నీరు-అడవి-భూమికోసం ఆదివాసీల పోరాటం చాలా కాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో వారు అలాంటి పోరాటమే ఒకటి చేస్తున్నారు. కొత్త భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటు, గ్రామంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. 115 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్యమంలో 33 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు.

‘మడోనార్ జన్ ఆందోళన్’ బ్యానర్‌పై జరుగుతున్న ఈ ఉద్యమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఇందులో పురుషులు-మహిళలు, పిల్లలు-వృద్ధులు అందరూ ఉన్నారు. తమ సంస్కృతిని, అడవిని కాపాడుకోవడం ఒక్కటే వారి లక్ష్యం.

నారాయణపూర్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో, ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రావ్‌ఘాట్, ఛోటేడోంగర్‌లో గనుల తవ్వకాలు మొదలుపెట్టారు. అందుకే రోడ్డు విస్తరణ చేస్తే ఇక్కడ కూడా గనుల తవ్వకాలు మొదలవుతాయేమోనన్న భయాందోళన వాతావరణం ప్రజల్లో నెలకొంది.

నారాయణపూర్ నుండి ఛోటేడోంగర్ వరకు దాదాపు 40 కి.మీ. దూరం కొండలు, అడవి మధ్య ఆదివాసీ ప్రాంతాల నుంచి ఇనుప లోడ్‌తో ట్రక్కులు నగరం వైపు వెళ్లే మార్గం ఇది. ఛోటేడోంగర్ వరకు మాత్రమే సాధారణ ప్రజలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ నుండి ఎడమవైపు వెళ్లే రహదారి మధోనార్. అక్కడికి వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలే ఆధారం.
115 రోజులుగా ధర్నా, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

ఈ స్థలంలోనే, గత 115 రోజులుగా, తమ రెండు అంశాల డిమాండ్ల కోసం నిరసనలు చేస్తున్నారు. ఛోటేడోంగర్ నుండి మధోనార్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ అడవులు, కొండలతో ఉన్న ఈ ప్రదేశంలో సీజన్‌లో తాము చేసుకునే పనిపాటల్ని వదులుకుని తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నారు.

ఈ నిరసన వేదిక ప్రవేశ ద్వారం వద్ద కలపతో ఏర్పాటు చేసిన బారికేడ్‌ల మీద ‘నిరవధిక సమ్మె ప్రదర్శన’ అని స్పష్టంగా వ్రాసి వుంది. అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చే వారి వివరాలు అడుగుతాడు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. తమ సాంప్రదాయ సాంస్కృతిక ఆయుధమైన బాణం విల్లు, ఇతర సాధనాలతో కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం బలహీనపడకుండా వుండడానికి రైతాంగ ఉద్యమంలోలా తినడానికి, తాగడానికి, బస చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రస్తుతం బస్తర్‌లో తెందు ఆకులు, చింతపండు, మహువ ఎండబెట్టి విక్రయించే సీజన్‌ కొనసాగుతోంది. ప్రజలు తమ పని చేసుకుంటూనే ఉద్యమంలో పాల్గొంటున్నారు.
ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఒకడైన, వ్యవసాయం చేసే బిజేంద్ర కుర్రం (22 ఏళ్లు) “ఈ స్థలం ఐదవ షెడ్యూల్‌లోకి వస్తుంది. అయితే గ్రామసభ అనుమతి లేకుండానే ఇక్కడ పోలీస్‌ క్యాంపును ప్రారంభించి రోడ్డు విస్తరణ చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అందుకు వ్యతిరేకంగా చాలా కాలంగా ఇక్కడ నిరసనలు చేస్తున్నాం. జనవరి నుండి 33 గ్రామాలు, 11 పంచాయతీల నుండి ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు, మాది రెండు అంశాల డిమాండ్‌లలో దేన్నీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. రాష్ట్ర ఉన్నతాధికారులు, పాలనా యంత్రాంగంతో పాటు ప్రధాని, రాష్ట్రపతికి లేఖలు రాసినా ఎవరి నుంచి స్పందన రాలేదు.

“ఒకటి, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు, రెండవది, మమ్మల్ని పోలీసులు వేధిస్తున్నారు. మా మీద చర్యలు చేపడుతున్నారు.”

