మనుషులు పుడతారు చనిపోతారు
తల్లి గర్భంలో
ప్రాణం పోసుకోవడానికి
స్త్రీ పురుషుల కలయిక కారణం అయితే
మరణానికి కారణాలు
అనేకం
సహజమరణాలు
అసహజ మరణాలు

ఈ రెంటికీ మధ్యన
జరిగిపోయే మరణాల సంగతేంటి ?

వాటికీ ఈ రాజ్యం
పెట్టిన పేరు
ఎన్ కౌంటర్

ఎన్ కౌంటర్ అంటే ప్రజలకు నమ్మకం
అది ఏకపక్ష
మరణ శాసనమని

ఎక్కడో ఓ తల్లికి
గర్భశోకం మిగిల్చారని!
ఓ తండ్రి కల లను
కాటిపాలు చేసారని!
ఓ కొంపను నిలువునా
కూల్చారని!
ఓ ఊరును వాళ్ళకాడు చేసారని !

మరణం మనుషులను దుఃఖంలో ముంచడం సహజమే !
ఈ కింది నాలుగు పదాల వెతుకులట సంఘర్షణ లో
నా... కనులు వర్షించి,
ఈ కాగితం తడవడం
నాకు తెలువకుండానే
జరిగిన క్షణాలు...
ఓ తల్లి తన పేగు బంధం
తెగిన వేదనను
ఎలా తట్టుకోగలదు ?

కన్నవారు గుర్తెరగని రీతిలో
దేహాలు చిద్రమై
చిందర వందరగా
విసిరి వేయబడి ఉంటాయి

పురుడు పోసుకున్నపుడు
పుట్టుమచ్చలు
గుర్తు పెట్టుకున్న తల్లులు
పొత్తిళ్లలో వెచ్చగా ఒదిగిన
తన పసిగుడ్డును తడుముకున్నట్లు,
కమిలిపోయిన
మాంసముద్దలను
తల్లి మునివేళ్లతో కదిలిస్తుంది.

పుట్టెడు దుఃఖంలో
పుట్టుమచ్చల వెతుకులాట
కవుల వర్ణనకందని
ఆ సన్నివేశం
కలా లు ఆ.. కదన రంగాన్ని
కాలానికి అందిస్తా ఉంటాయి

పుడమి పొత్తిళ్లు
రక్తంతో తడిసి ఇంకిపోతూ
రేపటి పురిటికోసం
ఆ.. ధరిత్రి
పరితపిస్తూ ఉంటుంది

రేపటి సూర్యోదయాన
ఎర్రని భానుని కిరణాలు
నెలమీద పరుచుకుంటున్నవేళ
భూమి బద్దలౌతుంది
పోరుబిడ్డల జాననాన్ని
ఆపడం ఎవరి
తరమౌ తుంది ?

వారిది మరణంకాదు
వారిది మహోన్నతమైన
అమరత్వం !
అది, ఎంతో...
రమణీయమైనది
అది, కాలాన్ని కౌగిలించుకుని
నూతన ప్రపంచాన్ని
వాగ్దానం చేస్తుంది !

Leave a Reply