బ్రాహ్మణీయ హిందూత్వ పుట్టుకకు అర్థభూస్వామ్య అర్థవలస సామాజిక ఆర్థిక వ్యవస్థే పునాది. పెటీబూర్జువా ఫాసిజం కన్నా బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం భిన్నమైనది. ఇది కులవ్యవస్థను నూతన రూపంలో బలోపేతం చేసే భూస్వామ్యతరహా ఫాసిజం. హిందూత్వ అంటే, రూపంలోనూ సారంలోనూ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉండే హిందూమతంలో ఏకరూపతను సాధించడం. భారత సమాజంలోని ప్రత్యక్ష, పరోక్ష వైరుధ్యాల ఫలితంగా ఏర్పడిన భౌతిక పునాదే పై కేంద్రీకరణను ఉత్పన్నం చేస్తుంది. సామాజిక నిర్మితిని సామాజిక, ఆర్థిక సంబంధాల రూపవ్యక్తీకరణే హిందూ సామాజిక నిర్మాణం. కాబట్టి హిందూత్వ ఫాసిజపు పుట్టుకను, పెరుగుదలను అర్థం చేసుకోవాలంటే దాన్ని సృష్టించిన భౌతిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. తొలి పెట్టుబడిదారీ విధానమంటే వలసవాదమే. వలసలను అన్వేషించడమే దాని అంతిమ లక్ష్యం. తొలి 18వ శతాబ్దపు భారతదేశ ఆర్థిక విధానం ఎక్కువగా వ్యవసాయ ఆర్థిక విధానమే. కాని అది అదేకాలంనాటి అత్యధిక యూరోపియన్‌ ఆర్థిక విధానాల్లాంటి అత్యంత వ్యవసాయాధారిత ఆర్థిక విధానం కాదు. 1750లలో ఫ్లాసీ యుద్ధం (1757) కంటే కొన్నేళ్ల ముందు తయారీరంగంలో భారతదేశపు వాటా 24.5 శాతం ఉండగా, చైనావాటా 32.5శాతంగా ఉండిరది. మొఘల్‌ సామ్రాజ్య పతనంతో భారత రాజకీయాలలో అంతర్గత యుద్ధాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘‘ఇండియాలో ఆంగ్లేయుల ఆధిపత్యం ఎలా నెలకొల్పబడిరది? మహామొఘలు సామ్రాజ్యపు సర్వాధికారం మొదట మొఘల్‌ వైస్రాయ్‌లచే, తర్వాత వారి అధికారం మరాఠాలచే, మళ్లీ మరాఠాల అధికారం అఫ్ఘన్‌లచే విచ్ఛిన్నమైపోయి, మొత్తంగా అందరికి అందరూ అంతర్గత యుద్ధాలకు పాల్పడ్డారు. ముస్లింలకు, హిందువులకు మధ్యÑ తెగకు, తెగకు మధ్య, కులాల మధ్య భీకర యుద్ధాలు చెలరేగే దేశంలోకి బ్రిటిష్‌వాళ్లు కూడా ప్రవేశించి అందరినీ అణచివేసి, వాళ్ల ఆధిపత్యాన్ని నెలకొల్పారు. ఇన్ని అంతర్గత యుద్ధాలు జరిగే దేశం విదేశీ ఆక్రమణకు గురికాకుండా ఉంటుందా?’’1 ఇండియా విదేశీదాడికి గురికావడం ఇది మొదటిసారికాదు. తన తొలి నాగరికతపై ఆర్యులదాడి మొదలుకొని భారతదేశ చరిత్రంతా విదేశీ దాడులమయమే. ఇండియాపై అరబ్బులు, టర్క్‌లు, మొఘలులు మున్నగువారిచే జరిగిన దాడులన్నీ సామాజిక, రాజకీయ మత భావజాలం వంటి ఉపరితల రంగానికి పరిమితమైనవి తప్ప ఆర్థిక పునాదులపై జరగలేదు. అవేవీ ఇక్కడి స్వయంపోషక గ్రామీణ వ్యవస్థను చెదరగొట్టలేదు. ఒక రకంగా అవి ఇక్కడి సామాజికార్థిక పరిస్థితులతో సర్దుబాటు అయి హైందవీకరించబడ్డాయి. నిజానికి భారత భూస్వామ్య వ్యవస్థ యూరోపియన్‌ భూస్వామ్యంకంటె భిన్నమైనది. ఇక్కడ భూమి, నీటిపారుదల, ఇతర అభివృద్ధి పనులన్నీ ప్రైవేటు యాజమాన్యం కింద కాకుండా రాజ్యం ఆధ్వర్యంలో నడిచేవి. ప్రాచీనకాలం నుండి మధ్యయుగాలవరకు భారతదేశం ఇటువంటి ప్రత్యేక లక్షణాలతోనే వుండిరది. దీనినే ఆసియా తరహా ఉత్పత్తి విధానమని అన్నారు. కాని, ఇండియాపై బ్రిటిష్‌ వలసవాద దాడి పై దాడులన్నింటికంటే భిన్నమైనది. బ్రిటన్‌ తనదేశంలో భూస్వామ్యాన్ని రద్దుచేసి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుకున్న