‘‘తమ తిరుగుబాటు ఒక జార్‌ని దించేసి మరో జార్‌ని, లేదా మరో పాలకుడ్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు. ఒక మహాలక్ష్యం కోసం ఉద్దేశించినది’’

సెర్గీమాట

The secret of beauty is the secret of life. The beauty of life is the beauty of struggle. (Y. Borev : Aesthetics, p.44& 46)

(జీవిత రహస్యమే సౌందర్య రహస్యం. సంఘర్షణ సౌందర్యమే జీవిత సౌందర్యం)

జీవితం, సంఘర్షణ, సౌందర్యం – ఇవి ఒక విడదీయరాని త్రయం. రచయిత నాగభూషణ్‌  రచించిన బృహన్నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ ఒక చారిత్రక నవల. ఒక

ఉద్యమ చరిత్రను ప్రతిబింబించిన నవల. 1825 డిసెంబరులో రష్యాలో జరిగిన తిరుగుబాటు, దాని పరిణామాలు దీని వస్తువు. 1917 నాటి సోవియట్‌ బోల్షివిక్‌ విప్లవం ప్రపంచమంతా తెలిసిన ఉద్యమం. కార్ల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రూపొందించిన మార్క్సిజం సిద్ధాంతాలకు అనుగుణంగా వి.ఐ.లెనిన్‌ నాయకత్వంలో శ్రామిక ప్రజలు జార్‌ పాలకుల మీద తిరుగుబాటు చేసిన విప్లవం బోల్షివిక్‌ విప్లవం. ఈ విప్లవానికి ముందే రెండు విప్లవోద్యమాలు జరిగాయి. 1825 డిసెంబరులో జరిగిన సాయుధ సైనిక తిరుగుబాటునే డిసెంబరిస్టు విప్లవం అంటారు. 1860 ` 70 దశకాల మధ్యకాలంలో వచ్చిన మరో ఉద్యమాన్ని నరోద్నిక్‌ విప్లవం అంటారు. ఈ రెండు విప్లవాలు వచ్చినట్టే వచ్చి, అణచివేతకు గురయ్యాయి. ఈ రెండిరటి వైఫల్యాల నుంచే మూడో విజయం సాధ్యమైంది. రెండు అపజయాలు తుది విజయానికి దారిని సుగమం చేశాయి. వాటిలో మొదటి విప్లవం అయిన డిసెంబరిస్టు విప్లవం మీద నాగభూషణ్‌ పరిశోధన, అధ్యయనం చేసి రచించిన నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ ఇది ఒక రాజకీయ చారిత్రక నవల. ఒక విప్లవ చారిత్రక నవల.

ఉద్యమ నవలలు రెండు రకాలుగా ఉంటాయి. 1. సమకాలీన ఉద్యమ నవలలు. 2. ఉద్యమ చారిత్రక నవలలు. సమకాలీన ఉద్యమ నవలలు ఉద్యమం నడుస్తున్న కాలంలోనే వస్తాయి. వాటిని ఉద్యమంలో పాల్గొన్నవాళ్ళు గానీ, ఉద్యమాన్ని చూసిన వాళ్ళు గానీ రాస్తారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘మాలపల్లి’ ఇలాంటి నవల. 1920 -22 మధ్య పల్నాడు ప్రాంతంలో జరిగిన స్వాతంత్రోద్యమంలో ఉన్నవ పాల్గొన్నారు. 1921 -22 మధ్య రాయవేలూరు జైలులో ఖైదీగా శిక్షను అనుభవిస్తూ ఆ నవలను రాశారు. ఆ కాలపు ఉద్యమాన్నే మహీధర రామమోహనరావు గారు 1950 తర్వాత ‘కొల్లాయి గట్టితేనేమి?’ నవలగా రాశారు. 1921 –  22 నాటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన మూడున్నర దశాబ్దాల తర్వాత నవలగా రాశారు. అది ఉద్యమ చారిత్రక నవల. నాగభూషణ్‌ గారి ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ అలాంటి ఉద్యమ చారిత్రక నవల. 1825 నాటి ఉద్యమాన్ని రెండువందల ఏళ్ళ తర్వాత ఆయన నవలగా రాశారు. మహీధర భారతీయుడు, తెలుగువాడు. ఆ ఉద్యమం భారతదేశంలో, తెలుగునాట జరిగింది. ఆ ఉద్యమం నాటికే ఆయన ఉన్నారు. ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ రష్యాలో జరిగిన ఉద్యమం. అది 1825లో జరిగింది. రచయిత భారతీయుడు, తెలుగువాడు. ఆ ఉద్యమం నాటికి రచయిత పుట్టలేదు. అది ఆయన అధ్యయనంలోంచి, ఆయన భావజాలంలోంచి పుట్టుకొచ్చిన నవల. ఇది చాలా శ్రమతో కూడిన పని. నాగభూషణ్‌ శ్రమకోర్చి రాసిన నవల ‘డిసెంబరిస్టు ఖైదీ’. సమకాలీన ఉద్యమ నవల రాయాలంటే, ఉద్యమానుభవం, లేదా ఉద్యమ పరిశీలనాజ్ఞానం ఉంటే చాలు. ఉద్యమ చారిత్రక నవల రాయాలంటే చారిత్రక అధ్యయనం చేయాలి. కేవలం చరిత్ర జ్ఞాపకం ఉంటే చాలదు. చరిత్ర జ్ఞాపకంతోపాటు దాని అవగాహన కూడా

ఉండడం చాలా అవసరం. చరిత్ర పట్ల చరిత్ర అధ్యయనపరులందరికీ ఒకే రకమైన అవగాహన ఉండదు. అధ్యయనం చేసేవాళ్ళ భావజాలాన్ని బట్టి, వాళ్ళకు చరిత్ర అర్థమౌతుంది. నాగభూషణ్‌ రష్యన్‌ చరిత్రనూ, రష్యన్‌ సాహిత్యాన్ని మార్క్సిస్టు దృక్పథం నుంచి అధ్యయనం చేశారు. డిసెంబరిస్టు ద్యమాన్ని రచయిత వర్గదృక్పథంతో అర్థం చేసుకున్నారు. అలాగే రాశారు.

