రచయిత్రి నిత్య రాసిన “ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు “పుస్తకం పై ఒక సమీక్ష  . ఈ పుస్తకాన్ని “మహిళా మార్గం “పత్రిక వాళ్ళు 2002 జనవరి లో ప్రచురించారు . కృష్ణాబాయి గారు “ప్రజా రచయిత ప్రేమ్ చంద్ “అన్న పేరుతో ముందు మాట రాస్తూ “భారతీయ సాహిత్యంలో వాస్తవికతని బలంగా ప్రతిపాదించిన తొలిరచయితలలో ప్రముఖుడు ప్రేమ్ చంద్ “అని చెప్తూ  సమకాలీన సాహిత్యంలో మధ్య తరగతి స్త్రీల దౌర్భాగ్యస్థితి పట్ల కరుణ ,వారి త్యాగశీలత పట్ల అమిత గౌరవంతో రచనలు సాగుతూంటే ,ప్రేమ్ చంద్ గ్రామీణ స్త్రీల సమరశీలతనీ ,ధైర్యసాహసాల్నీ ,త్యాగాలన్నీ అద్భుతంగా చిత్రించాడు . గ్రామాలలో జమీందారులూ ,వడ్డీవ్యాపారులూ చేసే దోపిడీని కళ్ళక్కట్టాడు . వాటిని ఎదుర్కునే స్త్రీ పురుషుల్నీ ,వాళ్ళ విజయాల్ని గానం చేసాడు . రైతు కూలీ సమస్యల కిచ్చిన ప్రాధాన్యతనే స్త్రీ సమస్యలకు కూడా ఇచ్చాడు . ఈ పుస్తకంలో అలాంటి స్త్రీల పరిస్థితుల్నీ ,వాళ్ళ ఆవేదనల్నీ ,సాహసాల్నీ ప్రేమ్ చంద్ చిత్రీకరించిన తీరుని చక్కగా విశ్లేషించారు నిత్య . “అని అన్నారు . 

ఒక విధంగా చెప్పాలంటే రచయిత్రి నిత్య “సేవాసదన్ “,”నిర్మల” ,”గోదాన్ “,”గబన్” ,”కర్మ భూమి “నవలలను పరిచయం చేశారు . ఆ యా నవలలలోని   ప్రధాన స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ అయిదు వ్యాసాలను రాశారు . మహిళా మార్గం పత్రిక వాళ్ళు ఆ వ్యాసాలను 2002 జనవరి లో పుస్తకంగా ప్రచురించారు .రచయిత్రి నిత్య ఆ నవలలను తెలుగులో అనువాదం చేసిన వారి పేర్లను ఉదహరించి ఉంటే బాగుండేది . ‘సాంప్రదాయాల సంకెళ్ళను ఛేదించకుండా స్త్రీ జాతికి స్వేఛ్ఛా, సమానత్వాలు లభించవని చాటి చెప్పే   సజీవ పాత్ర సుమన్ “అనే వ్యాసంలో  -భారత స్త్రీల పరాధీనత,వరకట్న సమస్య ,వేశ్యల సమస్యలు ముఖ్యంగా చిత్రించబడ్డాయి .” అని చెప్తూ వయసులో ఆమెకంటే చాలా పెద్దవాడు ,చిన్న జీతగాడు ,పిసినారి అయిన  గజాధర్ సుమన్ కు విధించిన ఆంక్షల గురించి ఇలా ప్రస్తావించారు “సుమన్ ని ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళవద్దనీ ,దారిన పోయే వాళ్ళ కంటపడవద్దనీ గజాధర్ఆం క్షలు విధించేవాడు .   ఆమె రక్తమాంసాలు ఉన్న మనిషనీ ,ఆమెకీ ఒక మెదడుంటుందనీ దానికి ఓ ఆలోచన ఉంటుందనీ ఆమెకు ఒక మనసుంటుందనీ ,ఆ మనసుకు కొన్ని కోర్కెలు ఉంటాయనీ గుర్తించకుండా  తను రోజంతా కష్టపడి సంపాదించి తెచ్చి పడేస్తే చాలనుకుంటాడు . ఆమెలో జరుగుతున్న మానసిక సంఘర్షణ ను ఏమాత్రం పట్టించుకోడు . అనుమానించటం నిత్యకృత్యం . అని చెప్తూ  గజాధర్ పాత్ర స్వభావాన్నీ అలాగే సుమన్ పడుతున్న వేతనలనూ విశ్లేషించారు నిత్య  . సమాజంలో తనదైన స్థానం కోసం సుమన్ ఎలా ఆరాటపడిందో ఎంతో సహజంగా వర్ణించారు .తన పక్కింటి వేశ్య భోలీ ముందు డబ్బు దాసోహమనటమే కాకుండా మతం కూడా ఆమె కృపాకటాక్షం పై ఆధారపడి నడుస్తున్నదన్న విషయాన్ని గమనించింది  సుమన్. అయితే  విలాసవంతమైన జీవితం గడపటానికి వేశ్యావృత్తి లోకి ఆమె దిగలేదు . అలాగని లైంగిక విశృంఖలత్వాన్ని కోరుకోలేదు . ఒక వ్యక్తిగా సమాజంలో గుర్తింపును కోరుకున్నదని అని స్పష్టపరిచారు నిత్య  . “హృదయం   లేని మీ హిందూ ధర్మం రక్షణ కోసం నేనెందుకు కోరి కష్టాలు తెచ్చుకోవాలి ?దాని కోసం నేనెందుకు నా ప్రాణాలను పణంగా పెట్టాలి ?”విఠలదాస్ తో సుమన్ అన్న ఈ  మాటలలో  హిందూ ధర్మం లో ఉన్న డొల్లతనం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది . చివరకు సుమన్ వేశ్యల పిల్లల కోసం స్థాపించబడిన సేవాశ్రమానికి చేరుతుంది . వారి పుట్టుక ప్రభావం వారి జీవితాలపై పడకుండా భావిపౌరులుగా తీర్చిదిద్దే మహత్తర కర్తవ్యానికి తనను తాను అంకితం చేసుకోవటం ప్రేమ్ చంద్ ఆదర్శవాదానికి గొప్ప ఉదాహరణ గా చెప్పుకోవచ్చు . 

