“ఈనాటి జీవితాన్ని సామ్రాజ్యవాద సంస్కృతి స్పృశించని పార్శ్వము, కోణామూ లేదు. అది మన అలవాట్లనూ, ఆచారాలనూ, ప్రవర్తననూ, సంస్కారాలనూ, కుటుంబాలను, సామాజిక సంబంధాలనూ, మన కోర్కెలను, ఆశలను, రాజ్యాన్ని, రాజకీయాలను వ్యక్తులనూ, సంస్థలనూ, కలల్ని, కళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూవుంది. క్షీణ విలువలకు ముఖ్య ఆధారంగా సాంస్కృతిక సామ్రాజ్యవాదం నిలిచివున్నది.” – లెనిన్
Lenin for children పేరుతో సోవియట్ రష్యా బొమ్మల పుస్తకం ప్రచురించింది. దీన్ని అమెరికన్ పిల్లల కోసం రూత్ షా ఇంగ్లీషు లోకి అనువదించగా 1934 లో ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, న్యూయార్క్ వాళ్ళు ‘our lenin. For boys and girls’ అంటే ‘మన లెనిన్. అబ్బాయిలు అమ్మాయిల కోసం’ గా అచ్చు వేశారు. శీర్షిక ఎంత చక్కగా వుందికదా!
ఆ తరువాత లెనిన్ సోదరి చెప్పిన కొన్ని బాల్యపు జ్ఞాపకాలను హ్యారీ అలాన్ పొటమ్కిన్ ఇందులో చేర్చారు. ఈ పుస్తకాన్ని తెలుగులో మొదటి సారి తుమ్మల వెంకట్రామయ్య గారు అనువదించగా (1942) ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తి అచ్చువేసింది. 2017లో తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ దీన్ని మళ్లీ పుస్తకంగా తెచ్చింది. ఇపుడు నా చేతిలో ఉన్నది ఇటీవల H S పబ్లిషర్స్ తెచ్చిన అదే పుస్తకం ‘లెనిన్’. కట్టా సిద్ధార్థ అనుసృజన.
యీ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు నా మనసు ఇలా పాడుతున్నది.
“సుత్తి కొడవలి గురుతుగవున్న
ఎర్రని జెండా ఎగురుతున్నది
ఆకాశంలో అరుణబింబమై
పీడిత జనాని కండదండగా. …!సుత్తి!
* * *
అది జార్ చక్రవర్తుల పాలన కాలం.1880 లో కథ మొదలవుతుంది.
లెనిన్ కు ముందు వోలోడ్యా:
లెనిన్ తండ్రి యుల్యనావ్ స్కూళ్ల సూపరెంటెండెంట్. పేద పిల్లలకు ఉచితవిద్య కావాలని పోరాడుతున్నాడు. లెనిన్ తండ్రి ఒక ప్రజాస్వామ్య వాది,ఆధునిక భావాలు కలవాడు. ఆయన భార్య దయార్ద్రహృదయమున్న తల్లి.
వారికి ఐదుగురు పిల్లలు. పెద్దవాడు అలెక్జాన్డర్ (సాషా), కూతురు అన్నా, మధ్యలో లెనిన్ ( వ్లాదిమిర్ ఇంట్లో ముద్దుపేరు వోలోడ్యా) తరువాత మేరియా, కడగొట్టువాడు మీత్యా.
ఒక నాడు తోడేళ్ల బారినపడ్డ చిన్న మేకపిల్ల పాట విని చిన్నారి మీత్యా గుక్క పట్టి ఏడుస్తాడు. అప్పుడు వోలోడ్యా చిన్నారి తమ్ముణ్ణి కౌగలించుకొని ”మాస్కో యూనివర్సిటీలో వున్న మన అన్న సాషా రష్యా లోని తోడేళ్లనన్నిటినీ చంపేస్తాడు. మేకలకూ, గొర్రెలకు, కోళ్లకూ అన్నిటికీ విముక్తి కలుగుతుంది” అని ఓదారుస్తాడు.
