మట్టి గాయపడినా , చెట్టు గాయపడినా , మనిషి గాయపడినా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్షరాలతో యుద్దాన్ని ప్రకటిస్తాడ. సానుభూతి కాదు. సంఘీభావం ముఖ్యమనే మాటపై నిలబడుతాడు.
నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రోజుల్లో ఉదయ్ కవిత్వం
ఈ ఫాసిస్టు దాడికి ప్రతిదాడిలాంటిది. గాయానికి మందులాంటిది. ఈ మనుషుల కోసం, సమానత కోసం, బువ్వ కోసం, భుక్తి కోసం తనువు రాలే వరకు పోరాడుతున్న మిత్రులను గుండెకు హత్తుకుంటాడు. పోరాట గీతాల్ని ఆలపిస్తాడు. అమరత్వాన్ని కీర్తిస్తాడు,. అమరుల బాటల్లో నడవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తాడు. మనల్ని సమాయత్తం చేస్తాడు. ఈ నేల చెప్పే గాథలను, కన్నీళ్లను మనలో ఒంపుకుందాం. ఈ నేలపై రాలిన ఎర్ర మందరాలను గుండెలకు హత్తుకుందాం.
ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ రివేరా ఇలా అంటాడు.
*ఉదయ కిరణ్ కవిత్వం సాదా సీదాగా మొదలై కొంత నడక సాగాక మెరుపులా మెరిసి భాస్వరంలా మండే వాక్యాలు ఉదయ్ ప్రతి కవితలో కనిపిస్తాయి. మరొక చోట కుల అసమానతలు, ఫాసిస్టు మత ధోరణులను తన వ్యాపార విస్తరణకు వనరులుగా చేసుకున్న కార్పొరేట్ శక్తుల ఓటమిని డిమాండ్ చేయడంలో వుంది.ఈ దిశగానే ఉదయ్ ప్రశ్నలు ఉన్నాయ్* అంటాడు. ఈ రెండు వాక్యాల్లో ఉదయ్ కిరణ్ కవిత్వ పటుత్వాన్ని తెలియజేస్తాడు.
రివెరా అన్నట్టుగానే తన మొదటి కవితా శీర్షికలో దేని గురించి రాయమంటావ్ ? అంటూ తన ఆవేదనను తిరుగుబాటు స్వరాన్ని బిగ్గరగా వినిపిస్తాడు.
“మత్తు గురించా, కుల గజ్జి గురించా, మత హత్యల గురించా “
” కొయ్యలు ఎన్ని దిగినా
నాగలి వదలని రైతన్నకు
మేకులు దించే నాయకుల గురించి “
రాయమంటావా అని వ్యవస్థపై తన అసహనాన్ని, అవేశాన్ని వేళ్ళ బుచ్చుతాడు..
కార్పొరేట్ల ఖజానా నింపే ప్రక్రియలో భాగంగా ఆగమేఘాల మీద నల్ల చట్టాలను తీసుకొచ్చింది ఈ కాషాయ ప్రభుత్వం..ఎలాంటి చర్చ జరపకుండా, ప్రయివేటు కంపెనీలకు ధారదత్తం చేసి మట్టిని దూరం చేసే దుర్మార్గమైన కుట్రలకు తెరలేపింది. ఈ కుట్రలను రైతులు కనిపెట్టలేరునుకున్నారు. తీవ్రమైన పోరాటం తర్వాత బిల్లులను వెనక్కి తీసుకుంటూ ఈ దేశ ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్పారు.
ఇలా సమాజంలో జరుగుతున్న అన్యాయపు సంఘటనలను, దాని వెనకున్న కుట్రలను ఈ కవి బహిర్గతం చేస్తాడు, తూర్పార బడుతాడు..
నేల నుడికారం అనే కవితలో :-
“ఓ కవి
ఇకనైనా నీ కలం అంచులో
కొడవలి పదును వెలుగుతుందా
లోకం కలలకు ఉన్న సంకెళ్లు తెంచడానికి
నీ ఊహలను రగిలిస్తావా ? “
” విప్లవాన్ని రగిలించడానికి
కవిత్వమంటే శృంగారపు రాతలు కాదనడానికి
జనానికి తప్ప కలం ఎవరికి నేస్తం కాదని నిరుపిస్తావా ? ” అంటాడు.
