హస్ దేవ్ నిరవధిక పోరాటానికి ఏడాది అయిన సందర్భంగా 13, ఫిబ్రవరి 2023 న సర్గుజ జిల్లా హరిహరపురంలో జరిగిన ధర్నాకు దేశ వ్యాప్తంగా వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. విద్యార్థి, రైతాంగ, యువజన, మేధావులు నలుమూలల నుండి రావడం ఒక అద్భుతం. . దేశ వ్యాప్త సమర్ధనతో ధర్నా విజయవంతం కావడం పోరాడితే పోయేదేమీ లేదు మన పై హింస తప్ప అని మరోసారి రుజువు చేసింది. అలాగే ధర్నా స్థలి నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లాలో జరుగుతున్న ఏరియల్ బాంబింగ్ ను ఆపేయాల్సిందిగా తీర్మానం చేస్తూ అక్కడ ఎంతో ధైర్యంగా పోరాడుతున్న ప్రజలకు జేజేలు తెలపడం పోరాట ప్రజల మధ్య ఐక్యతకు చిహ్నం. రేపురేపు అన్ని ప్రాంతాల, అన్ని సెక్షన్ల ప్రజలు కలిసి చేసే దేశ వ్యాప్త పోరాటానికి నాందిగా చెప్పుకోవచ్చు.
ఈ ధర్నా లో హస్దేవ్ రక్షణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడుతున్న ఆదివాసీల పోరాట పటిమను ఎత్తి పడుతూ ఈ భూమి నీరు అడవి ఆదివాసీల సంపద, వీటిని ఎవరూ ఆదివాసీల నుండి వేరు చేయలేరు, ఒక చెట్టు పెరగడానికి సమయం పట్టినట్టుగానే పెరిగిన చెట్టు నరకకుండా కాపాడుకోడానికి కూడా సమయం పడుతుంది, ఓపికతో పోరాడుతూ ఒక్క చెట్టు కూడా నరక కుండా ఉండేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి, దేశ వ్యాప్త మద్దతు కూడగట్టాలి.. అంటూ ముఖ్య వక్తగా వచ్చిన జాతీయ రైతు నాయకులు శ్రీ రాకేష్ టికాయత్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
వంద రోజులుగా జరుగుతున్న హస్ దేవ్ పోరాట సందేశం ఏమిటి ? దాన్ని ఎలా చూడాలి? అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఈ దేశ మూలవాసులను అర్థం చేసుకోవాలి . “జల్, జంగల్, జమీన్ హమారా హై” “న జాన్ దేంగే, న జమీన్ దేంగే” (నీరు, అడవి, భూమి మావే, ప్రాణం ఇవ్వం, భూమి ఇవ్వం) అంటూ ఇస్తున్న యుద్ధ నినాదాలు మనం వింటూ ఉంటాం. అయితే ఈ నినాదాలు ఎందుకు ఇస్తున్నారు? వీటి వెనక ఉన్న ఆవేదన ఏమిటి అనేవి మనలో ఎంతమందికి తెలుసు? ఈ నినాదాలకు ఉన్న ప్రాసంగికత ఏమిటి అర్థం కావాలి అంటే పోరాటమే జీవనంగా ఉన్న ఆదివాసీ జీవితాల్లోకి తొంగి చూడాలి.
దేశ నలుమూలలా పోరాట నిలయాలుగా ఉన్న ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసులు మనకి ఎన్నో విషయాల్లో మార్గదర్శకులు. తెలంగాణ అదిలాబాద్, మిగతా జిల్లాల్లో , ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం, తూర్పు ఏజెన్సీ, ఒరిస్సా లో ప్రస్తుతం జిందాల్ కి వ్యతిరేకంగా నడుస్తున్న ధింకీయా ప్రజల తిరుగుబాటు, అస్సాం లో అటవీ పరిరక్షణ పోరాటం, ఝార్ఖండ్ ఆదివాసులు చేస్తున్న పోరాటాలు, 4 దశాబ్దాలకు పైగా కాలం నుండి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు దండకారణ్యంలో పెద్ద ఎత్తున ఆదివాసీల భాగస్వామ్యంతో జరుగుతున్న ఉద్యమం ఇంకా ఇలా ఎక్కడైనా ఏ ఆదివాసీ ప్రాంతం అయినా పోరాట నేపథ్యం ఉన్నదే, పోరాటం కొనసాగిస్తున్నదే. ఛత్తీస్గఢ్ ఆదివాసీలు కూడా అదే పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
మధ్య భారతదేశంలోని ఉత్తర ఛత్తీస్గఢ్ లోని సర్గుజా, సూరజ్ గడ్, కోర్బా జిల్లాల్లో వ్యాప్తమై ఉన్న హస్ దేవ్ దట్టమైన అడవిని జీవనాధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న ఆదివాసీలు చేస్తున్న పోరాట నినాదమే పై నినాదం. ఐక్యత, పట్టుదల, పోరాటం సహజ గుణాలుగా ఉంటాయి ఆదివాసీ జీవన విధానం లో. అందుకే వారు చేస్తున్న పోరాటాలు ఎంతో పటిమ కలిగి ఉండి మనకి సందేశాన్ని ఇస్తుంటాయి. దోపిడీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ప్రజా ప్రభుత్వాన్ని ఉదాహరణగా నిలుపుతాయి. అయితే వారు పోరాటం ఎందుకు చేస్తున్నారు? తెలుసుకోవలసిన, మద్దతు ఇవ్వాల్సిన (భాగం కావాల్సిన) అవసరం, బాధ్యత మైదాన ప్రాంత ప్రజలందరి పై ఉంది. ఎందుకంటే అక్కడి ఆదివాసీలు చేస్తున్న పోరాటం వారి కొరకు మాత్రమే కాదు మనందరి మనుగడకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దూరం చేయడం కొరకు కూడా. ఏమిటా ప్రమాదం? ఎవరి నుండి ఆ ప్రమాదం? తెలుసుకుందాం…..