౦౦౦౦

చరిత్రను నవలలుగా మలచడంలో ఒక్కొక్క నవలలోనూ ఒక్కొక్క పద్ధతిని రచయిత అనుసరిస్తాడు. ఏ చారిత్రక నవలలో అయినా కొన్ని చారిత్రక పాత్రలు, కొన్ని కల్పిత పాత్రలు ఉంటాయి. అలాగే ‘డిసెంబ్రిష్టు ఖైదీ’ నవలలో కూడా కొన్ని చారిత్రక పాత్రలు, కొన్ని కల్పిత పాత్రలు కూడా ఉన్నాయి. అయితే కల్పితపాత్రలు ఈ నవలలో అప్రధానంగా ఉండగా, చారిత్రక పాత్రలకే రచయిత అధిక ప్రాధాన్యతనిచ్చాడు.

ఎక్కడో సుదూరంగా ఉన్న దేశంలో, అదికూడా వేరే శీతోష్ణస్థితులు కలిగిన దేశంలో రెండువందల ఏళ్లకిందట జరిగిన సంఘటనలను చాలా కూలంకషంగా అధ్యయనం చేసి తన ప్రతిభనంతా రంగరించి సైబీరియా ప్రాంత రచయిత రాయగలిగినంత వాస్తవికంగా రాయగలగడం పాఠకులను ఆశ్చర్యంలో ముంచివేస్తుంది. చరిత్రలో కలిసిపోయిన కథలను ఆ కాలపు వాతావరణంలో అప్పటి సంఘర్షణలను కళ్లకు కట్టినట్లు రాశాడు రచయిత.

మహీధర రామమోహనరావు గారి ‘కొల్లాయి గట్టితేనేమి?’ నవల మీద ఒక పెద్ద వ్యాసం రాస్తూ, రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఆ నవలను ఒక గొప్ప చారిత్రక నవలగా నిర్వచించారు. ఆ సందర్భంగా ఆయన చారిత్రక నవలకు నాలుగు ముఖ్యమైన లక్షణాలను పేర్కొన్నారు.

 అవి :

1. చారిత్రకత 2. దేశకాల నిర్దిష్టత.

3. చారిత్రక శక్తులకు, చారిత్రక ధర్మాలకు ప్రతినిధులుగా పాత్రల సృష్టి

4. నవలలో చిత్రింపబడిన చరిత్ర తన గత చరిత్ర అనే అనుభూతిని పాఠకులకు కలిగించడం. (రారా : సారస్వత వివేచన, పు. 17)

‘డిసెంబరిస్టు ఖైదీ’ నవలలో ఈ నాలుగు లక్షణాలు చక్కగా అమరినాయి. డిసెంబరిస్టు విప్లవం రష్యా చరిత్రలో ఒక దశా విశేషం. అది ఆ దేశం గత చరిత్ర. ఆ దేశపు చారిత్రక పరిణామక్రమంలో ఆ విప్లవం ఎలా సంభవించిందో పాఠకులకు అనుభవంలోకి వస్తుంది. ఆ విప్లవ వైఫల్యం మరో విప్లవానికి దారి ఏర్పరచిందన్న అనుభూతి పాఠకులకు కలుగుతుంది. దేశకాల నిర్దిష్టతను నవలా రచయిత చాలా జాగ్రత్తగా పునర్మిర్మాణం చేశారు. ప్రయాణ సౌకర్యాలు లేని ఆ కాలంలో రోజుల తరబడి గుర్రపుబండ్లలో రాజకుటుంబాలు సైతం చేసిన ప్రయాణాన్ని రచయిత చాలా సమాచార సేకరణతో చిత్రించారు. అప్పటి దేశకాల పరిస్థితులకు నవలలోని పాత్రలకు, సన్నివేశాలకు కార్యకారణ సంబంధాన్ని రచయిత చక్కగా కల్పించాడు. ఈ నవలలోని పాత్రలు చారిత్రక వ్యక్తులుగా ఉంటూనే చారిత్రక సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న అనుభూతి కలిగిస్తారు. పాఠకులకు. నవలలోని పాత్రల మధ్య జరిగే సంఘర్షణ అప్పటి వర్గాల మధ్య జరిగే సంఘర్షణగానే అర్థమవుతుంది. ఈ నవలలో ఇతివృత్తం రెండు వందల ఏళ్ళ నాటిది. ఇప్పుడు నవలగా వచ్చింది. అయినా పాఠకులకు ఈ నవల ఏదో గతకాలపు చారిత్రక అవశేషం అనిపించదు. ఇప్పటికీ ఆ చరిత్రకు కార్యకారణ సంబంధముందనే అనుభూతిని కలిగిస్తుంది. సోవియట్‌ రష్యా పతనం, జర్మనీ పరిణామాలు, తూర్పు యూరప్‌ పరిణామాలు, చాలా దేశాలలో వామపక్షాలు విజయాలు సాధిస్తూ ఉండడం వంటివి చూస్తుంటే ఆ కార్యకారణ సంబంధం అర్థమౌతుంది. చారిత్రక నవల అయిన ‘డిసెంబరిస్టు ఖైదీ’ నవల చరిత్రకు డాక్యుమెంట్‌గా రూపొందలేదు. అది నవలగా పరిణతి చెంది ఇప్పటి రూపం తీసుకుంది. ఇందుకు ప్రధాన కారణం రచయిత ఆ చారిత్రక ఉద్యమకాలం నాటి మానవ సంబంధాలనూ, వాటి పరిణామాలను, ఎంతో వాస్తవికంగా, సూక్ష్మాంశాలతో సహా ఎంతో ఓపికగా చిత్రించడమే.

