కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి. 

బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ సిద్ధాంతం. తొలినాటి వర్ణవ్యవస్థ నుండి, ఆ తర్వాత  ఏర్పడ్డ కుల వ్యవస్థ నుండి నేటి దాకా సాగుతున్న చారిత్రక పరిణామ క్రమంలో బ్రాహ్మణవాదపు మౌలిక లక్షణం నిరంతర సామాజిక శ్రమ విభజనే, అంటే- బ్రాహ్మణవాదానికి ఇముడ్చుకొని  కలుపుకోవడం అనే లక్షణాలతో పాటు స్వతహాగా దానికి మనుషులను నిరంతరం విభజించి పాలించే  స్వభావం ఉంటుంది. తద్వారా బ్రాహ్మణవాదం ఎప్పటికప్పుడు  ఆధిపత్య  ఏకాభిప్రాయాన్ని సాధిస్తూ తన ఆధిక్యాన్ని  నెలకొల్పుకుంటూ వస్తున్నది. కనుకనే చరిత్రలో శతాబ్దాల తరబడి వివిధ సామాజిక వ్యవస్థలలో, విభిన్న తరహా మతాల (కుల)భూస్వామ్య పాలనలలో  యావత్ దక్షిణాసియాలోనే  బ్రాహ్మణవాదం ఎల్లపుడూ పాలకవర్గ భావజాలంగా, ప్రతీఘాతుకత్వానికి ఒక సైద్ధాంతిక ప్రాతిపదికగా పనిచేస్తూనే  వస్తోంది.

తొలినాళ్లలో బ్రాహ్మణవాదం తన వర్ణ(కుల)విభజనను వ్యాపింపజేస్తూ విభిన్న తెగల ప్రజానీకాన్ని కుల-భూస్వామ్య  వ్యవస్థలో ఇముడ్చుకోవడం ద్వారా ఒక రకంగా ఆనాటి ఉత్పాదక శక్తుల అభివృద్ధిని వేగిరపరచింది. జైనుల, బౌద్ధుల ఆధిపత్య కాలంలో, ఆ తర్వాతి  కాలంలోనూ  వివిధ విజ్ఞాన శాస్త్రాలలో, వైద్యంలో, కళా సాహిత్య రంగాల్లో జరిగిన అభివృద్ధిని  బ్రాహ్మణవాదం తన సొంత ఖాతాలో వేసుకుంది. వివిధ క్షేత్రాలలో, విభిన్న ప్రాంతాలలోని జ్ఞానాన్నంతా  సేకరించి, వర్గీకరించి, సంశ్లేషించి  వివిధ సిద్ధాంతాలుగా  రూపొందించి వాటిని  తన సొంతం చేసుకుంది. కుల-భూస్వామ్య  సమాజానికి  తగినట్టుగా శాసన, నైతిక స్మృతి  అయిన మనుస్మృతిని  రూపొందించి, స్త్రీలతో  సహా పీడిత శ్రామిక ప్రజలందరినీ  జ్ఞానానికి దూరం చేసింది, వేదాలను వినడమనే  తప్పు చేస్తే శూద్రుల  చెవులలో  కరిగించిన సీసం పోయాలని శాసించింది.

ఈ  బ్రాహ్మణవాదపు ప్రతీఘాతుక వైఖరే  మానసిక, శారీరక శ్రమల  మధ్య ఒక పూడ్చలేని అగాథాన్ని సృష్టించి, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతిని అడ్డుకున్నది. ఒకవైపు కొత్త కొత్త  కోణాల నుండి చూసే  జ్ఞానం అందక  శ్రమ చేసే కుల సమూహాల ప్రజల ఆచరణ (అనుభవ జ్ఞానం) ఒకే మూసలో గానుగ తిరుగుడులా ఉండిపోగా, మరోవైపు అనుభవ జ్ఞానానికి దూరమైన  బ్రాహ్మణులకు, ఇతర కులీనులకు మాత్రమే గుత్తాధిపత్యంగా ఉండిన సిద్ధాంతం (జ్ఞానం) గిడసబారిపోయింది. 

