కర్ణాటక విద్యాసంస్థల్లో బిజెపి అనుబంధ గ్రూపులు రెచ్చగొట్టిన హిజాబ్ వివాదం వాళ్ళు కోరుకున్నట్లుగానే మత చిచ్చును రేపింది. వివాదం ఎవరు మొదలు పెట్టారు, గుంపులను రెచ్చగొడుతున్నది ఎవరు అనే విషయాలు ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, వాటిని అదుపు చేసే చర్యలు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వం మూడు రోజులు విద్యాసంస్థల్ని మూసేసింది. హిందూ, ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా వారి మతపరమైన దుస్తులు వేసుకొచ్చి గొడవ చేస్తున్నారని మీడియా ప్రచారం చేసింది. విద్యార్థులంతా స్కూల్ యూనిఫాం తప్ప ఏ మతపరమైన బట్టలు తగిలించుకోకూడదని కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది.
పీడకులు బాధితుల మధ్య తటస్తంగా వ్యవహరించడమంత మోసం ఇంకోటి ఉండదు.
అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? ఉడిపి లోని ప్రభుత్వ బాలికల ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ముస్లిం అమ్మాయిలను హిజాబ్ తీసేస్తే గాని క్లాసులకు రానివ్వమని అభ్యంతర పెడితే ఆరుగురు అమ్మాయిలు మొదట క్లాస్ రూమ్ బైట కూర్చొని నిరసన తెలిపారు. ముఖం కనిపించేలా తలకు హిజాబ్ ధరించడం యూనిఫాం కోడ్ ను ఉల్లంఘించడం కాదని, తమని క్లాసుల్లోకి అనుమతించమని వారు కర్ణాటక హైకోర్టుకు, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను పిటిషన్ పెట్టుకున్నారు. దీన్ని సహించలేని బిజెపి అనుబంధ సంస్థలు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకునే మరో కాలేజ్ లో అబ్బాయిలకు కాషాయ కండువాలు వేసి పంపించి గొడవ చేయించారు. ఆ కాలేజ్ లో హిజాబ్ ధరించే అమ్మాయిలకు పోటీగా వీళ్ళు అలా తయారైనట్టు చెప్పుకున్నారు. ముస్లింలు వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకునే గుడ్డ చుట్టుకున్నారు కాబట్టి హిందువులం కూడా మా మత అస్తిత్వాన్ని ధరిస్తామని విచిత్రమైన వాదన మొదలు పెట్టారు. దీన్ని మిగతా కాలేజీలకు కూడా వ్యాపింపజేశారు. నిజానికి సన్యాసులు కాషాయం ధరిస్తారు తప్ప సాధారణ హిందువులెవరూ కాషాయ గుడ్డలు మెడలో వేసుకొని తిరగరు. బిజెపి, దాని సోదర సంఘాలకైతే అది వారి రాజకీయ ప్రతీక. మతరాజకీయ ప్రతీక అని కూడా అనుకోవచ్చు. ఈ చర్య ద్వారా వారు అక్కడ చేస్తున్నదీ రాజకీయమే. ఇంకా విచిత్రం ఏమిటంటే కొన్ని చోట్ల అబ్బాయిలు, అమ్మాయిలు కూడా కాషాయ తలపాగాలు పెట్టుకొని స్కూళ్లకు రావడం. ఇది ఏ హిందువులు పాటించే సంప్రదాయ వస్త్రధారణో వాళ్ళను అడిగితే ఏం సమాధానం చెప్తారో. కొంపదీసి ఇప్పటి నుండి హిందువులంతా కాషాయం కట్టుకోవాలని గొడవ చేస్తారా ఏమిటి?
హిందూ అమ్మాయిలు బొట్టు, గాజులు వేసుకొనే స్కూళ్లకు, కాలేజీలకు వస్తారు. పెళ్ళయిన అమ్మాయిలు తాళిబొట్టు, మెట్టెలు కూడా వేసుకొని వస్తారు. వీటినెవరూ ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. సిక్కు అబ్బాయిలు తలకు గుడ్డ చుట్టుకొని వస్తారు. దీని కూడా ఎవరూ ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. అటువంటప్పుడు హిజాబ్ మాత్రమే స్కూల్ యూనిఫాం కోడ్ ను ఉల్లంఘిస్తుందనడంలో మత వివక్ష తప్ప వేరే ఏ హేతువు లేదు. పోనీ మనది సెక్యులర్ దేశం కదా, ఏ మత చిహ్నాలైనా విద్యాసంస్థల్లో ఉండకూడదు అనే నియమం కచ్చితంగా పాటించాలి అంటే పార్థనా గీతాల దగ్గరి నుండి దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు అన్నీ తొలగించాలి. పబ్లిక్ వ్యవహారాలలో మతానికి అతీతంగా ఉండేంత నాగరికులుగా ఇంకా మనం ఎదగలేదు. కాబట్టి ఇక్కడ మత సహనం గురించే మాట్లాడుకోగలం.