ఇల్యా ఎహ్రెనెబర్గ్‌ అనే సోవియట్‌ సాహితీవేత్త ‘‘రచయితా ` శిల్పమూ..’’’ అనే చిన్న గ్రంథంలో ‘‘నవలా రచయిత ఒక చిన్న జీవితంలో అనేక జీవితాలను గడపాలి’’ అన్నారు. నవలా రచయితగా నాగభూషణ్‌ గారు అలా జీవించారు.

౦౦౦

History is the one weak point in Indian Literature. It is infact non existent. (A.A. Macdonell: History of Sanskrit Literature)

ఈ అభిప్రాయం భారతీయ సాహిత్యం తాళపత్రాలలో ఒదిగి ఉన్నప్పటి, వలసపాలకులకు ప్రాచీన భారతీయ సాహిత్యమంతా అందుబాటులోకి రాకముందటి అభిప్రాయం. భారతీయ సాహిత్యంలో చరిత్రకు పరిమిత స్థానం ఉండినమాట వాస్తవమే. పురాణాల పునర్వ్యాఖ్యాన సాహిత్యం అధికం. అట్లని సంస్కృతంలోనైనా చరిత్ర ఉనికే లేదనడం సరికాదు. బాణుని ‘హర్షచరిత్ర’, కల్హణుని ‘రాజతరంగిణి’, బిల్హణుని ‘విక్రమాంక దేవచరితము’, సంధ్యాకారుని ‘రామచరితము’, గంగాదేవి ‘మధురా విజయము’ మొదలైనవి ఉన్నాయి. మధ్యయుగ సాహిత్యంలో తెలుగులోనే సిద్ధేశ్వర చరిత్ర, కృష్ణరాయ విజయము, పల్నాటి వీరచరిత్ర వంటి కావ్యాలు వచ్చాయి. ఆధునిక భారతీయ చరిత్ర తొలిదశలోనే చారిత్రక సాహిత్యం పుష్కలంగా వచ్చింది. ఇతర భాషల లోంచి అనువాద రచనలు, అనుసృజన రచనలు వచ్చాయి. మౌలిక చారిత్రక సాహిత్యమూ వచ్చింది. భారత జాతీయోద్యమం భారతీయ భాషలలో చారిత్రకసాహిత్య సృష్టికి ప్రేరణగా నిలిచింది. తొలి తెలుగునవల నరహరి గోపాలకృష్ణమశెట్టి గారి ‘శ్రీరంగరాజచరిత్ర’ (1872) చారిత్రకాభాస. చిలకమర్తి వంటి వాళ్ళు తొలినాళ్ళలో నోరి నరసింహశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు వంటివాళ్ళు మలిదశలో చారిత్రక నవలలు చాలా రాశారు. గతం పట్ల విశ్వాసమే వాళ్ళతో ఆ నవలల్ని రాయించింది. ఈ క్రమంలోనే నాగభూషణ్‌ గారి ‘డిసెంబరిస్టు ఖైదీ’ నవల వాటికన్నా భిన్నమైన నవలగా వచ్చింది.

్జ్జ్జ

చారిత్రక నవలలు రెండు రకాలుగా ఉంటాయి. ప్రాచీన సామ్రాజ్యయుగ చరిత్ర వస్తువుగా వచ్చిన నవలలు. ఆధునిక చరిత్ర వస్తువుగా వచ్చిన నవలలు. ‘డిసెంబరిస్టు ఖైదీ’ ఆధునిక యుగచరిత్ర వస్తువుగా వచ్చిన నవల. చారిత్రక నవలల్ని భారతదేశ చరిత్ర వస్తువుగా వచ్చిన నవలలు ` విదేశీ చరిత్ర వస్తువుగా వచ్చిన నవలలు అని మరో రకంగా కూడా వింగడిరచవచ్చు. విదేశీ చరిత్ర వస్తువుగా తెలుగులో చాలా తక్కువ నవలలు వచ్చాయి. తెన్నేటి సూరి ‘చెంఘిజ్‌ఖాన్‌’ ఈ దృష్టితో వచ్చిన ప్రసిద్ధమైన ఒకేఒక్క నవల. ఇంకొన్ని ఉండవచ్చు. వాటి పరిణత రూపంగా ‘డిసెంబరిస్టు ఖైదీ’ నవల వచ్చింది.

