద్యావిజ్ఞానవికాసానికి ఒక సంస్థను స్థాపించి ప్రచారంచేస్తూ కరాచీలో ఒక కళాశాలను నెలకొల్పాడు. అంటే స్వతహాగా వారిలో హిందూమత వ్యతిరేకత లేదని సారాంశం.
అయితే, ఆర్యసమాజ్ కార్యకలాపాలలో ముఖ్యభాగమైన ‘శుద్ధి’, తద్వారా అన్యమతస్థులను మళ్లీ హిందూమతానికి పరివర్తన ఒకవైపున జోరుగా సాగుతూంటే మరొకవైపున, హిందువుల పరమపవిత్రమైన గోమాతను వధించి దాని మాంసాన్ని సుష్టుగా ఆరగించే ‘ఆత్యాచారం’ పట్ల నిరసనగా ‘గోవధా నిషేధం’ కోరుతూ మహారాష్ట్ర ప్రాంతంలో హిందువుల, ముఖ్యంగా, పూనా చిత్పావన బ్రాహ్మణుల ఆందోళన వచ్చి జతగలిసి, హిందూ – ముస్లిం మతవర్గ తత్వాల విజృంభణకు అవకాశాలు కల్పించింది. ఈ రెండో అంశంలో బ్రిటిష్ ప్రభుత్వం హిందువుల మీద విరుచుకుపడి పూనా బ్రాహ్మణ వర్గానికి అప్పట్లో నాయకులనిపించుకున్న ‘నటూ సోదరుల’ను కఠినంగా దండిరచడం, 1897లో పూనాలో ప్లేగ్ వ్యాధి నిర్మూలన విషయమై బ్రిటిష్ ఉద్యోగులు విచ్చలవిడిగా సాగించిన ఆరోగ్యచర్యలవల్ల హిందువుల – ముఖ్యంగా – బ్రాహ్మణుల – మతాచారతత్వానికి ఘోరమైన అపచారం జరినట్లుగా దురుద్రేకాలను పెంచుకుని ఇద్దరు బ్రిటిషు సైనికాధికారులను వధించినందుకు ‘చాపేకర్ సోదరుల’కు ఉరిశిక్ష విధించడం – ఇలాంటివన్నీ హిందువులకు బాధ కలిగించాయి. ఈ పరిస్థితులలో తలెత్తిందే కాంగ్రెసులో ‘అతివాద’ ధోరణి.
పరాయిపాలన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన హిందూ సంఘ సంస్కరణకు వ్యతిరేకతతో బాటు, ‘సనాతన ధర్మం’ పేరిట హిందూ మతతత్పరతకూ జాతీయవాద రాజకీయానికీ మధ్య అభేద దృక్పథం ముఖ్యలక్షణాలుగా ఈ కాంగ్రెసు అతివాదులు, లేదా ‘జాతీయవాదులు’ తమ మత – రాజకీయ సమ్మేళనా ధోరణిని బంకించంద్ర ఛటర్జీ నుంచి పుణికిపుచ్చుకున్నారు. ‘ఆనంద్‌మఠ్’ నవల (1882) కంటె కనీసం ఆరేడేళ్ళ ముందు – 1875 లోనే – రచించి ఈ కుహనా చారిత్రక నవలలో దూర్చిన ‘వందేమాతరం’ గేయం, దేశాన్ని మాతృమూర్తిగానూ, మాతృమూర్తిని జగద్ధాత్రిగానే గాక అరిభయంకరమైన సాయుధమైన దేవతాశక్తి మూర్తిjైున కాళి,దుర్గ రూపంలోనూ ప్రశంసించింది. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం’ వగైరాల నటుంచి చూస్తే, ఈశక్తి ‘సప్తకోటి కంఠ కలకల నినాద కరాళే, ద్విసప్తకోటి భుజైద్ధృత ఖర కరవాలే’ అన్నప్పుడు గానీ, ‘బహుబలధారిణీం…. రిపు వళ వారిణీం’ అన్నప్పుడుగానీ ముస్లిం నవాబులను ఉద్దేశించినా అన్యాపదేశంగా కంపెనీ దొరతనాన్ని ఉద్దేశించినా, దాని హిందూత్వమే ముఖ్యం. పాశ్చాత్య సాహిత్యంతోటి తత్వధోరణులతోటీ గాఢమైన పరిచయం వుండీ, కోుట్ తత్వాన్నీ ఉపయోగితాతత్వాన్నీ మనస్సుకు పట్టించుకుని కూడా, బంకించంద్ర చటర్జీ అభినవ హైందవతత్వానికి ఆద్యుడయ్యాడు. ధర్మశాస్త్రాల ప్రామాణ్యాన్ని ప్రశ్నించినా, ధర్మాధికారాన్ని తలదాల్చాడు. ‘వందేమాతరం’ గురించి మొదట్లో ముస్లిములు అభ్యంతరం చెప్పలేదుగాని, మైనారిటీ మతవర్గతత్వం విజృంభించసాగిన కాలంలో మాత్రం దాన్ని కంటగించుకున్న మాట నిజం.
బంకించంద్ర ఛటర్జీకి భావవారసత్వం తీసుకున్న అరవిందఘోష్ అతివాద రాజకీయానికి సనాతన హిందూ మతతత్వాన్ని ఆపాదించడంలో బంకింను మించి పోయాడు. బంకిం ‘ఆనంద్‌మఠ్’ చాలనట్టుగా ‘భవానీ మందిర్’ భావం ప్రవేశపెట్టి మతాన్ని రాజకీయాన్ని కలగలిపాడు. బిపిన్‌చంద్రపాల్ దృష్టికి దేశ చరిత్ర మొత్తం పవిత్ర మాతృదేవి జీవిత చరిత్రగానే కనిపించింది. మహారాష్ట్ర ప్రాంతంలో రనడే, గోఖలే, అగార్కర్ వంటి వారి మీద కత్తి దూసి, సంఘ సంస్కరణకు విఘాతం కలిగించి పూనా బ్రాహ్మణబృందానికి తలలో నాలుకైన బాలగంగాధరతిలక్ గణేశ్ చతుర్థి ఉత్సవం వంటి వాటిని తన అతివాద రాజకీయ ప్రచారాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళే సాధనంగా తెలివిగా ఉపయోగించుకున్నా, దాని అంతిమ పరిణామాన్ని సరిగా వూహించలేదనే చెప్పాలి. బెంగాల్ రాష్ట్ర విభజన ఫలితంగా విజృంభించిన మొదటి గొప్ప రాజకీయోద్యమంలో అక్షయకుమార్ దత్తావంటి వాళ్లు చాలా కొద్దిమంది ముస్లిం రైతాంగాన్ని సైతం రంగంలోకి తీసుకురాగలిగినా, ముస్లిములకోసం ప్రత్యేకించి ఏర్పాటైన తూర్పు బెంగాల్ రాష్ట్రం ముస్లిములను అనేకులను సంతృప్తిపరిచింది. స్వదేశీ ఉద్యమంగా పిలువబడుతున్న వందేమాతరం పోరాటంలో మధ్యతరగతి (భద్రలోగ్) హిందూ యువకులు స్థాపించి నడిపిన అనేక రహస్య ‘టెర్రరిస్ట్’ సంస్థలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌వంటి వారికే స్థానం లభించనివిధంగా గంగాస్నానం, హోమాగ్ని ప్రదక్షిణం, శిరస్సున భగవద్గీతా గ్రంథాన్నీ దానిపైన ఖడ్గాన్ని వుంచి ఆత్మత్యాగ ప్రతిజ్ఞ చెయ్యడం వంటి తంతు పూర్తిగా హిందూమతానికే పరిమితమైంది.
