దేశభక్తి గల ఒక ఎన్‌ఆర్‌ఐ బంధువు స్టాలిన్‌ గురించి సులభంగా అర్థమయ్యే పద్ధతిలో నానుంచి జవాబు ఆశించాడు. స్టాలిన్‌ నాయకత్వమూ, రెండవ ప్రపంచయుద్ధంలో రెండుకోట్లమంది రష్యన్‌ ప్రజల ప్రాణత్యాగాలే లేకపోతే పాశ్చాత్యదేశాల  సోకాల్డ్‌  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఫాసిజం నుంచి బతికి బయటపడేది కాదని జవాబిచ్చాను.

స్టాలిన్‌ నాయకత్వం అన్నపుడు – అందులో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌పార్టీ మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి శ్రామికవర్గ విప్లవాన్ని విజయవంతం చేసిన చరిత్ర ఉన్నది. ఆ విప్లవ విజయకాలం నుంచి (అక్టోబర్‌ 1917) విప్లవంలోనూ, ఆ తర్వాతకాలంలో లెనిన్‌ నాయకత్వంలో 1923 దాకా సోషలిస్టు నిర్మాణాలకు వచ్చిన అవరోధాలను పరిష్కరించిన చరిత్ర ఉంది. అక్కడినుంచి రెండవ ప్రపంచయుద్ధం దాకా రష్యాలో శ్రామికవర్గ నియంతృత్వంలో సోషలిస్టు నిర్మాణాన్ని సాధ్యంచేసిన చరిత్ర ఉంది. ఈ కాలమంతా సోషలిజం నిర్మాణంలోను, బోల్షివిక్‌ విప్లవం మొదలు రెండవ ప్రపంచయుద్ధందాకా  తమకోసమే కాదు ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలకోసం, కార్మికవర్గం కోసం, ప్రజాస్వామ్యం కోసం రష్యన్‌ ప్రజలు ముందుండి చేయవలసిన పోరాటాల త్యాగాల చరిత్ర ఉంది.

రెండవ ప్రపంచయుద్ధం సందర్భం తీసుకుంటే ఆ యుద్ధంలో పాల్గొనవలసిన తక్షణ అవసరమూ ప్రమాదమూ  రష్యాకు గానీ, రష్యా కార్మికవర్గానికి గానీ కార్మికవర్గ పార్టీ సోవియెట్‌  కమ్యూనిస్టుపార్టీకి గానీ ఆ పార్టీ కార్యదర్శి, దేశప్రధాని స్టాలిన్‌కు గానీ ఏమాత్రం లేదు. యూరపునంతా ఆక్రమించుకునే క్రమంలో  ఫిన్లాండును ఆక్రమించుకున్న జర్మనీ నాజీ నియంత హిట్లర్‌తో స్టాలిన్‌ ఎంతో ముందుచూపుతో నిర్యుద్ధసంధి చేసుకున్నాడు. రష్యాను కాపాడుకోవడానికి హిట్లర్‌ను నిలవరించి ఓడించలేని  స్థితిలో ఏమీ లేదు రష్యా రక్షణవ్యవస్థ. తర్వాత చరిత్రలో 1945 నాటికి తూర్పుయూరోప్‌ దేశాలనన్నిటిలో  హిట్లర్‌ నాజీసైన్యాలను ఓడిస్తూ  1945 నాటికి బెర్లిన్‌ను హస్తగతం చేసుకొని తూర్పు యూరపు దేశాలన్నింట్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన చరిత్ర స్టాలిన్‌ నాయకత్వంలోని ఎర్రసైన్యానికున్నదని ఇపుడు కొత్తగా చెప్పనక్కరలేదు. రష్యాలో సోషలిస్టు నిర్మాణానికి తానుగా యుద్ధంలో  దిగకుండా సమయాన్ని ప్రోదిచేసుకునే వ్యూహమే నిర్యుద్ధసంధి.  సోషలిజం నిర్మాణానికి అడ్డురాకుండా ఉండే నిర్యుద్ధసంధి చేసుకున్న స్టాలినే సామ్రాజ్యవాద దేశాల సోకాల్డ్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆ దేశాధినాయకుల అభ్యర్ధనపై, ప్రజల ఆకాంక్ష పై తాను స్వయంగా రెండవ ప్రపంచయుద్ధ  సైనికాధిపత్యాన్ని చేపట్టాడు.  స్టాలిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన చైతన్యంతో కోట్లాదిమంది రష్యన్‌  సామాన్యప్రజలు  ఎర్రసైన్యంలో  చేరి ప్రాణత్యాగాలు చేసారు.  పార్లమెంటరీ ప్రభుత్వాలుగా సాగిస్తున్న సామ్రాజ్యవాదం పట్ల ఏమాత్రం భ్రమలు లేకుండా  ఆయాదేశాల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల సంఫీుభావంతో రష్యన్‌ ప్రజలు యుద్ధానికి, త్యాగాలకు సంసిద్ధమయ్యారు.

