(ఇటీవల ఆపరేషన్ కగార్ మీద విరసం ప్రచురించిన *దేశం కార్పొరేట్లకు* అనే పుస్తకానికి రాసిన ముందు మాట )
ఒక యుద్ధ వ్యూహానికి అనేక పార్శ్వాలు వుండవచ్చు. ఒకసారి యుద్ధమంటే ఎదురు దాడి. మరోసారి యుద్ధమంటే ఆక్రమణ. ఈ ఆక్రమణ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వుండదు. దేశాల మధ్య యుద్ధం. దేశం లోపల యుద్ధం. దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు, ద్వైపాక్షిక సంబంధాలు కేంద్రంగా వుంటాయి. దేశ అంతర్గత యుద్ధానికి తన పౌరులనే శత్రువులుగా పరిగణించే రాజ్య స్వభావం వుంటుంది. భారతదేశంలో ఆదివాసీ సమూహం భారత రిపబ్లిక్కు శత్రువుయింది. ఎందుకిలా అయింది? ఈ ప్రశ్న మరీ పాతది. అయినా దీనికి కొత్త సమాధానం వెతకాలి. కేవలం ఆదివాసులపై దాడి జరుగుతున్నదా? ఆదివాసులతో మావోయిస్టులు
ఉన్నందుకు వాళ్లను ఒకే రీతిలో రాజ్యం అంచనా వేస్తున్నదా? అనే అభిప్రాయం దగ్గర కాస్త ఆగుదాం.
దండకారణ్యంలో ఆదివాసీ జీవన విధానం నాగరిక భారతదేశానికి అంతగా పరిచయం లేకపోవచ్చు. తమతో పాటు ఆదివాసులనే భారత పౌరులు ఉన్నారనే భావన సంపన్న, మధ్య తరగతి ఆలోచనాపరులలో లేదు. ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనారిటీల మధ్య వుండే మానసిక బంధం లాంటిది కూడా ఆదివాసుల విషయంలో లేదు. వాళ్లు తమ రక్త సంబంధీకులనే భావోద్వేగం మైదానవాసుల్లో లేదు. తమ జీవన విధానంతో భారతదేశ సహజ వనరులను కాపాడుతున్నారని, తద్వారా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నారనే అవగాహన లేదు. పర్యావరణ సమతుల్యతకు ఆదివాసీి జీవన విధానం ఒక కొనసాగింపు. శతాబ్దాల జీవన సంస్కృతి, సంప్రదాయాలు పాటించే ఆదివాసులు తమ జీవన విధానంతో భారత దేశ మౌలిక వనరులను కాపాడుకుంటూ వస్తున్నారు. అయినా ఆదివాసులు భారత సమాజానికి పరాయి.
ఇక్కడే అసలయిన సమస్య ఉంది. జీవన విధానంలో, సంస్కృతిలో ప్రజల మధ్య ఉన్న తేడా ఉండవచ్చు. కానీ భారత రాజ్య వ్యవస్థ తన తైనాతీలకు అటవీ సంపదను, సహజ వనరులను ధారాదత్తం చేయడం కోసం ఆదివాసులతో శత్రువైఖరి అవలంభిస్తున్నది. ఈ శత్రువైఖరి ఈనాటిది కాదు. అధికార మార్పిడికి ముందు నుంచే ఉన్నది. ఈ చరిత్ర ఎంత సుదీర్ఘమైనదో, ఆదివాసులపై ఆధిపత్యానికి అంతే కాలచరిత్ర వుంది. భారత రాజ్యం దాన్ని తీవ్రం చేసింది.
అయితే ఈ దేశ ఆదివాసులు నిరాయధులు కాదు. తమ మనుగడ కోసం సకల జీవరాశులతో ఘర్షణ పడుతున్నట్లే నాగరిక రాజ్యంతో యుద్ధం కొనసాగుతున్నది. తమ మనుగడ కోసం వాళ్లు చేస్తున్న పోరాటం భారత దేశ సామాజికావరణతో సన్నిహితమైనది. ఆదివాసీ పోరాటాలు మనుగడ కోసం మాత్రమేనా! వాళ్ల వెనుక మానవచరిత్ర, వికాసం ఆధారపడి వున్నాయి.
ఇప్పుడది మావోయిస్టు భావజాల సంబంధంలో కొనసాగుతున్నది. కాబట్టి దీన్ని బూచిగా చూపి తర్కిస్తే సమాధానం దొరకదు. మావోయిస్టు నిర్మూలన ఆదివాసీ నిర్మూలనగా మారే ప్రమాదం ఉన్నది. ఇంతకూ ఇదంతా ఎందుకు? మావోయిస్టు రహిత భారతదేశాన్ని రూపొందించుకోవడం కోసం తాజాగా ఆపరేషన్ కగార్ ఎందుకు ఆరంభమైంది?
