గత సంవత్సరం ఒక–ఆన్ లైన్ పత్రికలో – ఆర్ ఎస్ ఎస్ ప్రారంభానికి ముందు మూంజే ఇటలీ పర్యటన, అక్కడి నుండి వచ్చి నాగపూర్ వెళ్ళి హెడ్గెవార్ ను కలవడం గురించి రాశారు. ఇండియాలో ఆర్ ఎస్ ఎస్ మూలాల పైన  ఇర్ఫాన్ హబీబ్ లేదా షంసుల్ ఇస్లాం వంటి వారి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.

బీజేపీ రాజకీయ నాయకులు తరుచుగా తమది సైద్ధాంతిక సంస్థ అనీ చెప్పుకుంటూ ఉంటారు . ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంస్థలు సంపూర్ణ ఆధిపత్యంతో పురోగమిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు రాజకీయాలను, దాని ఫాసిస్టు సైద్ధాంతిక పునాదులనూ, లక్ష్యాలనూ, దాని 97 ఏళ్ల పురోగతినీ ప్రజాస్వామిక సంస్థలు కొంత వరకే విశదపరిచే పని చేశాయి. అది అప్రతిహతింగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలో మాత్రం ఈ ఆరెస్సెస్ భావజాల పురోగతి ప్రజాస్వామిక సంస్థలకు బహుశ సాధారణ విషయంగా కనిపిస్తూ ఆ వైపు చర్చలు చేయడాన్ని పరిమితం చేసుకుంటున్నాయి. అంటే ప్రజలను తమ ఉన్మాద నినాదాల వెనక సమీకృత మయ్యేట్టు ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థలు ఎంత బలంగా పని చేస్తున్నాయో ప్రజాస్వామిక సంస్థలు అందులో సగం కూడా   ప్రచారం చేయలేకపోవడం కనిపిస్తోంది. ఆర్ ఎస్ ఎస్ ప్రారంభ ఫాసిస్టు ప్రణాళికలూ, ఫాసిస్టు మూలాలూ, 1947 కు ముందు బ్రిటీష్ పాలనలో ఆర్ ఎస్ ఎస్ రాజకీయాల ప్రభావం, గాంధీ హత్య గురించి దాని అనుబంధ సంస్థల సమావేశాలూ వంటి వాటిపై చాలా ప్రజారంగంలో పని చేస్తున్నవారికి పూర్తి అవగాహన లేదు. గాంధీ హత్య తర్వాత ఆర్ ఎస్ ఎస్ పై నిషేధం, ఏ యుక్తితో నిషేధం ఎత్తివేయించుకున్నదీ, నిషేధం ఎత్తివేత అనంతరం, రాజకీయ అనుబంధ సంస్థ భారతీయ జనసంఘ్ ఏర్పాటు కశ్మీర్ పరిణామాలలో జన సంఘ్ పాత్రల పై ప్రజాస్వామిక సంస్థల అంతర్గత సమావేశాల్లో, బహిరంగ సదస్సులలో చర్చలు జరుగుతున్నాయా అనేది సందేహాస్పదం. ఈ చర్చలు లేకుండా ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు స్వభావంపై, దాని పురోగతి పై చర్చ లేకుండా ఈ నాటి ఆర్ ఎస్సెస్ ఫాసిస్టు సంస్థల అప్రజాస్వామిక, నిరంకుశ, భయానక స్వభావాన్ని ఏ ప్రజాస్వామిక సంస్థ ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలదు. 1947 దేశ విభజన తదనంతర మత మారణ కాండలపై ప్రజాస్వామిక సంస్థలు ఏ అవగాహన కలిగి వున్నారు. విభజన నాటి పరిణామాలను ఆర్ ఎస్ ఎస్, దాని అనుబంధ సంస్థలూ, ఇతర ప్రజాస్వామిక సంస్థలు ఎట్లా చూశాయి. విభజన వెనక ప్రధాన పాత్ర ఎవరిది. ఎవరెవరు అనుకూలురు, ఎవరెవరు వ్యతిరేకులూ అన్న విషయాల పై ప్రజాస్వామిక సంస్థల సభ్యులకు సరైన అవగాహన లేకుండా ఆర్ ఎస్ ఎస్ ఇండియన్ ఫాసిజం పై ఎట్లా పోరాడగలం.