వోలోడ్యా చిన్న నాటి స్నేహితురాలు వీరా. ఆమె తల్లిదండ్రులు దగ్గరనే ఉన్న మిల్లులో పనిచేసే నేత కార్మికులు. వారిది దుర్భర దారిద్య్రం. మిల్లు యజమాని భార్య కొత్త చెప్పులు కావాలంటే కార్మికులు గంట ఎక్కువ పనిచేయాలి. యజమాని కూతురు కొత్త గౌను కొనాలంటే కార్మికుల జీతంలో కోత. మంచు దేశంలో కూతురికి చెప్పులూ, చలి కోటూ కొనిపెట్టలేని నిస్సహాయత వీరా తండ్రిదే కాదు ప్రతీ కార్మికుడిది కూడా. చాలీచాలని జీతాలతో, పెంచిన పనిగంటలకు, బానిసత్వానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె కట్టారు. ఈ సమ్మెకు నాయకుడైనందుకు వీరా తండ్రి జైలుపాలయ్యాడు. సమ్మెలు కార్మికుల న్యాయమైన హక్కనీ, దానికోసం జట్టుకడితే నిర్బంధమూ, జైలూ తప్పదని వోడల్యాకు మొదటిసారి ఎరుక కలిగి వుంటుంది.
పట్టణాల్లో ఇలా ఉంటే పల్లె సీమలేమీ గొప్పగా లేవు.
అక్కడా ఇదే దోపిడీ. కాకపోతే భూస్వాముల పీడన. వీరా బంధువు ఇవాన్. వోలోడ్యాకు మంచి స్నేహితుడు. ఆటలతో పాటు అప్పుడప్పుడు పొలం పనులకు వోలోడ్యా తోడుపోయేవాడు. ప్రకృతినే కాదు సమాజాన్ని చూడటమూ అప్పుడే తెలిసింది. పంటలు పండినా, పండక పోయినా రైతులు కౌలు చెల్లించాల్సిందే. లేకపోతే ఇంట్లో ఉన్న ఆవులను, బర్రెలను, గుర్రాలను యజమాని మనుషులు తోలుకుపోతారు. ఇంట్లో పాలుతాగే పసి కూనలున్నారని మొత్తుకున్నా వినరు. తీవ్ర కరువులో జనాలు ఆకలికి నకనకలాడుతుండగా బారెన్లలో దాచుకున్న ధాన్యంలో ఒక్క గింజకూడా కౌలు రైతులకు విదిల్చలేదు యజమాని. పైపెచ్చు ప్రాణం నిలుపుకోడానికి కొంత ధాన్యం ఇమ్మని అడిగినందుకు రైతులను కొరడాలతో కొట్టించి, ఇవాన్ తండ్రిని అరెస్టు చేయించాడు. ఎదుగుతున్న వోలోడ్యాకు ఇప్పుడీ వ్యత్యాసం కొంత అర్థం అవుతున్నది. న్యాయమూ, చట్టమూ రాజ్యము ఎప్పుడూ యజమానుల పక్షమేననీ తెలిసివుంటుంది.
వ్లాదిమిర్ ఇల్యేచ్ గా మారిన వోలోడ్యా:
అకస్మాత్తుగా వోలోడ్యా తండ్రి చనిపోయాడు. అప్పుడు అన్న పీటర్స్ బర్గ్ లో రహస్య విప్లవంలో మునిగివున్నా డు. అక్క కూడా అక్కడే చదువుతోంది. తల్లికి, చిన్న వాళ్లకు తోడు వోలోడ్యా మాత్రమే. రెండవ అలెక్జాన్డర్ (జార్) హత్య చేయబడ్డాడు. పదవినెక్కిన మూడవ అలెక్జాన్డర్ పాలన మరింత అధ్వానం అయ్యింది. ప్రజలు ఎక్కడ గుమిగుడినా పోలీసులు ప్రత్యక్షం. స్వాతంత్య్రం అనే పదం పలకడానికి కూడా లేదు. సాషా కార్యకలాపా లు బయటపడితే చిత్రహింసలు, మరణమూ తప్పదు. అయినా ఆ యువకుల్లో వెరపు లేదు. జార్ ను చంపే ఘడియకోసం అతడూ, అతని యువబృందం ఎదురుచూస్తున్నారు.
