మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా ‘నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది. హిందూమత పరిరక్షణే లక్ష్యమని చెప్పుకునే సంస్థ ఘరానా దొంగ అదాని సంరక్షణ బాధ్యతను కూడా నెత్తినేసుకున్నది.


జనవరి 25న అదాని నేరాల మీద హిండెన్‌బర్గ్‌ నివేదికను బైటపెట్టింది. జనవరి 29న అదాని గ్రూప్‌ దాని మీద స్పందించింది. ఆ మరునాటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార వార పత్రిక ఆర్గనైజర్‌ అదాని సమర్ధిస్తూ వ్యాస పరంపర మొదలు పెట్టింది. అదాని కొనుగోలు చేసిన మీడియా సంస్థలు ఎన్నో ఉండగా, వాటికంటే దూకుడుగా అదాని అధికార పత్రిక స్థాయిలో ఆర్గనైజన్‌ పని చేయడం మొదలుపెట్టింది. అదాని పులుకడిన ముత్యమని చాటడానికి ప్రయత్నిస్తున్నది.

అదాని-‘హిండెన్‌బర్గ్‌ వివాదం అనేక విషయాలను బైటపెట్టింది. అనేక సత్యాలను తెలుసుకోడానికి అవకాశం ఇస్తున్నది. మోదీకి, అదానీకి ఉన్న సంబంధమే కాదు. మోదీ వెనుక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌కు, హిందుత్వ పాసిజానికి, అదాని కార్పొరేట్‌ ఆధిపత్యానికి ఉన్న సంబంధం తెలుసుకోడానికి ఒక ఉదాహరణగా ఈ ఘటన నిలబడిరది. మేడిపండులాంటి మన ఆర్థిక వ్యవస్థ, దాని వ్యక్తీకరణ అయిన రాజకీయ వ్యవస్థ, దాని మత, సాంస్కృతిక వ్యక్తీకరణ తేటతెల్లమవుతున్నాయి. చాలా పెద్ద విశ్లేషణల కంటే ఇలాంటి సందర్భాలు వాటికవే అనేక విషయాలను సులభంగా బోధిస్తాయి. అప్పటి దాకా మనకు తెలియనివి, చూడనివి, దాపులో ఉండిపోయినవి అన్నీ ప్రజల్లోకి వచ్చేస్తాయి.

అందుకే ఇప్పుడు సమస్య అదాని కాదు. ఆయన ఒక్కడే కాదు. ఆయన చెలికాడు మోదీ కూడా కాదు. వాళ్లు చేస్తున్న అక్రమాలు మాత్రమే కాదు. ఈ వ్యవహారం మొదలైన ఈ మూడు వారాలుగా చాలా మంది “అదాని అక్రమాలు” అని వ్యవహరిస్తున్నారు. పైపైన చూస్తే ఇది నిజమే.  అక్రమాలు జరిగాయని అంటున్నామంటేనే వాటిని నివారించడానికి, సక్రమమైన మార్గం ఇంకోటి ఉన్నదని, దాన్ని పక్కన పెట్టడమే ఈ అనర్ధానికి కారణమనే అర్ధం వస్తుంది. ఆ సక్రమ మార్గాల్లో నడిచి ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదనే అంతరార్థం ఉంది. అయితే ఇది అక్రమాల, సక్రమాల సమస్య మాత్రమే కాదు. అసలు దేనికి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? సక్రమ మార్గాలు ఉండగా అంత పెద్ద ఎత్తున పదే పదే అక్రమాలనబడేవి ఎందుకు జరుగుతున్నాయి? ఈ తరహా చర్చతో ఇలాంటి అక్రమాలు జరగకుండా నివారించడం సాధ్యమేనా? పదే పదే జరుగుతున్న ఇలాంటి ఈ అక్రమాలకు ఆర్థిక వ్యవస్థలోనే కారణాలున్నాయా? రాజకీయ వ్యవస్థలోనే మూలాలు ఉన్నాయా? అని చర్చించడానికి ఇది మంచి సందర్భం.

ఆర్‌ఎస్‌ఎస్‌కు స్ఫూర్తినిచ్చిన ముసోలినీగాని, హిట్టర్‌గాని ఒకే జాతి, ఒకే ప్రభుత్వం, ఒకే నాయకుడు అని ఉపదేశించారు. ఒకే ఒకటి అనే భావన ఆర్‌ఎస్‌ఎస్‌కు చాలా ప్రియమైనది. ఏ రంగంలో అయినా ఒకే ఒక్కడు దిగ్గజంగా మారాలి. కార్పొరేట్‌ రంగంలో ఒకే ఒక్కడిగా ఎదిగిన అదాని ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రియమైన వ్యక్తి కావడం సహజమే. మోదీ అనే వ్యక్తికి అదాని మిత్రుడు కావడం, లేదా ఆ ఇద్దరు గుజరాతీలు కావడం అనేవి పైకి కనిపించేవే. అసలు విషయం ఏమంటే ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ భావనలోనే ఒకే ఒక్కడు విరాట్రూపంగా ఆవిష్కృతం కావాలి. ఈ భావన నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ జాతిని, జాతీయతను నిర్వచిస్తూ వచ్చింది.

ఆర్థిక రంగంలో అలాంటి ఒకే ఒక్కడుగా నిలచిపోవాల్సిన అదానిని కాచుకోవాల్సిన కర్తవ్యం భావజాలపరంగానే ఆర్‌ఎస్‌ఎస్‌కు అవసరం.

ప్రజాస్వామ్యం, సోషలిజం రెండూ పాశ్చాత్య భావనలని, వాటిని అంగీకరించనని గోల్వాల్కర్‌ అంటాడు. ఏదైనా స్వదేశీ అయి ఉండాలని, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ను కూడా సంఫ్‌ముపరివార్‌ ఏర్పాటు చేసింది. బహుశా ఆ అర్ధంలో స్వదేశీ కార్పొరేట్‌ అయినందు వల్ల అదాని అక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధిస్తున్నదని అనుకొనే అవకాశం ఉంది. కానీ అదాని అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రమేయంతోనే సకల అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ ధోరణులు ప్రపంచంలో ఏ దేశంలోని కార్పొరేట్లలో అయినా చూడవచ్చు. కానీ ఇండియాలో అదాని వంటి ఆర్థిక శక్తుల ఆవిర్భావంలో, వాటి స్వభావంలో చాలా తేడా ఉంది.

20వ శతాబ్ది ఆరంభానికే పారిశ్రామిక పెట్టుబడి ఫైనాన్స్‌ పెట్టుబడిగా మారింది. సాంకేతికత పెరగడంతో పదే పదే తలెత్తుతున్న అధికోత్పత్తి సంక్షోభాన్ని అధిగమించేందుకు సేవా రంగాన్ని అభివృద్ధి చేసుకున్నది. అంతక ముందు కూడా సేవా రంగం ఉండేది. అది వస్తు ఉత్పత్తి రంగానికి అనుబంధంగా పని చేస్తుండేది. పారిశ్రామికరంగం మీద ఒత్తిడి తగ్గించుకోడానికి, అధికోత్పత్తి సంక్షోభాన్ని నివారించుకోడానికి ప్రత్యేక రంగంగా సేవా రంగాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ తయారు చేసుకున్నది. ఈ ప్రపంచ పరిణామంలో భారతదేశం కూడా భాగమే. ప్రపంచమంతా ప్రత్యక్ష వలసలు రద్దయ్యాక పెట్టుబడిదారీ విధానం తనను తాను అంతర్గతంగా పునర్‌ వ్యవస్థీకరించుకున్నది. నేరుగా రాజకీయ, సైనిక పరిపాలన స్థానంలోకి కొత్త తరహా ఆర్థిక నియంత్రణ విధానాలను తయారు చేసుకున్నది.

భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గం వలస పాలనా చట్రం వల్ల సామ్రాజ్యవాదానికి లోబడిపోయింది. అధికార మార్పిడి తర్వాత ప్రభుత్వ అండతో బలపడుతూ వచ్చింది. 1991 నూతన ఆర్థిక విధానాల తర్వాత అమెరికా నాయత్వంలో మొదలైన గ్లోబల్‌ ఆర్డర్‌లో పూర్తిస్థాయిలో భాగమైంది. సామ్రాజ్యవాద దోపిడీకి తగినట్లు తన ఆర్థిక వ్యవస్థను మార్చుకుంటూ, అందులోని సేవా రంగాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చింది.

