‘‘యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది.
వాకిలి నీదైనా నాదైనా,
దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది నెత్తురు నీదైనా పరాయిదైనా
అది ఆదాము నెత్తురే కదా
యుద్ధం తూర్పున జరిగినా పడమర జరిగినా 
అది ప్రపంచ శాంతి దారుణ హత్యే కదా. 
బాంబులు ఇళ్ళమీద పడినా సరిహద్దులో రాలినా.. 
గాయపడేది మానవాత్మే కదా
మాడిమసైపోయే పోలాలు నీవైనా పరులవైనా 
ఆకలితో అలమటించే బాధ ఒకటే కదా.....’’ 

అంటూ
1965 ఇండో పాక్‌ యుద్ధం నేపథ్యంలో, హిందీ చిత్ర రంగంలో గొప్ప కవిగా వెలుగొందిన ‘సాహిర్‌ లూధియాన్వీ’ యుద్ధం గురించి అద్భుతమైన ఒక కవిత్వం రాశాడు.

నిజమే కదా యుద్ధ భీభత్సం అలాంటిది మరి. యుద్ధమంటే నాశనమని. యుద్ధమంటే విధ్వంసమని. యుద్ధమంటే సర్వ జీవరాశుల మారణహోమం అని, యుద్ధం తర్వాత మిగిలేది స్మశాన వైభవమేననీ ప్రతి యుద్ధం ఏదోమేరకు అర్థం చేయిస్తూనే ఉంది.

యుద్ధమంటే అగ్ర రాజ్యాలకు అటవిడుపు కావొచ్చు, లేదా యుద్ధ మంటే వ్యాపార విస్తరణలో లాభాల లెక్కలు కావచ్చు. యుద్ధమంటే నిస్సహాయుల భూమిని ఆక్రమంగా ఆక్రమించి ఆ నేలకిందదాగున్న సహజసంపదను దోచుకెళ్లడం కావచ్చు. కానీ ఆ యుద్ధం చిమ్మే నెత్తుటి మరక, అది మిగిల్చేగాయం, అయిన వాళ్లను, ఆప్తులను కోల్పోయిన వాళ్లకే తప్ప ఇంకెవరికీ అంత బాగా అర్థం కాదేమో..?

కానీ యుద్ధమంటే మరణహోమమని, యుద్ధానికి దిగితే మిగిలేది శవాల దిబ్బే అని తెలిసి కూడా కొందరు అనివార్య పరిస్థితిలో యుద్ధానికి దిగుతారు. కళ్లముందే ఆప్తులు పిట్టల్లా రాలిపడుతున్నా, ఒకచేత్తో గాయపడ్డ సహచరులను భూజాన మోస్తూ కూడా మరోచేత్తో యుద్ధానికి సై అంటున్నారు. ఇప్పుడు గాజా చేస్తున్నది అదే. గత కొంత కాలంగా దండకారణ్యం చేస్తున్నది అదే. అనివార్యంగా ఏదో ఒకరోజు ప్రతి పీడితుడు చేయాల్సింది అదే. యుద్ధాన్ని యుద్ధంతో ఎదుర్కోకపోతే కాళ్లకింద నేల, నీడనిచ్చే గూడు, దప్పిక తీర్చే నీరు, అక్కున చేర్చుకునే అడవి, ప్రకృతిలోని సమస్తం మనకు దక్కకుండా పోతుంది. అందుకే యుద్ధాన్ని ఆపడం కోసమైనా యుద్ధం చేయాలి..యుద్ధాన్ని యుద్ధంతోనే ఎదుర్కోవాలి. అచ్చం గాయపడ్డ గాజాలా, విశ్రమించని పాలస్తీనాలో.

