ఏడేళ్ల నాటి కేసులో ఇటీవల అరెస్టయిన 94 ఏళ్ల కేరళ మానవ హక్కుల కార్యకర్త  ‘గ్రోవ్’ వాసు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బెయిల్ తీసుకో నిరాకరించాడు.

అనేక మంది న్యాయవాదులు, సహచరులు, పోలీసులు, కార్యకర్తలు జైలుకు వెళ్ళకుండా ఉండటానికి అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, కాని వాసు ‘నిరసన అనేది నేరం కాదు’ అనే తన రాజకీయ వైఖరిపై ధృఢంగా నిలబడ్డాడు.   ఎన్‌కౌంటర్ జరిగిన రోజున వాసు మీడియాతో మాట్లాడుతూ, “ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని మేము నమ్ముతున్నాము. ఎన్‌కౌంటర్ అరిగిన తరువాత పాత్రికేయులను ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తించింది. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వేరే మార్గం లేనందున నేను న్యాయ విచారణ కోసం కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు.

తనను అరెస్టు చేసినప్పటి నుండి వాసు పోలీసులకు, కోర్టుకు సహకరించడానికి నిరాకరించాడు, తనపై కేసు కల్పితమని, తాను ఎవరినీ అడ్డుకోలేదని, కేవలం కొన్ని నినాదాలు మాత్రమే చేసానన్నాడు. న్యాయవాది సహాయం తీసుకోవడానికి నిరాకరించి కోర్టులో తానే వాదించాడు. మరణించిన మావోయిస్టుల పక్షాన మాట్లాడిన ఆయన, వారి మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోర్టు, మీడియా ముందు పేర్కొన్నారు. తాను దోషి కాదు కాబట్టి  బెయిల్ పొందేందుకు లేదా జరిమానా చెల్లించడానికి నిరాకరించాడు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని కోర్టు చేసిన ప్రతిపాదనను తిరస్కరించాడు. ప్రతిసారీ తనను వ్యక్తిగతంగా హాజరు పరచాలని పట్టుబట్టాడు. కోర్టు ఆవరణలో మరణించిన మావోయిస్టులకు అనుకూలంగా నినాదాలు చేయకూడదని ఆదేశించినప్పటికీ అతను దానిని కొనసాగించాడు.

2016 డిసెంబరు 3న దక్షిణ భారతదేశంలోని వివిధ పౌర హక్కుల సంస్థల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో పాటు ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్ళేందుకు ప్రయత్నించినప్పుడు వాసును సంఘ్ పరివార్ కార్యకర్తలు అడ్డుకుని దౌర్జన్యం చేశారు. అతను అనేక సార్లు నీలంబుర్ ఎన్కౌంటర్, తన సహచరుడు నక్సలైట్ వర్గీస్ బూటకపు ఎన్కౌంటర్ మధ్య పోలికలను గురించి చెప్పారు.

వాసుపై మోపిన ఏ అభియోగాలను కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో, వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవడంతో జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వీపీ అబ్దుల్ సతార్ వాసును సెప్టెంబర్ 13 నాడు 45 రోజుల తర్వాత విడుదల చేశారు. వాసుతో సహా ఈ కేసులో 20 మంది నిందితులు ఉన్నారు. మిగతా 19 మంది నిందితుల్లో 17 మందిని సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా విడుదల అయితే, మిగిలిన ఇద్దరు ₹200 చొప్పున జరిమానా చెల్లించి విచారణకు హాజరుకాలేదు. మొదటి నిందితుడైన వాసుపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 143 (చట్టవిరుద్ధమైన సమావేశం), 147 (అల్లర్లు), 283 (అధికారుల విధి నిర్వహణలో ఆటంకం కలిగించడం) కింద అభియోగాలు మోపారు.

చట్టవిరుద్ధమైన సమావేశానికి సంబంధించి  ఎటువంటి అధికారిక ఫిర్యాదులు లేవని, ఒకరు తప్ప, ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్షులందరూ పోలీసులేనని కోర్టు గుర్తించింది. ఆ ఒక్క సాక్షి కూడా వాసును నిరసనకారులలో వున్నట్లుగా గుర్తించలేక పోయాడు. కీలక సాక్ష్యాన్ని సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.