అక్క, అన్న అరెస్టు అయ్యారు. తల్లి వారిని కలవటానికి పీటర్స్ బర్గ్ కు ప్రయాణమైంది. తన అన్నను అందరూ యోధుడు, రానున్న విప్లవపు దూత అన్నారు. డాక్టరమ్మ మాత్రం “ సాషా ధైర్యశాలే కానీ… ఒంటరిగా బాంబు, తుపాకీ తీసుకువెళ్లడం పనికిరాదు. జారూ, అతని తొత్తులు కార్మికుల్ని చంపేస్తారు. ఈ దోపిడీనీ, జారునూ వదిలించుకోవాలంటే కార్మికులు, కర్షకులు ఏకం కావాలి.
వారి పరిపాలనను సమూలంగా నాశనం చెయ్యాలి.” అనింది. ఆమె మాటలు అతనికి రేఖా మాత్రమైన లక్ష్యాన్ని నిర్దేశించాయి.
అన్న సాషాను ఉరితీశారు, అక్కకు ప్రవాస శిక్ష వేశారు. వ్లాదిమిర్ వణికిపోయాడు కానీ సోదరుడి మరణం అతన్ని గట్టిపరచింది. చదువుకు కజాన్ యూనివర్సిటీ వెళ్ళాడు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. వాక్ స్వాతంత్య్రం కొరకు, విద్యార్థుల హక్కులకొరకు, నిర్బంధ పాలన అంతం కొరకు ఉద్యమం జరిగింది. దాని నాయకుడు వ్లాదిమిర్. అక్కడే అరెస్టు – శిక్ష . అంత నిర్బంధం లోనూ ఆనందం ఏమంటే ఆ ప్రవాస శిక్షతో తాతగారి వూరికి, అక్క దగ్గరకే పోయాడు. అక్కడ ప్రాణ మిత్రుడు ఇవాన్ కూడా వున్నాడు.
ఆ మూడు సంవత్సరాలు తాతగారి ఇంట్లోనే వున్నాడు. రైతుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో దగ్గరగా గమనించాడు, రైతులకు వాళ్ళ భాషలోనే కారణాలను చెప్పడం, కష్టాలనుంచి బయటపడటానికి దారి చూపడం నేర్చుకున్నాడు. Now he is a leader in making.
ప్రవాసకాలం గడిచాక పీటర్స్ బర్గ్ లో ప్లీడరుపరీక్ష రాసి లాయర్ అయ్యాడు. కానీ ఎంతోకాలం ఆ ప్రాక్టీసు కొనసాగలేదు. అమరుడైన సాషా ఆశయాలు కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాయి, ఈ దేశం తనను పిలుస్తోంది. కార్మికులతో పనిచేయటం మొదలుపెట్టాడు. రైతులగురించి ఇవాన్ ద్వారా తెలుసుకుంటున్నాడు.
కామ్రేడ్ ఇల్యేచ్ … కామ్రేడ్ లెనిన్ గా మారుతున్నాడు.
లెనిన్ పాత స్నేహితురాలు వీరా పీటర్స్ బర్గ్ లోని ఒక రహస్య సమావేశంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఒక యువకుడు మాట్లాడుతున్నాడు “మన ప్రతిపనీ విప్లవ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవాలి. మనం తక్షణ కోర్కెల కోసం కూడా పోరాడాలి. పనిగంటలు తగ్గాలి, కార్మికుల జీవనసౌకర్యాలు మెరుగుపడాలి, సోషల్ ఇన్సూరెన్స్ పొందాలి. మనం యువకులను కూడగట్టాలి. కార్మికులు ఐక్యం కావాలి. వారిలో వారికి ఉన్న విద్వేషపు గోడలు బద్దలవ్వాలి. సమిష్టి పోరాటం తోనే మనం శత్రువును కూలదోయగలం”… ఆశ్చర్యం! అతను తన వోలోడ్యా! వీరా ఉద్విగ్నతకు లోనయ్యింది.