‘‘గాజాలోని హమాస్‌ ఉగ్రవాద సంస్థ ఉన్నపళంగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిందని, కయ్యానికి కాలుదువ్విందని, 20 నిమిషాల్లోనే ఐదువేల రాకేట్లని ప్రయోగించిందని’’ పశ్చిమ మీడియా ఏకపక్ష కథనాలను ప్రచారం చేస్తుంది. వాటిని మమ్మకిమక్కి కాపీ కొట్టే దేశీయ మీడియా అవే కథనాలకు మసాల అద్ది రక్తికట్టే కథనాలను ప్రచారం చేస్తుంది. సాయుధులైన హమాస్‌ మిలిటెంట్స్‌ సరిహద్దులను దాటుకొని వచ్చి ఇజ్రాయెల్‌ పౌరులపై దాడులు చేస్తున్నారనీ, దొరికిన వాళ్లని బంధీలుగా పట్టుకెళుతున్నారనీ, మ్యూజికల్‌ పార్టీ చేసుకుంటున్న ఇజ్రాయెలీయులపై విరుచుపడి దొరికిన వాళ్లను దొరికినట్లే కాల్చి చంపేస్తున్నారని మీడియా అంతాకోడై కూస్తుంది. నిజానికి ఇదంతా అక్కడ జరగడం లేదా…? హమాస్‌ రాకెట్‌ దాడులు నిజం కాదా అంటే..? అన్నీ నిజమే…కళ్లముందు కనిపిస్తున్నదంతా నిజమే కావచ్చు. కానీ ఆ దాడులవెనుక కారణాలను కనుగొనకుండా, ఏకపక్ష కథనాలను ప్రచారం చేస్తుంటే బాధితుడెవడో, కారకుడెవడో..పిడితుడెవడో, పీడకులెవరో తెలియని పరిస్థితి వస్తుంది. దాడికీ, ప్రతిదాడికి తేడా తెలియని స్థితి ఏర్పడితే న్యాయం ఏవైపున ఉందో, ఎవరు ఏ వైపున నిలబడాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అచ్చంగా అదే.

ముందుగా ప్రస్తుత దాడికి కారణమైన హమాస్‌ సంస్థ గురించి, దాని ఏర్పాటు వెనుక ఉన్న ఇజ్రాయెల్‌, అమెరికా కుట్రల గురించి, అంతకంటే ముందు పాలస్తీనా ప్రజల పోరాట చరిత్ర గురించి తెలుసుకుంటే తప్ప నేడు జరుగుతున్న దాడులకు కారణం ఏంటో అర్థం కాదు.


కన్నీటి చరిత్ర

పాలస్తీనా ప్రస్తుతం ఒక స్వతంత్ర దేశంగా లేదు. అది ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉన్నది. 1948నాటి అరబ్‌ ఇజ్రాయెల్‌ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల తరువాత యాసర్‌ అరాఫత్‌ తో కలిసి పాలస్తీనా ఆందోళనాకారులు ఫతాను స్థాపించారు. అనేక పాలస్తీనా రాజకీయ పార్టీల సమూహంగా ఉన్న పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనేజైషన్‌ (PLO)లో ఫతా ఆధిపత్య పార్టీగా మారింది. పాలస్తీనాను ఇజ్రాయెల్‌ ఆక్రమణల నుండి విముక్తి చేయాలనే లక్ష్యంతో 1964లో ఏర్పడిన ఈ సంస్థ పాలస్తీనా విముక్తి కోసం శక్తివంచన లేకుండా పోరాడుతూ వచ్చింది. ఒకవైపు సాయుధపోరాటాన్ని కొనసాగిస్తూనే పొరుగుదేశాల్లో పాలస్తీనా పోరాటానికి మద్దతును కూడగడుతూ వచ్చాడు. పాలస్తీనా న్యాయ పోరాటం గురించి ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తూ వచ్చాడు. వందకుపైగా దేశాలు పిఎల్‌ఓను గుర్తించాయి. ఐక్యరాజ్యసమితి కూడా పిఎల్‌ఓను గుర్తించింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌ మాత్రం దాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. అయితే ఇజ్రాయెల్‌ ప్రభుత్వ అక్రమిత దాడులను ఫతా వ్యతిరేకిస్తూనే దౌత్యమార్గాలలో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాడు యాసర్‌ ఆరాఫత్‌. ఫలితంగా పాలస్తీనా – ఇజ్రాయెల్‌ అనే రెండు దేశాల ఏర్పాటుతో సంఘర్షణలకు చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతో 1993లో రెండు దేశాల మధ్య నార్వేలోని ఓస్లోలో శాంతి ఒప్పందం కుదిరింది. అయితే యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని ఫతా ఉద్యమం ఇలా ఉంటే, దీన్ని పాలస్తీనా ఇస్లామిక్‌ గ్రూపులలో అతి పెద్దదైన హమాస్‌ మొదటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చింది. (‘ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ మూవ్‌మెంట్‌’ కు హమాస్‌ అనేది అరబిక్‌ సంక్షిప్త నామం). ఈ సంస్థ ఫతా ఏర్పాడిన రెండు దశాబ్దాల తర్వాత 1987లో పురుడుపోసుకున్న సంస్థ. ప్రథానంగా పాలస్తీనాలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా పాలస్తీనా పౌరులకు సహాయంగా ఉండేదుంకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీని స్థాపకుడు షేక్‌ అహ్మద్‌ యాసిన్‌ అనే సగం కళ్లు కనిపించని అంధుడు, వికలాంగుడైన పాలస్తీనా మత గురువు. ముస్లిం బ్రదర్‌ హుడ్‌ లో సభ్యుడైన అతను దీని కార్యకలాపాలన్నీ గాజా అంతటా విస్తరించి అక్కడి ప్రజల మన్నన్నల్ని పొందాడు.

