దేశంలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లిపోతోంది. హిందూ ప్రభువు విధానాలను శంకిoచేవారూ, అనుమానాలను రేకిత్తించేవారూ ఎక్కువవుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఖలిస్తాన్ వాదులు, పాకిస్తాన్, చైనా ఏజెంట్లు సరేసరి. చిన్నాచితకా వ్యాపారస్తులు, పొలానికెళ్ళి దుక్కి దున్ని నాలుగు చినుకులు పడగానే విత్తు విత్తి ఆ తర్వాత వానకై ఆకాశం వైపు జూస్తూ పంట చేతికొచ్చాక నాలుగురాళ్ళు చేతికందుతాయని ఆశగా జీవనం గడిపే అమాయక రైతన్నలు, నిత్యం దేశభక్తిని ఆహారంగా పొందుతూ, అది వారి ప్రాణ వాయువై , జీవిత సమస్యలను పట్టించుకోకుండా మసీదు-మందిరం తగువులాటల్లో ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధం కావాల్సిన యువకులు కూడా సామ్రాట్ మోదీ విధానాలను అపార్థం జేసుకుoటున్నారంటే ఇది కలికాలం గాక ఏమవుతుంది.

మేరా మహాన్ భారత్ ఎటు పోతుంది?

దేశ ప్రజల హితం కొసమై నోట్ల రద్దు, జి ఎస్ టి, కోవిడ్ లాక్ డౌన్, ఆర్టికల్ 370 రద్దు, వ్యవసాయిక చట్టాలు, విద్యుత్ రంగ సంస్కరణలూ, కార్మిక చట్టాలు, అగ్నిపథ్ లాంటి కనీ విని ఎరుగని స్కీంలు ప్రవేశ పెడితే, వాటికి అపవాదం అంటిస్తూ, వాటిపట్ల అనుమానాలు రేకిస్తూ, అపోహలు కల్పించటం సబబేనా?

ఈ ప్రశ్న కేవలo బిజెపి నాయకులు, భక్తులు మాత్రమే కాదు. ప్రతి దేశభక్తుడూ వేయవలసినదే. దేశమంటే మోడీ అనవవలసిన ఈ అపవాదులేమిటి? ఆరోపణలేమిటి?

గతాన్ని త్రవ్వితీస్తూ, పాతరాతియుగం నాటి అఖండ భారత్ మహోన్నత సంస్కృతిని ప్రపంచవ్యాపితం జేయాలనే మన హిందూ హృదయ సామ్రాట్, క్రాంతి పురుష్ కలలను ఇలాంటి అపోహలకు గురిజేస్తూ ఆయన లక్ష్య సాధనకు అడ్డుకోవడం దేశద్రోహం గాక మరేమవుతుంది?

విదేశాల్లో మన కార్పొరేట్లు దాచుకున్న దొంగ డబ్బును వెనక్కి తెప్పించి ప్రతి భారతీయుని అకౌంట్ లో 15 లక్షల రూపాయలు జమజేస్తామనే హామీని నిలబెట్టుకోలేదని అపవాదు వేస్తున్నారు. ఎన్నికల హామీని ఏ రాజకీయపార్టీ నిలబెట్టుకుందనీ? అయినా, మోడీ అలాంటి ఇలాంటి నాయకుడు కాదు, అసమాన నాయకుడు. ఆ నల్లధనం, తెల్ల ధనంగా మారి దేశానికెప్పుడో వచ్చేసింది. అయినా, 140 కోట్ల మంది భారతీయుల ఖాతాల్లో జమజేయడం సాధ్యమా? విజ్ఞులు ఆలోచించాలి. ఒకవైపు, బ్యాంకుల మొగమే ఎరుగని వారు, ఖాతాలు లేనివారు లక్షలలో కాదు కోట్లలో వుంటారు. అందులోనూ ఖాతాలు కలిగిన వారికందరికీ ఒకే బ్యాంక్ లో ఖాతా ఉండదుగా! దేశంలోని వివిధ బ్యాoకులలో కోట్ల ఖాతాలలో జమజేయడం ఎంత కష్టం? అనవసర శ్రమకూడా. (అందుకే, ముందు ఆలోచనగా బ్యాoకులనూ విలీనం చేసాడు కూడా). ఆ డబ్బు జమకు సులభమార్గంగా దేశానికి ప్రతినిధి అయినా అదానీ ఖాతాల్లో జమ అయ్యింది. ఇంతకుముందే దేశమంటే మోదీ అని చెప్పుకున్నాం. ఇక మోదీ అంటే అదాని అని వేరే చెప్పాలా?