కార్మికులు సంఘంతో ఏకమవుతున్నారు. ఇప్పుడు లెనిన్ కార్మిక నాయకుడు, బోధకుడు, సహచరుడు. జారు పోలీసుల నల్లని నీడ ప్రతిచోటా వెంబడిస్తున్నది. “అండర్ గ్రౌండ్ “ పనులు మొదలు పెట్టవలసి వచ్చింది. కోడ్ భాష, రసాయనిక సిరాలతో రహస్య సందేశాలు పంపుకుంటున్నారు. అవసరం కొత్త దారులను వెతక చూపుతుంది. రహస్య ప్రెస్సులో వేలకు వేల కరపత్రాలు అచ్చయ్యేవి. అమ్మ నవలలో లాగా స్త్రీలు వాటిని ఆహారపుబుట్టల అడుగున పెట్టుకొని తమ కార్మికులకు చేర్చుకునేవారు.1895 లో పెద్ద సమ్మె జరిగింది. చక్రాలు ఆగాయి. నాయకుల అరెస్టులు జరిగాయి.. లెనిన్ జైలు పాలయ్యాడు, ఆ తరువాత లెనిన్ తో పాటు కొంత మందిని మంచు మైదానాలు వుండే సైబీరియాకు ప్రవాసం పంపారు.
అక్కడ గడ్డకట్టే చలికి మనుషులు కొయ్యబారిపోయి మరణిస్తారు. ఆ స్థితిలో వున్నా, కార్మిక పోరాటాలకు దూరమైనా లెనిన్ అధ్యయనం మానలేదు. వ్యాసాలు రాసి రహస్యంగా రష్యాలోని కార్మికులకు పంపేవాడు. కర్తవ్య నిర్దేశం చేసేవాడు. సూచనలు ఇచ్చేవాడు. లెనిన్ ను తమ నాయకుడుగా కార్మికులు నమ్మారు. తనలాగే ప్రవాస శిక్షకు గురయి సైబీరియా లొనే ఉన్న కృపస్కయా అతని జీవిత సహచరి అయ్యింది. లెనిన్ తిరిగి రష్యాకు రాకుండా జార్ అడ్డుకుంటునే వున్నాడు.
ప్రవాసానంతరం వేరేదారిన లెనిన్ రష్యా చేరాడు. అరెస్టు చేసే అవకాశం ఉండటంతో పీటర్స్ బర్గ్ పోలేదు. దేశమంతా కార్మికులు ఆర్గనైజ్ అవుతున్నారు. లెనిన్ నాయకత్వంలో “రష్యా సోషల్ డెమోక్రటిక్ పార్టీ “ ఏర్పడింది. ఉత్తరాలు, టెలిగ్రాఫ్, పుస్తకాలు, ప్రెస్సులు అన్నింటిమీదా నిఘా … పత్రిక ఇక రష్యాలో నడపడం వీలుకాదు. కార్మికులకు పత్రిక కావాలంటే విదేశాలకు వెళ్ళాలి. ఆ బాధ్యతతో లెనిన్ జర్మనీ వెళ్ళాడు. ఇస్క్రా (అగ్నికణం) పత్రిక వెలువడింది.
“నిప్పురవ్వే దావానల మౌను
పల్లె పట్టు పైరగాలి పట్టణాలు చుట్టును” శివసాగర్ గుర్తుకొస్తున్నాడు.
పోర్టు ఆర్థర్ రేవుకోసం రష్యా జపాన్ ల మధ్య యుద్ధం మొదలైంది. రైతులకు తుపాకులిచ్చి పసిఫిక్ సముద్ర తీరానికి తీసుకెళ్లి జపాన్ సైన్యంతో యుద్ధం చేయమన్నా రు. రెండు లక్షల మంది కార్మికులు గాయాల పాలయ్యా రు. సగం మంది మరణించారు. నిత్యావసర వస్తువుల కరువువల్ల ఆకలి తాండవిస్తున్నది. పెట్టుబడిదారులు, భూస్వాములు మాత్రం రష్యా గెలిస్తే తమకు వచ్చే లాభాల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. యుద్ధం నుంచి తిరిగివచ్చిన సైనికులు తమ కుటుంబాల స్థితి చూసి ప్రార్థనా గీతాలు పాడుకుంటూ సాయం కోసం జార్ దగ్గరికి వెళ్ళారు. 200 మందిని చంపేశారు. అసలు శత్రువెవరో కార్మికులకు ప్రత్యక్షంగా తెలిసింది. ఉద్యమ పతాకాల మీద “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” నినాదం వెలిసింది.
