అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా?  ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట  “భారత్ మాతాకు” జై,   “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత  మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది.

ఈ కుళ్ళు వ్యవస్థను  సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు.. స్కాం లు బయటపడినప్పుడల్లా గోల జేసి, ఆ రాచపుండుకు ఇంత మలాం రాసి, కొందరిని జైల్లో వేసినoత మాత్రానా మరలా అవి జరగకుoడా ఉంటాయా?  రెట్టింపు బలంతో ఆ రాచపుండు మరో అదానీ రూపంలో మరల ఉబికి వస్తుంది. తన విశ్వరూపం జూపుతుంది. రాజకీయనాయకులు గగ్గోలు పెడుతారు. మేధావులు తమ విశ్లేషణతో పత్రికల ముoచెత్తుతారు. ప్రచారా సాధనాలు మన చెవులు గింగురు మనేలా భిన్న స్వరాలను వినిపిస్తాయి. మధ్య, దిగువ మధ్యతరగతి తాము ఎల్ ఐసి, బ్యాంకుల లో, షేర్లలో దాచుకున్న డబ్బుల గురించి చింతాక్రాంతులవుతారు. సామాన్య జనానికివేమీ పట్టవు. రోజువారీ జీవన సమరం లో కింద మీదా పడుతుంటారు.

ఈ మధ్యలో రామభక్తులు ఇది విదేశీ కుట్ర అని, ఆదానీని, మోడీని శంకించడo దేశ ద్రోహమని, అలాంటి వారంతా చైనా ఏజెంట్లనీ ఊరు వాడ ఏకం జేస్తారు. కాలం గడుస్తూంది. మరల కొత్త స్కాం బయటపడేంత వరకు ఎన్నికల ప్రజాస్వామ్యం మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతుoది.

సబ్ టీక్ హై.

  అయినా అదానీ విషయంలో గతంలో జరగనిదీ, తెలియనిదీ కొత్తదేమీ జరగలేదు. 578షెల్ కంపెనీలు బెట్టి (అయినా డొల్ల ప్రజాస్వామ్యంలో డొల్ల  కంపెనీలు గాక  మరేముంటాయి? మన అమాయకత్వం గానీ  వాటి ద్వారా డబ్బు మారకంజేస్తూ లేని సంపదను సృష్టిస్తూ, అదానీ కంపెనీల వాస్తవిక విలువకన్నా 85%  ఎక్కువుగా జూపి  స్టేట్ బ్యాంకు(రూ.27 వేల  కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.7వేల కోట్లు)ఎల్ ఐ సి (రూ.36,474.78 కోట్లు)లాంటి సంస్థల నుండి వేలాది కోట్లు రుణాలు, షేర్లు పొందాడని  తద్వారా దేశ విదేశాలలో అనేక రంగాలలో, ప్రధాని మోడీ పరోక్ష సహాయం తో, పెట్టుబడులు పెట్టాడని హిండేర్ బర్గ్ స్పష్టంగా ఆధారాలతో నివేదిక బయట పెట్టారు. దాంతో ఒక వారం లోనే స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు రూ.5.6 లక్షల కోట్ల మార్కెట్ పెట్టుబడులను  నష్ట పోయింది. అదానీ తన సంపదలో ఒక్క సారిగా 5 వేల కోట్ల డాలర్ల మేర నష్టపోయి ప్రపంచ కుబేరుల ర్యాంకులలో మూడవ స్థానం నుండి 15 వ స్థానానికి  పడిపోయాడు. ప్చ్ ఎంత అప్రతిష్ట. ఆదానీని ఆదుకునేoదుకు దేశంలోని చాలా కార్పోరేట్ సంస్థలు, ముకేష్ అంబానీ, జిందాల్, సునీల్ మిట్టల్ లాంటి వారు ముoదు కొచ్చారంటే  ఒకే గూటి పక్షులు కదా!  క్లిష్ట సమయంలో  ఎలా ఏకమవుతాయో అర్థం జేసుకోవచ్చు.