మధ్యతరగతి పాఠకులను అమితంగా ఆకట్టుకున్న  నవల “నిర్మల “.ఈ నవలలో పురుషాధిక్యత పై తిరుగుబాటు చేసిన “కల్యాణి “పాత్రను  విశ్లేషించిన తీరు బాగుంది . నిర్మల నవలలోని కథను సంక్షిప్తంగా వివరించి చెప్పారు రచయిత్రి . ఈ నవలలో నిర్మల పాత్ర వరకట్నానికి బలైతే ,రుక్మిణి బాల వితంతువు .  తన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ సవతి పిల్లలలో చూసుకొని ఆనందపడుతూ రుక్మిణీ లాగానే హిందూ వివాహ వ్యవస్థ యొక్క కట్టుబాట్లకు బలి అయింది.  కల్యాణీ ,సుధలు రెబల్ పాత్రలు .”రచయిత వీరిద్దరి ద్వారా గయ్యాళులుగా పిలవబడే వాళ్ళు లేక చూడబడేవాళ్ళు అలా మారటానికి వెనుక ఉన్న వారి చుట్టూ వున్న పరిస్థితుల ప్రాబల్యాన్ని ,వారి మానసిక స్థితిని వారు అలా మారే పరిణామక్రమాన్ని చాలా సహజంగా చిత్రించారు ” అని అంటారు నిత్య  .  వ్యాసం  చివరలో ” ప్రేమ్ చంద్  అన్యాపదేశంగానే నిర్మలా ,సుమన్ ల ద్వారా సమాజపు దుష్ట సాంప్రదాయాలు ,కట్టుబాట్ల మీద వ్యవస్థ నిర్మాణం మీదా తిరుగుబాటు చేయిస్తాడు . ఈ తిరుగుబాటు పోరాటానికి నాంది అయితే పోరాటం విముక్తికి సోపానం అవుతుంది . తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే మధ్యతరగతి స్త్రీలు తిరుగుబాటు వైపు నెట్టబడే క్రమాన్ని ఆయన అతి సహజంగా చూపిస్తాడు . ఈ విధంగా  ఉపన్యాసాలు,ప్రవచనాలూ అక్కర్లేకుండానే స్త్రీలలో చైతన్యాన్నీ ,స్ఫూర్తినీ  నింపుతాడు “అని చెప్తూ వ్యాసాన్ని ముగించారు  .