చరిత్రలో పాలకవర్గాల మతం- ఇస్లాం, బౌద్ధం, సిక్కు, క్రైస్తవ మతం- ఏదైనప్పటికీ బ్రాహ్మణ వాదం వాటిలో తన కులవ్యవస్థను చొప్పించి ఎప్పటికప్పుడు పాలకవర్గంలో భాగమవుతూనే  వస్తోంది.అంచెలవారీ అసమానత,శ్రమ విభజనలతో కూడుకొని ఉన్న కులవ్యవస్థను అనుసరించడం వల్ల బ్రాహ్మణవాదం నిరంతరం (శ్రామిక) ప్రజలపై నియంత్రణను కలిగి ఉంటోంది. 

అయితే వలసవాద, వలసానంతర పాలనల వల్ల మార్పులేమీ జరగలేదా అనంటే జరిగాయనే చెప్పాలి. కానీ అవన్నీ పైపై  పరిమాణాత్మక మార్పులే గాని  దోపిడీ, పీడక కుల వ్యవస్థను పెకిలించే గుణాత్మక మార్పులు కావు.

ఒకవైపు వలసవాదం  ప్రోత్సహించిన ‘ఆధునిక’ విలువల వల్ల,  మరోవైపు శూద్రుల, అవర్ణుల కుల వ్యతిరేక  పోరాటాల వల్ల  బ్రాహ్మణవాద  విలువలకు  ఒక సవాలు తలెత్తింది. వలసవాద పాలన  బలంగా వేళ్ళూనుకుని ఉన్న చోట్ల సుముఖత, బలహీనంగా ఉన్న కొన్నిచోట్ల విముఖత అనే ద్వంద్వ స్వభావాన్ని బ్రాహ్మణవాద శిష్టవర్గం ప్రదర్శించింది. (మతపరంగా హిందువులు మెజారిటీగా ఉన్నందువల్ల) పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనూ  ‘మెజారిటీ పాలన’ అనే సూత్రం  ఆధారంగా పాలకస్థానాన్ని పొందాలనే  దురాలోచన  బ్రాహ్మణవాదులకు ఉం(డిం)ది. అందుకే వారు ఐక్య హిందూసమాజాన్ని నిర్మించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. తత్సంబంధిత సంస్కరణలను కూడా ప్రోత్సహించారు. గతంలో ఆర్యుల స్వర్ణ యుగం ఒకటుండేదని కూడా చెప్పారు. యావత్ దక్షిణాసియాలోని తత్వ శాస్త్రాలలో  అద్వైతానిదే  శిఖరాయమానమైన స్థానమని ప్రాచ్యవాదులు  ముందుకు తీసుకువచ్చిన ఒక వాదనను  కూడా  ఉపయోగించుకొని, మధ్యస్థ కులాల  ప్రజలను, అట్టడుగు దళితులనూ  తమ హైందవైక్య సంస్కరణల  స్రవంతిలోకి  తేవడానికి ప్రయత్నించారు. ఇదంతా బ్రాహ్మణవాద శిష్ట వర్గపు సుముఖతలో భాగంగా జరిగింది.