ఆర్ ఎస్ ఎస్ పై నిషేధం ఎత్తివేసిన తర్వాత, నెహ్రూ పాలనా కాలంలో ఆర్ ఎస్ ఎస్–జన సంఘ్ సంస్థలు ఏం చేశాయి. 1962 చైనాతో యుద్ధం, 1965 పాకిస్తాన్ తో యుద్ద కాలంలో తదనంతర ఇందిర పాలనా కాలంలో ఆర్ ఎస్ ఎస్ ఎత్తుగడలూ ఎట్లా వున్నాయి. 1975 జూన్ లో ఎమర్జెన్సీ ప్రకటన, ఎమర్జెన్సీ ఎత్తివేత, స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య, ఇందిర హత్య తర్వాత రాజీవ్ గాంధీ చేసిన బాబ్రీ మసీదు గేట్లు తెరిచిన, శ్రీలంకకు సైన్యం పంపుతూ చేసిన పనీ, దాంతో అతను హత్యకు గురికావడం– దేశంలో ఆర్ ఎస్ ఎస్ ను రాజకీయంగా బలంగా అణిచే పాలక సంస్థ లేకపోవడం– కశ్మీర్ విషయంలో 1947 లో రాజా హరిసింగ్ లేఖ ఇచ్చినపుడే నెహ్రూ ప్రభుత్వం ఇచ్చిన స్వతంత్ర ప్రతిపత్తి హామీ కేవలం ఆర్టికిల్ 370 నే కాకుండ, 1973 సిమ్లా ఒప్పందం తో పాకిస్తాన్ పాత్రను పరిమితం చేసినా, తదనంతరం అక్కడ యువతలో పెరిగిన అశాంతి విషయంలో కశ్మీరీ రాజకీయ సంస్థలతో చర్చలు జరపడంలో ఘోరంగా విఫలమైన ఇందిర అనంతర కాంగ్రెస్ పార్టీ, కేంద్రం లోని ప్రభుత్వాలూ కశ్మీర్ లో ప్రజల జీవన స్తితిగతులపై కన్నా పొరుగు దేశపు రాజకీయ ఎత్తుగడలకు సమాధానాల మాటలకే పరిమితమవడం వల్ల ఏర్పడిన అశాంతికి సమాధానంగా తరచూ రాష్ట్ర పతి పాలనలు విధించారు. మధ్య లో వీపీ సింగ్ పంపిన ఆర్ ఎస్ ఎస్ గవర్నర్ జగ్ మోహన్ సైనిక పటాలాలు రాత్రుళ్ళలో కశ్మీరీ గ్రామాల్లో ఇళ్లలోకి జొరపడి కశ్మీరీ తల్లులపై జరిపిన అత్యాచారాల పర్వం అక్కడి ప్రజల్లో కేంద్ర పాలకుల పట్ల మరింత ఏహ్య భావం కలిగించిన సంఘటనలు ఈ దేశంలోని అధికారులలో ఆర్ ఎస్ ఎస్ అనుయాయుల పాత్రనూ అర్థం చేయిస్తోంది. సాయుధ కశ్మీర్ యువత చర్యలు చూపిస్తున్న ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థల విష ప్రచారం స్థానంలో అక్కడి వాస్తవ పరిస్థితులపై, కశ్మీరీలకు హామీ పడిన స్వతంత్ర ప్రతి పత్తి పై ఏ ఎన్నికల పార్టీ కూడా ఇప్పటికీ ప్రజాస్వామిక దృక్పథంతో తమ వైఖరి చెప్పలేకపోతున్నందుకు ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థల ప్రచారమే దేశ ప్రజలకు కనిపిస్తున్న విషాదకర పరిస్థితి వుంది. ఇదే సమయంలో అద్వానీ రథ యాత్ర, దాని ఆధారంగా ప్రజల్లో మతోన్మాద భావనలే దేశ సమస్యలుగా నాటిస్తూ చేసిన విషపూరిత ప్రయోగాలు ఇవన్నీ వర్తమాన కాలంలో నిరంతరం ప్రజాస్వామిక రాజకీయాల గురించి జరిగే సభలలో చర్చించాలి. ఈ ఆర్ ఎస్ ఎస్ నేపథ్యంలో జరిగిన పరిణామాలను ప్రజాస్వామిక సంస్థల చర్చల్లో వస్తున్నాయా. 1992 డిసెంబర్ లో బాబ్రీ మసీదు కూల్చివేత తదనంతర ఎన్నికల పార్టీల రాజకీయాలు, ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో ఎన్నికల పార్టీల రాజకీయాలూ, ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంఘాలు భజరంగ్ దళ్ అనీ, విశ్వ హిందూ పరిషద్, ఇతర సేనలూ, సాధువుల సమావేశాలలో –బాహాటంగా ముస్లిం విద్వేష నినాదాలతో విజృంభిస్తూ పోవడం –నెహ్రూ, ఇందిర ల తర్వాత కాంగ్రెస్ తో సహా ఇతర ఎన్నికల పార్టీలకు ఈ ఫాసిస్టు ఆర్ ఎస్ ఎస్ ను సైద్ధాంతికంగా ఎదుర్కొనే చిత్తశుద్ది లేకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.   1980 ల తర్వాత టీడీపీ, బీ ఎస్ పీ వంటి కుల ప్రయోజనాల ప్రాంతీయపార్టీలు పెరగడమూ, అధికారమే పరమావధిగా, ఓట్లు వేయంచుకునే జిమ్మిక్కుల పథకాలు తప్ప, ప్రజల దేశంలో ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం పని చేయని పార్టీలు ప్రజలను కేవలం ఐదేళ్ల కోసారి జరిగే ఎన్నిక‌ల్లో వారు కాకపోతే వీరు వీరు కాకపోతే వారికి ఓట్లు వేసే దుస్తికి దిగజార్చి వదిలేస్తున్న విషయం చర్చకు వస్తున్నదా? ప్రజల జీవన స్థితిగతులు గాలికి వదిలి, నవీన కుల స్పృహ సంఘాల ప్రయోజనవాద రాజకీయాలూ, మరోపక్క ప్రపంచ బాంకు గుమాస్తాలైన కుల ప్రాంతీయ పార్టీలూ, ఆర్ ఎస్ ఎస్ రాజకీయ సంస్థ లతో కుమ్మక్కై నవీన కుల పెట్టుబడిదారుల రాజకీయాల తరాన్ని సృష్టించడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ప్రజా పోరాటాలను రక్తపుటేరుర్లో ముంచి అంతిమంగా ఆర్ ఎస్ ఎస్ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా పనిచేయడం చూశాం. దేశంలో 1947 విభజన తర్వాత నుండి ఆర్ ఎస్ ఎస్ వంటి బ్రాహ్మణీయ మనువాద ఆధిపత్య ఫాసిస్టు సంస్థ, దాని అనుబంధ సంస్థల రాజకీయాల నేపథ్యంలో రాజకీయ పరిణామాల వివరాలు   కనీసం బాబ్రీమసీదు ఘటన తర్వాతనైనా ప్రముఖంగా చర్చించి, దాని వ్యతిరేకంగా పని చేయడానికి ఈ పార్టీలు కార్యాచరణచేపట్టాల్సి వుండేది. ఈ ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు సంస్థల రాజకీయాలకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక కార్యాచరణలో ఫలితాలు సాధించని దుస్తితి వల్లనే ఈనాటి ఆ సంస్థల విజృంభణకు కారణం. ప్రజాస్వామిక సంస్థలు తరుచుగా కేవలం పెట్టుబడి/ కార్పొరేట్లు కోరుకున్న పాలకులు నిలబడ్డారు. మిగతా వారు పోయారు అని అనేయడం చూస్తాము. కొంత వరకూ ఈ మాట నిజమే అయినా ఆర్ ఎస్ ఎస్ వంటి ఫాసిస్టు సంస్థ విద్వేష భావజాలం పునాదిగా భయోత్పాతాన్ని బాహాటంగా ప్రచారం చేస్తూ చాపకింద నీరు వంటి పనులూ చేస్తుండగా… ఎన్నికల పార్టీలు ఏ సైద్ధాంతిక పునాదిలేని కేవల అధికార వాద, అవినీతికర దివాళాకోరు రాజకీయాలు చేశాయి. ఇక ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంఘాలు తమ లక్ష్యం నుండి దూరం కాకుండ నడిపిన మతోన్మాద ఫాసిస్టు వ్యూహాత్మక రాజకీయాల ప్రాధాన్యత మనం మర్చిపోరాదు.

