ప్రియా!
అన్వర్ ఇంటికాడ పీరీలు కట్టిన
యాపశెట్టు మొదట్లోనే ఎలిశిన పుట్టకు పసుపు కుంకుమల పూజ చేయడానికి నీవొచ్చినపుడు
ప్రేమంటే ఏంటని నేనడిగితే ఏమన్నావు?
ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకోవడం!
ఒకరి ఇష్టాలను ఒకరం గౌరవించుకోవడం!
స్వేచ్ఛను స్వేచ్ఛగా ఆస్వాదించడమనే కదూ..?
నేను తురకను!
నీవు హిందువువి!
మనం ప్రేమించుకోడమెట్లా? అన్నపుడు
ఏం నీవు మనిషివి కాదా? 
అని నువ్వు సూటిగా అడిగినపుడు
మబ్బులు తొలగినఆకాశమైంది నా ముఖం !
నేను ఆవు కూర అని నసుగుతుంటే-
నెయ్యి కూడా దాని రక్తమేలేనని
నీ తినే అన్నం చేతిని, నే తినే అన్నం చేతితో
ప్రేమగా అలాయి - బలాయి చేసినపుడు అలుగుబడ్డ శెరువైంది మనసు!

ఆకాశి పండుగ, బక్రీద్ పండుగ
ఒక్కనాడే కలిశొత్తే 
మనందరిండ్లల్ల కంచాలల్లో యేగేదిమూలుగు బొక్కల దరువేనన్న నీ మాటయాదికొత్తే 
నూరున్నొక్క రాగపు బహుజన తాళమైంది తనువు!

కానీ!
ఒక మాటింటావా ప్రియా?
నీవు నేను ప్రణయమాడటం కూడాపాపమవుతున్నదిపుడు!
వేప చెట్టుకు కట్టిన పీరీలు-
ఆ చెట్టు కిందనే చేసే పసుపు- కుంకుమల పూజలు శతాబ్దాల తరబడి జమిలిగా జరుగుతూ వస్తున్నా ఇప్పుడే ఎందుకు కొందరికి 
తప్పుగా కనిపిస్తున్నాయో తెలుసా?

దేశం ఒక వైపు!
మన ప్రేమ ఒక వైపు!

మన ప్రేమిప్పుడు
రాజకీయ ప్రయోగశాలలో
మతతత్వ పరీక్ష నాళికలో
పరీక్షకు పెట్టబడింది !

ప్రియా!
నా మది బాసను 
నీ హృదయానికి వినిపిద్దామని
నిన్ను నా హృదయానికి హత్తుకొందామంటే !
రెండంచుల పదునైన మతతత్వపు కత్తి ఒకటి 
అడ్డుగా ఉన్నది!
కొంచం నొప్పైనా ఓర్చుకో!
ఆ కత్తి మన ఇరువురి- హృదయాలు చీల్చుతున్నా- 
హత్తుకోవడం ఆపివేయవద్దు!
కత్తి అంచుల ఇరువురి రక్తం- కలిసి పారేటప్పుడైనా --
మనుషులంతా ఒక్కటేనని- తెలుసుకుంటారేమో ఏలికలు!
మన రక్తం వారి పరీక్ష నాళికల్లో లిట్మస్ టెస్టుకు గురౌతున్నపుడైనా-
ఎవరి మౌఢ్యమైనా-
ఒకే కమురు కంపు- కొడుతుందని-
తెలుసుకుంటారేమో- చాదస్తపు సన్నాసిగాళ్లు !


ప్రియా!
చివరి రక్తపు బొట్టు ఒడిసి ప్రాణమిడిశే దాకా
హత్తుకున్న మనం విడిపోవద్దు!
కనీసం మన నెత్తురైనా 
ఈ దేశానికి జీవ గంజై - లౌకికత్వానికి 
తిరిగి ప్రాణం పోస్తుందేమో..!?

One thought on “ఏకత్వం

Leave a Reply