దేశం. ఆ కారణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఐక్యతను సాధించిన దేశం. ఇండియాలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలన కొనసాగినంతకాలం దాని ప్రయోజనాలకు భంగకరంగా ఇక్కడ వున్న ఏ ఒక్క బ్రిటిష్‌ దేశస్తుడు కూడా వ్యవహరించలేదు. కాని, భారతీయ రాజులు, మంత్రులు, ప్రముఖులందరూ తమ రాజవంశాల ప్రయోజనాలకు భంగకరంగా బ్రిటిష్‌వారితో కుమ్మక్కయ్యారు. భూమిశిస్తు వసూలు చేసే అధికారం భూస్వామ్య రాజుకు ఉన్నప్పటికీ రాజు తన సామ్రాజ్యంలోని భూమికి యజమాని కాడు.2 మొత్తం గ్రామమే భూమికి వాస్తవ యజమానిగా వుండేది. అందువల్ల భూమిని సొంత ఆస్తిగా కలిగివున్న ప్రభువర్గం ఇక్కడ సృష్టించబడలేదు. మొఘలుల కాలంలో వ్యవసాయరంగంలో సాంకేతిక ప్రగతి, కొత్త ఆవిష్కరణలు జరిగినప్పటికీ ఇక్కడి భూసంబంధాలు చెదిరిపోలేదు. ముఖ్యంగా బ్రిటిష్‌ పెట్టుబడిదారీ విధానం కులవ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఇక్కడి బ్రాహ్మణీయ భావజాలంతో సర్దుబాటు చేసుకొని భూస్వామ్య సంబంధాలను సరికొత్త రూపంలో కొనసాగించింది. బ్రిటిష్‌ వలసవాద మానవ జాతి శాస్త్రవేత్తలు కుల వ్యవస్థ పుట్టుకకు సంబంధించిన ఒక జాతి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువచ్చారు. అదే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు భావజాలంగా మారింది. అలా బ్రిటిష్‌ పాలనా విధానం , బ్రిటిష్‌ చట్టాల ద్వారా కుల వ్యవస్థకు చట్టబద్ధతను చేకూర్చారు. పైగా బ్రిటిష్‌ న్యాయమూర్తులకు బ్రాహ్మణులే సలహాదారులుగా నియమితులయ్యారు. శాశ్వత సెటిల్‌మెంట్‌ చట్టం 1793, రైత్వారీ చట్టం 1820, వ్యవసాయాన్ని వ్యాపారీకరించడం, ఆధునిక పరిశ్రమలను స్థాపించడం వంటి పరిణామాలతో సాంప్రదాయ కుల వ్యవస్థ కొన్ని అనూహ్యమైన మార్పులకు గురైంది. అందులో భాగంగానే 20వ శతాబ్దంలో శూద్రకులాల నుండి భూస్వామ్య శూద్రులు, భూమిలేని కౌలుదారీ శూద్రులు అనే నిట్టనిలువు విభజన ఏర్పడిరది. ఈ భూస్వామ్య శూద్రులే మారిన పరిస్థితుల్లో బ్రాహ్మణవాదానికీ, భూస్వామ్యానికీ సరికొత్త ప్రతినిధులయ్యారు. బ్రిటిష్‌ వలసవాదాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. (1) వ్యాపార పెట్టుబడి దశ. 1753`1813 (2) పారిశ్రామిక పెట్టుబడిదశ 1813` తొలి 20వ శతాబ్దందాకా (3) ద్రవ్యపెట్టుబడి దశ.

(1) వ్యాపార పెట్టుబడి దశ :
ఈ దశ అసమానమైన వినిమయం, పెట్టుబడి సంచయం అనే ప్రాథమిక దశకు సంబంధించినది. తమ లాభాలకోసం ఈస్టిండియా కంపెనీ భారత మార్కెట్ల నుండి చాలా తక్కువ ధరకు సరుకులను కొని యూరోపియన్‌ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు అమ్మేది. ఇందుకోసం వలసవాదులు మార్వాడీ, గుజరాతీ, పార్శీ సామాజిక సమూహాల నుండి ‘ముకద్దములు’ అనే స్వదేశీ వ్యాపారవర్గాన్ని సృష్టించారు. వారు వలసవాద ఏజెంట్లుగా చేతివృత్తులదారులచే బలవంతంగా తక్కువ ధరకు సరుకులను ఉత్పత్తిని చేయించేవారు. దాని ఫలితంగా క్రమంగా స్వయంపోషక పరిశ్రమ విధ్వంసమై రైతాంగం పేదరికంలోకి నెట్టబడిరది. వృత్తిదారుల నైపుణ్యాలు దెబ్బతిని వారు కాంట్రాక్టు ఉద్యోగులుగా బతుకులీడ్చారు.