2023కి వస్తే, జూలై 29న ‘గ్రో’ వాసు అని పిలవబడే 94 ఏళ్ల వాసు కోసం పోలీసులు వచ్చినప్పుడు, తన దినచర్య అయిన గొడుగు తయారీలో ఉన్నాడు.

ఏడేళ్ల క్రితం అతనితో పాటు ఇతరులపై నమోదైన కేసులో అతడిని అరెస్టు చేసి కూనమంగళం సబ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 2016లో ఇద్దరు మావోయిస్టులను చట్టవిరుద్ధంగా పోలీసులు హత్య చేశారని ఆరోపిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమం అది.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారెంట్‌ కారణంగానే ఈ అరెస్ట్‌ జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. మెజిస్ట్రేట్ వీపీ అబ్దుల్ సత్తార్, సాంప్రదాయ పద్ధతిలో వాసుకు బెయిల్ మంజూరు చేసాడు. కానీ తన ఆదర్శాలతో  దృఢంగా నిలబడిన వాసు, పత్రంపై సంతకం చేయడానికి నిరాకరించి బదులుగా జైలు శిక్షను ఎంచుకున్నాడు. అతని సందేశం స్పష్టంగా ఉంది.

“నన్ను ఎందుకు విచారణ చేసారు? బూటకపు ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది మరణాలకు కారణమైన అధికారులను ఎందుకు బాధ్యులుగా చేయరు? ఇది ద్వంద్వ న్యాయం” అని అతను జైలుకు వెళ్లే ముందు ఉద్వేగంగా వాదించాడు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇలా అసమ్మతిని వినిపించేందుకు అనుమతించినందుకు విధుల్లో ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టింది. ప్రజా నిరసనకు భయపడిన అధికారులు కేసును రద్దుచేసి, వాసును విడిచిపెట్టడానికి హడావుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు. వరుసగా మూడు సార్లు కోర్టు ముందు హాజరుపరచగా బెయిల్ పత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించి వాసు మళ్లీ జైలుకు వెళ్లాడు.

న్యాయవాది తుషార్ నిర్మల్ “ఎన్కౌంటర్ అని చెబుతున్న ఘటనపై విచారణ ప్రారంభించి, దానిలో పాల్గొన్న అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనేది వాసుట్టాన్ డిమాండ్. ఆయన డిమాండ్ 2014 లో పియుసిఎల్ వర్సెస్ మహారాష్ట్ర రాష్ట్రం & ఇతరులపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై ఆధారపడింది. ఇది ఆయన ప్రజాస్వామిక డిమాండ్. ఆయనను అరెస్టు చేయడానికి అస్పష్టమైన కారణాలు, ఆరోపణలను ఉపయోగించారు” అన్నారు.

చేనేతకారుడి నుంచి కమ్యూనిస్టుగా…

వాసు కేరళకు చాలా సందర్భోచితమైనదిగా చేసింది సామాజిక అసమానతలు, రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా అతని 75 ఏళ్ల సుదీర్ఘ తిరుగుబాటు చర్యలు. స్వతంత్ర భారతదేశం, ఏకీకృత కేరళ పుట్టకముందే, వాసు తన యుక్తవయస్సులో కోజికోడ్‌లోని కామన్వెల్త్ ట్రస్ట్ హ్యాండ్లూమ్ వీవింగ్ కంపెనీలో కార్మిక నేత అయాడు.

కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన పి. కృష్ణ పిళ్ళై, కామ్‌ ట్రస్ట్ కార్మికులను సంఘటితం చేయడానికి అప్పుడప్పుడు కర్మాగారానికి వెళ్ళినప్పుడు అతనితో స్నేహం చేశాడు. కృష్ణ పిళ్ళై పాము కాటుతో చనిపోవడానికి ముందు, రాజ్య అణచివేతను తప్పించుకోడానికి 1948లో ట్రావెన్‌కోర్‌లో వుంటున్నప్పుడు వాసు కమ్యూనిస్టు భావజాల ప్రభావితుడయ్యాడు.