“ఆకలి మంటల మలమల మాడే
అనాథలందరు లేవండోయ్….. “ జన గీతమైంది.
దేశం ఉడుకుతున్నది
పల్లెల్లో భూస్వాములమీద కూడా తిరుగుబాట్లు మొదలయ్యాయి. సార్వత్రిక సమ్మె జరిగింది. జారు, పెట్టుబడిదారులు, భూస్వాములు గాభరా పడ్డారు. ఓటుహక్కు, మీటింగులు పెట్టుకునే స్వేచ్చ, కాంగ్రెస్ ను ఎన్నుకునే హక్కు వాగ్దానం చేశారు.
“ఇది విప్లవ విజయం అయితే కార్మికులను బుట్టలోవేసే దొంగ హామీలు ఇవి. నమ్మకండి! మీరు ఇంకా అనేక యుద్ధాలు చేయాలి . ఆయుధాలు సేకరించండి, సైనికుల్ని మన వైపుకి లాగండి. రైతుల్ని కలుపుకోండి సార్వత్రిక సమ్మె కొనసాగిద్దాం” లెనిన్ పిలుపు ఆఖరి పోరుకు దారిచూపింది. సమ్మె వల్ల మాస్కో ఖాళీ చేసిన గ్రామం వలే అగుపిస్తున్నది. కార్మికులు, మహిళలు , బాల బాలికలతో ఊరేగింపు మొదలైంది. బారికేడ్లు కట్టిన వీధుల్లో మొదటిసారి కార్మికులు జార్ పోలీసులపై తుపాకులు పేల్చారు. మర ఫిరంగులు, జారు అత్యున్నత సైన్యం మాస్కో దారి పట్టింది. కార్మిక నాయకుల్ని జైల్లో పెట్టారు. కార్మికులు లెనిన్ ను తప్పించారు.రష్యా కార్మికుల ప్రధమ సాయుధ తిరుగుబాటును జార్ హింసతో అణచివేశాడు. అనేకమంది కార్మిక నాయకులు నిరాశపడ్డారు. అంతా ముగిసిందని నీరసించారు. లెనిన్ మాత్రం విప్లవం ఊపిరి పీల్చుకునే ఈ రోజుల్లో మరో నూతన విప్లవ ఆధిరోహణానికి సిద్ధం కావాలన్నాడు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మొదట ఫిన్లాండుకు, అక్కడి నుంచి స్విట్జర్లాండ్ కు పోయాడు. తొమ్మిదేళ్ల పాటు పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టలేక పోయాడు. కానీ కార్మికుల్ని బృందాలుగా తన దగ్గరకి పిలిపించుకుని శిక్షణనిస్తున్నాడు. ప్రజలు మరో మహత్తర విప్లవానికి సిద్ధమౌతున్నారు.
వాళ్ళకు అండగా కార్మిక కర్షకులు నిర్మించుకున్న పార్టీ ఉంది. వాళ్ళు దాన్ని బోల్ష్ విక్ పార్టీ అని పిలుస్తారు. జారు భయపడుతున్న కొద్దీ నిర్బంధం పెరుగుతున్నది. ఒక్క సైబీరియా లొనే 200 మందిని కాల్చి చంపారు. జైళ్లు, ప్రవాసం సాధారణ శిక్షలు అయ్యాయి. మరోవైపు ఖనిజాలను, పెట్రోలును, బొగ్గును కొల్లగొట్టడానికి మార్కెట్లను, బంగారాన్ని స్వంతం చేసుకోడానికి పెట్టుబడిదారులు ఉవ్విళ్లూరుతున్నారు. కొన్ని చోట్ల జట్టుకడుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమౌతోంది. పాలకులు వాళ్ళ వాళ్ళ దేశాల్లో
“మాతృభూమిని రక్షించుకోండి” అనే పిలుపుతో తమ ప్రజలను, సైన్యాన్ని యుద్ధానికి ఉసిగొలుపుతున్నారు. 1914లో ఆ వినాశకర యుద్ధం మొదలైంది.