మోడీ+ అదానీ = భారత దేశం. ఇప్పుడు చెప్పండి .. మోదీ తన హామీని నేరవేర్చుకున్నాడో లేదో? ఇంకా అనుమానం వుంటే గూగుల్ సెర్చ్ చేసి వారి సంపద మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఎంత పెరిగిందో కనుక్కోoడి, నిత్య శంకితులారా! అంతేగాదు, అదానీ తన 60 ఏళ్ల తీపి గుర్తుగా 60 వేల కోట్ల రూపాయల ప్రజాసంక్షేమ నిధిని ఏర్పాటు జేస్తున్నాడు కూడా. అలాగాక, ఆ డబ్బు ప్రభుత్వ సమయాన్ని, శ్రమనూ వృధాజేస్తూ, మన వ్యక్తిగత ఖాతాల్లో జమయివుంటే, మనం దాన్ని వృధాగా విలాసాలకు, తప్పుడు పనులకు ఖర్చుచేసేవాళ్ళం కూడా. దార్శనికుడైన మోదీకి ఇదంతా ముందుగా తెలుసు. దటీజ్ మోడీ సాబ్! దేశ చౌకిదార్ గా, దేశ సంపదను సద్వినియోగం అయ్యేలా చూసే కర్తవ్య పాలకుడుమన మోదీజీ.

మరో హామీ, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. ఉద్యోగాలంటే కేవలం ఐఏఎస్ అధికార్లు, గజెటేడ్ ఉద్యోగులేనా? జీవించడానికి యే ఉపాధి అయినా ఉద్యోగమే. అందరూ పల్లకీలో ఊరేగేవారయితే, దాన్ని మోసే బోయీలెవ్వరు? మోదీకి గొప్ప, చిన్నా భేదం లేదు. అందులోనూ ఆయన చాయ్ వాలా ఆయే! అందుకనే పకోరా బండ్లు పెట్టుకొనే అవకాశాలెన్నో ఉన్నాయన్నాడు. ఉపాధి అవకాశాలు మనకు తెలియవు, ఎవరైనా తెల్పితే అపహాస్యం జేస్తాం. విమర్శిస్తాం. మోడీని విమర్శించడo, దేశాన్ని విమర్శించడమే సుమా.
ఇక, నోట్ల రద్దునైతే అబ్బో ఎంత అపార్థం జేసుకున్నారు. ఈ తప్పుడు ప్రచారమంతా బ్యాంక్ ఖాతాలున్న మహారాజులది. అయినా, దేశజనాభాలో వారెంత మంది లెండి? నోట్ల రద్దువల్ల క్యూలో నిలబడి వందలాదిమంది చనిపోయారని మోడీ వ్యతిరేకుల ప్రచారాన్ని అలా వదిలేద్దాం. ఎవరి చావుకు ఎవరు కారణం? జాతస్య మరణం దృవం అన్నారు. చచ్చేదెవరూ, చంపేదెవరూ అని గీతాకారుడన్నాడుగా! మోదీ గీతోపదేశాన్ని ఖచ్చితంగా పాటించే సనాతనుడు.

ఈ సంకుచిత మనసుగల మేధావులు, పనిలేని కొందరు మధ్యతరగతి బుద్ధిజీవులు ఏమి ప్రచారంజేసినా మోదీ ప్రభ కొంతకూడా తగ్గదు. మోడీ సంకల్పంలోని అంతరార్థం తెలుసుకోవాలంటే అందరికీ సాధ్యమా? నోట్ల రద్దు భయంతో దేశంలోని ధనమంతా బ్యాంకుల్లో చేరింది. దీనివల్ల ఎన్ని ఉపయోగాలో. ప్రజలకు దొంగల భయం లేదు. అంబానీ, అదానీ లాంటి కార్పోరేట్లకు పెద్దమొత్తంలో రుణాలిచ్చే అవకాశం కలిగింది. (అవి తిరిగి రావని అనేవాళ్ళు ఉన్నారనుకోండి.) వారే దేశం కదండీ. ఆ ధనంతో కొత్త పరిశ్రమలు, మరిన్ని ఉపాధి అవకాశాలు. అదే విడివిడి వ్యక్తుల చేతుల్లో వుంటే అనవసర ఖర్చులే కదా. డబ్బుంటే చెడు వ్యసనాలకు దారి తీస్తుందని మోదీ మహాశయుని భావన. ఇక, ఉగ్రవాద కట్టడి అంటారా? పాకిస్తాన్, చైనా ఉన్నంతవరకు ఉగ్రవాద బెడద తప్పదుగా! అందుకే మోదీజీ అఖండ భారత్ అంటున్నాడు.