౦౦౦

ఒకనాటి హైదరాబాద్‌ రాజ్యాన్ని నిజాం పాలకులు, అనేకులు 400 ఏళ్ళు పాలించారు. ఒకనాటి రష్యాను అనేకమంది జార్‌ చక్రవర్తులు సుదీర్ఘకాలం పాలించారు. ఈ నవలలో అయిదుమంది జార్‌ చక్రవర్తులు కనిపిస్తారు. అలెగ్జాండర్‌ `1, నీకొలస్‌`1, అలెగ్జాండర్‌`2, అలెగ్జాండర్‌-3, నీకొలస్‌-2. జార్‌ చక్రవర్తుల దుర్మార్గ పాలన మీద తిరుగుబాటే డిసెంబరిస్టు ఉద్యమం. సాధారణంగా ఒక విప్లవోద్యమం పీడితుల నుంచి ప్రాణం పోసుకుంటుంది. బాధితుల నుంచి పుడుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం రాజుల, దేశముఖ్‌, పటేల్‌ పట్వారీల నిరంకుశత్వంలో నలిగిన శ్రామిక జనమంతా చేసిన పోరాటం. భారత స్వాతంత్య్రోద్యమం పరాయి పాలనలో నలిగిపోయిన ప్రజలు నడిపిన ఉద్యమం. 1917లో విజయం సాధించిన బోల్షివిక్‌ విప్లవం కూడా జార్‌ చక్రవర్తికి వ్యతిరేకంగా శ్రామికులు నడిపిన ఉద్యమ ఫలితం. అయితే డిసెంబరిస్టు ఉద్యమం అలాంటిది కాదు. సంపన్నులు, జార్‌ చక్రవర్తి దగ్గర పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు నడిపిన ఉద్యమం. వాళ్ళంతా జారిస్టు పాలన వలన లాభపడినవాళ్ళు. రాజవంశాల వాళ్ళు. డిసెంబరిస్టులు ఎందుకు తిరుగుబాటు చేశారంటే, వాళ్ళు రాచరికం లేని రిపబ్లిక్‌ను కోరుకున్నారు. దున్నేవాళ్ళకే భూమి చెందాలని కోరుకున్నారు. జాతుల వివక్ష రద్దు కావాలని కోరుకున్నారు. బానిసత్వ నిర్మూలనను కోరుకున్నారు. వర్గవైరుధ్యాల నిర్మూలనను కోరుకున్నారు. అందరికీ సమానత్వ హక్కులను కోరుకున్నారు. పురుషులు విప్లవంలో ఉంటే, వాళ్ళ స్త్రీలు సైబీరియా ప్రాంత అభివృద్ధికి కృషిచేయడం, జార్‌ నిరంకుశత్వాన్ని ధిక్కరించడం ఈ నవలలో చూడవచ్చు.

ఇది పేరుకు డిసెంబరిస్టు విప్లవ నవల అయినా, ఇది ఆ విప్లవంతో ఆగలేదు. నరోద్నిక్‌ విప్లవం, బోల్షివిక్‌ విప్లవం కూడా ఈ నవలలో క్లుప్తంగా చిత్రింపబడ్డాయి. అందువల్ల ఈ నవల దాదాపు నూరేళ్ళ రష్యన్‌ చరిత్రకు ప్రతిబింబమైంది.

 అన్నమయ్య భక్త కవి అయినా అనేక సామాజిక వాస్తవాలను తన పదకవిత్వంలో చెప్పాడు. రాచరిక వ్యవస్థలో రాజకుటుంబాలలో అధికారం కోసం జరిగే హత్యాకాండను విమర్శిస్తూ ఒక పదం చెప్పారు :

దేహమిచ్చిన వాని తివిరి చంపెడువాడు

ద్రోహిగాక నేడు దొరయట…

తోడబుట్టిన వాని తొడరి చంపెడువాడు

చూడ దుష్టుడుగాక సుకృతియట…

కొడుకు నున్నతిగోరి చంపెడువాడు

కడుపాతకుడు గాక ఘనుడట…

తల్లి జంపెడువాడు తలప దుష్టుడు గాక

యెల్లవారల కెల్ల నెక్కుడట…

ఈ రాజకీయ వాతావరణాన్ని నాగభూషణ్‌ ఈ నవలలో చిత్రించారు. పీటర్‌-3 ఆరునెలలు పరిపాలించాడు. ఇంతలో అతని భార్య కుట్రచేసి, ఆస్థాన ప్రముఖుల సహాయంతో అతన్ని దించేసి తాను సింహాసనం ఆక్రమించింది. అతడు మళ్ళీ అధికారం కోసం ప్రయత్నిస్తాడేమోనని, ఆమె ప్రియులతో అతనిని చంపించింది. పాల్‌`1 మరణం కూడా అసహజమైనదేనని ప్రజలు చెప్పుకున్నారు. అతని కుమారుడు అలెగ్జాండర్‌`1 చిన్నవయసులో అధికారంలోకి వచ్చినా, తన తండ్రి మరణం హత్య అని బయటకి చెప్పుకోలేని స్థితిలోనే పాలన చేశాడు. ఏ దేశ రాజకీయ చరిత్ర అయినా ఇంతే.

ఈ నవల ప్రధానంగా సైబీరియా కేంద్రంగా నడుస్తుంది. అందువల్ల రచయిత మొదట ప్రవేశిక అనే శీర్షికలో మొదట సైబీరియా రష్యాలో కలిసిన తీరును ఆసక్తికరంగా వివరించారు. ఆ పరిచయం లేకుంటే విదేశీచరిత్ర వస్తువుగా గల ఈ తెలుగు నవలను ఇప్పటి పాఠకులు అర్థం చేసుకోవడం కష్టమయ్యేది.