అయితే మొదట్లో కేవలం థార్మిక, సేవా కార్యక్రమాలకే పరిమితమైన హమాస్‌ క్రమంగా పాలస్తీనా విముక్తి ఉద్యమాల్లో కూడా జోక్యం చేసుకోవడం మొదలెట్టడంతో దీన్ని అవకాశంగా తీసుకున్న ఇజ్రాయెల్‌, పాలస్తీనా విముక్తి ఉద్యమాన్ని చీల్చడానికి పథక రచన చేసింది. అందుకోసం హమాస్‌ నాయకుడు యాసీన్‌ గాజా, వెస్ట్‌ బ్యాంక్‌ అంతటా ఇస్లామిస్ట్‌ సామాజిక సంస్థల నెట్‌వర్క్‌ను నిర్మిస్తే వాటిలో కొన్ని ప్రాజెక్టులకు ఇజ్రాయెల్‌ నిధులను కూడా సమకూర్చింది.

మధ్య ప్రాచ్యంలో తమ ప్రయోజనాలకు ప్రధాన ప్రమాదకారిగా అరాఫత్‌ నాయకత్వంలోని ఫతా ఉద్యమం అవతరించిందని, పాలస్తీనా ఉద్యమం అంతకంతకూ బలీయం అవుతూ ప్రపంచంలో ఒంటరి అవుతున్న నేపధ్యంలో అమెరికా-ఇజ్రాయెల్‌ లను ఏలుతున్న జియోనిస్టు సామ్రాజ్యవాదం కుట్ర పన్నింది. ఒకవైపు హమాస్‌కు అన్ని రకాల సహాయ సహాకారాలు అందిస్తూ, మరోవైపు అప్పటికే తమ నిర్బంధంలోనే ఉన్న యాసర్‌ అరాఫత్‌ కు రేడియో ధార్మిక విష పదార్ధం పోలోనియంను ఆహారంలో కలిపి ఇచ్చి హత్య చేసేందుకు కుట్ర పన్నింది. అప్పటివరకూ ఉత్సాహంగా ఉన్న అరాఫత్‌ కొద్ది రోజుల వ్యవధిలోనే కేన్సర్‌ వ్యాధికి గురై మరణించాడు.


