సాహిత్య రాముడిని సనాతన రాముడిగానే కొలవాలి. ధర్మావతారుడిగానే భజించాలి. రాముడు రామాయణమనే సాహిత్యరూపం కూడా తీసుకున్నాడు కాబట్టి రచయితలు డీకోడ్‌ చేయబోతే ఉన్మాద రాముడిగా వీరంగం తొక్కుతాడు. ఆయన వారసులు మద్యం తాగి, రాముడిని వేదాంత స్వరూపుడిగానే చూడాలని బూతులు తిడతారు. రాముడి గురించి మేం తప్ప మరెవరూ మాట్లాడటానికి వీల్లేదని దాడి చేస్తారు. లౌకికవాదంపై చర్చకు వాళ్ల అనుమతి తీసుకోలేదని మీదపడి కొడతారు. వరంగల్‌ ‘సమూహ’ అనుభవం ఈ దేశం ఎక్కడున్నదో ఎత్తి చూపుతున్నది.


లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మాట్లాడుకోవాలి కదా. ఒకరి మాటలు ఒకరు వినాలి కదా. సభ పెట్టుకోవాలి కదా. లౌకికవాదాన్ని చర్చించబోతే రాజ్యాంగంలోని హక్కులన్నిటినీ కాలరాచే భయానక దాడి జరిగింది. రాజ్యాంగ విలువలకు, రామాయణ ధర్మానికి మధ్య ఘర్షణ ఇంత భీతావహంగా ఉంటుంది. లౌకికవాదానికే దిక్కు లేనప్పుడు ఇక రాముడి గురించి ఏ చర్చకు అవకాశం ఉంటుందా? నిరంకుశ రాముడిని తలదాల్చవలసిందే.


రాముడు ఇంత ప్రమాదకారి అవుతాడని ఎవరైనా అనుకున్నారా? రాముడు తప్ప ఇహపరాలు లేవని పూజించిన భక్తులకు, భక్త కవులు ఊహించి ఉండకపోవచ్చు. రాముడు ఇంత నిర్హేతుక విగ్రహంగా మారి, బుల్డోజర్‌గా రూపాంతరం చెంది మానవ మేధను, సృజనకు ఇంత సవాల్‌గా మారుతాడని ఆధునికులు కూడా గ్రహించి ఉండకపోవచ్చు. రాముడిప్పుడు బరిగీచి నిలిచి ఉన్నాడు. ఈ దేశ ప్రజల మీదికి, ప్రజల కోసం రచించే సాహిత్యకారుల మీదికి ఇట్లా ఉరుకురికి వస్తాడని ఎవ్వరూ అనుకొని ఉండకపోవచ్చు. దేశ భాషల్లోగాక, విదేశాల్లో సహితం ఎన్నెన్ని రామాయణాలు? ఎందరు రాములు? లిఖితానికంటే అపూర్వంగా జానపద, మౌఖిక కళా సంప్రదాయాల్లో ఇంకెందరు రాములు? భక్తుల మనసుల్లోకంటే సాహిత్య, సాంస్కృతిక పాఠాల్లో, పాఠాంతరాల్లో కనిపించే రాములకు అంతే లేదు. సారాంశంలో రాముడు ఏమిటనే తర్కబద్ధ విశ్లేషణలు, చారిత్రక కథనాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. రామ సంస్కృతిని రాజ్య సంస్కృతిగా, భక్తి సంస్కృతిగా, పురుష సంస్కృతిగా, ‘నాగరిక’ సంస్కృతిగా కనుగొనే అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుమించి రాముడు ధర్మ సంస్కృతిగా ఈ దేశంలో ఎట్లా పాతుకపోయాడో పెకలించే కృషి జరుగుతూనే ఉన్నది. దేనికంటే రాముడు ధర్మావతారుడని ప్రకటించడంలోనే ధర్మాన్ని, రాముడ్ని ప్రశ్నించడానికి వీల్లేదనే పరంపర ఆరంభమైంది. ఇప్పుడు ఆ రాముడు అయోధ్యలో బాల రాముడిగానే లేడు. మోదీ అవతారంగా ఢల్లీిలో తిష్టవేశాడు. ఫాసిస్టు రాముడిగా రాజ్యమేలుతున్నాడు. ధర్మాన్ని నాలుగు పాదాల నడపడానికి వేల, లక్షల రామ సైన్యం దేశమీద స్వైర విహారం చేస్తున్నది.