జి ఎస్ టి విషయంలోనూ మన దేశద్రోహ మేధావుల ధోరణి అలాగే సాగుతుంది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి భంగమని, సర్కారియా కమిషన్ నివేదిక స్పూర్తిని నాశనం జేస్తుందని ప్రతిపక్షాలు, వామపక్ష మేధావులు ఒకటే గగ్గోలు. అదేవిధంగా, విద్యుత్ సంస్కరణల విషయంలోనూ వీరి స్పందన అంతే. పై విధానాలలోగల మోదీ గారి దురాలోచన, సారీ దూరాలోచన వీరికి అర్థం కాలేదు. జాతి రాజ్యం (జాతి దేశం కాదండోయ్) గురించి శతాబ్దాల కిందటే గారిబాల్డీ ప్రయత్నాలు మొదలెట్టారు. పెట్టుబడి మార్కెట్ కనుగుణంగా NATIONAL STATE ఏర్పాటు మొదలయ్యింది. అలాంటిది, అఖండ భారత్ నిర్మాణానికి మన దేశాన్ని ఒకే రాజ్యం(హిందూస్తాన్), ఒకే జాతి(హిందూ), ఒకే భాషా(హిందీ) ఏర్పాటుకు మహాయజ్ఞం నిర్వహిస్తున్నకాలంలో రాష్ట్రాల అధికారం, స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడడం దుర్మార్గంగాక మరేమవుతుంది?

మన దేశంలోనే అఖండభారత్ నిర్మాణానికి పునాది బలంగా లేకపోతే, ఇక అఖండ భారత్ లో కలుపుకోవాలనుకున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, రావణాసురుని లంకల మాటేమిటి. (ఇవి ఇప్పటి లక్ష్యాలు మాత్రమే. సంస్కృతం దైవభాషా అంటారు కదా. రాజులు, పురోహితులు తప్ప రాణులకూ నిషేధమయిన భాష అని చెబుతారు. అలాంటి భాషకు, నేడు మ్లేచ్చుల భాషలు.. అవేనండి, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, లాటిన్, గ్రీకు భాషలు కవలలని భాషాశాస్త్రజ్ఞులు చెబుతున్నారు కదా. సంస్కృతంకు పుట్టినిల్లు ఈగడ్డేనని మనం వాదిస్తున్నాం. అందువల్ల, ఆయా భాషలు మాట్లాడే ప్రాంతాలు అఖండ భారత్ లో భాగమే అవుతాయి) ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారుగా. ఇప్పటికే సిక్కిం విలీనంతో అఖండ భారత్ ప్రస్తానం మొదలయ్యిందని మరువరాదు. మోదీ ప్రభువు అంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పుడు మా రాష్ట్రం, మా భాషా అనేది సంకుచిత మనస్తత్వం గాక మరేమవుతుంది.