ఇంకో విచిత్రం ముస్లిం అమ్మాయిల స్వేచ్ఛ గురించి ఈ సందర్భంలో చర్చ చేయడం. ఆడపిల్లల స్వేచ్ఛ మీద గౌరవం ఉండేవాళ్లే అయితే హిజాబ్ లు, బుర్ఖాలు ధరించిన అమ్మాయిల చుట్టూ చేరి అల్లరి పెట్టరు. నిజానికి వివాదం హిజాబ్ దగ్గర మొదలైంది. కానీ చర్చ బుర్ఖా వైపు మళ్లించారు. ఏదైనా సరే, ఏ బట్టలు కట్టుకోవాలన్నది పూర్తిగా ఆ మహిళలు నిర్ణయించుకోవాల్సిన విషయం. మరి పితృస్వామిక అణచివేత లేదా అంటే ఉండొచ్చు. (పితృస్వామిక అణచివేత అన్ని మతాల్లో ఉంది.) దాన్నుండి మహిళలు బైట పడాలి అంటే ముందు వాళ్ళు చదువుకునేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు తోడ్పడాలి. కానీ వీళ్ళు చేస్తున్నదేమిటి? చదువుకోడానికి వచ్చిన అమ్మాయిలను అల్లరిపెట్టి తరిమేయడం. పైగా మీకు హిజాబ్ కావాలా, చదువు కావాలా అని అడగడం! మన దేశంలో చాలా వరకు ముస్లిం కుటుంబాల నుండి మొదటి తరం అమ్మాయిలు చదువుల్లోకి వస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్ళ మధ్య వాళ్ళు చదువుకుంటున్నారో మనసుపెట్టి ఆలోచించగలిగితే ఇలాంటి అసంబద్ధ చర్చ చేయరు.
హిజాబ్ గొడవ ముస్లిం అమ్మాయిలను పితృస్వామిక అణిచివేత నుండి బైట పడేయడానికో, విద్యాసంస్థల్లో సెక్యులర్ యూనిఫాంను, తద్వారా సెక్యులర్ భావాలను వ్యాప్తి చేయడానికో అని వాళ్ళు వాదన చేస్తే అంతకన్నా దగుల్బాజీతనం ఇంకోటి ఉండదు. వాళ్ళు చేస్తున్నది దీనికి సరిగ్గా వ్యతిరేకం. ఇప్పుడిప్పుడే అభివృద్దిలోకి వస్తున్న అమ్మాయిలను చదువు నుండి దూరం చేయడం. స్కూల్లో అరమరికలు లేకుండా కలిసి మెలిసి ఆడుకునే పిల్లల మనసుల్లో మతభావాలను, పరమత ద్వేషాన్ని రెచ్చగొట్టడం.
నెల క్రితం ముస్లిం మహిళలపై ఇంటర్నెట్ మీద అసభ్యంగా వేధించడం, అవమానపరచడం చూశాం. ఇప్పుడది బహిరంగ వీధుల్లోకి చేరింది. కొంతకాలంగా ఆరెస్సెస్, బిజెపి, వాటి అనుబంధ సంస్థలు ముస్లిం మహిళలని లక్ష్యం చేసుకున్నారు. ఇందులో బుర్ఖాలు, హిజాబ్ లు ధరించని మహిళలున్నారు. ధరించే వాళ్ళూ ఉన్నారు. వారు వివిధ సామాజిక రంగాల్లో పనిచేస్తూ రాజ్యహింసను, అణచివేతను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు కచ్చితంగా తమ కుటుంబాల్లో, తమ సమూహాల్లో పితృస్వామ్యాన్ని ఎదిరించిన వారే అయి ఉంటారు. ఇప్పుడు పితృస్వామిక రాజ్యాన్నీ ప్రశ్నిస్తున్నారు. పితృస్వామిక రాజ్యం ఏ సమూహం మీదైనా దాడి చేయాలనుకున్నప్పుడు ఆ సమూహాపు మహిళలపై దాడి చేస్తుంది. అందులో మానసిక, లైంగిక దాడి ప్రధానం. హిజాబ్ పేరుతో చేస్తున్నది కూడా అందులో భాగమే. హిందుత్వవాదులు ‘హిజాబ్ ధరించడం తమ హక్కు’ అని మొదటగా నిరసన తెలిపిన ఆరుగురు అమ్మాయిల ఫోన్ నంబర్లు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో బహిరంగపరిచి మూక దాడిని ఉసిగొల్పే దాకా పోయారు. ముస్లిం అమ్మాయిల పక్షం నిలిచి మాట్లాడుతున్న నజ్మా నజీర్ వంటి ప్రతిపక్ష రాజకీయ నాయకురాలి ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ‘జైశ్రీరాం’ అంటూ బుర్ఖా ధరించిన అమ్మాయిని వెంటపడటం కూడా చూశాం. ముస్కాన్ అనే అమ్మాయి అలా చుట్టుముట్టిన మూక మధ్యనే అల్లాహో అక్బర్ అని నినదించడం చర్చనీయాంశం కూడా అయింది. అది ప్రతిఘటనగా కొందరు, కేవలం మత నినాదంగా కొందరు చర్చిస్తున్నారు. అది ప్రతిఘటనే అనుకున్నా ఇందులో ఒక సున్నితమైన అంశం మిళితమై ఉంది.