లక్షా 70వేల హెక్టార్ల (దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా) విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న హస్ దేవ్ అడవులు బొగ్గు నిక్షేపాలు కలిగి ఉన్నాయని దోపిడీ పాలకుల, కార్పొరేట్ల కన్ను పడింది. దాంతో అడవిని నాశనం చేసి అయినా సరే బొగ్గును తవ్వాలని కార్పొరేట్ల కు ఊడిగం చేసే ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువ బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఈ అడవుల్లో నిక్షిప్తమై ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. మనిషి మనుగడ కన్నా లాభార్జనే ప్రధానమైన కార్పొరేట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని నాశనం చేసి బొగ్గు తవ్వకానికే నిర్ణయించుకున్నారు.
2010 లో మొదటగా అటవీ ప్రాంతాన్ని బొగ్గు క్షేత్రాలుగా మార్చడానికి సిఫార్స్ చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. రాజస్థాన్ ప్రభుత్వ యాజమాన్యంలో విద్యుత్ వినియోగ సంస్థ కు ఈ తవ్వకాల పనిని కేటాయించారు. జూన్ 2011 లో ఇంత పెద్ద మొత్తంలో చెట్లు నరికేయడం పర్యావరణ సంతులనానికి చాలా ప్రమాదమని, తవ్వకాలకు అనుమతించరాదని కేంద్ర పర్యావరణ సంస్థ సిఫార్స్ చేసింది. అయినా అప్పటి పర్యావరణ మంత్రి సంస్థ సిఫార్స్ ఎంత మాత్రమూ పట్టించుకోకుండా తవ్వకానికి ఆమోద ముద్ర వేశాడు. ఈ ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సవాల్ చేయడం తో రెండు విడతలుగా చేయాలనుకున్న తవ్వకాలు మానవ మనుగడను ప్రమాదంలో పడేస్తుందని పర్యావరణ విరుద్ధమని హెచ్చరిస్తూ తవ్వకాలు నిలిపి వేయాల్సిందిగా 2014 లో తన తీర్పు ఇచ్చింది. కానీ సుప్రీం కోర్టు ఈ తీర్పు పై స్టే ఇవ్వడంతో మళ్ళీ తవ్వకాల ప్రక్రియ కొనసాగింది.
రాజస్థాన్ విద్యుత్ వినియోగ సంస్థ తో అదానీ మైన్స్ చేసుకున్న ఒప్పందం ప్రకారం 74% పెట్టుబడులు పెట్టిన (అయితే ఈ పెట్టిన పెట్టుబడులు అన్నీ ఎల్ ఐ సి, ఎస్ బి ఐ ఇంకా ఇతర ప్రభుత్వ బ్యాంక్ లలో దాచుకున్న సాధారణ ప్రజల సొమ్మే అనేది మనకి తెలిసిందే) అదానీ ఎంటర్ప్రైజస్ పర్సా ఈస్ట్ కాంట భవన్ బొగ్గు క్షేత్రాలకు గని డెవలపర్, ఆపరేటర్ గా ఉంటుందని ప్రకటించింది. దాంతో గనిలోని అనేక మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అదానీ కోటలోకి వెళ్తాయి.
