ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్‌గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది కూర్పు చేయబడింది. వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా ఉంటున్నారు. ప్రపంచ అసమానతల చారిత్రక పెరుగుదలకు సంబంధించిన అతి పెద్ద డేటా సేకరణకు వారు దోహదపడుతున్నారు. అసమానతలకు సంబంధించి ప్రపంచవ్యాపిత చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడగలదు. విధాన నిర్ణేతలు, పౌరులు, అసమానతల తీవ్రతనూ, కారణాలనూ అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయ పడింది. అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల కన్నా భారతదేశంలోనే అసమానతలు ఆకాశమంటుతున్నాయి. భారతీయ సంపన్నులకూ పేదలకూ మధ్య అంతరం ఎంత భారీగా ఉందంటే ఒకవిధంగా చూస్తే బ్రిటిష్ వలస పాలనలోనే ఈ సంపద పంపిణీ ఇప్పటికన్నా కొంత సమానతతో ఉండేది.
‘ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక అసమానతల పట్ల ‘వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ 2026’ ఆందోళన వ్యక్తపరిచింది. ప్రపంచంలోని అత్యధిక సంపద కేవలం కొద్దిమంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం… ప్రపంచ జనాభాలో 0.001 శాతం అంటే దాదాపు 56,000 మంది వ్యక్తులు. అంటే 56 వేల మంది వద్దే ప్రపంచ సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గణాంకాలు ధన, ఆదాయ అసమానతలు పెరగడం మాత్రమే కాకుండా… ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి కూడా పెను ముప్పుగా మారుతోందని నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలో ప్రతిదేశంలో అగ్రస్థానంలో ఉన్న 1 శాతం మంది వద్ద, దిగువన ఉన్న 90 శాతం మంది వద్ద ఉన్న మొత్తం సంపద కంటే ఎక్కువ ఆస్తి ఉంది. 1990 నుంచి బిలియనీర్లు, మిలియనీర్ల సంపద ప్రతి సంవత్సరం దాదాపు 8 శాతం చొప్పున పెరిగింది. ఇదే సమయంలో జనాభాలో దిగువ సగం మంది సంపద వృద్ధిరేటు దీనిలో సగం కంటే తక్కువగా ఉంది (సుమారు 4శాతం).
దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఢిల్లీలో మోడీ సర్కార్ నిత్యం వేసే డప్పు మేళాను ప్రపంచ అసమానతల నివేదిక-2026 ఒక్కసారిగా పటాపంచలు చేసింది. వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ రిపోర్టు విడుదల చేసిన రిపోర్టును పరిశీలిస్తే అన్ని దేశాల్లోకెల్లా ఆర్థిక అసమానతలు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయని తేటతెల్లమైంది. ‘విభజించు, పాలించు’ నినాదం మన ఏలికలకు కొత్తేం కాదు. కానీ ఇక్కడ చూస్తున్నది నిజమైన భారతదేశం రెండు ముక్కలై కనిపిస్తోంది. ఒకటి సంపదను కూడబెట్టే వర్గం కాగా మరొకటి జీవనోపాధి కోసం పోరాడే జన సమూహం. దేశ ఆదాయంలో యాభై ఎనిమిది శాతం కేవలం పది శాతం మంది చేతుల్లోనే ఉందంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాలి. ఇది యాదృచ్ఛికం కాదు. పదకొండేండ్లుగా మోడీ సర్కార్ అమలు చేస్తున్న కార్పొరేట్-కేంద్రీకృత విధానాల ఫలితం. వృద్ధి అనే గొప్ప అబద్ధం వెనుక భారత పేదల ముఖంపై అసమానత అనే నిజం నిలబడిపోయింది. పాలకులు, పెట్టుబడిదారులు కలిసి లిఖిస్తున్న వివక్ష చరితం. పాలకులు సమాధానం చెప్పాలి. ఇదేనా ‘వికసిత్ భారత్’?
భారతదేశంలో ఆదాయ అసమానతలు ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా ఉన్నాయి. ఆర్థికవేత్తలు లూకాస్ చాన్సెల్, రికార్డో గోమెజ్-కారెరా, రొవాడియా మోషరీఫ్, థామస్ పికెటిలు రూపొందించిన, తాజాగా విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక-2026 ఈ విషయాలను తేటతెల్లం చేసింది. దేశ సంపదలో 58 శాతం కేవలం పది శాతం మందికే చేరుతోందని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ నివేదిక వెల్లడించింది. దేశం ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందినా అభివృద్ధి ఫలాలు అందరికీ చెందడం లేదన్న ఆరోపణల్లో అసత్యం లేదని ఈ నివేదిక తెలియజేస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశసంపద అంతా టాటాలు, బిర్లాలకే దక్కుతోందని వామపక్షాల వారు విమర్శించేవారు. ఇప్పుడు అలాంటి కుబేరుల సంఖ్య ఎంతో పెరిగింది. గరిష్ట, కనిష్ట ఆదాయాల మధ్య వ్యత్యాసం బాగా పెరిగిందని ఆ నివేదిక వివరించింది. సంక్షేమ పథకాలను గురించి పదే పదే చెబుతూ, సమ్మిళిత అభివృద్ధి కోసమే వీటిని అమలు జేస్తున్నామని చెబుతున్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ఎవరికి చెందాలో వారికి చేరకపోవడం వల్ల సమ్మిళిత అభివృద్ధి జరగడం లేదు.