అంతకన్నా ఈ సామ్రాజ్యవాద వలసలుగా ఉన్న మూడోప్రపంచ దేశాల వలసవిముక్తి పోరాటాల విజయాన్ని ఆశించి ఈ యుద్ధంలో దిగారు అందుకే సోవియట్‌రష్యా యుద్ధంలో దిగిన తర్వాత అది ప్రజాయుద్ధ స్వభావాన్ని సంతరించుకున్నది. ఇంత దృఢమైన స్థిరమైన నాయకత్వం సోవియెట్‌రష్యా ఆంతరంగికంగా సోషలిస్టు నిర్మాణం చేయడం వల్ల సాధ్యమైంది.  సోషలిస్టు నిర్మాణాన్ని చుట్టూ పొంచి ఉన్న సామ్రాజ్యవాద దేశాల దాడినుంచి కాపాడుకోవడానికి నిర్మాణం చేసుకున్న ఎర్రసైన్యం వల్ల సాధ్యమైంది.

అప్పటికి రవి అస్తమించని రాజ్యంగా  బ్రిటన్‌ ప్రపంచవ్యాప్తంగా వలసలతో బలమైన సామ్రాజ్యవాదదేశంగా ఉన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ వేనోళ్ల  పొగిడి యుద్ధం తర్వాత ప్రపంచ శాంతిదూత గానూ,  సాహిత్యవేత్త గానూ రెండు నోబెల్‌ బహుమతులు యిచ్చుకున్న చర్చిల్‌ ఆ దేశప్రధానిగా ఉన్నాడు. నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడుగా  గెలిచిన రూజ్వెల్ట్‌   అమెరికా అధ్యక్షుడుగా ఉన్నాడు. వలసదేశాల ప్రజలు, ముఖ్యంగా ఒక ఫకీర్‌ (గాంధీ) నాయకత్వంలోని భారతీయులు తమను తాము పాలించుకోలేరని, కనుక ఆ దేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ప్రసక్తే లేదన్నవాడు చర్చిల్‌.  అమెరికాలో రెడ్‌ ఇండియన్లు అపాచీలు వంటి శ్వేతజాతేతర  నేటివ్‌ల (స్థానికుల) నిర్మూలన చేయడానికి  ‘రెడ్‌హంట్‌’ ప్రణాళిక రచించిన రూజ్వెల్ట్‌ మనదేశంలో 2009లో గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ చేపట్టిన దళారీ ప్రభుత్వ వ్యూహానికి మూలపురుషుడని రాసాడు బి.డి.శర్మ. ఇంత సమర్థులనిపించుకున్న పాలకులెవరూ రెండవ ప్రపంచయుద్ధానికి ముందు 1930లలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థికమాంద్యాన్ని అరికట్టలేకపోయారు. ఆ రోజుల్లో మనదేశంలో కూడ ఉన్న ప్రచారం ఏమంటే కొనుగోలుశక్తి గల వాళ్లయినా సంచుల్లో డబ్బులు తీసుకొని వెళ్లి జేబుల్లో వస్తువులు తెచ్చుకునే వాళ్లని.  హాన్‌సూయన్‌ అనే అమెరికాలో స్థిరపడిన చైనీస్‌ రచయిత్రి ‘బర్డ్‌లెస్‌ సమ్మర్‌’ అనే తన నవలలో హాంకాంగ్‌ ఓడరేవులో దిగిన ప్రయాణీకులు నగర మార్కెట్లోకి వెళ్లి చేసిన కొనుగోళ్ల గురించి ఇటువంటి విషయాల్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రించింది.

మనదేశంలో బెంగాల్‌ కరువుగా, ధాత కరువుగా చెప్పుకున్న రోజులు అవే. అవిభక్త కమ్యూనిస్టుపార్టీ  అప్పటి ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌, ఇప్టా వంటి సాహిత్య, కళా, సాంస్కృతిక సంస్థలు ముప్పైలక్షల మందికి పైగా చనిపోయిన ఈ కరువు ప్రకృతిసిద్ధమైనది కాదు, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వలసపాలక దోపిడీ అణచివేతల ఫలితమేనని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి కరువు వ్యతిరేక పోరాటాలనెన్నిటినో నిర్మించాయి.

అటువంటి గడ్డుకాలంలో ఆర్థికమాంద్యం లేకుండా స్థిరమైన ధరల స్థిరీకరణ, ప్రతిఒక్కరికీ పని, కూడు గూడు వస్త్రం గ్యారంటీ చేసి వృద్ధుల, శిశువుల, అనారోగ్యవంతుల పోషణభారాన్ని తీసుకున్నది సోవియట్‌ ప్రభుత్వం. ఒక్క సోవియట్‌ రష్యాకే అది సోషలిస్టు నిర్మాణం వల్ల సాధ్యమైంది.

