ఇటీవల విడుదలైన ఇక్బాల్ కవితా సంపుటి *కళ చెదరని స్వప్నం* కు రాసిన ముందుమాట
దేశ భక్తంటే రాజ్యభక్తిగాదోయ్ దేశ ప్రేమంటే ప్రజపట్ల ప్రేమోయ్ దేశ రక్షణంటే వనరుల రక్షణే చేను మేసే కంచెల్ని కాలబెట్టు
మార్క్సిస్టు కవులకు చరిత్ర పట్ల, వర్తమానం పట్ల విమర్శనాత్మక దృష్టి ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఆశావహ దృష్టి ఉంటుంది. మార్క్సిస్టు కవులు ప్రాదేశికత నుండి విశ్వజనీనత వైపు లేదా అంతర్జాతీయత వైపు పయనిస్తారు. మార్క్సిస్టు కవులది భౌతికవాద ప్రాంపచిక దృక్పథం. మనిషిని, మనిషి శ్రమను సత్యంగా గుర్తిస్తారు. మానవేతర శక్తులను తిరస్కరిస్తారు. మార్క్సిస్టు పాలకులు భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలను, ఆ వ్యవస్థల వారసులను, ఆ వ్యవస్థల రక్షకులను శుత్రువులుగా భావిస్తారు. పాలకుల ప్రచారాల పట్ల, బూర్జువా పాలనా విధానం పట్ల మార్క్సిస్టు కవులకు అభిప్రాయ సయోధ్య కుదరదు. వాటినన్నిటినీ పొట్ట విప్పి అసలు రూపాన్ని ప్రదర్శిస్తారు. సహజంగానే మార్క్సిస్టు కవులు దోపిడి, పీడన, అణచివేత, వివక్ష, మౌఢ్యం, ఆధిపత్యం, బానిసత్వం, అసమానతల వంటి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేస్తూ ఉంటారు. మార్క్సిస్టు కవులు సమాజం మారవలసిన అవసరాన్ని గుర్తు చేస్తారు. వస్తున్న మార్పును విశ్లేషిస్తారు. వస్తున్న మార్పు ఎవరికి ఉపయోగపడుతుందో స్పష్టం చేస్తారు. శాస్త్రీయమైన మార్పును ఆహ్వానిస్తారు. ఆరోగ్యపరమైన మార్పు కోసం శ్రమిస్తున్న శక్తులను కీర్తిస్తారు. మొత్తం మీద మరో ప్రపంచం మార్కిస్టు కవుల సామాజిక స్వప్నం. మార్క్సిస్టు కవులది వర్గ దృక్పథం. వాళ్ళు శ్రామికవర్గం వైపు నిలబడతారు. వాళ్ళు నిబద్ధ కవులు. వాళ్ళలో కొందరు నిమగ్నత గల వాళ్ళు అవుతారు. కవులు అందరి వాళ్ళు అనే భావన మార్క్సిస్టు కవులు తిరస్కరిస్తారు. మార్క్సిస్టు కవులు సామాజిక పరివర్తనను, సామాజిక విముక్తికి ప్రజా ఉద్యమాలనే సాధనాలుగా భావిస్తారు. దానిని ప్రజాయుద్ధం అనడానికి కూడా మార్క్సిస్టు కవులు వెనుకాడరు. మార్క్సిస్టు కవులకు సమసమాజం లక్ష్యం. ఆ సమసమాజ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న సామాజికాంశాలను విమర్శించి, సమ సమాజ స్థాపన కోసం ఎవరు ఏ చిన్న ప్రయత్నం చేసినా మార్క్సిస్టు కవులు కవిత్వా లింగనం చేసుకుంటారు. మార్క్సిస్టు కవులది ఎవరు ఏం చెప్పినా, బాగుందనే గిరీశం తత్వం కాదు. విమర్శ, ఆత్మ విమర్శ అనే సిద్ధాంతం వాళ్ళది. వర్గ శత్రువును విమర్శిస్తూనే, తమను తాము కూడా విమర్శించుకుంటారు. తమను తాము విమర్శించుకోవడమంటే తెలిసో తెలియకో తమలోకి జొరబడిన శత్రు వర్గ లక్షణాలను, అలవాట్లను గుర్తించి నిర్మూలించుకోవడం. తమ క్రియా శూన్యతను గుర్తించి తమను తాము చైతన్యపరచుకోవడం. తమలోకి ప్రవేశించిన నకిలీతనాన్ని, పౌండ్రక వాసుదేవతత్వాన్ని తన్ని బయటికి పంపడంÑ సారాంశంలో తమను తాము ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవడం, మార్క్సిస్టు కవులది స్థిరపడి ఉన్న విలువల్ని, కాలం చెల్లిన విలువల్ని ప్రశ్నించే కంఠస్వరం. యథాతథవాదానికి మార్క్సిస్టు కవులు వ్యతిరేకులు. అందుకనే ఫ్యూడల్ శక్తులు మార్క్సిస్టు కవులను తమ శత్రువులుగా భావిస్తాయి.