సనాతన రాముడికి కూడా భక్త కోటి ఉన్నది. దీని పని సమాజంలో ధర్మాతిక్రమణ జరగకుండా భావజాల సంకెళ్లలో పట్టి ఉంచడం. ఆస్తి రక్షణ కోసం రాజ్యం కింద వేతన సైన్యం ఉండేది. ఇప్పుడు రాముడి అపరావతారమైన మోదీకి కూడా ఈ రెండు సైన్యాలు ఉన్నాయి. లౌకిక స్వప్నం గురించి ఎక్కడ ఎవరు కవిత్వం రాస్తారో, భావ ప్రకటన కోసం ఎక్కడ ఎవరు ఉపన్యసిస్తారో, హేతు చింతన గురించి ఎక్కడ ఎవరు సభ పెడతారో, మానవతను కాపాడుకోడానికి ఎక్కడ మందిని పోగేస్తారో అని ఈ భక్త కోటి పహారా కాస్తూ ఉంటుంది. పురాణ కాలపు నమ్మకాలను, విశ్వాసాలను చెక్కు చెదరకుండా కాపాడి సమాజం మీద అధిపత్యం నిలబెట్టుకోడానికి ఫాసిస్టులు ఈ మూకను తయారు చేసుకున్నారు. అహేతుకత స్థానంలోకి హేతుబద్ధతను, గుడ్డి నమ్మకం స్థానంలోకి విమర్శను, మత జీవితం స్థానంలోకి లౌకికవాదాన్ని తేవాలని ప్రయత్నించే వాళ్ల మీద దాడులు చేయడం ఈ అల్లరి మూకను తయారు చేసే సంఫ్‌ుపరివార్‌ పని.
బహుశా వాళ్లు కొద్ది రోజులుగా సమూహ పనులను గమనిస్తూనే ఉంటారు. వందలాది మంది రచయితలను, మేధావులను, పాఠకులను ఒక చోటికి చేర్చడమే వాళ్లకు కంటగింపు. రాజ్యాంగ విలువలంటేనే వ్యతిరేకత. అందుకే ఈ దాడికి పాల్పడ్డారు. తొలి విడత ఎన్నికల తర్వాత ఈ దేశ ప్రధాని రెచ్చగొడుతున్న ముస్లిం వ్యతిరేకత ఈ దాడికి నేపథ్యం. పదేళ్లుగా అధికారానికి దూరమవుతానేమో అనే భయంతో మోదీ అంత మతవిద్వేషాన్ని బాహాటంగా రెచ్చగొడుతోంటే అతని నీడలో బతుకుతున్న ఈ ఉన్మాద మూక ఇంతకంటే ఇంకోలా వ్యవహరిస్తుందా? ప్రధానికే లౌకికవాదం, రాజ్యాంగం ఖాతరు లేని దేశంలో అతగాడి మాతృసంస్థ నుంచి పుట్టుకొచ్చిన విషక్రిములకు ఉంటుందా? వాళ్లను ఇంతగా ‘సమూహ’ రెచ్చగొట్టిందంటే అది నిజంగానే సార్థక నామధేయ. మతాల పేరుతో, కులాల పేరుతో విడగొట్టి ఓట్లు దండుకొని, సమాజం మీద పెత్తనం చేసే చోట విలువల గీటురాయి మీద సమూహ సాహిత్యకారులందరినీ కలపడంతో వాళ్ల కంట్లో నలుసుగా మారింది. అంటే సమూహ ప్రజల్లో, సాహిత్య పాఠకుల్లో సమూహ తాను ఎంచుకున్న పని ప్రభావశీలంగా చేస్తున్నట్లే. అందుకే దాని బుల్లోడజర్‌ పద ఘట్టనలు దేశమంతా పాకుతూ సాహిత్య ‘సమూహ’ం మీదికి ఈ రోజు వెళ్లాయి.