నక్సలైట్‌గా ప్రకటిస్తారనే భయం
చాలా మంది యువకులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. బీజాపూర్ నుండి వచ్చిన అస్సీ రామ్ సలామ్ (26 సం) మొదటి రోజు నుండి ఉన్నాడు. ఇక్కడ కొత్త క్యాంపు, రోడ్డు విస్తరణ అయితే కనక ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నట్లుగానే ఆదివాసీల నుంచి అడవి, భూమిపై హక్కులు లాక్కుంటారని భయపడుతున్నాడు.

“ప్రస్తుతం ఇది రహదారి విస్తరణ, కొత్త క్యాంపు గురించి మాత్రమే. అయితే దీని వెనుక ఆదివాసీల అడవిని, భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశ్యం ఉంది” అని అంటున్నాడు.
ఈ విధంగా మా సంస్కృతికి హాని కలుగుతుంది. ప్రస్తుతానికి మేం మా అడవులను రక్షించుకుంటున్నాం, తరువాత పోలీసులు రక్షించే పేరుతో వచ్చి మమ్మల్ని వేధిస్తారు. దాంతో పాటు మా అడవులను కూడా అంతం చేస్తారు. ఇక్కడ పోలీసు క్యాంపు నిర్మిస్తే, మా స్వేచ్ఛ పూర్తిగా నాశనం అవుతుంది. పోలీసులు పెట్రోలింగ్ పేరుతో గ్రామానికి వస్తారు, ఆపై ఆదివాసీలను అబద్ధపు కేసుల్లో ఇరికించి వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం, జైలుకు పంపడం, కొట్టడం, నక్సలైట్లని చెప్పి ఎన్‌కౌంటర్లు చేయడం వంటి ఘటనలు జరుగుతాయి.
ఈ మాటల మధ్య, “ఈసారి ప్రభుత్వం మా మాట వినాల్సిందే మా డిమాండ్లను నెరవేర్చకుంటే నిరవధిక దీక్ష కొనసాగిస్తాం”అని బిజేంద్ర, అస్సీ ఏక స్వరంలో అన్నారు.
సీజన్‌లో పని చేసుకోలేకపోతున్నారు

ఆదివాసీ సంస్కృతితో పాటు నీరు, అడవి, భూమిని కాపాడేందుకు ప్రజలు వివిధ రకాలుగా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నారు. మోతీరామ్ 10 కి.మీ దూరంలోని అడెర్‌బేధా గ్రామం నుండి వచ్చాడు. మోతీరామ్ మొదటి రోజు నుంచి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అతని ముగ్గురు పిల్లలు చదువుకొంటున్నారు.

“నేను వ్యవసాయం చేస్తాను, ఇప్పుడు తెందు ఆకుల సీజన్ నడుస్తోంది, ఆ తర్వాత వరి నాట్లు వేసే సమయం వస్తుంది. ఇక్కడ వుందడం వల్ల చాలా నష్టం వస్తుంది, కానీ నేను ఈ నష్టాన్ని తట్టుకోగలను… దాదాపు ప్రతి 15 రోజులకోసారి లేదా అంతకంటే ముందే ఇక్కడ రేషన్ అయిపోగానే ఇంటికి వెళ్తాను. మనకు తిండి కూడా ముఖ్యం, తినకపోతే ఆందోళన ఎలా చేస్తాం?… అందుకే రేషన్ అయిపోగానే ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు సరుకులు తెస్తాను. పిల్లల్ని కూడా చూసినట్లుంటుంది” అని అంటాడు.

“ఎలా వున్నామో అలా బాగానే వున్నాం. మాకు విశాలమైన రహదారి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న రోడ్డు మాకు సరిపోతుంది. మాకు రోడ్లు, క్యాంపులు అక్కర్లేదు” అని మోతీరామ్ అంటున్నాడు.

ఐదో షెడ్యూల్‌ గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దాదాపు సగం ప్రాంతానికి ఐదవ షెడ్యూల్ వర్తిస్తుంది. దీని ప్రకారం బస్తర్ డివిజన్‌లో నీరు, అడవి, భూమిపై హక్కు ప్రజలకే చెందుతుంది. కానీ ఉద్యమంలో కూర్చున్న వారు తమకు ఈ సౌకర్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గంగూరామ్ మడావికి 55 ఏళ్లు. రాజకీయ పార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఆవేశపడిపోతాడు. భూపేష్ బఘెల్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. మా ప్రాంతంలో ఐదవ షెడ్యూల్, పెసా చట్టం అమలులో ఉన్నప్పుడు, గ్రామసభ అనుమతి లేకుండా క్యాంపును పెట్టడానికి ప్రభుత్వం ఎలా అనుమతించింది? అని ప్రశ్నిస్తున్నాడు.

