ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని అంటారు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాయలసీమ సమస్యలు ఇప్పటికీ గుర్తుకు రాలేదు. ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వైసీపీగాని, అంతక ముందు ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలి, మళ్లీ అధికారం కావాలనుకుంటున్న టీడీపీగాని ఫలానా రాయలసీమ ఫలానా సమస్యను పరిష్కరిస్తామని నిర్దిష్టంగా మాట్లాడటం లేదు. రాయలసీమకు ఏ వాగ్దానమూ చేయకుండానే సీట్లు సంపాదించుకోవచ్చని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ అనుకుంటున్నాయి. ఉచితాలు, పింఛన్లు తప్ప రాయలసీమకు అతి ముఖ్యమైన నీటిపారుదల రంగం గురించి మాట్లాడటం లేదు. కరువుబారినపడి వేలాది గ్రామాలు వలస పోతున్న సీమ పల్లెల దుస్థితిని పట్టించుకోవడం లేదు. వానల మీద ఆధారపడిన సీమ వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధికి అవసరమైన సాగు నీటి విధానాన్ని ఏ పార్టీ ప్రకటించడం లేదు. కృష్ణా బేసిన్లో రాయలసీమకు చట్టబద్ధ హక్కుగా రావలసిన నీరు కేటాయించి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని నోరెత్తి అనడం లేదు. పదేళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం హామీలను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. వైసీపీ ఆ ఊసే ఎత్తలేదు.
దశాబ్దాలుగా అనేక విద్రోహాలకు పాల్పడిన ఈ పార్టీల గురించి చెప్పుకోడానికి ఒక తాజా ఉదాహరణ చాలు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విభజన చట్టం స్పూర్తికి వ్యతిరేకంగా అదే కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 6న ఒక చీకటి చట్టం తీసుకొచ్చింది. ఇది రాయలసీమయ నీటి హక్కులకు శాశ్వతంగా సమాధి కడుతుంది. 1980లలో మిగులు జలాల కోసం జరిగిన ఉద్యమం దగ్గరి నుంచి ఇప్పటి దాకా రాయలసీమ ప్రజలు పోరాడి సాధించుకున్న నీటి హక్కులను దెబ్బతీస్తుంది. రాజ్యాంగ వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఈ చట్టం మీద వైసీపీగాని, టీడీపీగాని ఒక్క మాట మాట్లాడలేదు. తమ మౌనం ద్వారా ఈ ద్రోహాన్ని ఈ పార్టీలు బలపరిచాయి.
అయితే బైటికి మాత్రం ఒకరిన్ని మించి ఒకరు పోటీ పడి సీమను తామే ఉద్ధరించామని ఈ పార్టీల నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే వీళ్లు రాయలసీమ మౌలిక సమస్యలు పరిష్కరించి ఉంటే ఏటా ప్రతి జిల్లా నుంచి వేలాది కుటుంబాలు వలస వెళ్లేవా? మెట్ట వ్యవసాయం చేసే రైతులూ, నికర జలాలు కేటాయించిన కాలువల కింద కూడా నీళ్లు ఎప్పుడు వచ్చేదీ తెలియక పంటలు సాగు చేసి అప్పులపాలవుతున్న రైతులూ ఏటా వందల మంది ఉరిబెట్టుకొనేవారా? ఉన్నత విద్యాసంస్థలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక లక్షలాది యువత ఆటోలు నడుపుకుంటూ, రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ, వలస వెళ్లి ఎండమావులకు వెతుక్కుంటూ బతికేవారా? గల్ఫ్ దేశాలకు బతుకుతెరువు కోసం వెళ్లి నానా అవమానాలు, ఇబ్బందులు పడేవాళ్లారా?
ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఈ ప్రాంతం వాళ్లే అయినా రాయలసీమ మౌలిక సమస్యలు తెలుసుకోవాలనే నిజాయితీ లేదు. వాళ్లకు అధికారమే తప్ప ప్రజలు పట్టలేదు. వ్యవసాయం, నీటిపారుదల, పారిశ్రామిక, విద్యా ఉద్యోగరంగాల్లో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సమస్యలు ఉంటాయనే అవగాహనే లేదు. ఉపాధి హామీ పథకం, పింఛన్లు, ఉచితాలు ఇస్తూ దశాబ్దాలుగా రాయలసీమకు ద్రోహం చేస్తూ వచ్చారు. రాయలసీమలోని నాయకులు ఈ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలవుతున్నారు. ఎంపీలువుతున్నారు. మంత్రి పదవులు చెలాయిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపద పోగేసుకుంటున్నారు. తమ చీకటి రాజ్యాలను సజావుగా నడుపుకుంటున్నారు. అంతేగాని వీళ్లలో ఎవ్వరికీ కనీస ప్రాంతీయ అభిమానం లేదు. ఓట్లు వేసిన జనం గురించి బాధ్యత లేదు. ఒక్క ఎమ్మెల్యేగాని, ఎంపీగాని తమ ప్రాంత సాగునీటి సమస్యను, వ్యవసాయ, పారిశ్రామిక సమస్యలను పరిష్కరించిన దాఖలా లేదు. కనీసం తాగు నీటి సమస్యను కూడా పరిష్కరించలేదు. తమ నియోజవర్గ పరిధిలో ఒక్క ఎకరాకు అదనంగా నీరు అందించిన ఉదాహరణ లేదు. వీళ్లే అటూ ఇటూ పార్టీలు మారి, కూటములుగా మారి మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు. అవతలి నాయకుల మీద దుమ్మెత్తిపోయడం తప్ప మేం ఫలానా ప్రాజెక్టు తీసుకొచ్చామని, కాలువ తవ్వించామని, కాలేజీ పెట్టించామని, తమ నియోజకవర్గంలో రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకోకుండా గిట్టుబాటు ధరలు ఇప్పించామని చెప్పుకొనే పని ఒక్కటి కూడా చేయలేదు.
విభజన చట్టం సెక్షన్-6 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని విషయంలో ‘‘విభిన్న ప్రత్యామ్నాయల అధ్యయనం కోసం నిపుణుల సంఘం’’ నియమించాల్సి ఉన్నది. దీన్ని గత పదేళ్లలో వంతులవారి రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ పాటించలేదు. వైసీపీ పాటించలేదు. అమరావతి రాజధాని అని ఒక పార్టీ, మూడు రాజధానులని మరో పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా కొట్లాడుకున్నాయి. తెలంగాణ వేరైపోయాక మిగిలిన పాత ఆంధ్రరాష్ట్రంలో ఇప్పటికైనా అమలు కావాల్సిన శ్రీబాగ్ ఒప్పందాన్ని పట్టించుకోలేదు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలనే రాయలసీమ ప్రజాభిప్రాయాన్ని తీసిపారేసి పదేళ్లుగా ఈ కార్పొరేట్, రియల్ ఎస్టేట్ నాటకాన్ని పోటీబడి ఆడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం న్యాయ రాజధాని అనే ఆశ చూపి మోసం చేసిందేగాని, అది కూడా ఆచరణలోకి రాలేదు.
విభజన చట్టం సెక్షన్-84 నుంచి 91 వరకు నీటిపారుదల అంశాలు ఉన్నాయి. వీటి ప్రకారం రాయలసీమకు రావాల్సిన హక్కులేవీ అమలు కాలేదు. 85- 7 (ఇ) లోని 11వ షెడ్యూల్ 10వ అంశం ప్రకారం రాయలసీమలోని హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేయాలి. రాష్ట్రంలో బోర విరుచుకొని తిరిగే చంద్రబాబుకు, జగన్‌కు ఢల్లీి వెళ్లే సరికి నడుములు వంగిపోతాయి. మోదీకి మోకరిల్లి, స్వ ప్రయోజనాలు నెరవేర్చుకొని వస్తారు. నోరు తెరిచి విభజన చట్టం హామీల గురించి కేంద్రంతో మాట్లాడే ధైర్యం లేదు. కృష్ణా నది నిర్వహణ బోర్డ్ నియమ, నిబంధనల ప్రకారం ఇప్పటికి అందుతున్న నీటికే ఎసరు పెట్టే పనికి కేంద్రం పూనుకున్నా వీళ్లు నోరు తెరవలేదు. ఇట్లాంటి మీకు ఓటు ఎందుకు వెయ్యాలి? అని సీమ ప్రజలు నిలదీయాలి. ఇప్పటికైనా మీరు విభజన చట్టం హామీల ప్రకారం రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించేందుకు ఏం చేస్తారు? ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఏం చేస్తారు? పారిశ్రామిక, విద్యారంగాల హామీలపై ఏం చేస్తారు? అని వైసీపీని అడగాలి. టీడీపీ కూటమిలోని పార్టీలనూ అడగాలి.