అరాఫత్‌ మరణం అనంతరం ఫతా నాయకత్వ పగ్గాల చేపట్టిన మహమ్మద్‌ అబ్బాస్‌ ఇజ్రాయెల్‌, అమెరికాల అడుగులకు మడుగులు ఒత్తాడు. క్లింటన్‌ హయాంలో కుదిరిన ఓస్లో ఒప్పందానికి తూట్లు పొడిచేందుకు ఇజ్రాయెల్‌ కు సహకరించాడు. ఫలితంగా యూదు దళారీ అబ్బాస్‌ హయాంలో సెక్యులరిస్టు ఫతా ఉద్యమం బలహీనపడిరది. మరోవైపు యూదు దురాక్రమణ పాలకులు. వారి అండతో నడిచే సంస్థలు హమాస్‌ గణనీయ శక్తిగా ఎదిగేందుకు దోహదపడ్డారు.

2006లో అరాఫత్‌ మరణం తర్వాత గాజాలో జరిగిన ఎన్నికల్లో హమాస్‌ అత్యధిక మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంది. కానీ అబ్బాస్‌ నాయకత్వంలోని ఫతా, హమాస్‌కు అధికారం ఇవ్వడానికి నిరాకరించింది. ఫలితంగా ఇరు పక్షాల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణల్లో ఓటమికి గురైన ఫతా, గాజా నుండి పూర్తిగా ఖాళీ చేసి వెస్ట్‌ బ్యాంక్‌ కు మాత్రమే పరిమితం అయింది. తద్వారా గాజాను తమ గుప్పిట్లో పెట్టుకున్న హమాస్‌ అక్కడి నుండి తమ కార్యకలాపాలను చేస్తు వచ్చింది.

అరాఫత్‌ మరణాంతరం ఫతా ఉద్యమం కోరలు కోల్పోయి ఇజ్రాయెల్‌ అదుపులోకి రావడం, ఈ పరిణామాల నేపథ్యంలోనే హమాస్‌ సంస్ధ పాలస్తీనా ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడం జరిగింది కానీ అంతిమంగా పాలస్తీనా ప్రజల జాతీయోద్యమం తీవ్రంగా నష్టపోయింది. ఎందుకంటే ప్రజలను జాతీయ ఆకాంక్షల పునాదిగా ఏకం చేయగల సెక్యులరిస్టు ఫతా ఉద్యమం ఇప్పుడిక ఇజ్రాయెల్‌ అదుపు ఆజ్ఞలకు లోబడుతూ జాతీయ స్వతంత్ర లక్ష్యాన్ని మొద్దుబార్చింది.

గాజా పరిధిలో ప్రజల ఆదరణ పొందిన హమాస్‌ ఒక ఇస్లామిక్‌ మత సంస్ధ కావడంతో ప్రజలందరినీ ఏకం చేయగల సత్తా దానికి కరువవ్వడం ఒకటైతే, దాని మిలిటెంట్‌ చర్యల కారణాంగా హమాస్‌ పైన ఉగ్రవాద ముద్ర వేయడం ద్వారా ప్రపంచ దేశాల మద్దతును దూరం చేయడంలో ఇజ్రాయెల్‌-అమెరికా-ఐరోపా దుష్ట త్రయం సఫలం అయింది. ఆ విధంగా పాలస్తీనా ప్రజల న్యాయమైన ఉదాత్త లక్ష్యమైన పాలస్తీనా స్వతంత్ర రాజ్యం దూరం జరుగుతూ వస్తోంది.


ఒకే దెబ్బకు రెండు పిట్టలు..


హమాస్‌ కి పరోక్షంగా సహకరించిన ఎత్తుగడతో అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్‌ జాత్యహంకార రాజ్యం ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టగలిగాయి. పాలస్తీనా ప్రజల జాతీయోద్యమాన్ని టెర్రరిస్టు ఉద్యమంగా ముద్రవేయడం, యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఎదిగిన పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పి.ఎల్‌.ఒ) సంస్ధను బలహీనపరచడం అనే రెండు లక్ష్యాలను అవి సాధించాయి. ముస్లిం బ్రదర్‌ హుడ్‌ నేతృత్వంలోని మతఛాందస ప్రభుత్వాలను గానీ, ఆల్‌-ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్ధలను గానీ అమెరికా ఏ లక్ష్యం కోసం చేరదీసి మద్దతు ఇస్తుందో అలాగే ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రజల పోరాటం చీల్చేందుకు హమాస్‌కు మద్దతు నివ్వడం ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది.