హిజాబ్ కు పోటీగా కాషాయాన్ని దించి హిజాబ్ ని, దానితో పాటు బుర్ఖాని మరింత శక్తివంతం చేయడం. ఏ మత అస్తిత్వం పేరుతో దాడి చేస్తున్నారో, ఆ సమూహాన్ని మరింతగా ఆ మత పరిధిలోనే బిగించే ప్రయత్నం చేయడం. తద్వారా వారిని మెజారిటీ ప్రజల నుండి మరింత ఒంటరి చేయడం. ఒకవైపు ఇస్లాంవాదులు బుర్ఖాను గ్లోరిఫై చేస్తున్నారు. ఉదారవాదులు కూడా నిండా బట్టలు కప్పుకోవడంలోని హుందాతనం గురించి మాట్లాడుతున్నారు. పనిలో పనిగా దిగంబర సాధువుల్ని, సినిమా హీరోయిన్లను పోలిక తెస్తున్నారు. అయితే ప్రగతిని కోరుకునే, విముక్తిని కాంక్షించే ముస్లిం మహిళలు ఏం మాట్లాడుతున్నారు.. మా దుస్తులు మా ఇష్టం, మా యుద్ధం మేం చేస్తాం అని కదూ. ఈ రణగొణ ధ్వనుల మధ్య అది చాలా విలువైన మాట. ఫాసిస్టు వ్యతిరేక ప్రగతిశీల శక్తులు దానితో గొంతు కలపాలి.
✊✊
Maa Satyam
తాత్విక తో కూడిన లోతైన విశ్లేషణ లో పేర్కొన్న అభిప్రాయంతో ఏకీభవిస్తూ
“హిజాబ్ మాత్రమే స్కూల్ యూనిఫాం కోడ్ ను ఉల్లంఘిస్తుందనడంలో మత వివక్ష తప్ప వేరే ఏ హేతువు లేదు. పోనీ మనది సెక్యులర్ దేశం కదా, ఏ మత చిహ్నాలైనా విద్యాసంస్థల్లో ఉండకూడదు అనే నియమం కచ్చితంగా పాటించాలి అంటే పార్థనా గీతాల దగ్గరి నుండి దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు అన్నీ తొలగించాలి. పబ్లిక్ వ్యవహారాలలో మతానికి అతీతంగా ఉండేంత నాగరికులుగా ఇంకా మనం ఎదగలేదు.”
భారత రాజ్యాంగానికి విరుద్ధంగా భారత దేశ వ్యాప్తంగా పాలకులకు మద్దతుగా హిందుత్వ తీవ్రవాదులు ముస్లిం మహిళల పట్ల జరుపుతున్న దాడులను చూస్తూ మౌనంగా ఉంటున్న భారత సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి పోవడం నేరమే అవుతుంది.
Down Down Indian Criminal
Government
“
✊✊
Maa Satyam
తాత్విక తో కూడిన లోతైన విశ్లేషణ లో పేర్కొన్న అభిప్రాయంతో “హిజాబ్ మాత్రమే స్కూల్ యూనిఫాం కోడ్ ను ఉల్లంఘిస్తుందనడంలో మత వివక్ష తప్ప వేరే ఏ హేతువు లేదు. పోనీ మనది సెక్యులర్ దేశం కదా, ఏ మత చిహ్నాలైనా విద్యాసంస్థల్లో ఉండకూడదు అనే నియమం కచ్చితంగా పాటించాలి అంటే పార్థనా గీతాల దగ్గరి నుండి దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు అన్నీ తొలగించాలి. పబ్లిక్ వ్యవహారాలలో మతానికి అతీతంగా ఉండేంత నాగరికులుగా ఇంకా మనం ఎదగలేదు.” ఏకీభవిస్తూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా భారత దేశ వ్యాప్తంగా పాలకులకు మద్దతుగా హిందుత్వ తీవ్రవాదులు ముస్లిం మహిళల పట్ల జరుపుతున్న దాడులను చూస్తూ మౌనంగా ఉంటున్న భారత సర్వోన్నత న్యాయస్థానం నేరమే అవుతుంది.
Down Down Indian Criminal
Government
మీరు చెప్పింది అక్షరాల నిజం