ఫాసిజం అనే పదం దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి వున్నది. ఈ పార్టీని మొదటగా ముసోలిని ఇటలీలో ప్రారంభించాడు. హిట్లర్ జర్మనీలో ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకారిగా పరిణమించిన రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించారు. వీరి కూటమిని ఓడించేందుకు ప్రపంచమంతా ఒకటయింది , ఆ మహా కూటమిలో ప్రత్యర్థి వ్యవస్థలైన సోవియెట్ వ్యవస్థ,పెట్టుబడిదారీ వ్యవస్థ తాత్కాలికంగానైనా ఒక్కటయినాయి. ఆ ఐక్యసంఘటన ఏర్పడకపోతే ప్రపంచం ఏమైపోయేదో ఆలోచించలేము. పెట్టుబడిదారీ దేశాల వైపునుండి ఆలోచిస్తే ఆ కూటమే వారిని వినాశనం నుండి రక్షించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియెట్ ప్రజలదే అసమాన త్యాగం. ప్రారంభంలో హిట్లర్ , ముసోలినిలను తూర్పు వైపు ఉసికొల్పి , సోవియెట్ వ్యవస్థ నాశనమైపోతే పండగ చేసుకుందామనుకున్నారు. కానీ, ఫాసిస్టు కూటమి సోవియెట్ యూనియన్నే కాకుండా ప్రపంచన్నంతటిని తన పాదాక్రాంతం చేసుకోవాలనే ఆలోచనతో , యూరపు పై విరుచుకొని పడే సరికి , సోవియెట్ సహాయం లేకుండా , ఫాసిజాన్ని ఎదుర్కొనలేని  పరిస్థితిలో బ్రిటిష్, అమెరికన్ సామ్రాజ్యవాదులు  సోవియెట్ యూనియన్  తో చేతులు కలిపి, మిత్రరాజ్య కుటమితో  ఫాసిజాన్నిఓడించడంలో పాలుపంచుకున్నారు .   ఈ వ్యూహానికి కర్త స్టాలిన్. ఇంటర్నేషనల్ ద్వారా ఆయన అవగాహన ప్రపంచ విప్లవ  శక్తులకు, ఫాసిస్టు వ్యతిరేక శక్తులకు దారి చూపించింది .

ఒక రాజకీయ ధోరణిగా ఫాసిజం మొదటగా ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియాలలో తలెత్తింది. అక్కడి బూర్జువాజీ , ద్రవ్య పెట్టుబడి  కలగలిసి పోయి, పారిశ్రామికాభివృద్ధి సాధించి, సంక్షోభ దశకు చేరుకున్నాయి. కార్మికవర్గం చైతన్యయుతంగా వుండేది. కార్మిక వర్గ నాయకత్వం సంస్కరణవాదం చేతుల్లో వుండేది. ఆ నాయకత్వం కార్మికవర్గాన్ని రాజ్యాధికార స్వాధీనానికి , నిర్ణయాత్మక చర్యలకు సిద్ధం చేయకుండా సంస్కరణవాద కార్యక్రమాలతో పొద్దుపుచ్చేది. ఈ నాయకత్వపు నిష్క్రియాపరత్వానికి కార్మికవర్గం   విసిగి వున్నప్పుడు, హిట్లర్ , ముసోలినిలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, యూదు వ్యతిరేకతను రెచ్చగొడుతూ, జాతీయ సోషలిజం  నినాదాలిస్తూ ముందుకు వచ్చారు. వారి సోషలిజంలో జాతి దురహంకారం , విపరీత కార్మికవర్గ దోపిడి తప్ప సోషలిజం ఇసుమంతైనా