రాయలసీమలో దాదాపు 90 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి వుంది. అందులో కనీసం 20 లక్షల ఎకరాల సాగునీరు అందించగల ప్రాజెక్టులు కూడా లేవు. ఉన్న ప్రాజెక్టులకు కూడా సరిగా పంట కాలువలు లేవు. అసలు సీమకు కేటాయించిన నికర జలాలను నిలువ చేసుకొనే రిజర్వాయర్లు లేవు. కృష్ణా బేసిన్‌లోకి ఉప నదుల ద్వారా వచ్చే వరద వచ్చిన సంవత్సరాల్లో అయినా నీరు నిలుపుకోవడానికి క్యారీ ఓవర్ రిజర్వాయర్లు లేవు. దీంతో ఏటా సగటున 460 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీని వల్ల రాయలసీమకు కేటాయించిన నీటిలో 40 శాతం కూడా నీరు వినియోగంలోకి రావడం లేదు. ఎక్కడైనా ప్రజలందరికీ తాగునీరు, ఆ తర్వాత సాగు భూమిలో ప్రతి ఎకరాకు ఒక పంటకు సాగు నీరు అందాలి. ఇది కనీస ప్రజాస్వామిక సూత్రం. మానవీయ విలువ. సమాజ అభివృద్ధికి ఇది కనీస షరతు. కానీ రాజకీయ నాయకులు రాయలసీమ ప్రజలను కేవలం ఓటర్లుగా తప్ప మనుషులుగా గుర్తించరు. మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా మేం అభివృద్ధి చేశామంటే మేం అభివృద్ధి చేశామని తగాదా పడగలరు.
రాయలసీమ ప్రజలు తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల జీవితం కోసం, ఈ ప్రాంత హక్కుల కోసం గొంతెత్తాల్సిన సమయం ఇది. ఓట్లు కోసం మీ ఇంటికి వచ్చే, ఊరికి వచ్చే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఈ కింది డిమాండ్ల మీద ప్రశ్నించండి. ఈ సమస్యలను వాళ్ల పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఒత్తిడి తీసుకరండి. వీటి మీద ఎవరేం చేస్తారో హామీ ఇవ్వాని ఈ కింది డిమాండ్ల మీద నిలదీయండి.
- విభజన చట్టంలో హామీ ఇచ్చిన తెలుగు గంగ, గాలేరు-నగరి,హంద్రీ-నీవా ప్రాజెక్టుల యుద్ధప్రాతిపదికన పూర్తి జేయాలి.
- వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే బుందేల్ ఖండ్ తరహా ఆర్థిక ప్యాకేజీ రాయలసీమకు ఇవ్వాలి
- రాయలసీమలో చెరువుల నిర్మాణానికి, పాత చెరువుల పునరుద్ధరణకు, పెన్నా నది పునరుజ్జీవానికి నిధులు కేటాయించి నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తి చేయడానికి ఒక ఇరిగేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
- రాయలసీమకు కేటయించిన నిరక జలాలను వాడుకోడానికి తగినట్లు ప్రాజెక్టుల స్థిరీకరణ చర్యలు చేపట్టాలి.
- పట్టి సీమ ద్వారా ఆదా అయ్యే 80 టీఎంసీల కృష్ణా జలాలను నికర జలాలుగా రాయలసీమకు కేటాయించాలి
- రాజధాని లేదా హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలి. రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో 40 శాతం సీమకు కేటాయించాలి.
- కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి.
- సిద్ధేశ్వరం అలుగును నిర్మించాలి.
- ఏఐఎంఎస్(జాతీయ స్థాయి వైద్యాలయం)ను అనంతపురంలో ఏర్పాటు చేయాలి
- కడప ఉక్కు కర్మాగార నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి.
- జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
- గుంతకల్ లో రైల్వే జోన్ ఏర్పాటు జేయాలి.
- ఆల్మట్టి – బుక్కపట్నం లింకు కెనాల్ ఏర్పాటు చేయాలి
- తుంగభద్ర హై లెవల్ కెనాల్‌కు సమాంతర కాలువను ఏర్పాటు చేయాలి
- కాలువపల్లి- బిటిపి- కుందుర్పి కాలువను పూర్తి చేయాలి
- ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని చెరువులను పునరుద్ధరించాలి
- వరద వచ్చిన సంవత్సరాల్లో నీరు సముద్రంపాలు కాకుండా నిలువ చేసుకోడానికి క్యారీ ఓవర్ రిజర్వాయర్లు నిర్మించాలి
- కె సీ కెనాల్ స్థిరీకరణకు 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్ట్ ను వెంటనే నిర్మించాలి.
- కర్నూలు పశ్చిమ ప్రాంత కరువు నివారణకు వేదవతి ప్రాజెక్ట్‌ను, ఆర్డీఎస్ కుడి కాలువను వెంటనే చేపట్టాలి.
- దెబ్బతిన్న అలగనూరు ప్రాజెక్ట్‌ను వెంటనే పునరుద్ధరించాలి.
- పులికనుమ సామర్థ్యం పెంచాలి.
- వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టను పునరుద్ధరించాలి.
- చిత్తూరు జిల్లాకు ముఖ్యమైన గాలేరు నగరి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి.
- అనంతపురంలో లేపాక్షి నాలెడ్జి హబ్‌ను ఏర్పాటు చేయాలి.