ఆనాడు అత్యంత శక్తివంతమైన బ్రిటన్‌లో ఆర్థికమాంద్యాన్ని అరికట్టలేని చర్చిల్‌ ఒక నాటక ప్రదర్శనలో బెర్నార్డ్‌షా కలిస్తే –  ‘మిమ్ములను చూస్తే దేశంలో ఆకలి ఉన్నదని అర్థమవుతున్నద’ని అన్నాడట.  బెర్నార్డ్‌షా ‘మిమ్ములను చూస్తే ఎందుకు ఉన్నదో కూడ అర్థమవుతున్నది’ అన్నాడట. బెర్నార్డ్‌షా ప్లెబియన్‌ సోషలిస్టు  అని అతని  నాటకాలు, రచనలు చదివినవాళ్లకు తెలుసు. ‘ఎన్నికలు పాలకుల చిరునామాలు మారుస్తాయి. విప్లవం మాత్రమే పాలకులను మారుస్తుంది’ అన్నాడాయన.

యూరపులో జాతిభావన పెట్టుబడిదారీ విధానం నుంచి వచ్చింది. ఇంచుమించు యూరపులోని దేశాలన్నీ మొదటి ప్రపంచయుద్ధ కాలానికే జాతుల దేశాలుగా ఏర్పడినవి. అది జర్మనీలో హిట్లర్‌ కాలానికి జాతీయోన్మాదానికి దారితీసింది. నేషనల్‌  సోషలిజం వాగ్దానంతో ఎన్నికలు గెలిచి క్రమంగా జర్మన్‌ జాతి మాత్రమే పవిత్రమైన, పాలించగల జాతి యని,  ప్రపంచాన్ని జయించాలనే యుద్ధకాంక్షతో  పార్లమెంటును తగులబెట్టి  ఆ నెపం కమ్యూనిస్టుల మీద పెట్టి నియంతగా మారాడు. ఫ్రాన్సు, ఇంగ్లండు ముందు గెలిచి యూరోప్‌నంతా ఆక్రమించుకోవాలనే వ్యూహంతో జర్మనీలో ఉధృతంగా యుద్ధపరిశ్రమలు నెలకొల్పడానికి పెట్టుబడిదారులకు అండగా  నిలిచాడు.  రెండవ ప్రపంచయుద్ధ ఆరంభకాలానికి హిట్లర్‌ ప్రాపకంతో  రెండు గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థల ప్రాబల్యం పెరిగింది. మోడీ ప్రాపకంలో గత ఎనిమిదేళ్లకాలంలో అంబానీ, అదానీల ప్రాబల్యం వంటిదే అది. అయితే గుణాత్మకంగా  ఈ పాలకుడు,  ఈ పరిశ్రమలు ఎంత జి`20 అధ్యక్షుడు, బడా కంపెనీలైనా సామ్రాజ్యవాద ప్రపంచంలో నిర్వహించగలిగేది దళారీ పాత్ర మాత్రమే. సామ్రాజ్యవాద మార్కెటుకు దోచిపెట్టే క్రమంలో పెరిగినవాడు, పెరిగినవే తప్ప వీళ్లది బలం కాదు, వాపు.  ప్రజల బలం ముందు చూసినపుడు, ప్రజాశక్తి  బలం ముందు చూసినపుడు సామ్రాజ్యవాదమే  కాగితం పులి అన్నాడు మావో. అంతకన్నా చాలముందే అది మరణశయ్యపై ఉన్న దశలో ఉందన్నాడు లెనిన్‌. ఆ ఎరుకతో ఆ సోషలిస్టు నిర్మాణ నేపథ్యంలో తన వెనుక కార్మికవర్గ, ఎర్రసైన్య బలంతో యుద్ధంలో దిగాడు స్టాలిన్‌.