అటువంటి పరిస్థితులన్నీ తీవ్రమైన సామాజిక పరిణామాలకు దారితీసాయి. మొదట భూస్వామ్య సంబంధాలు వలసవాదం మద్ధతుపొంది, అవి రెండూ సామరస్యంగా సహజీవనం చేసాయి. ఈ భూస్వామిక సంబంధాలే భావజాల రంగంలో, ఆర్థిక రంగంలో ద్వంద్వ పాత్ర పోషించాయి. భావజాల రంగంలో అవి మతం, కులం అనే నమూనాలపై ఆధారపడి ఆర్యత్వం అనే వాస్తవాన్ని నిర్మించగా, ఆర్థిక రంగంలో అవి దోపిడీద్వారా రైతాంగాన్ని, వివిధ వృత్తిదారులను అణచివేసాయి. ఆర్థిక దోపిడిపై ముసుగు కప్పడానికి మత భావజాల రంగంలో ఆర్యత్వం అనే గుర్తింపును తయారుచేసింది. కాబట్టి హిందువులు, ముస్లిం మధ్య మతతత్వ ద్వేషం మొదలై విస్తృత రూపం ధరించింది. భూస్వామ్యవర్గాలు తమచేతిలో అంటరానితనం అనే పనిముట్టును ఉపయోగించుకొని యావత్‌ సమాజంపై ఆధిపత్యాన్ని నెలకొల్పుకున్నారు. అలాగే మరోవైపు ముస్లింలు విదేశీయులని, దాడిచేసేవాళ్లని, దోపిడీదార్లని ప్రచారం చేశారు. మూడవ మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ పరిపాలనా కాలంలో (1556-1605) ప్రారంభమైన మత సామరస్య విధానాన్ని (sulh-i-kul peace with all తర్వాత పాలకులు కొనసాగించలేదు (అయితే ఆ మత సామరస్యం, సహనం అనే సూత్రం మీద కాకుండా అంగీకారం అనే సూత్రంపై ఆధారపడి కొనసాగిందని మనం గమనించాలి). బనారస్‌ పట్టణంలో భక్తి ఉద్యమకాలంలో నిర్మితమైన గంగా` జమునా` తెహజీబ్‌ మతతత్వవాదంచే కలుషితమైంది. బ్రిటిష్‌ వలసవాద పాలకులు భూస్వామ్య వ్యాపారవర్గాల మద్ధతుతో హిందువులు ముస్లిం మధ్య వైరాన్ని సృష్టించి వలసదోపిడీ కోసం దానిని కొనసాగించారు. యూరోపియన్‌ వలసవాదం మనదేశంలోకి రాకముందే ఇక్కడ స్వదేశీ వ్యాపారుల వర్గమొకటి అభివృద్ధి చెందుతోంది. ఈస్టిండియా కంపెనీ రాజరిక భూస్వాముల, నవాబుల, ఇతర భూస్వామ్య శక్తుల పాత్రను బలోపేతం చేసి, రైతాంగం, సాంప్రదాయ వృత్తిదారుల శ్రమ నుండి అదనపు విలువను దోచుకుంది. ఇది కాకుండా రైతాంగం నుండి కౌలు వసూలు రూపంలో కూడా కంపెనీ వాళ్లను దోచుకుంది. 1771 నాటి భూమిశిస్తు వసూళ్లు అంతకు ముందుకంటే చాలా రెట్లు పెరిగాయి. 1793లో శాశ్వత పరిష్కార చట్టం రావడంతో భూమిశిస్తు వసూలుదారుల నుండే ఒక కొత్త భూస్వామ్యవర్గం పుట్టుకొచ్చింది. దాని తర్వాతనే భూమి సరుకుగా మారి, దానికొక యజమాని ఏర్పడి భూమిని అమ్మడం, కొనడం జరిగింది. అందుకే 1828-1835 మధ్యకాలంలో గవర్నర్‌ జనరల్‌గా వున్న విలియం బెంటింక్‌ ఇలా అన్నారు; ‘‘విస్తృతంగా ప్రజా కల్లోలం చెలరేగి భద్రత కొరవడితే శాశ్వత పరిష్కార చట్టం (ఇతర విషయాల్లో ఎక్కువగా ఉపయోగపడనప్పటికీ) ఉపయోగ పడవచ్చునని నేనంటాను. దీనివల్ల ధనిక, భూస్వామ్య యజమాని వర్గం ఒకటి సృష్టించబడి విశాల ప్రజానీకంపై అదుపును, బ్రిటిష్‌ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చును’3 అలా 1790 తర్వాత భారతచరిత్రలో పుట్టుకొచ్చిన ధనిక, భూస్వామ్య, జమీందారీ వర్గాలు, ధనిక రైతాంగ వర్గాలు వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున వ్యాపారీకరించాయి. ఒకవైపు కౌలు, వడ్డీ, వ్యాపారం వంటివి భూస్వామికి లాభాలు చేకూర్చాయి. మరోవైపు భూస్వాములు నియమించుకున్న వ్యవసాయ కూలీలు నిజమైన అర్థంలో ఆధునిక పెట్టుబడిదారీ కూలీలు కారు. వారు కులహింసకు గురౌతూ అప్పుల వలయంలో చిక్కి బంధిత కూలీలుగా మారిపోయారు. కాబట్టి భారతదేశాన్ని ఆధునిక దేశంగా మార్చడం కాకుండా, ఒక అర్థ భూస్వామ్య దేశంగా మార్చడమే బ్రిటిష్‌ వలసవాద లక్ష్యం.

