1 .అర్థ చంద్రాకారపు ఆయుధం
 
నిండు పున్నమి లేనేలేదు
దుఃఖ సమయాన ఉత్సవముంటుంది
పట్టడానికి ఆయుధముంటుంది 
కార్మికులు చూపిన కాంతి
రైతులు పట్టిన చంద్రుడు
తెలంగాణ స్తనానికి పాలు తాగిన పసిబిడ్డ
సాయుధ పోరాటంలో రాటుదేలిన ఆడబిడ్డ
మనముందే వున్నది, మనమధ్యే వున్నది
ఏ కాలానికైనా
కొడవలి మాత్రమే చంద్రుడు
చంద్రుడంటే 
అర్థ చంద్రాకారపు ఆయుధం!
*
ప్రజాపోరాటంలో అమావాస్యలుండవు
కొడవలి పట్టిన అమ్మలుంటారు
మోదుగుపూల పాటలుంటాయి 
విముక్తిని అందించే
అందమైన చందమామలుంటాయి
*
నిరాశలూ నిశబ్ధాలూ లేనేలేవు
చందమామను పట్టడమే ఉత్సవం!
*

2. కాంతి పిట్ట ~

గొంతులపై ఇనుప బూట్లకు నేను సాక్షిని
అక్షరాలపై లాఠీ దెబ్బలకు నేను సాక్షిని
ఆదివాసుల స్తనాలు నరికి
మేఘాలలోంచి పాలను మాయం చేసిన
నియంత పరిపాలనకు నేను సాక్షిని

నా దేశంలో
న్యాయం అనేది పుక్కిటి పురాణం
నా దేశంలో 
హక్కుల చట్టాలు, రక్షణ చట్టాలు 
అంగాంగాలుగా నరకబడ్డ పసిపాపలు
జైలు లోపలి విధ్వంసానికి
పదకొండేళ్ల అనుభవమున్న సాక్షిని నేను

నిజమే! నన్ను బోనులోనే నిలబెట్టండి!
పగలూ రాత్రీ నా ఆయుధాలు
సత్యం ప్రేమా నా ఆయుధాలు
దిక్కులూ మొక్కలూ నా ఆయుధాలు
చిరునవ్వుల పసిపువ్వులు నా ఆయుధాలు
భూగోళం బోనులోనూ భయపడదు
జైలు గదిలో చంద్రకాంతి నా ఆయుధం 
సంకెళ్ళపై వాలిన సూర్యకాంతి నా ఆయిధం
ఈ కుష్ఠు వ్యవస్థలో మరోసారి
కోర్టులో అడుగుపెట్టబోతున్న కాంతిపిట్టను నేను.

(బెల్లాల పద్మను మళ్ళీ అరెస్టు చేసిన సందర్భం)
*

3. ఈ శరణార్ధుల శిబిరంలో

ఆకాశం విలవిలాడుతోంది
చంద్రుడు వలవలపోతున్నాడు
ఈ రాత్రి, నాకోసం వచ్చిన వర్షాన్ని
చూడలేకపోతున్న నా చూపులపై
విశ్వం జాలిపడబోతుంది

చీకటి దేహం పైనుండి తెల్లటి ముత్యాలమాలలు
వరుసగా నేల జారుతున్నట్టుగా వుండొచ్చు
ఈ రాత్రి, ఒక అద్భుతమైన వర్షం

వాడి బూట్లు నన్ను హెచ్చరిస్తున్నాయి
అటు వైపు చూడకూడదని
కానీ, వర్షాన్ని వెనక్కి పొమ్మని వాడు హెచ్చరించలేడు
వర్షం కాపాలాదారుడి మాట ఎప్పటికీ వినదు
*
ఇంకా కురుస్తూనే వుంది
రాత్రంతా నేను నిద్రపోనట్టుగా
ఈ వర్షమూ అలసిపోలేదు
మేఘాలు నీరై
గాలిని నాకటం ఎంత అందమైనదో
నన్ను ఈ కాపాలాదారుడు చూడనివ్వడం లేదు

ఈ శిబిరం నలువైపులా నల్లటి పరదాలు
లోపల నేను, నావంటి మనుషులు
గుడిసె ముఖద్వారం వైపు తొడిగిన పరదాలకు 
నేను కొన్ని చిల్లులు పెడితే, వర్షాన్ని చూడవచ్చు
అప్పుడు నా పసి దేహానికి
ఎన్ని చిల్లులు పడతాయో 
కాపలాదారుడి తుపాకీ
నన్ను ఎన్నిసార్లు ముద్దుపెడుతుందో!
*
ఈ వాన
మేఘాల చనుపాల వంటిది
తాగి పాడిఆడాలి
అంత కంటే ముందు
హాయిగా తడిసిపోవాలి.