లేదు. పెట్టుబడి కనుసన్నలలో వుండే ప్రభుత్వ యంత్రాంగమూ , సాయుధబలగాలూ తోడ్పడి వారిని అధికారంలోకి తెచ్చాయి. ఆ సమయంలో స్టాలిన్ నాయకత్వంలో  కమ్యూనిస్టు విప్లవ శక్తులు  రానున్న పరిణామాలను శాస్త్రీయంగా అంచనా వేసి, రానున్న భీభత్స పాలనకు సిద్ధమయ్యేందుకు ప్రజానీకానికి పిలుపునిచ్చి, సిద్ధమయ్యాయి . అధికారం చేజిక్కించుకున్న ఫాసిస్టులు కమ్యూనిస్టుల మీద, పురోగామి శక్తులన్నీటి మీద విరుచుకొని పడి, భీభత్స రాజ్యాన్ని సాగించారు. తమ ద్రవ్యపెట్టుబడిదారి యజమానులను సంక్షోభం నుండి కాపాడేందుకు, కొత్త మార్కెట్లను సంపాదించి పెట్టేందుకు ప్రపంచ యుద్ధానికి దిగి మొత్తం మానవాళినే మారణహోమం చేయ తలపెట్టారు. అసలు వాస్తవమేమిటంటే , సామ్రాజ్యవాద పరిస్థితులలో పెట్టుబడిదారీ వర్గ పాలనను సాగించేందుకు , సేవ చేసేందుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య రూపాలు పనికి రాకుండా పోయినాయి. సంక్షోభాన్ని ఎదురుకొనేందుకు కొత్త మార్కెట్లను సంపాదించడం, కార్మికులపై దోపిడిని ద్విగుణీకృతం చేయడం తప్ప వెరే మార్గాలు లేవు. మౌలికంగా బూర్జువా సిద్ధాంతమే అయిన ఫాసిజం ఆ దశలో, ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన రూపంగా ముందుకు వచ్చింది.

ఫాసిస్టు సిద్ధాంతంలో కొత్త ఆర్థిక అంశాలేవీ లేవు, మనిషిని మనిషి దోపిడి చేయడం గురించి ఏమిలేదు. ఇంకా యాంత్రికోత్పత్తిని మాని  వేసి, చేతివృత్తులను ప్రోత్సహించాలన్న వాదనలున్నాయి. గతకాల వైభవాన్ని తిరిగి తీసుకొని వచ్చేందుకు అదే సరైన మార్గమన్న ధోరణి  వున్నది. చూపంతా భవిష్యత్తు మీద కాకుండా భూతకాలం మీదనే ఉన్నది. పూర్వం నెలకొని వున్న పరిస్థితులను తిరిగి తీసుకొని వచ్చే ప్రయత్నమే  వున్నది.అసలు సమస్యలనుండి ప్రజానీకం దృష్టిని మరల్చడమే వున్నది. వ్యవస్థలో వున్న మౌలిక లోపాలను , ఉపరితలం పైన ఉన్న లోపాలకు అపాదించి, అవే మౌలి క సమస్యలుగా ప్రజలను విజయవంతంగా తప్పుదారి పట్టించ గలిగింది. యూరపు దేశాలలో వడ్డీ వ్యాపారం చేస్తూ, దోపిడీలకు పాలుపడిన యూదులపై ప్రజలలో కొంత వ్యతిరేక భావం వుండేది. పదిహేడు  పద్దెనిమిది శతాబ్దాల సాహిత్యంలో సైతం దానికి ఆధారాలు మనకు కనిపిస్తాయి.  ఆ వ్యతిరేకతను  ఫాసిజం విజయవంతంగా ఉపయోగించుకో కలిగింది. దానికి తోడు ఆర్యజాతి ఔన్నత్యం, దురహంకారాన్ని ఫాసిజం సులభంగా రెచ్చగొట్టింది. యూదులు ఆర్యేతరులున్న భావనను రెచ్చగొట్టింది.