(2) పారిశ్రామిక పెట్టుబడిదశ 1813- తొలి 20వ శతాబ్దందాకా :
పారిశ్రామిక విప్లవం జరగడంతో మనదేశ వ్యాపార స్వభావంలోనే తీవ్రమైన మార్పు సంభవించింది. 1813 నుండి 1858 వరకు స్వేచ్చవాణిజ్యం పేరిట పారిశ్రామిక పెట్టుబడిదారీ దోపిడి పెద్ద ఎత్తున పెరిగింది. ఫలితంగా స్వదేశీ సంప్రదాయ చేతివృత్తుల పరిశ్రమ నాశనమై, మనదేశం మాంఛెష్టర్‌ వస్త్రపరిశ్రమల మార్కెట్‌గా మారిపోయింది. యూరప్‌లో అప్పుడు హేతువికాసం, జ్ఞానోదయ ఉద్యమాలు జరుగుతూ ఒక విప్లవాత్మక యుగం నడుస్తోంది. అక్కడి ఉత్పత్తి విధానం పరస్పర వైరుధ్యాలతో కూడిన కొత్త వర్గాలను, కొత్త దోపిడీ పద్ధతులను సృష్టించి, కొత్త పోరాట రూపాలను కూడా ముందుకు తెచ్చింది. కాని ఇండియాలో బ్రిటిష్‌ వలసవాదం తన జాతివాద భావజాలంతో తూర్పుదేశాలను ‘నాగరీకరించే’ ధ్యేయంతో ముందుకు సాగింది. యూరప్‌లో జ్ఞానోదయ ఉద్యమ ఫలితంగా ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియగా ఇండియాలో వలసవాద పెట్టుబడి తాలూకు పారిశ్రామిక పొగలు కమ్ముకొని మతపరమైన శత్రుత్వంతో ప్రజలు నానాబాధలు, వేదన అనుభవించారు.

పైగా సామ్రాజ్యవాదం తన ప్రాచ్యవాద అవగాహనతో ఇండియాను చలనంలేని సమాజంగా, సామాజిక ఉత్పత్తి విధానంలోనూ, చైతన్యంలోనూ ఎటువంటి గుణాత్మక మార్పులు జరగని స్తబ్దత సమాజంగా పరిగణించింది. వలసపాలకులు, కొత్త భూస్వామ్య వర్గాలు హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను వాళ్ల లాభాపేక్షకు ప్రమాదకరంగా భావించి వాళ్ల మధ్య వైరుధ్యపూరితమైన సంబంధాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. వలసవాద చరిత్రకారులు భారతచరిత్రను ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రగా మతవాద తర్కంతో వర్గీకరించారు. ప్రముఖ స్కాటిష్‌ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ అయితే తన ‘‘బ్రిటిష్‌ ఇండియా చరిత్ర’’ అనే గ్రంథంలో ప్రాచీన భారతదేశాన్ని హిందూదేశమని, మధ్యయుగాల భారతదేశాన్ని ఇస్లామిక్‌ దేశమని, బ్రిటిష్‌ ఇండియాను ఆధునిక భారతదేశమని పేర్కొన్నాడు. మొత్తంగా భారతచరిత్ర అధ్యయనమే మతతత్వకోణంలో అనేక నిరాధారమైన, అహేతుక అభిప్రాయాలతో సాగింది. 1857లో ప్రథమ భారత సంగ్రామం సందర్భంగా హిందూ ముస్లింల ఐక్యపోరాటాన్ని చూసి, వలసవాద పాలకులు ఇక్కడ విభజించి పాలించు అనే సూత్రాన్ని మొదలుపెట్టారు. అందుకే ఆ కాలంలో బ్రిటిష్‌ ప్రావిన్స్‌లలో హిందూ పునరుద్ధరణవాద ఉద్యమం ప్రబలంగా బయలుదేరింది. వలసవాదం చేత నిర్మితమైన ప్రజాక్షేత్రాన్ని అగ్రకులాలవారు, భూస్వామ్య వర్గాలే ఉపయోగించుకున్నాయి. ఆర్యసమాజం, బ్రహ్మసమాజం వంటి ఎన్నో సంస్థలు పుట్టుకువచ్చి మతాన్ని వలసవాద దృక్కోణంలో చూశాయి. హిందూమతంలోని మధ్యయుగపు మలినాలను ప్రక్షాళనం చేసే పేరిట ఆర్యసమాజం శుద్ధి ఉద్యమాన్ని చేపట్టింది. హిందూ పునరుద్ధరణవాద దృష్టిలో చరిత్ర రచన అంటే, ఒక వర్గంపై మరొక వర్గం అధికారాన్ని, ఆధిపత్యాన్ని సహజీకరించడమే. ఈ అవగాహనే చరిత్ర` మారని క్షేత్రమని, అక్కడ కాలానికి కూడా ఎటువంటి ప్రభావం ఉండదని, మానవాతీత విషయం అనే భావనకు దారితీసింది. బంకించంద్ర ఛటర్జీ తన ‘‘ఆనందమఠం’ నవలలో ఈ ప్రాచ్యవాద తర్కాన్ని ఉపయోగించి, పాశ్చాత్య ప్రపంచమే ప్రాచ్య ప్రపంచాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయగలదని అంటాడు. అయితే, ఆయన ఆధ్యాత్మికతను