ఈ కుత్సిత మానసిక రోగులైన మేధావుల విషయమటుoచితే, నేలదున్ని, విత్తు విత్తి పంటకోసం ఎదురుచూసే రైతన్నలకు ఏం పోయేకాలం వచ్చింది? మోదీ మహారాజ్ ఎంతో దూరదృష్టితో, రైతన్నల సంక్షేమం, దేశభవిష్యత్తు కోసం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే, ఎంత అపార్థానికి గురిజేసారు. ఎన్ని నిందలు వేసారు. పాపం ఆయన ఎంత నొచ్చుకున్నాడు. తనను రైతాంగం అపార్థం చేసుకున్నారని, కొంతకాలం తర్వాత తనను అర్థంజేసుకోగలరని ఎoతో ఆశాభావం వ్యక్తం జేశాడు కూడా. ప్రజలపై ఆయనకున్న నమ్మకం అలాంటిది. రైతాంగానికి తన ఉత్పత్తిని ఎక్కడైనా, ఎంతైనా అమ్ముకొనే అవకాశం కల్పించారు. అంతేకాదు, దళారీల నుండి విముక్తం జేయాలనుకున్నారు. అంబానీ, ఆదానీలాంటి దాతృత్వ కార్పొరేట్లు రైతాంగానికి ఎరువులు, క్రిమిసంహారక మందులు, మంచి విత్తనాలు, సాంకేతిక సహాయం అందించడమే గాక అనువైన (ఎవరికీ అని అడగకండి) ధరకు కొనుగోలుజేసే అవకాశం కల్పిoచాలనుకున్నారు. అంతేకాదు, తనవిధానాల వల్ల ఎప్పుడూ గోధుమల లాంటి పంటలపై ఆధారపడుతూ, స్వదేశీమార్కేట్ ఒడుదుకులకు లోనుగాకుండా, విదేశీ సంపన్నవర్గపు ఆహారాలవాట్లకు అనుగుణంగా, ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చేoదుకూ, అంతర్జాతీయ మార్కెట్లో మాంచి డిమాండ్ వున్న పంటలవైపు రైతాంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జేశారు. రైతుబందు మన మోదీ. కానీ, మన రైతాంగం అమాయకంగా అర్బన్ నక్సల్స్, ఖలిస్తానీల ప్రభావంలో ఎంత అరాచకం సృష్టించారు! ఎన్నిరకాల ఆందోళనలు చేపట్టారు! పాపం, ఆయన మనసు ఎంత నోచ్చుకొందో? దగ్గరలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఎన్నికలు వుండటంతో ప్రజలకోసం తన ప్రయత్నాన్ని విరమిoచుకోవల్సి వచ్చింది తాత్కాలికంగానైనా.

మోదీజీని మరింత అప్రతిష్ట పాలుజేసేందుకు ప్రతిపక్షాలకూ, దారితప్పిన మధ్యతరగతి బుద్ధిజీవులకు అవకాశం ఇచ్చింది పెట్రోల్, డీజిల్ ధరల పెంపు. వాటి పెంపు వెనుక ఎన్ని ఉన్నత ఆశయాలున్నాయో ప్రతిపక్షాల విషయం వదిలేస్తే, కనీసం మధ్యతరగతి వాళ్ళూ అర్థం చేసుకోకపోవడం మనదేశ దౌర్భాగ్యం. ఒక్కసారి ధరల పెరుగుదల వల్ల కేవలం వ్యక్తులకు, దేశానికే గాక, మొత్తం ప్రపంచానికే ఎంత లబ్ది చేకూరుతుందో మన మంద బుద్ధులకు అర్థం కాలేదు. వ్యక్తుల వాహనాల వినియోగం తక్కువ కావడంతో, ఖర్చులు తగ్గుతాయి. అంతవరకూ ఏమాత్రం శారీరక శ్రమ లేక బొజ్జలు పెంచుకొని గుండెజబ్బు లాంటి అనేక రుగ్మతలకు గురయ్యే ఈ మధ్యతరగతి మహానుభావులు నడక, సైకిల్ ప్రయాణాలు మొదలెట్టక తప్పదు. దాంతో, వారి ఆరోగ్య సమస్యలు మాయమవుతాయి. డబ్బు మిగులుతుంది. సైకిల్ వినియోగంతో, వాటి డిమాండ్ పెరగడంతో, ఆ పరిశ్రమాభివృద్ది, దానితోపాటు ఉపాధి కల్పన పెరిగి, మోదీ హామీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగకల్పనకు తోడ్పతుంది.