నికరమైన జాతీయ భావాలు కలిగిన పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ లాంటి సంస్ధలతో వ్యవహరించడం కంటే ఎటువంటి చారిత్రక అవగాహన, అభ్యుదయ భావజాలం, ప్రజల ప్రయోజనాల పట్ల కనీస నిబద్ధతా లేని ముస్లిం మతఛాందస సంస్ధలతోనూ, టెర్రరిస్టు వ్యవస్ధలతోనూ వ్యవహరించడమే అమెరికా, ఇజ్రాయెల్‌ సామ్రాజ్యవాదానికి తేలిక. జాతీయ భావాలతో పోరాడే పోరాట సంస్ధలను ప్రజలనుండి వేరు చేయడం కష్టతరం. జాతీయ శక్తులను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం కూడా సామ్రాజ్యవాదులకు కష్టం. కానీ ముస్లిం మతఛాందస శక్తులను బూచిగా చూపి, వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం సులువు.

సద్దాం హుస్సేన్‌, మౌమ్మర్‌ గడాఫీ, బషర్‌ అస్సాద్‌ తదితర జాతీయ నిబద్ధత కలిగిన శక్తులు సామ్రాజ్యవాదంతో రాజీపడే అవకాశాలు చాలా తక్కువ. దళారీ బూర్జువా శక్తులు అయితే తప్ప వారు సామ్రాజ్యవాద ఆధిపత్యానికి తల వంచరు. జాతీయతా భావాలతో నిండి ఉండే ప్రజాసామాన్యం వారికా శక్తిని ఇస్తారు. కాని సెక్టేరియన్‌ దృక్పధాలతో నిండి ఉండే మతఛాందస శక్తుల భావాలకు ప్రజలను కూడగట్టి ఐక్యంగా నిలిపి ఉంచే శక్తిగానీ, కనీసం తమ ప్రయోజనాల కోసమైనా చివరికంటా నిలబడగల నిబద్ధతగానీ ఉండవు. తమ స్వార్ధ ప్రయోజనాలు ఎక్కడ నెరవేరితే అక్కడ నిలబడడానికి వారు సిద్ధంగా ఉంటారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎంత హింసాత్మకంగానైనా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే వారికి బాగా తెలిసిన న్యాయం.

అయితే, తాము పెంచి పోషించినా హమాస్‌ పైన ఉగ్రవాద ముద్ర వేయడంలో ఇజ్రాయెల్‌ సఫలం అయినా గాజా ప్రజలు హమాస్‌ను మాత్రం వదులుకోకపోవడం ఇక్కడ విశేషం. దీనికీ కారణం లేకపోలేదు. చాలా సంవత్సరాలుగా పాలస్తీనా భూభాగంలో సెటిల్‌మెంట్లను నిర్మిస్తూ, తమ మిలటరీ గుప్పిట్లో గాజాను దిగ్భందిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ మారిన పరిస్థితుల నేపథ్యంలో, అంతర్జాతీయ వత్తిడీల మూలంగా గాజా ప్రాంతం నుండి 2005లో వెనుదిరగాల్చి వచ్చింది. అలా వెనుదిరిగినా దాని దృష్టి అంతా గాజాను హస్తగతం చేసుకోవడంపైనే ఉంటూ వచ్చింది. ప్రతి చిన్న కారణాన్ని సాకుగా చూసి గాజాను కట్టడి చేయడం, సరిహద్దులను మూసివేస్తూ కనీస నిత్యవసరాలకు కూడా అందకుండా ఆ ప్రాంతాన్నంతటినీ ఓపెన్‌ జైలుగా మార్చివేసింది. అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా ఇజ్రాయెల్‌ గాజాపై తన వైఖరిని మార్చుకోకపోగా మరింత మూర్ఖంగా వ్యవహరిస్తూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలోని సహజవాయు నిక్షేపాలపై దాని కన్నుపడటమే.