ఈ కవిత ఉదయ్ కిరణ్ ప్రజా హృదయాన్ని, ప్రజా సమస్యల పట్ల – ప్రజా గొంతుకగా నిలబడాలనే నిబద్ధతను తెలియజేస్తుంది.
పీడిత తాడిత ప్రజల పక్షాన మన కలం సాగాలి. మన రాతలు వెలగాలి,. సమాజంలో వున్నటువంటి ఆంక్షల మీద సంకెళ్ళ మీద మన రాతలు కొడవల్ల వలె కోత కోయాలి. అక్షరాలను అందమైన వాక్యాలను పేర్చడం కోసం కాకుండా, జనానికి తప్ప మరెవరికీ గులాం కావొద్ధనే ఉదయ్ చెప్తున్న విషయాన్ని గమనించాలి ఆచరించాలి..
** **
ఉదయ్ కిరణ్ ఆలోచనలు ఆచరణ ఎప్పుడు కలిసే వుంటాయి. ఈరెండు కలిసి వున్నపుడే ప్రజా జీవితంలో బలమైన దారులను నిర్మించగలం, శక్తిగా నడవగలం. తానెప్పుడూ మరో ప్రపంచాన్ని చూడాలనుకుంటాడు అందుకేనేమో//
ఓ నినాదం కవితలో ..
“ఆ క్షణం
వాళ్ళలో ఓ నినాదం మొలుస్తుంది
సంకెళ్లను దాటి మరణాన్ని దాటి
ఊరు పొలిమేరల ఆవల
ప్రపంచ రూపుదాల్చి తనలోకి తీసుకుంటుంది “
ఇంతకీ ఆ నినాదం ఏమిటి ?? అంటరానితనం, ఎట్టి, బానిస సంకెళ్లను తెంచి మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అక్కడా నీళ్లను, నేలను తాకనివ్వని దొరతనం, పెత్తనం, దోపిడీ, అఘాయిత్యాలు కనిపించవు. అక్కడ ఒక స్వేచ్ఛ ఉంటుంది. కులాలు లేని మతాలు లేని సమానత్వ వేదిక వుంటుంది. మనమంతా పిడికిలి బిగించితే ఎర్రని పొద్దొకటి ఉదయిస్తుంది అదే ఆ నినాదం అంటూ ఎర్ర మందారమోలే ఈ కవితలో ఉదయిస్తాడు..
మసకబారిన కండ్లు అను కవితలో ..
” కోట్లు కొల్లగొట్టి
ఈ దేశం రొమ్ములపైన ఎగేసి తన్ని పారిపోయిన
గా అదానీలు అంబానీల అప్పులు రుణమాఫీ చేస్తుంటే మీకు కనిపించలేదా” అంటాడు
భూమినే నమ్ముకొని ఆరుగాలాలు కష్టపడితే గానీ పిడికెడు బువ్వ నోట్లోకి పోయే పరిస్థితి లేదు ఈ దేశ రైతులకు. భూమి కాగితాలను బ్యాంకుల్లో పెట్టీ తెచ్చిన పైసలను ఎరువుల రూపానా మింగే ఈ రాజకీయ దొంగలు కిస్తీ కట్టడం ఒక్కరోజు ఆలస్యమైనా !! పుస్తెలు తెగిన రోజులు, చెట్టుకు వేలాడే దృశ్యాలు అనేకం..కానీ ఈ దేశాన్ని దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులకు మాత్రం వేల లక్షల కోట్లు రుణంగా ఇవ్వడమే కాకుండా కట్టకపోయినా !! దేశంలో వారిని రాజుగా కీర్తిస్తూ ఆ రుణాలను మాఫీ చేయడం వంటి కుట్రలను ఈ కవితలో ప్రస్తావిస్తాడు, అలాగే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న చర్యలను ఖండిస్తూ మీ మసక బారిన కండ్లను ఎప్పుడు శుభ్రం చేసుకుంటారు అంటూ గర్జిస్తాడు. అయినా, బువ్వ పెట్టేది ఎవ్వడు ?? – పొట్ట కొట్టేది ఎవ్వడు ?? అను దృశ్యాలు మీ మసక బారిన కండ్లకు ఎలా కనిపిస్తాయి ?? వాళ్లు మూడు రంగుల జెండాను ముందు పెడితే దేశభక్తి ప్రవాహంలో కొట్టుకుపోయే మీకు ఇవన్నీ కనిపిస్తాయా అంటూ చురకలంటిస్తాడు.