ఇక శిష్ట  బ్రాహ్మణ వాదుల వ్యతిరేకత లోని బండారం సంగతి చూద్దాం. నిజానికి వారికి ఉండిన వలసవాద వ్యతిరేకత  సామ్రాజ్యవాద వ్యతిరేకత కానే కాదు. వలసపాలన వల్ల ఒనగూరే  లాభాలను ఆశిస్తూనే, వలస పాలనలో వాటాదార్లుగా ఉండడం కోసం చాలా  తాపత్రయపడ్డారు. అందుకే వలస ప్రభుత్వంలో  కొన్ని పదవులు అడగడం దగ్గరినుండి  అధినివేశ ప్రతిపత్తి (బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనలో అంతర్భాగంగా ఉంటూనే శాసనపరమైన స్వాతంత్ర్యం కలిగి ఉండడం) అడగడం దాకా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగాయి. ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని బాలగంగాధర్ తిలక్ చేసిన ప్రకటన పైకి చూడ చాలా రాడికల్ గా కనబడినప్పటికీ, దాని నిజమైన అర్ధం  పై  తరహా పాలనే/ అధినివేశ ప్రతిపత్తియే. ఆ తర్వాత కాలంలో విప్లవ జాతీయ ఉద్యమ కారులు, వామపక్ష, కమ్యూనిస్టు ఉద్యమాల ఒత్తిడి వల్ల భారత జాతీయ  కాంగ్రెస్ చేసిన ‘సంపూర్ణ స్వాతంత్ర్యం’ అనే తీర్మానం  కూడా నిజంగా సామ్రాజ్యవాద బంధనాల నుండి విముక్తి కోసం  కానేకాదు.

ఈ ప్రయత్నాలన్నింటిలో  రాజా రామ్మోహన్ రాయ్, తిలక్, స్వామి దయానంద సరస్వతి, గాంధీ, నెహ్రూ లాంటి వేర్వేరు మితవాద, అతివాద  ఛాయలతో కూడిన  వాళ్ళందరూ ఉన్నారు. వలసవాద ‘ఆధునిక’ సంస్కరణల పట్ల ఎటువంటి వైఖరి అవలంబించాలనే  విషయంలోనే  వాళ్ళ మధ్య అనేక విభేదాలు ఉండేవి తప్ప,  బ్రాహ్మణవాదాన్ని మాత్రం తమ ఉమ్మడి మౌలిక దృక్పథంగా అందరికందరూ కలిగిఉండేవారు. ఎప్పటికప్పుడు వారు బ్రాహ్మణీయ ఆధిపత్య  ఏకాభిప్రాయాన్ని సాధించి  అమలు చేసేవారు.

ఏదేమైనప్పటికీ, వలసవాద పాలన ఇక్కడి కుల భూస్వామ్యాన్ని సడలించి, మెల్లమెల్లగా పెట్టుబడిదారీ సంబంధాలను  ఏర్పరచింది.  అయితే, పశ్చిమ యూరోప్ లో  వలె కాకుండా, ఇక్కడి  పెట్టుబడిదారీవిధానం  స్థానిక భూస్వామ్యంతో  పెనవేసుకుని  పెరిగింది. అది ఇక్కడి భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి రెండింటికి సేవ చేస్తూనే వున్నది. దీనినే మనం నిరంకుశ (బ్యురాక్రటిక్)  పెట్టుబడిదారీ విధానం అని అంటున్నాం. దీనికి దళారీ నిరంకుశ పెట్టుబడిదారులే ప్రతినిధులు. ఈ శక్తులన్నీ క్రమంగా ఒకే బలమైన వర్గంగా కలిసిపోయాయి. వాటి సామాజిక పునాది లో ప్రధానంగా సవర్ణులే, అంటే- బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, జైనులు, క్రైస్తవులు, ముస్లింలలోని సవర్ణులు- ఉన్నారు. ఇలా ఏర్పడిన నూతన  పెట్టుబడిదారీ వర్గానికి ఉన్న సైద్ధాంతిక దృక్పథంలో  బ్రాహ్మణవాదానికే  కేంద్రస్థానం ఉన్నది.