“గోదాన్ “నవలలోని ధనియా పాత్రను గ్రామీణ శ్రామిక స్త్రీల ప్రతినిధిగా అభివర్ణిస్తూ  “ప్రేమ్ చంద్ నవల లన్నింటిలో గ్రామీణ ,నగర జీవితాల చిత్రణ ఏకకాలంలో సాగుతుంది . పేద రైతులు అప్పుల భారంతో చితికిపోయి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ పట్టణాలకు వచ్చి కార్మికులుగా మారే క్రమం యొక్క సామాజిక పరిస్థితులను హృద్యంగా చిత్రించారు అని చెప్తూ  ”గోదాన్ నవలకు మూల ఆధారం ఆవు . గోదానము -అంటే -గోవును దానంగా ఇవ్వటం . చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరటానికి ఆవును బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఇదొక సాంప్రదాయం .”అని అంటారు . నవలలో ప్రముఖ పాత్రలు భార్యా భర్తలైన హోరీ ధనియాల  గురించి చెప్తూ ” హోరీ సహనానికి ప్రతీక ,ధనియా తిరుగుబాటుకి ప్రతీక హోరీ కర్మను నమ్ముతూ దోపిడీ అన్యాయాల ముందు తలొంచితే ధనియా మాత్రం అన్యాయం ,అక్రమం లేశ మాత్రం కనిపించినా వెంటనే నడుంబిగించి వాటిని ఎదుర్కోవటానికి సిద్ధపడుతుంది . హోరీ మితిమీరిన సాధు స్వభావాన్ని ఆవిడ భరించలేదు . ఆవిడలో వ్యవహార కుశలత లేదు . ముక్కు సూటి మనిషి . బయటికి ఎంత కఠోరంగా కనిపించినా మనసు మాత్రం వెన్నలాంటిది “అని అంటారు నిత్య  . గోమాత రైతు ఆస్థి అతని సర్వస్వం . అయితే హోరీ కి మాత్రం ఆవుతోనే కష్టాలు ప్రారంభమయ్యాయి వాటితోనే అతని జీవితం ముగుస్తుంది . ఊరి పెద్దలు వచ్చి ఆవును దానంగా ఇస్తే తప్ప హోరీ ఆత్మకు శాంతి కలగదని ధనియాతో అన్నప్పుడు 20 అణాలు బ్రాహణుడి చేతిలో పెడుతూ “ఇంట్లో ఆవూ లేదు . ఆవు దూడా లేదు . మొత్తం ఉన్నదంతా ఈ ఇరవై అణా లే . ఇదే ఆయన గోదానం అంటారు . “ధనియా దుష్ట సాంప్రదాయానికి చెంపపెట్టు పెడుతుంది అని చెప్తూ  తన విశ్లేషణలో ధనియా స్వభావాన్ని స్పష్టపరిచారు . నవలలో ధనియా పాత్ర గురించి ఆమె అన్యాయాలకు ,అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే స్తీ మూర్తి అని అభివర్ణించారు . 

నాయికా పాత్ర ప్రధానమైన నవల గబన్ గురించి చాలా చక్కగా విశ్లేషించారు నిత్య . తరతరాలుగా అణచివేయబడ్డ స్త్రీ జాతి మేల్కొంటున్న చైతన్యం “జాలప “అనే శీర్షిక ఈ వ్యాసానికి చాలా సముచితంగా ఉంది . ప్రేమ్ చంద్ స్త్రీ పాత్రల చిత్రీకరణలో ఒక కొత్త ఒరవడిని తీసుకు వచ్చారనేది కాదనలేని సత్యం . మధ్యతరగతి కుటుంబపు వాతావరణంలో పుట్టిన జాలప బాల్యంలో చంద్రహారం పట్ల వ్యామోహం పెరుగుతుంది . ఈ వ్యామోహం ఆవిడ మొత్తం జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తుంది . కథ మొత్తం జాలప పాత్ర చుట్టూనే ఉంటుంది . రమానాథ్ ఆమెను సంతృప్తి పరచటంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు  . అప్పుల ఊబిలో కూరుకుపోతాడు . అతనిని ఆ ఊబిలోనుంచి బయటకు తెచ్చే ప్రయత్నం కూడా ఆమె చేస్తుంది . జా లప త్యాగశీలత రామానాధ్ లో గొప్ప మార్పును తెస్తుంది . ఈ నవల ద్వారా మధ్యతరగతి జీవితాల మిధ్యాడంబర మరియు తప్పుడు ప్రతిష్ట కోసం ప్రాకులాడే స్వభావాన్ని నగ్నంగా ఎండగట్టారు రచయిత అని అంటారు నిత్య . 