ఏ భావజాలం కలిగిన కవులైనా వాళ్ళలో ప్రబోధం ప్రధాన గుణంగా ఉంటుంది. అయితే అందరి ప్రబోధాలూ ఒక్కటి కావు. యథాతథవాదుల ప్రబోధాలు, తిరోగమనవాదుల ప్రబోధాలు జనాన్ని మభ్యపెడతాయి. మత్తులో ముంచుతాయి. ప్రశ్నించకుండా చేస్తాయి. సారాంశంలో ఆ ప్రబోధాలు దోపిడీకి ఉపయోగపడతాయి. మార్క్సిస్టు కవుల ప్రబోధాలు జనాన్ని నిద్ర లేపుతాయి ప్రశ్నించమంటాయి, నిలదీయమంటాయి, ఉద్యమించమంటాయి. యథాతథవాదులకు రాజ్యం అండ ఉంటుంది.
మార్క్సిస్టు కవులు సంపన్నులు, పేదవాళ్ళు ఉన్న సమాజంలో పేదవాళ్ళ పక్షం వహిస్తారు. విశ్రాంతివర్గం, శ్రామికవర్గం ఉన్న సమాజంలో మార్క్సిస్టు కవులు శ్రామిక వర్గానికి అండగా నిలుస్తారు. ఆధిపత్య కులాలు, అణచివేయబడిన కులాలు ఉన్న సమాజంలో మార్క్సిస్టు కవులు అణచి వేయబడిన కులాల వైపు మొగ్గుతారు. మెజారిటీ మైనారిటీలు ఉన్న సమాజంలో మైనారిటీలకు అండగా నిలుస్తారు. అంత మాత్రం చేత మైనారిటీలలోని అభివృద్ధి నిరోధకతను వెనకేసుకొని రారు. పురుషాధిపత్య సమాజంలో మార్క్సిస్టు కవులు స్త్రీలవైపు మొగ్గుతారు. ఏ రకమైన ఆధిపత్యాన్ని ఆమోదించకపోవడమే మార్క్సిస్టు కవి లక్షణం.
మిత్రులు ఇక్బాల్ నాలుగు దశాబ్దాల నుండీ కవిత్వం రాస్తున్నారు. కొన్ని కథలు కూడా రాశారు. స్పందన (1985), సేద్యం (2011), రాహేఁ (2018), జాబిలి ఖైదు (2019), దగ్ధ స్వప్నం (2020) ` ఇవీ ఇక్బాల్ కవిత్వ సంపుటాలు. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (2017) తెలుగు నుండి అర్విని రాజేంద్రబాబు గారిచే ఇంగ్లీషులోకి అనువదింపబడ్డ ఇంగ్లీష్ కవితా సంకలనం వెలువరించారు. కఫన్ అనే కథా సంపుటి (2007) ప్రచురించారు. ఇక్బాల్ మార్క్సిస్టు కవి, రచయిత. ఇప్పటిదాకా పేర్కొన్న మార్క్సిస్టు కవి లక్షణాలన్నీ ఇక్బాల్‌లో ఉన్నాయి. సోవియట్ రష్యాలో 1917లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం 1985 కల్లా గోర్బచేవ్ పెరిస్త్రోయికా, గ్లాస్‌నోస్త్‌లతో బీటలు వారింది. 1991కి ఆ ప్రభుత్వం పడిపోయింది. దాంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా నిలిచి ప్రపంచీకరణను ప్రపంచ దేశాల మీద రుద్దడం మొదలైంది. పెట్టుబడిదారీ సమాజం మార్క్సిజానికి కాలం చెల్లింది అనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. భారతదేశంలోని కొన్ని ప్రగతిశీల శక్తులు సైతం మార్క్సిజం భారతదేశానికి పనికి రాదనీ ప్రచారం మొదలుబెట్టాయి. అయితే