సారంగా కలిగివున్న ప్రాచ్య ప్రపంచానికి, శాస్త్ర, సాంకేతిక ప్రగతితో నడిచే పాశ్చత్య ప్రపంచానికి మధ్య ఒక రకమైన ఐక్యతను సృష్టిస్తాడు. ఆ క్రమంలో ముస్లింలను రాక్షసులుగా చిత్రించి వాళ్లే దేశపరాధీనతకు కారకులని వాదిస్తాడు. క్రమంగా హిందూ పునరుద్ధరణవాదుల, ‘‘గతంలోకి అంటే స్వర్ణయుగంలోకి’’ వెళ్లండి అనే నినాదం ఊపందుకున్నది. వలసవాద పాలనను చూపెట్టి మొత్తంగా భారతదేశంలోని దోపిడీనే పక్కకు తప్పించారు. నానాటికీ తీవ్రమౌతున్న ఆర్థిక బాధలు, తరచుగా సంభవించే క్షామాలు ప్రజల్లో అశాంతిని రగిలించాయి. ఆ అశాంతి ఎప్పుడైనా స్వదేశీ పాలకవర్గాలకు వ్యతిరేకంగా మళ్లవచ్చునని భావించి , భూస్వాములు, వడ్డీవ్యాపారస్తుల ఆధ్వర్యంలోని హిందూ మతతత్వ వాదులు, పునరుద్ధరణవాదులు ఆర్థిక సమస్యలకు మతవాద రంగు పులిమారు. 1885 లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెసు మొదట బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వాన్ని తమ డిమాండ్‌లను నివేదించుకునే ‘పెద్దల’ సంస్థగా ఉండేది. పైగా భారత జాతీయ కాంగ్రెసుకు బ్రిటిష్‌ పారదర్శక పాలనపట్ల అచంచల విశ్వాసముండేది. ఆ తర్వాత ఇండియా ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో అంతర్భాగం చేయబడిరది. తత్వవేత్త ఫ్రాంజె ఫనాన్‌ చెప్పినట్టుగా` ‘‘ఆర్థిక అసమానత్వమే వలసవాద సందర్భపు అసలు వాస్తవం. మానవ జీవితంలోని భిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాలు ఆ వాస్తవాన్ని మరుగుపరచలేవు.’’ అలాగే కారల్‌ మార్క్స్‌ కూడా భారత ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్‌ వలసవాద ప్రభావం గురించి ఇలా అన్నాడు. ‘‘ఇండియాలోకి చొచ్చుకొచ్చిన బ్రిటిష్‌ పెట్టుబడే ఇక్కడి చేనేత పరిశ్రమను, వడికే రాట్నాన్ని విధ్వంసం చేసింది. వ్యవసాయానికి, చేతివృత్తుల పరిశ్రమకు మధ్యనున్న ఐక్యతను ఛేదించింది.’’4 స్వదేశీ చేతివృత్తుల పరిశ్రమ విధ్వంసం కావడంతో ఆ వృత్తిదారులు జీవనోపాధి కోల్పోయారు. కాని ఇంగ్లండులో వలె పారిశ్రామికరంగం అభివృద్ధి చెందకపోవడంవల్ల భారత చేతివృత్తుల వర్గం వ్యవసాయ రంగానికి బలవంతంగా మళ్లి, కౌలుదార్లుగానో, వ్యవసాయ కూలీలుగానో బతుకులీడ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 1850`60ల నాటికి కూడా ఇండియాలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందనందువల్ల ఆరువేల మైళ్ల రూరంలో వున్న ఇంగ్లాండ్‌ సాధిస్తున్న అభివృద్ధి భారాన్ని ఇక్కడి చేతివృత్తుల వర్గమే మోయాల్సి వచ్చింది. సరిగ్గా అలాంటి కాలంలోనే ప్రపంచ పెట్టుబడిదారీ మార్కెట్‌ పట్టులోకి ఇండియా వచ్చింది. రైల్వేలైన్ల నిర్మాణంతో ఇక్కడి ముడిసరుకులు బ్రిటన్‌కు ఎగుమతి కావడం, బ్రిటన్‌లో తయారయిన సరుకులు భారతమార్కెట్‌కు దిగుమతి కావడం వేగమంతమయింది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం ఇండియాలో దేశీయ పెట్టుబడిదారీ విధానపు అభివృద్ధిని అనుమతించనందువల్ల దళారీ వ్యాపారవర్గమే దళారీ బూర్జువావర్గంగా పరిణామం చెందింది. ఈ దళారీ బూర్జువా వర్గమే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించకుండా దేశ ప్రజల్ని దోపిడీ చేయడంలో నిర్ణయాత్మకపాత్ర వహించింది. నిజానికి, జాగీర్‌దార్లు, మునసబ్‌దార్లు, భూస్వామ్య రాజులు బలప్రయోగంతో రైతాంగం నుండి పన్నుల వసూళ్ల ద్వారా సంచయమైన సంపదే ఈ దళారీ బూర్జువా పెట్టుబడి రూపాన్ని ధరించింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధసామగ్రిని తయారుచేయడానికిగాను ఇనుము, ఉక్కు వంటి లోహాలకు డిమాండ్‌ చాలా పెరిగింది. ఫలితంగా ఇనుము, ఉక్కు పరిశ్రమలు, వస్త్రపరిశ్రమలు స్థాపించబడడంతో దళారీబూర్జువా వర్గమే నేరుగా సామ్రాజ్యవాద ప్రయోజనాలను నెరవేర్చింది. వ్యవసాయం వ్యాపారీకరణ చెందడంతో రైతాంగం విపరీతంగా అప్పులపాలైంది. ఈ పరిణామాలపై రాయల్‌ కమీషన్‌ నివేదిక ఇలా పేర్కొన్నది. ‘‘భారతదేశంలో వ్యవసాయసేద్యం ఎక్కువమట్టుకు జీవిక కోసం తప్ప మిగులు కోసమో, లేదా లాభం కోసమో కాదు. భూమిపై ఆధారపడే జనసంఖ్య అత్యధికంగా పెరగడం, భద్రమైన జీవితంకోసం ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం, భూమిని వదిలి బయటపడడానికి మార్గం లేకపోవడం లాంటివన్నీ కలిసి వ్యవసాయదారున్ని ఎట్టిపరిస్థితుల్లోనైనా ఆహారపంటలను పండిరచడానికి ఒత్తిడి చేసాయి. ఒకవేళ భూమి గనుక అప్పిచ్చిన వారి చేతుల్లోకి వెళితే, ఏ చట్టంగాని, ఏ కౌలు చట్టంగాని వ్యవసాయదారున్ని రక్షించదు. ఆహారం కోసం వ్యవసాయదారునికి భూమి కావాలి. భూమి ఉంటే వ్యవసాయదారుడు అప్పిచ్చేవాడి ముందు సాగిలపడాల్సిందే.’’5 సంక్షిప్తంగా చెప్పాలంటే` భారతదేశంలో వలసవాద ఆర్థిక విధానం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడంలో విఫలమయింది. యూరోపియన్‌ దేశాలలో వలె ఇక్కడ` వ్యవసాయ జనాభా జీవితం మెరుగుపడలేదు. వలసవాద ఆర్థిక విధానాల ఫలితంగా భూస్వాములు, వడ్డీవ్యాపారులు, దళారీ వ్యాపారవర్గాలు సృష్టించబడ్డాయి. ఉత్పత్తిదారుల నుండి పన్నులు వసూలు చేయడమే వారి ప్రధానమైన విధిగా ఉండేది. మరోవైపు చేతివృత్తుల పరిశ్రమలు నాశనం కావడంతో ఆ జనాభా అంతా బలవంతంగా వ్యవసాయరంగంవైపు బదిలా అయ్యింది. 1850`1860ల దాకా చేతివృత్తుల పరిశ్రమ ఏ మేరకైతే ధ్వంసమయిందో, ఆ స్థాయిలో తగిన పారిశ్రామికీకరణ జరగకపోవడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున నగరాల నుండి గ్రామాలకు తిరుగు వలస (రివర్స్‌ మైగ్రేషన్‌) వెళ్లారు. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా ఉద్రిక్తతలు పెచ్చుమీరిపోయాయి. కొత్త భూస్వామ్యవర్గాలు మొదట వలసపాలకులతో ఘర్షణపడి, ఆ తర్వాత, సహకరించి ‘విభజించి, పాలించు’ అనే వలస నీతిని పాటించాయి. 1870ల నుండి హిందూ పునరుద్ధరణ వాదం పెరుగుతూ శిఖరస్థాయికి వెళ్లింది. బ్రిటిష్‌వారి సహకారంతో సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌, రాజా శివప్రసాద్‌ సింగ్‌ల ఆధ్వర్యంలో 1888లో ఐక్య భారత దేశభక్త సంఘం స్థాపించబడిరది. ఒక రకంగా అది బలహీనపడుతున్న భూస్వామ్య వర్గాలు, రాజులు, ఇతర హిందూ, ముస్లిం ప్రభువుల సంకీర్ణ రాజకీయ సంస్థ. అదే ఆ తర్వాత ముస్లింలీగుగా, హిందూమహాసభగా విభజించబడిరది.

(3) ద్రవ్యపెట్టుబడి దశ :
20వ శతాబ్దంలో ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో సామ్రాజ్యవాదం పెరగడంతో భారతదేశంలో వలస దోపిడీ తీవ్రమయింది. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు బ్రిటిష్‌ పెట్టుబడి పెద్ద మొత్తంలో భారతదేశంలోకి ప్రవేశించింది. దాని లక్ష్యం భారతదేశాన్ని పారిశ్రామికీకరిండం కాదు, కేవలం భారతదేశం నుండి ముడి పదార్థాలను ఎగుమతి చేసి, బ్రిటిష్‌ సరుకులను వెల్లువలా ఇండియన్‌ మార్కెటుకు తరలించడమే.

