విమర్శకు ప్రమాణాలు ఏమిటి? వొక రచన బాగుందా లేదా అని చెప్పడానికి ఏమైనా తూనికరాళ్లున్నాయా? మాట్లాడుతున్న విమర్శకులు ఏ సాహిత్యప్రక్రియ గూర్చి మాట్లాడుతున్నారు? కవిత్వము, కథ, నవల, నాటకం ఇలా ఉండగా అన్నింటనీ వొకే గాడిన కట్టేస్తున్నారా? తెలుగు విమర్శ ఎంత అత్యున్నతంగా ఎదిగందంటే ప్రమాణాలు లేవు అనే పేలవమైన కామెంట్లు చేసే స్థితికి చేరింది. పోనీ ప్రమాణాలేవో చెబుతారా అంటే అలా కూడా చెప్పరు. ఈ తరహా ఆలోచన తిరోగమనస్థితికి సంకేతం. ఈ సంక్లిష్ట, సందిగ్ధ సందర్భంలో వొక కవిత్వంలో ప్రమాణాల గూర్చి చర్చిద్దాం. నీలిమ విపస్ రావు కవిత్వం ఆగ్రహి చూద్దాం. ఈ కవిత్వంలో ఉన్న కవిత్వ ప్రమాణాలను అంచనా వేద్దాం.
మార్క్సిస్ట్ అవగాహన:
మార్క్సిస్ట్ సిద్దాంత పరిచయం ఉన్న కవికి జీవితాన్ని, సమాజాన్ని అర్థం చేసుకోడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది విశ్వజనీన సత్యం. మార్క్సిజం చదవకుండా ఏ కవికానీ, విమర్శకుడు కానీ గొప్ప సాహిత్యాన్ని సృష్టించలేరు. సృష్టించినా అది శాస్త్రీయత లోపించడమో, సామాజికచైతన్యరాహిత్యమై ఉండటమో సామాన్యజనానికి దగ్గరగా లేకుండటమో ఉంటుంది. జీవితాల్ని సమగ్రంగా అర్థం చేసుకోడానికి పునాదిరాయి మార్క్సిజమే. ఇక ఈ కవికున్న మార్క్సిజం అవగాహన ఎంత?
ఇప్పుడు నా క్కొంచెం స్వేచ్ఛ కావాలి
నాకొక ఆయుధం కావాలి
నన్ను నన్నుగా నిలిపే
ఒక రాజ్యాంగం కావాలి
స్వేచ్ఛ ఎందుక్కోరుకున్నారు.? ఎందుకు ఆయుధం కావాలి? 106 సార్లు జరిగిన రాజ్యాంగసవరణ గూర్చి నమ్మకం లేక, ఈ రాజ్యాంగం అమల్లో ఉన్నా స్త్రీహక్కులు కాలరాయబడి రక్షణలేకపోవడంతో వచ్చిన ఆగ్రహమే పై కవితా వాక్యాలు. అలాగని రాజ్యాంగంపై గౌరవం లేక కాదు. ఇంతకంటే మార్కిస్ట్ అవగాహన ఏం కావాలి.
వస్తు రూపం:
మనిషి, మానవసంబంధాలు, సామాజిక జీవితం, సామాజిక సమస్యలు, జీవనచక్రంలో సాగే వైరుధ్యాలు భాగమే. ఇవే కవికి వస్తువులౌతాయి. ఈ వస్తువులో ఇతివృత్తం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇతివృత్తాన్ని కవి ఎలా వ్యాఖానిస్తారో అది గొప్ప వస్తువౌతుంది. ఇతివృత్తాన్ని జీవితానుభావల నుంచి తీసుకుంటారు. స్వానుభవమేకాక ఇతరుల అనుభవాల నుంచి కూడా ఇతివృత్తాన్ని తీసుకోవచ్చు. అయితే ఇతివృత్తం సమకాలీనమైనదిగా ఉండటం అనివార్యం. ఇక్కడ రాసే కవి భావజాలం కూడా ప్రధానపాత్ర పోషిస్తుంది. కవి ప్రగతిశీలవాది అయితే మార్క్సిస్ట్ భావజాలంతో కవిత్వం గొప్పవస్తువై ప్రజలనాల్కలపైకి చేరుతుంది. రూపం విషయానికొస్తే వస్తువు అంతర్గత సమీకరణ. ఈ రూపమే గొప్పశిల్పానికి దారులు పరుస్తుంది. ఇప్పుడు వస్తురూపమున్న కవితనే పరిశీలిద్దాం.
న స్త్రీ
ఆరేళ్లయినా పదహారేళ్ళయినా అరవై ఆరేళ్లయినా ప్రాయమేదయినా/అర్ధరాత్రి అయినా అపరాహ్నం అయినా అసురసంధ్య అయినా కాలమేదైనా/ఆయేషా అయినా /ఆసిఫా అయినా /అరుణ అయినా /మతమేదైనా/యూపీ అయినా/ఎంపీ అయినా/ఏపీ అయినా/ప్రాంతమేదైనా/న ప్రాయం/న కాలం/న కులం/న మతం/న ప్రాంతం/న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి.