మానవ, వన్య ప్రాణుల మనుగడకు అడవి ఎంత విడదీయరానిది మనకి తెలిసిందే. పర్యావరణ సంతులనం కోసం, జీవిక కోసం అడవి అత్యావశ్యకం. రేపటి తరాలు మనుగడ సాగించాలి అంటే అడవులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. కానీ మార్కెట్ విస్తరణ కాంక్ష తో కార్పొరేట్లు తమ వాణిజ్య పెట్టుబడులను విస్తరించేందుకు అడవులను నాశనం చేస్తున్నారు వేలాది మానవుల, వన్య జీవుల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. కార్పొరేట్ల కాంక్ష కు అనుగుణంగా ఆర్థిక విధానాలు రూపొందిస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
“ఒకవేళ హస్ దేవ్ లో ఎలాంటి తవ్వకాలు చేపట్టినా బాంగో ఆనకట్ట ప్రమాదంలో పడిపోతుందని దాని నీటిమట్టం సామర్థ్యం తగ్గిపోతుంది అని, సర్వ మానవ మనుగడకు ఆధారం అయిన ఆక్సిజన్ తగ్గిపోతుంది అని, అడవి గుండా ప్రవహిస్తున్న నది ఎండిపోయి జల కొరత ఏర్పడుతుందని, ఖనిజ తవ్వకం జరిగితే మానవులు ఏనుగుల మధ్య సంఘర్షణ ఎప్పటికీ నియంత్రించ లేనంత స్థాయిలో పెరిగిపోతుందని” ప్రభుత్వ అధ్యయన సంస్థలే హెచ్చరిస్తున్నప్పటికీ గౌతం అదానీ ఖనిజ తవ్వకాల కంపెనీ కి నామమాత్రపు ధరకి వేల కోట్ల లాభాలు చేకూరుస్తూ చట్ట విరుద్ధంగా తవ్వకాలకు అనుమతినిచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆదివాసులకు బతుకుదెరువు, సంస్కృతి అయిన అడవి ఆధారం చేసుకుని జీవిస్తున్న వాళ్ళకి వార్షిక ఆదాయం లో 60% ఈ అడవి నుండే వస్తుంది కాబట్టి తమ మనుగడకు ప్రమాదంగా జరుగుతున్న తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడి అడవిని రక్షించుకోవడానికి సుదీర్ఘంగా పోరాడుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్ల కు అనుకూలంగా వార్తలు రాస్తూ పోరాడే ఆదివాసులకు మద్దతు అందకుండా చేయడానికి తమ స్వామి భక్తి చాటుకుంటూ రక్షణ కవచంగా ఉంది నాలుగో స్తంభం అయిన మీడియాలోని ఒక భాగం. పోరాటాన్ని ఎత్తిపడుతూ వార్తలు రాసే ప్రజా పక్ష మీడియా పోరాడుతున్న ప్రజలతో పాటూ పాలకుల, కార్పొరేట్ల హింసను ఎదుర్కోవలసి వస్తోంది.
అయితే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రాంతాల్లో పెసా చట్టం, 1996 , మరియు అటవీ అధికార గుర్తింపు చట్టం, 2006 ప్రకారం భూమిని హస్తగతం చేసుకోవాలన్నా ఎలాంటి తవ్వకాలు చేపట్టాలన్నా అక్కడి గ్రామ సభ అనుమతి తప్పనిసరి. ఆ అడవి పరిధిలో ఉన్న 20 గ్రామ సభలు సుదీర్ఘ కాలంగా బొగ్గు ఖనిజ తవ్వకాలను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అదానీ ఇంకా ఇతర కార్పొరేట్ల కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు నకిలీ గ్రామ సభ తీర్మానాల ద్వారా అనుమతి ప్రక్రియ పూర్తి చేశాయి. వాస్తవానికి పెసా చట్టం రద్దు చేసే అధికారం గానీ, సవరించే అధికారం గానీ ప్రభుత్వాలకు లేదు కానీ వాళ్ళే రూపొందించుకున్న చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ల అనుకూల తమ విధానాలు అమలు చేస్తున్నాయి.