ఆ ఎరుకకు తోడు లెనిన్‌, స్టాలిన్‌ రష్యాలో ఉన్న జాతులసమస్యను పరిష్కరించారు. యూరపులోని  దేశాలవలె కాకుండా రష్యా ఇండియావలెనే  బహుళజాతుల దేశం. అది పెట్టుబడిదారీ వ్యవస్థకు జార్‌ చక్రవర్తి కాలంలో బలహీనమైన అతుకుగా ఉన్నది విప్లవకాలంలో  అన్నాడు లెనిన్‌. కనుక ఆ బలహీనగొలుసును తెగగొట్టడానిక కార్మికవర్గ నాయకత్వంలో జాతులు కలసిరావాలని విజ్ఞప్తి  చేసాడు. జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తిస్తూనే  గౌరవిస్తూనే ఉమ్మడి శత్రువును ఓడిరచడానికి కలిసివస్తే ఆ తర్వాత సోషలిస్టు నిర్మాణంలో పాల్గొనే స్వయంనిర్ణయాధికారం వారికుంటుందన్నాడు. విప్లవం విజయవంతం కాగానే విప్లవ భూసంస్కరణల తీర్మానంతో పాటు స్త్రీల విడాకులహక్కును గుర్తిస్తూ  స్త్రీ పురుషులు వివాహంతో కలిసి ఉండడం, విడిపోవడం ఎట్లా  వారి వారి స్వయంనిర్ణయాల మీద ఆధారపడడాన్ని ప్రభుత్వం ఎట్లా గుర్తించి గౌరవిస్తుందో జాతుల విషయం కూడ అంతేనన్నాడు. స్టాలిన్‌ జీవించి ఉన్న కాలమే కాదు సోషలిస్టు  నిర్మాణ ఫలాల వల్ల 91లో నామమాత్రమైన సోవియట్‌ రష్యా విచ్ఛిన్నం దాకా కూడ రష్యాలో జాతులసమస్య తలఎత్తలేదు.

లెనిన్‌ మరణించిన సందర్భంలోనే మనకాలపు మార్క్సిజాన్ని స్టాలిన్‌ మార్క్సిజం` లెనినిజంగా విశ్లేషించి నిర్వచించాడు. ఆ క్రమంలో ఆయన చాలముందుకు తీసుకపోయి విస్తరించి వ్యాఖ్యానించింది జాతుల సమస్యనే. జాతుల సమాఖ్యలోని స్వచ్ఛంద ఐక్యత బీటలువారిందనడానికి సంకేతంగానే 91లో ఎర్రజెండాను, సుత్తీకొడవలిని చివరకు మార్క్స్‌, లెనిన్‌ విగ్రహాలను  కూడ రష్యన్‌ ప్రజలు నిరాకరించారు. 1956లో కృశ్చెవ్‌తో మొదలై  గ్లాస్‌నాస్త్‌, పెరిస్ట్రోయికాలతో  రివిజనిజం – సోషల్‌ సామ్రాజ్యవాద పరిణామఘట్టం – సామ్రాజ్యవాద శిబిరంలో పూర్తిగా షరీకయిన సందర్భం అది. జాతుల స్వయంనిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, వాటికి పూర్తి స్వేచ్ఛనిస్తూ సోవియెట్‌  సోషలిస్టు యూనియన్‌లో కొనసాగించగలగడం కమ్యూనిస్టుల బోల్షివిక్‌ స్పిరిట్‌కే సాధ్యమవుతుందని లెనిన్‌ మరణించినాక మూడు దశాబ్దాల పాటు కమ్యూనిస్టు నాయకత్వంలో చేసిచూపాడు స్టాలిన్‌.  ఒక్కసారి ఈ సందర్భాన్ని బ్రిటిష్‌ ఇండియాలోను,  వలసపాలనాంతర ఇండియాలోనూ జాతుల బందిఖానాగా ఉన్న మనదేశంతో  పోల్చుకుంటే  బోల్షివిక్‌పార్టీ, స్టాలిన్‌ల నాయకత్వం ప్రదర్శించిన స్వేచ్ఛాపూరిత  ప్రజాస్వామిక ఆచరణ అర్థమవుతుంది.

