తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి. 

స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి వాటి అంతసారాన్ని అర్ధం చేసుకోగలగడమే కాక ఆ గ్రహింపుతో తన చుట్టూ జీవితాన్ని చూడగలిగారు. అదికూడా సమాజపు చివరి అంచుల్లో ఉన్నవాళ్లు పక్కన నిలబడి చూశారు. అట్లా చూస్తున్నప్పుడు స్థూలంగా తాను అర్ధం చేసుకున్న రాజకీయార్థిక  చలన సూత్రాలను సూక్ష్మ రూపంలో గమనించగలిగారు. అట్లా గమనించిన జీవితాన్ని రక్తమాంసాలున్న మనుషులను  జీవించేందుకు వాళ్ళ పెనుగులాటనీ అత్యంత శ్రద్ధతో సాహిత్యంలోకి తీసుకు వచ్చారు . ప్రధానంగా ఇదే కారా కథకు సాహిత్యానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్.  

తీర్పు, యజ్ఞం , జీవధార, హింస, కుట్ర, చావు మొదలైన కధల్లో ఆయన దృక్పదాన్ని , అందులోంచి ఆయన చేసిన పరిశీలలను గమనించవచ్చు. ఈ కధలన్నిటా  కూడా ఆయన అవగాహన పెంపొందుతున్న క్రమాన్ని గమనించొచ్చు. అప్పటికే మొత్తం వ్యవస్థను కూల్చివేసే పూనికతో ఉద్యమాల ఉధృతి పెరిగింది. ఈ క్రమంలోనే వ్యవస్థ ఆమోదాన్ని పొందిన ప్రతి భావన ప్రశ్నకు గురైంది. అభివృద్ది, న్యాయం, కుట్ర, హింస భయం లాంటి భావనలన్నీ పునర్నిర్వచించాల్సి వచ్చింది. 

అభివృద్ది అంటే డాములు కట్టడం . ఎక్కువ పండించడం అన్న అర్ధం తిరస్కరణకు గురైంది. రెండు దశాబ్దాల స్వాతంత్రానంతర గ్రామీణ భారతంలో ఈ అభివృద్ది నమూనా కొద్దిమందికి సంపద కట్టబెడుతూ అసంఖ్యాకుల్ని అప్పుల ఉబిలోకి నేట్టివేశాక అభివృద్ధి అంటే సర్వనాశనం అని రుజువయ్యాక అభివృద్ది అంటే ఎవరికీ అనే ప్రశ్న నేడుర్కోంది. యజ్ఞంలో ఈ అభివృద్ది  సంక్షోభాన్ని చూడవచ్చు . అయితే ఈ సంక్షోభం ఎట్లా పరిష్కారమవుతుంది అన్న స్పష్టత ఇంకా రూపుదిద్దు కొని కాలంలో  అది దిగ్భ్రాంతికి గురిచేసే స్వీయహింసతో ఈ కథ ముగుస్తుంది. మనుషులు సమూహాలుగా కలసి ఎదిరించినప్పుడు ఒక భౌతిక శక్తిగా వణికిస్తాయని ప్రత్యక్షంగా అర్ధమయినప్పుడు జీవధార లాంటి కధలు పుట్టాయి. 

గాలి, నీరు, భూమి  లాంటి సహజ ప్రకృతి వనరులు కొండి మంది చేత చిక్కి అసంఖ్యాక జనజీవితాన్ని దుర్భరం చెసినప్పుడు  వాళ్ళు అనివార్యంగా  ఎదురు తిరుగుతారు. అందుకోసం సంఘటిత మవుతారు. ఎప్పుడు సంఘటితమవుతారో అప్పుడు అవతలి పక్షం భయపడుతుంది . రాజీ కొస్తుంది. ఈ మొత్తం క్రమంలో మనుషులేట్లా ప్రవర్తిస్తారు?. దీనికి జవాబే కారా కథలు.      

హింస కథ వాడుకలో ఉన్న హింస నిర్వచనాన్ని తిరస్కరించి  ఆకలి అణచివేతలే అసలైన హింసని చెబుతుంది. కుట్ర కథ (ఇది కథా కాదు అనే వాళ్ళు ఉన్నారు.) ఎవరు అసలైన కుట్రదారులో చర్చిస్తుంది. అన్ని వనరులు గుంజేసుకొని ఎదురుతిరిగిన వాళ్ళని , ఇదేమని ప్రశ్నించిన వాళ్ళని కుట్ర దారులంటున్న రాజ్యమే అసలైన కుట్రదారు అని రుజువు పరుస్తుంది.  

అంతే కాదు పరస్పర భిన్న భావనల సాపెక్షతను కూడా కారా చర్చిస్తాడు. శాంతి -యుద్ధం , న్యాయం -అన్యాయం , భయం -ధైర్యం స్థాలకాలాలను బట్టి ఎట్లా మారతాయో చెబుతాడు . ఇవి బయట సమాజంలోనే కాదు మనిషిలోపట కూడా ఎట్లా సంఘర్సిస్తాయో చూపెడతాడు.  సమాజ గతికే కాదు కార కధలకు కూడా ఈ ఘర్షణే  కీలకం.   

Leave a Reply