“ఈ దేశం మీదికాదు. ఇది మీ యజమానులకు, ధనవంతులకు చెందినది. వాళ్ళు మిమ్ములను ఒకరినొకరు చంపుకోమని చెబుతున్నారు. వాళ్ళ లాభాలకోసం మీరు యుద్ధంలో చచ్చిపోతున్నారు. రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, అమెరికన్ బ్రిటిష్ కార్మికులమంతా ఏకమౌదాం. సామ్రాజ్యవాద యుద్ధాన్ని విప్లవంగా మలుద్దాం” అని లెనిన్ పిలుపునిచ్చాడు. యుద్ధం వల్ల పాలు, రొట్టె, మాంసం దొరకడం లేదు. నాసిరకం రొట్టెకోసం రోడ్లమీద బారులు తీరిన ప్రజలు. వారిలో ఉద్రేకం పెల్లుబికింది. పట్టణ కేంద్రానికి దారితీశారు. కొంతమంది సైనికులు ప్రజల పక్షాన నిలిచారు. “సోవియట్లను నిర్మించండి. అవి ప్రజలకు స్వాతంత్య్రం ఇస్తాయి” నినాదం ఎల్లెడలా! జారు పారిపోయాడు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది కానీ దాని పెత్తనం ఇంకా యజమానులదే. కార్మికులకు అధికారం రాలేదు. విప్లవాన్ని ఆపకండి. ప్రతిఒక్కరికీ శాంతి, కార్మికులకు తిండి, రైతులకు భూమి మనం అధికారం పొందినప్పుడే సాధ్యం.” కార్మికులకు సందేశం పంపి తాను రష్యా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా శాంతిని, తిండిని సమకూర్చలేక పోయింది. వాళ్లు జారు ప్రభువుకంటే ఎక్కువగా పెట్టుబడిదారుల సేవలో మునిగిపోయారు.
లెనిన్ అంటే పెట్టుబడిదారులకు ద్వేషం. ప్రజలలో అతనికున్న పేరును నాశనం చేద్దామని ముందుగా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆ తరువాత అంతం చేసి విప్లవం తలతీసేద్దాం అనుకున్నారు. అరెస్టు వారెంట్ ప్రకటించారు. పట్టించిన వారికి పెద్ద బహుమతులు ప్రకటించారు. లెనిన్ కొంత కాలం గ్రామ సీమల్లో, అడవిలో తలదాచుకున్నాడు, వ్యవసాయ కూలీగా పనిచేస్తూ తన గుర్తింపును దాచుకున్నాడు.
1917 శరదృతువు… ఆకురాలేకాలం. నౌకలు అట్లాన్ టిక్ samudram మీదుగా అమెరికన్ సైనికుల్ని తెస్తున్నాయి. రష్యా, పోలాండ్, జర్మనీ సరిహద్దుల్లో యుద్ధంలో అలసి పోయిన సైనికులకు లెనిన్ మాటలు అర్థమవసాగాయి. యుద్ధం వద్దని జర్మనీ, రష్యా సైనికులు ఒక్కటయ్యారు. తమ ఆయుధాలతో సహా పెట్రోగ్రాడ్ (పూర్వపు పీటర్స్ బర్గ్) కు కదిలారు. ధనిక వర్తకుల మర ఫిరంగులు కార్మికులపై గర్జించాయి. ప్రతిగా సోవియట్ల తుపాకులు బదులిచ్చాయి. లెనిన్ నేరుగా రంగంలో దిగి విప్లవబాధ్యత తీసుకున్నాడు, సహాయకుడు స్టాలిన్. ముందు బోల్షివిక్కులు, వెనుక శ్రేణులు.. “టెలిఫోన్, రైల్వే స్టేషన్లను ఆక్రమించండి. పీటర్ అండ్ పాల్ కోటను ముట్టడించండి. జార్ భవనం శత్రువుల మూలస్థానం
దాన్ని ముట్టడించండి”. శ్రేణులు పిలుపుకు స్పందించాయి.