అగ్రశ్రేణిలో ఉన్న 10 శాతం ధనవంతులకూ, అట్టడుగున ఉన్న 50 శాతం మంది పేదల మధ్య 2014 నుంచి 2024 వరకూ ఆదాయంలో అంతరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని ఆ నివేదిక సూచిస్తోంది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 2014 నాటి నుంచి మొదటి పదేళ్ళలో వ్యత్యాసాలు బాగా పెరిగాయి. అంతరాలను తగ్గించడానికి కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి సందర్భంలోనూ పేర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల నిధులన్నీ అగ్రశ్రేణిలో ఉన్న పది శాతం మందికే చేరుతున్నాయని అసమానతల నివేదిక పేర్కొంటోంది. అలాగే, దేశంలో కుబేరుల సంఖ్య బాగా పెరుగుతోందనీ, గడిచిన పదేళ్ళలో కొత్త కుబేరులు తయారయ్యారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ (ఎడిఆర్) ఎన్నికల సందర్భంగా విడుదల చేసే నివేదికల్లో పేర్కొంటోంది. గతంలో బిలియనీర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అలాంటి బిలియనీర్లు లెక్కకు మిక్కిలిగా పెరిగారు.
రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించే మంత్రులు, ముఖ్యమంత్రుల సంఖ్య గతంలో కన్నా బాగా పెరుగుతోంది. అయితే, విదేశాల నుంచి పెట్టుబడులు ఆశించినంత రావడం లేదన్న సమాచారం కూడా వెలువడుతోంది. విదేశీ సంస్థలకు భూమి, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నా, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నా, మౌలిక సదుపాయాలను, బ్యాంకు రుణాలను పొందిన వారు పరిశ్రమలు, యూనిట్లను స్థాపించడం లేదనీ, ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారన్న విమర్శలు తరచూ వస్తున్నాయి. జనాభాలో అధిక సంఖ్యాకులు పరిమితమైన సంపదతోనే జీవిస్తున్నారనీ, దేశంలో సగటు ఆదాయం 7,273 డాలర్లుగా ఉందనీ, కొనుగోలు శక్తి పెరగడం లేదని నివేదిక వివరించింది. మహిళా కార్మికుల భాగస్వామ్యం తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. మహిళా కార్మిక శక్తి ఆదాయం గడిచిన థాబ్ద కాలంలో ఏమాత్రం పెరగలేదనీ, ఆర్థిక అసమానతలు లింగ అసమానతలు సమాజంలో పాతుకుని పోయాయనీ, కార్మిక రంగంలో స్త్రీ, పురుషుల వేతనాల మధ్య వ్యత్యాసం ఇంకా కొనసాగుతోందని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ నివేదిక వివరించింది.
‘వికసిత్ భారత్’, ‘అచ్ఛేదిన్’ అంటూ ఊదరగొట్టే ప్రధాని మోడీ హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదని మరోసారి రుజువైంది. కార్పొరేట్లకు కొమ్ముకాసే ఎన్డీయే ప్రభుత్వంలో మిలియనీర్లు బిలియనీర్లుగా మారుతుంటే, పేదలు మాత్రం నిరుపేదలుగానే మిగులుతున్నారు. ఆదాయ అసమానతల్లో భారత్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు విడుదలైన ఇనీక్వాలిటీ రిపోర్ట్ (ప్రపంచ అసమానతల నివేదిక (ఆర్థిక) – 2026లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంపద ఒకవైపే పోగుబడటం, పేదలు మరింత పేదరికంలోకి దిగజారడం వెనుక మోడీ సర్కార్ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గద్దెనెక్కిందే పెట్టుబడిదారుల కోసమా అన్న చందంగా పాలన ఉన్నది. జిఎస్టి అన్ని వర్గాల ప్రజల కోసమంటూ నమ్మించి అమలులో మాత్రం పెట్టుబడిదారుల ప్రయోజనాలనే నెరవేర్చింది. స్లాబుల సవరణ వల్ల ఉత్పత్తి ఆధారిత పెద్ద కంపెనీల పన్ను భారం తగ్గింది. వినియోగదారులు, ముఖ్యంగా పేద, కింది తరగతులకు మాత్రం పరోక్షంగా పన్నుల భారం పెరిగింది. పైగా కార్పొరేట్ల ఒత్తిడి మేరకే ఈ శ్లాబుల నిర్ణయం చేసి ‘జిఎస్టి బచావ్’ అంటూ ప్రచారం లంకించుకోవడం కేంద్ర సర్కార్కే చెల్లింది.