మన దేశంలో  ఫాసిస్టు ధోరణులు 1920 లలో ప్రారంభమయినాయి. కేశవ బలిరామ్  హెడ్గేవార్ నాయకత్వంలో ఆర్. ఎస్. ఎస్ నాగపూర్లో 1925 లో ప్రారంభమయింది. ఒక ముస్లిం ఒక హిందూ స్త్రీని జుట్టుపట్టుకొని ఇంటిలోంచి ఈడ్చుకొని రావడం ఆయనకు ప్రేరణ కల్పించిందని చెప్పుతారు. మతాల మధ్య విభేదం, ప్రజా సమూహాల మధ్య, కులాల మధ్య విబేధాలు వర్గ  సమాజంలో ఏదో ఒక స్థాయిలో ఉండి తీరుతాయి. ప్రతి సమూహం ఇతర సమూహం చేతుల్లో అన్యాయానికి గురైనామని గాని, తమదే ఉన్నతమైన మతమని, ఉన్నతమైన సంస్కారమని, నాగరికతని భావిస్తాయి. అలా భావించని క్షణం నుండి ఆ సమూహం మనుగడకే అర్థం లేకుండా పోతుంది. అదే కాకుండా మన దేశంలో పద్దెనిమీదవ శతాబ్దం ఉత్తరార్ధం వరకు ముస్లిం రాజవంశాలు గణనీయ భాగంపై రాజ్యాధికారం చలాయించాయి. ఫ్యూడల్ పాలనలో  అన్నీ మతాలు , సమూహాలు వివక్షతకు, రైతాంగం దోపిడీకి గురయిన మాట వాస్తవమే. ఆ వ్యవస్థలో తమ మనుగడ కోసం పాలక వర్గాలు అనుసరించిన వ్యూహంలో భాగంగానే జరిగినది. అయితే మొత్తంగా మధ్య యుగంలో హిందువుల పై అణచివేత మాత్రమే  జరగలేదు, సముచిత స్థానం కల్పించబడిన సందర్భాలు కోకొల్లలు. మొత్తంగా హిందూ మతం నాశనం కాలేదు. అట్లా ప్రయత్నిస్తే తమ పాలనకు మోసం వస్తుందని అప్పటి పాలకులకు స్పష్టంగా తెలుసు. దేవాలయాల విధ్వంసనం తమ గెలుపును ప్రకటించుకోవడం కోసమే గాని , మతవిధ్వంసనానికి ఉద్దేశించినది కాదు. ఔరంగజీబు గోల్కొండ రాజ్యాన్ని దండెత్తినప్పుడు కుతుబ్షాహి రాజుల వైభవ చిహ్నాలను విధ్వంసం చేశాడు. ఒకవేళ ముస్లిం రాజవంశాలు హిందూ మతాన్ని నాశనం చేయాలని ప్రయత్నించి వుంటే, తివ్రమైన తిరుగుబాటు వచ్చి , మనదేశంలో ఆ రాజవంశాలే నాశనమై పోయేవి. లేదా హిందూ మతమే తుడిచి పెట్టుకొని పోయేది. రెండూ జరగలేదు.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన స్వతంత్ర పోరాటంలో మొదట ఐక్యతదే పైచేయి. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంలో మతాల విబేధం భావనే లేదు. అల్లాహు అక్బర్, హారహర మహదేవ్ నినాదాలు జంటగా వినిపించేవి.1857 స్వతంత్ర సంగ్రామాన్ని అణచివేసిన తరువాత బ్రిటీషర్లు హిందూ,ముస్లిం మతాల మధ్య విబేధాలను పెంచే ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించు కొన్నారు.    గాంధీ భారతదేశంలో అడుగుపెట్టినదాదిగా , స్వతంత్ర దేశంలో మతపరమైన ప్రతీకలతో ప్రజలను ఉద్దీపింప జేసె ప్రయత్నం చేశాడు, రామ రాజ్యం తన అదర్శమని చెప్పాడు. అట్టడుగు వర్గాలను హరిజనులన్నాడు. ఈ విధమైన మతప్రతీకలు ఇతర మతావలంబులలో సందేహాలను రేకెత్తించాయి. వారి సందేహాలను  ప్రతిబింబిస్తూ ముస్లిం లీగ్ ముందుకు వచ్చింది. అంతకు ముందే 1907 లో హిందూమహాసభ ఏర్పడింది. నేటి భారతీయ జనతా పార్టీకి, దాని పూర్వరూప మైన భారతీయ జనసంఘ్ కు అది పురుషులైన సావర్కర్, ముంజే, శ్యామప్రసాద్ ముఖర్జీ, తదితరులందరూ హిందూ మహాసభలో ముఖ్య పాత్ర వహించారు. దేశ విభజనకు , విభజన సమయంలో జరిగిన మరణ హోమానికి ఈ రెండు సంస్థలదే  బాధ్యత. అఖండ భారత్ వాస్తవీకరణకు అడ్డం నిలిచాడన్న కక్షతో గాంధీని హత్యచేశారు. అప్పటి నుండి చాప కింద నీళ్ళలాగా తమ బలాన్ని పెంచుకుంటూనే వచ్చారు. యువజనులను ఆకర్షించేందుకు శాఖల నిర్వహణ, పాఠశాలల నిర్వహణ, శాఖల ద్వారా వచ్చిన కార్యకర్తలకు తమ విద్య సంస్థలలో ఉద్యోగాలు కల్పించి కార్యకర్తలను కాపాడుకున్నారు. 