తిరుగుబాటు దారులు అరౌరా నౌక నది మీద నుంచే రాజ భవనం పైకి ఫిరంగులు పేల్చారు. జార్ అధికార కేంద్రం కూలిపోయింది. 1917 నవంబరు 7 లెనిన్ “అధికారమంతా సోవియట్లకే” నినాదం ఇచ్చాడు. సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ ఏర్పడింది. అయినా కార్మికుల మధ్యలో శత్రువులు దాక్కునే వున్నారు. పైగా విదేశాలకు పారిపోయిన పెట్టుబడిదారులు, పూర్వపు రాజవంశీకులు, దేశంలోని ధనిక వర్తకులు జట్టుకట్టి సోవియట్లకు వ్యతిరేకంగా కొత్త సైన్యాన్ని తయారు చేశారు. ఒకసారి అవి పెట్రోగ్రాడ్ వరకూ వచ్చాయి. ఒడిపోతామేమోనని కార్మికులకు సందేహమూ, భయమూ కలిగాయి. అప్పుడు లెనిన్ కు కలిగిన ఆలోచనే “ రెడ్ ఆర్మీ” ఎర్రసైన్యం.
1920 నాటికి ఎర్రసైన్యం తన శత్రువులను జయించింది. పెట్టుబడిదారీ పత్రికలు ఇపుడు రష్యా పై కొత్తగా దుష్ప్రచారం మొదలు పెట్టాయి. మరో వైపు లెనిన్ ను చంపేసారని ప్రచారమూ చేస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే రష్యన్ విప్లవం తరువాత మన భారతదేశ యువకులతో సహా అన్ని ప్రపంచదేశాల యువత సంపూర్ణ విముక్తి, సమానత్వం గురించిన ఆలోచనలు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. విముక్తి ఉద్యమాలు బద్దలయ్యేస్థితి ఏర్పడనున్నది. అది వాళ్ళను కలవరపరుస్తున్నది.
ఇంతలో శత్రువులకు చెందిన ఒక మహిళ లెనిన్ పై తుపాకీతో కాల్పులు జరిపింది. రెండుగుళ్లు శరీరంలోకి దిగాయి. అయినా లెనిన్ బతికాడు. కానీ అది అతని భవిష్యత్తు ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆ తరువాత అతని త్వరిత మరణానికి కారణమయ్యింది.
చేరుకోవలసిన లక్ష్యాలు ఇంకా మిగిలేవున్నాయి. విప్లవ మంటే పాతను ధ్వంసించడమే కాదు. సమానత్వం ప్రాతిపదికన కొత్తను సృజించడం కూడా. కానీ అది సాధ్యమా? జార్, పెట్టుబడిదారుల బంట్లు అయిన, బద్ధకస్థులైన ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. అరకొర చదువు లేదా అసలు చదువేలేని కార్మికులకు, మహిళలకు శిక్షణనిచ్చి పరిశ్రమలు, ఆఫీసులు నడిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల కమ్యూనిస్టు పార్టీలతో మొదటి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ఏర్పడింది.
లెనిన్ నిద్రాహారాలుమాని పనిచేస్తున్నాడు. ఆరోగ్యం దెబ్బతింటుందని సన్నిహితులు హెచ్చరించారు కూడా. అతడు ఎవరిమాటా వినని మొండి పనివాడు. అతనికి ప్రజల శ్రేయస్సు తప్ప మరో లక్ష్యం లేదు.
లెనిన్ 1924 జనవరి 21న అనారోగ్యంతో మరణించాడు. మార్క్స్, ఎంగిల్స్ తరువాత ప్రపంచ ప్రజలకు అంతటి స్ఫూర్తినిచ్చిన మహానాయకుడు లెనిన్ మరిలేడు. అతడు కన్న కలలు ఇంకా సాకారం కాలేదు. ప్రతీపశక్తులు కమ్యూనిస్టు రాజ్యాన్ని దెబ్బతీయడానికి కాచుకొనే వున్నాయి ‘మేకపిల్లను కబళించాలనుకునే తోడేలులాగా’.
