మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు
మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వృద్ధిని పెంచాయి కాని ఉపాధిని పెంచలేదు. సంపద పెరిగింది కాని పంపిణీ జరుగలేదు. పెట్టుబడులు పెరిగాయి కానీ అవి ఉత్పత్తి రంగంలో కాకుండా సేవా రంగాల్లోకి వెళ్లాయి. ఆర్థిక సంస్కరణల తదుపరి పలు ప్రభుత్వ రంగాల నుంచి తన వాటాను ఉపసంహరించుకుంటున్న కారణంగా ప్రభుత్వ రంగంలో ఉపాధి సన్నగిల్లింది. ఫలితంగా రిజర్వేషన్ సదుపాయం అటకెక్కింది. సామాజిక న్యాయం పాతాళానికి తోయబడింది. మరోవైపు ప్రభుత్వమే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలకు ఒడిగట్టడంతో తక్కువ వేతనాలకు కార్మికులు పనిచేస్తున్నారు. దేశ ప్రగతిని మానవాభివృద్ధిలో కాకుండా ఆర్థిక వృద్ధితో అంచనా వేస్తున్నారు.