రెండవప్రపంచ సందర్భంలో స్టాలిన్‌పాత్ర గురించి మళ్లీ మరొక కోణంలో ప్రస్తావించేముందు ఆయన నాయకత్వంలో విప్లవ విజయానంతరం, దాదాపు ఇరవయ్యేళ్ల తర్వాత లెనిన్‌ మరణం తర్వాత 13 ఏళ్లకు కూడ ప్రపంచవ్యాప్తంగా  స్టాలిన్‌ నాయకత్వంలో బోల్షివిక్‌పార్టీ స్ఫూర్తి  ప్రజాస్వామ్యశక్తుల మీద ఎంతబలంగా ఉందో స్పానిష్‌ అంతర్యుద్ధకాలంలో చూద్దాం.  ఫాసిజం ప్రమాదాన్ని పసిగట్టి యుద్ధంలో దానితో తలపడడానికన్న ముందే కమ్యూనిస్టులకు ఆ సవాల్‌ స్పెయిన్‌లో  ఫ్రాంకో నియంతృత్వం రూపంలో వచ్చింది.  ఈ సందర్భంలో మనం మరచిపోకూడని విషయమేమంటే ప్రపంచానికి  (పార్లమెంటరీ) ప్రజాస్వామ్యం అనే  చైతన్యాన్ని యిచ్చింది తామే అని సాధారణంగా యూరోపియన్లు, అందులో ఇంగ్లిషు, ఫ్రెంచి జాతులు భావిస్తాయి. ఈ రెండుదేశాలు విప్లవ భావాలకు పుట్టినిళ్లని కూడ విడిగా చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో యూరోపియన్‌ బుద్ధిజీవులు, ముఖ్యంగా ఇంగ్లిషు, ఫ్రెంచి బుద్ధిజీవులు వాల్టేర్‌ మాటల్లో చెప్పాలంటే ఎదుటివారి భావప్రకటన స్వేచ్ఛకొరకు తమ ప్రాణాలనయినా బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అటువంటి నేపథ్యంలో స్పెయిన్‌లో 1936లో పార్లమెంటుకు ఎన్నికయిన స్పాన్‌యార్డుల చేతికి అధికారం ఇవ్వడానికి ఫ్రాంకో నిరాకరించాడు. ఎన్నికయిన పార్లమెంటేరియన్లు (స్పాన్‌యార్డులు) అందరూ తమ ప్రజాస్వామికహక్కును సాధించుకోవడానికి  సాయుధులయ్యారు. వాళ్లకు మద్దతుగా వాళ్లతో కలిసి పోరాడడానికి, ప్రపంచవ్యాప్తంగా రచయితలు, కళాకారులు, కవులు, మేధావులు ఒక అంతర్జాతీయ బ్రిగేడ్‌ను ఏర్పాటుచేసారు. స్పెయిన్‌ సరేసరి.  లోర్కా వంటి కవి, నాటకకర్త ఈ అంతర్యుద్ధంలో అమరుడయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లండు, ఫ్రాన్సు నుంచి పాల్గొన్నవాళ్లు అందరికందరు తమ ముప్పై ఏళ్ల యవ్వనంలో ఉన్నారు. వాళ్లంతా అప్పటికే ప్రపంచంలో ప్రసిద్ధులైన మార్క్సిస్టు కవులు, కళారులు, తత్వవేత్తలు, రచయితలు, కమ్యూనిస్టులు ` స్పెయిన్‌ వంటి నియంతృత్వపాలనలోనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి సాయుధులయ్యారు.

ఇప్పటికీ  విప్లవంలో తమ నవయవ్వన, కౌమారప్రాయంలోనే  సాయుధులై  పోరాడేవాళ్లు విప్లవంలో అమరులయినపుడు బుద్ధిజీవుల గురించి ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ చర్చ చేసే వాళ్లెవరూ చరిత్రలో ఈ సందర్భాన్ని ప్రస్తావించరు. ఈ త్యాగం కార్మికవర్గరాజ్యం కొరకు కూడ కాదు. కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం. ఒక నియంతృత్వం స్థానంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికైనా,  ఈ చర్చ తేవడానికి కమ్యూనిస్టు బుద్ధిజీవులు,  మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంత ముందు ఉంటారో, ఉన్నారో అనడానికి ఇది ఎప్పుడూ గుర్తుచేసుకోవాల్సిన ఉదాహరణ. హోవార్డ్‌ఫాస్ట్‌ వంటి అద్భుతమైన రచయిత కమ్యూనిస్టుపార్టీని  వదిలిన నాడయినా ‘గాడ్‌ దట్‌ ఫెయిల్డ్‌’ ` విఫలమైన దైవం) అని దానిపట్ల తన ఆరాధనాభావం దాచుకోలేదు. గడ్డివేళ్లస్థాయి సాపేక్ష వాస్తవికతను అర్థం చేసుకున్నాక మళ్లా కమ్యూనిస్టుపార్టీలోకి వచ్చాడు.

స్టీఫెన్‌ స్పెండర్‌ను సాహిత్యప్రపంచం ఆయనను  స్పెయిన్‌ అంతర్యుద్ధం తర్వాత కమ్యూనిజం పట్ల భ్రమలు కోల్పోయినంత వరకే గుర్తుపెట్టుకున్నది.  బెర్ట్రెండ్‌ రస్సెల్‌  సోవియెట్‌రష్యా స్ఫూర్తికి దూరమైనా ప్రపంచశాంతి కోసం సోవియెట్‌ రష్యా చేసిన త్యాగాల స్ఫూర్తితోనే  అణ్వాస్త్ర రహిత ప్రపంచం కోసం-  జీవితాంతం పోరాడాడు..

బోల్షివిక్‌పార్టీ  నెలకొల్పిన విలువల ప్రమాణాల తోనే సామ్రాజ్యవాదదేశాల  పెట్టుబడిదారీ విధానాలను, ఆస్తి సంచయాలను ప్రశ్నించాడు. మార్క్స్‌ ఏంగెల్స్‌ కార్మికవర్గం  ఆచరణ కోసం రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక (కమ్యూనిస్టు మానిఫెస్టో) ను ఎంతో అభిమానంతో ప్రశంసించాడు.

