స్నేహితులారా!

మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి.

మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి వైవిధ్యం కలిగిన, చలనశీల సమాజపు అవసరాలకు అనుగుణంగా మారే స్వభావం దానికున్నది. మనదేశపు సంపద్వంతమైన సాంస్కృతిక, భాషాపరమైన, మత వైవిధ్యపు అల్లికను గౌరవించే ఒక చట్రాన్ని రాజ్యాంగం మనకు అందించింది. అది మనకు ఒక రక్షకుడు లాంటిది.

భారతదేశంలో రాజ్యాంగవాదం అంటే కేవలం కొన్ని నియమ నిబంధనల సంహిత మాత్రమే కాదు. అది ఒక జాతిగా మనల్ని కలిసికట్టుగా వుంచే ఒక పవిత్ర నిబంధన. మన నేపథ్యాలు ఏవైనప్పటికీ ప్రతి భారతీయ పౌరుడి గౌరవాన్ని అది ఎత్తిపడుతుంది. ప్రభుత్వానికి దఖలైన అధికారం సమిష్టి శ్రేయస్సుకోసం వినియోగపడేటట్లు మనకు గ్యారంటీనిస్తుంది. అధికారానికి, పారదర్శకతతో కూడిన బాధ్యతాయుతమైన విధానానికి మధ్య ఒక సున్నితమైన సమతౌల్యతను అది స్థిరపరిచింది. మన రాజ్యాంగం అధికార దుర్వినియోగాన్ని నిరోధించి వ్యక్తుల హక్కులను రక్షించింది.

వేగవంతమైన మార్పులు జరుగుతున్న ఈ శకంలో రాజ్యాంగవాదం పట్ల మన నిబద్దత మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అది అధికారయుత వాదపు పెనుగాలుల నుండి మనల్ని కాపాడే కవచం లాంటిది. పరిపాలనకు సంబంధించిన సంక్లిష్టతల సుడిగుండాలను దాటుకుని మనల్ని ముందుకు నడిపించే దిక్సూచి లాంటిది. మన రాజ్యాంగ వారసత్వాన్ని కాపాడుకునే జాగరూకులైన రక్షకులుగా మనం వ్యవహరించడం తప్పనిసరి. సమానత్వం ఒక సుదూరమైన కలగా మిగిలిపోకుండా, అది ఒక సమకాలీన వాస్తవంగా ఆచరణరూపం దాల్చేటట్లు, న్యాయం ఒక ప్రత్యేకమైన హక్కుగా కాక, జన్మతః లభించిన హక్కుగా రూపొందేటట్లు సమాజాన్ని తీర్చిదిద్దడం మన బాధ్యత.

మన సమాజంలోని వైవిధ్యం మనదైన ప్రత్యేకత. అది మన బలం. దాని నుండే భిన్నత్వంలో ఏకత్వం సిద్ధిస్తుంది. ఈ వైవిధ్యాన్ని మనం ఘనంగా చాటుకుందాం. మన రాజ్యాంగం ఒక సజీవమైన డాక్యుమెంట్‌. మారుతూన్న మన ప్రజల అవసరాలకు అనుగుణంగా మారే శక్తి దానికున్నది. అది కేవలం ఒక న్యాయ సంహిత కాదు. మరింత కరుణాత్మకమైన, అందర్నీ కలుపుకుపోయే సమాజంవైపు మనల్ని నడిపించే నైతిక కంపాస్‌ లాంటిది అది.

ఈ ప్రయాణానికి మనం ఉద్యుక్తులమయ్యే ఈ సందర్భంలో రాజ్యాంగవాదాన్ని మన సమిష్టి దృక్పథానికి, దృష్టి కోణానికి మూలస్తంభంగా చేసుకుందాం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి విలువలు మన ఆచరణకు మార్గదర్శకం కావాలి. మన రాజ్యాంగ స్ఫూర్తిని పైకి ఎత్తిపట్టే క్రమంలో భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక విలువైన దీపస్తంభంలాగా కొనసాగేటట్లు మనం చూద్దాం. మహత్తరమైన మన జాతి నాలుగుమూలలు మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదర్శాలు ప్రతిధ్వనించేటట్లు చూద్దాం.

Leave a Reply