కాని, మొదటి ప్రపంచయుద్ధంతో సామ్రాజ్యవాద వైరుధ్యాలు, బ్రిటిష్‌ వలసవాదం పట్ల వ్యతిరేకతా పెరగడంవల్ల దళారీ బూర్జువావర్గం, భూస్వామ్య ప్రభువుల వర్గం మెడలపై బోల్షివిక్‌ విప్లవం ఒక కత్తిలా వేలాడుతుండడం వల్ల బ్రిటన్‌ తన పారిశ్రామిక విధానాన్ని బలవంతంగా మార్చుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో, కింది నుండి ప్రజాఉద్యమాలు వివిధ రూపాలలో తలెత్తాయి. మహరాష్ట్రలో భూస్వామ్యవ్యతిరేక ఉద్యమాలు, అంబేద్కర్‌ రాకతో ప్రజల్లో అనేక ఉద్యమాలు ఊపందుకున్నాయి. తనపైన రాజకీయ ఆచరణద్వారా అంబేద్కర్‌ అట్టడుగు కులాల అమానుష స్థితిని, బ్రాహ్మణీయ హిందూమతతత్వ వాదం, పెట్టుబడిదారీ విధానం కింద దళితుల స్థితిగతులను ప్రశ్నించాడు. అలాగే 1925లో కమ్యూనిస్టుపార్టీ పుట్టుక, క్రమంగా అనేక ట్రేడ్‌ యూనియన్లు, రైతాంగ సంస్థలు, శ్రామికవర్గ రైతాంగ పోరాటాలు రావడం వల్ల జాతిని, జాతీయవాదాన్ని సరికొత్తగా అర్థం చేసుకోవడం మొదలయింది. జాతీయ స్వాతంత్య్ర పోరాటంపై కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. హిందూస్థాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌, అతని సహచర కామ్రేడ్ల పోరాటం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి, ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతతత్వ శక్తుల వ్యతిరేక పోరాటానికి సరికొత్త బలాన్నిచ్చింది. అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్‌ వలస పాలకులు స్వదేశీ పాలకవర్గాలతో కూడిన ఉమ్మడి కూటమి, సాధ్యమైన మార్గాలలో ప్రజాఉద్యమాలను అణచివేయడానికి ఉద్దేశపూర్వకంగానే మతోన్మాద వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలను మొదలుపెట్టింది. భూస్వామ్య ప్రభువుల, పీష్వాల, వడ్డీవ్యాపారుల ప్రయోజనాలను రక్షించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925లో స్థాపించారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రపోరాట చరిత్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు. అంటే, దళారీబూర్జువా వర్గం, భూస్వామ్య ప్రభువర్గాలకు తోడుగా ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి విధేయమైన సేవకురాలిగా వ్యవహరించిందనేది చారిత్రక సత్యం. 1947లో అధికార బదిలీతో ఇండియా అర్థభూస్వామ్య` అర్థవలస దేశంగా మారింది. రాజకీయాధికారం దళారీబూర్జువా వర్గాల, భూస్వామ్య వర్గాల చేతుల్లోకి వచ్చింది. వారి ఉమ్మడి ఆధిపత్య వర్గకూటమియే బలప్రయోగంతో, ప్రజలను మోసగించడం ద్వారా తమ పాలనను స్థాపించుకున్నది. నాటి రాజ్యాంగ సభలో భూస్వామ్య శక్తులు, దళారీబూర్జువా శక్తులు ఆధిపత్యం చెలాయిస్తుండేవి. ఆ రాజ్యాంగసభకే చట్టాలు చేసే అధికారం ఇచ్చారు. సహజంగానే ఆ ఆధిపత్య శక్తులు భూ పరిమితి విధింపు, భూ సంస్కరణలు వంటి ప్రజాస్వామిక డిమాండ్లన్నింటినీ వ్యతిరేకించాయి. 1948లో సంస్ధానాల విలీనం చట్టాల ద్వారా అనేక రాజరిక సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. సంస్థానాథీశులకు, నవాబులకు రాచరిక అధికారాలన్నీ ఇవ్వబడ్డాయి. కొందరినైతే ప్రభుత్వంలోనే విలీనం చేసుకున్నారు. ఆ విధంగా నెహ్రూ తరహా సోషలిజం అనేది పాలకవర్గాల ఆధిపత్య భావనగా స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశాబ్దాలలో చలామణి అయ్యింది. బంగారం, బొగ్గు, మెగ్నీషియం వంటి గనులు, తదితర రంగాలపై విదేశీ శక్తుల నియంత్రణలే వుండడం, మూడవ వంతు భారత దిగుమతులపై, నాల్గవ వంతు ఎగుమతులపై విదేశీకంపెనీల సర్వాధికారం వుండడం భారత అలీన విధానపు ఆత్మవంచనను నగ్నంగా బహిర్గతం చేస్తుంది. ఇక, దేశ పారిశ్రామిక ఉత్పత్తి విషయానికి వస్తే` అది అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఉత్పత్తి అయిన విలావసవంతమైన సరుకుల వరకే పరిమితమైనది. నిజానికి కాంగ్రెసు ప్రభుత్వం ఆనాటి పేదరికాన్ని నిర్మూలించడానికి విధాన పరంగా చేసిందేమీ లేదు. 