***
ఏ ఉద్యమకారుడు అక్రమంగా నిర్బంధించబడినా, ఏ కవి, కళాకారుడు ఈ రాజ్య హింసలో గాయపడినా రెప్పలు వాల్చనివని కన్నీటితో ఓ గేయం రాస్తుంటాడు.
స్వేచ్ఛా పువ్వులు అను కవితలో ..
“ఈ రాజ్యంలో
పువ్వులు పూయడం మొదలుపెడితే
రాజ్యమంతా పూలవనం అవుతుంది కదా
వాటి మధ్య ప్రతి జీవరాసులు
స్వేచ్ఛగా తిరుగుతాయి కదా
మరి రాజ్యానికి స్వేచ్ఛ అనే పదం నచ్చదు
అందుకే దాని గుండెల్లో భయం ” అంటాడు.
అవును నిజమే, ప్రశ్నించడమే నేరమవుతున్న కాలంలో ఈ రాజ్య దురాగతాలను ఎండగట్టి, ప్రజలకు రాజ్య పిచ్చి పోకడలను వివరిస్తున్న కవులను రచయితలను మేధావులను అక్రమంగా నిర్బంధించి దేశం ద్రోహం కేసులు పెట్టి జైలు పాలుజేస్తున్న నిరంకుశ ప్రభుత్వ విధానాలను ఈ కవితలో సాధారణ పాఠకుడికి కూడా అర్థం అయ్యేలా ఉదయ్ కిరణ్ రాశారు..
అయినా నిర్బంధం కేవలం భౌతికం, ఆలోచనలను ఏం జేస్తారు? సత్యాలను చేరకుండా ఎవరడ్డుకుంటారు? నిత్య నూతనమై ఆ పూవులు వికసిస్తూనే ఉంటాయి, ప్రతి గుండెలోకి చేరుతూనే ఉంటాయి.
అమ్మ కవితలో ..
ముగింపు మరిచిపోయిన కవితేదైనా వుంది అంటే అది ఒక అమ్మ కవిత మాత్రమే అంటాడు..
ఈ ఒక్క వాక్యం ప్రతి మదిని తడుతుంది, ప్రతి తల్లిని యాధికి జేస్తుంది..
ఓ యుధ్ధ ప్రకటన కవిత లో..
“దేశమంతా మత పిచ్చితో
మారణహోమంలో మునిగిపోతుంటే
మరెంత కాలం
ఆ నాలుగు గోడల మధ్య
స్వప్నపు కాంతులంటూ కలలు కంటావు
లే..,
ఆ చీకటి ప్రపంచంలో నుండి
బయటకు రా ఇక్కడ ఎవరూ
ఏ యుద్ధాన్ని ప్రకటించరు” !..
మతపెచ్చులు రాలుతున్న కాలంలో ఎన్నాళ్ళు ఇంకా కలలుకంటూ నాలుగు గోడల మధ్యే ఉంటావ్ !! యుద్ధ ప్రకటన అంటూ ఏమీ ఉండదు, ఎక్కడైతే నిలబడతావో, కలబడతావో, అగ్నిజాలలా ఎగిసిపడంటాడు, అక్కడే వెలుగును నింపాలంటాడు..
***
ప్రజా ఉద్యమకారులెప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలను తిరస్కరిస్తూనే వుంటారు, ప్రజా కవులు, కళాకారులు రాజ్యం దగ్గర మోకరిల్లరు, ఎంగిలి తిండికి ఆశ పడరు. అందుకేనేమో ప్రజా పక్షాన నినాధమవుతున్న ఉదయ్ కిరణ్ కూడా ఇలా అంటాడు.
ఎపుడైనా నేను గుర్తొస్తే అను కవితలో ..