అంతకు ముందు లేని విధంగా, వలసవాద పాలన  భారత ఉపఖండం లోని విభిన్న జాతులను, సుదూర ప్రాంతాలకు తన కేంద్రీకృత పాలన కిందకు తీసుకొని వచ్చింది. స్థానిక శిష్ట వర్గాలు వలసవాద భాషను, విలువలను నేర్చుకోక తప్పలేదు. ఫలితంగా పరస్పర సంభాషణలు, సంపర్కాలు బాగా పెరిగాయి. ఇవన్నీ భారత జాతి అనే భావనకు ఒక భౌతిక పునాదిని ఏర్పరిచాయి. నిజానికి భారత జాతి అనే భావన ‘ఆధునిక’ వలస పాలన కారణంగా ఏర్పడినప్పటికీ, బ్రాహ్మణవాదం ఈ జాతి భావనను చాలా సనాతనమైనదిగా వర్ణిస్తూ, ఆ జాతిని ఏకం చేయాలని, అందుకు వలసవాదమే అడ్డంకిగా ఉన్నదని  చాలా విచిత్రంగా వాదించింది. ఈ విధంగా ‘భారత జాతీయత’ అనే తప్పుడు చైతన్యాన్ని సృష్టించి, తద్వారా పాలకుల ‘జాతీయతా  భావన’ వెనుక ఉన్న విదేశీ, పరాధీనతా  మూలాలను బ్రాహ్మణవాదం మరుగుపరచగలిగింది. ఇలా గతం  నుంచి నేటి దాకా  బ్రాహ్మణవాదం సామ్రాజ్యవాదానికి సేవ చేస్తూనే ఉన్నది.

1947లో అధికార బదిలీ జరిగి ఇండియా ఔపచారికంగా స్వతంత్ర దేశం అయ్యింది. నేటి నయా వలసవాద  పరిస్థితులలో కూడా ఇక్కడి పాలక వర్గాలకు, సామ్రాజ్యవాదానికి  కూడా ఈ నామమాత్ర స్వాతంత్రపు ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. విదేశీ ద్రవ్య పెట్టుబడి నానాటికీ మరింతగా చొచ్చుకురావడం వల్ల దేశ పరాధీనత చాలా పెరిగింది. అయితే ఆ వాస్తవాన్ని మరుగుపరిచి, దాన్నే  అభివృద్ధి అని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితిలో  నేడిక్కడి పాలకులు ఉన్నారు.

ఆ రకంగా (దేశానికి రాని)  స్వాతంత్ర్యం, (దేశంలో జరగని) అభివృద్ధి అనే మిథ్యా  భావనలే  నేటి  పాలకవర్గ ఆధిపత్య ఏకాభిప్రాయ సాధనలో కీలకమైన  అంశాలయ్యాయి.  పాలకవర్గాలు అమలు చేస్తున్న తమ  దోపిడీ పాలనను, విస్తరణ వాదాన్ని, అంతర్గతంగా వివిధ జాతుల, తెగల ప్రజల అణచివేతను మరుగుపరచడానికి వీటినే ఉపయోగిస్తున్నారు.  వీటన్నింటిలో ‘అఖండ భారత్’, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే బ్రాహ్మణవాద భావనలే  చాలా కీలకంగా పనిచేస్తున్నాయి.

పైగా, నిప్పులాంటి ఒక (దోపిడీ,పీడనల) నిజాన్ని దాచడానికి భారత దేశం ఎల్లప్పుడూ ఆహింసనే ప్రబోధించిందని ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తూ వస్తున్నాయి. నిజానికి, బ్రాహ్మణులు నిరంతర యజ్ఞ యాగాదులలో  పెద్ద ఎత్తున జంతుబలులు ఇవ్వడాన్ని జైన, బౌద్ధ మతాలు వ్యతిరేకించడం వలన అహింస అనే భావన పుట్టింది. కాని  బ్రాహ్మణవాద విధి నిషేధాలను ఉల్లంఘించిన శూద్రులను, ఆదివాసులను అణిచివేయడానికి హింసా ప్రయోగం సరైనదేనని చెప్పిన  బ్రాహ్మణవాదమే, పితృస్వామ్యాన్ని  పరిరక్షించేందుకు హింసను ప్రయోగించి  స్త్రీలను అంగవికలురను  చేసి, ‘వారి  స్థానంలో వారిని  ఉంచాలని’ చెప్పిన బ్రాహ్మణ వాదమే  అహింస అనే భావనను  తన ఖాతాలో వేసుకుని, ఈనాటి పాలకవర్గ ఆధిపత్య ఏకాభిప్రాయ సాధనలో దానిని అంతర్భాగం చేసుకోవడం బ్రాహ్మణ వాదానికి  ఉన్న హింసాయుత స్వభావానికి పరాకాష్ట  అవుతుంది.