1950ల నాటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాలంలో ప్రభుత్వమే ఒక విధానంగా పెట్టుబడిదారీ వర్గం బలపడటానికి చేపట్టిన రాజకీయార్థిక విధానాలకు 1990ల్లో మొదలైన కొత్త విధానాలకు చాలా తేడా ఉంది. పెట్టుబడి ప్రపంచీకరింపడిన తర్వాత దానికి ఇక దేశాల సరిహద్దులు లేవు. స్వదేశీ, విదేశీ విభజనలు లేవు. ఉదాహరణకు అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి లేకుండా అదానిలాంటి వాళ్లు అభివృద్ధి లేదు. భారత పెట్టుబడిదారీ వర్గం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచస్థాయిలో ఆర్థిక నియమాలను, నిబంధనలను రూపొందించేది సామ్రాజ్యవాద దేశాలే. అదానీగాని మరే భారతీయ పెట్టుబడిదారుడు కానీ వాటికి తగినట్లు పని చేయాల్సిందే. వాటికి లోబడి ఉండాల్సిందే.

అయితే అదాని ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలోకి ఎలా వచ్చాడు? దీన్ని సామ్రాజ్యవాదం ఎలా అనుమతించిందనే ప్రశ్న తలెత్తుతుంది. ఇదే ద్రవ్య పెట్టుబడిలోని మాయ.

దాని వల్ల అదాని ఆస్తుల లెక్కలు ఎంతయినా పెరగవచ్చు. అది పెరుగుతున్నట్లు చాటుకోడానికి, తద్వారా మదుపర్గను ఆకర్షించి మోసం చేయడానికి ఎన్ని రకాల అక్రమ పద్ధతులకైనా పాల్పడవచ్చు. కానీ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి లోబడి ఉండాల్సిందే.

గత ముప్పై ఏళ్లుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో మనీ లాండరింగ్‌ చేస్తూ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి నుంచి డబ్బులు తరలించి అదాని ప్రపంచంలో సంపన్నుడయ్యాడు. ఇలాంటి పనులు అదాని ఒక్కడే కాదు. కార్పొరేట్‌ సంస్థలన్నీ చేసేవే. అయితే అదాని ఎదిగిన తీరులో ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఆయన ఒక్కడికి సంబంధించిందే కాదు. భారత పెట్టుబడిదారులందరికీ వర్తించేది. నిర్దిష్టంగా అదాని అయితే అనేక అక్రమాల ద్వారా తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ అందులో కొంత గుజరాత్‌ రాజకీయ వ్యవస్థ ఫండిరగ్‌ చేస్తూ వచ్చాడు. బీజేపీ రాజకీయశక్తిగా ఎదిగి తనకు అనుకూలంగా వ్యవహరించే స్థితికి చేరుకోడానికి దోహదం చేశాడు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి నేరుగా ప్రభుత్వ అండతో మరింత విస్తరించాడు. దీని కోసం మోదీ ప్రభుత్వాలు ఉన్న చట్టాలను కాలరాచింది. కొన్నిటిని తిరగరాసింది.