ఇంక ఐన్‌స్టీన్‌కు సోవియెట్‌ సోషలిస్టు రష్యాతో ఉన్న గాఢానుబంధం ప్రపంచానికంతా తెలిసిందే. ఆయనకు బోల్షివిక్‌ విప్లవ విజయంలో, సోషలిస్టు నిర్మాణంలో ఎంత ఏకీభావం లేకపోతే  ‘సోషలిజం ఎందుకు?’ (వై సోషలిజం) వంటి నాలుగుపేజీల సరళమైన రచన చేస్తాడు. ఈనాటికీ అది కమ్యూనిస్టు మానిఫెస్టో వలెనే అంతగా ప్రజాదరణ పొందుతుంది.

ఇంక ఈ వివశత్వంలోకి వెళ్లకుండా బోల్షివిక్‌ చైతన్యాన్ని బుద్ధిజీవుల్లో  అత్యున్నత త్యాగానికి పురికొల్పింది స్పెయిన్‌ అంతర్యుద్ధమయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజల్నే  ప్రజాయుద్ధంగా మారినాక యుద్ధంలో దించింది స్టాలిన్‌ నాయకత్వం. చర్చిల్‌, రూజ్వెల్ట్‌ నాయకత్వంలో జర్మన్‌ సైన్యాలను గడ్డికరిపించి ఓడిరచిన ఇతివృత్తాలను చరిత్రలో, సాహిత్యంలో చదువకున్నా హాలీవుడ్‌ సినిమాల్లో మొహంమొత్తే  స్థాయిలో హీరో, విలన్ల రూపంలో చూసిన ప్రేక్షకులకు ఎక్కువ వివరించనక్కర్లేదు. వాటిల్లో కూడ చాల గొప్ప సినిమాలు ఉన్నాయి గానీ రష్యన్ల పోరాటాలు, త్యాగాలు చూపినవి చాల తక్కువ.  చాల ప్రాచుర్యం పొందింది ‘ఫాల్‌ ఆఫ్‌ బెర్లిన్‌’ ` బెర్లిన్‌ ఎర్రసైన్యం హస్తగతమయిన తీరును చిత్రించిన సినిమా. ఈ సందర్భంగా రష్యాలో 1972లో బోరిస్‌  వాసిల్యేవ్‌ నవల ఆధారంగా అదే పేరుతో దృశ్యాకరించిన ప్రపంచ ప్రసిద్ధచిత్రం ’ద డాన్‌ హియర్‌ ఆర్‌ క్వైట్‌’  చడలేకపోయినా శివలక్ష్మి ‘రియలిస్టిక్‌ సినిమా’ సంకలనంలో రాసిన ‘రష్యన్‌ రెడ్‌ ఆర్మీ మహిళా కామ్రేడ్లు’ పరిచయమైనా పాఠకులు చదివి ఎర్రసైన్యం త్యాగాలను గుర్తిస్తారని ఆశిస్తున్నాను.