తెలుగు మార్క్సిస్టు రచయితలు ఇతర ప్రగతిశీల సామాజిక వాదాలను సమన్వయీకరించుకుంటూనే మొక్కవోని మార్క్సిస్టు నిబద్ధతతో రచనలు చేస్తున్నారు. ఇక్బాల్ ఈ సమయంలోనే రచయితగా ఎదిగొచ్చి, పరిణతి చెందారు. ఆయన ఇప్పుడు తన ఆరవ కావ్యం ‘‘కళ చెదరని స్వప్నం’’ కావ్యాన్ని పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ కావ్యం మార్క్సిజానికి కాలం చెల్లింది అనే పెట్టుబడిదారీ సమాజ ప్రచారానికీ, మార్క్సిజం భారతదేశానికి పనికిరాదు అన్న భారతీయ మార్క్సిస్టేతర ప్రగతివాదుల ప్రచారానికీ సరైన సమాధానంగా మనం భావించవచ్చు. ఈ కావ్యంలోని కవితలన్నీ 2020 జనవరి 2022 ఫిబ్రవరి మధ్య 26 నెలలలో రాసిన కవితలే ఈ కవితలన్నీ వర్తమాన ప్రపంచ సామాజిక వాస్తవికతనే ప్రతిఫలిస్తున్నాయి. ప్రపంచీకరణ ప్రపంచ దేశాల ప్రాదేశికతను విధ్వంసం చేసేసి, దానిని వ్యతిరేకించే వాళ్ళను కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆకర్షించేసి, తనకు వ్యతిరేకంగా మాట్లాడే స్వరాలను స్వాధీనం చేసుకొంది. ఈ క్లిష్ట సమయంలో ఇక్బాల్ తన మార్క్సిస్టు స్వరం వినిపించారు. ఇది ఆయన నిబద్ధత. ఇక్బాల్‌ది రాజకీయ కంఠస్వరం.
కవి ఏం జేస్తడు
కవి ఏం జేస్తడు
బతుకు బాధల్ని
బాకు జేసిస్తడు
అని కవి తనను నిర్వచించుకుంటూ, కవి కర్తవ్యాన్ని నిర్దేశించాడు. ఇక్బాల్ విప్లవ కవి. విప్లవం ద్వారా సమాజ విముక్తి ఆయన లక్ష్యం. అందుకే ఆయన కవిత్వం నిండా విప్లవ స్ఫూర్తి పరచుకొని ఉంది.
ఈ కావ్యమంతా చదివినాక పాఠకులకు అర్థమయ్యేది వర్తమాన ఆర్థిక రాజకీయరంగాల పట్ల గల అసంతృప్తి, విమర్శనాత్మక దృష్టి తలకిందులు దేశభక్తి, ప్రజాస్వామ్య రూపంలో దాక్కున్న నిరంకుశత్వం, స్వేచ్ఛా ప్రియుల పట్ల అసహనం, క్రూర నిర్బంధం, వ్యవస్థల దుర్వినియోగం, దేశాన్ని ప్రైవేటీకరించడం, ప్రపంచీకరణ దుర్మార్గాలు, కార్పొరేట్ శక్తుల విజృంభణ ` వంటి సకల వర్తమాన పరిణామాల పట్ల కవికి గల విమర్శనాత్మక దృష్టికి అక్షర రూపం ఈ కావ్యం. ముఖ్యంగా గత ఎనిమిదేళ్ళ దేశపాలన మీద రాజకీయ వ్యాఖ్యలే ఈ కావ్యంలోని కవితలు.
నాకు బాగా తెలుసు…
వొంటినిండా పొంగిపొరలే
నీ దేశ భక్తి భవితయేమిటో
అని కవి ఇప్పుడు ప్రచారంలో ఉన్న దేశభక్తి భావనను గుర్తించి విమర్శించారు. పౌరసత్వ చట్ట సవరణ, కాశ్మీర్‌కు సంబంధించిన 370వ చట్టం రద్దు, ప్రశ్నించే వాళ్ళను అణచివేసే చట్టాలూ వంటి వాటిని కవి నిరసించారు.