ఇప్పుడు కొత్తగా దేశంలోని బొగ్గుగనుల నుoడిగాక, విదేశాలనుండి అధిక ధరల చెల్లించి, అదాని బొగ్గు గనులనుండి దిగుమతి చేసుకుంటూ అదానికి లబ్ది చేకూరుస్తున్నాడని మరో అపోహా, ఆరోపణ. చూడండి ఎంత మహత్తర ఆలోచన. బొగ్గు తవ్వకాలవల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, బొగ్గు రేట్లు అధికం కావడంతో వినియోగం తగ్గుతుందనే పర్యావరణ సంరక్షడుగా, ప్రజల హితం కోరి మోదీ మహాత్ముడు తీసుకున్న నిర్ణయమది. ఇక ఇంధన దిగుమతి తగ్గుతుంది కాబట్టి విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది. దేశ ఆర్థికవ్యవస్థ లాభపడుతుంది. మోదీ కేవలం తన వాళ్ళ సంక్షేమమే చూచే సంకుచిత మనస్కుడు కాదండోయ్. “సర్వేజనా సుఖినోభవంతు”(సర్వేజన అంటే సంఘ పరివారమని గిట్టనివారంటారు. పట్టించుకోకండి) అనే ఆలోచన గలిగిన విశాల హృదయుడు. (54 “ చెస్ట్ అని అర్థo చేసుకోకండి). తన ఇంధన ధరల పెంపువల్ల భారతదేశం లాంటి అత్యధిక జనాభా గల దేశంలో వాహనాల వినియోగం, వాయు కాలుష్యాన్నికొంతమేరకైనా తగ్గించి పర్యావరణ సంరక్షణకు నడుంకట్టిన ధీరోదాత్తుడు మన మోదీ. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారుగానీ, మన మోదీ వేటుకు 4 ప్రయోజనాలు. 1) వ్యక్తుల ఆదాయ పొదుపు, 2) వారి ఆరోగ్య సంరక్షణ, 3) ఉపాధి కల్పన, 4) పర్యావరణ సంరక్షణ. దానికి గర్వపడక ఆయన్ను విమర్శించడం-పిదప బుద్ధులు, పిదప కాలం మరి.