1960`61 నాటి మొత్తం 44 కోట్ల జనాభాలో 19 కోట్ల 70 లక్షల జనాభా పేదరికంలోనే ఉన్నది. చాలా ప్రజాస్వామిక సంస్కరణలని చెప్పబడుతున్న భూసంస్కరణలు భూస్వామ్య వర్గాలకే లాభించాయి. దేవాలయాలకు, మసీదులకు, తోటల పెంపకానికి సంబంధించిన భూములన్నీ భూసంస్కరణల పరిధి నుండి మినహాయించబడినవే. భూమిలేని రైతులకు పంచిన భూములుకూడా తక్కువ ఉత్పాదక శక్తిగల భూములు, బంజరు భూములే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1991 నాటి పంచవర్ష ప్రణాళికాంతం వరకు మొత్తం 40.7 కోట్ల ఎకరాల భూముల్లో నుండి 72.3 లక్షల ఎకరాల భూమిని మాత్రమే పేదలకు పంచారు. జాతీయోద్యమం సందర్భంగా కాంగ్రెసు చేసిన చాలా వాగ్దానాలు అమలుకాలేదు. ప్రజాస్వామ్యంలో భంగం చేయడానికే వాగ్దానాలు చేస్తారనే నానుడిని ఇది గుర్తుకు తెస్తుంది. మొదటి పంచవర్షప్రణాళిక వెనుక తర్కమేమిటంటే` పబ్లిక్‌ పెట్టుబడి సహాయంతో ప్రైవేటు పెట్టుబడిని ప్రేరేపించడమే. మౌలిక సదుపాయాల కల్పనలో పబ్లిక్‌ పెట్టుబడినే ఉపయోగించి, ప్రైవేటు పెట్టుబడికి సంబంధించిన అదనపు విలువల వాటాను పరోక్షంగా పెంచడమే లక్ష్యంగా సాగింది. ఒకవేళ సంక్షోభం వస్తే, పబ్లిక్‌ రంగమే ఆ సంక్షోభ భారాన్ని మోసేటట్టుగా, ప్రైవేటు రంగం దాన్నుండి తప్పించుకునేటట్టుగా ఆ పథకాలు తయారు చేయబడ్డాయి. 1960లలో భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలలో సంక్షోభానికి గురయింది. వాటిలో ఆహారసంక్షోభమే అతి పెద్ద సంక్షోభం. ఆ సంక్షోభాన్ని అధిగమించడానికి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం హరిత విప్లవమనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే అనతికాలంలోనే నక్సల్బరీలో సాయుధరైతాంగ తిరుగుబాటు జరగడంతో ఆ హరిత విప్లవం ఎర్ర విప్లవంగా మారింది. ఆ కాలంలో కులపరమైన అత్యాచారాలు, మతతత్వ ఉద్రిక్తతలు గ్రామాల్లోనూ, నగరాల్లోనూ పెరిగాయి. భూస్వామ్య దోపిడీ ఒక కొత్త స్థాయికి చేరింది. ఒకవైపు భారత రాజ్యపు విధానాలు రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా వుండగా, మరోవైపు బూర్జువా నాయకులేమో దేశాన్ని రైతుల దేశంగా, వ్యవసాయదేశంగా గర్వంగా మాట్లాడడం చేశారు. స్థూల దేశీయోత్పత్తి నిష్పత్తిలో వ్యవసాయ రంగపు వాటా ఇటీవలి సంవత్సరాలలో 14.4 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ నినాదం ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ నుండి ప్రస్తుత హిందూత్వ నినాదం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ దాకా స్వదేశీ ఉత్పత్తి రంగం చాలా క్షీణించింది. ఫలితంగా వ్యవసాయ శ్రామికులు అసంఘటిత శ్రామికులుగా మారి అతి దయనీయమైన పరిస్థితులలో బతుకులీడుస్తున్నారు. నయా ఉదారవాద పథకాలు రావడంతో ప్రజల కొనుగోలు శక్తిపై, ప్రజల పొదుపులపై ప్రత్యక్ష దాడి జరుగుతోంది. నయా ఉదారవాద రాజ్యం ప్రజా అభివృద్ధి పథకాలన్నింటినీ ప్రైవేటు శక్తులకు అప్పగించింది. ఈ రోజు ఆరోగ్యం, రవాణా, బీమా, బ్యాంకులు, విద్య తదితర రంగాలన్నిటినీ విచ్చలవిడిగా ప్రైవేటీకరించడం వల్ల ప్రజల్లో తీవ్రమైన అభద్రతా భావం నెలకొన్నది. 2016లో పెద్దనోట్ల రద్దు ద్వారా ప్రజల చిన్నమొత్తాల పొదుపులను తస్కరించారు. వస్తు సేవల పన్ను (Gూు) లాంటి ఫాసిస్టు పన్నులు చిన్న స్థాయి పరిశ్రమల, చిన్న వ్యాపార వర్గాల వెన్నెముకలను విరిచేశాయి. ఈ రోజు నయా ఉదారవాదం ప్రత్యక్షంగా రాజ్యయంత్రాంగ వ్యవస్థలన్నింటినీ ఫాసిజీకరిస్తూంది.

  1. Karal Marx : The Future of British Rule in India
    1. Radha Kamal Mukharjee : Land Problems in India, Quoted from A.R. Desai : Social Background of Indian Nationalism, P. 45
    2. A.R.Desai : Social Background of Indian Nationalism , P. 47
    3. Karal Marx : The Future of British Rule in India
    4. A.R.Desai : Social Background of Indian Nationalism, P. 64

Leave a Reply