అయితే ఈ బుల్డోజర్‌ అనేక రూపాలు. ఇదే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పది రోజుల కింద తమ కుమారుడి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు కట్టుకున్న స్థూపానికి ఎర్రరంగు వేయడానికి వీల్లేదని పోలీసులు ఒత్తిడి తెచ్చారు. కట్టిన చేతులతోనే స్థూపాన్ని కూల్చేయాలని పదుల సంఖ్యలో ఇంటి మీదపడి బెదిరించారు. దంతెవాడలోని నల్లగుట్ట ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడైన అన్నె సంతోష్‌ అనే విప్లవకారుడి తల్లిదండ్రుల అనుభవం ఇది. ఆ తర్వాత కాంకేర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సుమన, సుధాకర్‌ సంస్మరణ ఉమ్మడి వరంగల్‌ జిల్లా చల్లగరిగ గ్రామంలో జరిగింది. ఆ సభ కోసం తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్న బేనర్‌ తీసేయాలని పోలీసులు బెదిరించి తీయించారు. ఆ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 29 మంది పేర్లు దాని మీద ఉండటమే కారణం. సరిగ్గా రెండు రోజుల తర్వాత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సమూహ సభ మీద దాడి చేయడానికి వెళ్లిన అల్లరి మూక లౌకికవాదం`సాహిత్యం అనే బేనర్‌ను పీకేయడానికి పోయారు.
వాళ్లు చట్టబద్ధ పోలీసులా? చట్టాతీత సంఫ్‌ుపరివార్‌ మూకలా? అని మనం తేడా చూద్దాం. కానీ వాళ్లకు మాత్రం లౌకికవాద చర్చ అన్నా భయమే. మావోయిస్టు అమరుల సంస్మరణ అన్నా భయమే. ఈ దేశ ప్రధానికి ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. పాపం ఆయన ఎప్పుడు గుండె ధైర్యంతో బతికాడని? ఈ పదేళ్లూ భయం భయంగానే ప్రాణాలు అరచేత పెట్టుకొనే బతికాడు. హత్యలు చేసేవాడికి, అసమ్మతిని అణచేవాడికి, దేశాన్నంతా తెగనమ్ముకొనేవాడికి భయం కాక ధైర్యం ఉంటుందా? ఆ భయంతోనే మరింత హింసను ప్రేరేపించాడు. మరింత విధ్వంసానికి పాల్పడ్డాడు. ఎక్కడెక్కడ అసమ్మతి ఉన్నదో వెతికి వెంటాడాడు.
ఆ భయంతోనే వాళ్లు సాహిత్యంలో లౌకికవాద చర్చను భరించలేరు. రాజ్యాంగబద్ధ హక్కులతో ఈ అడవిని, వనరుల్ని, పర్యావరణాన్ని, దేశాన్ని కాపాడుకుంటామనే ఆదివాసులను సహించలేరు.
కాకపోతే వాళ్లు తమ భయానికి కారణమైన వాటన్నిటినీ కలిపి చూస్తున్నారు. అన్నిటినీ మీదికి, అందరి మీదికి అనేకానేక బుల్డోజర్లను దేశం మీదికి వదులుతున్నారు. వాళ్లకు సనాతన రాముడా, కార్పొరేట్‌ రాముడా అనే తేడా లేదు. ఇద్దరూ వాళ్లకు ఆరాధ్యమే. అన్ని రకాల రాములను కలిపి జనం మీదికి సంధిస్తున్నారు. ఒకే ఒక యుద్ధ వ్యూహంలోకి అందరినీ లాగి, అన్నిటినీ లాగి నిర్మూలిద్దామనుకుంటున్నారు.
మరి మనం ఇంత స్పష్టంగా అన్నిటినీ కలిపి చూడలేమా? అన్నిటి సారం ఏమిటో గ్రహించలేమా?

Leave a Reply