విరసం 50 ఏళ్ల సందర్భంలో ఎ.కె. ప్రభాకర్ ఎడిటర్‍గా పర్స్పెక్టివ్స్ “50 ఏళ్ల విరసం: పయనం- ప్రభావం” అనే పుస్తకాన్ని 2020 లో ప్రచురించింది. ఇందులో 12 మంది వ్యాసాలు, 21 స్పందనలు కలిపి మొత్తం 33 రచనలు ఉన్నాయి. వెంటనే వీటికి ప్రతిస్పందనగా వరలక్ష్మి, పాణి రాద్దామనుకున్న రెండు వ్యాసాలు  2021, మార్చి 31న ఎన్ఐఏ చేసిన దాడిలో  పోయాయి. ఇంతమంది మిత్రులు చేసిన ఈ సంభాషణకు ప్రతిస్పందించడం విరసం బాధ్యతగా భావించి   మళ్లీ “కల్లోలకాల ప్రతినిధి- దృక్పథాల సంభాషణ” అనే సుదీర్ఘ వ్యాసాన్ని పాణి రాసాడు.   ఇటీవలే ఇది  విడుదలైంది.  

         పర్స్పెక్టివ్స్ ప్రచురించిన పై పుస్తకంలోని వ్యాసాలన్నీ చాలా విలువైనవని.  కొన్ని వ్యాసాల్లో చాలా లోతు, విస్తృతి   ఉన్నాయని విరసం భావించింది. ఇందులో 33 మంది రచయితలు విరసంతో పాణి ప్రేమపూర్వకమైన సంభాషణను ఉద్వేగ, విమర్శనాత్మక- తలాలలో  సాగించాడు.  అయితే వారి అభిప్రాయాలు వారికి మాత్రమే పరిమితమైనవని విరసం అనుకోలేదు. అవి తెలుగు సమాజాల్లోని అనేకానేక మందికి ప్రాతినిధ్య వహించే అవకాశం ఉన్నదని భావించింది.   విరసం  ప్రతిస్పందనను ప్రశ్నలు -జవాబుల రూపంలో కాకుండా, అంశాల వారీగా రాయడమే సరైన పద్ధతి అని, ఆ ప్రతిస్పందన ఒక సంభాషణగా సాగితేనే ఎక్కువ ప్రయోజనకరమని భావించింది. అయితే ఈ సంభాషణ తిరుగులేని వాదనాబలంతో ఇతరులను ఒప్పించడానికి చేసిన అంతిమతీర్పు లాంటి సంభాషణ కాదు. చారిత్రక వాస్తవాల పునాదిపై ఆధారపడి ఓపెన్ ఎండెడ్ గా సాగిన మైత్రీపూర్వక, స్వయం విమర్శనాత్మక విమర్శనా దృక్పథం గల  ప్రజాస్వామిక చర్చ ఇది.

         విప్లవ రచయితలతో పాటు ఈ పుస్తక రచయితలందరికీ నేపథ్యంలో విప్లవోద్యమం ఉన్నందువల్ల ఈ చర్చను విరసానికి మాత్రమే పరిమితం చేయనవసరం లేదని, ఒక బహిరంగ చర్చగా సాగితేనే చాలా ఉపయోగకరమని   దృఢంగా భావించి పాణి  ఇది రాసాడు.  ఇటువంటి చర్చ ఇప్పుడున్న ఫాసిస్టు అణచివేత సందర్భంలో మనల్ని చుట్టుముట్టి ఆవరించి ఉన్న రాజకీయ, భావజాల వాతావరణాన్ని సమీక్షించుకోవడానికి, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఆచరణాత్మకంగా ఎదుర్కొనే భావజాల స్పష్టతను పొందడానికి, పోరాట మార్గాలను అన్వేషించడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.

 ఇన్నిన్ని భిన్న దృక్పథాలు తమలోతాము ఎంతగా తలాడుతున్నాయో  ఇది చదివితే తెలుస్తుంది. చరిత్రను నిర్మించే పనిలో భాగంగా భావజాల పోరాటంలో  ఇన్ని రకాల సాహిత్య శక్తులు సీరియస్ గా పాల్గొంటున్నాయి.  తప్పక  అదొక ప్రగతిశీల మార్పు క్రమానికి సంకేతంగా మనం భావించాలి.

కల్లోల కాల ప్రతినిధి పుస్తకం చదివితే .. విరసాన్ని  ప్రేమించి,  ప్రశ్నించి, విశ్లేషించే    తరాలు నిరంతరం తయారు కావడమే విరసం వర్గపోరాట సృజనాత్మక ఆచరణకు సజీవ నిదర్శనం. విప్లవ సాహిత్య ఉద్యమ చరిత్రను, విప్లవోద్యమ చరిత్రను  అనేక భావజాలాలు ఉన్న రచయితలు ఎలా చూస్తున్నారు, ఆ చూపును విరసం ఎలా అర్థం చేసుకుంటున్నది అనే చర్చకు ఇది తాజా సాక్ష్యం.         తెలుగు సమాజ చరిత్రలో ప్రజల కొరకు, ప్రజల తరపున ఏర్పడిన మొట్టమొదటి విప్లవ సాహిత్య, సాంస్కృతిక కలెక్టివ్ విరసం. సిద్ధాంతపరంగా,  నిర్మాణపరంగా సీరియస్ నెస్ తో చారిత్రక ప్రాసంగికత కలిగివుండి 50 ఏళ్లుగా అవిచ్చిన్నంగా  కొనసాగుతున్నదీ విరసమే. అయితే అది మొదటిదే కావచ్చు కానీ చివరిడి  కాదు. ఆ తర్వాత కాలంలో అనేక సంస్థలు ఏర్పడి కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు విశాల ప్రజాశ్రేణుల్లో వేర్వేరు సోర్సెస్ నుండి వివిధ రూపాల్లో మొదలై సాగే పోరాట చలనాలను పెంపొందించడానికి ఇంకా అనేకానేక సంస్థలు, వేదికలు ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక  కలెక్టివ్ లుగా నిర్మాణం కావాల్సివున్నది.  ఇప్పుడున్న సామాజిక రాజకీయ ముఖచిత్రాన్ని మనం మార్చాల్సిన తక్షణ అవసరం ఉన్నది. ఇలాంటి ఆశావహ సంభాషణ ఈ పుస్తకం.

Leave a Reply