చరిత్ర సుదీర్ఘమైనది, పరిచయం లేనిది కావడం వలన రచయిత కథను చెబుతూ మధ్యలో పాఠకులను నేరుగా పలకరిస్తారు. నవలలో రచయిత పాఠకులతో ప్రత్యక్షంగా మాట్లాడటం శిల్పపరంగా లోపమని నవలా విమర్శకులు చెబుతుంటారు. కానీ ఈ   బృహన్నవలలో, సంకీర్ణ ఇతివృత్తంలో రచయితకు ఆ పద్ధతి అనివార్యమైంది.

సైబీరియా రష్యాలో అంతర్భాగమైన రెండున్నర శతాబ్దాల తర్వాత జరిగిన కథ ఈ నవలలో కథ. దాదాపు అది జరిగిన తర్వాత నూరేళ్ళ చరిత్రను ఈ నవల మనకు చెబుతుంది. ఈ చరిత్ర జరిగిన వందేళ్ళ తర్వాత ఈ నవల వచ్చిందని పాఠకులు గుర్తుపెట్టుకుంటే కథ జరిగిన కాలానికి నవలా కాలానికి మధ్య గల కాలవ్యవధి తెలుస్తుంది. ఇలాంటి వస్తువును నవలగా రాయడం కత్తిమీద సామే. సమీప గతచరిత్ర గనక రచయిత అసహజ కల్పనలు చేయడానికి వీలులేదు. వాస్తవికత ప్రమాణంగా, చరిత్రే ప్రాణంగా నాగభూషణ్‌ ఈ నవల రాశారు.

ఈ నవలలో చాలా చరిత్ర, ప్రయాణ సమయంలోనూ, తీరిక సమయంలో సంభాషణా రూపంలోనూ చిత్రింపబడిరది. రచయిత శిల్పపరమైన జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ పద్ధతి ఫలవంతమైంది. నవల ప్రారంభమే మాస్కో రాజమార్గంలో ‘కబీత్క’ అనేరకం గుర్రపుబండిలో ఇద్దరు మహిళలు ప్రయాణం మొదలు బెట్టడంతో జరుగుతుంది. ఆ ప్రయాణం సుదీర్ఘమైనది. కష్టమైనది. ఆ ప్రయాణం మనకు చాలా చరిత్రను ఆసక్తికరంగా చెబుతుంది. రష్యాదేశానికి తేయాకుకు సంబంధం ఏర్పడిన కథనం చాలా ఆసక్తిగా

ఉంది. ఆ గుర్రబ్బండిలో ప్రభువంశానికి చెందిన యువతి మరీయావోల్కోన్స్కయా, ఆమె సహాయకురాలు మాషా ఉంటారు. మరీయ తన ఏడాది నిండని కొడుకును ` నీకొలస్‌ను అత్తదగ్గర వదలిపెట్టి, అనారోగ్యంతో యుద్ధఖైదీ శిక్షను అనుభవిస్తున్న భర్త దగ్గరికి బయలుదేరడంతో నవల మొదలౌతుంది. ఆమె భర్తను చేరుకోవడం, చేరుకోవడానికి అనేక బాధలు పడడం, భర్తకు దూరం కావడం, ఇద్దరూ చెరొక రకంగా ప్రాణాలు వదలడం ` ఈ పద్ధతిలో కథ సాగుతుంది. ఈ మధ్యలో డిసెంబరిస్టు విప్లవం జరగడం, విఫలం కావడం, నరోద్నిక్‌ విప్లవం మొదలు కావడం అదీ విఫలం కావడం ` ఈ చరిత్రంతా నడుస్తుంది. బోల్షివిక్‌ విప్లవ విజయంతో నవల ముగుస్తుంది. చరిత్రను చరిత్రగా, రాజకీయాలను రాజకీయాలుగా ఏకరువు పెట్టకుండా, రచయిత తన చేయితిరిగినతనంతో వాటిని సృజనాత్మకంగా కొన్ని ఫ్రేములలో బిగించారు.

ఈ నవలలో రష్యా రాజచరిత్ర, ఉద్యమాలు ఒక భాగం, అక్కడి మానవ సంబంధాలు, సంస్కృతి మరో భాగం. ఈ రెండు భాగాలనూ రచయిత తన అధ్యయన అనుభవాన్ని రచనా సామర్థ్యంతో రంగరించి నవల రాసి పాఠకుల ముందుంచారు.

సాధారణంగా పాలనాపరమైన రాజకీయాలలో ఏ చిన్న మార్పు వచ్చినా ప్రజలు ఆ మార్పు పట్ల కొంత ఆసక్తి చూపిస్తారు. కానీ, ఈ నవలలో జార్‌ చక్రవర్తులు మారుతున్నప్పటికీ ప్రజలు అసలు పట్టించుకోరు. ఎందుకంటే జార్‌ చక్రవర్తులు మారుతున్నా పాలనలో మార్పులు ఉండవు. అదే నిరంకుశత్వం కొనసాగుతూనే ఉంటుంది. ఈ నవలలో ఒకటవ భాగంలో నేపథ్యం అనే శీర్షికలో పాల్‌-1 హఠాత్తుగా చనిపోయిన సందర్భంలో ఈ విషయం చెప్పాడు రచయిత. ‘‘అధికశాతం జనాభా బానిసత్వంతో మగ్గే ఆ సామ్రాజ్యానికి ఏ జార్‌ వచ్చినా ఏమీ ఒరగదు… పేర్లు మారినా వ్యక్తుల తీరు అదే. నిజానికి జార్‌లంతా వారి ప్రాణాలకు … యముళ్ళన్నమాటే’’ అంటాడు రచయిత. ఈ మాటవల్ల ఎలాంటి రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా డిసెంబరిస్టులు తిరగబడ్డారో పాఠకులకు అర్థమౌతుంది. జార్‌లలో ఎవడన్నా ఒకడు కొంత మెతకవైఖరి కలిగున్నా అది తాత్కాలికమే అని కూడా ముందే రచయిత చెప్పడం వలన పాఠకులకు పాలకులలోని వైవిధ్యమూ, సాదృశ్యమూ అవగతమౌతాయి. పళ్ళు రాలగొట్టుకోడానికి ఏ రాయి అయితే ఏమి? అనే సామెత ఈ నవలలో వాస్తవికతను సమర్థిస్తుంది.