మామూలుగా పెట్టుబడిదారులకు బూర్లువా ప్రభుత్వాలు ఇచ్చే పన్ను రాయితీలు, మౌలిక వసతుల కల్పన వంటి ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటాయి. బీజేపీ ప్రభుత్వం అదానికి చేసింది అలాంటి సాయం కాదు. అప్పటి దాకా ఉన్న అన్ని పద్ధతులను పక్కన పడేసి కార్పొరేట్‌ సామ్రాజ్యంలో అదాని నెంబర్‌ ఒన్‌ కావడమే లక్ష్యంగా పని చేసింది. దీని కోసం ఓడరేవులు, విమానాశ్రయాలు, గనులు వగైరా కట్టబెట్టింది. మొదటి పంచ వర్ష ప్రణాళిక నుంచి రాజకీయాశ్రితంగానే దళారీ పెట్టుబడిదారీ వర్గం ఎదుగుతూ వచ్చినా బీజేపీ ప్రభుత్వ హయాంలో అదాని ఎదిగిన తీరు చాలా భిన్నమైనది. ప్రభుత్వం ద్వారా తనకు అనుకూలమైన విధానాలు తయారు చేయించుకొనే దశ నుంచి ఏ విధానాలు, నియంత్రణలు లేని దశకు ఈ వర్గం ఎదిగింది. ఇప్పుడు చూస్తే అదాని కోసం మోదీ ఈ అక్రమాలన్నీ చేశాడని బైటికి కనిపిస్తున్నది కానీ, వాస్తవానికి భారత దళారీ వర్గం ఎదుగుదలలోనే ఈ మార్చు వచ్చింది. అధికార మార్పిడి తొలి రోజుల్లో ప్రభుత్వ ఆధికారంతో ఈ వర్గం ‘చట్ట’ బద్ధంగా బలపడిన దశ నుంచి ద్రవ్య పెట్టుబడి ప్రపంచాన్ని ముంచెత్తుతున్న కాలంలో మాఫియా పద్ధతిగా మారిపోయింది. ఇది అపక్రమం కాదు. ఇదే సహజమైనది. ఇది వ్యవస్థాగతమైనది. దీనితో సంబంధం లేకుండా అదాని ఆస్తుల పెరుగుదల గురించి, తగ్గుదల గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. దాని వెనుక ఉన్న అక్రమాల చిట్టాను పోగేసినా అసలు విషయం అర్థం కాదు. కార్పొరేట్‌ కంపెనీలు తమ సంపద వాస్తవ విలువను ఊదరగొట్టి, భవిష్యత్‌లో రాబోయే లాభాల ఊహాజనిత విలువను ప్రచారం చేసుకొని షేర్‌ మార్కెట్లో మోసాలు చేయడం అంతటా ఉన్నదే. ప్రభుత్వ అధికారం అండ లేకుండా ఇలాంటి మోసాలు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రభుత్వ అధికారం, ఫైనాన్స్‌ పెట్టుబడి కలిసి అదానిలాంటి కార్పొరేట్‌ సామ్రాజ్యాలు విస్తరిస్తున్నాయి. మన దేశంలో అన్ని ప్రభుత్వాలు పెట్టుబడిదారీ వర్గ అనుకూల విధానాలు అనుసరించినవే. అంతేకాదు. సామ్రాజ్యవాద అనుకూల విధానాలు తీసుకొచ్చినవే. వీటి ద్వారా దేశంలోని పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలు తీర్చినవే. ఆ రకంగా సామ్రాజ్యవాద పెట్టుబడితో, దాని ఆర్థిక నియంత్రణతో ఏ సంబంధమూ లేని స్వేచ్భాయుత కార్పొరేట్‌ మాఫియా సామ్రాజ్యాలు కావు ఇవి. అందుకే ఇందులో ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడే బూటకపు స్వదేశీ లేదు. అదానీ లాంటి వాళ్లను చూపి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరిగెడుతోందనే వాదనల్లో నిజం లేదు. అనేక దేశాల్లో పెట్టుబడి పెట్టే స్థాయికి భారత పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించి ఉండవచ్చు. కానీ అది ఎంత విస్తరించాలో సామ్రాజ్యవాదం నిర్దేశిస్తుంది. అదాని అనేక అక్రమాలు చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోడానికి అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి అవకాశం ఇచ్చినట్లే , ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గ స్వభావాన్నీ అదే నిర్దేశిస్తున్నది. ఈ విషయం తెలుసుకోడానికీ కూడా అదాని’హిండర్‌బర్గ్‌ వివాదం దోహదం చేస్తుంది. మిగతావన్నీ వివరాలే.

One thought on “అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

  1. Good analysis on the institutional dynamics of Finance Capital and its overall role play in the regulation of political, financial sectors of the globe. It thoroughly exposed the fake SWADESI of RSS and its hallowness in supporting Adani.

Leave a Reply