ఇంతకంటే వస్తురూపాలింకేం కావాలి. ఈ కవిత్వం ఫెమినిస్టు దృక్ఫథంతో కొనసాగినా సగటు మహిళ వేదన, కన్నీళ్లు కదా. వస్తువు వాస్తవికకోణాన్ని ఆవిష్కరించింది. ఇతివృత్తం అధ్యంతమూ వైవిధ్యంగా కొనసాగడం మూలంగా రూపం పటిష్టంగా నిర్మించబడి కవితకు బలాన్నిచ్చింది.
“Thus the content of a work is the artistic reflection through images of specific phenomena from the real world, aesthetically interpreted a evaluated by the artist.” ఈ వాస్తవిక ప్రపంచంలో ఎటువంటి దృశ్యాలను వస్తువు అందిస్తే అంతటి గొప్ప కవిత్వమే పెల్లుబుకుతుంది. ఇటువంటి కవిత్వాన్నే కదా కోరుకోవాల్సింది. ఎక్కువ మంది పాఠకులు ఆమోదిస్తే గొప్ప రచన అని ఇటీవల విమర్శకులు అర్థం లేని వాదన చేస్తున్నారు. విమర్శకుడు రచనకు ఆమోదం వచ్చేలా పనిచేయనవసరం లేదు..విమర్శకుడి పని అది కాదు.ఈ కాలం విమర్శకుడు కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తున్నాడనే వాదనను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. విమర్శకుడు ఇంత కంటే చేయదగింది ఏముంది? తనదైనశైలో విశ్లేషణ చేయడమే విమర్శకుల పని. విమర్శకు కొత్తసిద్దాంతం ప్రతిపాదించి వుంటే అలా చెప్పేవారి మాటలకు విలువ వుంటుంది. ఏమీచెప్పకుండా ఇలా అలా ఉండాలని ఎవరైనా పేలవమైన ప్రకటనలు చేస్తుంటారు. ఇది సాహిత్యలోకానికి తీవ్రనష్టం.
సారం:
వస్తువు యొక్క భావచిత్రాలలోని దృక్కోణాన్ని సారం అనొచ్చు. అయితే ఇతివృత్తాన్ని చారిత్రక, సామాజిక చైతన్యంతో మలచడం వల్ల కూడా సారం పరిపృష్టమవుతుంది. దీన్నే రాజకీయ వ్యతిరేక కవిత్వం రాసినపుడు అలవోకగా కనిపెట్టవచ్చు. అయితే ఇక్కడ భిన్నాభిప్రాయాలున్నాయి. సాహిత్యం రాజకీయాలకు దూరంగా ఉండాలనే దరిద్రపు, దివాలాకోరుతనం ఆలోచన కూడా కొంతమంది విమర్శకులంటుంటారు. శ్రీశ్రీ కూడా హైదరాబాద్‌లో 1 అక్టోబర్ 1971న జరిగిన విరసం రెండో రాష్ట్రమహాసభల్లో ఈ విషయం గూర్చి ప్రత్యేకంగా మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రచయిత ఉండాలన్న అభిప్రాయాన్ని ఖండిరచారు. ఈ నీలిమ కూడా రాజకీయవ్యతిరేక కవిత్వం ఈ సంపుటిలో రాసింది. ఆ కవిత్వాన్ని అందులో సారాన్ని చూద్దాం..
మాఖీ పిల్లా!
కాషాయ కర్కశత్వానికి బలైపోతున్న ఓ మాఖీ పిల్లా/నీ కథ విన్నాక నన్నుకాస్త కాస్త నీలోకి ఒంపుకున్నాక/ నా తనువంతా కన్నీటి సముద్రమయ్యాక/కామంతో కళ్ళుమూసుకుపోయిన కండకావర రాజ్యాధికారం మీద/ ఖాండ్రిరచి ఉమ్మాలనునుంది/ఉవ్వెత్తున లేచిన ఉన్నావ్ ఊరిజనులకు ఊతమవ్వాలనుంది/ఉషామెహ్రా అందించిన నిర్భయను నిలదీయాలనుంది/ బేటీ బచావోను ఉప్పుపాతరేయాలనుంది/నిరసనలూ నినాదాలూ కంటి నుండి ఉధృతంగా/కిందికి దూకే కన్నీటి ధారలూ/నిన్ను సాంత్వన పరచటానికి నేనిచ్చే ఆయుధాలు/కాషాయ కర్కశత్వానికి బలైపోతున్న/ఓ మాఖీపిల్లా మరణాన్ని ఎదిరించి మళ్లీ రావూ..