“కామ్ ట్రస్ట్ ఫ్యాక్టరీ ముందు కార్మికుల కోసం కామ్రేడ్ కృష్ణ పిళ్ళై ఎదురుచూస్తుండటం చూశాను. ఆయన కేరళలోని కమ్యూనిస్టులందరికీ పాఠ్య పుస్తకం” అని వాసు 2013లో తన జ్ఞాపకాల పుస్తకంలో పేర్కొన్నారు. అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడు. 1964లో పార్టీ విచ్ఛిన్నం అయినప్పుడు, కొత్తగా ఏర్పడిన సాపేక్షంగా రాడికల్ వర్గం అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తో కలిసి నిలబడ్డాడు.

.సిపిఐ (ఎం) లో తీవ్రమైన సిద్ధాంత యుద్ధం కొనసాగింది. 1967లో పశ్చిమ బెంగాల్‌లో స్వల్పకాలిక నక్సల్బరీ రైతు తిరుగుబాటు తర్వాత అది మరింతగా చీలిపోయింది. కానీ వాసుకి మాటం ఎలాంటి గందరగోళం లేదు. బెంగాల్‌లో చారు మజుందార్, కేరళలో కున్నిక్కల్ నారాయణన్ నేతృత్వంలోని నక్సలైట్ ఉద్యమంలో అతను మరింత రాడికల్‌గా మారాడు. “ప్రపంచంలో ఎవరూ అతని ఇష్టానికి విరుద్ధంగా అతనిని గందరగోళపరచలేరు. అతను ధైర్యం, కరుణల కలయికకి  ప్రతిరూపం” అని వాసు జీవిత చరిత్రను వ్రాయడానికి ప్రయత్నించి సగంలో విరమించుకున్న యువ జర్నలిస్టు కె ఎ సైఫుద్దీన్ వివరించారు

” అతడు గత ఘటనలను వివరించేటప్పుడు చెందిన వేదనను నేను భరించలేక పోయాను. ఒకానొక సమయంలో, గత భయానక పరిస్థితులలోకి అతనిని తీసుకువెళ్లడం అతని జీవితాన్ని దెబ్బతీస్తుందని నేను భయపడ్డాను,” అని సైఫుద్దీన్ మలయాళ వారపత్రికలో ఎనిమిది అధ్యాయాలు ప్రచురితమయ్యాక వాసు జీవిత చరిత్రను రాయడం ఎందుకు ఆపేశాడో వివరించాడు. 1969లో తిరునెల్లి-త్రిసిల్లెరి చర్య కోసం నక్సలైట్లు ఏర్పాటు చేసిన నిర్మూలన బృందంలో వాసు సభ్యుడు. ఆ చర్య కమాండర్ అరిక్కాడ్ వర్గీస్‌ను పట్టుకుని చంపేసే ముందు పోలీసులు వాసుని అరెస్టు చేశారు.

“విచారణ ఖైదీగా ఏడు సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాడు. అత్యవసర పరిస్థితి అనంతరం జనతాపార్టీ పాలనలో జైలు నుంచి విడుదలైనప్పుడు చాలా అనారోగ్యంతో వున్నారు. వాసును పోలీసులు అత్యంత క్రూరంగా హింసించారు” అని ఈ కేసులో సహ నిందితుడు, 1986లో నిర్దోషిగా తేలిన ముండూరు రావున్ని చెప్పారు.

1970లో కేరళలో జరిగిన మొదటి ఎన్‌కౌంటర్ హత్యను వివరిస్తూ ఒక శోకతప్తుడైన పోలీసు రాసిన ఒప్పుకోలు నోట్‌లోనివి ఈ క్రింది భయానక  ఘటనను రాసి పెట్టుకున్న పోలీసు కానిస్టేబుల్ పి రామచంద్రన్ నాయర్ కొన్నాళ్ల తర్వాత, పశ్చాత్తాపపడి, కలత చెంది ఈ నోట్‌ని హత్యకు గురైన అరిక్కాడ్ వర్గీస్ సహచరుడు అయీనూర్ వాసుకు అప్పగించాడు.