2000 సంవత్సరంలో గాజా తీరంలో చమురు, సహజవాయు నిక్షేపాలు కనుగొనడంతో గాజా భాగంగా కలిగిన పాలస్తీనా స్వతంత్ర, స్వయం సమృద్ధి గల రాజ్యంగా అవతరించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయని ప్రపంచం ముందు రుజువయింది. 2000లో అంచనా వేసిన మొత్తం కంటే అనేక రెట్లు సహజ సంపద గాజా తీరంలో ఉన్నదని తరువాతి సంవత్సరాలలో అది వెల్లడి అయింది. దీంతో గాజా తీరాన్ని పాలస్తీనా ప్రజలకు శాశ్వతంగా దూరం చేసేందుకు ఇజ్రాయెల్‌ కుట్ర పన్నింది. అందులో భాగమే గాజాపై దిగ్బంధనం. గాజాపై పదే పదే దాడులు చేయడం ద్వారా ప్రజల స్ధైర్యాన్ని దెబ్బతీయాలని ఇజ్రాయెల్‌ పన్నాగం. తీవ్ర అణచివేత అమలు చేస్తే పాలస్తీనీయులు విసిగి గాజా తీర సంపదలలో వాటా వదులుకుంటారని ఆశీస్తోంది. కానీ అది ఏండ్లు గడిచినా నెరవేరడం లేదు.

తాజా దాడిని ఎలా చూడాలి…


గాజా నుండి వరదలా వచ్చి పడే రాకెట్ల నుండి రక్షణ కోసమే తాము గాజాపై దిగ్బంధనం అమలు చేస్తున్నామని, హమాస్‌ టెర్రరిస్టుల వృద్ధిని నిరోధించడానికి యుద్ధానికి దిగుతున్నామని, అవసరమైతే సొరంగ మార్గాల్లోకి వెళ్లి హమాస్‌ను తుదముట్టిస్తామని ఇజ్రాయెల్‌ చెబుతుంది. కానీ అది వాస్తవం కాదు.
గత కొన్ని దశబ్దాల కాలంగా ఇజ్రాయెల్‌ దాని కనుసన్నల్లో పనిచేసే నేటి అరబ్‌ పాలకులు గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఫలితంగా అనివార్య పరిస్ధితుల్లో గాజా ప్రజలు సొరంగాలను నిర్మించుకున్నారు. నిజానికి ఈ సొరంగాలు ఇటీవల కాలానివి కూడా కాదు. అలెగ్జాండర్‌ సైన్యాలు పాలస్తీనాపై దాడికి వచ్చినపుడు నిర్మించిన సొరంగాలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయి. గాలి, నేల, సముద్రం ఇలా అన్నీ మార్గాలనూ బంధించిన ఫలితంగా అప్పటి సొరంగాలను మరింత విస్తరించి ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా అభివృద్ధి చేసుకున్నారు గాజా ప్రజలు.

భూమి సరిహద్దుల గుండా గాజాలోకి వచ్చే ప్రతి చిన్నా, పెద్దా సరుకును ఇజ్రాయెల్‌ పరీక్షించి గాని అనుమతించదు. గుండు సూది మొదలుకుని ప్రతిదీ తనిఖీ చేయవలసిందే. నిత్యావసరమైన అనేక సరుకులను నిషేధించింది. దానితో గాజా భూగర్భ సొరంగాలు ప్రజల జీవన వాహకాలుగా మారాయి. అంతర్జాతీయ పరిశీలకుల అంచనా ప్రకారం గాజా దిగ్బంధనం వల్ల ముడి సరుకుల దిగుమతి ఆగిపోయి పారిశ్రామిక కార్యకలాపాలు ఆగిపోవడంతో లక్ష ఉద్యోగాలు ప్రజలు కోల్పోయారు. వాణిజ్యం లేకపోవడం కూడా ఉపాధిని, ఆదాయాన్ని హరించివేసింది. 80 శాతం ప్రజలు ఐరాస తదితర సంస్ధల సహాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారు.