కాని నేనిక్కడ పాఠకులదృష్టికి తేదల్చుకున్నది – స్టాలిన్‌ అప్పటిదాకా ఇంచుమించు రెండున్నర దశాబ్దాలు సోవియెట్‌ సోషలిస్టు రష్యాకు శత్రువులుగా  ఉన్న బ్రిటిష్‌, సామ్రాజ్యవాదులతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి తీసుకున్న నిర్ణయం. అంతకన్నా సామ్రాజ్యవాద మొనగాడుగా ముందుకొస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదం కూడ ఆలస్యంగా యుద్ధంలో దిగినా కలిసే యుద్ధం కొనసాగించడం – అయితే సామ్రాజ్యవాదమే లెనిన్‌ మాటల్లో.  మారిబండ్‌ (మృత్యు) దశ అనుకుంటే ఆ దశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యరూపాల్లోకన్నా, ఆ రూపం కూడ ఇరుకయిపోయిన, ఉక్కపోత అయిపోయిన, అసహనస్థాయికి వెళ్లిన ఫాసిజం` మృత్యువు మాత్రమే కాదు ఇంక  ప్రజాస్వామ్యం చిగురించడానికి వీలులేని శ్మశానం, బీడు భూమి అయిపోతుంది అని ఆయన పసికట్టాడు. ఇది నిజానికి ఇవ్వాటికీ మనం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులనన్నింటినీ, కమ్యూనిస్టులను కలిపి ఐక్యసంఘటన కట్టడంలో ఎదుర్కొంటున్న సవాళ్ల అనుభవంతో పోల్చుకున్నపుడు చరిత్ర మనముందు ఉంచిన ఒక పెద్ద రిడిల్‌ ` విరోధాభాసగా కనిపించే సవాల్‌ ` పైగా ఈ యుద్ధం ముగియగానే ఓడితే సరేసరి ` ఆ యూరోపియన్‌ దేశాలన్నింటినీ ఫాసిజం ఆక్రమించుకుంటుంది. కబళిస్తుంది. అపుడిరక అది తలపడేది పొరుగున సోషలిస్టు రష్యాతోనే.  ఫాసిజం ఎర్రసైన్యం చేతిలో మట్టిగరచిన మరుక్షణం నుంచి నిన్నటి శత్రువులు తమ సామ్రాజ్యవాద వర్గస్వభావానికి అనుగుణంగానే ఏ కృతజ్ఞతాభావం లేకుండా మళ్లా శత్రువులుగానే తలఎత్తారు. తల ఎత్తుతారని స్టాలిన్‌కు తెలుసు. తెలిసీ ఎందుకు యుద్ధంలో దిగినట్లు. ఆ ప్రభుత్వాలమీద ప్రేమతో కాదు. అక్కడి కార్మికవర్గం, పీడితవర్గం, ప్రజాస్వామ్యశక్తుల భవిష్యత్తు కోసం ` వాళ్ళ ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసం. ఇందుకోసం రష్యా చాల మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సర్వతోముఖమైన సర్వసమగ్రమైన సోషలిస్టు నిర్మాణం యుద్ధంలో ప్రజాశక్తుల విజయం కోసం, ఆ తర్వాత శాంతికోసం రష్యాలో యుద్ధ పరిశ్రమలే నిర్విరామంగా పనిచేయాల్సి వచ్చింది. యుద్ధంలోకి  ప్రత్యక్షంగా తన ప్రజల్ని పంపాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాల్ని నిర్మించాల్సి వచ్చింది. సామ్రాజ్యవాద దేశాలకు కావల్సింది విజయమే కానీ బాధ్యతలు లేవు. అయితే ఈ క్రమంలో, ముఖ్యంగా ఫాసిజాన్ని మట్టికరిపించడానికి ఇది ప్రజాయుద్ధంగా మారిందన్న ఎరుకతో అది ఇచ్చిన ఉత్తేజం,  చైతన్యం లతో ప్రపంచవ్యాప్త వలసదేశాల్లో ప్రజలు ఇదేకాలంలో వలసవ్యతిరేక పోరాటాలను కూడ ముమ్మరం చేసారు. ఇండియా వంటి అతిపెద్ద బ్రిటిష్‌ వలసదేశ ప్రజలు స్వయంగా సైన్యంలోచేరి యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. కాని దానితోపాటే జాతీయోద్యమంలోనే చాల మిలిటెంటు ఉద్యమంగా సాగిన ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం వచ్చింది. యుద్ధం ముగియగానే యుద్ధంలో గెలిచిన చర్చిల్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన లేబర్‌ పార్టీ  ఇండియాకు స్వాతంత్య్రం హామీపడాల్సి వచ్చింది.

సరిగ్గా స్టాలిన్‌ ఎంత గతితార్కిక చారిత్రక అవగాహనతో ఈ యుద్ధంలో దిగాడో అటువంటి ఫలితాలన్నీ ఈ ప్రజాయుద్ధం సాధించింది. బెర్లిన్‌ హస్తగతం కావడం తూర్పుయూరపు దేశాలలో ఎర్రసైన్యం విజయాలకు పరాకాష్ట. దానితోపాటు 1945 తర్వాత తూర్పుయూరపు దేశాలన్నిటా కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడినవి. దక్షిణాఫ్రికా వంటి చాలకొద్ది దేశాలలో తప్ప ఇంచుమించు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో చాలదేశాల్లో యూరోపియన్‌ సామ్రాజ్యవాదదేశాల వలసపాలన ముగిసింది. స్టాలిన్‌ బతికున్నంత కాలమే కాకుండా ఆ స్ఫూర్తితో ఆరో దశాబ్దం దాకా కూడ సామ్రాజ్యవాద శిబిరానికి, ముఖ్యంగా ఆ శిబిరానికి రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా కేంద్రంగా మారాక ఆసియా ఆఫ్రికా ఖండాల్లో ఒక బలమైన అలీనకూటమి ఏర్పడడానికి సోవియెట్‌ రష్టా స్టాలిన్‌ నాయకత్వంలో అండగా నిలిచింది. ఇండియా, ఇండొనేషియా, ఈజిప్టు, యుగొస్లేవియా వంటి దేశాలు అందుకు నాయకత్వం వహించాయి. అమెరికా యూరోపు సామ్రాజ్యవాద శిబిరానికి వ్యతిరేకంగా మేము ఇండియవంటి అలీన దేశ ప్రభుత్వంతో పెట్టుకునే సంబంధాలుమీరు ఆ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా చేసే పోరాటాలతో ప్రభావితం కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని స్టాలిన్‌ ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులకు చెప్పాడు కూడ. 

