వయసు మనుషుల్ని దూరం చేసింది

మమత పురాతన అవశేషమయింది

ముదిమి ఊతకర్రగా మారింది

ప్రేమించడమే మరిచిపోతున్న 

మనుషుల్ని వదిలి

రాని కాళ్ల వెంట

కానని చూపుల దారులలో

చిక్కుకున్న నిన్ను ఎక్కడనీ వెతకను

నా చిట్టి కూనా..

గ్రీష్మంలో మలయ మారుతంలా

రాలుతున్న విత్తుకు జీవం తొడిగావు

ఇప్పుడు నా మేనంతా సంతోషం

అవును ఈ క్షణం అపురూపం

ఉద్వేగం, ఉత్తేజం సంగీతంలా నాకు కొత్త ఊపిరినద్దుతోంది..

మబ్బులు పట్టిన ఆకాశం

నా కన్నీటి తెరగా దారంతా పరచుకొంది

ఈ మహా వృక్షం దాపున

కాసేపు  సేద తీరుదాం

ఈ క్షణం నాకెంతో అపురూపం

గతం తాలూకు నీలి నీడలు తరిమేశానిప్పుడు

నా చిట్టి కూనా

నన్నొదిలి వెళ్లకు

నాలో జీవం రద్దు చేయకు

ఇప్పుడు మనిద్దరిదీ ఒకటే గమ్యం

ఈక్షణం నాకెంతో మధురం.

Leave a Reply