గాజా సొరంగాలు ఎంత నిత్యజీవిత అవసరంగా మారాయంటే ఈజిప్టు యువకుడు ప్రేమించిన గాజా యువతిని ఇంటికి తెచ్చుకోవాలన్నా ఈ సొరంగాలే మార్గం అయ్యాయి. అమెరికా దన్నుతో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న అమానుష యుద్ధకాండల నుండి గాజా ప్రజలకు ఊపిరి సరఫరా చేస్తున్నది ఈ సొరంగాలే. అందువల్లనే ఒక సొరంగం కూల్చివేస్తే పది సొరంగాలను వారు నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సొరంగ మార్గాలే హమాస్‌కు రక్షణ కవచంగా ఉన్నాయి.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ వేల రాకెట్లతో విరుచుకుపడి వేలాది మందిని హతమార్చి, వందలాది మందిని బంధీలుగా తీసుకువెళ్లిన ఫలితంగానే యుద్ధానికి దిగామని ఇజ్రాయెల్‌ ప్రపంచానికి చెబుతున్నప్పటికీ హమాస్‌ ఈ దాడులకు పాల్పడటానికి, దాన్ని పెంచి పోషించింది ఎవరనేది మాత్రం చర్చించడం లేదు. ఒకనాడు ఇజ్రాయెల్‌ కొనసాగించిన దుష్టపన్నాగమే ఇవాళ ఇజ్రాయెల్‌ ప్రజల ప్రాణాల మీదకు వచ్చిందనీ, రెండు ప్రాంతాల ప్రజలు యుద్ధంలో సమీధలవుతున్నారనేది మర్చిపోవడం లేదు. ఈ మారణహోమానికి ఎవరినైనా నిందించాల్సి వస్తే అది ఇజ్రాయెల్‌నే..!

ఇవాళ హమాస్‌ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ 2000 సంవత్సరంలోనే అమెరికన్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాన్‌ పాల్‌ ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా గాజాపై దాడిచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌ చర్చలను అమెరిక చట్టసభల సాక్షిగా ప్రశ్నించాడు. పాలస్తీనా ప్రజల ఉద్యమాన్ని చీల్చడానికి హమాస్‌కు నిధులు ఇచ్చి ఇజ్రాయెల్‌ పెంచిపోషించిందనీ ఇవాళ అదే హమాస్‌ నియంత్రించే వీలులేనిదైపోయే సరికి దాన్ని హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించాడు. ఇవాళ పాలస్తీనా ప్రజలపై కురుస్తున్న బాంబుల్లో, మిసైల్స్‌లో ఆమెరికావి కూడా ఉన్నాయనీ, ఈ మారణహోమంలో మనం భాగస్వాములమనే విషయాన్ని మర్చిపోకండని ఎద్దేవ చేశాడు.