ఆదివాసుల పెనుగులాట అస్తిత్వ పోరాటం నుంచి భారతదేశ మనుగడ పోరాటంగా మారింది. అందుకే ఆపరేషన్ కగార్ అనే యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరంభించింది. కగార్ అనే పదానికి అర్థం అంతిమ యుద్ధం. లేదా అంతిమ అస్త్రం. కగార్ అనే మాట హఠాత్తుగా ఊడిపడిన పదం కాదు. దీనికి ముందు అనేక యుద్ధ నామవాచకాలు వచ్చాయి. కాల ప్రవాహంలో కలిసిపోయాయి. రాజ్యం తాను ఎంచుకున్న దాడికి గ్రీన్‌హంట్ అని, హాకా అని, సమాధాన్ అని, ప్రహార్ అనే నామవాచకాలను చేర్చింది.
కగార్ వెనుక సహజ వనరుల దోపిడీ మాత్రమే లేదు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం వుంది. హిందుత్వ ఫాసిజం దేశంలో అమలవుతున్న తీరు గమనిస్తే కగార్ అమలవుతున్న తీరు అర్థమౌతుంది. ఆదివాసులను, మావోయిస్టులను నిర్మూలించే ఆలోచన వెనుక ఒక ప్యూహం వుంది. ఆదివాసులంటే ప్రతిఘటన సంప్రదాయానికి చెందినవారు. జీవన విధానాన్ని కలుషితం చేసుకోని సంస్కృతి వారిది. అక్కడ మత ఆధిపత్యం లేదా, మత ప్రవేశం తేలికయిన అంశం కాదు. అందుకే విధ్వంసీకరణ రూపం మారింది. కగార్ యుద్ధాన్ని తీసుకొచ్చారు. ఈ యుద్ధ వ్యూహం వెనుక ఆర్థికం, సంస్కృతి, పరాయికరణ అంశాలు ఇమిడి ఉన్నాయి.
రెండేళ్ల కాల వ్యవధిలో ఆదివాసీ ప్రాంతాల్లో ఇండ్లపై, పొలాలపై డ్రోన్లతో వైమానిక దాడులు జరిగాయి. వాటికి సమయం లేదు. ఆ దాడుల సంఖ్యకు అంతులేదు. ఏ క్షణమైనా వైమానిక దాడి జరగవచ్చు అనే ఆందోళన ఆదివాసీి ప్రాంతాల్లో వుంది. రాజ్యం ఇంతటి భయభ్రాంతులకు గురి చేయడం వెనుక ఒకనాటి మన్మోహన్సింగ్ అయినా, నేటి నరేంద్ర మోదీ అయినా ఒకటే లక్ష్యం. అడివిని కార్పొరేటీకరించడం. దేశాన్నంతా కార్పొరేట్లకు ఇచ్చేయడం. ఇప్పుడు బ్రాహ్మణీయ హిందుత్వ ఇంకొక అదనపు అంశం. ఫాసిజం హిందుత్వగా, కార్పొరేటీకరణగా వచ్చింది. ఇది ఆదివాసీ సంస్కృతిని, మావోయిస్టు భావజాలాన్ని ధ్వంసం చేయడం మాత్రమే కాదు. భారత దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంతరాలను నిర్మూలించే ప్రజాస్వామిక సూత్రమే నిర్మూలించబడుతోంది.
దీన్ని ఆదివాసులు తమ శక్తిమేరకు ప్రతిఘటిస్తున్నారు. వాళ్లు అంతిమ యుద్ధానికి సిద్ధమయ్యారు. సాయుధ పోరాట పంథాలో మనుషుల ప్రాణాలు కేవలం సంఖ్య మాత్రమే కాదు. సంఖ్య దగ్గర ఆగితే పోరాట రూపం వెనుక వున్న లక్ష్యం అర్థం చేసుకోడానికి పరిమితి ఏర్పడుతుంది. దీర్ఘ కాలిక విప్లవ పోరాటంలో కచ్చితంగా అమరత్వముంటుంది. ప్రగతిశీల ఆలోచనాపరులు కూడా ఈ అమరత్వాన్ని గుర్తించలేక దూరం జరుగుతున్నారు. ఒకనాటి ఆదర్శ సమాజం కార్పొరేటీకరణ అందిస్తున్న సుఖలాలసలో ఊగిసలాడుతోంది. బుద్ధిజీవి ఆందోళనజీవిగా ఉండటమే సమస్యగా మారింది.
ఈ పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి కగార్ చిట్టచివరి యుద్ధమని రాజ్యం భావిస్తున్నది. ప్రజల మౌలిక అవసరాలను, భారత సమాజ అంతరాలను, దోపిడీని కగార్ సైనిక చర్యలు పరిష్కరించజాలవు. ఇది చరిత్రలో నిరూపితమైంది. ఈ పదేళ్ల సంఫ్‌ుపరివార్ పాలన సైనికీకరణతోపాటు భారత దేశ ముఖచిత్రంపై కాషాయ రంగు రుద్దింది. దూరదర్శన్లోగోను కాషాయ రంగులోకి మార్చడం ఒక చిన్న విషయమే. సకల సృజనాత్మక రంగాలను కాషాయికరించే యత్నాలు చేస్తుంది. చిన్నవీ, పెద్దవీ కలిపి ఒక యుద్ధ వ్యూహం తయారు చేసింది.