ఈ నవల చాలావరకు మరీయ గుర్రబ్బండి మీద ప్రయాణిస్తూ జరిగిపోయిన చరిత్రంతా నెమరు వేసుకోవడంలోనే నడుస్తుంది. ఇది సుదీర్ఘమైన నెమరు రూపంలో సాగుతుంది. పాల్‌-1 మరణం తర్వాత అలెగ్జాండర్‌ -1 రాజు కావడం, ఆ తర్వాత జరిగిన యుద్ధాలు, నెపోలియన్‌తో రష్యా చేసిన యుద్ధం, అందులో ఆమె భర్త సెర్యోషా (సెర్గీ) నిర్వహించిన వీరోచిత పాత్ర, అతనితో తన వివాహం, జారిజం మీద జరిగిన తిరుగుబాటు, అందులో సెర్యోషా పాత్ర, అతను ఖైదీ కావడం ` ఇలాంటివన్నీ ఆమె గుర్తు చేసుకొనే పద్ధతిలో నవలలో చిత్రింపబడ్డాయి.

సెర్యోషా రాజకుటుంబానికి చెందిన సైనికాధికారి. అతడు నెపోలియన్‌తో యుద్ధం చేసినప్పుడు గొప్ప దేశభక్తుడు. అతడే స్వదేశీ జార్‌ పాలకుల మీద తిరుగుబాటు చేస్తే నేరస్థుడు అయ్యాడు. ఇది ఈ నవలలో ముఖ్యమైన విషయం. విదేశీ దురాక్రమణను అడ్డుకుంటే దేశభక్తుడు. స్వదేశీ దుర్మార్గాలను అడ్డుకుంటే నేరగాడు కావడం ఈ నవల చేసిన ప్రతిపాదన. ఎన్‌టి రామారావుగారు  ఒక సినిమాలో ఇలాంటి విషయం ప్రస్తావించారు.

ఈ నవలలో సెర్గీ, మరీయ ప్రధాన పాత్రలు. వీళ్ళిద్దరూ రాజకుటుంబాలకు చెందిన వారు. ఇద్దరూ కళాకారులు. ఇద్దరూ అందమైన వాళ్ళు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. సెర్గీ తల్లికి కొడుకంటే కోపం, తిరుగుబాటు ఉద్యమం లేవదీశాడని. మరీయ తల్లికి కూతుర్లంటే ఎందుకో అయిష్టత. ఈ యిద్దరూ కళాకార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరికీ శ్రామికజనం పట్ల సానుభూతి ఉంది. డిసెంబరిస్టు ఉద్యమంలో ఇద్దరూ తమవైన పద్ధతుల్లో పాల్గొన్నారు. అయితే ఈ యిద్దరి మధ్య ఒక ప్రధానమైన తేడా ఉంది. సెర్గీ (సెర్యోషా) డిసెంబరిస్టు ఉద్యమంలో అవర్గీకృతుడైనాడు. రాజకుటుంబ లక్షణాలన్నిటినీ వదులుకొని సామాన్యమైన రైతు స్థాయికి చేరుకున్నాడు. రైతు అయ్యాడు. వ్యవసాయం చేశాడు. సామాన్యులతో, శ్రామికులతో కలసి జీవించాడు. వాళ్ళలో కలిసిపోయాడు. వాళ్ళ భాష నేర్చుకున్నాడు. వాళ్ళ భాషలోనే వాళ్ళతో మాట్లాడాడు. అసలు సిసలైన విప్లవకారుడయ్యాడు. మరీయ కూడా ఈ మార్గంలోనే చాలావరకు నడిచింది. చాలా కష్టాలు పడిరది. అవమానాలు అనుభవించింది. గుడిసెలలో బతికింది. కాని ఆమెలో ఎంతవద్దన్నా తన వర్గ అభిజాత్య లక్షణంతో సాగింది. ఇదీ వాళ్ళ మధ్య తేడా. ఈ నవల ఈ వాస్తవాలను చాలా వివరంగా, పాఠకులకు విసుగు కలగకుండా చిత్రించింది. ఉద్యమాలలో జీవితం గడిపే స్త్రీ, పురుష సంబంధాలలో ఎలాంటి పరిణామాలు వస్తాయో, ఒక్కోసారి ఆ పరిణామాలు హృదయ విదారకంగానే కాదు, అతి బాధాకరంగా ఉంటాయన్న సంగతి కూడా ఈ నవల చూపించింది. రాజ కుటుంబాలలో పుట్టి, వైభవోపేతమైన జీవితం గడిపవలసిన మరీయ సెర్గీలు తమ వర్గం నుంచి దూరమై కింది వర్గం కోసం ఉద్యమించడంలో వాళ్ళు చేసిన త్యాగాలు ఒకవైపు, వాళ్ళలోని వైరుధ్యాలు మరోవైపు నేటి పాఠకులను ఆలోచనలో పడవేస్తాయి. ఈ నవలలో ప్రగతిశీల పాఠకులకే కాదు, సామాన్యులకు సైతం బాగా నచ్చేది సెర్గీ అవర్గీకరణ స్వభావం. ఇది మనకు ఇవాళ చాలా ముఖ్యమైనది. అణచివేయబడిన వర్గాలలో పుట్టి ఆధిపత్యవాద వర్గ స్వభావాన్ని అలవరచుకొనేవాళ్ళు సెర్గీని చదవాలి. ఆధిపత్యవాద వర్గంలో పుట్టి ఆధిపత్య దోపిడీ చేసేవారు కూడా సెర్గీని చదవాలి. అలాగే ఆధిపత్యవాద వర్గంలో పుట్టి శ్రామిక వర్గ సంస్కృతివైపు ఆకర్షించబడి కూడా ఆధిపత్యవర్గ స్వభావాన్ని వదిలించుకోలేని వాళ్లు కూడా ఈ నవల చదవాలి.