నిజానికి, అధికార మార్పిడి జరిగిన తర్వాత చాలా దశాబ్దాల పాటు ఈ బ్రాహ్మణవాద కృషికి  పాలకవర్గంలో బలీయమైన చోటు  దొరకలేదు. మృదు  బ్రాహ్మణవాదం స్థానంలో దూకుడు బ్రాహ్మణవాదం  భారత పాలకవర్గంలో  కేంద్ర స్థానానికి రావడం  ఇటీవలి  దశాబ్దంలో జరిగిన కీలక పరిణామం. అయితే ఈ రాజకీయ మార్పులను  కేవలం ఆర్ ఎస్ ఎస్, బీజేపీలు మాత్రమే   అధికారం కోసం చేసిన  ప్రయత్నంగానే చూడడం సరైనది కాదు. మొత్తం పాలకవర్గాల  ప్రయోజనాలలోనే దీని మూలాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు  వారు ఎదుర్కొన్న సాధికారతా  సంక్షోభంలో  నుండి ఇది పుట్టిందనేది ఒక చారిత్రక వాస్తవం.

గాంధీ ఆధ్వర్యంలో అభివృద్ధి అయి, నెహ్రూ ద్వారా బలపడిన పాలకవర్గ ఆధిపత్య ఏకాభిప్రాయం 1960ల తర్వాత తీవ్ర సంక్షోభంలో పడింది. అంతకంతకూ  సామ్రాజ్యవాదులపై ఆధారపడడం స్పష్టంగా బహిర్గతమైన కొద్దీ ఒక స్వతంత్ర భారతాన్ని నిర్మిస్తామన్న  పాలకుల హామీ బూటకమని  తేలిపోయింది. వివిధ ప్రజా పోరాటాలు, జాతుల ఉద్యమాల వల్ల పాలకవర్గాల రాజ్య సాధికారత ఒక పెద్ద సవాలును ఎదుర్కొంది.

ఆ తర్వాత నక్సల్బరీ సాయుధ రైతాంగ తిరుగుబాటు దేశాన్ని నిలువునా కుదిపివేసింది. కోల్పోయిన ఆధిపత్య ఏకాభిప్రాయాన్ని తిరిగి సాధించుకోవడానికి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ‘గరీబీ హఠావో’ లాంటి కొన్ని జనరంజక పథకాలను, ఎమర్జెన్సీ లాంటి కొంత ఫాసిస్టు  పాలను కలిపి ప్రయోగించి  పరిపాలించింది. కాని  అదీ విఫలమైన తర్వాత, పాలక వర్గాలకు రిజర్వేషన్లు, లౌకికవాదం లాంటి అంశాలపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ రంగంలో, రాజ్య నియంత్రణలో కొనసాగుతున్న ఆర్థిక నమూనాను కూలదోసి, బహుళ జాతి కంపెనీలకు తలుపులు బార్లా తెరిచి, స్వావలంబనకు  స్వస్తి పలికారు. 1990 ల్లో సోవియట్ యూనియన్ కూలిపోవడంతో  ప్రపంచీకరణ అజెండాను పూర్తిస్థాయిలో  ముందుకు తెచ్చారు. క్రమంగా పాలకవర్గాల కొత్త ఆధిపత్య  ఏకాభిప్రాయంలో బ్రాహ్మణవాదం  కీలక పాత్ర పోషించడం మొదలైంది. సవర్ణ హిందూ కులాలన్నింటినీ  ఒక ఐక్య అఖిలభారత కూటమిగా మలిచి,  దాన్ని రాజ్యపు కీలకమైన సామాజిక పునాదిగా చేసే ఒక ప్రయత్నం ముమ్మరం కాసాగింది. మొత్తం మీద  అన్ని పాలకవర్గాలు  బ్రాహ్మణవాదాన్ని ఆమోదించినప్పటికీ, దాని వ్యక్తీకరణలు ఎలా ఉండాలనే విషయంపై  అనేక విభేదాలు ఆనాటి నుండి నేటి దాకా వాళ్లలో కొనసాగుతూనే ఉన్నాయి.

