ఎప్పుడైనా నేను గుర్తొస్తే
కన్నీళ్లు పెట్టుకోకండి
"కాలం చీకటి గర్భంలో నన్ను కంటుంది"
అన్న నా కవితలను ఒక్కసారి చదువుకోండి
అక్షర రూపంలో నేనెప్పుడూ
మీతో బతికే ఉంటాను
ఎప్పుడైనా నేను గుర్తొస్తే
మీ చుట్టూ ఉన్న జీవితాలు
అదే చరిత్రను దాచిన పుస్తకాలు చదవండి
మహిళల కోసం, ఆదివాసి హక్కుల కోసం
ప్రజా పోరాటాలను చేయండి
ఆ పోరాటంలో నేను
మీకు తోడుగా ఉంటాను
ఎప్పుడైనా నేను గుర్తొస్తే
నా బట్టల కింద ఉన్న డైరీలో
మీ కోసం రాసిన కవితలను
మరోసారి మీ గుండెలకు హత్తుకోండి
కాసేపు భారమైన బాధలను మర్చిపోతారు
ఎప్పుడైనా నేను గుర్తొస్తే
ఆకలి కోసం ఎదురుచూసే పిల్లలకు
అదే అనాధ అంటున్న నా పిల్లలకి
సిగ్నల్ వద్ద చేయి చాచి అడుక్కునే
నా అవ్వలకి పట్టెడన్నం పెట్టండి
వాళ్ళ ఆకలి మంటల్లో నేను ఒకడిని
ఎప్పుడైనా నేను గుర్తొస్తే
రాలుతున్న ఆ ఎర్రమందారాలను
ఒరిగిన అమరవీరుల స్థూపాల చుట్టూ పేర్చి
వాళ్ల చరిత్రను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి
ఆ ఎర్రమందరాలల్లో నేను
ఓ మందారాన్ని అవుతాను
Related