“ఒకరు వర్ఘీస్ ను ఒక కొండ రాయిలో ఉన్న పగులు దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఛాతీ వరకు  మాత్రమే కనిపిస్తున్నాడు.  లక్ష్మణుడు నన్ను కాల్చమని ఆదేశించాడు. నేను బారెల్‌ను వర్ఘీస్ ఛాతీకి దగ్గరగా ఉంచాను. మా మధ్య దూరం రైఫిల్ పొడవు మాత్రమే, అంటే కేవలం నాలుగు అడుగులు. అది .303 రైఫిల్. ఆ రోజు 1970 ఫిబ్రవరి 18. సమయం సాయంత్రం 6.55 గంటలు. వర్ఘీస్ అంతకు ముందు కోరినట్లు, నేను సంకేతంగా ‘శూ’ అని శబ్దం చేసాను. నేను అతని ఛాతీ పైన బారెల్ ఒత్తి పట్టాను. వెంటనే అతను  ‘  విప్లవం వర్ధిల్లాలి” అని నినాదాలిచ్చాడు.  తుపాకి పేలింది. వర్ఘీస్ కుడివైపుకు పడిపోయాడు. ఆ విధంగా అతనికి చివరి ముద్ద తినిపించిన చెయ్యే అతన్ని చంపేసింది.”

వాసు ఈ విషయాన్ని 28 సంవత్సరాల పాటు రహస్యంగా ఉంచాడు. ఎట్టకేలకు 1998లో మధ్యమం వీక్లీ ద్వారా బహిరంగపరచడంతో కేరళ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. కేరళ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు యిచ్చిన ఆదేశం ఒక ఆసక్తికరమైన కోర్టు విచారణకు దారితీసింది. కేరళ పోలీస్‌లో మాజీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన కె లక్ష్మణ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

“స్వాతంత్య్ర భారత్ లో ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్యలకు పాల్పడిన పోలీసు అధికారికి ఇది మొదటి పెద్ద శిక్ష కావడం గమనార్హం. ఇందులో వాసు పాత్ర కీలకం” అని న్యాయవాది, మాజీ శాసనసభ్యుడు డాక్టర్ సెబాస్టియన్ పాల్ చెప్పారు.

వాసు ‘గ్రో’ (GROW) వాసుగా ఎలా మారారు?

1986లో కోజికోడ్ సమీపంలోని మౌవూర్లో గ్వాలియర్ రేషన్స్ వర్కర్స్ ఆర్గనైజేషన్ (జిఆర్‌ఓడబ్ల్యూ) ను ప్రారంభించినప్పుడు వాసు ‘GROW’గా మారారు. ఇది కేరళ చరిత్రలో గ్వాలియర్ రేషన్స్& సిల్క్ మాన్యుఫ్యాక్చరింగ్ లేదా గ్రాసిమ్ పరిశ్రమలను, కేరళ లోని అతిపెద్ద పారిశ్రామిక యూనిట్‌ను తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ 18 నెలల పాటు సాగిన తీవ్రమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమం వాసు, అతని సహోద్యోగి మొయిన్ బప్పు ఆమరణ నిరాహార దీక్షతో ముగిసింది.

ప్రధాన మంత్రి ఎ. కె. నయనార్ వాసు కు తన చేతివ్రాతతో ఒక వ్యక్తిగత లేఖ రాశారు. తన డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా అంగీకరిస్తుందని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే ఆయన ఒప్పుకున్నారు” అని సీనియర్ రాజకీయ నాయకుడు సిపి జాన్ వాసును ఉద్యమాన్ని ఉపసంహరించుకోవాలని ఒప్పించేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నారు. పదేళ్ల తరువాత, అదే వాసు మరో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఈసారి, నియంత్రిత కాలుష్యం కారణంగా మానవ జీవితాన్ని దుర్భరంగా చేసిన గ్రాసిమ్ పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేశారు.

సీనియర్ రాజకీయ నాయకుడు సిపి జాన్ ఆందోళనను ఉపసంహరించుకునేలా వాసును ఒప్పించేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఇ. కె. నాయనార్ వాసుకు వ్రాసిన లేఖను సిపి జాన్ స్వయంగా వాసుకు అందజేసినప్పుడు “ప్రభుత్వం తమ డిమాండ్లకు పూర్తిగా అంగీకరిస్తుందని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే ఆయన ఒప్పుకున్నారు.”