అవన్నీ అలా వదిలేయండి. మొన్నటి వరకూ కేవలం హిందుత్వ, ఘనమైన భారతీయ సంస్కృతి, అహింసా మార్గంలో తలమునకలై, మోదీ పరివార్ గా మెసులుకున్న యువతకేమైందండి. బాబ్రీ కూల్చిన తర్వాత, ఇప్పుడు మధుర అంటున్నాడుగా! ఆ మహత్తర లక్ష్యసాధనలో మునీగిపోక “అగ్నిపధ్” స్కీం పై అపోహలకు గురై హింసాత్మక చర్యలకు దిగడం ఎంత విషాదం. మహొన్నత భారతీయ సంస్కృతికి ఎంత అప్రతిష్ట. మనది శాంతి దేశం కదా! మహాభారతం, రామాయణంలో హింస, మన చక్రవర్తుల దండయాత్రలు తెగిన సామాన్యుల నరకంటాలు, ఎమర్జెన్సీ, శిక్కుల ఊచకోత, గుజరాత్, ముంబై మారణకాండ, ఆదివాసీల జరుగుతున్న దమనకాండ అంటారా -అవి పాలకుల లబ్దికోసం జరిగినవి. అంతేగాని, మన దేశంలో ప్రజలు తమ హక్కుల కోసం హింసకు దిగిన సంఘటనలున్నాయా? వాటిని పాలకులు సహించిన చరిత్ర ఉందా! హవ్వ,హవ్వా! ఇదేమి చోద్యం. ఒక బిజెపి నాయకుడు వాపోయినట్టుగా 10 వ తరగతి, ఇంటర్ అర్హత గలిగిన అభ్యర్థులకు, అదీ దళిత, ఆదివాసీలకు నెలకు రూ.30 వేల నుండి రూ.40 వేల వరకు వేతన మిచ్చి, నాలుగేళ్ల తర్వాతా పదో, పాతికో లక్షలిచ్చి ఇంటికి పంపుతామంటే, దాన్ని నిరశిస్తూ రైల్వే దమనకాండనా?ఎంత సిగ్గుచేటు! అంతేకాదండోయ్, ఆ నాలుగేళ్ళలో వారికి దేశభక్తితో పాటు స్వామిభక్తినీ నిలువెల్లా అంటించి, మెదల్లలోజోప్పించి, సుశిక్షితులైన, క్రమశిక్షణ (అంటే తమ పై వారి ఆదేశాలను తు.చ.తప్పకుండా పాటించేలా –అని కొందరు కుబుద్దులు ఆరోపించడం మామూలే) గలపౌరులుగా తీర్చిదిద్దుతారు. వారంతా బయటికి వచ్చాక కార్పోరేట్ కంపెనీలకు అతి విధేయులైన చౌకిదారులుగా మెలగాలని మనదేశ చౌకిదారు ఆశయం. ఇక దేశంలో వారు పనివారలతే సమ్మెలూ, నిరసనలు, లాకవుట్లు ఉండవు. దేశ పారిశ్రామికాభివృద్ధికి డోకా వుండదు. ఈ ప్రశాంత వాతావరణంలో విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. దాంతో నిరుద్యోగ సమస్య వుండదు. దీంతోనే సరిపుచ్చుకుంటే ఆయన మోదీ ఎలా అవుతాడు. అఖండ భారత్ కు అడ్డుపడే సంస్థలు, మేధావులు కొందరు అంతర్గత శత్రువులుగా ఉన్నారు. వారిపై పదే పదే సైన్యాన్ని వినియోగించడం దేశంలో పట్టించుకొనే వారు కరువవుతున్నా, విదేశీ నాయకుల సంతృప్తి పరచడం కోసం సైన్యాన్ని తక్కువగా వినియోగించాల్సి వస్తూంది. అందుకే దేశభక్తిని ప్రతిక్షణం నూరిపోసే సంస్థలకు పదాతి దళాలుగా ఈ సుశిక్షిత యువకులు అవసరం కూడా. ఇప్పటికే కొన్నిసంస్థలు కర్రసాముతో మొదలెట్టి, తుపాకుల వినియోగం, నాటుబాoబుల తయారీలో కూడా శిక్షణ యిస్తున్నారనుకోండి. అయినా, సైన్యాధికారుల శిక్షణoత పదునుగా ఉండదుగా! అయితే పై సంస్థల శిక్షణను నేను తక్కువగా అంచనా వేస్తున్నానని అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే గాడ్సే నుండి గౌరిలంకేష్ దాకా వారిచ్చిన శిక్షణ గురి తప్పలేదు. ఏమైనా సైనిక శిక్షణ, సైనిక శిక్షణే-కాదనలేం. అలా శిక్షణ పొంది నిరుద్యోగులుగా మిగిలిన యువత, తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు దేశ అంతర్గత శత్రువుల (ముస్లింలు, క్రైస్తవులు, కమ్యునిస్టులు) దునుమాడడానికి వినియోగించవచ్చు. ఇదేమీ కొత్త కాదు. నేటి దేశభక్తుల ఆరాధించే ముస్సోలినీ, హిట్లర్ అనుసరించిన పంథానే. ఇక ఆ యువకులలో ఏ కొద్దిమందో దారితప్పితే ఎన్కౌంటర్లు ఉండనే వున్నాయి. ఇప్పుడర్థంయ్యిoదా మోదీ గారి ప్రతి విధానం వెనుక ఒకటి కాదు, రెండూ కాదు, లెక్క లేనన్నిబృహత్తర లక్షాలుంటాయి. అగ్నిపధ్ పథకం తో, నిరుద్యోగం తగ్గుతుంది, ఇప్పటికే ఒక కార్పోరేట్ అధినేత నాలుగేళ్ళ సైనిక శిక్షణ పొందిన వారికి తన సంస్థలో ఉద్యోగాలిస్తానన్నాడు. (కొంతమంది పదవీ విరమణ చేసిన సైనికాధికారుల్లాగా, ఇప్పటికి అలాంటి వారికెంతమందికి ఉద్యోగాలిచ్చారని అడగకండి. నిత్య శంకితులనిపించుకోవద్దు, ప్లీజ్). బయట పారిశ్రామిక రంగంలో ప్రశాంతత, విదేశిపెట్టుబడుల రాక, అంతకన్నా ముఖ్యంగా హిందీ, హిందూ, హిందూస్తాన్ భావన వ్యతిరేకించే దేశద్రోహుల ఆటకట్టు.
పై మహోన్నత, ఉదాత్త, ముఖ్యంగా దేశభక్తియుత పథకాలను విమర్శిస్తూ, తామే పీడిత ప్రజల చాంపియన్లమని భావిస్తున్న కొందరు, అదృష్టవశాత్తు అతి కొద్దిమంది మేధావులు, రచయితలూ తమ రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా ప్రజలను దేశద్రోహ కార్యాలకు రెచ్చగొడుతుంటే ఏ దేశభక్తుడైనా ఊరకుంటాడా? అయినా ప్రజల సమస్యలు పరిష్కారించే హాక్కు, ప్రజలను శిక్షించే హక్కు రాజ్యాధిపతిదే కదండీ. రామరాజ్యంలో (అదే మనం రామరాజ్య స్థాపనకై బ్రిటీష్ వారిని వదిలిoచుకున్నామని చెప్పుకుంటున్నాం కదా!) ప్రజలకు హనుమంతుని లాగా విధేయులుగా, పాలకుల కాళ్ళకు మోకరిల్లుతూ వుండే బాధ్యత తప్ప ప్రశ్నించే అధికారం ఉండదని గుర్తుంచుకోకపోతే ఎలా? మనుధర్మo నాలుగుపాదాల నడుస్తున్న రామరాజ్యంలో ఎవరు ఏ వృత్తి, ఏ బాధ్యతలు చేపట్టాలో అనేది నిర్ణయించే అధికారం పాలకునికే వుండదని పై మేధావులకు తెలియకపోతే ఎవరిని నిందిస్తాం. దయచూపినా, శిక్షిoచినా అది చక్రవర్తులకే చెల్లు. ప్రజలకేది మంచి, ఏది చెడు నిర్ణయించేది ఆయనే కదా. ధర్మరాజంతటి వాడు చార్వాకుల దండించినా, రాముడు శంభూకుని శిక్షించినా అది రాజధర్మమే.