దశాబ్దకాలంగా దేశంలో ఎలాంటి పురోగతి లేదన్నది వాస్తవం. ఆదాయాలు, సంపద, లింగ వైవిధ్యత వంటి పలు అంశాల్లో భారతదేశంలో అసమానతలు చాలా లోతుగా పాతుకుపోయాయి. వీటివల్ల ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వ్యవస్థాగతమైన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇది ఎవరో చెప్పింది కాదు, ఆర్థికవేత్తలు జయతి ఘోష్, జోసెఫ్ స్టిగ్లిట్జ్‌లు ఈ నివేదికకు ముందుమాటలో రాసిన మాటలు. అంతర్జాతీయంగా సంపద అత్యంత అసమానమైన రీతిలో పంపిణీ కావడం ఆందోళనకరం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 ఏండ్ల కాలంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరంలో ఏ మాత్రం మార్పు రాకపోగా, ఈ అంతరం స్వల్పంగా పెరిగినట్టు నివేదికలోని గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. పేద, ధనిక వర్గాల మధ్య ఆదాయం అసమానతలు 2014లో 38 శాతంగా ఉంటే, అది 2024 నాటికి 38.32 శాతంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యంలో కూడా ఏమాత్రం పెరుగుదల కనిపించలేదని నివేదిక పేర్కొంది. 2014లో 15.7 శాతంగా ఉన్న మహిళా శ్రామికశక్తి, 2024 నాటికి కూడా 15.7 శాతంగానే ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
ప్రపంచ మానవాభివృద్ధి ప్రగతి గడచిన మూడున్నర దశాబ్దాల్లో అత్యంత తక్కువ నమోదు కావడం పట్ల మొన్న ఐక్యరాజ్య సమితి చీఫ్ అంటానియో గుబెరస్ వ్యక్తపర్చిన ఆందోళన మానవాళికి హెచ్చరిక. కరోనా మహమ్మారితో పూర్తిగా రెండు సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ స్తంభించిన అనంతరం మానవాభివృద్ధిలో సుస్థిరత నెలకొని మరింత మెరుగుదల దిశగా పయనించాల్సింది పోయి అధమ స్థాయికి దిగజారడం ఆత్మ విమర్శనా పూర్వకంగా ఆలోచించాల్సిన విషయం. 2024 సంవత్సరానికి ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) ప్రపంచ మానవాభివృద్ధి నివేదికను వెలువరించింది. కృత్రిమ మేధ యుగంలో ప్రజలు, అవకాశాలపై నివేదిక విశ్లేషించింది. మానవాభివృద్ధి ప్రగతి నిర్ణయించుకున్న లక్ష్యాలకనుగుణంగా లేదు. మానవాభివృద్ధి తక్కువ ఉన్న దేశాలు, ఎక్కువ ఉన్న దేశాల మధ్య అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని నివేదిక కుండబద్ధలు కొట్టింది. ఈ అసమానతలు వరుసగా నాల్గవ తడవ కూడా మరింతగా విస్తరించడం ఆందోళన కలిగించే విషయం.
సమాజంలో ఆర్థిక అసమానతలు, లింగ వివక్ష ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో శత కోటీశ్వరుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఫోర్బ్స్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాయి. వాటికి అభిముఖంగా దిగజారుతున్న పేదరికం వృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి తరుగుదల, పారిశ్రామిక మందగమనం, ఉపాధి అవకాశాల తగ్గుదల, పోషకాహార లోపం, పాఠశాలల్లో డ్రాపవుట్స్, బాలకార్మిక సమస్యలు పీడిస్తున్నాయి. ప్రపంచ ఆకలిసూచిలో ఇండియా స్థానం చిట్టచివరిలో ఊగిసలాట అసమానతల తీవ్రతకు ప్రతిరూపం. 2023-24లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 41.71 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో ఉటంకించింది. దీనికి కారణం గ్రామాల్లో మహిళల శ్రమ పెరిగిందని అర్థం. మహిళా శక్తి సద్వినియోగం కావాలంటే మహిళలు ఉద్యోగాల్లో చేరే వాతావరణం నెలకొల్పబడాలి. వారు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశాలు సృష్టించబడాలి. ప్రస్తుతం ఆ పరిస్థితులు తక్కువేనన్నది నిపుణుల మాట. రాజకీయ భాగస్వామ్యంలో మహిళల వెనుకబాటు కొనసాగుతోంది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎప్పటికీ సాకారమవుతాయో తెలియకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రాకుండా మానవాభివృద్ధి పెరగదన్నది కఠోర నిజం. ఆదాయ, లింగ అసమానతలు భారతదేశ మానవాభివృద్ధి ప్రగతిని 30.7 శాతం తగ్గించాయి.
నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న ఫలితంగా అత్యవసర సేవలైన వైద్యం, విద్య వంటివి అంతకంతకూ అధికంగా ప్రైవేటు రంగం చేతుల్లోకి పోతున్నాయి. ఆదాయాల అంతరాలు పెరిగిపోవడంలో దీని పాత్ర చాలా ఉంది. సంపన్నులు ఎప్పుడూ ఖరీదైన ప్రైవేటు వైద్యానికే పోతూంటారు. పేదవారు ప్రభుత్వ వైద్య సంస్థల సేవలను ఉపయోగించుకుంటారు. ఎప్పుడైతే ప్రభుత్వ వైద్య వ్యవస్థ కుదించుకుపోతూ ఉంటుందో, అప్పుడు ఆ పేదవారు సైతం అనివార్యంగా ప్రైవేటు వైద్య సేవల వైపు మళ్ళవలసి వస్తుంది. దాని వల్ల వారి ఖర్చు పెరుగుతుంది. ఒకపక్క ఆదాయాలు తగ్గిపోతున్నా, మరొకవైపు ఖర్చు పెరుగుతుంది. ఈ పెరిగిన ఖర్చును చూపించి ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నట్టు చెప్పుకోవడం కన్నా అసంబద్ధమైనది ఉంటుందా? ఇలా వైద్యం నిమిత్తం ఖర్చు పెరిగిపోయినప్పుడు పేదలు అనివార్యంగా ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్లే వారి ఆహార ఖర్చు తగ్గుతుంది. అది కాకపోతే వారు అప్పులు చేస్తారు. అందుచేత అంతరాలు తగ్గిపోయాయంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నది వాస్తవ చిత్రానికి పూర్తి విరుద్ధం. ప్రభుత్వ ఆస్పత్రులలో విపరీతమైన రద్దీ కారణంగా సకాలంలో వైద్యం అందకపోవడం, లేదా, అక్కడ ఆలస్యం అవుతున్నందున ప్రైవేటు ఆస్పత్రులకు పోయి అక్కడ బిల్లులు కట్టలేక, వైద్యం పొందలేక బిడ్డల్ని పోగొట్టుకోవడం వంటి సంఘనలతో వార్తాపత్రికల్లో మనకు ప్రతిరోజూ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజలకు అత్యవసరమైన సేవలను ప్రైవేటుపరం చేసి వాటిని ఖరీదైనవిగా మార్చి, పేదలను మరింత కష్టాలపాలు చేయడమే కాకుండా, తమ విధానాల వల్ల సమాజంలో ధనిక, పేద అంతరాలు తగ్గిపోయాయంటూ ప్రచారం చేసుకోవడం ఈ ప్రభుత్వపు బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
అంతర్జాతీయంగా సంపద చారిత్రక ఎత్తులకు చేరుకుంది. కానీ అత్యంత అసమాన రీతిలో పంపిణీ అవుతోంది. అగ్ర స్థానంలో ఉన్న 0.001 శాతం మంది అంటే 60వేల కన్నా తక్కువ మంది కోటీశ్వరులు కింది స్థాయిలోని మానవాళి వద్ద మొత్తంగా గల సంపద కన్నా మూడు రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. వారి వాటా నిలకడగా పెరుగుతూనే ఉంది. దాదాపు 4శాతం నుండి ఈనాడు 6శాతానికి పైగా చేరుకుంది. పైగా అంతర్జాతీయ స్థాయిలో అసమానతలు పెచ్చరిల్లడం, బహుళపక్షవాదం బలహీనపడడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ధోరణి చోటు చేసుకుందని ప్రపంచ అసమానతల నివేదిక 2026 పేర్కొంది. ఈ పరిస్థితులను మార్చాలాంటే ప్రభుత్వాలు విధానపరమైన మార్పులు తీసుకురావాలని పేర్కొంది. విద్య, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ, నగదు బదిలీలు, పెన్షన్లు వంటి పునఃపంపిణీ కార్యక్రమాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని సూచించింది. ప్రగతిశీల పన్నుల విధానం, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరింది.