పీడిత వర్గాలు ఏకం గావడం కష్టం గానీ, పీడక వర్గాలు తమ ముందున్న ముప్పును వెంటనే గ్రహించి వెనువెంటనే  ఏకమవుతాయి. అదానీ ఇంతవరకు దేశ సహజ సంపదలన్నిటిపై గుత్తాధిపత్యం సంపాదించాడు. వాటి వెనుక వున్న కుంభకోణాల్ని  వెలికి తీసినందుకు అతడు “ది వైర్” పత్రికపై వందకోట్ల పరువు నష్టం దావా వేసాడు. ఇక, పరంజరు గుహ థాకుర్తే, రవి నాయర్ లాంటి జర్నలిస్టులు అతని ఆగ్రహానికి గురయ్యారు.

అంతెందుకు , అంతో ఇంతో నిజాయితీగా వార్తలు ప్రచారం జేసే NDTV ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. నేడు ప్రసార సాధనాలన్నీ అధికార పార్టీల, కార్పోరెట్ల ప్రచార సాధనాలు  కాదు, నిజాన్ని మరుగున పరిచే వారి అస్త్ర శస్త్రాలు కూడా.

 గతంలో ఇలాంటి డొల్ల కంపెనీలు పెట్టిన వారెవరూ లేరా? అంతెందుకు,”దివంగత మహానేత”,నాటి ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుడు , నేటి యువనే(మే)త, ముఖ్యమంత్రి జగన్ నాడు చేసిందేమిటి? ఆదానీకి  మోదీ చేయూతనందించినట్టే  జగన్ కు ఆయన తండ్రి చేయూత నిచ్చాడు. అదానీ తో పోలిస్తే   జగన్ చేసింది సముద్రం లో నీటి బొట్టు లాంటిది. పాపం జగన్ కు నాడు అధికార పార్టీ అండదండలు లేవు. దాంతో కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆదానీకీ సాక్షాత్తు ప్రధాని, ”హిందూ హృదయ  సామ్రాట్” మోడీ మద్దతు వుంది.

 నిశితంగా పరిశీలిస్తే అదానీ ఆర్థిక రంగం , మోదీ రాజకీయ రంగ ఎదుగుదల  సమాంతరంగా కనిపిస్తాయి.    ఒక చాయ్ అమ్ముకునే కుర్రాడు ప్రధాన మంత్రి స్థాయికి ఎదగడం, ఒక గుమాస్తా ప్రపంచ కుబేరుల లో ఒకరుగా నిలవడం వెనుక గల వారి చాతుర్యాన్ని, అవకాశవాదాన్ని మెచ్చుకోవలసిందే. 2014 మోదీ ప్రధాని కావడంతో అదాని దశ తిరిగింది. ఆనాడు రూ.50.4 వేల కోట్లు వున్న అతని సంపద 2022 నాటికి రూ.10.30 లక్షల కోట్లకు పెరగడం మోదీ చలువ కాదనగలమా? క్విడ్ ప్రో క్యో , ఆశ్రిత పెట్టుబడి అంటే ఇదే కదా! మోదీ తరచూ ఒకే దేశం, ఒకే భాషా, ఒకే మతం తో పాటు ఒకే మార్కెట్ అనడం లో దేశ సంపదను మొత్తం అదానీ లాంటి కార్పోరెట్ల చేతుల్లో ఉంచడానికే.

హిందూత్వ-కార్పోరేట్ శక్తుల కలయిక మరెన్ని ఘోరాలకు  దారి తెస్తుందో?

ఆదానీకి మద్దతుగా, ముఖ్యంగా, సంఘ్ పరివార్  రంగంలోకి  దిగింది.  ఇదంతా భారత దేశం ఆర్థికంగా బలపడటం ఓర్వలేని చైనా లాంటి  దేశాల కుట్ర అని, ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీయడమేనని ప్రచారం మొదలెట్టింది. చైనా, ఇంకా ఇతరదేశాల లోని స్కాం లను హిండర్ బర్గ్ బయటపెట్టాడనే విషయం మాత్రం భక్తులు చెప్పరు. అదానీ తనను తాను భారతదేశ ప్రతీకగా చెప్పుకుంటూ,” భారత దేశ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యత, వృద్ధి కథనం, వడివడిగావేయాలన్న భారత్ ఆకాంక్షను చూసి ఓర్వలేక ఈ రకమైన దాడి చేస్తున్నారు” అని ఎదురు దాడికి దిగాడు. ఐటి,సెబి,ఆర్ బి ఐ లాంటి  సంస్థలు మౌనం పాటిస్తున్నాయి. మన కేంద్ర ఆర్థిక శాఖామంత్రి మాత్రం దానికి, ప్రభుత్వానికి సంబంధం   లేదని చెబుతారు. 