ఆదివాసులు, మావోయిస్టులు, దేశమంతా ఉన్న సాధారణ ప్రజలు ఈ యుద్ధ వ్యూహంలో ప్రభుత్వానికి అవతలి పక్షం. ఒక చోట ఆయుధ ఘర్షణ. మరొక చోట భావజాల ఘర్షణ. నిత్యం మతాల సంఘర్షణ. ఇందులో ప్రజలను రాజ్యం దేశ ద్రోహులుగా, అంతర్గత ప్రమాదకారులగా గుర్తిస్తున్నది.
ఆపరేషన్ కగార్ ఆదివాసులుపై ప్రయోగిస్తున్న మానసిక, సైనిక యుద్ధతంత్రం. ఈ భావజాల యుద్ధతంత్రాన్ని అర్థం చేసుకునే పరికరాలు మన దగ్గర వున్నాయా? అనే అన్వేషణే ఈ పుస్తకంలోని వ్యాసాలు. కగార్ పేరుతో మొదలైన గత నాలుగు నెలల యుద్ధాన్ని ఈ రచనలు వివరించాయి. ఈ యుద్ధ వ్యూహం వెనుక ఉన్న రాజకీయార్థిక సైనిక సాంస్కృతిక ఫాసిస్టు లక్ష్యాలను విశ్లేషించాయి. కగార్‌ను ఆదివాసుల సమస్యగానో, మావోయిస్టుల మీది యుద్ధంగానో చూడరాదనే విశాల అవగాహనను ఈ వ్యాసాలు అందిస్తాయి.
ఈ అవగాహన ఎందుకు అవసరం అంటే, తాజాగా ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ముస్లింలను, వామపక్ష విప్లవ భావజాలాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఓట్ల విషయంలో కాంగ్రెస్‌ను ఉద్దేశించినా ఆయన అసలు లక్ష్యం ముస్లింలు, మావోయిస్టులు. అర్బన్ మావోయిస్టుల రూపంలో ముస్లింలకు సంపదను ధారాదత్తం చేస్తారు అనే విద్వేష ప్రకటనకు తెరలేపాడు. రాజ్యాంగపరిధిలో పని చేయాల్సిన ఒక వ్యక్తి రెచ్చగొడుతున్న విద్వేషం ఇది. హిందూ ఆడపడుచుల మంగళ సూత్రాలను లాక్కుని ముస్లింలకు పంచుతారు అనే మాట వెనుక ప్రమాదకరమైన ఉద్దేశం ఉంది. హిందువులకు మిగతా మతాలతో వున్న ప్రేమ పూర్వక సంబంధాలను ధ్వంసం చేసి ఎన్నికల్లో గెలవడమే ఆయన లక్ష్యం. ఆయన అర్బన్ మావోయిస్టుల పదాన్ని ఈ ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడుతున్నాడు. హోం మంత్రి అమిత్‌షా ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని ఈ ఎన్నికల సందర్భంగానే అంటున్నాడు. మావోయిజాన్ని సమస్యగా చూపదల్చుకున్నాడు. ఆయన ఎంత మందినైనా చంపవచ్చు. కానీ మావోయిజం సమస్య ఎంత మాత్రం కాదు.. పరిష్కారం అనే అభిప్రాయాన్ని ప్రజల్లోంచి తీసేయలేడు.
మోదీ పదేళ్ల పాలనలో దండకారణ్యం ఏ విధ్వంసీకరణకు గురైందో మైదాన ప్రాంత అట్టడుగు వర్గాల ప్రజలూ అంతటి క్షోభను అనుభవించారు. కగార్ రూపంలో అది కోట్లాది ప్రజల ఆకాంక్షలను విధ్వంసం చేయబోతున్నది. ఈ యుద్ధవ్యూహం మొత్తంగా భారత సమాజంపై అమలవుతుంది. బ్రాహ్మణీయ హిందుత్వ రూపంలో అమలవుతున్నది. తన ప్రజల పట్ల పాలకులు ద్వేషం పెంచుకొని, యుద్ధం చేయడం ఈ ఫాసిస్టు పరిణామం. దీన్ని వివరించడానికి ఈ వ్యాసాలు ప్రయత్నిస్తాయి. ఇవి ఇప్పటికే వివిధ పత్రికల్లో అచ్చయినవే. అయినా ఒక చోట చదువుకుంటే ఆపరేషన్ కగార్‌ను బ్రాహ్మణీయ హిందుత్వ కార్పొరేట్ ఫాసిజంలో భాగంగా విశ్లేషించుకోవచ్చు. ఫాసిస్టు యుద్ధ ప్రమాదాన్ని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంలో. తప్పక చదవండి. చర్చించండి..