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి పాలన బాధ్యతలను స్వీకరించిన కాంగ్రెస్ భారత ప్రజానీకం పట్ల తన బాధ్యతలను విస్మరించి , భూస్వామ్య, దళారి బూర్జువా వర్గాల సేవలో మునిగి పోయింది. భూస్వాముల ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా , ఆ భూములను భూమిహీన ప్రజానీకానికి పంపిణీ చేయకుండా, కంటి తుడుపు చర్యలతో కాలం వెళ్లబుచ్చింది. దళారి బూర్జువాజీ అవసరాలు తీర్చే కొన్ని చర్యలు చేపట్టినా , అవి దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేయలేదు. దాన్నే నేడు అధికారం కోల్పోయిన పాలక వర్గాలు, పార్టీలు అభివృద్ధియని చెప్పుకుంటున్నారు. మధ్య తరగతి కొంత పెరిగినా , అంతరాలు విపరీతంగా పెరిగి పోయినాయి. దేశంలోని ఏ రాష్ట్రం లోనూ ఉన్న ఊరిలో గౌరవప్రదమైన జీవనోపాధి దొరకడం అసాధ్యమై పోయింది. పాలకవర్గాలు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎంత బోలుదో కరొన సంక్షోభం విడమర్చి చెప్పింది. కోట్లాది మంది కాలినడకన వందలు వేలాది కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. అభివృద్ధి చెందుతున్న ఏ దేశంలోనూ ఈ దుస్థితి కనిపించలేదు. ఈ పరిస్థితి ఒక్క రోజులో వచ్చింది కాదు. డెబ్బై అయిదేళ్ళ పాలకవర్గాల నిర్వాకం.

డెబ్బై దశకం వరకు ప్రజలు పాలకవర్గాల మాటలు కొంత నమ్మారు. కాని ఇందిరా గాంధీ కాలం నాటికి అసంతృప్తి ఆకాశాన్నంటింది. ఆ చరిత్ర కల్లోల డెబ్బైలలో కనపడుతుంది. ఇందిరాగాంధీ అమలు చేసిన నిర్బంధకాండను ,దోపిడి పాలనను తిప్పికొట్టిన ప్రజానీకం ఎంతో ఆశతో ప్రతిపక్షాల కూటమియైన జనతా పార్టీకి పట్టం కట్టారు. ఆ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు. ప్రతిపక్షకూటమిలో  ప్రధాన భాగస్వామి అయిన నేటి బి. జె. పి వర్గం పెత్తనం తన చేతిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసింది. ఆ ఘర్షణలో కొత్తగా ప్రజలను మోసపుచ్చే నినాదాలేవి లేక తొంభై దశకం ప్రారంభం నుండి మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతూ, ముస్లిం పాలకులు ధ్వంసం చేసినట్టుగా చెప్పుతున్న దేవాలయాల పునరుద్ధరణ, ప్రత్యేకించి అయోధ్య రామ జన్మభూమి వివాదాన్ని పైకి తెచ్చి మెజారిటీ మతస్థులలో గణనీయమైన సెక్షన్నుతన వైపు తిప్పుకున్నది. రాజ్యాంగం పట్ల , దేశ చట్టాల పట్ల వ్యతిరేకతను   అడుగడుగునా ప్రదర్శించింది. నాటి నాయకులు వాజపేయి, అడ్వాణీ చట్టలను లెక్క చేయనవసరం లేదంటూ ప్రకటనలు చేసి, తమ అనుచర గణాన్ని రెచ్చగొట్టారు. ఒక ఉన్మాద పరిస్థితిని సృష్టించారు. దాని బలంతోనే మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఆ ఉన్మాద పరిస్థితిని గుజరాత్ లో అత్యున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళిన నరేంద్ర మోది సహజంగానే ఫాసిస్టు మూకలకు దేశాన్నుద్ధరించగలిగిన  కారణజన్ముడిగా కనిపించాడు . అడ్వాణీయే కదా  బాబ్రీ మస్జిద్ విధ్వంసనకు నాయకత్వం వహించింది? “చాహే సర్కార్ కుచ్ భీ కర్లే, మందిర్ వహిన్ బనేగి”అని రెచ్చగొట్టినది వాజపేయి కాదా? మోది రాజధర్మం అతిక్రమించాడని వాజపేయి అన్న మాట కేవలం కంటి తుడుపే. వారు నాటిన విత్తనం ఈ నాడు విస్తృత విషవృక్షమయింది.