పదేళ్ల తర్వాత అదే వాసు మరో ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈసారి, అనియంత్రిత కాలుష్యం కారణంగా మానవ జీవితాన్ని దుర్భరం చేసిన గ్రాసిమ్ పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేశారు.

కోజికోడ్ మెడికల్ కాలేజ్‌కు చెందిన అవినీతిపరులైన వైద్యులపై నక్సలైట్లు జరిపిన ప్రసిద్ధ బహిరంగ విచారణలో కూడా ఆయన పాల్గొన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం ఉన్నప్పటికీ, వాసు కేరళ అంతటా పర్యటిస్తూ, ఎన్ఆర్సి-సిఎఎ వ్యతిరేక, శ్రామిక వర్గపు వివిధ నిరసనలతో సహా, అట్టడుగున ఉన్న ప్రజల కోసం అన్ని ప్రజా నిరసనలలో ముందంజలో ఉన్నాడు. నరేంద్ర మోదీ పాలనను అనుసరిస్తున్న పినరాయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.

‘మరువాకు’ మాస పత్రిక సంపాదకురాలు అంబికా తన నిరసనను సోషల్ మీడియాలో ఇలా రాశారు, ‘వాసుట్టన్‌ను అరెస్టు చేయడం రాజ్య హింస. ఇలాంటి చట్టవ్యతిరేక హత్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కును రాజ్యం రద్దు చేస్తోంది, ఇది రాజ్యాంగ విరుద్ధం. దాదాపు 95 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి జైలులో పెట్టాలనే ఈ ఉత్సాహం ఏ కారణం చేతనైనా ఆమోదయోగ్యం కాదు. అతను ఒక హంతకుడు లేదా సంఘ వ్యతిరేకి కాదు. గత ఎనిమిది దశాబ్దాలుగా అణచివేతకు గురైన ప్రజలతో పాటు వారి విముక్తి కోసం పోరాడిన మానవ హక్కుల కార్యకర్త.

 2016లో జరిగిన ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పియుసిఎల్ కేరళ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ పి.ఎ. పూరన్, వాసు అరెస్టును చట్టవిరుద్ధం, ఏకపక్షం, న్యాయశాస్త్రంలోని అన్ని ఆమోదయోగ్యమైన సూత్రాలకు విరుద్ధంగా వున్నదని అన్నారు. 

 “నిలంబూరు ఎన్‌కౌంటర్ ముసుగులో ఇద్దరు అమాయకులు, కదలలేని నిరాయుధ వ్యక్తులను దారుణంగా హత్య చేసినందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం నేపథ్యంలో కేసు నమోదు చేయాలని పియుసిఎల్, కేరళ యూనిట్ కేరళ పోలీసు ఉన్నతాధికారులను కలిసింది. కానీ, సంబంధిత పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడానికి బదులు, వారు నా వాంగ్మూలాన్ని తీసుకొని ఫైల్‌ను మూసి వేసారు” అని ఆయన చెప్పారు.

“పిన్నారై విజయన్ ఎకె నయనార్ కాదని, కేరళలో రాజకీయాలు చాలా మారిపోయాయని వాసుకి తెలుసు. అయితే, తాను తప్పుగా భావిస్తున్న చర్యలకు ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయాలని ఆయన ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు” అని జాన్ చెప్పారు. వాసు లేవనెత్తుతున్న అంశం తీవ్రమైనది. నక్సలైట్ వర్గీస్ దారుణ హత్యకు 46 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 2016లో ముఖ్యమంత్రిగా పినరై విజయన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీసుల కాల్పుల శబ్దం కేరళలోని అడవుల్లో వినిపించింది.