ఆ సందర్భంగా రాన్‌ పాల్‌ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. 80ల కాలంలో అమెరికా తన ప్రత్యర్థిగా భావించిన సోవియట్‌ యూనియన్‌ను ఎదుర్కొనేందకు ఒసామా బిన్‌ లాడన్‌తో పొత్తు పెట్టుకున్నదనీ, ముస్లింలను రాడికలైజ్‌ చేయడానికి మద్రసాలకు నిధులను అందించామనీ, ఆనాడు సీఏఏ ఇదే కోరుకున్నదని కానీ దాని ఫలితాన్ని తర్వాతి కాలంలో మనమే అనుభవించామన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తుచేశారాయన. ఇవాళ హమాస్‌ విషయంలో జరుగుతున్నది కూడా అదే.
ఇజ్రాయెల్‌ మిలిటరీలో అరబ్‌ వ్యవహారాల నిపుణుడిగా 1980ల చివరలో గాజాలో పనిచేసిన కల్నల్‌ డేవిడ్‌ బెక్హాం, 70వ దశకం చివరిలో హమాస్‌ స్థాపకుడైన యాసీన్‌కు ఇజ్రాయెల్‌ మద్దతు ఇవ్వడం అతిపెద్ద పాపమని ఒప్పుకున్నాడు. ఈయన మాత్రమే కాకుండా రెండు దశాబ్దాలుగా గాజాలో మత వ్యవహారాలకు బాధ్యత వహించిన ఇజ్రాయెల్‌ అధికారి అవ్నర్‌ కోహెన్‌ ‘హమాస్‌ ఇజ్రాయెల్‌ సృష్టి..దానికి నేను పశ్చాతాపం ప్రకటిస్తున్నా’ అని పేర్కొన్నాడు. ఆయన స్వయంగా 1980ల మధ్యకాలంలో తన ఉన్నతాధికారులకు అధికారిక నివేదిక కూడా రాశాడు. అందులో ఆక్రమిత ప్రాంతాలలో ప్రజల్ని విభజించి పాలించవద్దని హెచ్చరించాడు . ‘‘మనం సృష్టించిన హమాస్‌ వాస్తవికత మన ముఖంపైకి దూకకముందే ఈ రాక్షసుడిని విచ్ఛిన్నం చేయమని’’ అధికారులను కోరాడు కూడా. కానీ యుద్ధం రుచిమరిగిన పాలకులు తమ ప్రజల ప్రాణాలతో కూడా రాజకీయం చేయగలరని పదే పదే రుజువవుతున్నదే. ఇప్పుడు గాజాలో జరుగుతన్నది అదే.
ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఇజ్రాయెల్‌కు కూతవేటు దూరంలో ఉన్న హమాస్‌ వేల సంఖ్యలో రాకెట్లతో దాడిచేసేందుకు పథక రచన చేసినా తెలయదని ఎలా అనుకోవాలి…? ఒకవైపు ఈజిప్ట్‌ కు చెందినా ఇంటలిజెన్స్‌ వ్యవస్థ ముందస్తుగానే ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేసినా పెడచెవిన పెట్టిన ఇజ్రాయెల్‌ ఇవాళ ఆ దాడులను ఒక సాకుగా చూపుతుందని కాసింత ఆలోచించే విచక్షణా జ్ఞానమున్న ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

ముందస్తు పథకంలో భాగంగానే హమాస్‌కు స్వేచ్ఛగా దారులు వదిలింది ఇజ్రాయెల్‌. దాడులు చేసే అవకాశం ఉందనీ తెలసినా తమ పౌరులను ఎరగా వేసింది ఇజ్రాయెల్‌. పొరుగు దేశంలోని నిఘా వ్యవస్థలు హెచ్చరిస్తున్నా హమాస్‌ పట్టున్న సరిహద్దు ప్రాంతంలో మ్యూజికల్‌ పార్టీకి అనుమతిచ్చింది ఇజ్రాయెల్‌. ఇది అచ్చంగా మన దగ్గర జరిగిన పుల్వామా దాడిని గుర్తుచేయడం లేదు. ..? మూడు వందల కేజీల ఆర్‌డీఎస్ ను యదేచ్ఛగా సరిహద్దు దాటించి, నిత్యం గస్తీ ఉండే మార్గంలో ఒక వ్యక్తి కార్లో వేసుకొని వచ్చి వందలాది మంది సైనికులను హతమార్చాడంటే నిఘా వ్యవస్థల కళ్లుగప్పి ఇదంతా చేశాడని అనుకోవాలా? అంత అమాయకులా జనం.

కారణాలు ఏవైనా ఇవాళ గాజాలో జరుగుతన్న పరిణామాలకు ప్రధాన దోషి ఇజ్రాయెలు దానికి వంతపాడుతున్న అమెరికానే. ఇజ్రాయెల్‌ జాత్యంహకారం రెండు దేశాల్లోని ప్రజలను యుద్ధంలో సమిధలుగా మారుస్తుంది. ఈ యుద్ధాన్ని వ్యతిరేకించకపోతే మధ్య అసియా ప్రాంతం సామ్రాజ్యవాదుల చేతిలో యుద్ధక్షేత్రంగా మారే అవకాశం ఉంది.

Leave a Reply