ఇందిర హత్య తర్వాత బలహీన పడిన కాంగ్రెస్ వల్ల, 1991 తర్వాత ఇతర ఎన్నికల పార్టీలు, ఉత్తర భారతపు కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నే లక్ష్యం చేసుకోడంతో పార్లమెంటు ఎన్నికలలో లోక్ సభలో రెండు సీట్ల నుండి ఎనభై సీట్లకూ, ఆ పైన నూట యాభై పైన సీట్లకూ–ఆ క్రమంలో అకాలీదళ్, అన్నా డీ ఎమ్ కే, టీడీపీ వంటి అవకాశ వాద ప్రాంతీయ పార్టీల మద్దతుతో కూటమి కట్టిన కేంద్రంలో 1999 నాటికి అధికారం సుస్థిరం చేసుకున్నది ఆర్ ఎస్ ఎస్. ఈ విధంగా అధికారం ఆర్ ఎస్ ఎస్ దే అనాలి కానీ బీజేపీది కాదు. బీజేపీకి ఆర్ ఎస్ ఎస్సే సైద్ధాంతిక సంస్థ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు. అది ముస్సోలినీ, హిట్లర్ ల జాతి విద్వేషం పునాది గా గల ఫాసిస్టు సైద్ధాంతిక సంస్థ. కార్పొరేట్ల మద్దతు విషయానికి వస్తే–ఇందిర హయాంలో టాటా, బిర్లాలూ, ఆ తర్వాత గుజరాత్ కార్పొరేట్లు కాంగ్రెస్ కు ఎన్నికల్లో ఉపయోగపడ్డారు.