2016 నవంబర్లో తమిళనాడుకు చెందిన కుప్పూ దేవరాజన్, అజితా అలియాస్ కావేరి మలపురం జిల్లాలోని కరులై పర్వత శ్రేణుల్లో హత్యకు గురయ్యారు. 2019 మార్చిలో, మలయాళీ మావోయిస్ట్ అయిన సిపి జలీల్ను వైనాడ్ జిల్లా లక్కీడి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ వెనక భాగంలో కాల్చి చంపారు.

2016లో జరిగిన ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పియుసిఎల్ కేరళ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ పి.ఎ. పూరన్, వాసు అరెస్టును చట్టవిరుద్ధం, ఏకపక్షం, న్యాయశాస్త్రంలోని అన్ని ఆమోదయోగ్యమైన సూత్రాలకు విరుద్ధంగా వున్నదని అన్నారు. 

 “నిలంబూరు ఎన్‌కౌంటర్ ముసుగులో ఇద్దరు అమాయకులు, కదలలేని నిరాయుధ వ్యక్తులను దారుణంగా హత్య చేసినందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం నేపథ్యంలో కేసు నమోదు చేయాలని పియుసిఎల్, కేరళ యూనిట్ కేరళ పోలీసు ఉన్నతాధికారులను కలిసింది. కానీ, సంబంధిత పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడానికి బదులు, వారు నా వాంగ్మూలాన్ని తీసుకొని ఫైల్‌ను మూసి వేసారు” అని ఆయన చెప్పారు.

అదే సంవత్సరం అక్టోబరులో, కర్ణాటకకు చెందిన శ్రీమతి అలియాస్ రీమా, సురేష్ అలియాస్ అరవిందన్, కార్తీ, మణివాసం అనే ముగ్గురిని గిరిజనులు అధికంగా ఉండే పాలక్కాడ్ జిల్లాలోని అట్టప్పాడిలో కాల్చి చంపారు. 2020 నవంబరులో తమిళనాడుకు చెందిన వెలుమురుకాన్ వైనాడ్ లో హత్యకు గురయ్యాడు. “వాసు లాంటి హక్కుల కార్యకర్తలు ఈ హత్యలన్నీ ట్రిగ్గర్ హ్యాపీ బూటకపు ఎన్కౌంటర్లు అని అనుమానిస్తున్నారు. న్యాయ విచారణలను డిమాండ్ చేస్తున్నారు. అందుకే వారిని మాట్లాడకుండా చేస్తున్నారు” అని కేరళ ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ అన్నారు.

వృద్ధాప్యం, అనారోగ్యం ఉన్నప్పటికీ, వాసు కేరళ అంతటా పర్యటిస్తూ, ఎన్ఆర్సి-సిఎఎ వ్యతిరేక, శ్రామిక వర్గపు వివిధ నిరసనలతో సహా, అట్టడుగున ఉన్న ప్రజల కోసం జరిగిన అన్ని ప్రజా నిరసనలలో ముందంజలో ఉన్నాడు. నరేంద్ర మోదీ పాలనను అనుసరిస్తున్న పినరాయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఆయన జీవితాంతం అణగారిన ప్రజల పక్షాన నిలిచారు. అతను లేవనెత్తడానికి ప్రయత్నించే అంశం వాస్తవం, చాలా ముఖ్యమైనది. కమ్యూనిస్ట్ పార్టీ కోసం బ్యాండ్ సెట్‌ను కొనుగోలు చేయడానికి అదనపు ఆదాయ వనరుగా అతను 1950లలో నేర్చుకున్న గొడుగులు తయారు చేసే వ్యాపారాన్ని విడుదలయ్యాక తిరిగి మొదలు పెట్టవచ్చు. త్వరలో తన 94వ పుట్టినరోజును సమీపిస్తున్నందున, అతను తన మారివిల్ కుడకల్, అంటే ఇంద్రధనస్సు గొడుగులతో కోజికోడ్ శివారులో కనిపించవచ్చు. అతని సంకల్పం ఎప్పటికీ దృఢంగా వుంటుంది.

One thought on “94 ఏళ్ల ‘గ్రోవ్’ వాసు అరెస్టు-విడుదల

  1. వాసు పై వ్యాసం చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. వ్యాసంలో కొన్ని వాక్యాలు రిపీట్ అయ్యాయి. సరిచేయండి

Leave a Reply