బస్తర్ డివిజన్‌లోని చాలా మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆయాకాలాన్ని బట్టి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యమం జరుగుతున్న ప్రస్తుతం కాలంలో ఈ ప్రాంత ప్రజల ప్రధాన ఆదాయ వనరు మహూవా, చింతపండు, టెందు ఆకులు.

ఉద్యమంలో మహిళలు
మహిళలు భుజం భుజం కలిపి ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారు. ఉద్యమంలో పాల్గొంటున్న చాలా మంది మహిళలకు హిందీ భాష అర్థం కాదు. మహిళలు స్థానిక మాండలికం గోండి మాట్లాడతారు. లచ్ని వడేకు హిందీ రాదు. ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు తన ఏడాది చిన్నారితో కలిసి వచ్చింది. తన బిడ్డకు పాలిస్తూ మాతో మాట్లాడటానికి ప్రయత్నించింది.

“నేను, నా భర్త ఇద్దరమూ ఈ ఉద్యమంలో భాగమే. కొన్నిసార్లు నా భర్త ఇక్కడ వుంటే మరి కొన్నిసార్లు నేను వుంటాను. మేమిద్దరం ఇంటి, పొలం పనులతో పాటు ఉద్యమంలో పాల్గొంటున్నాం. ఎందుకంటే మా ఉనికికి ఉద్యమం అవసరం.

గొప్పే కశ్యప్ తొలినాళ్ల నుంచి ఉద్యమంలో భాగమైన వృద్ధురాలు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. కుటుంబం మొత్తం దానిపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం తన ఆదాయం గురించి కంటే ఎక్కువగా పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయడంపై ఆందోళన పడుతోంది .

… “ఇక్కడ భద్రతా దళాల క్యాంపు నిర్మాణం ప్రారంభం కాగానే, మా స్వేచ్ఛ అంతమైపోతుంది. ముఖ్యంగా మహిళలకు చాలా కష్టంగా ఉంటుంది. నేటికీ మేం నీరు-అడవి-భూమిపైనే ఆధారపడి ఉన్నాం. ఈ నాటికీ మహిళలు స్నానం చేయడానికి నదులు, వాగులు, చెరువులకు వెళ్లాల్సి వస్తోంది.

… “క్యాంపు మొదలైతే నాలుగు వైపులా పోలీసు పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. దానివల్ల మా రోజువారీ పనులకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విచారణ పేరుతో మహిళలను కూడా నక్సలైట్లుగా ప్రకటిస్తారు. ఈరోజు రోడ్డు విస్తరణ అంటున్నారు, రేపు గనుల తవ్వకాలు మొదలుపెడతారు. దీని వల్ల మన అడవులు, భూమి పూర్తిగా నాశనమవుతాయి. మా అడవిని మా దగ్గరే ఉండనివ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అడవి లేకుండా మనం అసంపూర్ణం, మనం లేకుండా అడవి అసంపూర్ణం.”

సీజన్‌లో పని చేసుకోవడం కంటే ఉద్యమం చాలా ముఖ్యం
సమ్లో మడావి వయసు దాదాపు యాభై ఏళ్లు ఉంటుంది. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆమె సుమారు ఏడు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. సమ్లో పెళ్లి చేసుకోలేదు. “సమస్య విషయానికొస్తే, నాకు చాలా సమస్య ఉన్న మాట వాస్తవమే, ఇది పని సీజన్, ఈ సమయంలో గ్రామం మొత్తం అడవి నుండి తెందు ఆకులను సేకరించడానికి వెళుతుంది, ఇంతకు ముందు ప్రజలు మహువా సేకరించారు. కానీ నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే సీజన్‌లో పని చేయడం కంటే నా అడవిని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. అడవిని కాపాడితేనే మన ఉనికిని కాపాడుకోగలం. ప్రస్తుతం మనం మన సంస్కృతిని కాపాడుకోవడం అవసరం. నేను కూడా అదే చేస్తున్నాను.”

నీరు, అడవి, భూమిని కాపాడేందుకు గతంలో కూడా నారాయణపూర్ జిల్లాలో ప్రజలు ఆందోళనకు దిగారు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఇందులో పాల్గొన్నారు. వీటన్నింటి మధ్య, రావుఘాట్, ఛోటేడోంగర్‌ల దగ్గర గనుల తవ్వకాలు మొదలయ్యాయి.