పోటెత్తే సముద్రాన్ని
అన్లాఫుల్ యాక్టివిటీ కింద
అదుపుకు చట్టం చేస్తావా? అన్నది కవి ప్రశ్న.
చాలా కవితలలో ఇక్బాల్ రాజ్యహింసను విమర్శకు పెట్టారు. ఆదివాసీల పోరాటాల్ని, వాటి అణచివేతల్ని కవి ప్రత్యేక దృష్టితో చూశారు. అలాగే గత ఏడాది ఢల్లీి సరిహద్దుల్లో చేరి భారతీయ రైతులు చేసిన పోరాటాన్ని కూడా ఈ కవి అనేక కవితలలో చిత్రించారు. ఆ రైతుల పట్ల పాలకుల ప్రవర్తనలను నిరసించారు.
భూమి పుత్రులకు
భూ బకాసురలకూ
లడాయి మొదలైందక్కడ
పుట్లకొద్దీ పంట తీసీ
పూట తిండికి లేక
పస్తులు తీసే
రైతు బిడ్డలకూ…
దేశ పాలనన్నా..
పవిత్ర రామనామ స్మరణన్నా
రక్తపుటేరులు పారించడమేనంటున్న
దేశభక్త ముసుగుచాటు
దేశద్రోహులకు
యుద్ధం రాజుకున్నదక్కడ
అంటు పాలక పాలితుల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణాన్ని చెప్పారు. మార్క్సిస్టు కవులు ప్రపంచీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దానికి సామ్రాజ్యవాద లక్షణముండడమే కారణం.
పడగిప్పిన విధ్వంసక
అభివృద్ధి నమూనా
అని కవి దానిని నిర్వచించారు. ఈ కావ్యం నిండా విప్లవ కంఠ స్వరం స్పష్టంగా వినిపిస్తున్నది. సకల సమస్యలను విప్లవం పరిష్కారంగా కవి పేర్కొన్నాడు. రగల్ జెండాను విప్లవానికి సంకేతంగా ఉపయోగించారు. రష్యా విప్లవ నాయకుడు లెనిన్‌ను స్మరించారు. 1947 నాటి స్వాతంత్య్రం మీద, స్వాతంత్య్రానంతర రాజకీయాల మీద కవికి మరో చూపు ఉన్నది.
సమాజం పరివర్తన చెందడానికి అవసరమైన ఆలోచనలు చేసి, ప్రణాళికలు రూపొందించి, పాలనగాడి తప్పినప్పుడు నిస్సంకోచంగా వేలెత్తి చూపవలసిన బాధ్యత మేధావి వర్గం మీద ఉంది. మేధావి వర్గం ఉదాసీనత సమాజానికి చాలా చెడు చేస్తుంది. ఇక్బాల్ మాట్లాడవలసిన సమయంలో మౌనం పాటిస్తున్న మేధావి వర్గాన్ని ప్రశ్నించారు.
వాడు
తేనెమీద కన్నేసి
తెట్టె కింద పొగబెడితే
పట్టదుగాక పట్టదానీకు
జ్ఞానీ! వర్థిల్లు నీవు
కరోనా ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన సమస్య. కరోనా ప్రపంచ కవులందరినీ కదిలించింది. ఇక్బాల్‌ను కూడా కదిలించింది. చాలా కవితలు రాశారు. కరోనా కాలంలో ప్రజల బాధల్ని చిత్రించడమే కాకుండా, కరోనా కాలంలో పాలకుల తీరును కవి గమనించి విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించాడు. కరోనా కాలంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలను రక్షిస్తూ ఉంటే, ఆపదలలో ఆదుకుంటారని భావించే దేవుళ్ళు గుడులలో
ఉండిపోయారు. అప్పుడు మతాలు మనిషికి పరిష్కారాలు కావనే శాస్త్రీయ ఆలోచన సమాజంలో బలపడిరది.