శాశ్వత భూమిశిస్తు విధానం (1793) సృష్టించిన కొత్త భూస్వామిక వర్గంలో జమీందారులంతా హిందువులే కావడం మొదలు, 20వ శతాబ్ది ప్రారంభానికి గూడా ముస్లిములలో అత్యధిక సంఖ్యాకుల జీవనప్రమాణం మరీ హీనంగా వుండడం, అటు నవాబో ఇటు గరీబో తప్ప ముస్లిం జనాభాలో స్వతంత్రమైన మధ్య తరగతి ఒకటి ఇంకా తలెత్తకపోవడం – ఇలాంటి వాస్తవాంశాలన్నీ కలిసి మైనారిటీ మతవర్గ మనస్తత్వాన్ని కలిగించడం వింతకాదు. అయితే దాన్ని ఆగాఖాన్‌లాంటి కోటీశ్వరులూ సలాముల్లాఖాన్ వంటి మోయిషినుల్ మల్క్ నవాబులూ తమ వర్గ ప్రయోజనాలకోసం బ్రిటిషు ప్రభుత్వభక్తితోగూడిన ప్రత్యేక రాజకీయ ధోరణిగా మార్చే క్రమంలో ‘ముస్లిమ్‌లీగ్’ను స్థాపించారు. (1906). కల్నల్ డన్‌లప్‌స్మిత్ వంటి ఉన్నత ప్రభుత్వాధికారుల సలహా సంప్రదింపులతోనూ, లార్డ్ మింటో తెర వెనక ప్రోద్బలంతోనూ వైస్రాయివద్దకు రాయబారం నడిపి, ముస్లిములకు శాసన మండలులలో, ప్రభుత్వోద్యోగాలలో ప్రత్యేక మతవర్గ ప్రాతినిధ్యం మాత్రమేగాక, తమ జనాభా దామాషాను మించే అదనపు ప్రాతినిధ్యం కూడా ఉండాలంటూ విజ్ఞాపన చేశారు. 1909 నాటి భారత మండలుల చట్టం ఈ కోరికలనన్నిటినీ తీర్చింది. ఆనాటి నుంచీ ముస్లిం మతవర్గతత్వం క్రమంగా బలపడుతూ వచ్చినా, తాత్కాలికంగా ఖిలాఫత్ సమస్య విషయంలో లీగ్‌కూ కాంగ్రెస్‌కూ అవకాశవాదపూరితమైన రాజీ ఏర్పడిరది. (1916). గాంధీ నడిపిన ఖిలాఫత్ పోరాటందాకా (1919-22) ఈ ఒద్దిక కొనసాగినప్పటికీ సహాయ నిరాకరణోద్యమం అర్థాంతరంగా ఆగిపోయిన నాటినుంచి (1924) హిందూ – ముస్లిం మతవర్గ తత్వాలు పేట్రేగి మత కలహాలు పెచ్చు పెరిగాయి. దీనికి కారణం, 1914 నాటికే తలెత్తిన హిందూమహాసభ ద్వారా మదనమోహన్ మాలవీయ, లజ్‌పత్‌రాయ్‌వంటి కాంగ్రెసు నాయకులు సైతం ముఖ్యులుగా వుంటూ, మైనారిటీ మతవర్గతత్వాన్ని ఎక్కిరానీయకుండా మెజారిటీ మతవర్గ తత్వాన్ని ప్రోత్సహించడమే. హిందూ – ముస్లిమ్ సమైక్యతను తన నిర్మాణ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశంగా చేసుకుని, అఖిలభారత ఖిలాఫత్ కమిటీకి తాను అధ్యక్షుడై, అలీ సోదరుల సాయంతో పోరాటం నడిపినా, గాంధీ తన తత్వాన్ని హిందూమతపరంగానే మలచుకున్నాడు. తాను ‘సనాతనవాది’ నని చెప్పుకున్నాడు. ఆయన కోరుకుంది ‘రామ్‌రాజ్’ మాత్రమే. అస్పృశ్యులకు ‘హరిజనుల’ని పేరుపెట్టి వారికి సేవచెయ్యడంలో ఆయన ఆంతర్యం వర్ణవ్యవస్థతో గూడిన హిందూ సమాజాన్ని కొనసాగించడమే ననీ, నిజానికి గాంధీ ‘హిందూమత సామ్రాజ్యవాది’’ మాత్రమేననీ అంబేద్కర్ చేసిన విమర్శలో నిజం లేకపోలేదు. కాకుంటే, మాలవీయ లాంటి వారితో పోల్చినా మతవర్గతత్వాన్ని ప్రతిఘటించే విషయంలో గాంధీ ఎంతో మెరుగనిపించకపోడు. గోఖలే అనుచరుడుగా కాంగ్రెసువాదిగా పైకివచ్చిన మహమ్మదలీ జిన్నా చివరకు కాంగ్రెసుకు దూరమయ్యాడంటే దానికి కారణం, కనీసం ప్రారంభదశలో, అతని మితవాద జాతీయవాద దృక్పథమే. బ్రిటిష్ రాజభక్తి దానికి ప్రాణం. బ్రిటిషువారి మంచితనంమీద దానికి వెర్రినమ్మకం. కాబట్టి గాంధీ సహాయ నిరాకరణోద్యమ పద్ధతులు జిన్నాకు సరిపడలేదు. అందుచేతనే కాంగ్రెసుకు క్రమంగా దూరమై, రాజకీయాన్ని విడిచి, బారిస్టరీ మీద కేంద్రికరిస్తూ చివరకు దేశాన్నే వదిలి ఇంగ్లాండుకు పోయివుండడం జరిగింది. ‘సర్ మహమ్మద్ ఇక్బాల్’’ ఊహించిన స్వతంత్ర ముస్లిం రాజ్యభావన ఇంగ్లాండులో పెద్దచదువులకోసం వెళ్ళి ఉండిన సంపన్న ఇండియన్ ముస్లిం విద్యార్థుల గుండెలకు పట్టి, పాకిస్తాన్ భావానికి దారి తీసింది. రౌండ్‌టేబుల్ సమావేశాల కాలంలో బ్రిటిషు అధికారులు జిన్నా చెవుల్లో నూరిపోసిన కాంగ్రెసు వ్యతిరేకత వారికి సత్ఫలితాలే ఇచ్చి మతతత్వ విజృంభణకూ మతోద్రేక పరిస్థితులకూ మతకలహాలకూ అనుకూల పరిస్థితిని కల్పించింది. ఇప్పుడిది పేరుకే మతవర్గ తత్వం అయేంతగా, రాజ్యాధికారానికి ప్రభుత్వోద్యోగాలకూ (శ్రీవaఙవం aఅస టఱంష్ట్రవం శీటట శీటటఱషవ) హిందువుల ఆధిక్యాన్ని తొలగించగల మైనారిటీ పంతంగా పట్టుదలగా వాస్తవానికి పరిణమించింది. 1919 నాటి భారత ప్రభుత్వ చట్టంలో సిక్కులను మైనారిటీలుగా భావించి ప్రత్యేక మతవర్గ ప్రాతినిధ్యం యివ్వడం గాని, 1934లో ‘కమ్యూనల్ అవార్డ్’లో దళితవర్ణాలను సైతం అలాగే ఆదరించగలమని అంబేద్కర్ వంటివారికి సంతృప్తి కలిగించడంగానీ, బ్రిటిష్ శకుని రాజనీతికి మతవర్గతత్వ పోటాపోటీలు ఎలా పాచికలయ్యోమో తెలిపే ఘటనలు, హిందువుల ప్రాబాల్యానికి సవాళ్ళు వెలువడసాగిన కాలంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఏర్పడడం గమనించదగిన అంశం.