కథలకు సంబంధించి వస్తువు ఎంపికే ప్రధానమైనది. దానిని అనుసరించేవే మిగతా లక్షణాలు. నేరుగా జన జీవనంతో మమేకమైపోయి, వాళ్ళ బతుకు సాధకబాధలే ఇతివృత్తాలు గా, ఆయా సమూహాలను చరిత్రలో భాగం చేసే రచయితలు చాలా చాలా అరుదు. వాళ్ళ ఆరాటపోరాటాల్ని చాలా దగ్గరగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు కలిగే అనుభూతి చాలా భిన్నమైన మార్గంలో కథకుడ్ని నడిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాల్ని, ఇతరుల కన్నుకు కనబడని జీవితం తాలూకు ఘర్షణని చూసేలా చేస్తుంది.‌ ఖచ్చితంగా పాఠకుడికి ఆ సంఘటనలకు కారణమయ్యే శక్తుల మీద ఆగ్రహం కలుగుతుంది. జీవన విధ్వంసం దృశ్యాన్ని కథగా మలిచేటప్పుడు కథలో ఇలా ఎందుకు జరిగింది?జరగకూడదే?అనే మీమాంస కథకుడి ఆలోచనలతో పాఠకుడూ ప్రయాణిస్తాడు. ఇలాంటి కథలలో, పాత్రలతో పాటు కథకుడూ పాత్త్రేపోయి కథను ముందుకు నడిపిస్తాడు.        

నిజానికి జనజీవితపు సంక్షోభాలన్నింటికీ బయటి శక్తులే కారణమౌతాయి.‌ అంటే కార్మీకులూ, కర్షకులూ, మహిళలూ, పిల్లలూ కోరి సమస్యల్లో కూరుకుపోరు. ఆ సమస్యలన్నింటికీ సమూహానికి ఆవాల ఉండే శక్తులు కారణమౌతాయి. వీళ్ళు సదరు సమాజంలో సభ్యులు కారు. ఒక ఆదివాసీ ప్రాంతం తీసుకోండి. అక్కడ మైనింగ్ చేయడానికి ఒక కంపెనీ వస్తుంది. ఆదివాసీల జీవితం ప్రశ్నర్థకంగా మారుతుంది. ఈ బయటి శక్తిని పారద్రోలే సాధనాలు వారి వద్ద అప్పటికప్పుడు పుట్టుకొని రావు. చాలా కాలం ఘర్షణ పడ్డ తర్వాత, లేని సమస్యల్ని సృష్టించే ఈ కంపెనీలతో (పరిమిత వనరులతోనే)పోరాడడం తప్ప వేరే మార్గం వారికి ఉండదు. అక్కడ ఒక పోరాటం లేకపోతే? పోరాడాలనే చైతన్యం ఆ ప్రజలకు లేకపోతే? ఉండేలా కల్పించుకొని ఆ బాధ్యతని కథకుడు మోస్తాడు. పాత్రలోకి పోరాటం నేపధ్యాన్ని కల్పిస్తాడు, కథలోకి చైతన్యమున్న పాత్రలని ప్రవేశ పెడతాడు.‌ దానికవసరమైన భౌతికపరిస్థితులను కథలో సృష్టిస్తాడు. కాల్పానిక సాహిత్యం సాధించే ప్రయోజనం,విజయం ఇక్కడే ఉంది. చైతన్యం తగినంతగా లేని చోట చైతన్యం ఉన్నట్టు కల్పించుకుంటాడు. బయటి శక్తులెప్పుడు శాంతితో లొపలికి రావూ. అశాంతీ, హింసలే ఆయా శక్తులు ఆయుధాలు. ఇక్కడ పోరాటం నేపధ్యం కథా వస్తువుగా మారుతుంది. వస్తువే ఒక చైతన్యవంతమైన పాత్ర నిర్వహిస్తుంది. సమూహానికి పోరాట నేపధ్యాన్ని కల్పిస్తాడు కథకుడు అతడి మానసిక ఆందోళన పాత్రల రూపం తీసుకుంటుంది. ఈ పాత్రలెంత సజీవంగా ఉన్నాయి వాటి పోరాటానికి ఏ స్థలకాలదులను కథకుడు ఆపాదించాడు అనేది కథకుడి ప్రావీణ్యం మీద ఆధారపడి ఉంటుంది. వీటి మధ్య సంతులత సాధించే కథలు ఖచ్చితంగా కాలానికి నిలబడతాయి. “ఒక కంపెనీ వచ్చి మైనింగ్ మొదలుపెడిట్టింది అది ఆదివాసీల స్థానభ్రంశానికి కారణమైంది” అనే విషయం ఒక వార్తగా కూడా నోచుకోని కాలం కదా ఇది. ఇదే విషయాన్ని ఓ మంచి కథకుడు కథగా చెప్పే భారం మీదేసుకుంటాడు

జల్ జంగిల్ జమీన్ అనే నినాదం కొత్తది కాదు. అరణ్యం మాది అనడం కూడా కొత్తది కాదు. అరణ్యంపై సర్వ హక్కులూ అడవి బిడ్డలదే అనేది రాజ్యాంగం లో ఒక విలువ. ఆదివాసీలు ఎదుర్కొనే ఏ ఉపద్రవమైనా దేశానికీ చెందిందే! మనం అర్థం చేసుకోవలసింది సంక్షోభంలో ఉన్నది ఆదివాసీల జీవితమొక్కటే కాదు మొత్తంగానే ప్రజాస్వామిక, రాజ్యాంగ విలువలు అని అర్థం కావాలి. అలా చూసినపుడు ఈ పరిణామాలనీ, మార్పులనీ రికార్డ్ చేసే కథలది నిస్సందేహంగా కథా రచనలో ఉన్నత స్థానం. ఇలాంటి కథలకు ఉదయమిత్ర పెద్ద పీట వేశారు “అలవి వల” సంకలనంలో! 