అదానీ షేర్ల విలువ పడిపోయినంత మాత్రాన ఎల్ ఐ సి , బ్యాంకుల కు నష్టం లేదనీ, లాభాలు తగ్గుతాయని సదరు సంస్థల అధికారులు ప్రకటన జేస్తారు. మోదీ ప్రస్తుతం మౌనం వహిస్తారు. ఏమీ జరగదని అతనికి తెలుసు. బోఫోర్స్ ను మించిన రాఫెల్ స్కాం అతన్ని ఏమీ చేయలేక పోయింది. న్యాయవ్యవస్తతో సహా అన్ని వ్యవస్థలు  కాషాయం తో నిండినపుడు మోదీకి తిరుగేముoది.

 పార్లమెంటులో  అల్లరి, స్తంభన.”త్వం శుంటా,త్వం శుంటా” అని ఒకరినొకరు తిట్టుకోవడం, షరా మామూలే. చివరకు ప్రజలకు  మిగిలేది డొల్లె.

 అయినా విత్తనం ఒకటి నాటితే ఫలం వేరే ఉంటుదని ఆశించడం అమాయకత్వం కాదా? స్వాతంత్రం కాలం నాటి నుండి పెట్టుబడిదారుల మద్దతుతో నడుస్తున్న పాలన ఎవరికి లబ్ది చేకురుస్తుందో  అర్థం జేసుకొనడానికి తాజాగా మనకు అదాని ఎపిసోడ్ కావాల్సి వచ్చింది. అంతే.

  అడవులను, గనులనూ తొవ్వుకొని అక్కడి ప్రజల నిర్వాసి తుల జేస్తూ , వారిపై  సైన్యాన్ని మొహరిస్తూ సహజవనరులను కార్పోరేట్లకు అప్పగిస్తున్నప్పుడు నోరిప్పని రాజకీయ పార్టీలు ఇప్పుడు రాజకీయ లబ్దికోసం నానా యాగీ జేయడం చూస్తుంటే వినోదంతో పాటు, దేశ పరిస్థితి జూసి విషాదం కలుగుతుoది. అంతెందుకు, ది సో కాల్డ్ మార్క్సి స్టులు కేరళలో( ప్రతిపక్షం లో వున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించి)  అధికారంలోకి రాగానే  మత్స్యకారుల ఆందోళనలను  అణచివేస్తూ, కమలనాథులతో చేతులు కలిపి  ఆదానీకి విజింజం నౌకాశ్రయం అప్పగించలేదా? అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలే గదా!

అదాని ఎపిసోడ్ కొంతకాలం మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టవచ్చు. కానీ, మోదీకి హిందూత్వ అనే బ్రహ్మాస్త్రం వుంది. ఇంకా అవసరమైతే ఎన్నికల ముందు పాకిస్తాన్, చైనా  భూతాలను బయటికి లాగుతాడు. ఇక దేశభక్తి తెప్పలుగా పారుతుంది. ఇప్పుడు దేశమంటే అదానీయేగా!  మేం చిన్నప్పుడు   దేశమంటే మనుషులోయ్  అని చదువుకున్నాం. ఆ తర్వాత దేశమంటే పీడిత ప్రజలు అని తెలుసుకున్నాం. బారువా లాంటి వారు ఇందిరా అంటే ఇండియా అని చెప్పగా విస్తుపోయాం. సరే, ఆమె దేశ ప్రధాన మంత్రికదా అని సరిపెట్టుకున్న వాళ్ళూ వున్నారు. ఇప్పుడు చివరకు ఇండియా అంటే అదానీ అని, అదానీ అంటే ఇండియా అని హిందూత్వ పాఠాలు   నేర్చుకొనే పరిస్థితికి చేరుకున్నాం. ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడిదారి వ్యవస్థ అనే బదులు,పెట్టుబడిదారి ఆశ్రిత రాజ్యం అనడం సరైందేమో? థాంక్స్ టు అదాని అండ్ మోదీ. 

Leave a Reply