చట్టాలన్నీ ఉన్నోళ్ల చుట్టాలు గా ఉన్న స్థితి. పోరాట కారుల, ప్రజల అనుకూల చట్టాలు కూడా అప్పటికి పోరాటాలను అదుపు చేయడం కోసం తెచ్చినవే తప్ప దశాబ్దాలు గడిచినా ఆ చట్ట ప్రయోజనాలు ప్రజలకు చేరింది ఎంత మాత్రమూ లేదు. పరిశ్రమలు నెలకొల్పే కార్పొరేట్ వర్గాలు తమ సామాజిక బాధ్యతగా పునాది అవసరాలకు నిధులు సమకూర్చడం విధి. బొగ్గు గనుల ప్రాంతాల్లో చట్ట ప్రకారం 26% లాభాలు స్థానిక ప్రజలకు కేటాయించాలని శాసనబద్ధం చేసినప్పటికీ ఎక్కడా మచ్చుకి కూడా కనిపించవు. మొన్నటికి మొన్న అదానీ ఫౌండేషన్ కి 60 వేల కోట్లు అదానీ భార్య 60వ పుట్టిన రోజు సందర్భంగా విరాళం ఇచ్చినట్టు ఉంటుంది ఈ నిబంధన అమలు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చెప్పుకోవడం అవసరం ఎంతైనా ఉంది. హస్ దేవ్ అడవిలోని తవ్వకాలు మొదలు పెట్టినప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రలో ఉంది. ఆదివాసీల పక్షమే తాను అంటూ మొసలి కన్నీరు కార్చింది. ఆదివాసీల నుండి భూమిని, అడవిని లాక్కునే అభివృద్ధి మనకొద్దు అంటూ నీతులు వల్లించింది. అంతేకాదు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పోరాట కేంద్రం అయిన మదనాపుర్ లో రచ్చబండ నిర్వహించి బొగ్గు తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు తెలియజేస్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తే తవ్వకాలు ఆపేస్తాం అంటూ హామీ ఇచ్చాడు. అంతేకాదు కేంబ్రిడ్జ్ లో పోయినేడాది ఒక సందర్భంగా హస్ దేవ్ ఆదివాసీలు చేస్తున్న పోరాటం సరైనది అంటూ వెంటనే పరిష్కరించాల్సిన అంశం అంటూ ప్రకటించాడు. ఆ రచ్చబండ అయిన కొద్ది రోజులకే వచ్చిన ఎన్నికల్లో 2015లో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. తవ్వకాలు ఆపేస్తామంటూ చేసిన హామీ నీటిమీద రాత అయింది. ఆపకపోగా మిగిలిపోయిన అనుమతుల ప్రక్రియ కూడా పూర్తి చేసి తవ్వకాలు వేగవంతం చేసింది. ఇదంతా ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు సోనియా గాంధీతో జరిపిన మంతననాల తర్వాతే జరిగింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి పోలీసు బలగాల సాయం తో పోరాడుతున్న వారి పై హింస ప్రయోగిస్తూ (జైల్లో పెడుతూ హత్యలు చేయిస్తూ) తవ్వకాలకు అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు చేసి కార్పొరేట్ల పట్ల తమ విధేయత చాటుకున్నాడు. అంతేకాదు పోరాడుతున్న వాళ్ల పట్ల, మద్దతు ఇస్తున్న వాళ్ల పట్ల తప్పుడు ప్రచారం కు ఊతం ఇచ్చాడు. భూమి విలువకు నాలుగురెట్లు అడగడమో, ఉద్యోగ భద్రత అడగడమో చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ ప్రచారం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొదట తాము ఈ తవ్వకాలు ఆపేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని నమ్మబలికింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోడీ అదానీల కుంభకోణాల గురించి పార్లమెంట్ నుండి రోడ్ దాకా పోరాటాలు చేసింది. ఇవి చేయాల్సినవి అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీ చేస్తున్నది కూడా అదే. అదానీ మైన్స్ కి వేల కోట్ల లాభాలు చేకూర్చే విధానాలే అమలు చేస్తుంది. అన్ని పాలక పార్టీలు ప్రజా వ్యతిరేకమైనవే, వారి స్వార్థ ప్రయోజనాలకు దోపిడీ పాలనే సాగిస్తుంది అనేది మనకి చరిత్రలో, వర్తమానంలో అనేక మార్లు రుజువు అయిన విషయమే. ఆదివాసీ ప్రజలకు పూర్తిగా తెలుసు వాళ్లకేం కావాలి, వాళ్లేం చేయాలి అనేది అందుకే భూమి బదులు డబ్బు, ఉద్యోగం కోసం పోరాడడం లేదు ఈ భూమి మాది, ఈ నీరు మాది, ఈ అడవి మాది అంటూ రాజీ లేని పోరాటం చేస్తున్నారు. 2021అక్టోబర్ లో 300 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత ప్రభుత్వాల నుండి తవ్వకాలు ఆపే వైపుగా ఎలాంటి చర్యలు లేకపోవడం తో పూర్తిగా నిరవధిక పోరాటం చేపట్టారు. 2022 మార్చి 2 నుండి మొక్కవోని దీక్ష తో చేస్తున్నారు. ఇది ఇప్పట్లో ఆగేది కాదు. సమస్యలున్నంత వరకూ ప్రజలు పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాడే ప్రజలతో భుజం కలిపి అడుగు వేయడమే మనం చేయాల్సింది. కార్పొరేట్ల ను ఎదుర్కొనే ఏకైక మార్గం అదే.