౦౦౦

ఈ నవలలో సోవియట్‌ సాహిత్యంతో పరిచయమున్న వాళ్ళకు పుష్కిన్‌, టాల్‌స్టాయ్‌ వంటి రచయితలు తారసపడతారు. అది చాలా సంతోషకరమైన అంశం ఈ నవలలో. మనకు పరిచయమున్న వాళ్ళు కనిపించినంత ఆనందం కలుగుతుంది.

‘డిసెంబరిస్టు ఖైదీ’ నవలలో ప్రధాన కథ ‘డిసెంబరిస్టు విప్లవం’. అది విఫల

ఉద్యమం. భారతదేశంలో సంఘసంస్కరణ ఉద్యమం వచ్చింది. అది మేధావులు ప్రజలకోసం నడిపిన ఉద్యమం. భారత స్వాతంత్య్రోద్యమం వచ్చింది. అది మేధావులు, ప్రజలు కలిపి నడిపిన ఉద్యమం. దానికన్నా ఎక్కువ ప్రజాస్వభావం గల ఉద్యమం తెలంగాణ రైతాంగ పోరాటం. మొదటిది అంతగా విజయం సాధించలేకపోయింది. దానికి కారణాలున్నాయి. ఆ ఉద్యమ వైఫల్య ఫలితాలను ఇంకా మనం అనుభవిస్తున్నాం. తక్కిన రెండూ ఫలవంతమయ్యాయి. వాటికీ కారణాలున్నాయి. డిసెంబరిస్టు ఉద్యమం మన సంఘ సంస్కరణోద్యమమంత బలహీనమైనది కాదు గానీ, అది విఫలమైంది. బోల్షివిక్‌ విప్లవం విజయం సాధించింది. డిసెంబరిస్టు ఉద్యమం ఎందుకు విజయం సాధించలేకపోయింది? ఈ ప్రశ్నకు ఈ నవలే సమాధానం చెబుతుంది. డిసెంబరిస్టు

ఉద్యమం సమాజం పట్ల తమకు బాధ్యత ఉన్నది అనుకొన్న పైవర్గాల వాళ్ళు చేసిన

ఉద్యమం. వాళ్ళ త్యాగాలు చిన్నవికావు. అసాధారణమైనవే. వాళ్ళ అజెండా విప్లవాత్మకమైనది. రాచరిక వ్యవస్థ నశించి రిపబ్లిక్‌ వ్యవస్థ రావడం, బానిసత్వం రద్దుకావడం, సమాన హక్కులు రావడం, రైతుల దోపిడీ నశించడం ` వంటి ఆరోగ్యకరమైన అంశాలు వాళ్ళ ప్రణాళికలో ఉన్నాయి. అయినా ఉద్యమం విఫలమైంది. ఎందుకంటే అందులో ప్రజల భాగస్వామ్యం లేదు. ఉద్యమకారులంతా పైవర్గం, మధ్యమ వర్గాలకు చెందినవారే. ఈ విషయం డిసెంబరిస్టు ఉద్యమనేత అయిన సెర్గీకి ఆలస్యంగా అవగాహనకొచ్చింది. అందుకనే ఆయన ఒక సందర్భంలో తాము సాధించిన విజయాలను, ఫలితాలను చెప్పి ‘‘అనుభవంలోకి వచ్చినప్పుడే అసలైన కష్టాలు తెలుస్తాయి’’ అంటాడు. ఈ మాట ‘ఆత్మానుభవం అయితే తప్ప తత్వం బోధపడదు’ అనే గురజాడ మాటను తలపిస్తున్నది.  ఆయన దృష్టిలో డిసెంబరిస్టు విప్లవం విఫలమైనా, ఏమీ సాధించకుండా పోలేదు. సంపూర్ణ విజయం సాధించాలంటే ప్రజలు భాగస్వాములు కావడం ద్వారానే విప్లవం విజయవంతమౌతుంది అని ఈ నవల రుజువు చేసింది.