కమ్యూనిస్టు పార్టీ నుండి ఎమ్ ఎల్ వరకూ అధికారం కార్పొరేట్లదే– పార్టీలు వారి చేతిలో పావులు అనేయవచ్చు.

కానీ ఇందిర హత్య తర్వాత ఆర్ ఎస్ ఎస్ పన్నాగాలు ఫాసిస్టు భావజాల ప్రచార కృషి పాత్ర లేదంటామా. పీవీ నర్సింహ్మారావు లోలోపల ఆర్ ఎస్ ఎస్ సానుభూతి పరుడనే విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆ పివీ మన్మోహన్ కార్పొరేట్లకు అనుకూలం పాలన విధానాలు కూడా అప్పటికే ఉత్తర భారత వ్యాపారుల అభిమాన సంస్థ ఆర్ ఎస్ ఎస్ కు ఉపయోగపడ్డాయి.

ఇక ప్రజల్లో ఓట్లు వేయించుకొనే బలమైన ఫాసిస్టు సంస్థ, తమ ప్రియమైన బ్రాహ్మణీయ సంప్రదాయిక మనువాద ఆధిపత్య సంస్థదే భవిష్యత్తు సమాజ ఆధిపత్యం అని కార్పొరేట్లకు అనిపించీ, వారు ఆర్ ఎస్ ఎస్ రాజకీయ సంస్థ బీజేపీకి తమ సంపూర్ణ సహకారం ఇచ్చారు.

కాంగ్రెస్ గరీబీ హటావో అన్నా, భూసంస్కరణ అన్నా భూస్వాముల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ఏ విఘాతమూ చేయలేదు. అందుకే కమ్యూనిస్టుల నుండి ఎమ్ ఎల్ వరకూ ఎన్నికలన్నీ నడుపుతున్నది టాటా బిర్లా, సింఘానియాలే అనేవారు.  పురాతన ఇటలీ వైభవం కోసం కొత్త ఇటలీ అన్న ముస్సోలినీ దారిలో, యూదులను చంపండి అన్న హిట్లర్ దారిలో ముస్లిం జాతి విద్వేషంతో బయలు దేరిన ఆర్ ఎస్ ఎస్ కు, దాని అనుబంధ రాజకీయ సంఘానికి ఓట్లు పడటానికి అంతర్జాతీయ సామ్రాజ్యవాద  ఆధిపత్య రాజకీయాలు కూడ ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. నాటో సామ్రాజ్యవాదులు నడిపిన పెట్రోలియం దేశాల మధ్య విభజన రాజకీయం, పశ్చిమాసియా దేశాలపై మారణ కాండలూ–పశ్చిమ ఆసియాలో కొన్ని తుపాకుల గ్రూపులు చేసిన ప్రతిఘటన యుద్ధం చూపుతూ సద్ధాం, గడాఫీల పై నాటో సామ్రాజ్యవాదులు చేసిన యుద్దాలు కూడా 2001 తర్వాత ఆర్ ఎస్ ఎస్ ఇండియన్ ఫాసిస్టులు ఇండియాలో అత్యంత సులభంగా యువత మెదళ్ళలో ముస్లిం సంస్కృతి పై విషం పెంచడానికి దోహదం చేసింది.

 ఫలితంగా ఇండియాలో ఇండియన్ ఫాసిస్టుల వ్యూహాత్మక విద్వేష రాజకీయాలకు అంతు లేకుండ పోయింది. వారు తమ మతోన్మాద విద్వేషం ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేసుకొంటూ వుంటే కార్పొరేట్ బానిస గా పదవి చేపట్టిన మన్మోహన్ ప్రధాన మంత్రిగా ఆర్ ఎస్ ఎస్ ను ఎదుర్కొనే సైద్ధాంతిక ఆలోచన చేసే ప్రణాళిక ఏదీ చేయ లేదు.