పదకొండేళ్లుగా సాగిస్తున్న దురాగతాల్ని, ఈ పాలనలో బాలికలకెంత రక్షణ ఉందో ఇంతకంటే ఏం చెబుతారు. ఇందులోని సారం కనబడదా? వస్తు, శిల్ప, రూప, సౌందర్యాలతో సాగే సారాన్ని చూడొచ్చు. రాజ్యం చేస్తున్న కుట్రల్ని ఇంతకంటే ఇంకేం తేటతెల్లం చేయగలరు.
శిల్పం:
ప్రతీకవి వొక్కోశైలిని, శిల్పాన్ని సృష్టించుకుంటారు. దానికేం నిర్దిష్టమైన సూత్రాలు చెప్పాల్సిన పనిలేదు. శేషేంద్ర శైలి, శిల్పం అందరిలో ఉండాలంటే సాధ్యం కాదు. అయితే ఏ కవిత్వసృజనకైనా శిల్పం ప్రధాన భూమిక పోషిస్తుంది. గతంలో అంత్యప్రాసలు శిల్పంలో భాగమే. కానీ పోస్ట్ మాడ్రనిజం వచ్చాక శిల్పం వైవిధ్యభవితమై తెలుగు కవిత్వాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నది.
ఒక నిశ్శబ్దాన్ని చెక్కాలి/ఒక మౌనాన్ని గీయాలి/అన్నింటికీ సవ్వడి నేర్పాలి/అన్నీ నీ గురించే కదా..
ఇంకొక కవితలో..
భారతదేశం నా మాతృభూమి/ అని నేనిక కీర్తించను/యత్ర నార్యంతు పూజ్యంతే/అని నేనిక వేదమంత్రాన్ని పఠించలేను/ ఇది నా మాతృభూమి కాదు/మగభూమి, మృగభూమి.
ఇలాంటి కవిత్వశిల్పం నీలిమ వియస్ రాసినప్పుడు కూడా ఈ శిల్ప సౌందర్యాన్ని కూడా పొగడ్త అని అందామా? ఏ కవిత్వమైనా విమర్శ చేస్తున్న సందర్భంలో కొంతమంది విమర్శకుల చుట్టే విమర్శ తిరుగుతుందని, కొంతమంది రాసిన పుస్తకాల చుట్టే తిరుగుతుందనే దుర్మార్గమైన వితండ వాదన చేసే విమర్శకులనేమనాలి. విమర్శకులు రాచపాళెంను చదవాలి, శేషేంద్రను చదవాలి. బాలగోపాల్‌ను చదవాలి, చెంచయ్యను చదవాలి. పాపినేని శివశంకర్ చుట్టో , శ్రీశ్రీ చుట్టో ఇంకొందరి చుట్టో విమర్మవృత్తాకార కక్ష్యలో ప్రయాణం చేయదు. కట్టమంచి మొదలు కొని నేటి విమర్శకులందరినీ చదవాలి. రాసి పడేసినంత ఈజీ కాదు విమర్శ రాయడమంటే. తాంమూలాలిచ్చేశాం తన్నుకు చావండి అని మాత్రమే కవి రాస్తాడు. ఆ తన్నుకు చచ్చే గాయాల తాలుకు జారిన నెత్తుటి బిందువుల్ని లెక్కించేవాడే విమర్శకుడు. ప్రగతిశీలకవులు తమ రచనల్లో పేదలకన్నీటిని సృజనాత్మకంగా మార్చేప్రయత్నం నిరంతరం చేస్తారు. సృజనాత్మకత మార్క్సిజంలో అంతర్భాగం. మార్కిస్ట్ కవులు పేదల బాధల్ని అర్థం చేసుకుని సృజనాత్మక వ్యక్తీకరణ చేస్తారు. ఈమె ఇదే చేసింది. ఈ కవిత్వంలో ఎన్ని నిర్మాణసూత్రాలనైనా చెప్పొచ్చు. భావుకత, ఎత్తుగడ, పదచిత్రాలు, భావచిత్రాలు, అభివ్యక్తి , ముగింపు ఇలా ఎన్నింటినైనా చూడొచ్చు. ఈ కవిత్వం నిండా స్త్రీవాదమే ఉండొచ్చు. ఈ కవిత్వం నిండా సగటు మహిళ వేదనలు, కన్నీళ్లు ఉండవచ్చు. కానీ ఈ కవిత్వంలో గొప్ప కవిత్వస్పర్శ మన గుండెను మీటుతుంది. ఇంతటి గొప్ప కవిత్వాన్ని అందించిన నీలిమ వియస్ రావు సాహిత్యక్షేత్రంలో నాకు ఎక్కడా పరిచయం కాని అమ్మ. ఈ అమ్మకు మన:స్ఫూర్తిగా జేజేలు.