ఆ తర్వాతి కాలంలో మండల్ కమిషన్ ప్రతిపాదనలను అమలు పరుస్తూ వి. పి.  సింగ్ ప్రభుత్వం రిజర్వేషన్లను ఇతర వెనుకబడిన తరగతులకు విస్తరించడం, సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ వంటి కులాధారిత పార్టీలు పుట్టుకు రావడం ఆనాటి ముఖ్య పరిణామాలు. అయితే, ఆ పరిణామాలన్నింటినీ  ఒకే గాటన కట్టి ‘రాజకీయాల మండలీకరణ’ అని కొందరు అంటున్నప్పటికీ, వాటిలోని సామాజిక చలనాలు చాలా భిన్నమైనవని , పరిశీలనార్హమైనవని గుర్తించడం ముఖ్యం.  మండల్ కమిషన్ సిఫారసులు అమలు పరచడం అనేది పైకి  ఆర్ఎస్ఎస్, బిజెపిల  ఆట కట్టించడానికి వేసిన ఒక ఎత్తుగడగానే కనిపించినప్పటికీ, దూకుడుగా ముందుకు వస్తున్న బ్రాహ్మణ వాదాన్ని నియంత్రించి, మరో కొత్త పాలకవర్గ ఆధిపత్య ఏకాభిప్రాయ సాధన కృషికి దోహదపడడమే  దాని అసలు ఉద్దేశ్యం. అంతకు ముందు లేని విధంగా, అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా (వి.పి.సింగ్) ప్రభుత్వమే  ప్రారంభించడం కూడా పై ఉద్దేశ్యంతోనే. ఆ క్రమంలోనే అంబేద్కర్ ను  ‘రాజ్యాంగ పితామహుడు /నిర్మాత’ అని, ఆయనకు   పాలక వర్గాల రాజకీయ నాయకుల సరసన చోటివ్వడం కూడా  పాలకవర్గాల కుటిల నీతిలో భాగంగానే మొదలయింది. మొత్తం మీద ఆ పరిణామాలన్నీ ఆనాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక వైరుధ్యాలు తీవ్రమైన స్థితిని సూచించాయి. 

తత్ఫలితంగా దళితులు, ఇతర మధ్యస్థ కులాలే కాకుండా సవర్ణ  కులాలు కూడా కాంగ్రెస్ కు దూరం అయ్యాయి. ఆయా రాష్ట్రాలలోని దోపిడీ వర్గాలు  తాము నిలదొక్కుకొని ఎదగడం కోసం  అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియంత్రణను వదిలించుకొని  కొత్తగా ఏర్పడిన సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ ల రూపంలో ఐక్య కూటముల ప్రభుత్వాలు   ఏర్పాటు కావడం మొదలైంది. అటువంటి రాజకీయ అనిశ్చిత  స్థితి స్వల్ప కాలంలోనే కుదురుకొని,కొత్త కులీనులు  కూడా పాలకవర్గాలతో మమేకమయ్యారు. వారి సైద్ధాంతిక ఏకాభిప్రాయ సాధనలో భాగస్వాములయ్యారు. అందుకే సవర్ణులపై తీవ్ర అధిక్షేపణలతో మొదలైన బహుజన్ సమాజ్ వాది పార్టీ  చివరకు బ్రాహ్మణవాద ప్రతీకల్లోనే తన ప్రతీకలను వెతుక్కోవడాన్ని మనం చూసాం.

