1 రాజకీయ రాముడు
వేట చూపులతో
బోర విరుచుకొని
ధనస్సు బాణాలతో నడి బజార్లో నిలబడ్డ
రాముడి మెడలో
భయం దండ పడింది
అనుమాన భూతద్దాలు వచ్చాయి
కలాల్ని చూస్తే
గౌరీ లంకేష్ కనపడుతుంది
గలాల్నిచూస్తే
గోవిందు పన్సారే కల్బురిగి కనపడు తున్నారు
మంటలు గాలుల్ల కవులు రచయితలు కలిస్తే
పొట్టలు చీల్చిన తలలు తెగిన
నరికిన తొడల రక్తింద్రియాలు కారుతూ వచ్చిన
మండుతున్న అక్షరాలు మాట్లాడినట్టు అనిపిస్తుంది
నడిచి నడిచి వలస ఆకలి
కరోనా సాకై గంగలో
గుంపులు గుంపులుగా జలచరాలు తినగా మిగిలిన ప్రవాహ శవాలు అక్షరాలై
మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది
ఈశాన్య ఢిల్లీ వీధుల్లోంచి పారిన హిందూ ముస్లిం కలగలిసిన నెత్తుటి అక్షరాలు
గొంతు విప్పినట్టు అనిపిస్తుంది
దేశ సంపద కాపరైనందుకు తలలు శరీరాలు
చిధ్ర మైన హత్యలతో
హిందుత్వ కార్పోరేట్ ఖజానైతున్న
ఆదివాసీ అక్షరాలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది
భరతమాత నగ్న ఊరేగింపు హత్యాచారాలతో
తగలబడ్డ మణిపూర్ అక్షరాలు
గర్జిస్తున్నట్టు అనిపిస్తుంది
చెరువు స్నానం చేసి చావు దెబ్బలు తిన్న అక్షరం అమానుష హత్యాచారం
అర్ధరాత్రి ఆఖరి చూపు లేకుండై
పాడె మండిన హథ్రాస్ సగంకాలిన శవంవాసనాక్షరం
గుఱ్ఱమెక్కి తిరిగిన అక్షరం
మీసాలు పెంచిన అక్షరం
పరమ పవిత్ర శ్రోత్రీయ నేర ఆంబోతుల స్వేచ్ఛను సవాలు చేసిన అక్షరం
ఆఖ్లన్ అక్షరం మాట్లాడుతున్నట్టు
మూక దాడిలో మరణించి నెత్తురోడ్తున్న అక్షరాలు గుడ్లుర్మి మాట్లాడతున్నట్టు
జైల్లో నుంచి ఎగురొచ్చిన భీమా కోరేగావ్ గుండె సడలని అక్షరాలు
సంభాషిస్తున్నట్టు అనిపిస్తుంది
తెగిపడిన తలలాక్షరాలు బుల్డోజరై
తన మీదకు వస్తున్నట్లు అనిపిస్తోంది
పాప భీతితో
పుర్రెలు పులులై మీద పడ్తున్నట్టు
రాజకీయ రాముడు భయపడుతున్నాడు.
(సమూహ సభలో కవి మిత్రుల మీద దాడికి నిరసనగా)
2 కారడవి గర్భశోకం
వాళ్ళెవరో నాకు తెలియదు
మేఘం కట్టిన దుఃఖం నా కళ్ళల్లో
చలనం గడ్డకట్టిన నడక నా కాళ్ళల్లో
మనసంతా
వర్షం పడి తడిసి ముద్దముద్దైన నెత్తుటి బురద
ఎక్కడి బంధమో ఎన్నటి బంధమో
ఎంతకీ తెగని గాలి దారo
కావల్సినంత చిత్రహింసల కార్యశాల నడిపి
అంగాంగ విధ్వంస రచన చేసి
ఒక భీభత్స యుద్ధదృశ్యం చిత్రిస్తుంది ఒక తుపాకి
జల్ జంగల్ జమీన్ జండై ఎగిరి
చెట్టు దుఃఖాన్ని పువ్వు దుఃఖాన్ని
గుడిసె దుఃఖాన్ని చేతులారా తుడిచి
మనిషి మనిషంతా పచ్చని ఆకుల కలలు తొడిగి
అనేక జీవన పార్శ్వాల వెలిగించి
అరవై ఏళ్ళుగా
ఆగని నడక నేర్పారు అడవికి
మహావృక్షాల వేళ్ళు పొదిగిన సంపదకు
రెక్కలు కట్టాలని చూస్తున్న కళ్ళ ఎజెండాగా
మనుషుల ఆకలి మరణించే అడుగులు పెట్టారు
రాజుల కాలాన్ని దిగుమతి చేసుకుంటున్న
కార్పోరేటు బానిస రాజ్యం
నిచ్చెనమెట్ల బానిసత్వాన్ని ప్రేమిస్తుంది
ప్రశ్నలు
ప్రజాస్వామ్యం
పక్కల బల్లాలు
నెత్తురు ముద్దాడని కాలముండదేమో!
ఆదిమ సమాజ వేటల అనాగరిక నెత్తుటికేళి
అపాలనే ఆరాటం ఇవ్వాళ్టిదా -
ఎక్కడ ఆగింది ప్రవాహం
ఆకలి దోపిడి అణిచివేత దాని నాసిక్ త్రయంబకేశ్వరం
హంతకుడా!
గ్రీన్ హంతో సమాధానో ప్రహారో కగారో
ఇంకెంత కాలం వినాలి విన్న కథే!
అంతా
చిగుళ్ళు రాలిన దుఃఖం.
Related