రెండోప్రపంచ యుద్ధాన్ని ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధంగా మార్చిన వైనం గుణాత్మకంగా  సాధించిన గొప్ప విజయం  యుద్ధానంతరం  ప్రపంచంలోనే  అత్యంత పెద్దదేశమైన చైనాలో మావో నాయకత్వంలో విప్లవం విజయవంతమై 1949 అక్టోబర్‌లో  పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఏర్పడడం. అందుకు చైనాకు జపాన్‌ సామ్రాజ్యవాద దాడి వేగిరపరచే ఒక ప్రతికూలచర్యగా తోడ్పడినా అది ప్రపంచం ప్రజాస్వామ్య, సామ్యవాద శక్తుల విజయకేతనమై ఎగిరింది.

మరొకవైపు యుద్ధంలో ఆలస్యంగా దిగిన అమెరికా ప్రపంచయుద్ధంలో చమురు అమ్ముకునే రక్తపిపాసిగా మొనదేరింది. యుద్ధవ్యాపారంలో అశేష ధనార్జన చేసింది. యుద్ధం ముగిసాక జపాన్‌లోని నాగసాకీ హిరోషిమాలపై  అణుబాంబు వేసి లక్షలాదిమంది మరణానికే కాదు, ఇప్పటికీ ఆ అణు విష పరిణామాలకు కారణమైంది.

ఈ బలంగా ముందుకువచ్చిన అమెరికన్‌ సామ్రాజ్యవాదంతో తలపడుతున్న వియత్నామ్‌ వంటి దేశాలకు, హోచిమిన్‌ నాయకత్వానికి సోవియెట్‌ రష్యా అన్నివిధాల అండగా నిల్చింది.

పెట్టుబడిదారీ అత్యున్నత దశ సామ్రాజ్యవాదమని గుర్తించి దాని బలహీనమైన  అతుకు దగ్గర దెబ్బతీయాలని యుద్ధాన్ని మొదటి ప్రపంచయుద్ధ కాలంలో అంతర్యుద్ధంగా మార్చి బోల్షివిక్‌ విప్లవ విజయాన్ని సాధించే వ్యూహాన్ని  లెనిన్‌ రచించి ఆచరించి చూపితే ` ఆ సామ్రాజ్యవాద ప్రభుత్వాల పరిపాలనా సరళిలోని దశలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి నాజీజం, ఫాసిజం లోకి పరిణమిస్తే ` ఆ తారతమ్యాలను, తక్షణ ప్రమాదాలను, భవిష్యత్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని` ముఖ్యంగా ఎక్కడయినా ఏ దేశ, ఏ పాలనా  వ్యవస్థలోనైనా ప్రజల, ప్రజాస్వామ్య శక్తుల  ప్రజాస్వామ్య ఆకాంక్షల జీవనాడిని పట్టుకొని కమ్యూనిస్టులు రాజకీయాచరణ లోకి దిగాలని స్టాలిన్‌ వ్యూహం రచించాడు. భౌగోళికంగా యుద్ధం తర్వాత జర్మనీ, ఇటలీ లలో నైతే నాజీజం, ఫాసిజాలకు నూకలు చెల్లాయి. ఇంగ్లండు, ఫ్రాన్సులు బలహీనపడ్డాయి. రష్యాకు పొరుగున సామ్రాజ్యవాద దేశాలన్నీ బలహీనపడ్డాయి. దూరాన అమెరికా సామ్రాజ్యవాద దేశం బలపడి కొత్త సవాళ్లతో ముందుకు వచ్చింది.

స్టాలిన్‌ కాలానికి రుజువయిన విషయం ఏమంటే శాంతికాలం లోనే కాదు, యుద్ధంలో దించి కూడ సామ్రాజ్యవాద శక్తులు రష్యాలో సోషలిస్టు నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయాయి. కమ్యూనిజాన్ని అంతం చేయలేకపోయారు.  పైగా చైనా విప్లవంతో అది ప్రపంచంలో మూడిరట రెండువంతుల భూభాగంలో తన జెండాను ఎగురవేసింది. కొందరు చరిత్రకారులు స్టాలిన్‌ మరణానంతరం కృశ్చెవ్‌ శాంతియుత పరివర్తన సందర్భంగా వ్యాఖ్యానించినట్లు ప్రపంచవ్యాప్త  సామ్రాజ్యవాద దేశాలు స్టాలిన్‌ బతికుండగా చేయలేని పనిని, చెట్టులోపల పురుగు తొలచినట్లుగా రివిజనిజం  చేయగలిగింది. అది 1967 నాటికి సోషల్‌ సామ్రాజ్యవాదంగా స్థిరపడింది.  అది చైనా శ్రామికవర్గ  సాంస్కృతిక విప్లవం, నక్సల్బరీ గుర్తించాయి. ప్రపంచవ్యాప్తంగా జిపిసిఆర్‌ వెలుగులో ఏర్పడిన మార్క్సిస్టు ` లెనినిస్టు పార్టీలు గుర్తించాయి, విశ్లేషించాయి. అది వేరే కథ.

Leave a Reply