ఈ నవలలో మానవ జీవితం మీద సాహిత్యం చూపే ప్రభావం, పాలకులు గ్రంథాలను నిషేధించడం, అణచివేత, నిరంకుశ చట్టాలు చేయడం, మత మార్పిడులు, ఒక ఇంట్లోనే భిన్న భావజాలాలు గల వాళ్ళు ఉండడం, ఒక ఉద్యమకారుల సమూహంలోనే భిన్నాభిప్రాయాలు ఉండడం, ఉద్యమంలో ఐక్యత, ఘర్షణ సంబంధాలుండడం, పై వర్గాల అక్రమ సంబంధాలు, విప్లవకారులకు సామాన్యులు ఇచ్చే సహకారం, ఉద్యమకారుల బలహీనతలు ఉద్యమాలకు నష్టం చేయడం, తల్లిదండ్రుల స్వభావాలు, రాజద్రోహుల క్రూర ప్రవర్తన, పాలకుల హత్యాకాండ, పాలకులలోనే హత్యాకాండ వంటి అనేకాంశాలు చిత్రింపబడ్డాయి.

ఒక పెద్ద నవలకుండ వలసిన విశాలమైన కాన్వాస్‌ ఈ నవలకుంది. ఇంత పెద్ద నవలను పఠనీయంగా రాయడం నాగభూషణ్‌గారికి రష్యన్‌ సాహిత్యంతో గల అనుభవం కారణం కావచ్చు. రష్యన్‌ నవలల్లో ప్రతిచిన్న విషయాన్ని, సూక్ష్మాంశాన్ని వదిలిపెట్టకుండా చిత్రిస్తారు. మానవ జీవితాన్ని ప్రకృతిలో అంతర్భాగంగా చిత్రిస్తారు. ఈ నవలలో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది.

ఈ నవలలో వ్యాపారదృష్టి కాకుండా, పాఠకులను బోల్తా కొట్టించే దుర్బుద్ధి లేకుండా రచయిత పాఠకులకు అనేకచోట్ల ఉత్కంఠ కలిగించాడు. పాఠకులను తమవెంట తీసుకుపోయే శిల్పరీతులలో కథనం ఉత్కంఠ భరితంగా నడిపించడం ఒకటి. ఈ పెద్ద నవలలో నాగభూషణ్‌ గారు అనేక సందర్భాలలో ఉత్కంఠ కలిగించారు.

నాగభూషణ్‌గారు దేనినీ పనిగట్టుకొని చిత్రించినట్లు కనిపించరు. వర్గసమాజ లక్షణాలను ఆయన అనేక పర్యాయాలు చిత్రించారు. కానీ ఎక్కడా వాచ్యంగా చెప్పరు. అది పరిణతి చెందిన రచయిత చేసేపని. గ్రామాలపైన పూర్తి అధికారం దుర్మార్గులైన భూస్వాములకు దఖలు పరచి, రైతులకు సొంత భూములు లేకుండా చేసిన దుర్నీతిని రచయిత చాలా సున్నితంగా చిత్రించారు.

పాత్రల వ్యక్తిగత జీవితాలనే గాక, పాత్రల వర్గస్వభావానికి, చైతన్యానికి తగినట్లు సంభాషణలు రాయడం వాస్తవిక రచనా పద్ధతి. ఈ నవలలో ఈ లక్షణం పుష్కలంగా

ఉంది.

నూరేళ్ళ రష్యాదేశ ఉద్యమచరిత్రను నాగభూషణ్‌ మన కళ్ళముందుంచారు. ప్రపంచీకరణ ప్రవేశించి మనుషుల్ని విభజించి, అన్ని ఉద్యమాలనూ అణచివేసే పాలకుల్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నవల రావడం ముఖ్యమైన పరిణామం. దేశభక్తి అంటే,

ఉన్నదానినంతా ఆమోదించడమేనని ప్రచారం జరుగుతున్న  నేపథ్యంలో పాలకవ్యవస్థపై తిరుగుబాటు జరిగిన ఉదంతాన్ని నవలగా రాయడం, ఇప్పుడున్న ఉద్యమావసరాలను గుర్తుచేయడమే. ప్రపంచీకరణ దెబ్బకు అందరూ ప్రాదేశికతా పలవరింతలో మునిగిపోతున్న సమయంలో ఒక విదేశీ చరిత్రను వస్తువుగా తీసుకొని నవల రాయడం, ఆ పలవరింతను వ్యతిరేకించడం కాదు గానీ, మళ్ళీ మనం అంతర్జాతీయ చైతన్యంతో చేతులు కలపాలన్న సందేశం ఇవ్వడమే. మనదేశంలో ఎంత నిరంకుశత్వం కొనసాగుతున్నా, కొన్ని చారిత్రాత్మక ఉద్యమాలు నడుస్తున్న సమయంలో ఈ నవల రావడం గుర్తించాలి. చారిత్రకాభాస నవలలతో మునిగిపోయిన తెలుగు నవలా చరిత్రలో వాస్తవిక చారిత్రక నవలలు పరిమితంగానైనా కొన్ని వచ్చాయి. వాటిలో గొప్ప విప్లవ చారిత్రక నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’.

‘ఏ తిరుగుబాటు ఉద్యమానికైనా, అది కొంతకాలం పాటు నిలదొక్కుకొని సాగాలంటే, ప్రజల మద్దతు తప్పని సరి అని చెప్పక తప్పదు. భవిష్యత్తులో జరిగే ఏ పోరాటమైనా దీన్ని గుర్తించక తప్పదు. డిసెంబరిస్టు ఉద్యమం నేర్పే పాఠం ఇదే’ (సెర్గీమాట)

“Art is a textbook of life” Y.Borev : Aesthetics. P.112

Leave a Reply