కార్మిక రాజ్యం ఏర్పడి నిండా నాలుగేళ్లు కూడా నిండలేదు. అందుకోవాల్సిన లక్ష్యాలేమో పర్వతాలంత పెద్దవి. దేశ అభివృద్ధికి విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు తక్షణ అవసరం. ఆ అవసరాల ప్రాతిపదికన స్టాలిన్ ప్రభుత్వం (1928-32) మొదటి పంచవర్ష ప్రణాళిక రూపొందించింది. భారీ పరిశ్రమలు, సమిష్టి వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు దాని మొదటి లక్ష్యం. త్వరలోనే ఆ ప్రణాళికలు ప్రపంచానికి అభివృద్ధి నమూనా అయ్యాయి. శర వేగంగా సాగుతున్న రష్యా అభివృద్ధికి ఆటంకంగా రెండో ప్రపంచయుద్ధం వచ్చింది..
యుద్ధంలో చిక్కుకుపోయి మానవాళి విలవిల లాడుతున్నది. జర్మన్ ఫాసిజం ప్రపంచాన్ని కబళించేం దుకు కాలుదువ్వుతున్నది. ఉక్కుమనిషి స్టాలిన్ రష్యా నాయకత్వాన్ని చేపట్టి ఎర్ర సైన్యం సాయంతో రష్యానే కాదు, యావత్ ప్రపంచాన్నే ముందుకు నడిపాడు.
“స్టాలినో నీ ఎర్రసేన
ఫాసిజం వినాశ సైన్యం” అని చలసాని ప్రసాద్, వేటపాలెం వెంకాయమ్మ పాడగా విన్న పాట గుర్తుకొస్తున్నది.
హిట్లర్ ఫాసిజాన్ని ఓడించాడు. 53 ఏళ్ల లెనిన్ జీవితం అంటే నిజానికి రష్యా చరిత్రనే.
*మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంతవరకు అతివాదులుగా ఫోజు కొట్టిన కొంతమంది సోషలిస్టులు నిరంకుశత్వాన్ని తట్టుకోలేక రాజీల బాట పట్టారు. సామ్రాజ్యవాద యుద్ధంలో బూర్జువాలతో కుమ్ముక్కయి జాతీయ దూరహంకారాన్ని రెచ్చగొడుతూ, సిద్ధాంతాలను గాలికి వదిలేశాయి* -లెనిన్
ఈ చిన్ని నవల చదువుతున్నంత సేపూ నాకు మన చుట్టూ ఇనుప కంచెగా అల్లుకుంటున్న జాతీయవాదం, కుహనా దేశభక్తి, వీటిని ప్రశ్నించిన వారిపట్ల అమలు జరుగుతున్న నిర్బంధం, జైళ్లు, ప్రొఫెసర్ సాయిబాబా, స్టాన్ స్వామి,సుధా భరద్వాజ్, వరవరరావు, వెర్నాన్, హనీబాబు, జ్యోతి జగతాప్… మరెందరో గుర్తొచ్చారు. ఎప్పుడైనా కౄర నిర్బంధం అమలులో వుందంటేనే పెట్టుబడిదారులు భయపడుతున్నారని అర్థం.
పెట్టుబడి కుట్రలతో కులాలుగా, మతాలుగా చీలిపోయి ఉన్న భారత సమాజం కూడా మళ్లీ ఒక్కటై విముక్తి మార్గంలో నడుస్తాయన్న ఆశ నాకు కలిగింది. ప్రజల మధ్యలో ఏర్పరచిన విద్వేషపు గోడలు బద్దలు కొట్టేది ఎలాగో మనమంతా కలిసి ఆలోచించాలి.
మీరు చదవండి. మీ పిల్లలతో చదివించండి. పిల్లలకు చదివి కథగా చెప్పండి. మానవాళచేసిన ఒక మహత్తర పోరాటం గురించి చెబుతూ స్వేచ్చ, సమానత్వం, సోదరభావం అనే మానవీయ ఆకాంక్షలు ఎందుకు గొప్పవో అర్థం చేయించండి.
ఈ పుస్తకాన్ని తెచ్చిన ప్రచురణకర్తలకు, అనుసృజన చేసిన కట్టా సిద్ధార్థకు అభినందనలు. దీని కొనసాగింపుగా ఇటువంటిదే స్టాలిన్ పుస్తకం తేవాలని వారికి నా విన్నపం.
లెనిన్
వెల:120
ప్రతులకు: అన్ని పుస్తకాల షాపులు.
మీ అభిప్రాయాలను మెయిల్ ద్వారా తెలియజేయడానికి hspub1917@gmail.com