ఈసారి కూడా ప్రజలు నిరవధిక నిరసన ధర్నా ప్రదర్శనలో కూచున్నారు. ఇందులో పలువురు ఉన్నతాధికారులతో పాటు ప్రధాని, ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ విషయమై నారాయణపూర్‌ డీఎం అజిత్‌ వసంత్‌తో జన్‌చౌక్ మాట్లాడినప్పుడు “నారాయణపూర్‌లో కొత్త క్యాంపును తెరవకుండా నాలుగు వేర్వేరు ప్రదేశాలలో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఇది సుదీర్ఘ ప్రక్రియ. అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం ఏది సరైనదని భావిస్తుందో అది రాజ్యాంగ విలువలతోనే జరుగుతుంది. ఇది జిల్లా స్థాయి పని కాదు” అని అన్నారు.

బస్తర్ ఇనుము వున్న మూడవ అతిపెద్ద ప్రాంతం
చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పడమర వరకు నాలుగు దిశలలో ఖనిజ సంపదతో నిండి ఉంది. దీంతో వీటిపై ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల దృష్టి పడింది. గతేడాది ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు జరిగిన హస్‌దేవ్ అరణ్య కేసు దీనికి అతిపెద్ద ఉదాహరణ.

ప్రస్తుతం, ఛత్తీస్‌గఢ్ దేశంలోనే ఇనుప ఖనిజ నిక్షేపాలలో మూడవ స్థానంలో ఉంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని దంతేవాడ, నారాయణపూర్, బస్తర్, కంకేర్, బలోద్, రాజ్‌నాథ్‌గావ్, కబీర్‌ధామ్ జిల్లాలలో పెద్ద మొత్తంలో ఇనుప నిక్షేపాలు ఉన్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4031 మిలియన్ టన్నుల ఇనుము నిల్వలు ఉన్నాయి. ఇది మొత్తం దేశంలో 19.59 శాతం. ఉత్పత్తి పరంగా దేశంలోనే రెండో స్థానంలో ఉంది.

దంతేవాడలోని బైలాడిలా కొండ, నారాయణపూర్‌లోని రావ్‌ఘాట్, ఛోటేడోంగర్, భానుప్రతాపూర్ తహసీల్‌కు చెందిన చార్‌గావ్, కొండపారావ్, హాహాలద్ది కొండలలో హెమటైట్ రకం ఇనుము లభిస్తుంది.

రాఘాట్ కొండ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ కొండకు తూర్పు దిశలో ఉంది. ఇందులో ఆరు నిక్షేపాలు ఉన్నాయి. అందులో ఒకటి ఛోటేడోంగర్. అన్నీ చోట్లా ప్రజలు తమ డిమాండ్ల కోసం నిరవధిక నిరసనలు చేస్తున్నారు. ఈ కొండల్లో 732 మిలియన్ టన్నులు ఇనుము నిల్వలు వున్నాయి.


https://janchowk.com/zaruri-khabar/why-are-the-tribals-of-bastar-forced-to-go-on-indefinite-strike/

One thought on “ఎడతెరపి లేని వానల్లో నిరవధిక ఉద్యమం

  1. ప్రెసిడెంట్ ముర్ముకు యిలాంటి ఆందోళనలేవీ కమబడవు. గుళ్ళూ గోపురాలకే పరిమితమయిపోయారు. సొంత గొంతు లేని వారు ఎంత ఉన్నత పదవులలో వున్నా అది ప్రజలకు భారమే తప్ప‌ వారి వలన ఏ ఉపయోగమూ లేదన్నందుకు ఇదో పెద్ద ఉదాహరణ. రాష్ట్రాల విభజన ద్వారా రాజ్యం micro level లో పోలీసు యంత్రాంగం ద్వారా నియంత్రించడానికి ఆస్కారమేర్పడుతోంది. Mines వున్న ప్రాంతాలకే రోడ్లు వేస్తున్నాయి‌ ఒడిషా తో సహా‌ అన్ని‌ రాష్ట్ర ప్రభుత్వాలు. కార్పొరేట్ నియంత్రణ లో సాగుతున్న పాలకుల నుండి ప్రజా ప్రతిఘటనతోనే ఎదర్కోగలం. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమం గురించి main stream media రాయదు.

Leave a Reply