నగ్నంగా ఊరేగించబడింది
అత్యాచారం గావించబడింది
అత్యంత దారుణంగా హత్యగావించబడింది
ఆదివాసీలు,
అడవి బిడ్డలు మాత్రమే కాదు.
ఇంకేదో..
ఇంకా ఏదో, ఏదేదో...
*
బలహీనుల ఎదుట అధికారం
అస్సలు మాట్లాడదు
నిశ్శబ్దంగా తన పనేదో తాను చేసుకుంటూ వెడుతుంది.

హక్కుల్నే కాదు
మాన ప్రాణాల్ని  
రద్దు చేసేస్తుంది 

మీరింకా పాఠాలు  మాత్రమే మారిపోయాయని,
 అనుకుంటున్నారు.
చిన్నప్పటినుండి చేస్తున్న
'ప్రతిజ్ఞ 'ను కూడా 
మార్చేసిన విషయం ఇంకా తెలియదు.

మనుషులందరూ సమానం కాదని అందరూ సోదర సోదరీమణులు కాదని
అందరికీ హక్కులు ఉండవని
వాళ్లు కొత్త గొంతుతో ప్రతిజ్ఞ మొదలుపెట్టేశారు
*
నోట్ల కన్నా ముందే
స్త్రీత్వం, మనిషితనం
ఆత్మగౌరవం, ఆత్మాభిమానం
స్వేచ్ఛ, సమానత్వం
వాక్ స్వాతంత్రం 
అన్నింటినీ రద్దు కాబడ్డాయి.

కళ్ళుండి చూడలేని తనం వల్ల
 చెవులుండీ వినలేనితనం వల్ల నోరుండి మాట్లాడలేనితనం వల్ల
మాత్రమే
అందరికీ అన్నీ అర్థం కాలేదంటున్నారు.
*
కొత్త పాఠంలో, 
కొత్త ప్రతిజ్ఞలో
స్వతంత్రత వుండదు
మాటలు ,అంతర్జాలాలు
కొన్ని కులాల వాళ్లు
నియంత్రించబడతారు.
వాళ్ళు ఎప్పుడూ 
కేవలం ఓటర్లే.
ఈ సువిశాల దేశంలో 
అందరూ స్వతంత్రులు కారని
కాలేరని.
వాళ్ళ విలువంతా
ఐదేళ్లకోసారి
ఒక్క ఎన్నికల సిరాచుక్క ఆరేంతవరకే..అనేదే సారాంశం!
అదే కొత్త పాఠ్యాంశం.
*
ఇప్పుడు 
కరపత్రాలకు, అక్షరాలకు
అభిప్రాయాలకు, ఆలోచనలకు కూడా సంకెళ్లే..
*
భయపడి భయపడి భయపడి
సిగ్గుపడి సిగ్గుపడి సిగ్గుపడి
చచ్చి చచ్చి చచ్చి
 ఆదివాసి భాషతో పాటే 
ఆదివాసీలూ అదృశ్యం అవుతున్న దృశ్యం ..

రక్త గాయాలు హత్యలు ఆత్మహత్యలు 
అత్యాచారాలు,ఆక్రందనలు రోదనలు ఏడుపులు ..
ఈ అడవి దుఃఖాన్ని ఆపేదెవరు?

తెలుసో తెలియదో..
అడవులు చాలా చాలా ప్రమాదకరం.
 *
అడవి బిడ్డల్ని
అత్యాచారం చేసిన వాళ్లు 
 అడవి బిడ్డల్ని అదృశ్యం చేసిన వాళ్లు 
అడవి బిడ్డలని గాయపరిచిన వాళ్ళు...
వాళ్లొక ఊరేగింపుగా వెళుతున్నారు.

ఉరి తీయబడాల్సిన వాళ్లు ఊరేగింపులో ఉత్సవమూర్తులుగా
  వెలిగిపోతున్నారు.
విద్యకు వైద్యానికి అభివృద్ధికి దూరంగా వెలి వేయబడిన వాళ్లు
లెక్కల్లో లేకుండా పోతున్నారు.
లెక్క లేకుండా పోతున్నారు.

ఆదివాసీల, అడవి బిడ్డల
హత్యలు అత్యాచారాల అసలైన లెక్కలు పూర్తిగా ప్రపంచానికి ఇంకా
 తెలియవు కానీ,
ఖచ్చితంగా
లెక్కలు మారుతాయి.

Leave a Reply