సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం …

 మా వూరికి దక్షిణ శివారులో పాలాగు ఒడ్డున  సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నది. నేను నా భార్య, ఇద్దరు పిల్లలు, అవ్వ-నాన్న కలిసి జాతరకు  ఎల్లినం .  వన దేవతలకు మొక్కులు చెల్లించి ఒక కోన్ని కోసి అక్కన్నే చెట్లల్ల వండుకున్నం. రాత్రి 8 గంటలు అయితంది.. పల్లెం లో అన్నం కూర పెట్టుకుని తింటున్న.

 పిండారపోసినట్టు తెల్లని వెన్నెల  కురుస్తంది. స్టీల్ పల్లెం పై ఆ వెన్నెల  పడి మెరుస్తంది. ఈ టైంలో తమ్ముడు  ఏమి చేస్తున్నట్లు? ఎక్కడ వున్నట్లు? ఒక్క సారిగా మనసు తమ్ముని మీదికి పోయింది. కోర మీసాలు. చురుకైన కళ్ళు . చామనఛాయకు కొద్దిగా మించిన తెలుపు. కండలు తిరిగిన దేహం. వంకీలు తిరిగిన జుట్టు. ఒక్కసారిగా ఆ రూపం నా కళ్ళెదుట  కట్టింది. గుండెలో సన్నని బాధ.

 నేను ఇంటర్మీడియట్, తను పదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఇంట్లో వేములవాడ జాతరకు పోతుంటే తాను రానని మొండికేసిండు. లేని దేవున్ని మొక్కలేనని ఖరాఖండిగా చెప్పిన మొండోడు.

చిన్నప్పుడు బహుశా మూడు, నాలుగు తరగతుల్లోననుకుంటా.. చుట్టంగా వచ్చిన మా మేనమామ పోతూపోతూ మా ఇద్దరికి చెరో రూపాయి ఇచ్చి పోయిండు. “పిల్లికి రొయ్యల మొలతాడు” లెక్క పొద్దుగూకె వరకు పాపడాలు, లేమిడీలు కొనుక్కుని రూపాయి మొత్తము ఒడగొట్టిన. ఎన్నడూ  కోపానికి రాని మా నాన్న ఆ రోజు నన్ను ఇంట్లకు రానియ్యకుండా బయట నిలబెట్టి తలుపులేసిండు. కొంచెం  సేపట్లోనే తలుపు తెర్సుకుంది. తమ్ముడు బయిటికి  వచ్చిండు. వెంటనే తలుపు మూసుకుంది.

”అన్నను ఇంట్లకు తీసుకుంటే సరే…  లేదంటే అన్నతోని నేనుంటా” అని ఇంట్ల ఏడిస్తే వాన్నీ బయిటికి దొబ్బిండ్రు. అన్నకష్టములో తోడుండాలన్న తపన వయసుతో పాటే పెరిగి పెద్దదయి, విశాలమయి మంది కష్టాలు బా పేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధం చేసింది.     

 ఇంటిముందు రామస్వామి మామ తాగుబోతు. రోజూ తాగచ్చి కమలత్తను కొడుతుండెడిది. ఒక రోజు దెబ్బలకు తట్టుకోక ఆమె మొత్తుకుంటుంటే రివ్వున రాకెట్లెక్క వాల్లింట్లోకి దూసుకెల్లిండు. ఆయన నుంచి ఆ అత్త ను విడిపించి..“ఆమెను కొట్టడానికి నువ్వెవ్వరు? భర్తవైతే కొట్టే హక్కెవ్వరిచ్చిండు? ఇంకోసారి కొడితే మంచిగుండది” అని గట్టిగా బెదిరిచ్చేసరికి తాగుబోతు మామ హడలిపోయిండు. అది మొదలనుకుంటా… అన్యాయాన్ని  ఎదిరించే తత్వం మళ్లెక్కడా ఆగిపోలేదు.

తాను పూర్తి కాలపు విప్లవ కార్యకర్తగా  మారిన కాలములో ఒక్క సారి  హఠాత్తుగా హైదరాబాద్ లో హడావుడిగా ఎదురుపడ్డాడు. ఆశ్యర్యాలు, అలాయ్ – బలాయ్ లు అయిన తరువాత  ప్రేమ అంటే ఏమిటి? అని అడిగిండు. నేను  ‘ఏందిరా ప్రేమలో పడ్డావా? ‘  అని అడిగాను ఒకింత ఆత్రంతో.”అదేం లేదు కానీ, తెల్సుకోవాలని వుంది” అన్నాడు. సినిమా ప్రేమలు, ప్రేమ వివాహాలు, చలం “మైదానం”, రంగనాయకమ్మ “జానకి విముక్తి”,  ఐత్ మాతోవ్ “జమీల్య- దనియార్”  ‘మార్క్స్ -జెన్నీ”, మనుషుల పట్ల ప్రేమ, మూగ జీవాల పట్ల ప్రేమ, వర్గ ప్రేమ ఒకటేమిటి అన్ని అంశాలతో ఒక మూడు నాల్గు గంటల నిర్విరామ చర్చ. తన నిండా ప్రేమను మాలోకి వంపి  వెళ్ళిపోయాడు. ప్రేమైక మూర్తి.

జాతర అయిపోయిన పది రోజుల తరువాత ఒక రోజు  నేను పొద్దటి బదిలికి పోయి ఇంటికి వచ్చిన. బెల్లంపల్లి నుండి దోస్తు లక్శ్మన్ లాండ్ ఫోన్ చేసిండు. అన్నా పేపర్ చూసినవా.. అని అడిగిండు. విషయం చెప్పకుండా వార్త దిన పత్రిక మెయిన్లో మూడవ  పేజి చూడమన్నడు.

ఒక్క సారిగా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది. తూర్పు గొదావరి జిల్లా దారకొండ లో సరిగ్గా సమ్మక్క పున్నమి రోజు జరిగిన పోలీస్ అవుట్ పోస్ట్ పై జరిగిన దాడిలో పి.ఎల్.జి.ఎ.డిప్యూటి కమాండర్ గా మా తమ్ముడు సత్యం , నవీన్ పాల్గొని ప్రాణాలొదిలినట్లు జాంబ్రి పేరిట ప్రకటన వచ్చింది. పోలీసు నిర్బంధం వల్ల వెంటనే ప్రకటించలేకపొయామని, గాయపడిన దశలో సత్యంను వెంట తీసుకెళ్తున్న క్రమం లో చనిపోయాడని, అతనిని విప్లవ సాంప్రదాయాలతో ఆంధ్ర –ఒరిస్సా సరిహద్దు గ్రామం లో  అంత్యక్రియలు జరిపినట్లు ఆ ప్రకటన సారాంశం.

 ప్రేమైక సమాజం ఏర్పడాలంటే దోపిడి పోవాలి. ఆ దోపిడికి వ్యతిరేకంగా గిరిజన వీర వనితలు  సమ్మక్క- సారక్కలు రాజరికానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యి తమ తనువులను తమ వారికి కూడా కనపడనియ్యకుండా చిలకలగుట్టలో వన ప్రవేశం చేసి కుంకుమ బరిణలయ్యారు.

 సత్యం కూడా ఈ సమాజాన్ని ప్రేమ మయంగా  మార్చే యుద్ధం లో అమరుడయ్యి తనువును కూడా మాకు కనపడనియ్యకుండా స్థూపమై ఆకాశమెత్తులో నిలిచాడు.

Leave a Reply