మేఘాల చనుపాల కంటే ముందు
రొమ్ముపూలు కార్చే ప్రేమ
వొలికిపోతున్న అమ్మ పాలు
ఈ శరణార్ధుల శిబిరంలో
పసిపిల్లలంతా రుచి చూడాలి

అమ్మల రొమ్ముల్లో, రొమ్ముల గుహల్లో
మనలో కొందరు దూరిపోయి దాచుకోవాలి
ఈ శరణార్ధుల శిబిరంలో
స్థలం చాలా తక్కువ.
*
4. కూలిపోయిన గోడలపై దీపాలు ఏమాత్రం వుండవు

బాంబుల దాడికి గోడలు పడిపోతాయి
కానీ ఇక్కడి గోడలు గోడల్లా పడిపోవు
మనిషి అంతర్లోకంలో కుప్పకూలుతున్న మరో మనిషిలాగే
గోడలూ దుఃఖంతో కుప్పకూలుతాయి.
అయినప్పటికీ,
నేలపై పడివున్న సిమెంటు గడ్డల మధ్య లోంచి
ఆకాశం వైపుకు చూస్తున్న పిడికిళ్ళను మనం చూడవచ్చు
నెత్తుటి ఏర్లను ముద్దాడి నడుస్తున్న వాళ్ళం
పిడికిళ్ళు పిలుస్తున్నప్పుడు హాయిగా వెళ్లి కౌగించుకోకుండా ఎలా వుండగలం!

గోడలపై అనేక పేర్లుండేవి
చెదిరిపోయిన అక్షరాలతో
పసిపిల్లల పేర్లు, నదుల పేర్లూ వుండేవి
ప్రస్తుతం ఆ పేర్లతో ఏ గోడలూ లేవు
కూలిపోయిన గోడల్లోంచి ఏమాత్రం నీరు పారలేదు
నెత్తురు ఏరులై సాగుతుంటే.. నీటికి చోటెక్కడిది !

ఈ రాత్రి, నిన్నటి రాత్రి, కొన్ని యుగాల రాత్రులన్నీ
ఇక్కడ దీపాలతో వెలుగుతున్నాయి

కూలిపోయిన గోడలపై దీపాలు ఏమాత్రం వుండవు

కన్నుల చివర ఏ దీపం వుండదు
పెదాల చివర ఏ దీపం వుండదు
శ్వాసలు అటూఇటూ తప్పించుకునే ఆట స్థలంలోనూ వుండవు
జారుడుబండ లాంటి చెంపలపై అసలే వుండవు
గొంతు చుట్టూ చుట్టబడ్డ ఇనుప కంచెలోనే వుంటాయని
భ్రమ పడ్డాను

దీపాలన్నీ ఎక్కడ వెలుగుతున్నాయో తెలుసా
యుద్ధంలో కోయబడుతున్న చన్నులన్నీ
ఈ పచ్చినేలపై, పచ్చిరక్తంలో తేలుతూ
దీపాలుగా వెలుగుతుంటాయి !
(పాలస్తీనా కోసం)
*
5. తూర్పు మధ్యధరా గాలిలోకి 

నువ్వు చూస్తావు
ఇల్లు ఇల్లుగా లేని నేలపై
నేల నేలగా లేని పాలస్తీనా పై
నువ్వు చూస్తావు

తూర్పు మధ్యధరా గాలిలోకి
నేను దోగ్గాడుకుంటూ ఈదుకుంటూ ఎగురుకుంటూ
రకరకాలుగా వెళ్లడాన్ని నువ్వు చూస్తావు.
కంచెలను పెకిలించి
పాలస్తీనా తల్లుల కన్నులను చూడ్డానికి
నేను వెళ్ళడాన్ని నువ్వు చూస్తావు.
తల్లుల ఒడిలో తలవాల్చి
కన్నీటి పరిమళాల్ని, పరిమళపు ధ్వనుల్ని
నేను వినటం నువ్వు చూస్తావు.

పాలస్తీనా గుర్తొచ్చినప్పుడల్లా
నా హృదయాన్ని రుచి చూసినవాడా
నా కన్నీళ్లను చదివినవాడా
నేను బిగ్గరగా పాడటాన్ని నువ్వు చూస్తావు.
*

Leave a Reply