ప్రాణులలోకెల్ల పరమాత్మ నిజరూపు
మనిషే అన్నవిక్కడ మతములన్నిగూడి
అన్నాడు ఇక్బాల్. కరోనా కాలంలో వలస కూలీల మీద కవిత రాయని కవులు లేరు. ఇక్బాల్ సైతం
దారి పొడుగునా రాలెటోల్లం
కష్టజీవులం మేమె గదా!
కోటలూ రాజ్యాలూ లేసింది
మా సమాధుల మీదనే గదా!
అని అధిక్షేపించారు. అలాగే కరోనా కాలంలో ప్రజలను బతికించడంలో క్రియాశీల పాత్ర నిర్వహించిన డాక్టర్లు, సిస్టర్లు, సఫాయి కార్మికులను కవులు కీర్తించారు. ఇక్బాల్ కూడా అందులో గొంతు కలిపారు.
తెలంగాణ రాష్ట్రోద్యమంలో భావజాలాలకు అతీతంగా సకల జనులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడినాక అసంతృప్తులు మొదలయ్యాయి. వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న కొందరికి పదవులు దక్కాయి. విప్లవకవిగా ఇక్బాల్ ఈ విషయాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా పెట్టుకున్న ఆశలు వమ్ము కావడాన్ని విమర్శించారు.
బంగారు తెలంగాణ ఉత్త పేరుకే గాని
నయా జమీందార్దే రాజ్యమల్ల
అన్నది ఆయన విమర్శ. ఆకర్షణీయమైన నినాదాలతో సాధించుకున్న రాష్ట్రం అందరిదీ కాకపోయేనన్న అసంతృప్తి కవిలో ఉంది. ఈ కావ్యంలోనే ఉద్యమాల నుండి వెనుదిరిగిన వాళ్ళమీద కూడా విమర్శ పెట్టాడు కవి. ఈ కావ్యంలో కనిపించే గుణం ‘విమర్శ ఆత్మవిమర్శ’ అన్నది.
పివి నరసింహరావు గారు తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రధాన మంత్రి కాగానే సోవియట్ రష్యాలో రాజకీయ మార్పు జరిగింది. ప్రపంచీకరణ పోలోమని ప్రపంచ దేశాల మీద పడిరది. ఎల్‌పిజి వ్యవస్థ ప్రపంచమంతా వ్యాపించింది. భారత దేశంలోకి అతి వేగంగా చొచ్చుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక పివికి గౌరవం పెరిగింది. నూతన ఆర్థిక విధానాలతో దేశం అల్లాడిపోయింది. అయితే తెలంగాణ ఇవేమీ పట్టించుకోలేదు. అయితే మార్క్సిస్టు వాది అయిన ఇక్బాల్, తెలంగాణ ప్రేమికుడైనా పివిని కూడా విమర్శనాత్మకంగానే చూశారు.
ఎదనిండా విరబూసిన
వేయి పడగల
సరళీకరణ సంకెళలై
రైతు దేశమున రైతు బతుకు
రోడ్ల పాలై రోదిస్తున్నది
అయితేనేం
ఆయన మేధస్సుకు
వందేళ్ళు
క్యాలెండర్ మారడాన్ని అరుదైన చారిత్రక సందర్భంగా భావించి శుభాకాంక్షలు చెప్పుకొనే మధ్య తరగతి సంస్కృతికి మార్క్సిస్టు కవి వ్యతిరేకి. జీవితంలో ఏ మార్పు రాకుండానే తేదీలు మారాయని సంబరపడడం అర్థం లేని పని అని కవి అభిప్రాయము.
కొత్త సంవత్సర సంబరాలతో
మారవు బతుకులు
శ్రమ సంస్కృతిలోంచి
ఉదయించే
నూతన మానవుని కోసం
పురిటి నొప్పులు తీస్తున్న
ప్రజా పోరాటాల విజయంతోనే
నిజమైన మార్పంతా
అని ఇక్బాల్ కవి తీర్పు. ఇక్బాల్ కవిగా, మార్క్సిస్టు చింతనాశీలిగా ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకి. ప్రజా సంస్కృతికి అనుకూలుడు.
చారెడు నేలకోసం
దోసెడు నూకల కోసం
సత్తువంతా కూడదీసుకొని
సావో బతుకో
తేల్చేసుకుందామని
ఎత్తిపట్టిన పిడికిలి సంస్కృతి.