పద్నాలుగు కథలు ఈ సంకలనంలో విభిన్న మైన కథా వస్తువులు పాఠకులను పలకరిస్తాయి. ఆలోచింపజేస్తాయి. తనకు పరిచయం లేని ఒక ప్రపంచంలోకి తీసుకెళతాయి. పాఠకుడికి కొత్త పాత్రలు పరిచయం అవుతాయి. స్థానిక వేషభాషలూ- జీవితం బలవంతంగా పరాయీకరించబడే దృశ్యాలతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ జీవన విధ్వంసానికి కారణమయ్యే ఆర్థిక, సామాజిక వ్యవస్థలోని లోపాలు పాఠకుడికి అర్థం అవుతాయి. అలా పాఠకుడి ఆలోచనలు మరో ప్రపంచంలోకి తెరుచుకుంటాయి. ఉదయమిత్ర పాలకులకూ వ్యతిరేకంగానూ, పాలకుల విధ్వంసకర విధానాల వల్ల బలైపోతున్న జనం పక్షపాతిగానూ నిలబడతాడు. ఈ కథలన్నీ రాసేటప్పుడు ఆయన అనుభవించిన మనో భారాన్ని, ఆ కథల్లోని సారాన్ని అర్థం చేసుకున్నప్పుడు పాఠకుడికి తెలుస్తుంది. నిజానికి, ఇంత వాస్తవాన్ని ఒకేసారి అర్థం చేసుకోవడం వేరు వాస్తవానికుండే విభిన్నమైన కోణాల నుండి ఆర్థం చేసుకోవడానికి అవసరమైన సామాజిక జ్నానం వేరు. అది ఒకేసారి పలు పార్శ్వాలనీ అందులోని సంక్లీష్టతని అర్థం చేసుకోవాలని షరతు పెడుతుంది. కథ సరైన దృక్పధంతో రాయబడినప్పుడు పాఠకుడు ఆ దృశ్యంలో తానొక సాక్షిగా నిలబడతాడు. అటువంటి కథ పాఠకుడికి ఉద్వేగాలన్నింటినీ తాకుతుంది. అందుకే కథా సంవిధానం పాఠకుడి మానసిక బౌద్ధిక తలంపై బలమైన ముద్ర వేస్తుంది.

 ఉదయమిత్ర కథల్లో మనకి ఆర్థిక సామాజిక అంశాల పరిణామల్లోని సంక్లిష్టత ముడి విడివడి ఆయన దృక్పధాన్ని సానుభూతితో చూసేలా చేస్తుంది. రాజకీయాల పట్ల భిన్నమైన వైఖరులున్నప్పటికీ కథ మనల్ని వాటిని దాటి చూసేలా ప్రేరేపిస్తుంది. విప్లవ దృక్పధం ఉన్న రచయిత ఉదయమిత్ర అని అందరికీ తెలిసిందే! ఇందులో ఆ అంశం అంతర్లీనంగా కలిసి ఉండి అదే ప్రత్యక్ష రూపం తీసుకోకపోవడం ఈ కథల లోని ప్రత్యేకత. నిజానికి ఎంచుకున్న వస్తువు మన చైతన్యానికి కూడా విశాలమైన ప్రాతిపదిక కల్పిస్తుంది. అలా చూసినపుడు ఈ కథల్లోని వస్తు విస్తృతి ఎన్ని వైరుధ్యాలనీ మన ముందు ఉంచిందో అదే సమయంలో వైరుధ్యాల వెనుక కారణాలు కూడా అర్థం అవుతుంది. ఈ వైరుధ్యం మనదైన దృక్పధంతో అర్థం చేసుకున్నా పెద్ద ఇబ్బంది కలగకుండా ఈ కథ రాయవలసిన కథే ఇందులో వస్తువు తెలియవలసిన వస్తువే అనే నిర్ధారణకు వస్తాం. ఇందులో జీవితం ఈ పాత్రలకు ఆపాదించి బడిన చైతన్యం ఆకాశం నుంచి ఊడిపడింది కాదనీ, ఇది ఈ భౌతిక పరిస్థితులు మధ్యలోంచే అంకురించిందనీ, ఆ కథ మొదలు కానీ ముగింపు కానీ నేలవిడిచి సాము చేయలేదని అర్థం అవుతుంది. అక్కడ నేలా,నీరూ,గాలీ ఉండవలసిన చోటే ఉన్నాయనీ, అక్కడి జీవినసరళి దానికి భూమిక అని పాఠకుడికి అర్థం అవుతుంది. ఇవన్నీ వాస్తవవాద కథలు. కథకుడి చైతన్యం దృక్ఫధం రాజకీయాలు ఆ వస్తువుని గుర్తించాయని అవే లేకపోతే ఇలాంటి వస్తువు ఎంపిక జరగే అవకాశం తక్కువ!అలా కథకుడిగా ఉదయమిత్ర కథలు చాలా అవసరమైన కథలు అని అర్థం అవుతుంది.

Leave a Reply