“ఎప్పుడైనా నేను గుర్తొస్తే
మీ చుట్టూ ఉన్న జీవితాలు
అదే చరిత్రను దాచిన పుస్తకాలు చదవండి
మహిళల కోసం, ఆదివాసీ హక్కుల కోసం
ప్రజా పోరాటాలను చేయండి
ఆ పోరాటంలో నేను మీకు తోడుగా ఉంటాను “
మహిళా చైతన్యం, మహిళా సాధికారిత అంటూ నినాదాల్లో ముంచుతూ, ఆదివాసీ భూమిని – నివాస ప్రాంతాలను లాక్కొని వారి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న రోజుల్లో నేను గుర్తొచ్చినప్పుడెల్లా వారి హక్కులకై ఉద్యమించండి అంటున్న ఉదయ్ కిరణ్ కవిత్వాన్ని మన పోరాట సమాయత్తాలకు కరపత్రికగా చూడాలి.
మల్ల యోధులం కవితలో ..
“పార్లమెంట్ ముందు పోలీసులు మమ్మల్ని
హింసాత్మకంగా ఈడ్చుకెళ్ళి జైల్లో బంధిస్తుంటే
ఈ దేశ రక్షణ గౌరవం ఎప్పుడో
బంధించబడ్డాయని
మాలో ధైర్యం నిప్పంత నిబ్బరాన్ని రగుల్చుకుంది”..
దేశ విదేశాల్లో భారతావని జెండాను రెపరెపలాడించిన ఈ దేశ కీర్తి పతాకాలైన మహిళా క్రీడాకారులపై ఈ ప్రభుత్వ ధమనకాండను మనం కళ్ళారా చూసాం. న్యాయం కోసమని దేశ నడిబొడ్డున వీధుల్లోకి వెళ్లి కన్నీరు పెడుతుంటే పోలీసు బూట్లతో తొక్కించి, అమానుషంగా రోడ్లపై ఈడ్చుకెళ్ళి ఈ దేశాన న్యాయం రాజకీయ గుప్పిట్లో ఉందనే నిర్వచానాన్ని చెప్పబడుతున్న రోజున, వారికి సంఘీభావంగా అక్షరాలతో రాజ్యంపై మల్ల యుద్ధం ప్రకటించాడు..
**
ఉదయ్ కిరణ్ కవిత్వం గాజా పిల్లల మరణాలపై తన ఆందోళన, ఆవేదన, వారి నవ్వులకై తన తపన అంతా ఈ కవితలో కనిపిస్తుంది. భూమ్మీద ఎక్కడో ఓ చోట యుద్ధం జరిగితే ఏమి మన దేశమా ?? మన పిల్లల ?? మన ప్రజల ?? అనుకుంటూ మిన్నుకుండిపోతామా ఊపిరి ఎక్కడ ఉంటే అక్కడ మనం కవిత్వంగ మాట్లాడాలి, ఓదార్చాలి, గుండెలకు హత్తుకోవాలి..సామ్రాజ్యవాద కాంక్షలో బూడిద అవుతున్న గాజా పిల్లల నవ్వులను ఎవరైనా తిరిగి తెస్తారా ??
” బడులపై బాంబులు వేసిన
పసిగుడ్డులా ప్రాణాలు తీసిన
వాళ్లను ఖననం చేసిన
ఈ భూమిలో మళ్లీ వాళ్లు మొలకెత్తక తప్పదు “
ఈ విధంగా ఉదయ్ కిరణ్ కవిత్వంగా వినబడుతున్నాడు. ప్రజా పక్షాన నిలబడి పొద్దుని పిడికిలిగా ఎత్తుతున్నాడు. ఈ ఫాసిస్టు మత రాజ్యంలో ఓ ఎర్రని తోవలో అడుగులేస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఎలాగైతే దాడులకు పురిగొలుపుతూ ప్రజా సామాజిక సాంస్కృతిక అంశాలను పడగొట్టాలని చూస్తుందో దానికి ఎదురొడ్డి బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది.
ప్రజా చైతన్య దారులు పల్లె పల్లేనా విస్తరించాలి. మూఢత్వ దారులు మూసుకుపోవాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, రాజ్యం కక్షగట్టినా, కాలం నల్లని మబ్బులని కమ్మినా ఉషోదయం ఉద్భవిస్తూనే వుండాలి . ఈ దిశగా ఉదయ్ కిరణ్ కవిత్వం మరింత బలంగా రావాలి. ప్రజలకు మరింత చేరువవ్వాల్సిన అవసరం వుంది. ఈ ఎర్ర మల్లెల వనమాలి కి మోదుగు పూల అభినందనలు.