 పెట్టుబడికి ఊడిగం, కార్మిక, పీడిత వర్గాల అణచివేత, మతభావాల ఉద్దీపన, మతాలు , సమూహాల మధ్య వైషమ్య సృష్టి, ఇతర ప్రజాసమూహాలపై హింసాకాండ జరిపే హంతక మూకల నిర్మాణం , పార్లమెంటరీ ప్రజాస్వామ్య రూపాల విధ్వంసనం, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా యుద్ధోన్మాదం, ప్రజల పక్షాన పోరాడే వ్యక్తులు , శక్తులపై వినాశక దాడులు  ఫాసిజం సారాంశం. మోది అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే  తన ప్రభుత్వం “బిజినెస్ ఫ్రెండ్లీ”అని చెప్పుకున్నడు. అదే వరవడిలో కార్మికుల హక్కులను హరించి వేసే నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చాడు.పెట్టుబడిదారులకు ప్రభుత్వం చేసే ఊడిగానికి అడాణి ఉదంతం ఒక చక్కని ఉదాహరణ.  వ్యవసాయ రంగంలో  ఆశ్రిత పెట్టుబడిదారులకు మేలు చేసే వ్యవసాయ చట్టాలను తెచ్చాడు. ఆ చట్టాలను పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల రైతులు ఏడాది కాలం పాటు ఎండవానలను లెక్క చేయకుండా , ఆరు వందల మంది బలిదానాలిచ్చి తిప్పికొట్టారు.  మోది ప్రభుత్వపు తొమ్మిది సంవత్సరాల పాలనలో బిలియనీర్ల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. ఆ వివరాలను ఆక్స్ఫమ్ చక్కగా వివరించింది. రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి చేసి మూడవ సారి తన అధికారాన్ని పదిలపర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే కాకుండా కాశీ లో కూడా మరొక వివాదాన్ని ప్రారంభిస్తున్నారు. మథురలో వివాదాన్ని సృష్టించి ఆరని మాట చిచ్చులను రగిలిస్తున్నారు. గోరక్షకుల పేరుతో గుండా గ్యాంగులను ఏర్పాటు చేసి ముస్లిం మతస్తులను భయపీడితులను చేస్తున్నారు. ముస్లిముల పట్ల వివక్ష చూపే సవరించిన పౌరసత్వ చట్టాన్ని, జాతీయ పౌర రిజిస్టర్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. దేశ వ్యాప్తంగా శివాజీ జయంతి ఉత్సవాలను జరుపుతూ, విగ్రహాలు ప్రతిష్టిస్తూ ఇతర మతస్తులకు భయానక వాతావరణాన్ని సృష్టిస్తు న్నారు. కాశ్మీరీ సమస్యపైన, గాల్వాన్ లోయ సమస్య పైన పొరుగు దేశాలపై యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ చర్యలతో మధ్య తరగతిని, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న వెనుకబడిన కులాలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నది. మధ్యతరగతి పైపై చర్యలకు తొందరగా పక్కదారి పడుతున్నది. ఇది చాలా విచారకరమైన విషయం. వారి విధానాలను వ్యతిరేకించే వారందర్నీ దేశద్రోహులని , అర్బన్ నక్సలైట్లని ఆరోపిస్తున్నారు. అబద్ధపు కేసుల్లో విచారణ లేకుండా నిరబంధిస్తున్నారు. రాజ్యాంగం లోని ఆర్టికిల్ 370 ని రద్దు చేసి , కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కూడా