కర్మభూమి నవల చాలా ప్రత్యేకమైనది . స్త్రీ ల పోరాట చైతన్యానికి ప్రతిబింబం “కర్మ భూమి “అన్న శీర్షిక తో రాసిన ఈ వ్యాసం లో ప్రేమ్ చంద్ తన కర్మభూమి నవలలో కార్యోన్ముఖులు ,సాహసులు ,త్యాగశీలురైన స్త్రీ పాత్రల్ని సృష్టించారు అని అంటారు  . అమరకాంత్ ,అతని  కుటుంబాన్నీ కేంద్రంగా చేసుకొని ముందుకు సాగుతుంది ఈ నవల . అయితే ఈ నవలలోని స్త్రీ పాత్రలన్నీ వైవిధ్య భరితమైనవి  సంతరించుకొని ఉన్నాయి . ఈ నవలను చాలా చక్కగా విశ్లేషించారు నిత్య . మున్నీ పాత్ర  కొంత ప్రత్యేకతను కలిగి ఉన్నది . మున్నీ ఒక గ్రామీణ స్త్రీ . పాలు తాగే బిడ్డకు తల్లి . ఒకరోజు ఆమె పొలంలో పనిచేసుకుంటుండగా తెల్ల సైనికులు ఆమె పై అత్యాచారం చేస్తారు . ఈ ఘటన జరిగిన రెండు నెలల తరువాత ఇద్దరు తెల్లసైనికులను నడి బజారులో కత్తితో పొడిచి చంపుతుంది మున్నీ . అప్పటి నుంచీ ఆ పట్టణ వాసులంతా మున్నీని దేవతగా పూజించటం మొదలు పెట్టారు . కోర్ట్ లో ఆమె పై కేసు కొట్టి వేయటం జరుగుతుంది . ఇంటికి తీసుకు వెళ్ళటానికి వచ్చిన భర్తతో తిరిగి  వెళ్ళటానికి ఇష్టపడదు మున్నీ . “ఇవాళ ఇక్కడ నాకు లభిస్తున్న ఆదరణా ,గౌరవాన్నీ చూసి నా భర్త నన్ను స్వీకరించటానికి సిద్దపడి ఉండవచ్చు .కానీ ఆయన మనసులో ఏముందో నాకు తెలుసు . నన్ను స్వీకరించిన తరువాత సమాజం నాతో పాటు అతనిని కూడా వెలివేసినట్లు చూస్తుంది .దానిని ఆయన తట్టుకోలేడు . నాతో సుఖంగా ఉండలేడు .”అంటూ తనని దూరంగా ఎక్కడైనా పంపిచేయ్యమని శాంతకుమార్ ను కోరటం మున్నీ పాత్ర యొక్క అవగాహనను తెలియపరుస్తుంది. 

పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న తమ నాయకుడిని విడిపించుకోవాలనే చైతన్యమే కాక దానికి తగిన చొరవా ,తెగవు చూపిన మున్నీ నేడు తెలంగాణా జనపథాలలోనూ ,దండకారణ్యం లోని పల్లెలలోనూ సమిష్టి చైతన్యంగా ,శక్తిగా మనకు దర్శనమిస్తుంది అని అంటారు రచయిత్రి . అంతేకాకుండా అమర్ అరెస్ట్ తరువాత ప్రజల్ని కూడగట్టే పనిని మున్నీ తీసుకోవటం ,గ్రామాల మీద పోలీసుల దాడులు ,క్యాంపులు ,మున్నీ అరెస్ట్ అవటం ఇవన్నీ నవలలో చెప్తూ కరువు ,శిస్తు సమస్య మొదలైన వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఎన్నుకోవటం ఆ కమిటీలో మున్నీ ని సభ్యురాలిగా ఎన్నుకోవటం తో నవలను ముగిస్తారు ప్రేమ్ చంద్ . ఈ సంఘటనలన్నిటినీ కళ్ళకు కట్టినట్టు వివరించారు నిత్య  . 

అంతేకాకుండా ప్రేమ్ చంద్ విశాల దృక్పథంలో సాహసం ఏ ఒక్కరి సొత్తూ కాదు . స్త్రీ ,పురుషులు ఇద్దరూ అందుకు అర్హులే అని ఆయన విశ్వసించాడు . మొత్తం స్త్రీ పాత్రలన్నీ ధైర్యం ,సాహసం కరుణ ,త్యాగం మేళవించిన త్యాగమూర్తులుగా ,సాహసమూర్తులుగా మనకు దర్శనమిస్తాయి . ఆయన స్త్రీ పాత్రలలో ఊగిసలాట కనపడదు అని చెప్తూ ఈ నవల మొత్తంలో ఒక బలమైన ఆకాంక్ష ఉంది . అదేమంటే ప్రజల న్యాయమైన పోరాటాలు వర్ధిల్లాలి . ఆయన ఆలోచనా వికాస క్రమంలో ఈ నవల రచనా కాలం సంధికాలానికి వర్తించేదని నిత్య అభిప్రాయపడ్డారు . ఈ అయిదు నవలలను ,అందులోని ప్రధాన స్త్రీ పాత్రలనూ పాఠకులకు సరళంగా అర్ధమయ్యే విధంగా ,చక్కగా ,అద్భుతంగా విశ్లేషించారు నిత్య . ఆమెకు జోహార్లు . 

Leave a Reply