అలాంటి రామరాజ్యంలో ఆదివాసీలు జల్, జంగిల్, జమీన్ లకై పోరాడటమేమిటి, దానికి మేధావులు, పౌరహక్కుల నేతలు మద్ధతు పలకడమేమిటి? ఇది రాజాజ్ఞ ధిక్కరణ కాదా? సమస్యంతా మన బుర్రలు చెడిన మేధావులు ఈ దేశం ప్రజాస్వామ్య దేశమనే భ్రమల్లో ఉండటమే. బహుశ దేశంలో ఎన్నికలు జరగడం, అదీ ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనంత తరచుగా జరపడం, ఒక న్యాయ వ్యవస్థ వుండటం, దానికి స్వతంత్ర ప్రతిపత్తి వుందని వీళ్ళనుకోవడం వారి ప్రజాస్వామ్య భ్రమలకు కారణమనుకోవచ్చు. అయ్యా మాది రామరాజ్యం అంటూ వేలమార్లు ప్రకటించినా, దానికి రుజువుగా శ్రీరామునికి గుడులే లేనట్టు బాబ్రీని కూల్చి రాముని గుడి నిర్మాణానికి పూనుకున్నా, మనదింకా ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ అని చదువుకున్న మూర్ఖులు భావిస్తే ఎవరయినా ఏం జేస్తారు. అలాంటి వారి భ్రమలు వదిలించాలంటే జైళ్ళూ, మరీ మొండిగా వుంటే ఎన్కౌంటర్ల గుళికలు తప్పవు కదా!

అయినా వారిని సరిదిద్దటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వారికీ అనుభవం కొత్తకాదు. స్వాతంత్రం అనేది వచ్చిందని అనుకున్నకాలం నుండి మీసాలు, ఊపాలను, ఎన్ఐఎ చవిచూస్తున్నవారే వీరు. మోదీ అఖండ భారత్ లక్ష్యసాధనలో మరింత కఠినంగా అంతర్గత శత్రువులతో వ్యవహరిస్తున్నాడు. మరింత అకుంటిత దీక్షతో పనిజేస్తున్నాడు కూడా. అయినా, తన సామ్రాజ్య విస్తరణకు అడ్డoకిగా ఉన్నవాటిని తొలగించే క్రమంలో గతంలో రాజులు, చక్రవర్తుల ఎంత హిoసకు పాల్పడలేదు? రాజ్యం వీర భోజ్యం అనే నానుడి ఉండనే ఉందిగా. మహోన్నత గత భారతీయ సంస్కృతీ వారసత్వాన్ని పుణినికి పుచ్చుకొని, గీతోపదేశం పరమ పవిత్రం అనుకునే మోదీ మహారాజ్ తాను ధర్మమనుకునే దానికి ఎవరడ్డువచ్చినా, చివరకు సోదరులైనా అడ్డంగా నరికేయమని భగవాన్ ఉవాచను పాటించడనుకోవడం మూర్ఖత్వంగాక మరేమవుతుంది? దానికి, ఎవరినైనా, ఏవిధంగానైన వినియోగించుకోమని ఆయన ఆధునిక ఆరాధ్య దేముళ్ళు ముస్సోలినీ, హిట్లర్ లు దిశానిర్దేశం చేసారు కూడా. అందువల్ల తననుకుంటున్న భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న మోదీ మహారాజ్ పై నిందలు వేయడం, అపోహలు కల్పించడం దేశాద్రోహంగాక మరేమవుతుంది.