కేవలం కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మ పాత్రకు పరిమితమైన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పాలన కాలం మరో సారి ముస్లింల రక్త దాహంతో విజృంభించిన గుజరాత్ ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టులకు వరమైంది. ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టులు  గుజరాత్ కార్పొరేట్ల అండతో కాంగ్రెస్ ను 2014 లో సులభంగా తీసేసి దేశాన్ని ఆక్రమించారు. ఈ ఎన్నికల విజయం కన్నా చాలా సంవత్సరాల ముందు నుండే దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్యేతర సంస్థల్లో తమ భావజాల విభాగాలను చొప్పించింది. విద్యాసంస్థలూ,యువజన సంస్థల నుండి, ఉద్యోగులూ, కార్మికులూ పోలీసుల వంటి శాంతిభద్రతల సంస్థలూ, న్యాయ వ్యవస్థలూ శాస్త్ర విజ్ఞాన సాంకేతిక సంస్థలలో ఆర్ ఎస్ ఎస్ అనుకూల వ్యక్తులు పెద్ద సంఖ్య లో కనిపిస్తారు. గుజరాత్ మారణకాండ కు చాలా ముందే 1980 దశకంలో ప్రారంభంలో అస్సాం బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాలలో దశాబ్దాల క్రితం వలసలు వచ్చిన వారి ఇళ్లను తగల బెట్టి సజీవ దహనం చేసిన మారణకాండ, ఉత్తర్ ప్రదేశ్ మీరట్ లో ప్రొవిన్షియల్ ఆర్మడ్ కాన్స్టాబ్యులరీ అనేక ప్రత్యేక పోలీసులు జరిపిన సామూహిక మతోన్మాద హత్యలూ, 1988 లో ధర్భంగా వంటి ఉత్తర బీహార్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం మైనారిటీ మతస్తులను లక్ష్యం చేసుకుని జరిపిన మారణకాండలూ ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థల తెరచాటు ఫాసిస్టు కార్యకలాపాలకు ఉదాహరణలైతే, 1993 జనవరిలో బొంబాయిలో నెల రోజుల పాటు శివ సేనతో కలిసి జరిపిన హత్యాకాండలూ ఆర్ ఎస్ ఎస్ అధికారంలో లేనపుడే జరిపిన ఫాసిస్టు హత్యాకాండల దృష్టాంతాలు. ఈ మారణహోమాలకు బాధ్యత వహించేట్టు ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంఘాల ముసుగు చించి ప్రజల ముందు నిలబెట్టే కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ప్రజాస్వామిక సంస్థలు ఇచ్చిన

ఎన్నికల పార్టీల దివాళాకోరు కేవల అధికార దాహం, ప్రాంతీయ పార్టీల పదవుల ప్రయోజన వాదం, వారి అవినీతి, ప్రజల్లో పెరిగిపోతున్న నిరుద్యోగం, మీడియాలో నిండిపోయిన ఆర్ ఎస్ ఎస్ బ్రాహ్మణీయ సంప్రదాయిక శక్తులు– వగైరా కారణాలన్నీ పట్టణ యువతకూ, 1990 ల తర్వాత వచ్చిన కొత్త తరాలకూ, కొన్ని పాత తరాలకూ, ముఖ్యంగా బొంబాయి, గుజరాత్ కార్పొరేట్ల లాభాల ప్రణాళికలకూ, ఆర్ ఎస్ ఎస్ విద్వేష ఫాసిజంలో ప్రయోజనాలు కనిపించాయి. ఆర్ ఎస్ ఎస్ వల్ల తమ ప్రయోజనాలు పూర్తిగా నెరవేరే మార్గం చూసిన క్రోనీ కాపిటలిస్టుల వల్లనూ, దాదాపు 1992 నుండి పెరిగిన ధనిక స్వామిక తత్వం, ధనార్జనకు ఏ పద్దతైనా సరైనదేననే సూత్రం జీవన లక్ష్యంగా, ఏ సైద్ధాంతిక దృక్పథం లేని అన్ని ఎన్నికల పార్టీలూ యువతకు, సాధారణ ప్రజలకూ భూస్వామ్య తత్వం మిళితమైన పెట్టుబడిదారీ భావజాలం నూరిపోశాయి. ఈ పరిణామాలన్నీ ఇవాళ దేశంలో ముస్లింల రక్త దాహంతో ఎగిసి పడుతున్న ఆర్ ఎస్ ఎస్, బీజేపీ దాని అనుబంధ ఫాసిస్టు ముఠాల భయోత్పాత బాహాట ప్రకటనల పాలన పట్ల అనుకూలతలను కూడా తెచ్చి పెట్టి ప్రజాస్వామిక విలువల రాజకీయాలకు సవాలుగా నిలబడ్డాయి.

Leave a Reply