ఆ తర్వాత ఆధిపత్య ఏకాభిప్రాయాన్ని  ఆర్ఎస్ఎస్, బిజెపిలు  చాలా దూకుడుగా మార్చడం ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో తనదైన ముద్ర  వేయడానికి గాంధీ -నెహ్రూల సైద్ధాంతిక  వారసత్వాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నాలు చేసింది.అందుకు  చరిత్ర సునాయాసంగా అనుమతించదు  కాబట్టే , భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అసలే లేని ఆర్ఎస్ఎస్/ బిజెపి తన సరికొత్త  ‘జాతీయతా కథనాన్ని’ తయారుచేయడానికి  బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా వెలుగులోకి రాని హిందూ వ్యక్తుల చరిత్ర కథనాలను ముందుకు  తెస్తున్నది. ఇందులో కమ్యూనిస్టుల, ముస్లింల నాయకత్వంలో జరిగిన  పోరాటాలను మినహాయిస్తూ  ఆయా వ్యక్తులందరూ హిందూ వాదాన్ని సమర్థించే వాళ్లేనని అబద్ధం చెపుతున్నది. నిజానికి వాళ్లు శిష్ట వర్గాలకు చెందిన బ్రాహ్మణ వాదులే కాబట్టి  ఆర్ఎస్ఎస్ కు ఇబ్బంది ఏమీ ఎదురుకాలేదు. అందుకు ప్రతిగా, ఉదార  మేధావులు, కాంగ్రెస్, పార్లమెంటరీ వామపక్ష పార్టీలు  బ్రాహ్మణవాద వ్యతిరేక స్రవంతికి చెందిన సాంఘిక సంస్కర్తల బోధనలను గురించి చెప్పినప్పటికీ  ఆర్ఎస్ఎస్, బిజెపిల లాంటి బ్రాహ్మణవాదులు చేపట్టిన ఈ కార్యక్రమానికి  ఇబ్బందేమీ రాలేదు. ఎందుకంటే- బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమాలలో  పనిచేసిన అణగారిన కులాలలో కూడా ఒక శిష్ట వర్గం ఏర్పడింది. క్రమంగా వారి దోపిడీ ప్రయోజనాలు పెరిగినకొద్దీ అదే నిష్పత్తిలో వారి బ్రాహ్మణీకరణ కూడా జరిగింది. కాబట్టే ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి బ్రాహ్మణవాద పార్టీలు అనుసరిస్తున్న ‘ఇముడ్చుకునే’ ఎత్తుగడలకు, కొత్త శిష్ట వర్గాల ప్రయోజనాలకి మధ్య ఒక సఖ్యత కుదరడం సులభంగానే జరిగింది.

మరోపక్క- బ్రాహ్మణ వాదం పట్ల ఒక సమగ్రమైన, తీవ్ర విమర్శను అభివృద్ధి చేయడంలో వామపక్ష కమ్యూనిస్టులు  విఫలమైనందువల్ల  కుల వ్యవస్థపై పోరాటాన్ని  వర్గపోరాటం తో పూర్తిగా సమైక్యం చేయలేక పోవడమే కాకుండా, బ్రాహ్మణవాద చిహ్నాలను సైతం సొంతం చేసుకోవడంలో ఆర్ఎస్ఎస్ తో పోటీ పడడం వల్ల కూడా పాలకవర్గాలకు  తమ ఆధిపత్య ఏకాభిప్రాయాన్ని మార్చుకోవడానికి  పెద్దగా సైద్ధాంతిక సవాలు ఎదురుకాలేదు. పైగా, రాడికల్ (వామపక్ష) కమ్యూనిస్టులు సైతం  బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా సైద్ధాంతికంగానూ,  సాంస్కృతికంగానూ పోరాడాల్సిన అవసరాన్ని కొంత ఆలస్యంగా గుర్తించడం వల్ల కూడా  పాలకవర్గాల ప్రయత్నాలకు  పెద్ద అవరోధం ఎదురుకాలేదు.

బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా చరిత్రలో జరిగిన పోరాటాలలో చార్వాకం, జైన,బౌద్ధాలు, మధ్య యుగాలలోని   బసవన్న లింగాయత తిరుగుబాటు  లాంటి వాటన్నింటినీ  బ్రాహ్మణవాదం  అధిగమించగలిగింది. చరిత్రలో ఎంతో కాలం నిరాకరించబడిన  బ్రాహ్మణవాద స్థలాలలోకి, సాంస్కృతికాచరణలలోకి, పౌరోహిత్య పద్ధతుల్లోకి ప్రవేశించడం తిరోగమనం  అయినప్పటికీ, దానిని  ఒక తిరుగుబాటు చర్యగా భావించడం వల్ల కూడా  వారు అనివార్యంగా బ్రాహ్మణీకరణ చెందేందుకు అది దారితీసింది.

వలసవాద పాలనా  కాలంలో కూడా కుల వ్యవస్థ పై జ్యోతిరావుపూలే, వైకుంఠ స్వామి, నారాయణ గురు,అయ్యం కాళి, పాయ్ కాయిల్  జోహానన్, రామస్వామి పెరియార్, సహోదర్ అయ్యప్పన్, అంబేద్కర్  మొదలైన వాళ్ళు చేసిన పోరాటాలన్నీ ఆ తర్వాతి కాలంలో  కొనసాగలేదు. వీరిలో వైకుంఠ స్వామి, పెరియార్, అంబేద్కర్, ఫూలేల  పోరాటాలు చారిత్రకంగా చాలా విలువైనవి. బ్రాహ్మణవాదం పై అంబేద్కర్, ఫూలే లు పెట్టిన  విమర్శలు చాలా లోతైనవి, సమగ్రమైనవి,  ఆధునికమైనవి. ‘బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీవిధానం రెండూ  కార్మికులకు నిజమైన శత్రువులు’ అన్న అంబేద్కర్ ప్రకటన, కార్మికులను  కూడా సమీకరించి ఎక్కుపెట్టిన ఫూలే  పోరాటం రెండింటిలోనూ  నిజమైన ఆధునికతను సాధించే విషయానికి సంబంధించి, కార్మికవర్గం వర్గ పోరాటంలో వర్గ చైతన్యం పొందే విషయానికి సంబంధించి  చాలా అంతరార్థం ఇమిడి ఉంది. ‘తనలో తానున్న’ స్థితి నుంచి  ‘తన కోసం తాను ఒక వర్గం’గా ఎదిగే క్రమానికి సంబంధించిన విషయంలో  వారిద్దరి పోరాటాలు  ప్రజలకు అమూల్యమైన వారసత్వ సంపదగా చరిత్రలో  నిలిచి, అవి భవిష్యత్ తరాలకు నిరంతర స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

ఫూలే, అంబేద్కర్ లు ఇద్దరూ వలసపాలనా కాలం నాటికే ఆవిర్భవించిన  ఆధునిక  దళారీ పెట్టుబడిదారీ వర్గపు  సైద్ధాంతిక  దృక్పథంలో  భాగంగా  బ్రాహ్మణవాదాన్ని చూడలేకపోయిన స్థితిని, అలాగే కుల సమస్యను దాని నిర్దిష్టతలో,  అనగా  అర్థ-భూస్వామ్య వ్యవస్థలో  భాగంగా చూడలేకపోయిన స్థితినీ అధిగమించే  అవకాశాన్ని  తర్వాతి తరాల  వారికి  చరిత్ర  అందించింది. దాన్ని సత్వరమే అందుకొని దుష్ట  కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిశితమైన రాజీలేని పోరాటం చేయడమే  నేడు మనముందున్న చారిత్రక  కర్తవ్యం.

Leave a Reply