ఆధునిక చరిత్రలో మోదీ అంత ఎక్కువగా నిందలకు, ఆరోపణలకు గురయినవారెవ్వరూ లేరు. అయినా, ఆయన ప్రభ రవ్వంత మసకబార లేదు. దేశం లోని మెజారిటీ ప్రజలు కర్మ సిద్ధాంతం నమ్ముకొని ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఇక యువతలో కొందరు అమెరికా కలల్లో తేలిపోతుంటే, కొందరు తమ దేశక్తి నిరూపించుకునేందుకై, ఐహిక జీవితానికి స్వస్తిజెప్పి జీవిత సాగరం దాటడానికి హిందుత్వ పడవలో పయనిస్తున్నారు. చాలా కొద్దిమంది, అతి తక్కువమంది మోదీ మహారాజ్ ను తప్పుగా అర్థంజేసుకోవడం, ఆయనపై ఆరోపణలుజేయడం, ఆయన విధానాలపై బురద్దజల్లడం వల్లనే దేశం దుర్గతిపాలవుతున్నదని, దివ్వెలు వెలిగించి, చప్పట్లు గొట్టినా, కంచాలు మొగించినా, గోమూత్రం సేవించినా కోవిడ్ మహమ్మారికి దేశం బలిగాక తప్పలేదని భక్తుల వాదనలో నిజముoదనిపిస్తూంది.

ఇప్పుడే అందిన వార్త- మోదీజీ గుజరాత్ మారణకాండ కేసునుండి పులు కడిగిన ముత్యంలా బయటపడ్డారు. ఆయనా మోదీ గరళకంఠుడని, ఇన్నేళ్ళు తాను గరళాన్నిమోసాడని షా గారు సెలవిచ్చారు. మోదీ ఇంతవరకు కంఠంలోనే దాచుకున్న గరళాన్ని అప్పుడే తీస్తా సెతల్వాద్ లాంటి హక్కుల కార్యకర్తపై చిమ్మారు. ఇక ఆ గరళం మరెంతమందిని ముంచెత్తుతుందో? మోదీ విష ప్రభావం ఎంత శక్తిమంతమైనదో దేశ ప్రజలు ఇప్పటికే రుచి చూసారు కూడా. దీని విషయంలోనూ సుప్రీంకోర్టుపై అనుమానాలు వ్యక్తం చేయకండి. తాము కోర్టును ప్రభావితం చేయలేదని సాక్షాత్తు కేంద్ర గృహమంత్రి అమిత్ షా సెలవిచ్చారు. ఆయనపై కేసు కూడా అంతే. ఆయనకు కిందికోర్ట్ లో శిక్ష వేసిన న్యాయమూర్తి ఆకస్మిక గుండెపోటుతో పరలోకానికి వెళ్ళాడు. తస్మాత్ జాగ్రత్త! పవిత్రమూర్తులపై నిందారోపణలు ఎక్కడికి దారితీస్తాయో తెలుసుకోండి.

మీరు ప్రభువుల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు తప్పక గుర్తుంచుకోవలసినది, అత్యంత ఆవశ్యకమైనది దేశం = మోదీ = సంఘపరివార్= అదానీ.
ఇంకా అర్థం కాలేదా? మీకూ తీస్తా సేల్వాద్, జుబైర్ ల గతే!

Leave a Reply