రద్దు చేశారు. అక్కడితో ఆగకుండా కాశ్మీర్ ను మతాల ప్రాతిపదిక మీద ముడుముక్కలు చేసి , నిబంధ కాండను తీవ్ర తరం చేసివేశారు. దేశంలో వైవిధ్యానికి విఘాతంగా ఏక భారత్,ఏక నేత లాంటి నినాదలిస్తూ వస్తున్నారు. ప్రజల జీవితాలను దుర్భరం చేసే ఏకీకృత జి. ఎస్. టి లాంటి పన్నుల విధానాన్ని అమలులోకి తెచ్చి రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తూ,ఫెడరల్ స్వరూపాన్ని దెబ్బ తీసే విధంగా చర్యలు చేపట్టుతున్నారు.పలు బి. జె. పి పాలిత రాష్ట్రాలలో మతాంతరికరణను చట్ట విరుద్ధంగా పరిగణించే చట్టాలను అమల్లోకి తెచ్చారు. ముమ్మారు తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా చేసే చట్టాన్ని తెచ్చారు. పైకి ఎన్ని మాటలు చెప్పినా , ముస్లిం మహిళలు హర్షం ప్రకటిస్తున్నారని చెప్పినా , ఆ చట్టంలో ఉన్నది ముస్లిమ్ వ్యతిరేకతే . సైనిక దళాలలో సైతం తమ కార్యకర్తలను చేర్చేందుకు నియామక విధానన్నే పూర్తిగా మార్చి వేసి కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు. నూతన విద్యావిధానం పేరిట విద్య వ్యవస్థను కూడా మతం ప్రాతిపదిక మీద,వేదాల ప్రాతిపదిక మీద,హేతు విరుద్ధ ప్రాతిపదిక మీద నిర్మించడానికి బృహత్పథకం తయారు చేశారు.

మరొక వైపున మేక్ ఇన్ ఇండియా పేరుతో విదేశీ పెట్టుబడిని ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశీ కంపనిల వస్తువులను తయారుచేసి, వాటిని ఎగుమతి చేసి స్వయంసమృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మనదేశం లో విజ్ఞాన శాస్త్రాలను , సాంకేతిక నైపుణ్యాన్ని దృఢతరం చేసే విద్యను నిరుత్సాహ పరచి, ఈ యుగానికి పనికిరాని పద్ధతులను ప్రోత్సాహిస్తున్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల బి. జె. పి ప్రభుత్వ పాలనలో హిందూ మతోన్మాదం, ముస్లిం వ్యతిరేకత, దోపిడి వర్గాల కొమ్ముకాయడం, ప్రజాస్వామ్య క్రమాల పట్ల వ్యతిరేకత, యూనిటరి తరహా ప్రభుత్వ స్థాపన, ప్రభుత్వ సంస్థల కాషాయీకరణ , ప్రజావ్యతిరేకత , విజ్ఞాన శాస్త్రాల విధ్వంసన వగైరా తిరోగమన చర్యలు కోకొల్లలు. ఇవే ఫాసిజం సారాంశం. ఈ చర్యలు ప్రజలను కొంతకాలం మోసపుచ్చగలవేమో కాని ఎల్లకాలం ఆకట్టుకోలేవు. గతకల వైభవం దోపిడి వర్గాలు కోరుకునేది. ప్రజలకు కావలసి ఉంది అన్నవస్త్రాలు, నిలువనీడ , ప్రశాంత జీవనం మాత్రమే. అది ఇవ్వలేక ఉత్తనినాదాలతో పొద్దు పుచ్చె ప్రభుత్వాలను సమాయమాసన్నమైనప్పుడు  తిప్పికొడతారు. బి. జె. పి పాలనలో పిడితులైన అన్నీ వర్గాలు, సెక్షన్ల ప్రజలను ఫాసిజానికి వ్యతిరేకంగా సమీకరించి ,పోరాటలలోకి దించాలి. ఈ భారతీయ తరహా ఫాసిజాన్ని తిప్పికొట్టేందుకు, పాతిపెట్టేందుకు విశాల ఐక్యసంఘటన అవసరం.

Leave a Reply